democracy
-
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్‌ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్‌కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సంపన్నుల ఆధిపత్యం ఆందోళనకరం
వాషింగ్టన్: అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోందని, ఇది నిజంగా ప్రమాదకరమైన పరిణామం అని అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ధనవంతులు దేశాన్ని శాసించే పరిస్థితి రావడం సరైంది కాదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలంటే బడాబాబులు పెత్తనం సాగించే అవకాశం ఉండొద్దని చెప్పారు. బైడెన్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఆయన అధ్యక్ష పగ్గాలను డొనాల్డ్ ట్రంప్‌కు అప్పగించబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం శ్వేతసౌధంలో బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్, కుమారుడు హంటర్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసు నుంచి జో బైడెన్ ప్రసంగించారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ శిక్ష నుంచి తప్పించే అవకాశం ప్రస్తుతం ఉందని, ఈ పరిస్థితి కచి్చతంగా మారాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. ట్రంప్‌పై ఉన్న క్రిమినల్ కేసులు, ఆయన దోషిగా తేలిన సంగతిని పరోక్షంగా ప్రస్తావించారు. శిక్ష నుంచి తప్పించుకొనే అవకాశం అధ్యక్షుడికి ఇవ్వొద్దని పేర్కొన్నారు. పిడికెడు మంది సంపన్నులు, బలవంతుల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం ప్రమాదకరమని వెల్లడించారు. వారు అధికార దురి్వనియోగానికి పాల్పడితే ఊహించని ఉపద్రవాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అందుకే అలాంటివారిని నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రభావితం చేసినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలి సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం పట్ల బైడెన్ స్పందించారు. సోషల్ మీడియా కంపెనీల ఆధిపత్యం వల్ల దేశానికి చాలా నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం అనే ఊబిలో అమెరికా కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత మీడియా అనేది కనుమరుగు అవుతోందని, ఎడిటర్లు అనేవారు కనిపించడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో నిజ నిర్ధారణ అనేది లేకపోవడం బాధాకరమని వెల్లడించారు. అసత్యాల వెల్లువలో సత్యం మరుగునపడడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కొందరు స్వార్థపరులు అధికారం, లాభార్జన కోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారని బైడెన్ ఆరోపించారు. మన పిల్లలను, మన కుటుంబాలను కాపాడుకోవడానికి, అధికార దురి్వనియోగం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సోషల్ మీడియాను జవాబుదారీగా మార్చాలని స్పష్టంచేశారు. తగిన నిబంధనలు, రక్షణలు అమల్లో లేకపోతే కృత్రిమ మేధ(ఏఐ) కోరలు మరింతగా విస్తరిస్తాయని, మానవ హక్కులకు, గోప్యతకు భంగం వాలిల్లుతుందని హెచ్చరించారు. తమ నాలుగేళ్ల పాలనలో సాధించిన ఘనతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము విత్తనాలు నాటామని, వాటి ఫలితాలు తర్వాత కనిపిస్తాయని జో బైడెన్ తేల్చిచెప్పారు. -
స్వాతంత్య్ర ఫలాలను కాపాడుకోవాలి!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇప్పుడిక భూమ్మీద అత్యధిక జనాభా గల దేశంగానూ అవతరించనుంది. భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటోంది. ఈ సమ యంలో మనందరిపై ప్రత్యేక బాధ్యత ఉంది. స్వాతంత్య్రం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలను పరిరక్షించుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో వాటిని బలోపేతం చేసుకునేందుకు నడుం బిగించాలి. ఎంతో ఉన్నతంగా రెపరెపలాడే జాతీయ జెండాకు సగర్వంగా సెల్యూట్ చేసే ప్రతి భారతీయుడూ ఆ జెండాలోని మూడు రంగుల అంత రార్థాన్ని గ్రహించాలి. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, దేశ సమైక్యతను ప్రతిఫలించే ఆ మువ్వన్నెలే మన ప్రజాస్వామ్యాన్ని అవని మీదే ఉన్నతమైందిగా రూపొందించాయి. భారత ప్రజల ఈ సమైక్యతను దెబ్బతీసే విద్వేష ప్రచారాలను అడ్డు కోవాలి. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహంకార పూరితమైన నిరంకుశ అధికారం ఎప్పటికీ కబళించకుండా కాపాడుకోవాలి. ఈ చారిత్రక సందర్భంగా ఇలా చేస్తామని మనమందరం ప్రతిన పూనాలి. ఇదే జాతీయ పతాకానికి మనం అర్పించగల ఘన నివాళి. సమైక్యత మన సంపద వలస పాలన మృత్యు కౌగిలి నుంచి విముక్తమైన భారత్ నాడు తక్షణం జాతి సమైక్యతకు నడుం బిగించింది. చెల్లా చెదురుగా ఉన్న బ్రిటిష్ పాలిత ప్రాంతాలను, సంస్థానాలను విలీనపరచి ఒక సమైక్య జాతిగా అవతరించింది. ఈ సమైక్యత రాత్రికి రాత్రే మంత్రం వేసినట్లు వచ్చింది కాదు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమం, విదేశీ పాలనకు చరమగీతం పాడేందుకు భారతీయులందర్నీ ఏకం చేసింది. భాష, కులం, మతం, స్త్రీపురుష భేదం, సామాజిక అంతరాలు... వీటన్నిటికీ అతీతంగా భారతీయులను ఈ ఉద్యమం సమైక్యం చేసింది. ఈ సమైక్యత భారత్‌కు అమూల్య సంపద. కుల మత విభేదాలు, భాషా దురహంకారాలతో ఇది నాశనం కాకూడదు.ఇలాంటి కుట్రలతో భారతీయులను భారతీయుల మీదే ఉసిగొల్పి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పొందితే పొందవచ్చు. కానీ, ఒక గొప్ప జాతిగా ఈ దేశం ప్రయాణం సాగించే ప్రగతి బాట మీద ఇవి అగాథాలను సృష్టిస్తాయి. వలస పాలకులు మనల్ని నిలువునా దోచారు. వారి నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న మనం ఒక బీదదేశంగా కొత్త జీవితం ప్రారంభించాం. ఆ స్థాయి నుంచి నేడు ప్రపంచ అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగగలిగాం. 1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ విధానం మన ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చింది. పేదరికం తగ్గింపు, ఆర్థిక అసమానతల తొలగింపు ప్రభుత్వ విధానానికి దిశానిర్దేశం అయ్యాయి. అందరి ఆర్థిక ప్రయోజనమే మనకు పరమావధి అయ్యింది. ఒకవైపు ఆర్థిక అంతరాలు పెరుగుతూ, మరోవైపు ఎంపిక చేసిన కొద్ది మంది వ్యాపార దిగ్గజాలే సంపద ప్రయోజనాలను పొందడాన్ని మనం అనుమ తించకూడదు.వేర్పాటు రాజకీయాలు కూడదు! ఉపాధి లేని వృద్ధి ఏ ఆర్థిక వ్యవస్థకూ క్షేమం కాదు. సామాజిక అసంతృప్తికి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు నిరుద్యోగ సమస్య దారితీస్తుంది. జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న యువజనులకు విద్య, నైపుణ్యం, తగు ఉపాధి కల్పించాలి. ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వాలి. తద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ధ్యేయంగా రానున్న 25 సంవత్సరాలకు బాటలు వేసుకోవాలి. ఇది సుసాధ్యం కావాలంటే విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు దేశం నలు మూలలకు స్వేచ్ఛగా వెళ్లగలగాలి. మతం, భాష వంటివి ఈ స్వేచ్ఛా గమనానికి అడ్డంకులు కాకూడదు. దేశ పారిశ్రామిక సారథులు అవరోధాల ప్రమాదాన్ని గుర్తించి జాతీయ సమైక్యతకు గళం విప్పాలి. విచ్ఛిన్న రాజకీయాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంటే వారు మౌన ప్రేక్షుల్లా ఉండిపోకూడదు. శాస్త్రీయ సంప్రదాయం నిలబెట్టాలి! స్వాతంత్య్రం తొలినాళ్ల నుంచీ దేశం శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి సాధనకు దాన్ని మార్గం చేసుకుంది. పురోగమన దృక్పథంతో నేషనల్ సైన్స్ పాలసీ రూపుదిద్దుకుంది. విజ్ఞానం, బోధన, పరిశోధనలకు గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటయ్యాయి. అనేక భారతీయ సాంకేతిక సంస్థలు ప్రపంచ గుర్తింపు పొందాయి. వాటిలో చదివిన పలువురు విద్యావంతులు నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. అంతరిక్ష, సాగర, అణుశక్తి కార్య క్రమాలు మనల్ని అంతటి సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన నిలిపాయి. శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచ గుర్తింపు పొందిన మన వైజ్ఞానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సారథ్య బాధ్యతల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట తక్కువ ప్రతిభావంతులకు చోటు కల్పిస్తే అంతకు మించిన దురదృష్టం ఉండదు. ప్రాచీనకాలం నుంచీ మనకు గర్వించదగిన సాంప్రదాయిక విజ్ఞానం ఉంది. అయితే అది ఆధునిక విజ్ఞానాన్ని మసకబరచి మేటి శాస్త్రవేత్త లకు అపఖ్యాతి తేకూడదు.స్పష్టమైన విదేశీ విధానాలురెండు అధికార కూటములు ప్రపంచంపై పట్టు సాధించడానికి పోటీపడుతున్న సమయంలో... దేశాల మధ్య శాంతి సామరస్యాలు మెరుగుపరచడానికి మనం అవలంబించిన విలువలు, విధానాలు, మన అలీన ఉద్యమ నాయకత్వం భారత్‌కు ఎనలేని గౌరవం తెచ్చి పెట్టాయి. మన పొరుగున ఉన్న అత్యధిక దేశాలతో మనకు సహృద్భావ సంబంధాలు ఉండేవి. కొన్నిటితో ఘర్షణలు ఉన్నప్పటికీ శాంతి యుత సహజీవనానికి వీలుకల్పించేలా వాటితో అవగాహనా వార ధులను నిర్మించుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచ దేశాలు మనల్ని నమ్మదగిన గౌరవప్రదమైన మిత్రదేశంగా పరిగణించే స్థితి ఉండాలి. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఈ విశ్వాసం పొందాలి. కేవలం కెమెరాల మందు ఆప్యాయతా ప్రదర్శనలకు పరిమితమైతే మన విదేశాంగ విధానం బలహీనం అవుతుంది. సమర్థులయిన దౌత్యవేత్తల సహకారంతో విజ్ఞులైన నాయకులు సుస్పష్టమైన చర్యలు చేపట్టాలి. యువత శ్రేయస్సు ముఖ్యం యువజనుల ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మీద తప్పనిసరిగా దృష్టి సారించాలి. మన చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బిడ్డల్ని కనే మహిళల్లో పోషణ లేమి, రక్తహీనత అధికంగా ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –5) తేల్చి చెప్పింది. కాబట్టి పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవ సరం ఉంది. అలాగే, మంచినీరు, పారి శుద్ధ్య రంగాల్లో కూడా సరైన చర్యలు, విధానాలు అమలు చేయాలి. మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అనేక బలహీనతలను కోవిడ్ – 19 బట్టబయలు చేసింది. వ్యాధులపై నిఘా పెంచాలి. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వెయ్యాలి. వైద్య సేవల రంగాన్ని విస్తరించాలి. ఈ దిశగా పరిశీలిస్తే ఆ యా రాష్ట్రాల మధ్య ఆరోగ్య వ్యవస్థల పనితీరు, వాటి విస్తరణల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. రాష్ట్రాలు ఆరోగ్యం మీద మరిన్ని నిధులను వెచ్చించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్య సాధన కోసం రాష్ట్రాలకు ఇతోధికంగా మద్దతు అందించాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించడం సార్వత్రిక ఆరోగ్య సేవల కల్పన విధానాల లక్ష్యం కావాలి. దేశవ్యాప్తంగా సమరీతిలో ఈ లక్ష్యాన్ని సాధించాలి. పౌరుల బాధ్యతఅప్పట్లో నేను పధ్నాలుగేళ్ల కుర్రవాడిని. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆనంద పారవశ్యంతో మునిగిపోయాను. అదే సమయంలో దేశ విభజన అంతులేని విషాదం మిగిల్చింది. అలాంటి దుఃస్థితి తిరిగి ఎప్పటికీ రాని దృఢమైన దేశంగా భారత్ ఎదగాలని ఆశించాను. ఇండియా ఇన్నేళ్లల్లో సాధించింది చూసి నేనిప్పుడు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశం భవిష్యత్తు పట్ల నాకు ఎన్నో ఆశలున్నాయి. సమాజంలో çసుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ప్రజల్ని విభజిస్తున్న వేర్పాటు నినాదాలు, మత విద్వేషాలు చూసి నేను ఆందోళన కూడా చెందుతున్నాను. మరో వంక, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించి తీరాల్సిన, సుపరిపాలన నియమ నిబంధనలను నిలబెట్టాల్సిన, ఎన్నికలకు ధనబలం, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు బలహీనమవటం కూడా జరుగుతోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను పరిరక్షించుకోవలసింది భారత పౌరులే! సగర్వంగా తల ఎత్తి మన జెండాకు వందనం చేసేటప్పుడు మనలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవలసిన గురుతర బాధ్యత ఇది!డాక్టర్ మన్మోహన్ సింగ్ (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా 2022 ఆగస్ట్ 15న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాసిన వ్యాసం ఇది. ‘ది హిందూ’ సౌజన్యంతో.) -
ప్రజాస్వామ్యం మానవత్వం
జార్జిటౌన్: ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సరికొత్త పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రం అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చిచెప్పారు. గురువారం గయానా దేశ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వార్థం, విస్తరణవాదం అనే సంకుచిత ధోరణిని భారత్ ఏనాడూ నమ్ముకోలేదని అన్నారు. విస్తరణవాదంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. వనరుల దోపిడీ అనే ఆలోచనకు భారత్ దూరంగా ఉంటుందని వివరించారు. మూడు దేశాల పర్యటన భాగంగా ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. గయానా పార్లమెంట్లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సూత్రాన్ని అనుసరించాలి. అదే మనకు తారకమంత్రం. మనతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లాలని, అందరి అభివృద్ధిలో మనం సైతం భాగస్వాములం కావాలని ప్రజాస్వామ్యం ప్రథమం స్ఫూర్తి బోధిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వం ప్రథమం అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలతో మొత్తం మానవాళికి మేలు జరుగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు మేల్కోవాల్సిన సమయం వచి్చంది. మనమంతా క్రియాశీలకంగా పనిచేయాలి. మనం ఒక్కతాటిపైకి రావాలి. మనం కలిసికట్టుగా పని చేస్తూ నూతన ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) సృష్టించాలి. ప్రపంచం విషయానికొస్తే యుద్ధాలు, ఘర్షణలకు ఇది సమయం కాదు. యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటిని రూపుమాపాల్సిన సమయం ఇది. భారత్–గయానా మధ్య గత 150 ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్ దృష్టిలో ప్రతి దేశమూ కీలకమైనదే. ఏ ఒక్కటీ తక్కువ కాదు. ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించడం లేదు. వాటిని అతిపెద్ద సముద్ర దేశాలుగా భావిస్తున్నాం. ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే స్ఫూర్తితో భారత్ ‘విశ్వబంధు’గా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తితే అందరికంటే మొదట భారత్ స్పందిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు. -
హైదరాబాద్‌లో ‘డిజైన్ డెమోక్రసీ’ ప్రారంభం
హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2024’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫీక్కీ ఫ్లో మాజీ చైర్పర్సన్ పింకీ రెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ ప్రారంభించారు.తెలంగాణ మ్యూజియం బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమెక్రసీ వ్యవస్థపాకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ, అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణ సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది. -
తనను వ్యతిరేకించే వారి మాట కూడా వినేవాడే పాలకుడు: గడ్కరీ
ముంబై: ప్రజాస్వామ్యం, పాలకుల వ్యవహార తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించే వారి మాటను పాలకుడు వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్షగా పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాడని చెప్పారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించాలని తెలిపారు.పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్ష ఏంటంటే.. ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని అందించినా దాన్ని పాలకుడు సహించవలసి ఉంటుందన్నారు. ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.దేశంలో విమర్శకుల అభిప్రాయ బేధాల్లో సమస్య లేదు కానీ.. అభిప్రాయాలను వెల్లడించడంలోనే సమస్య ఉంది. మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఒకరి లోపాలను గుర్తించేందుకు ఎప్పుడూ విమర్శకులు చుట్టుముట్టాల్సిన అవసరం ఉంది. అంటరానితనం, సామాజిక న్యూనత భావం, ఆధిపత్యం కొనసాగినంత కాలం దేశం అభివృద్ధి చెందదని అన్నారు. -
షేక్ హసీనా.. నియంతగా మారిన ప్రజాస్వామ్య ప్రతీక!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యస్థాపన కోసం సైనికపాలకులతో పోరాడిన నాయకురాలు.. నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్ముజిబుర్ రెహ్మాన్ వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన హసీనా 1975లో దేశం మిలిటరీ పాలనలోకి వెళ్లిన తర్వాత యూరప్‌తో పాటు భారత్‌లో ఆశ్రయం పొందారు. 1981లో ఇండియా నుంచే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పోరాటం నడిపారు. తర్వాతి పరిణామాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఐదుసార్లు అధికారాన్ని చేపట్టారు. తాజాగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై దేశంలో చెలరేగిన ఆందోళనలు, హింసకు తలొగ్గి దేశం విడిచి తిరిగి భారత్‌కే వచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.పోరాటం నుంచి తిరుగులేని అధికారం వైపు.. మిలిటరీ పాలనపై పోరాడేందుకు హసీనా 1981లో ప్రవాసం వీడి బంగ్లాదేశ్‌కు వచ్చారు. రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ)చీఫ్ ఖలీదా జియాతో చేతులు కలపి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు. 1990లో ఈ పోరాటంలో విజయం సాధించి సైనిక నియంత హుస్సేన్ మహమ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, బీఎన్పీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీపై విజయం సాధించి షేక్‌హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ చేతిలో హసీనా తిరిగి ఓటమి చవిచూశారు. సైనిక తిరుగుబాటు తదనంతర పరిణామాల తర్వాత మళ్లీ 2007లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారంలోనే ఉండి బంగ్లాదేశ్‌కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు.ప్రతిపక్షమే లేకుండా అణిచివేశారు..2007లో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడింది. నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాసంఘాల నేతల మూకుమ్మడి అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్కోసారి కొందరు నేతలు ఉన్నట్టుండి అదృశ్యమయ్యేవారు. వారి మిస్సింగ్ మిస్టరీగానే మిగిలింది. ఇంతే కాకుండా హసీనా పాలనలో ఫేక్ ఎన్కౌంటర్లు సర్వసాధారణమైపోయాయి. ఆమె హయాంలో ఐదుగురు ముస్లిం అగ్రనేతలను యుద్ధనేరాల్లో ఉరితీశారు. హసీనా నాయకత్వంలో దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం వాటిని బహిష్కరించి పోటీకి దూరంగా ఉందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఎలా మారారన్నదానికి హసీనా రాజకీయ జీవితం ఒక ఉదాహరణ అని ఢాకా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నజ్రుల్ అన్నారు.15 ఏళ్ల హసీనా పాలనలో పాజిటివ్ కోణం.. షేక్ హసీనా వరుస 15 ఏళ్ల పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందిందని చెబుతారు. వస్త్ర తయారీ రంగంలో మహిళలకు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం వల్లే ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి సాధ్యమైందన్న వాదన ఉంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్లింది. హసీనా పాలనలో దేశంలో పేదిరికం తగ్గడంతో పాటు దేశంలోని 17 కోట్ల మంది ప్రజల్లో 95 శాతంమందికి కరెంటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దేశం ఎందుకు వీడాల్సి వచ్చింది..ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. తొలుత ప్రభుత్వం తీసుకున్న ఈ కోటా నిర్ణయాన్ని తర్వాత ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన ఈ హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో హసీనా ప్రభుత్వం దిగివచ్చి కోటా విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. హసీనా గద్దె దిగాల్సిందేనని, ఆమె ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని అధికార నివాసాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టడం.. సైన్యం హెచ్చరికల నేపథ్యంలో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సోదరితో కలిసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. -
మారకుంటే... ముప్పు
రక్తసిక్త అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త పేజీ అది. అమెరికా దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ఖరారవుతారని భావిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ వద్ద శనివారం జరిగిన కాల్పులు, హత్యాయత్నంతో అగ్రరాజ్యమే కాదు... యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ దాడిలో దుండగుడి తుపాకీ తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ, రక్తగాయం చేసి పోయింది. నిఘా వర్గాల భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన బయట పడ్డారు. ఎన్నికల బరిలో ట్రంప్‌కు ప్రధాన పోటీదారైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలందరూ ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన ఇరవై ఏళ్ళ వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టారన్న మాటే కానీ, ఈ దుశ్చర్య వెనుక అసలు కారణాలు లోతైన దర్యాప్తులో గానీ వెలికిరావు. తాజా దాడి ఘటనతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరుగుతాయని ఓ అంచనా. అది నిజం కావచ్చు. కానీ, అంతకన్నా కీలకమైనది ఇంకోటుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే నేలపై ఆ స్ఫూర్తి వెనకపట్టు పట్టి, హింసాకాండ చెలరేగుతోంది. అమెరికా సమాజమే కాదు... ప్రపంచమంతా ఆందోళన చెందాల్సిన విషయమిది. అమెరికాలో నేతలపై దాడులు, హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు. గతంలో అబ్రహామ్ లింకన్, జాన్ ఎఫ్. కెనడీ సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలయ్యారు. రీగన్, థియోడర్ రూజ్వెల్ట్ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తాజా ఘటన జనంలో మునుపెన్నడూ లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికీ, చీలికకూ ప్రతీకగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ట్రంప్‌పై హత్యాయత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగడం విషాదం. ఘటన జరిగిన మూడు గంటలకే రక్తసిక్తమైన ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్ట్లు ఆన్లైన్లో అమ్మకానికి వచ్చేశాయి. ఈ జగడాలమారి వైఖరిని చూస్తుంటే, అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విలువలు మరచిన మాటల దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టానిష్టాలు ప్రబలి, పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్‌పై దాడి తార్కాణం. ఎన్నికలను యుద్ధంలా, రక్తం చిందించైనా సరే గెలవడమే పరమావధిగా భావించడం అతి పెద్ద తప్పు. ఇది అమెరికాయే కాక ప్రజాస్వామ్య దేశాలన్నీ విస్మరించలేని పాఠం. ఈ పాపంలో అన్ని పార్టీలకూ భాగం ఉంది. అనేక జాతులు, తెగలతో కూడిన అమెరికా రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమే. కానీ, ట్రంప్ మళ్ళీ పగ్గాలు చేపడితే అది అమెరికాకు విలయమేనంటూ డెమొక్రాట్లు ప్రచారం సాగిస్తూ వచ్చారు. రిపబ్లికన్లు, ట్రంప్ సైతం సైద్ధాంతికంగా దిగజారుడుతనంలో తక్కువ తినలేదు. అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతీకగా దేశ చట్టసభకు పీఠమైన యూఎస్ క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టి, 2021 జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు యథేచ్ఛగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్య సౌధంలో ప్రమాద ఘంటికలు మోగాయి. తాజా హత్యాయత్నానికి డెమోక్రాట్లు, బైడెన్ల ప్రచార ధోరణే కారణంటూ ట్రంప్ సహచరులు విరుచుకుపడుతున్నారు. ఒక్కమాటలో... అగ్రరాజ్యమనీ, భూతల స్వర్గమనీ అనుకొనే అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన జనం, ఆగని రాజకీయ హింస అక్కడి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో తుపాకీ సంస్కృతి పెను సర్పమై బుసలు కొడుతోంది. అమెరికాలో తుపాకీలు బజారులో అతి సులభంగా కొనుక్కోవచ్చన్నది జగమెరిగిన సత్యం. అమెరికా రాజ్యాంగ ప్రకారం ఆత్మరక్షణార్థం ఆయుధాలు కలిగివుండే హక్కు పౌరులకుంది. అమెరికా వయోజనుల్లో ప్రతి పది మందిలో నలుగురింట్లో తుపాకులున్నాయి. చిత్రమేమిటంటే, 2023 జూన్ నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం తుపాకీ చేతిలో ఉంటే చట్టాన్ని పాటించే పౌరులుగా తమను తాము కాపాడుకోవచ్చని నూటికి 49 మంది అమెరికన్లు భావిస్తున్నారు. మరోమాటలో అమెరికన్ సమాజానికి దేశ శాంతి భద్రతలపై అంతటి అపనమ్మకం ఉందను కోవచ్చు. మరి, పౌరుల చేతిలోని ఈ ఆయుధాలు తప్పులు చేసేవారి చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశంలో పాఠశాలలు, వాణిజ్యభవన సముదాయాల్లో విచక్షణారహితమైన కాల్పుల ఘటనల నుంచి తాజా హత్యాయత్నం దాకా అనేక సంఘటనలే అందుకు సమాధానాలు. తుపాకీలపై నియంత్రణలున్నంత మాత్రాన ఈ ఘటనలు జరగవని కాదు కానీ, లేనప్పుడు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ప్రస్తుతం అమెరికా ముందు, ఆ దేశ రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజల ముందు ఓ పెను సవాలుంది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితులు, పేట్రేగుతున్న రాజకీయ విద్వేషం, హింస లకు అడ్డుకట్ట వేయాల్సింది వారే. అన్ని పక్షాలూ కళ్ళు తెరిచి, ఈ పతనాన్ని నివారించాలి. అతివాదాన్ని నిరసించాలి. ఎన్నికల ప్రచారంలో పరస్పర గౌరవంతో సైద్ధాంతిక చర్చలే అనుసరణీయ మార్గమన్న తమ మౌలిక సూత్రాలనే మళ్ళీ ఆశ్రయించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, ఎన్నికలొక్కటే సామాజిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఓటర్లు తమ తీర్పు ద్వారా మరోసారి చాటాలి. అలా కాక, ఇలాంటి ఘటనల్ని వాటంగా చేసుకొని ఎవరికి వారు మరింత రెచ్చగొట్టుడు ధోరణికి దిగితే కష్టం. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. -
రాచరికం నుంచి ప్రజాస్వామ్యం దాకా...
కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించని ఉత్తర, దక్షిణ భారత ప్రసిద్ధ రాజవంశాలు లేవంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుపూర్వం ఈ ప్రాంతాన్ని మౌర్యులు పాలించారు. తర్వాతి కాలంలో చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పాలించారు. విజయనగర రాజుల పాలన ఈ ప్రాంతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓటమి తరువాత ముస్లిం పాలకులు: బీజాపుర్ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, గోల్కొండ నవాబులు, కర్నూలు నవాబులు దాదాపు 275 ఏళ్లు పాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపై మొదట 1801లో ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో తెర్నేకల్ గ్రామం పన్నులు కట్టడానికి నిరాకరించింది. బ్రిటీష్ సైనికుల ముట్టడిలో అనేకమంది గ్రామస్థులు మరణించారు. బ్రిటిష్ వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన మొదటి గ్రామంగా తెర్నేకల్ను చెప్పవచ్చు.ప్రసిద్ధి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిన్నవయసులోనే బ్రిటిష్ ప్రభుత్వ కఠినమైన పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు అతి త్వరగా 66 గ్రామాలకు వ్యాపించింది. 1846–1847 మధ్య కాలంలో ఈయన సాహసోపేతమైన ప్రతిఘటన జనరల్ ఆండర్సన్ ఆధ్వర్యంలోని ఆంగ్లేయ దళాలను గడగడ లాడించింది. అయితే అపారమైన బ్రిటిష్ సైన్యం ముందు ఓటమి తప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించి ఉరితీసింది కంపెనీ ప్రభుత్వం. 1800వ సంవత్సరంలో నిజాం నవాబు ఈస్టిండియా కంపెనీ వారికి సైనిక ఖర్చుల కోసం ఇవ్వవలసిన సొమ్ముకు బదులుగా బళ్ళారి, కడప జిల్లాలను పూర్తిగానూ; కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, పత్తికొండ తాలూకాలను ఇచ్చాడు. ఇలా వారికి ధారాదత్తం చేయడంతో ఈ ప్రాంతాలకు ‘దత్త మండలాలు’ అనే పేరు వచ్చింది. ఈస్టిండియా కంపెనీ పాలనలో కర్నూలు ప్రాంతం 1800వ సంవత్సరం నుంచి 1857వ సంవత్సరం వరకు కొనసాగింది.దత్తమండలాలకు ప్రధాన కలెక్టరుగా థామస్ మన్రో 1800–1807 వరకు సేవలను అందిచాడు. కర్నూలు ప్రాంతాన్ని పాలించిన మొదటి కలెక్టరు ఆయనే. రైత్వారీ భూవిధానం వంటి వ్యవస్థాగతమైన మార్పులతో ఉత్తమ పాలన సాగింది. మన్రో నివేదికను అమలుచేస్తూ రెవిన్యూ పరిపాలన సౌలభ్యం కోసం 1808వ సంవత్సరంలో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. అవి కడప, బళ్ళారి జిల్లాలు. అనంతపురం ప్రాంతం బళ్ళారి జిల్లాలో, కర్నూలు ప్రాంతం కడప జిల్లాలో భాగంగా ఉండేవి. కర్నూలు పరిధిలోని రామళ్లకోట, నంద్యాల, సిరివెల్, నందికొట్కూరు తాలూకాలతో పాటు కడప జిల్లా నుంచి దూపాడు (మార్కాపురం), కంభం, కోయిలకుంట్ల; బళ్లారి జిల్లా నుంచి పత్తికొండ తాలూకాను కలిపి మొత్తం 8 తాలూకాలతో 1858 జూలై 1న కర్నూలు జిల్లా అవతరించినది. స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఈ జిల్లాలో ఎలాంటి మార్పులూ సంభవించలేదు. అయితే 2022 ఏప్రిల్ 4న జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కర్నూలు జిల్లా రెండుగా... అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలుగా విభజితమయ్యింది.ప్రస్తుతం జనాభా విషయంలో నంద్యాల జిల్లా కంటే ఎక్కువగా, వైశాల్యం, రెవిన్యూ విషయంలో నంద్యాల జిల్లా కంటే తక్కువ స్థాయితో కర్నూలు మారిన పరిస్థితిని గమనించగలం.– ఆచార్య మన్సూర్ రహ్మాన్ సామాజిక – ఆర్థిక విశ్లేషకులు ‘ 9441067984(కర్నూలు జిల్లా 166వ అవతరణ దినోత్సవం నేడు) -
ఎందుకీ ప్రజాస్వామ్య పతనం?
భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని మోదీ కొద్ది సంవత్సరాల క్రితం సగర్వంగా ప్రకటించారు. ఆ మాట చారిత్రకంగా వాస్తవమని ఏ చరిత్రకారుడు కూడా అన్నట్లు లేడు. ఆధునిక సమాజాలు స్థిరపడినా కొద్దీ ఆధునిక ప్రజాస్వామ్యాల దశ మొదలైంది. అటువంటి ప్రాంతాలలో భారతదేశం కూడా ఒకటనటంలో సందేహం లేదు. ప్రపంచ ప్రజాస్వామ్యం వేల ఏళ్ళుగా రూపుదిద్దుకున్న చరిత్రలో భారత భూమి భాగస్వామ్యం ఉండటం గర్వించదగ్గ విషయం. అయితే, ‘వి–డెమ్’ ప్రకారం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్‌లో ఇండియా స్థానం 104. మొత్తం 179 దేశాలతో పోల్చినప్పటి స్థితి ఇది. భారత్ లాంటి మహత్తర దేశస్థానం ఎందువల్ల పడిపోయినట్లు? ఆ పతనానికి బాధ్యులెవరు? రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 27న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమె ద్వారా ఒక ముఖ్యమైన మాటను చెప్పించగలదో లేదోనని ముందుగా కొంత అనుమానం కలిగింది. చివరకు చెప్పించటం చూసి సంతోషం కలిగింది. భారతదేశం ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని అభివర్ణించారామె. ప్రపంచ చరిత్ర పుటలలోకి వెళ్ళి చూసినట్లయితే ఆ మాటకు కొంత విలువ ఉంటే ఉండవచ్చు. కనుక అది చారిత్రక దృష్టితో సంతోషించదగిన మాటే. అయితే, రాష్ట్రపతితో ఆ మాట చెప్పించిన మోదీ పాలనలో, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్‌లో మన స్థానం 104కు ఎందుకు పతనమైందన్నది భారతీయుల సందేహం.భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని మోదీ కొద్ది సంవత్సరాల క్రితం సగర్వంగా ప్రకటించారు. ఆ మాట చారిత్రకంగా వాస్తవమని ప్రపంచంలో ఏ చరిత్రకారుడు కూడా అన్నట్లు లేడు. అయితే, క్రీస్తు పూర్వం అనేక శతాబ్దాల క్రితం ప్రపంచంలోని పలు సమాజాలు నాగరికమైనా కొద్దీ అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల లక్షణాలు కనిపించసాగాయి. నిజానికి అందుకు బీజాలు ఆదిమ తెగల సమాజాలలోనే ఉన్నట్లు మానవ వికాస శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆ తర్వాత దశలో ఆధునిక సమాజాలు స్థిరపడినా కొద్దీ ఆధునిక ప్రజాస్వామ్యాల దశ మొదలైంది. అటువంటి ప్రాంతాలలో భారతదేశం కూడా ఒకటనటంలో సందేహం లేదు. అవే పరిణామాలు గ్రీసు, ఈజిప్టు, ఇతర మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలు, చైనా వంటి చోట్ల కూడా చోటు చేసుకున్నాయి. ఆ విధంగా ఇవన్నీ క్రీస్తు పూర్వ కాలపు అక్క చెల్లెల్లన్నమాట. అందుకు అనుగుణంగానే ఈ ప్రాంతాలన్నింటా ప్రజాస్వామిక తత్త్వవేత్తలు, సంఘ సంస్కర్తలు, పరిపాలనా శాస్త్రవేత్తలు అప్పటినుంచే ఆవిర్భవించటం మొదలైంది.మొత్తానికి ఆ విధంగా ప్రపంచ ప్రజాస్వామ్యం వేల ఏళ్ళుగా రూపుదిద్దుకున్న చరిత్రలో భారత భూమి భాగస్వామ్యం ఉండటం మనమంతా గర్వించదగ్గ విషయం. అయితే, అటువంటి మహత్తర దేశస్థానం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్‌లో ఇపుడు 104కు ఎందువల్ల పడిపోయినట్లు? ఆ పతనానికి బాధ్యులెవరు? ఆ స్థితి భారతీయులకు గర్వించదగ్గ విషయమా? ప్రజాస్వామ్య దేశాలు, వ్యవస్థలన్నింటిని ఎప్పటికప్పుడు మదింపు చేసే ప్రపంచ స్థాయి సంస్థ పేరు ‘వి–డెమ్’. దాని నివేదికలు కొద్ది సంవత్సరాల క్రితమే ఇండియాను ‘ఇటీవల అతి హీనంగా నియంతృత్వీకరణ చెందుతున్న దేశాలలో ఒక’టనీ, ‘ప్రపంచంలోని మొదటి పది నియంతృత్వ దేశాలలో ఒక’టనీ అభివర్ణించాయి. తర్వాత 2018 వచ్చేసరికి, అనగా గత ఎన్నికల కన్నా ముందే, ‘ఎన్నికైన నియంతృత్వం’ స్థాయికి పడిపోయింది. 2018 నుంచి 2023 వరకు అయిదేళ్ళ పాటు కూడా అదే స్థాయిలో కొనసాగింది. ఈ 2024 ర్యాంకింగ్స్ వచ్చేసరికి పరిస్థితి ఏమి కాగలదో చూడాలి. ఇది వి–డెమ్ పరిశీలించిన మొత్తం 179 దేశాలతో పోల్చినప్పటి స్థితి అన్నమాట. వి–డెమ్ సంస్థ స్వీడన్‌లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ విభాగం నుంచి పనిచేస్తుంది. ఒక ప్రజాస్వామ్యం ఏవిధంగా పనిచేస్తున్నదో మదింపు వేసేందుకు ఆ సంస్థకు ఐదు కొలమానాలు ఉన్నాయి. అవి, ఎన్నికల తీరు, ఉదారవాదం, ప్రజల భాగస్వామ్యం, చర్చలకు గల అవకాశం, ప్రజా సంక్షేమం. వి–డెమ్ మాత్రమే కాదు, కొన్ని తేడాలతో ఇతర ప్రముఖ సంస్థలు కూడా హీనమైన ర్యాంకులే ఇస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ ప్రసిద్ధ ‘ఎకానమిస్టు’ మేగజైన్ 2020లో 53వ ర్యాంక్నిచ్చింది. ప్రజాస్వామ్య సూచీలలో పత్రికా స్వేచ్ఛ ఒకటని భావిస్తే, ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ నివేదిక ప్రకారం, ఈ 2024లో ఇండియా ర్యాంకు 180 దేశాలలో 159వది. మానవ హక్కుల విషయంలో 165 దేశాలలో 109వది. నిజానికి ప్రధానంగా ధనిక వర్గాలకు లాభం చేసే ఆర్థికాభివృద్ధి సూచీల మాట ఎట్లున్నా, సామాన్య ప్రజలకు సంబంధించిన మానవాభివృద్ధి సూచీలు కూడా ప్రజాస్వామ్యం గురించేనని భావిస్తే, ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం మనది 134వ స్థానం. గమనించదగినదేమంటే, ఈ సూచీలన్నీ నరేంద్ర మోదీ పాలనలో క్రమంగా పడిపోతున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఇటువంటి నివేదికలను, వాటిలో పేర్కొన్న వాస్తవాలను, తమ తీవ్రమైన అప్రజాస్వామికతను విస్మరించి, భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే ప్రకటనలు నిర్భయంగా చేయటాన్ని బట్టి వారి తెగువను మెచ్చుకోవాలి. దేశంలో ప్రజలేమన్నా, ప్రపంచం ఏమన్నా, ఈ మాటను కూడా గోబెల్స్ ప్రచారం వలె సాగించినట్లయితే అదే నిజంగా స్థిరపడగలదన్నది మోదీ నమ్మకం అయి ఉండాలి. ఇందులోని గమనించదగ్గ మెలిక ఏమంటే, భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అయినా కాకున్నా ప్రజాస్వామ్యానికి బీజాలు వేసిన భూభాగాలలో ఒకటన్నది నిజమే గాని, దానిని వర్ధిల్ల చేయటంలో మోదీ పాత్ర ఏమిటన్నది ప్రశ్న. మనది మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే ప్రచారం చాటున ఆయన తన అప్రజాస్వామికతను, పైన పేర్కొన్న తరహా ర్యాంకింగుల అప్రతిష్ఠను కప్పిపెట్టుకో జూస్తున్నారనిపిస్తున్నది. గోబెల్స్ తరహా ఎత్తుగడలలో ఇది ఒకటి. ఈ సందర్భంగా, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ సాగించిన భయం గొలిపే విషప్రచారం అనివార్యంగా గుర్తుకువస్తుంది. ఆ ప్రచారాన్ని చివరకు ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సైతం బహిరంగంగా ఆక్షేపించవలసి వచ్చిందంటే, మోదీ తీరును ప్రజాస్వామికమని ఎవరైనా అనగలరా? భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అని సగర్వంగా చాటుకోగల నాయకుని ధోరణి అదేనా? ఈ దేశపు గత చరిత్రను, ప్రజాస్వామిక సంప్రదాయాన్ని ప్రస్తావించే నైతిక హక్కు ఆయనకు ఉంటుందా? పైన పేర్కొన్న ర్యాంకింగ్లన్నీ మొన్నటి ఎన్నికల విష ప్రచారం కన్నా ముందటివి. ఆ తర్వాతవి ఏ విధంగా ఉండగలవో చూడాలి.మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా చెప్పించిన మరొక విశేషం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ. ఈ ప్రస్తావనలు ప్రధానితో పాటు బీజేపీకి చెందినవారు గత కొద్దిరోజులుగా చేస్తున్నారు. అది చాలదన్నట్లు సాక్షాత్తూ రాష్ట్రపతి ద్వారా మాట్లాడించారు. ఎమర్జెన్సీ విధింపు పూర్తి అప్రజాస్వామికమనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ చర్య తీసుకున్న పరిస్థితులు, అది అమలైన తీరు అన్నీ ప్రజాస్వామ్య విరుద్ధమే. దానిని అందరూ ఖండించటమే గాక, తిరిగి ఎన్నడూ ఏ రూపంలోనూ ఆ ధోరణులను ప్రదర్శించకూడదు. కానీ, దానిని ఇంతగా ఖండించే మోదీ చేస్తున్నదేమిటీ? తన నాయకత్వాన ఇండియాకు ప్రజాస్వామ్య ర్యాంకింగ్‌లు వరుసగా పడిపోతూ నియంతృత్వ ర్యాంకింగులు ఎందుకు వస్తున్నాయి? ఇందిర ఎమర్జెన్సీ తన వ్యక్తిగత అధికార పరిరక్షణకు ప్రజాస్వామ్యాన్ని, సమాజాన్ని ఒక పరిమిత కాలం పాటు భంగపరిచిన చర్య. అంతే తప్ప ఆ చర్య దీర్ఘకాలిక ప్రభావం చూపలేదు. అందుకు భిన్నంగా మోదీ చర్యల వల్ల భారత సమాజమే విషప్రాయమవుతున్నది. ఆ ప్రభావాలు దీర్ఘకాలం పాటు ఉండనున్నాయి. తన తీరు చివరకు ఆరెస్సెస్‌కు సైతం ఇబ్బందికరం, అభ్యంతరకరం అవుతున్నది. అటువంటి నాయకుడు కనీసం ఎన్నికల ఎదురుదెబ్బలతోనైనా పాఠాలు గ్రహించి తన ధోరణిని మార్చుకోవటం అవసరం. భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే నీతులు ఎవరికీ చెప్పనక్కరలేదు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకులు- టంకశాల అశోక్ -
‘ఈవీఎం’ సేఫేనా..? జోరందుకున్న చర్చ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) సేఫా..? వాటిలో పడిన ఓటు భద్రమేనాా..? ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చొచ్చా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఇటీవల కొందరు పాపులర్ టెక్నాలజీ నిపుణులే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అయితే ఈవీఎంల వాడకానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టాలని ట్వీట్ చేసి సంచలనానికి తెర తీశారు. మస్క్ ఈ తరహా అభిప్రాయం వెలిబుచ్చిన సమయానికే మహారాష్ట్రలోని ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గంలో ఓటీపీ ద్వారా ఈవీఎంను తెరిచారన్న వివాదం వెలుగులోకివచ్చింది. దీంతో ఈవీఎంల భద్రతపై చర్చ జోరందుకుంది.భారత్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేధావి శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు. వీరే కాక తాజాగా సైబర్ లా నిపుణుడు, ప్రముఖ న్యాయవాది పవన్ దుగ్గల్ కూడా ఇంచు మించు ఇదే చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఛాన్సు లేకపోలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా..? అనే సమాధానం లేని ప్రశ్న మళ్లీ అందరి మెదళ్లను తొలుస్తోంది. అసలు మస్క్ ఏమన్నారు.. సందర్భమేంటి..? ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని టెస్లా అధినేత మస్క్ ఇటీవల సూచించారు. అమెరికా నియంత్రణలో ఉన్న ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’అని మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.మస్క్‌కు మాజీ ఐటీ మంత్రి కౌంటర్లో వాస్తవమెంత..?మస్క్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వెంటనే ఎక్స్‌లో మాజీ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు’అని సూచించారు.రాజీవ్ చంద్రశేఖర్ లాజిక్ కరక్టేనా.. సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ ఏమన్నారు.. ‘ఒక కంప్యూటర్‌కు బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానం లేనపుడు హ్యాక్ చేయడం కష్టమే కావచ్చు. అయితే ఎలాంటి వ్యవస్థనైనా ఏమార్చి దానిలో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నా. నిజానికి భారత్‌లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. భారత్‌లో అసలు సైబర్ భద్రతకు సంబంధించి పక్కా చట్టమే ఇప్పటివరకు లేదు.‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ పప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు’అని సైబర్ లా నిపుణులు, ప్రముఖ న్యాయవాది పవన్‌దుగ్గల్ వ్యాఖ్యానించారు.శ్యామ్ పిట్రోడా అనుమానాలేంటి..?ఈవీఎంలపై టెక్నాలజీ నిపుణుడు శ్యామ్ పిట్రోడా కుండ బద్దలు కొట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పారు. ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి. కొంత మంది చెబుతున్నట్లు ఈవీఎంలు కేవలం స్టాండలోన్ పరికాలే కాదు. వాటికి వీవీప్యాట్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. ఇంతేగాక వీటిని తయారు చేసే క్రమంలో, రవాణా చేసే సందర్భాల్లో ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది’అన్నారు. బ్యాలెట్ పేపరే పరిష్కారమా..? ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అన్న వాదన వినిపిస్తోంది. -
జనస్వామ్యమా! జయీభవ!!
ఏటా వచ్చే వేసవికి అదనంగా ఈసారి ఎన్నికల వేసవిని చవిచూస్తున్నాం. కాకపోతే రెంటి మధ్యా ఒక తేడా ఉంది. సూర్యతాపం ద్విగుణీకృతమవుతున్నకొద్దీ, వోటర్లలోనూ ఎన్నికల సమరోత్సాహం త్రిగుణీకృతమవుతుంది. అదే ప్రజాస్వామ్యంలోని అందమూ, చందమూ, ఆకర్షణా. ప్రజా స్వామ్యం అత్యుత్తమం కాకపోవచ్చుకానీ, ఇప్పటివరకూ అనుభవంలోకి వచ్చిన అన్ని వ్యవస్థల్లో అదే ఉత్తమమని పండితులెందరో తేల్చారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక. తమ కలలు, కాంక్షలతో ముడిపడినవి కనుకే ఎన్నికలు జనానికి మండు వేసవిలోనూ మంచు లేపనమవుతాయి. రాచరికం, సైనిక నియంతృత్వం లాంటి చేదు అనుభవాల దరిమిలా ప్రజాస్వామ్యాన్ని తెచ్చు కున్నామని పొరబడేవారున్నారు. రాజ్యమూ, సామ్రాజ్యమూ ఉనికిలోకి రాకముందే, మనుషులు గుంపు కట్టడం నేర్చిన తొలి దశలోనే అంకురించిన తాత్వికత– ప్రజాస్వామ్యం. కాలికమైన అంతరాలను, అడ్డంకులను దాటుకుని నేటికీ పురివిప్పుతున్న రాజకీయ తాత్వికత అదే. వేట– ఆహార సేకరణ దశలో మనిషి ప్రకృతి శక్తులతో పోరాడుతున్నప్పుడే తోటి మనుషుల తోడు, తోడ్పాటుల విలువ గుర్తించాడు; అభిప్రాయాల కలబోతనూ, ఐక్య కార్యాచరణనూ అలవరచుకున్నాడు. అంద రినీ కలుపుకొనిపోయే నాయకత్వాన్నీ ఆనాడే ప్రతిష్ఠించుకున్నాడు. గణతంత్రం పేరిట సాముదా యికంగా అభివృద్ధి చేసుకున్న సమాజాలతోనే రాజకీయ చరిత్ర ప్రారంభమైందని విజ్ఞులంటారు. గణతంత్రంలో నాయకుడు సమానులలో మొదటివాడే తప్ప అసామాన్యుడూ కాదు, అడ్డు అదుపుల్లేని అధికార శ్రీమంతుడూ కాదు. నేడు ప్రతి వోటుకూ ఒకే విలువ ఉన్నట్టే, నాడు ప్రతి ఒకరికీ ఒకే విలువ. పురాణేతిహాసాల్లో ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. రామాయణంలో దశరథుడు తన పెద్దకొడుకు రాముడికి పట్టాభిషేకం చేయడానికైనా; మహాభారతంలో యయాతి తన చిన్న కొడుకు పూరునికి రాజ్యం కట్టబెట్టడానికైనా పౌర, జానపదుల ఆమోదం తప్పనిసరి. సమష్టి స్థానంలో వ్యక్తి ప్రాధాన్యం పుంజుకున్న దశలోనూ మంత్రి పరిషత్తులో చర్చించే నిర్ణయాలు తీసుకు నేవారు. విభీషణ శరణాగతి ఘట్టంలో రాముడు వానరవీరుల అభిప్రాయాన్ని అడుగుతాడు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో మలుపులూ, మరకలతోపాటు మెరుపులూ మన చూపుల్ని జిగేలుమనిపిస్తాయి. గణాలు వ్రాతాలుగా, వ్రాతాలు జనాలుగా, జనాలు మహాజనాలుగా మారే క్రమంలోనే సామ్రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి. మనదేశంలో మగధ సామ్రాజ్యావతరణకు ముందున్నది గణతంత్రమే. ఆనాడు దేశం పదహారు జనపదాలుగా ఉండేది. గ్రీస్, మెసపోటేమియాలలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి. నాటి గ్రీస్‌లోని ఎథెన్స్ అధినేత పెరిక్లీస్ ప్రజాస్వామిక అనుభవాన్ని కొత్త పుంతలు తొక్కించి జనతంత్రానికే ఘన చిహ్నమయ్యాడు; సంపన్నుల ప్రతిఘటనకు ఎదురొడ్డుతూ పేదలవైపు నిలబడి కలబడడంలోనూ ప్రజానాయకులకు తొలిమూసై మణిపూస అయ్యాడు. బలవత్తరులైన పర్షియన్ల దాడిని దీటుగా తిప్పికొట్టినా, సాటి గ్రీసు రాజ్యమైన స్పార్టాతో యుద్ధమొచ్చిన దశలో ప్లేగు వాతబడి అతను కన్నుమూయడం ఎథెన్స్ స్వాతంత్య్రానికీ; ప్రజాస్వామ్యానికీ చితిపేర్చింది. ఆ తర్వాత, స్పార్టా సహా గ్రీస్ అలెగ్జాండర్ సామ్రాజ్యంలో, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో చిన్న వలసగా మసకబారిపోయింది. అలా కొడిగట్టిన ప్రజా స్వామ్యం తిరిగి కాంతినీ, క్రాంతినీ తెచ్చుకోవడానికి రెండువేల సంవత్సరాలు పట్టింది. ఎథెన్స్ ప్రభవించిన తాత్విక శిఖరాలే సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్! సోక్రటిస్ ప్రజాస్వా మ్యాన్ని వ్యతిరేకించినా; ప్లేటో అన్ని అధికారాలనూ రాజ్యం చేతుల్లో పెట్టి, ఉదారవాద నియంతృత్వమనే ఊహాస్వర్గానికి నిచ్చెన వేసినా; అరిస్టాటిల్ మధ్యేమార్గంగా రాజ్యాంగబద్ధ ఆదర్శ రాజ్యాన్ని నొక్కి చెప్పినా– ముగ్గురూ పశ్చిమ దేశాల రాజకీయ తాత్విక చింతనను ఉద్దీపింపజేసిన వారే. ప్రత్యేకించి అరిస్టాటిల్ ఆధునిక కాలంలో జాన్ లాక్, మాంటెస్క్యూ వంటి ప్రజాస్వామ్య దిశానిర్దేశకులకు ఒరవడి అయ్యాడు. గ్రీకుల బహుళ దేవతారాధనను వ్యతిరేకించినందుకు సోక్ర టిస్‌ను ఉరితీయడం ఎథెన్స్ ప్రజాస్వామ్య పరిమితిని, అపరిణతిని నొక్కిచెప్పి; భావప్రకటనా స్వేచ్ఛలేనిది ప్రజాస్వామ్యమే కాదన్న నీతినీ బోధించింది. పౌర ప్రాతినిధ్యం నుంచి రాచరిక నియంతృత్వంలోకి జారిపోయిన రోమ్ అనుభవమూ ఇలాంటిదే. వ్యక్తులు ఉత్తములూ, ఉన్నత సంకల్పవంతులూ అయితే చాలదు; వ్యవస్థలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యానికి ఉనికీ, మనికీ అన్నది రోమ్ నేర్పిన గుణపాఠం. యూరప్ అంతటా ప్రజాస్వామ్య వ్యవస్థల సంపూర్ణ పతనం; ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఇంగ్లండ్ వేగుచుక్క కావడం; ఫ్రెంచి విప్లవం తిప్పిన మలుపులు; ప్రజాస్వామ్య మార్గంలో అమెరికా వేసిన ముందడుగు– ఇదంతా మరో చరిత్ర. వోటుహక్కు చరిత్రనే తిరగేస్తే, ఎథెన్స్ ప్రజాస్వామ్యంలోనూ బానిసలకు వోటు హక్కు లేదు. ఆ తర్వాతా శ్రామికులకు, స్త్రీలకు వోటు హక్కు లభించడానికి పెద్ద పోరాటాలే జరిగాయి. యూరప్ దేశాలు అనేకం ప్రజాస్వామ్యంలోకి రావడానికి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకూ ఎదురుచూశాయి. ఇలాంటి చీకటి వెలుగుల చిత్రపటంలో భారత్ ఉనికే ఉజ్వలమూ, ఉత్తేజవంతమూ! వోటు హక్కును సార్వత్రికం చేసిన తొలి ఘనత మనదే. భారత్ ఒక దేశంగా మారడాన్నే అనుమానించి అవహేళన చేసిన నాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ సహా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజాస్వామిక ప్రస్థానంలో ముందడుగు వేస్తూనే ఉన్నాం. బహుళ మతాలూ, భాషల వైవిధ్యం వైరుద్ధ్యం కాదనీ, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువనీ ప్రపంచానికి చాటి చెప్పాం. భారత ప్రజాస్వామ్యమా! జయతు జయతు! -
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం: అమెరికా
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కలిగిన ఉన్న దేశం భారత్ అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. భారత్ ఎల్లప్పుడు తమకు ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపింది. భారత్-అమెరికా సంబంధాలపై యూఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మిల్లర్ చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో ప్రజాస్వామ్యం వెనకబాటు తనం, ప్రతిపక్షాలపై అణిచివేత దోరణీకి సంబంధించి అమెరికా కీలక వ్యాఖ్యలను ప్రస్తావిస్త్ను మీడియా అడిగిన ప్రశ్నకు మిల్లర్ సమాధానం చెప్పారు. ‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు భారత్ చాలా ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మకమైన భాగస్వామి. ఇరు దేశాల బంధం సత్యమని నేను ఆశిస్తున్నా’అని మిల్లర్ పేర్కొన్నారు. ఇటీవల కూడా భారత సంబంధాలపై మిల్లర్ స్పందిస్తూ.. భారత్ తమకు(అమెరికా) చాలా ముఖ్యమైన భాగస్వామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్, అమెరికాల సంబంధాలు ఎప్పడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి భారత్‌లో సరైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నామని అమెరికా వ్యాఖానించిన విషయం తెలిసిందే. అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించిన సంగతి విదితమే. -
ఫర్ డెమాక్రసీ? అగేనెస్ట్ డెమాక్రసీ?
‘సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ’ ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ సంస్థ చేసిన అతి గొప్ప పని ముసలివాళ్ళకు, గుడ్డివాళ్ళకు, కుంటివాళ్ళకు ఇంటి దగ్గరే పింఛన్లను అందించే కార్యక్రమాన్ని ఆపించడం. ఇందుకోసం ముందు కోర్టుకు పోయింది. తరువాత ఎన్నికల కమిషన్ వద్దకు పోయి ఆపించింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన 2,50,000 మంది వలంటీర్లు ఫించన్ల పంపిణీ ద్వారా ఓటును ప్రభావితం చేస్తారని. ఇదో కొత్త వాదన, వింత వాదన. ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ సంస్థను ప్రజలు గౌరవిస్తారా? వైసీపీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వలంటీర్లను కాంట్రాక్టు ఉద్యోగ పద్ధతిలో నియమించింది. వారినందరినీ ఉద్యోగాల నుండి తీసేసే అధికారం ఈసీకి కూడా లేదు. వలంటీర్లు చేసే అతిమానవత్వపు పని ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఒకటో తారీఖు నాడు పెన్షన్ డబ్బు వాళ్ళ ఇంటి వద్ద అందించడం. అదికాక వీళ్లు ఇంకా చాలా పనులు తమ క్లస్టర్స్ (దాదాపు 50 కుటుంబాలు)లో చేస్తారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఆ కుటుంబాలతో, ఆ ముసలి వారితో, రోగస్థులతో సంబంధంలో ఉండి వారి మెప్పును పొందిన వలంటీర్లను ఎన్నికలయ్యే వరకు వారిని కలిసి మాట్లాడకుండా ఎలా ఆపుతారు? అంతేకాదు, ప్రభుత్వ వెల్ఫేర్ స్కీముల కిందికొచ్చే ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా మెజారిటీ. అటువంటి కుటుంబాలన్నిటితో ఈ వలంటీర్లు చాలా ఇతర స్కీముల ద్వారా కూడా కలుస్తారు కదా. ఆరోగ్య సంబంధ స్కీములు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అవసరాలు, స్కూలు పిల్లలకు ఉన్న అవసరాలు, రేషనుకు సంబంధించిన అవస రాలు అన్నీ వాళ్లు ఇంటింటికి తీరుస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకు చెడ్డ పేరొస్తే తప్ప, మంచి పేరుతో, సహాయ సహకార సంబంధాలలో వలంటీర్లు ఉంటే వారి సంబంధాల్ని సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ గానీ, ఈసీగానీ ఎలా ఆపుతాయి? ఈ పనిని ఈ సంస్థ డెమాక్రసీకి అను కూలంగా కాదు చేసింది; డెమాక్రసీ వ్యతిరేక బుద్ధితో చేసినట్లు అర్థమౌతూనే ఉంది. ఈ వలంటీర్లు ఆయా గ్రామాల వారే, వాడల వారే. పట్టణాల్లో కూడా వాళ్ళు పనులు చేసే కుటుంబాలకు తెలిసిన వారే. వీళ్ళు నిత్య సంబంధాలు ముసలోళ్ళకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఫించను ఇవ్వకుండా ఆపితే ఆగుతాయా? అప్పుడు ఈ సంస్థ ఏమి చెయ్యాలి? ఈ వలంటీర్ల ఉద్యోగాలు పీకించి గ్రామ బహిష్కరణ చేయించాలి. అప్పుడు వీళ్ళు నిజమైన సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ పని చేసినట్టు! కానీ అది వారి నుంచి కాదు కనుక ఈ ఒక్క డిమాండ్ సాధించారు. ఈ పని చేసింది ప్రజా స్వామ్యం కోసమా, ప్రతిపక్షాల కోసమా? అసలు ఈ సంస్థ ఏర్పడిన విధానం, దాని లక్ష్యం, అది సాధించిన ఘనతలను చూద్దాం. ఇది 2023 అక్టోబర్‌లో విజయవాడలో ఏర్పడింది. మాజీ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఏఎస్) జనరల్ సెక్రటరీగా ఏర్పడింది. మాజీ ఛీప్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం (రిటైర్డ్ ఐఏఎస్) ఇందులో ముఖ్యంగా పని చేస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోనే డెమాక్రసీని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఇద్దరికీ పౌరహక్కుల గురించి ఎన్నడూ మాట్లాడిన చరిత్ర లేదు. ఆదివాసుల్లోగానీ, దళితుల్లోగానీ వీరికి అభిమానులు ఉన్నట్లు ఎక్కడా కనిపించదు. ఇంతకుముందు ఐఏఎస్ అధికారులు పదవుల్లో ఉండగా, దిగిపోయాక కూడా ప్రజల హక్కుల కోసం పని చేసినవాళ్ళు ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ శంకరన్, కాకి మాధవరావు చాలా కాలం ఇటువంటి పని చేశారు. ఆదివాసుల కోసం బీడీ శర్మ చాలా పనిచేశారు. శంకరన్ రిటైర్ అయ్యాక కమిటీ ఆఫ్ కన్సర్న్డ్ సిటిజన్స్ అనే సంస్థ పెట్టి బీద ప్రజల కోసం, పౌర హక్కుల రక్షణ కోసం చాలా పనిచేశారు. ఆయన మరణానంతరం దళిత సంఘాలు ఈనాటికీ ఆయన సంస్మరణ సభలు జరుపుతాయి. కాకి మాధవరావు ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్‌లో చాలా చురుకుగా పనిచేశారు. బీడీ శర్మ ఆది వాసుల హక్కుల కోసం తన జీవిత కాలమంతా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకు భిన్నంగా రమేష్ కుమార్, సుబ్రహ్మణ్యం... చంద్ర బాబు నాయుడి ఏజెంట్లుగా వ్యవహరించారని స్పష్టంగా అర్థమౌ తూనే ఉంది. దానివల్ల ఎవరి హక్కులు భంగమయ్యాయి? అతి బీద, ముసలి, కుంటి, గుడ్డి వారి హక్కులు భంగమయ్యాయి. చాలా బాధా కరమైన విషయమేమంటే ఈ అప్రజాస్వామిక సంస్థ చెయ్యబట్టి 30కి పైగా ముసలివాళ్ళు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన సిటిజెన్స్ ఫర్ డెమాక్రసీ అనే పేరు గల సంస్థను ప్రజలు గౌరవిస్తారా? ఇప్పుడు పరిస్థితి చూడండి. అదే చంద్రబాబు నాయుడు నేను వలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను; వాళ్ళందరికీ నెలకు 10 వేలు ఇస్తానంటున్నాడు ఎందుకు? మొత్తం ప్రజానీకంలో ఆయన ఆట బొమ్మలైన మాజీ ఐఏఎస్ అధికారులు చేసిన పనివల్ల మొత్తం కూటమి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఈ కూటమి కూడా ఒక ఉమ్మడి మానిఫెస్టోను ప్రకటించలేదు. ఎవరిది వాళ్ళు మానిఫెస్టోగా రాసుకున్నారు. కానీ రేపు అధికారమొస్తే ముగ్గురు మంత్రి మండలిలో ఉండి పరిపాలించాలి. చంద్రబాబు ఇప్పుడు ఇచ్చే హామీలు బీజేపీ, జనసేనవి కావు కదా! వాళ్ళెందుకు అంగీకరిస్తారు? ఆయన పబ్లిక్ మీటింగుల్లో ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నాడు. మరో వాగ్దానం చూడండి. ఆయన అధికారంలోకి వస్తే ప్రతి స్త్రీకి సంవత్సరానికి 15 వేలు ఇస్తాడట. ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తాడట. ఇద్దరుంటే 30 వేలు, ముగ్గురుంటే 45 వేలు అంటున్నాడు. ఈ పైసల పంపకాన్ని బీజేపీ ఒప్పుకుంటుందా! అందుకు మోదీ సరే అన్నాడా? చంద్రబాబు హామీలు జగన్ హామీ లలా కాదే. జగన్ అన్నీ స్వయంగా తన పార్టీలో నిర్ణయించగలడు. కానీ బాబు ఇప్పుడు అలా చెయ్యలేడే. బీజేపీ ఒక జాతీయ పార్టీ. దానికి 30 వేల ఎకరాల్లో వేల కోట్లు పెట్టి రాజధాని కట్టడమే అంగీకారం కాదు. ఇప్పుడు ఆంధ్రలో వలంటరీ వ్యవస్థను అంగీకరిస్తే దేశమంతా అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశముంది. కనుక బాబు బోగస్ వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయన అయోమయంలో మాట్లాడు తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశంలో చాలా అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రశాంత్ కిశోర్ డబ్బులతో ఎన్నికల రిజల్ట్ ప్రిడిక్షన్స్ చేస్తూ స్వంత పార్టీ పెట్టి బిహార్‌లో ఏ మాత్రం గుర్తింపు లేని నాయకుడుగా మిగిలిపోయి ఇప్పుడు మళ్ళీ పాత అవతారమెత్తుతున్నాడు. ఏపీ ఎన్నికలు అతన్ని దేశంలోనే ఎవరూ నమ్మకుండా చేసే అవకాశముంది. విదేశాల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకొని వచ్చిన ఈ బ్రాహ్మణ మేధావి ఇంగ్లిష్ మీడియం విద్యా ప్రభావంగానీ, సంక్షేమ పథకాల ప్రభావంగానీ ఎన్నికల్లో ఉండదని ఊకదంపుడు బ్రాహ్మణ వాదం చేస్తున్నాడు. బడులు కాకుండా, గుడులు కడితే ప్రజలు ఓట్లేస్తారని వీరి సిద్ధాంతం. రిటైర్డ్ ఐఏఎస్‌లు పౌరహక్కుల నాయకుల అవతారమెత్తి ముసలోళ్ళను, కుంటోళ్లను, గుడ్డోళ్ళను ముంచితే వారి నాయకుడు చంద్రబాబు వలంటీర్లను, అమరావతి రైతులను అంతు లేని ఆశలతో ముంచుదామని చూస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. ఎలా నమ్ముతారు? జగన్ వెల్ఫేర్ కార్యక్రమాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది; అభివృద్ధి అంటే సింగపూర్ వంటి రాజధాని కట్టలేదు; అద్దంలా మెరిసే రోడ్లు వెయ్యలేదు అంటూనే ఇప్పుడు జగన్‌ను మించిన హామీలిస్తున్నాడు. ఆయన ఇచ్చే హామీల గురించి పవన్ కల్యాణ్ గానీ, పురందే శ్వరిగానీ ఏమీ మాట్లాడటం లేదు. అంటే ఆ పార్టీలు ఈ వాగ్దానా లను అంగీకరించవనే కదా అర్థం. ఎన్నికలు ఇంకో నెల రోజులు ఉండగా, ఈ మూడు పార్టీల పరేషాన్ చూస్తే చూసేవారికే జాలేస్తుంది. మరీ చంద్రబాబు అయితే ఓడిపోతే ఎట్లా, ఎట్లా అనే భయం ముఖంలో కనిపిస్తుంది. ఇవి ఆఖరి ఎన్నికలని ఆయన భయమే చెబుతుంది. ఏమౌతుందో ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Lok sabha elections 2024: ఎన్నికల భారతం చూసొద్దాం!
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్! ‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు లెక్కలేస్తున్నాయి. మెక్సికో స్ఫూర్తి 2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది. గుజరాత్లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్యాకేజీల ప్రత్యేకతేంటి? అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్‌ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్నర్ సుదేశ్ రాజ్‌పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్‌ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటు ప్రజాస్వామ్య జీవధాతువు
భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. ఓటరు చైతన్యం ఇందులో కీలకం. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. మన జీవిత నిర్మాణానికి అది ఒక పనిముట్టు. ఓటుహక్కును మనం దుర్వినియోగం చేసుకుంటే, మన మిగిలిన హక్కులన్నీ కాల రాయ బడతాయి. అందుకే ఓటు అనేది అత్యున్నతమైనది. దాని విలువ అమూల్యమైనది. ఆ విలువ మానవ విలువలతో సమానమైనది. భిన్న భావజాలాల ప్రభావం ఈ ఎన్నికల మీద ఉండబోతోంది. అంబేద్కర్ వాదుల, సామ్యవాదుల, సోషలిస్టుల, కమ్యూనిస్టుల, స్త్రీవాదుల, దళిత బహుజన వాదుల, మైనారిటీ హక్కుల వాదుల, మానవ హక్కుల పోరాటవాదుల సిద్ధాంతాల ప్రజ్వలనం సమాజంలో అంతర్గతంగా బలంగా ఉందని చెప్పక తప్పదు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూలు వస్తుందనగా... బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం దీని లక్ష్యం. సీఏఏ చట్టం 2019 లోనే పార్ల మెంట్ ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా... విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదను చూసి ఇపుడు దానిని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం వర్తిస్తుంది. భారతదేశంలోకి అనేక మతాలవారు ఆయా కాలాల్లో వచ్చారు. భారతీయ జన జీవనంలో కలసిపోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అన్ని మతాలవారు, కులాల వారు కలసి పోరా డారు. భారతదేశానికి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుండి ముస్లింలకు పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఇస్తూ వస్తు న్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముస్లిం సభ్యులు 76 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఎంపీలు గణనీయంగా ఎన్నికయ్యారు. ఆనాడు ముస్లింల జనాభా 6 శాతం కంటే తక్కువ. మొదటి రాజ్యసభలో సుమారు 10.5 శాతం ముస్లిం సభ్యులున్నారు. 2014లో బీజేపీ స్వల్ప మెజారిటీతో లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి ముస్లింల ప్రాతినిధ్యం అత్యల్పం. అందుకే 2024 ఎన్నికల్లో ముస్లింలు ఏకమై సెక్యులర్ పార్టీలకు ఓట్లు వేస్తారని ఒక పరిశోధనా పత్రం పేర్కొంది. బీజేపీపై పోటీ చేసే బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారని ఆ పరిశోధన అంచనా వేసింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 27 మంది ముస్లిం అభ్యర్థులు గెలవగా (17వ లోక్‌సభ), 16వ లోక్‌సభలో 23 మంది ముస్లిం సభ్యు లున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇది ముస్లింలు తక్కువ సంఖ్యలో వున్న రెండోసభ. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా (17.22 కోట్లు్ల) కలిగివున్న దేశం. నిజానికి ముస్లింలు ఈ దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న ప్రధానమైన శక్తులు. వారిని నిర్లక్ష్యం చేయడం దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు. క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూమతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైనవారు ఆ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. దళితులు ఎక్కువ మంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం వల్ల, జనరల్ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చింది. సమసమాజ భావాన్ని ప్రజ్వ లింప చేసింది. మానవతా ధర్మాన్ని ప్రబోధం చేసింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ సంస్కృతి వికాసం జరిగింది. భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. వారు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. పరోక్ష రాజకీయ ఉద్యమంలో వున్నారు. తప్పకుండా భారత రాజ కీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది. ఇకపోతే రావ్‌ు మనోహర్ లోహియా ప్రభావం దళిత బహుజన రాజకీయాల మీద బలంగా వుంది. మండల కమిషన్ రిపోర్టును బయటికి తీసుకొచ్చిన వి.పి.సింగ్ ప్రభావం కూడా బలంగా వుంది. కమ్యూనిస్ట్‌లు, అంబేడ్కర్ వాదుల అశేషమైన భావజాలం కూడా 2024 ఎన్నికల మీద వుంది. భారతదేశంలో అనేక భావజాలాల ప్రభావానికి ఈ ఎన్నికలు గురవు తాయి అనడంలో సందేహం లేదు. ఫూలే, అంబేడ్కర్, రావ్‌ు మనో హర్ లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్, వి.పి. సింగ్, కాన్షీరావ్‌ు... వీరందరి ప్రభావం తప్పక ప్రజల మీద ఉంది. ఇకపోతే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన తొమ్మిదేళ్ళ పది మాసాల్లో పెరిగిన నిరుద్యోగం, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం కావడం, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్ట కష్టాలను ప్రధానాంశాలుగా ప్రతిపక్షాల కూటిమి ‘ఇండియా’ విస్తృతంగా ప్రచారం చేయాలి. మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ చెప్పినట్లుగా దశ మహపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకర నమిలేస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు కొత్త కాదు. ప్రజలు చైతన్యవంతులు, ఆలోచనాపరులు. అయితే, యువతకు ఉద్యోగ వసతి కల్పిస్తారనీ, ఆర్థిక అభివృద్ధి చేస్తారనీ ఎక్కువమంది మోదీకి ఓట్లు వేశారు. కానీ పేద ప్రజలకు భరోసాని ఇచ్చే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామి’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ విధి. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత మేలు ఉన్నప్పటికీ, లోపాలు కూడా లేక పోలేదు. సున్నితమైన నియోజకవర్గాల్లో, ఎన్నికల సంబంధ హింసాకాండ చోటు చేసుకొనే అవకాశమున్న పోలింగ్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించడానికి విడతలవారీ ఎన్నికల నిర్వహణ దోహదపడుతుంది. 85 ఏళ్ళ వయస్సు పై బడిన వారందరూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 85 వయస్సు పైబడిన ఓటర్లు దేశ వ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో వందేళ్ళు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది వున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఈనాడు అనివార్యంగా ఓబీసీలకు సీట్లు పెంచవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. బీసీలు వృత్తికారులే కాక, శ్రామికశక్తులు! చాలామంది బీసీలు తమ విముక్తిదాతైన ఫూలే గూర్చి తెలుసుకోలేకపోతున్నారు. మహాత్మా ఫూలే ఓబీసీలకు అర్థమైనపుడే వారిలో సామాజిక, రాజ కీయ చైతన్యం వస్తుంది. స్త్రీలకు కూడా మునిపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తారు. విద్యాధికులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, పాత్రికేయ ప్రము ఖులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూకారు. ఆంధ్రప్రదేశ్‌లోకి బీజేపీని ఆహ్వానించడం వల్ల చంద్రబాబు ముస్లింల, క్రైస్తవుల, సోషలిస్టుల, కమ్యూ నిస్టుల ఓట్లు కోల్పోతున్నారు. రాజ్యాంగేతరమైన భావజాలం ఎన్ని కలలో పెరగడం ఆశ్చర్యకరం. అయితే భారతదేశంలో ఇవన్నీ అనేక సందర్భాలలో జరుగుతూ వచ్చాయి. వాటన్నింటినీ భారతదేశం తట్టుకొని నిలబడుతూ వచ్చింది. బీజేపీ తన వ్యూహ ప్రతి వ్యూహ రచనల్లో ప్రధానంగా పార్టీలను చీల్చడం, లొంగదీసుకోవటం వంటి అనేక వ్యూహాలతో ముందుకువెళ్తోంది. కానీ భారత రాజ్యాంగాన్ని దాటి వెళ్లే శక్తి ఏ వ్యక్తికీ, ఏ పార్టీకీ లేదని మనం తప్పక నమ్మాలి. దాని అంతర్గత శక్తి బౌద్ధ సూత్రాలతో నిండి ఉంది. అందుకే 2024 ఎన్నికలకు దళిత బహుజన లౌకికవాద భావజాలంతో ముందుకు నడవాల్సిన చారిత్రక సందర్భం ఇది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
ప్రజాస్వామ్యంలో ఏఐ పాత్ర
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) తన మొదటి ప్రధాన నైతిక పరీక్షను ఎదుర్కొనే సంవత్సరంగా ఈ 2024 ఉండబోతోంది. ఈ సంవత్సర ప్రారంభంలో బంగ్లాదేశ్, స్లొవేకియాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులను దెబ్బగొట్టడానికి ‘డీప్ ఫేక్’ను వాడుకున్నారు. అదే సమయంలో, జైలు నుంచే ఇమ్రాన్ ఖాన్ తన ఓటర్లకు పిలుపునివ్వడంలో కూడా జెనరేటివ్ ఏఐ సాయపడింది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పాత్రకు భిన్నంగా కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవచ్చో పాకిస్తాన్ చేసి చూపించింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ చాలా సాయపడగలదు. తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహించుకోవడంలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడగలదు. గత రెండేళ్లుగా, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)... దాని ద్వారా ఉత్పన్నమైన ఉత్సాహం, అది కలిగించిన అంతరాయాలపై సాంకేతిక కథనాలు ఆధిపత్యం చలాయించాయి. కాపీరైట్, పక్షపాతం, గోప్యత, డీప్‌ఫేక్ (వ్యక్తుల వాస్తవ చిత్రాన్ని మార్చి అప్రతిష్ఠకు పాల్పడటం) వంటి నైతిక సమస్యలు ఎదురు కావడంతో, 2023 చివరి భాగంలో ఈ కథనాలు కొద్దిగా పసలేనివిగా మారిపోయాయి. ఇప్పుడు, చాలా దేశాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి సహాయపడినా లేదా దానిని నాశనం చేసినా... కృత్రిమ మేధస్సు తన మొదటి ప్రధాన నైతిక పరీక్షను ఎదుర్కొనే సంవత్సరంగా 2024 ఉండబోతోంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, ఇతర ప్రధాన ప్రజాస్వామ్య దేశాలు ఈ సంవత్సరం కీలకమైన ఎన్నికలకు వెళుతున్నాయి. జనరేటివ్ ఏఐ కంటే ముందే డీప్‌ఫేక్‌లు ఉనికిలో ఉన్నప్పటికీ – ‘సోరా’, ‘స్టేబుల్ డిఫ్యూజన్’ వంటివి వాటి ఉత్పత్తిని ప్రజాస్వామీకరించాయి. వాటిని సులభంగా, వేగంగా, చౌకగా మార్చేశాయి. వాట్సాప్, టిక్ టోక్ మొదలైనవి అంతర్జాతీయ పంపిణీని అత్యంత సులభంగా మార్చేయడంతో సోషల్ మీడియాకు సంబంధించి శిఖరస్థాయి దశలో ఉన్నాం. బంగ్లాదేశ్, స్లొవేకియా ఈ సంవ త్సరం ప్రారంభంలో ఎన్నికలకు వెళ్లాయి. ఈ సందర్భంగా చాలా డీప్‌ఫేక్‌లు వచ్చాయి. బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకుడు పాలస్తీనియన్లకు తన మద్దతు విషయంలో సందిగ్ధంగా ఉన్నట్లు చూపటం జరిగింది. ఇది ఆ దేశంలో ఒక వినాశకరమైన వైఖరి. స్లొవేకియా ఎన్నికలలో, ఒక ప్రధాన పోటీదారు ఎన్నికల రిగ్గింగ్ గురించి, మరింత ప్రమాదకరంగా బీరు ధరను పెంచడం గురించి మాట్లాడినట్లు చూపారు. ఇది ఆయన ఓటమికి కారణమైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నకిలీ వాయిస్ అమెరికా ప్రైమరీలలో ఓటు వేయవద్దని ప్రజ లను కోరింది. 2016 కేంబ్రిడ్జ్ అనలిటికా(డేటా స్కాండల్) వైఫల్యానికి చెందిన జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్నాయి. పెద్ద ఎన్నికలు సమీపి స్తున్నందున ఇవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అయినప్పటికీ, నేను ఇక్కడ భిన్న వైఖరిని తీసుకుంటాను. పాకిస్తాన్ వైపు చూడండి. అక్కడ మాజీ ప్రధాని జైల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. ఆయన పార్టీ గుర్తులు లాక్కుని, వారి అభ్యర్థులను నిర్బంధిస్తామని బెదిరించారు. చివరికి ఇతర పార్టీలు గెలిచినట్లు ప్రకటించినప్పటికీ, భారీ రిగ్గింగ్, అవకతవకలు జరిగి నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కచ్చితమైన మెజారిటీ వచ్చిందని చాలా నివేదికలు పేర్కొన్నాయి. కటకటాల్లో ఉండి కూడా, దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనరేటివ్ ఏఐని ఉపయోగించుకోవడం ద్వారా, ప్రజాస్వామ్యాన్ని అణచివేశానని తనపై వచ్చిన కథనాన్ని ఇమ్రాన్ ఖాన్ వమ్ముచేయగలిగారు. తన ఓటర్లను బయటకు వచ్చి తన పార్టీకి ఓటు వేయమని ఇమ్రాన్ కోరిన దృశ్యాలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐని ఉపయోగించుకున్నారు. ఇది యూట్యూబ్‌తోపాటు ఇతర ఆన్ లైన్ ఛానెళ్లలో విస్తృతంగా షేర్ అయింది. ప్రజలు ఆయన పిలుపును విని రికార్డు సంఖ్యలో బయటకు వచ్చారు. ఆయన అభ్య ర్థులకు ఆశ్చర్యకరమైన విజయాలు అందించారు. ప్రజాస్వా మ్యాన్ని నాశనం చేసే పాత్రకు భిన్నంగా, కృత్రిమ మేధస్సును ఎలా ఉప యోగించుకోవచ్చో పాకిస్తాన్ చేసి చూపించింది. డీప్‌ఫేక్‌ల విధ్వంసక శక్తిని నేను తిరస్కరించడం లేదు. భారత్‌లో, ఇతర దేశాల్లోని ఎన్నికలలో చర్చను ప్రేరేపించడానికీ, కథనాలను రూపొందించడానికీ వాటిని ఉపయోగిస్తారని నేను భయ పడుతున్నాను కూడా. అయినప్పటికీ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ చాలా సాయపడగలదు. పాకిస్తాన్ ఉదాహరణ దీనికి సంబంధించి ఒక సృజనాత్మక మార్గం. ఎన్నికల్లో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని, సమర్థతను పెంపొందించడానికి కూడా ఏఐని ఉపయోగించవచ్చు. దాని అధునాతన డేటా విశ్లేషణ సామర్థ్యాలు ఎన్నికల సంబంధిత డేటాను నిజ సమయంలో పర్యవేక్షించగలవు. మోసపూరిత కార్యా చరణను సూచించే ఏవైనా అవకతవకలను ఇట్టే గుర్తించగలవు. ఏఐ అల్గారిథమ్‌లు ఓటరు నమోదులు లేదా బ్యాలెట్ సమర్పణలో అక్ర మాలకు సంబంధించిన నమూనాలను గుర్తించగలవు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్‌ల భద్రతను కూడా ఏఐ మెరుగు పరుస్తుంది. అదనంగా, ప్రమాదాలను కనిపెట్టే అల్గారి థమ్‌లు... సంభవించగల సైబర్ ప్రమాదాలను గుర్తించడంలో కూడా సహాయపడతాయి. స్థానిక సమస్యలపై దృష్టి సారించే అభ్య ర్థులపై, వారి మాని ఫెస్టోలపై ప్రజల స్థానిక మాండలికాలలో అత్యంత సున్నితమైన వ్యక్తిగత కంటెంట్‌ని రూపొందించడంలో జెనరేటివ్ ఏఐ సహాయ పడుతుంది. తద్వారా ఓటరు అవగాహనను నవీకరించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా వ్యక్తిగతీకరించిన విధానం విస్మృత వర్గాల్లో రాజకీయ అవగాహనను పెంపొందించగలదు. దీన్ని అధిక సామర్థ్యంతో చాలా తక్కువ ఖర్చుతో చేయ డంలో జెనరేటివ్ ఏఐ ఉపయోగపడుతుంది. తద్వారా తక్కువ డబ్బు ఉన్న అభ్యర్థులకు కూడా అధికారం లభించేలా చేస్తుంది. కృత్రిమ మేధతో నడిచే వ్యవస్థలు వైకల్యాలున్న ఓటర్లకు ప్రాప్యతను కూడా మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు, అతిశక్తిమంతమైన వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్‌లు దృష్టి లోపం ఉన్న ఓటర్లకు సహాయపడతాయి. రాజకీయ సంభాషణలో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, జన సమూహాలలో ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి కూడా కృత్రిమ మేధను అన్వయించవచ్చు. ఎన్నికల నిర్వహణ లాజిస్టిక్స్ వంటివాటిని కూడా అనుకూలపర్చవచ్చు. ఖర్చులు ఆదా చేయవచ్చు. ఇది భారతదేశం వంటి పెద్ద దేశాలకు చాలా ముఖ్యమైనది. ఓటరు నమోదును, ధ్రువీ కరణను మరింత సమర్థవంతంగా చేయడంలో కృత్రిమ మేధ సహాయపడుతుంది. అర్హతను ధ్రువీకరించడానికి అవసరమైన డేటాను సరైన సమయంలో విశ్లేషించడం ద్వారా పొడవాటి క్యూలు లేకుండా చేస్తుంది. చివరగా, కృత్రిమ మేధ అనేది ద్వంద్వ వినియోగ సాంకేతికతను కలిగివున్నది. అపారమైన విధ్వంసక శక్తితో పాటు భారీ ప్రయో జనాలను ఇది కలిగి ఉంది. ఎన్నికలపై దాని ప్రతికూల ప్రభావాన్ని డీప్‌ఫేక్‌ల రూపంలో మనం చూడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మన ప్రజాస్వామ్యాలను అది ఎలా మెరుగుపరుస్తుందో కూడా చూడాలి. పర్ఫెక్టుగా లేకపోయినా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఈ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపడంలో విజయం సాధించింది. జస్ప్రీత్ బింద్రా వ్యాసకర్త సాంకేతికాంశాల మేధావి (‘ది మింట్’ సౌజన్యంతో) -
ఎన్నికల బృహత్ పర్వం!
ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల సమయం వచ్చింది. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలకూ, అదే విధంగా మరో 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకూ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించడంతో ఒక బృహత్ యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో మరో నెల రోజుల పైచిలుకులో తొలి దశతో సుదీర్ఘ ఎన్నికల పర్వం ఊపందు కోనుంది. ఇదే ఏడాది అమెరికా సహా పలు భారీ ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, 96.9 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లతో మన దేశం సంఖ్యాపరంగా అన్నిటి కన్నా ముందు వరుసలో ఉంది. అలాగే, మిగిలిన దేశాలతో పోలిస్తే సుదీర్ఘంగా ఈ ప్రక్రియ సాగనుంది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు సైతం ఇలాగే సుదీర్ఘంగా సాగాయి. 489 స్థానాలకు గాను మొత్తం 68 దశల్లో అప్పట్లో ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత మళ్ళీ అంత సుదీర్ఘంగా సాగుతున్నవి ఈ సార్వత్రిక ఎన్నికలే. ఈ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజుల వ్యవధిలో ఈ హంగామా కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో రానున్న రెండున్నర నెలలు వేసవి వేడితో పాటు దేశమంతటా ఎన్నికల ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయి. ఇవి యువతరం ఎన్నికలు కావడం విశేషం. ఓటర్లలో 29 శాతం మంది 18 నుంచి 29 ఏళ్ళ మధ్యవయసు యువతరమే. 2660 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి కూడా! అధికారికంగా అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు విధించారన్న మాటే కానీ, పార్టీల ప్రచారం సహా ఈ ఎన్నికల తతంగం మొత్తం ఖర్చు దాదాపు రూ. 1.2 లక్ష కోట్లు దాటుతుందని లెక్క. ఏకంగా 15,256 అడుగుల ఎత్తైన ప్రాంతంలోనూ పోలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న బృహత్తర ప్రక్రియ ఇది. వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఫోన్–ఇన్ ప్రచార సాధనాలతో వర్చ్యువల్ ప్రచారం ప్రబలిన ఆధునిక కాలమిది. ఓటింగ్‌కు 48 గంటల కన్నా ముందే ప్రచారం ఆపాలి, అంశాల ప్రాతిపదికన – కులమతాలకూ, విద్వేషానికీ దూరంగా ప్రచారం సాగాలి లాంటి నిబంధనల్ని ఆచరణలో పెట్టించడం ఈసీకి కష్టమే. అలాగే 1999లో 29 రోజులతో మొదలై గత 2019లో 39, ఈసారి 44 రోజులకూ వ్యాపిస్తూ పోతున్న ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండే పాలకపక్షాలకు వాటంగా మారుతుందని ఆరోపణలొస్తున్నాయి. షెడ్యూల్ ప్రకటన ఫలితంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో ఈసీ క్రియాశీలక పాత్ర మొదలైంది. తాజాగా సోమవారం గుజరాత్, యూపీ సహా అరడజనుల రాష్ట్రాల్లో హోమ్‌శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ కౌరడా జుళిపించింది. పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన డీజీపీపై వేటు వేసింది.ఎన్నికలు నిష్పక్ష పాతంగా సాగాలంటే, ఆయా ప్రాంతాల్లో పాలకపక్ష అనుకూలురని పేరుబడ్డ అధికారులకు చెక్ చెప్పడం సమంజసమే, స్వాగతించాల్సిందే. అయితే, అనేక సందర్భాల్లో కేంద్రంలోని పాలక వర్గాల చేతిలోని సంస్థగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వింటూనే ఉన్నాం. అవన్నీ నిరాధారమని మాటలతో కన్నా చేతల ద్వారా తేల్చడమే ఈసీ ముందున్న మార్గం. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒకప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ను ఆదర్శంగా నిలుపుకోవాలి. పాలకుల కన్నా ప్రజలకు జవాబుదారీగా ఈసీ నిలబడాలి. డబ్బు, అధికారం లేనివారు సైతం ఎన్నికల బరిలో స్వేచ్ఛగా పోటీ చేసే ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి. దురదృష్టవశాత్తూ పరిస్థితులన్నీ ఆ ఆదర్శాలకు తగ్గట్టు ఉన్నాయన్న భరోసా ఇప్పటికీ పూర్తిగా కలగడం లేదు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలోనే దేశంలో ఒకటికి రెండు కీలక పరిణామాలు సంభవించాయి. రహస్యమయమైపోయిన ఎన్నికల బాండ్లలో దాతలు, గ్రహీతల (పార్టీల) వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని ఆదేశించాల్సి వచ్చింది. మరోపక్క మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై వేలకొద్దీ పేజీల నివేదిక సమర్పిస్తూ, లోక్‌సభకూ, రాష్ట్రాల శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలని సిఫార్సు చేసింది. ఇంకొకపక్క కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి భాగం లేకుండా ప్రభుత్వం ఆ మధ్య చేసిన మార్పులు సైతం మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఒక రకంగా భారత ప్రజాస్వామ్య ప్రస్థానం నునుపైన జారుడు శిఖరం మీద సాగుతున్న అంశాన్ని పట్టిచూపాయి. రానున్న కాలంలో ఈ ప్రయాణం ఇంకెంత సంక్లిష్టం కానున్నదో చెప్పకనే చెప్పాయి. బాండ్ల సాక్షిగా పారిశ్రామిక వర్గాలకూ, రాజకీయాలకూ మధ్య రహస్యబంధం అంతకంతకూ బలపడుతున్న వేళ, దేశమంతా ఒకేసారి ఎన్నికలతో సమస్తం కేంద్ర పాలకుల కనుసన్నల్లోకి మార్చాలని చూస్తున్న వేళ... రానున్న ఎన్నికల్లో ప్రజలెన్నుకొనే ప్రభుత్వాలు కీలకం కానున్నాయి. ‘‘చరిత్ర కూడలిలో నిల్చొని, ఏ మార్గంలో వెళ్ళాలో ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి జాతికీ ఒకానొక దశలో వస్తుంది’’ అని భారతదేశానికి రెండో ప్రధాన మంత్రి అయిన లాల్‌బహదూర్ శాస్త్రి ఒక సందర్భంలో అన్నారు. ఆ మార్గాన్ని బట్టే భవితవ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతావని తన ప్రయాణంలో ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉంది. ఈ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఎంచు కొనే మార్గం పౌరుల మొదలు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికార వ్యవస్థ, మీడియా దాకా సమస్తాన్నీ ప్రభావితం చేయనుంది. అందుకే, సరైన మార్గాన్ని ఎంచుకోవడం అత్యవసరం. సరైన ఎంపిక సాగాలంటే, అలక్ష్యం చేయకుండా విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడమే సాధనం. -
మరోసారి 'మోదీ'ని ప్రశంసించిన అమెరికన్ సింగర్.. ఎందుకంటే?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేసింది. దీనిపై దేశంలో పలు ప్రాంతాల్లో వ్యతిరేఖత కనిపిస్తోంది. కానీ ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని 'మేరీ మిల్బెన్' మాత్రం ఇది గొప్ప చర్య అంటూ వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని గుర్తించాలని, భారతదేశంతో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలని, ముఖ్యంగా మూడోసారి మోదీని ఎన్నుకోవాలని సూచించింది. సీఏఏ నిజమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని, దుర్బల వర్గాలకు రక్షణ మరియు ఆశ్రయాన్ని అందజేస్తుందని మేరీ మిల్బెన్ పేర్కొంది. మత స్వేచ్ఛను కోరుకునే క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఇదొక శాంతి మార్గం. భారతదేశం వీరందరికి నివాసం కల్పిస్తోంది. పౌరసవరణ చట్టం నిజమైన ప్రజాస్వామ్య చర్య అని మేరీ మిల్బెన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొంది. భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నోటిఫికేషన్ గురించి అగ్ర రాజ్యం అమెరికా ఆందోళన చెందుతోంది. సీఏఏ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తూ.. ఇది భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. @StateDept, PM @narendramodi is demonstrating compassionate leadership towards those being persecuted for their faith and providing a home to them in #India. A pathway to peace for Christians/Hindus/Sikhs/Jain/Buddhists seeking #religiousfreedom. When the PM is reelected for a… https://t.co/Y5tyuWCVAs — Mary Millben (@MaryMillben) March 15, 2024 -
ట్రంప్ ప్రపంచానికే ముప్పు
వాషింగ్టన్: తన కంటే ముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా దుమ్మెత్తి పోశారు. ఏ అధ్యక్షుడైనా అమెరికా ప్రజలను రక్షించడాన్ని కనీస బాధ్యతగా భావిస్తాడని, ఈ విషయంలో ఆ మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని, అతడిని క్షమించలేమని అన్నారు. బైడెన్ గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటపాటు మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పేరును 13 సార్లు పరోక్షంగా ప్రస్తావించారు. పలు అంశాల్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లాడని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘నాటో’ దేశాలను ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్‌కు సూచించాడని ఆరోపించారు. పుతిన్ చర్యలను అడ్డుకోకపోతే ప్రపంచ దేశాలకు నష్టం తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు మరణించడం చూసి తాను తీవ్రంగా చలించిపోయానని బైడెన్ చెప్పారు. గంజాయి తీసుకుంటే నేరం కాదు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ నెగ్గడానికి యువ ఓటర్ల మనసులు గెలుచుకొనే పనికి శ్రీకారం చుట్టారు. గంజాయి తీసుకుంటే, గంజాయి కలిగి ఉంటే నేరంగా పరిగణించవద్దని తేలి్చచెప్పారు. గంజాయి విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించానని చెప్పారు. సాధారణంగా స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్‌లో తమ విదేశాంగ విధానంతోపాటు దేశీయంగా కీలక అంశాలను అమెరికా అధినేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ, గంజాయి గురించి మాట్లాడిన మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం బైడెన్ కావడం విశేషం. -
ప్రజాస్వామ్యమే గెలిచింది: ఏక్నాథ్ షిండే
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చేశారు. ఈ తీర్పుపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే.. శివ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరోసారి విజయం సాధించిందని అన్నారు. శివ సేన- బీజేపీ సంకీర్ణ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షల మంది ఓటర్లు గెలుపొందారని తెలిపారు. "రాష్ట్రంలోని శివసైనికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. 2019లో శివసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లు ఈరోజు విజయం సాధించారు. ఇది శివుడి విజయం. హిందూ హృదయ చక్రవర్తి బాలాసాహెబ్ థాక్రే భావాజాలంతో ఉన్న శివసైనికుల విక్టరీ ఇది." అని ఏక్నాథ్ షిండే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. "బాలాసాహెబ్, ధర్మవీర్ ఆనంద్ దిఘేల హిందుత్వ భావాజాలానికి మేమే నిజమైన వారసులమని మరోసారి రుజువైంది. నేటి విజయం సత్యం విజయం. సత్యమేవ జయతే." అని అన్నారు. "నేటి ఫలితం ఏ పార్టీ విజయం కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ముఖ్యం. శివ సేనాను ఎలక్షన్ కమిషన్ మనకు కేటాయించింది. ఇప్పుడు విల్లు, బాణాలు కూడా మన చేతికి వచ్చాయి. నేటి ఫలితాల నుంచి నియంతృత్వం, రాజవంశం అంతమైంది." "పార్టీని తన ఆస్తిగా భావించి ఎవరూ తన మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేరు. ప్రస్తుత తీర్పు పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా ఉండకూడదు. ఈ తీర్పు అందుకు ఉదాహారణగా ఉంది.' అని షిండే ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన -
ప్రజాస్వామ్యం లేని గెలుపు?
ఆమె గెలవడం ఇది అయిదోసారి. అందులోనూ ఇది వరుసగా నాలుగో గెలుపు. మామూలుగా అయితే ఇది అసాధారణం. అయితే, బంగ్లాదేశ్‌లో కాదు. ఆ దేశంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన తీరు కానీ, ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ (ఏఎల్) ఘన విజయం కానీ అనూహ్యమేమీ కాదు. మునుపటి ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మిత్రపక్షాలు... అన్నీ కలిపి 15 పార్టీలు ప్రజాతీర్పుకు దూరంగా ఉన్నప్పుడు పాలక పక్షానిదే గెలుపు కాక మరేమవుతుంది! ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునివ్వడంతో సహజంగానే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2018 నాటి 80 శాతం సగానికి పడిపోయి, 40 చిల్లర వద్ద తచ్చాడింది. ఫలితాలూ ఊహించినట్టే వచ్చాయి. మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా, పాలక పక్షానికి 223 వచ్చాయి. విచి త్రమేమంటే, ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచింది స్వతంత్రులే. ఇలా ఇండిపెండెంట్లుగా గెలిచిన 62 మందిలో కూడా అత్యధికులు పాలక అవామీ లీగ్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ, పార్టీ అధికా రిక అభ్యర్థిపై పోటీ చేసి గెలవమన్న వాళ్ళే! అలా గెలిచినవాళ్ళే! ఇప్పుడు బంగ్లాదేశ్ పార్లమెంట్లో రెండో అతి పెద్ద వర్గం ఈ ఇండిపెండెంట్లదే! ‘జాతీయ పార్టీ’ 11 సీట్లు, మరో మూడు విపక్ష పార్టీలు 3 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నామావశిష్టంగా నిలిచాయి. ఇప్పుడిక ఎవరిని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటిస్తారో చూడాలి. అధికారిక ప్రకటనలెలా ఉన్నా, ఆచరణలో వాస్తవికంగా బంగ్లా ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్షమే లేని పార్లమెంట్ అయింది. షేక్ హసీనా తన తాజా విజయంతో అటు ప్రతిపక్షాలనే కాదు... ఇటు ప్రజాస్వామ్యాన్ని సైతం ఓడించారని విశ్లేషకులంటున్నది అందుకే! ప్రపంచంలో దీర్ఘకాల మహిళా ప్రభుత్వాధినేత అనే కిరీటం హసీనాదే. 2009 నుంచి హసీనా తాలూకు పార్టీదే అధికారం. అప్పటి నుంచి ఇన్నేళ్ళలో మంచీ చెడులు రెంటిలోనూ హసీనా ఉక్కుమహిళే! అటు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్ని దుర్భర దారిద్య్రం నుంచి బయటకు తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన కీర్తి, ఇటు మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో తొక్కేసిన అపకీర్తి... రెండూ ఆమెవే. దేశ ఆర్థిక పురోగతి, సామాజిక అభివృద్ధిలో అవిస్మరణీయ పాత్ర ఈసారి కూడా ఆమెకు విజయం అందించి ఉండవచ్చు. అంతమాత్రాన మిగతా తప్పులన్నీ ఒప్పులై పోవు. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై అంతర్జాతీయ పరిశీలకులు, మానవ హక్కుల సంఘాల వారు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. కీలక సంస్థలు, వ్యవస్థల పైన, అసమ్మతి వినిపించకుండా చివరకు మీడియా పైన కూడా హసీనా సర్కార్ నియంత్రణపై విమర్శలూ వచ్చాయి. 17 కోట్లకు పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్ తరుణ ప్రజాస్వామ్యానికి ఇది వన్నె తీసుకురాదు. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు. హసీనా మరోసారి ఎన్నికవడం భారత్‌కు మాత్రం ఒక రకంగా శుభవార్తే! ఎందుకంటే, హసీనా హయాంలో భారత – బంగ్లాదేశ్ బంధాలు బలపడ్డాయి. వాణిజ్యం పెరిగింది. మెరుగైన రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతానికి తీవ్ర వాదం పెనుముప్పుగా పరిణమించిందని ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మునుపటి షేక్ హసీనా హయాం మరో పర్యాయం కొనసాగడం ఢిల్లీ దృష్టి నుంచి చూస్తే మంచిదే! బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరత, విదేశాంగ విధానాల కొనసాగింపు మనకు లాభించే విషయాలు. పైగా, అంతర్యుద్ధంలో కూరుకుపోయిన ఉమ్మడి పొరుగుదేశమైన మయన్మార్ నుంచి శరణార్థుల సమస్య పెరుగుతూ, తీవ్రవాదులకు ఆయుధాలు సులభంగా అందివచ్చే పరిస్థితులున్న సమయంలో బంగ్లా దేశ్‌లో స్నేహశీల సర్కార్ ఉండడం భారత్‌కు ఒకింత సాంత్వన. నిజానికి, రాగల కొద్దినెలలు దక్షిణాసియా ప్రాంతానికి కీలకం. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో ఈ ఏడాదే ఎన్నికలున్నాయి. ఈ ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరగనుంటే, ఆ తరువాత కొద్దినెలలకే శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నిక. ఇక, ఏప్రిల్ – మే నెలల్లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు సరేసరి. వివిధ దేశాల ఎన్నికల ఫలితాలు, కొలువు దీరే కొత్త ప్రభుత్వాలు, వాటి వైఖరిలో మార్పులను బట్టి భారత ఉపఖండంలో అనేక మార్పులు రావడం సహజం. ఇప్పటికే నిరుడు సెప్టెంబర్‌లో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత వ్యతిరేక వైఖరిని అస్త్రంగా చేసుకొని, మహమ్మద్ మొయిజు గద్దెనెక్కారు. భారత్‌కు దీర్ఘకాలిక మిత్రదేశమైన మాల్దీవులు అప్పటి నుంచి ఢిల్లీ కన్నా బీజింగ్ వైపు మొగ్గుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజా లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ ఘటనలోనూ అదే కనపడింది. వీటన్నిటి దృష్టితో చూసినప్పుడూ బంగ్లాదేశ్‌లో మరోసారి భారత అనుకూల హసీనా సర్కార్ ఏర్పాటవడం భారత్‌కు ప్రయోజనకరమే! ఇటు భారత్‌తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, అటు చైనా సైనిక ఆలంబన – రెండూ కొనసాగిస్తూ హసీనా చేస్తున్న సమతూకం అందరికీ చేతకావు. అలాంటి ఆమె విజయాలు ప్రశంసా ర్హమే అయినా, సాగిస్తున్న రాజకీయ అణచివేతను విస్మరించలేం. ఆన్లైన్లో విమర్శించినా అరదండాలే అన్న డిజిటల్ భద్రతా చట్టం లాంటివి పౌరస్వేచ్ఛకు ప్రతిబంధకాలు. ప్రజాస్వామ్య వాతావర ణమే లేకుంటే, చివరకు అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య షరతులు విధిస్తాయి. అదే అదనుగా బంగ్లాదేశ్ పక్షాన చైనా బరిలోకి దిగుతుంది. అది భారత్‌కూ అభిలషణీయం కాదు. అందుకే, ప్రతిపక్షాలను ఊపిరి పీల్చుకొనిచ్చేలా, వ్యవస్థల స్వతంత్రతను కాపాడేలా హసీనా సర్కార్‌కు భారత్ నచ్చజెప్పాలి. బంగ్లాకూ, భారత్‌కూ దీర్ఘకాలంలో అదే శ్రేయస్కరం. -
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్‌కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్‌ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్‌నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
హసీనాకు అగ్నిపరీక్ష!
మెరిసేదంతా మేలిమి అని ప్రజానీకాన్ని నమ్మిస్తే ఓట్ల వర్షం కురవొచ్చు. ఒకటికి రెండుసార్లు ఆ చిట్కా పనిచేసి అధికారం వచ్చినా రావొచ్చు. కానీ ఎల్లకాలం అదే మంత్రం ఫలించదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాలుగో దఫా నెగ్గేందుకు పడుతున్న అవస్థలను గమనిస్తే అర్థమవుతుంది. ఆదివారం బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జరగబోతు న్నాయి. ఆ ఎన్నికలు సవ్యంగా సాగుతాయనీ, ప్రజలంతా తన పక్షమేననీ హసీనా ఇప్పటికీ నమ్మ బలుకుతున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం బతికేవుందని చాటాలంటూ పౌరులకు ఆమె విన్నపాలు చేస్తున్నారు. అటు విపక్షం హసీనా నయవంచనను బట్టబయలు చేయాలని ప్రజలను కోరింది. ఈ ఎన్నికలను బహిష్కరించి, శని ఆదివారాల్లో దేశవ్యాప్త హర్తాళ్ పాటించాలని పిలుపునిచ్చింది. బంగ్లాలో అటు ఎన్నికల తంతు, ఇటు బహిష్కరణ పిలుపు రెండూ సాధారణ ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. 2014 ఎన్నికలను విపక్ష బంగ్లా నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) బహిష్కరించింది. తదనంతర ఎన్నికల్లో పోటీలో దిగి, చివరి నిమిషంలో ఆ పార్టీ ముఖం చాటేసింది. 2014లో 39 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 2019 నాటికి అది ఒక్కసారిగా 80 శాతానికి ఎగబాకింది. గత ఎన్నికల్లో అవామీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 300 స్థానాల్లో ఏకంగా 96 శాతం స్థానాలు... అంటే 288 రాగా, బీఎన్పీ కూటమికి ఏడంటే ఏడే వచ్చాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార పక్షంపైరిగ్గింగ్ ఆరోపణలు రివాజు. అయితే గత ఎన్నికలకూ, ఇప్పటికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పట్లో హసీనా గెలుపుపై ఎవరికీ సంశయాలు లేవు. మెజారిటీ విషయంలోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఈసారి అలాకాదు. ఏం చేసైనా నెగ్గి తీరాలన్న సంకల్పంతో అన్ని రకాల మాయోపాయాలకూ సిద్ధపడుతున్నారని విపక్షంతోపాటు పౌరసమాజ వర్గాలు ఆరోపిస్తున్నాయి. యాభై రెండేళ్ల క్రితం హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో పాకిస్తాన్ పాలకులపై పోరాడి బంగ్లా విముక్తి సాధించింది. ఆ వెంటనే ముజిబుర్ రెహమాన్‌ను కూలదోసి సైన్యం అధికా రాన్ని ఆక్రమించింది. ఆయన్ను దారుణంగా కాల్చిచంపింది. వెంటవెంటనే జరిగిన మార్పుల్లో జన రల్ జియావుర్ రెహమాన్ అధికారం చేజిక్కించుకుని అనంతర కాలంలో దేశాధ్యక్షుడయ్యారు. బీఎన్పీ ఆయన నేతృత్వంలోని పార్టీయే. మరో సైనిక పాలకుడు హెచ్ఎం ఎర్షాద్ సైతం జాతీయ పార్టీని ఏర్పాటుచేశారు. మొత్తానికి మూడు సైనిక తిరుగుబాట్లు, దాదాపు 20 వరకూ విఫల తిరుగు బాట్లతో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సైనిక పాలకులు ఎన్నికలు లేకుండా చేసి, పౌరుల ఓటుహక్కుకు ఎగనామం పెడితే... ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు దొంగ ఓట్లతో, హింసతో దాన్ని మరింత నీరుగార్చాయి. తనకు మెజారిటీ ప్రజల మద్దతున్నదని చెప్పే హసీనా తొలి, మలి దఫాలకు మించి మూడోసారి పూర్తి స్థాయి నియంతగా మారారని, అసమ్మతి స్వరాలను అణిచేశారని ఆమె వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో ఇరుక్కుని 22,000 మంది విపక్ష నేతలు, కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. అధిక ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని ఉద్యమించినవారిని హసీనా సర్కారు శత్రువులుగా చూస్తోంది. హసీనా తొలిసారి అధికారంలోకొచ్చిన రోజులతో పోలిస్తే ఇప్పుడు కరెంటు కోతలు లేవు. దేశం పచ్చగా కనబడుతోంది. అడిగిందే తడవుగా విదేశీ మదుపుదారులు ఉదారంగా అప్పులిచ్చారు. ఆర్థిక రంగం పుంజుకోవటంతో నగరాలు మెరిసిపోతున్నాయి. ఆకాశాన్నంటే భవంతులు, ఎక్స్‌ప్రెస్ వేలు, వంతెనలు, భారీ దుకాణ సముదాయాలు, దిగుమతి చేసుకున్న వినియోగ వస్తువులు విస్మయ పరుస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇదంతా తిరబడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. అందాల పరదాల మాటున పాతరేసినవన్నీ పైపైకి తోసుకొచ్చి నిలదీస్తున్నాయి. బ్యాంకులు వేల కోట్లలో ఇచ్చిన అప్పులన్నీ పారు బాకీలుగా మారి బావురుమన్నాయి. ఖజానాలో కరెన్సీ మాయమై, ద్రవ్యో ల్బణం ఆకాశాన్నంటి దేశ ఆర్థిక వ్యవస్థ బిత్తరచూపులు చూసింది. విదేశీ పెట్టుబడులతో మొదలు పెట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం సరైన పర్యవేక్షణ కొరవడి నత్తనడకన సాగింది. వ్యయం అనేక రెట్లు పెరిగింది. పల్లెటూళ్లు తెల్లముఖం వేశాయి. ఉపాధి కరువై గ్రామీణులు నగరా లకు, పట్టణాలకు వలసలు కట్టారు. కరెంట్ అకౌంట్ సంక్షోభం పీల్చి పిప్పి చేస్తుండగా ఒకనాడు పైపై మెరుగులు చూసి ఎగబడి పొగిడిన అంతర్జాతీయ మీడియా వరస కుంభకోణాల వైనాన్ని వెల్లడిస్తున్నకొద్దీ దేశంలో అశాంతి ప్రబలింది. ఉద్యమాలు వెల్లువెత్తాయి. వాటి అణచివేత తప్ప హసీనా దగ్గర మరే ప్రత్యామ్నాయం లేకపోవటం విషాదాల్లోకెల్లా విషాదం. దేశాన్ని దక్షిణాసియాలోనే ‘ఎకనామిక్ టైగర్’గా రూపొందించానని ఒకనాడు సగర్వంగా చాటు కున్న హసీనా సంక్షోభంపై సరైన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన లపై ఇంటా బయటా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనల బాధ్యులకు తమ దేశంలో ప్రవేశం ఉండబోదని అమెరికా ప్రకటించింది. వైఫల్యాలకు పాలక విపక్షాలు రెండూ బాధ్యత వహించాలని ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇతర నేతలతో పోలిస్తే హసీనాయే ఉన్నంతలో మెరుగని మెజారిటీ పౌరులు విశ్వసిస్తుండటం విశేషం. ఏకపక్షంగా సాగే తాజా ఎన్నికల తంతులో విజయం మాటెలావున్నా హసీనాకు మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పవు. ఆమె విఫల నేతగా మిగులుతారా, తప్పులు దిద్దుకుని దేశాన్ని గట్టెక్కిస్తారా అన్నది చూడాల్సివుంది. -
సరికొత్త అధ్యాయం?!
మరో అడుగు ముందుకు పడింది. ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో ఒక అభిలషణీయ పరిణామం గత వారం సంభవించింది. అస్సామ్‌లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం. ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్‌లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం. ‘సార్వభౌమాధికార’ అస్సామ్ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్‌లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది. ‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్ లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్‌లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక– పాకిస్తాన్లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్‌తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం... ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి. వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్‌ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు. స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్‌ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు. అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది. ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్‌లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్ఎస్పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి. తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట. ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం! -
ఇదేమి ప్రజాస్వామ్యస్ఫూర్తి?!
ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో చరిత్రలో మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగుతోంది. ఈ నెల 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలనీ, చర్చ జరగాలనీ ప్రతిపక్షాలు పట్టు బట్టడం రచ్చగా మారింది. సభా వ్యవహారాలకు అడ్డుతగులుతున్నా రనీ, అభ్యంతరకరంగా ప్రవర్తి స్తున్నారనీ అంటూ ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం నిర్ఘాంత పరుస్తోంది. అధికార పార్టీ ఎంపీ సిఫార్సు పాసులతో సందర్శకులుగా వచ్చిన ఆగంతకుల రంగు పొగల హంగామాపై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం చూస్తుంటే, గత సంప్రదాయాలకు విరుద్ధంగా సభలో కాక బయట వివిధ పత్రికలు, టీవీ ఛానళ్ళలో ప్రధాని, హోమ్ మంత్రి జరిగిన సంఘటనపై స్పందిస్తూ ప్రతిపక్షాల డిమాండ్‌ను పెడచెవిన పెట్టడం చర్చనీయాంశమైంది. గత వారం 14 మంది, ఈ సోమవారం 78 మంది, తాజాగా మంగళవారం మరో 49 మంది... మొత్తం ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. పార్లమెంట్లో సభా వ్యవహారాలకు అడ్డుపడిన సభ్యుల సస్పెన్షన్ కొత్తేమీ కాదు. ఇలా ఇంత సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగడం మాత్రం ఇదే తొలిసారి. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్నడో 1989 మార్చిలో థక్కర్ ప్యానెల్ నివేదికపై రచ్చతో ఒకే రోజున లోక్‌సభలో 63 మంది సభ్యులను సస్పెండ్ చేసినట్టు చరిత్ర. ఇప్పుడు ఆ పాత రికార్డును చెరిపేస్తూ, దురదృష్టకరమైన కొత్త చరిత్ర లిఖితమైంది. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తికి సభ్యులను సస్పెండ్ చేసే అధికారమున్న మాట నిజమే. కానీ, ఆ స్థానంలో కూర్చొనే వ్యక్తి ప్రథమ కర్తవ్యం – అధికార, ప్రతిపక్షాల మధ్య సమతూకం పాటిస్తూ సభను సజావుగా నడపడమే తప్ప, సభ్యులపై పెత్తనం చూపడం కానే కాదు. ఆ సంగతి మర్చి పోయి సభలో వారందరికీ పెద్దన్నయ్యలా ప్రవర్తిస్తామంటేనే కష్టం. ప్రస్తుతం జరుగుతున్నదదే! నిరుద్యోగం సహా వివిధ సమస్యలపై దృష్టి పడేటందుకే పార్లమెంట్లో గతవారం అలా అలజడి రేపామని పట్టుబడ్డ ఆగంతకుల కథనం. ఆ ఆందోళనకారుల ఆలోచనలు ఏమైనప్పటికీ, వారు పొగ గొట్టాలతో పార్లమెంటులోకొచ్చే వీలు కల్పించి, సభ్యుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన భద్రతా లోపంపై తక్షణం చర్చ జరగాల్సి ఉంది. అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. విపక్షాల వాదనా అదే. ఆ వాదనలో న్యాయం ఉంది. ఘటనపై సభలో రక్షణ మంత్రి లాంటి వారు కాక శాంతి భద్ర తలు చూసే హోమ్ మంత్రి, సభానాయకుడు ప్రకటన చేయడం, సభ్యుల అనుమానాలను నివృత్తి చేయడం విధాయకం కూడా! కానీ అలా జరగట్లేదు. అక్కడే పీటముడి బిగిసింది. అనైతికత అంటూ ప్రతిపక్ష ఎంపీ మహువా మొయిత్రాపై చర్యలకు వేగిరపడ్డ పాలకులు, ఆగంతకులకు పాసులిచ్చిన స్వపక్షీయుడిపై చర్యకు ముందుకు రాకపోవడం ద్వంద్వ ప్రమాణాలంటూ విమర్శలకు తావిచ్చింది. అయితే, సభను సజావుగా సాగనివ్వకుండా ప్రతిపక్షాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని అధికార పక్ష ఆరోపణ. అది పూర్తి సత్యదూరమనలేం. కానీ, దాన్ని సాకుగా చూపుతూ సభలో సాధారణ ప్రకటన చేయడానికి కూడా అమాత్యులకూ, ప్రభుత్వానికీ అభ్యంతరం ఉంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. సభావ్యవహారాలను అడ్డుకోవడం సైతం సభ్యుల హక్కులలో భాగమేనని బీజేపీ ఎంపీ స్వర్గీయ అరుణ్ జైట్లీయే ఒకప్పుడు వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ, అధికార పీఠంపై కూర్చున్నాక బీజేపీ ఆ పాత వైఖరిని నమ్ముతున్నట్టు లేదు. చర్చలు, భిన్నాభిప్రాయాల కలబోతతో సాగాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాలకుల ఏకపాత్రాభినయంగా మార్చాలని చూస్తున్నట్టుంది. ఎన్నికల సంఖ్యాబలపు నియంతృత్వంతో అధికారాన్ని హక్కుభుక్తంగా భావిస్తే అది గర్హనీయం. ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే హక్కును కాదంటే, వాటి మాట వినాల్సిన పనే లేదనుకుంటే ఇక సభా సమావేశాలకు అర్థం ఏముంది! నేటి ప్రధాని గతంలో గుజరాత్‌ను ఏలినప్పుడూ, నిరసన తెలిపే ప్రతిపక్షాలపై నిర్దాక్షిణ్య సస్పె న్షన్ల పర్వం ఇలాగే సాగిందని పండితులు లెక్కలు తీస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించే ఈ ధోరణి ఇప్పుడు పార్లమెంటుకు పాకడం విచారకరం. 2009–14 మధ్య దాదాపు 36 సస్పెన్షన్లు జరిగితే, ఎన్డీఏ ఏలుబడి వచ్చాక 2014–19లో అది 81కి ఎగబాకింది. ఇక, కేంద్రంలో వర్తమాన ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్లు 149కి చేరాయి. ఇక, తాజా సస్పెన్షన్ల వల్ల ప్రస్తుత శీతకాల సమా వేశాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో మూడింట రెండొంతుల పైగా సభ్యులు సభ వెలుపలికే పరిమితమైన పరిస్థితి. కొన్నేళ్ళుగా అనేక కీలక బిల్లులు చర్చే లేకుండా, అవసరమైన సవరణల్ని పట్టించుకోకుండా సంఖ్యాబలంతో చట్టాలవుతున్న తీరు పార్లమెంటరీ విధానాన్నే ప్రశ్నిస్తున్నాయి. ఇక, ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ వెలుపల మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఓ ప్రతిపక్ష ఎంపీ ప్రవర్తించిన తీరు బాగా లేదు. రాజ్యసభ ఛైర్మన్‌ను అనుకరిస్తూ ఆ సభ్యుడు చేసిన ప్రహసనం సమర్థనీయం కాదు. ఇది ‘డెమోక్రసీ’ కాదు, ‘నమోక్రసీ’ అంటున్న ప్రతిపక్షాల పోరుకు శోభనిచ్చేదీ కాదు. వ్యక్తిగత ప్రవర్తనలో లోపాలు, పక్షపాత ధోరణులు ఎన్ని ఉన్నా... రాజ్యాంగ రీత్యా రాజ్యసభ ఛైర్మనైన భారత ఉపరాష్ట్రపతి హోదాకంటూ ఓ గౌరవం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఆ గౌరవం ఇవ్వాల్సి ఉంది. అది మరిచి అగౌరవంగా ప్రవర్తిస్తే ప్రతిపక్షాలకే నష్టం. పోరాటాన్ని అది పలుచన చేస్తుంది. అసలు సంగతి పక్కదోవ పడుతుంది. ఏమైనా, చర్చలంటే టీవీలో ప్రసంగాల స్థాయికి దించేస్తూ, ప్రజాసమస్యల్ని గాలికొదిలేసే సభలతో ప్రయోజనం శూన్యం. ప్రతిపక్షాలే లేని పాలన కావాలనుకుంటే దానికి ప్రజాస్వామ్యమని పేరెందుకు? -
చీకటి వెలుగులు
విశాల విశ్వంలో సృష్టి సమస్తం ద్వంద్వాలమయం. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. లోకంలో వెలుగు చీకట్లుంటాయి. నిప్పూ నీరూ ఉంటాయి. తీపి చేదులుంటాయి. రేయింబగళ్లు ఉంటాయి. ఎండా వానా ఉంటాయి. శీతోష్ణాలుంటాయి. శిశిర వసంతాలుంటాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ నిరాశలు ఉంటాయి. శాంతి అశాంతులు ఉంటాయి. గెలుపు ఓటములు ఉంటాయి. ఉత్థాన పతనాలు ఉంటాయి. మన వేదాంతం ఎంతగా అద్వైత సిద్ధాంత బోధ చేస్తున్నా, మానవమాత్రులైన వారెవరూ ద్వంద్వాతీతులు కారు, కాలేరు. మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవిలోనూ ఆడా మగా ఉంటాయి. ప్రతి జీవికీ చావుపుట్టుకలు ఉంటాయి. ప్రతి జీవితానికీ ఆద్యంతాలుంటాయి. ద్వంద్వబంధురమైన సృష్టి ప్రకృతి సహజం. సృష్టిలో ఇన్ని ద్వంద్వాలే లేకుంటే, ప్రకృతికి ఇంతటి సౌందర్యమెక్కడిది? జీవితానికి ఇంతటి వైవిధ్యమెక్కడిది? అద్వైతం అందమైన భావన. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ‘బ్రహ్మ సత్యం... జగన్మిథ్య’ అనే అద్వైత బోధను ఆలకించేటప్పుడు తన్మయత్వంతో కాసేపు ఓలలాడవచ్చేమో గాని, అది క్షణికమే! ఆ తర్వాత మిథ్యా మైకం నుంచి బయటపడ్డాక మనమింకా ద్వంద్వాల వలయంలోనే ఉన్నామన్న సంగతి ఎరుకపడటానికి ఎంతోసేపు పట్టదు. ‘మనకు రెండు కళ్లు, రెండు కాళ్లున్నట్లే ద్వంద్వాలన్నీ మన జీవితంలో భాగమే!’ అన్నాడు కార్లోస్ సాంటానా. అలాగని అతడేమీ తత్త్వవేత్త కాదు, వేదాంతి కాదు, కనీసం ప్రవచనకర్తయినా కాదు గాని, వారెవరికీ లేని ఎరుక అతడికి ఉంది. కార్లోస్ సాంటానా అమెరికన్ గిటారిస్ట్. అయినా, సృష్టిలోని ద్వంద్వాలను అర్థం చేసుకోవడానికి తత్త్వవేత్తలో, వేదాంతులో, ప్రవచనకర్తలో కానక్కర్లేదు... ఇసుమంత ఇంగితమున్న మనుషులైతే చాలు! ద్వంద్వాలు మన వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ద్వంద్వాల నడుమ నిత్యసంఘర్షణే ప్రకృతి ధర్మం. ‘మానవ జీవితమే మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం’ అన్న ఆరుద్ర మాటలు ఇందుకు చిన్న ఉదాహరణ. మన జీవితాలను నిర్దేశించేవి జ్ఞానా జ్ఞానాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, రాగద్వేషాలు, నీతి అవినీతి వంటి ద్వంద్వాలే! విశ్వానికి మూలం తొలుత ఏకపదార్థమేనని, కాలక్రమంలో అది ద్వంద్వాలుగా విడిపోయిందని పాశ్చాత్య తత్త్వవేత్తల్లో కొందరి భావన. సృష్ట్యాదిలో ప్రపంచమంతా జలమయమై ఉండేదని మన పురాణాల కథనం. గ్రీకు తత్త్వవేత్త థేలీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. థేలీస్ అభిప్రాయాన్ని అతడి శిష్యుడు అనగ్జిమాండర్ ఖండించాడు. ‘ఏదో ఒక అనిశ్చిత, అనిర్దిష్ట, అజ్ఞాత పదార్థం సమస్త స్థలాన్నీ ఆవరించి ఉండేది. అది అనంతం, అనశ్వరం’ అని అనగ్జిమాండర్ అన్నాడు. సృష్టికి మూలమైన పదార్థం ద్వంద్వాతీతమైనదో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు గాని, మన చుట్టూ ఉన్న ద్వంద్వాలు, మన లోపలున్న ద్వంద్వాలు అందరికీ అనుభవపూర్వకమే! జీవితంలో అడుగడుగునా తారసపడే ద్వంద్వాలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఎంతటి వారైనా జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను అతిక్రమించలేరు. వాటి ఉనికిని గుర్తించకుండా ఉండలేదు. వాటికి అతీతంగా బతకలేరు. కాబట్టి మనం ద్వంద్వాలను నిర్ద్వంద్వంగా అంగీకరించక తప్పదు. లోకంలో కొందరు మనుషులు మంచివాళ్లుగా, మహానుభావులుగా చలామణీ అవుతారు. కొందరు దుర్మార్గులుగా, చెడ్డవాళ్లుగా పేరుమోస్తారు. నిజానికి ఎవరూ పూర్తిగా మంచివాళ్లుగా గాని, పూర్తిగా చెడ్డవాళ్లుగా గాని ఉండరు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి స్పందించే తీరుతెన్నులే మనుషుల మంచిచెడులను బయటపెడతాయి. అందుకే ‘మనుషులందరూ మంచి చెడుల సమ్మేళనాలే’ అన్నాడు స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్. ‘కృతా కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా/ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరో వ్రతీ’ అని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. కృతాకృత కర్మకలాపాలు, సుఖదుఃఖాది ద్వంద్వాలు శాంతించినప్పుడు భక్తుడు సంశయరహితుడై జ్ఞాని అవుతాడని, అప్పుడు వైరాగ్య వ్రతం చేయకున్నా త్యాగపరాయణుడవుతాడని ఈ శ్లోకానికి అర్థం. జనకుడికి అష్టావక్రుడు చేసిన ఈ వేదాంత బోధ ‘అష్టావక్రగీత’గా ప్రసిద్ధి పొందింది. అష్టావక్రుడు తన గీతబోధలో ద్వంద్వాల ఉనికిని నిరాకరించలేదు. కాకుంటే, అవి శాంతించాలన్నాడు. ద్వంద్వాల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే అవి శాంతిస్తాయి. సుఖదుఃఖాలు, రాగద్వేషాల వంటి సహజాతి సహజమైన ద్వంద్వాలకు కొంత మోతాదుకు మించి స్పందించడం మానవ స్వభావం. ద్వంద్వాల ప్రభావాన్ని సమానంగా స్వీకరించి, ఆత్మావలోకనం చేసుకోగల సామర్థ్యమే స్థితప్రజ్ఞ! కాకపోతే, మనుషుల్లో స్థితప్రజ్ఞులు అరుదు. ముఖ్యంగా ప్రజల మధ్య గడిపే రాజకీయ నేతల్లో, సినీతారల్లో మరీ అరుదు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణాలు. ప్రజామోదం పొందిన వారు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారు. ప్రజాదరణ కొరవడిన వారు పరాజితులవుతారు. గెలుపొందిన వారు ‘అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమనుకొని ’ విర్రవీగితే మాత్రం తర్వాతి ఎన్నికల్లో పర్యవసానాన్ని చవిచూడక తప్పదు. పరాజితులు ఇంతే తమ కర్మమ నుకుని కుంగిపోయినా, తమను ఆదరించని ప్రజలను నిందించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఘనవిజయాలు సాధించినప్పుడు బాధ్యతలను గుర్తెరిగి అప్రమత్తంగా ప్రవర్తించాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను సవరించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఎన్నికల క్రతువులో ఘనవిజయాలూ శాశ్వతం కావు, అపజయాలూ శాశ్వతం కావు. శాశ్వతం కానివని తెలిసి తెలిసి ఫలితాలను తలకెక్కించుకుంటేనే ప్రమాదం. -
వోటథాన్ యాప్ ప్రారంభించిన లెట్స్‌వోట్ - వచ్చే వారంలో వాకథాన్ కూడా..
Digital Democracy Votathon App: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లాభాపేక్షలేని పౌర సమాజ సంస్థ లెట్స్‌వోట్ 'డిజిటల్ డెమోక్రసీ వోటథాన్' యాప్‌ను విడుదల చేసింది. ఈ నెల 25న (నవంబర్ 25) గచ్చిబౌలి స్టేడియంలో 'స్టోరీబాక్స్'ను ఆవిష్కరించడమే కాకుండా ఓటు హక్కు, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు 'వాకథాన్'ను నిర్వహించనున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజిటల్ డెమోక్రసీ వోటథాన్ యాప్ ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి.. ఓటు ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి వోటథాన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పౌరులు 'లైఫ్ సైకుల్' (Lifecykul) యాప్ డౌన్లోడ్ చేసుకుని పాల్గొనటానికి వోటథాన్ విభాగానికి వెళ్లాలి. ఆ తరువాత ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం ప్రారంభించవచ్చు. ప్రతి సెషన్ ముగిసే సమయానికి వినియోగదారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో ఖచ్చితంగా తెలుసుకుంటారు. స్టోరీబాక్స్ స్టోరీబాక్స్ అనేది కంటెంట్ అందించే ఒక వినూత్న ఆలోచన. యువ పాఠశాల విద్యార్థులను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి ఓటు హక్కు గురించిబ తెలుసుకుంటారు. అదే సమయంలో పెద్దలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రేరేపిస్తారు. లెట్స్‌వోట్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కంటెంట్‌ను ప్రారంభించింది. వివిధ పాఠశాలల యాజమాన్యాలతో కలిసి పనిచేయడం కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం 25 పాఠశాలల్లో ప్రారంభమైన ఈ స్టోరీబాక్స్ కంటెంట్ 40 పాఠశాలలకు చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. స్టోరీబాక్స్ మీద ఆసక్తి ఉన్న యాజమాన్యం స్టోరీబాక్స్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి లెట్స్‌వోట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. వాకథాన్ వచ్చే శనివారం (నవంబర్ 25) రోజు ఓటుపై అవగాహన పెంచేందుకు లెట్స్‌వోట్ ద్వారా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ భాగస్వామ్యంతో వాకథాన్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 6:30 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ వాకథాన్‌లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లు, సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రముఖులు సుమారు 4000 కంటే ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందని ఓటు వేద్దాం జాతీయ కన్వీనర్ డాక్టర్ కె సుబ్బరంగయ్య అన్నారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఓటరు అవగాహన కోసం నిరవహించే ఈ వాకథాన్‌లో వేసే ప్రతి అడుగు ఒక బలమైన ప్రజాస్వామ్యం నిర్మించడంలో ఉపయోగపడుతుంది. కొత్త ఓటర్లు.. అనుభవజ్ఞులైన వారితో చేతులు కలపడం ఇక్కడ జరుగుతుంది. కేవలం మన ఓటు వేయడమే కాకుండా.. భవిష్యత్తును రూపొందించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా అవుతుందని లెట్స్‌వోట్ పబ్లిసిటీ కన్వీనర్ షీలా పనికర్ తెలిపారు. -
సాధికారతే ప్రజాస్వామ్యం!
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్ రామస్వామి నాయకర్ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది. భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం. ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధికారంలో వున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్‌లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్ జగన్ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు. వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పింది. మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్‌లో పడిపోయింది. ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు. 1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు. అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు. సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్ మోహన్‌రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది. మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు. ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్ గోర్కీ రాసిన రష్యన్ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి. పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు. ఈ 53 నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
నేర విచారణ ప్రక్రియ ఇలా...
ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. పేదలు–ధనికులు, చిన్న–పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ పాటించాల్సిందే. చట్టాలు అమలు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, న్యాయవ్యవస్థలు పని చేస్తాయి. బాధ్యత గల పౌరులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య వాటాదారులు కాబట్టి, ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతోంది అనే అవగాహన కూడా వారికి ఉండాలి. ఆ అవగాహన వారికి ఉంటేనే ప్రజాప్రతినిధుల పనితీరును సరిగ్గా అవగతం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతారు. ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తించతగిన నేరం) జరిగితే పోలీసు వారికి ప్రజల నుంచి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. మూడు సంవ త్సరాలు అంతకు ఎక్కువ శిక్షపడే నేరాలను కాగ్నిజబుల్ అఫెన్స్‌లు అంటారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు మేజిస్ట్రేట్ వారెంట్ లేకుండా ఇతర నిబంధనలకు లోబడి నిందితులను అరెస్టు చేయవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్సులపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు దాని ఆధారంగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి సంబంధించిన మేజిస్ట్రేట్‌కు పంపిస్తారు. అది మొట్టమొదటి నివేదిక కాబట్టే దాన్ని ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. మూడేళ్ళ కంటే తక్కువ శిక్షలు పడే నేరాలను నాన్–కాగ్నిజబుల్ అఫెన్సులు అంటారు. వీటిని కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రైవేట్ కంప్లైట్ ఆధారంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళవచ్చు. ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సు జరిగింది అనే విషయాన్ని తెలియజేసే పత్రం మాత్రమే. ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో సహజంగా నిందితుల పేర్లను పొందుపరచడం జరుగుతుంది. అయితే ఎఫ్ఐఆర్ ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. పోలీసుల దర్యాప్తులోనే అందులోని నిజానిజాలు, నిందితుల పాత్రలు నిర్ధారించడం జరుగుతుంది. ఫిర్యాదులో నిందితుల పేర్లు లేవు కదా అని దాన్ని స్వీకరించకపోడా నికీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండటానికీ ఆస్కారం లేదు. ఉదాహరణకు దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు లేవు. పోలీసుల దర్యాప్తు లోనే ఆ పేర్లు, వారి పాత్రలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్రజల సొమ్ము కొల్లగొట్టడం వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అందరి పేర్లు ఎఫ్ఐ ఆర్‌లో చేర్చడం మామూలుగా జరగదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక పత్రాలను పరిశీలించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే బాధ్యులైన నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయి. అరెస్టు అయిన వ్యక్తికీ కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిందితుడికి అందుకు కారణాలు చెప్పాలి. బెయిలబుల్ అఫెన్సు అయితే ఆ విషయం తెలియపరుస్తూ బెయిల్ బాండ్స్ ఇస్తే విడుదల చేస్తామనీ నిందితుడికి వివరించాలి. నింది తుడికి సంబంధించిన వ్యక్తికి అరెస్టు కార్డ్ ఇవ్వాలి. ఎలాంటి సాక్ష్యా ధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లైతే 24 గంటల్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని క్రిమినల్ ప్రోసీజర్ కోడ్‌లోని (సీఆర్పీసీ) సెక్షన్ 167 చెప్తుంది. అయితే ఆ అరెస్టు వేరే ప్రాంతంలో జరిగితే ప్రయాణ సమయాన్ని అదనంగా పరిగణించాలనే నిబంధనా ఉంది. నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితేనే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తారు. కేవలం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వారినే పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా అరెస్టు చేసిన నాటి నుంచి 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరంలో నిందితుడి పాత్రపై కీలక విషయాలను రాబట్టడా నికి పోలీసు కస్టడీ దోహదం చేస్తుంది. జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పుడు నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించే, కోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆధారాలు లేకుంటే జ్యుడీషియల్ రిమాండ్‌ను మేజిస్ట్రేట్ తిరస్కరించవచ్చు. ఇలా తిరస్కరించినప్పుడు నిందితునికి బెయిల్ ఇచ్చి పంపించివేస్తారు. జ్యుడీషియల్ రిమాండ్ దశలో నిందితుడిని నేరం చేశారా, లేదా? అనే అంశాన్ని న్యాయమూర్తి అడగరు. కేవలం పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా? వంటివి మాత్రమే అడుగుతారు. పోలీసులు తనను కొట్టారని నిందితుడు వెల్లడిస్తే వెంటనే ఆస్పత్రికి పంపడానికీ, ఊండ్స్ సర్టిఫికెట్ తీసుకోవ డానికీ తగిన చర్యలు తీసుకుంటారు. పోలీసు కస్టడీలో నిందితుడిని కొట్టారని రుజువైతే సంబంధిత పోలీసులపై అదే కోర్టులో కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తారు. సీఆర్పీసీలోని సెక్షన్ 161 కింద నమోదు చేసే ఈ వాంగ్మూలాల్లో సాక్షుల సంతకాలు తీసుకోకూడదు. ఈ వాంగ్మూలాలను సాక్ష్యాలుగానూ పరిగణించకూడదు. కేవలం వాటిని దర్యాప్తు నిమిత్తం, కోర్టులో సాక్షుల వాంగ్మూలాల కచ్చిత త్వాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింది సాక్షుల వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేయ వచ్చు. ఆ వాంగ్మూలాల కింద సాక్షుల సంతకాలు తీసుకుంటారు. అందువల్ల ఈ వాంగ్మూలానికి విరుద్ధంగా సాక్షి కోర్టులో సాక్ష్యం చెబితే అందుకు అతడు బాధ్యుడు అవుతాడు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కోర్టులో నిందితుల విచారణ నిమిత్తం అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు సీఆర్పీసీలోని సెక్షన్ 190 కింద నేరాన్ని కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంటుంది. అభియోగం చేసిన నేరారోపణలపై ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే కోర్టు పరిగణనలోకి తీసుకోదు. ఈ దశలో సదరు కేసు విచారణ అదే మేజిస్ట్రేట్ పరిధిలో ఉంటే దానికి సీసీ నంబర్ ఇస్తారు. అందులోని సెక్షన్ల ప్రకారం కేసు సెషన్స్ న్యాయమూర్తి ట్రయల్ నిర్వహించాల్సి ఉంటే పీఆర్సీ నంబర్ ఇచ్చి ఫైల్‌ను సంబంధిత కోర్టుకు పంపిస్తారు. చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణన లోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేయడం ద్వారా ఓ తేదీ ఖరారు చేసి నిందితులను న్యాయస్థానానికి పిలుస్తారు. నిందితుడు హాజరైన తర్వాత చార్జ్‌షీట్‌తో పాటు ప్రాసిక్యూషన్ వాళ్ళు కోర్టుకు సమర్పించిన ప్రతి డాక్యుమెంట్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ తర్వాత హియరింగ్ డేట్ ఇచ్చి, ఆపై ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ప్రక్రియ చేపడతారు. ఈ సంద ర్భంలో చార్జ్‌షీట్‌లోని ఆరోపణలను నిందితుల ముందు చదువు తారు. ఈ దశలో ఏ నిందితుడైనా తనపై ప్రాసిక్యూషన్ ఆరోపించిన సెక్షన్లు చెల్లవని భావిస్తే డిస్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత మాత్రమే నిందితులపై చార్జెస్ ఫ్రేమింగ్ జరుగుతుంది. ఈ దశలో న్యాయమూర్తి నిందితులను ఉద్దేశించి నేరం అంగీకరిస్తావా? అని ప్రశ్నిస్తారు. అంగీకరిస్తే (ప్లీడెడ్ గిల్టీ) వెంటనే శిక్ష విధిస్తారు. అంగీకరించకపోతే (డినై) కేసు ట్రయల్ నిర్వహిస్తారు. కేసు ట్రయల్ దశలో న్యాయస్థానం సాక్షులకు సమన్లు జారీ చేస్తుంది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత సీఆర్పీసీలోని సెక్షన్ 313 ప్రకారం నిందితులకు ఓ అవకాశం ఉంటుంది. ఏ నిందితుడిపై ఏ సాక్షి ఏం చెప్పాడనేది వారికి తెలియపరుస్తారు. దానిపై వాళ్లు ఏం చెప్పాలనుకున్నది తెలుసుకుని రికార్డు చేస్తారు. ఈ సందర్భంలోనే నిందితుల తరఫున ఎవరైనా సాక్షులు ఉన్నారా? అనేది న్యాయమూర్తి అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటే లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ విట్నెస్ రూపొందించి, వారికి సమన్లు ఇచ్చి కోర్టుకు పిలుస్తారు. ఆపై వీరి వాంగ్మూలం నమోదు, ప్రాసిక్యూషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతాయి. ఇది పూర్తయిన తర్వాత నిర్ణీత సమయం ఇచ్చి, ఆపై వాదోపవాదాలు మొదలవుతాయి. నిందితుడికి తెలియకుండా న్యాయమూర్తి సాక్ష్యాలు రికార్డు చేయరు. ప్రతి సాక్ష్యమూ అతడి ప్రత్యక్షంలోనే చేస్తారు. సీఆర్పీసీ సెక్షన్ 317 ఆధారంగా దాఖలు చేసే పిటిషన్ ద్వారా నిందితుడు కోరితేనే అతడి న్యాయవాది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏ దశలోనూ పౌరుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో నిందితుడికి ఇన్ని సౌలభ్యాలు కల్పించారు. బాధ్యత గల పౌరులు ఎవ రైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. వాదోప వాదాలు విన్న తర్వాత కోర్టు వారు ఓ తేదీ ఇచ్చి తీర్పు వెలువరిస్తారు. – జస్టిస్ జి. కృష్ణ మోహన్ రెడ్డి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
ఒకేసారి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు
‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తగ్గుతుంది. రెండవది – ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడదు. ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించినవి. ఓటు హక్కును ‘ప్రజాస్వామ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం పరిమితులను విధిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం ఉంది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వల్ల ప్రయోజ నాలు, నిష్ప్రయోజనాలను నేను సరిగ్గా, సరళంగా, సమతులంగా చెప్పగలనేమో చూద్దాం! ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే భావన పైన, ఆ ఆవశ్యకత పైన అవగాహన కోసం ఇది మీకు సహాయకారిగా ఉండవచ్చు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది, ఖర్చు తగ్గుతుంది. కదా మరి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఖర్చు... వివిధ సమయా లలో అనేకసార్లు జరిగే పలు ఎన్నికల మొత్తానికీ అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అయితే థరూర్, చక్రవర్తి అదేమంత చెప్పు కోదగిన పొదుపు కాదని అంటున్నారు. ఏడాదికి రూ. 5,000 కోట్ల లోపే ఉండే ఆ పొదుపు మొత్తం లేకున్నా కూడా భారత్ వంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో అది ఏమంత నిర్ణయాత్మకమైన ఆందోళన కారకం కాదనేది వారి వాదన. రెండవ అనుకూల వాదన ఏమిటంటే, దేశం మొత్తానికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల ఎప్పుడూ ఏదో ఒకచోట అమలులో ఉండే ఎన్నికల ఆంక్షల కారణంగా అభివృద్ధి కుంటుపడటం అనే సమస్య ఉండదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అన్నది దేశవ్యాప్తంగా అమలుకావలసి ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ నియమావళి అమలు పెద్ద విషయంగా ఉండటం లేదు. అసలు అమలవుతోందా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్న. అక్కడ ఆంక్షల్ని అతిక్రమిస్తున్నది అధికార పార్టీకి చెందినవారైతే నియమావళి నిస్సందేహంగా అమలు కానట్లే! ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించే ప్రాథమికమైన స్వభావం కలిగి ఉన్నవి. ఓటు హక్కును ‘‘ప్రజాస్వా మ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ పరిమితులను విధిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వం తన మెజారిటీ కోల్పోయి నప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న హక్కును హరించేలా పార్లమెంటును కొనసాగించే మార్గాల అన్వేషణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే ఈ భావన మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్య ప్రయాణ మార్గాన్ని విఘాత పరచనూవచ్చు. ఆ మార్గాన్ని మనం విస్తృతపరచుకోవడానికి, మరింత లోతుకు తీసుకు వెళ్లడానికి ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అడ్డుపడుతుంది. ఉదా హరణకు, ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను తిరిగి వెనక్కు పంపే హక్కు మనకు ఉండాలి. 50 ఏళ్ల క్రితమే 1974లో వాజ్‌పేయి ఈ ‘రీకాల్’ హక్కు అవసరాన్ని గుర్తించారు. అయితే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ఈ హక్కుకు విరుద్ధమైనది. ఐదేళ్లకోసారి ఎన్నికలు అనే విధానం... ఓటు వేసి, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు పౌరులకున్న అవకాశాన్ని కుదించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇరుకైనదిగా మార్చేస్తుంది. ఇప్పుడిక ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అమలుకు అవసర మైన రాజ్యాంగ సవరణల చిక్కుల దగ్గరికి వద్దాం. మొదటిది–ఎన్నికల ఏకకాలీనత కోసం సవరణలు! ఆ సవరణల వల్ల కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు పొడిగింపును పొందుతాయి. మరికొన్ని చోట్ల శాసనసభల కాలపరిమితిని కుదించాల్సి వస్తుంది. అప్పుడది కచ్చితంగా ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఆడుతున్న ఆట అవదా? ఓటర్లు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని ఏకపక్షంగా తగ్గించడమో, పెంచడమో చేసినట్లే కదా! ఐదేళ్ల కన్నా ముందే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో రకం సవరణలు అవసరం అవుతాయి. మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన రాష్ట్ర స్థాయిలో అవాంఛనీయమైనదీ, కేంద్రస్థాయిలో అసాధ్యమైనదీ. ఇందుకు ఒక పరిష్కారం– జర్మనీ తరహా నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం. ఎలాగంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదక్కడ. పడగొట్టినవాళ్లే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వినడానికి బాగుంది కానీ, ఆచరణలో ఎల్లవేళలా ఇది సాధ్యమా? ఉదాహరణకు, పాలకపక్షం నుంచి చీలిపోయిన పక్షం, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడానికి నిరా కరిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం తన మెజా రిటీని కోల్పోతుంది, కానీ ఆ స్థానంలోకి వచ్చేవారెవరూ లేకపోవడం వల్ల అలాగే కుంటుతూ నడుస్తుంది. లేదా ఒకవేళ సంకీర్ణ కూటమిలోని భేదాభిప్రాయాల వల్ల బడ్జెట్‌కు పార్లమెంటులో ఆమోదం లభించలేదనే అనుకుందాం? అప్పుడిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. కానీ çసభ్యుల బలం ఉన్న కారణంగా బడ్జెట్‌కు ఆమోదం పొందలేని ఆ ప్రభుత్వం ఏమీ కుప్పకూలి పోదు. ఇలాంటి సందర్భాలలో ఐదేళ్ల కాల వ్యవధిలో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అది ఓటు అనే వనరును నిర్లక్ష్యంగా ఉపయో గించుకున్నట్టు అవదా? ఓటు విలువ కొన్నిసార్లు ఐదేళ్ల కాలానికీ, మరి కొన్నిసార్లు ఐదేళ్లలో మిగిలిన భాగానికీ ఉంటుందా? ప్రజాస్వామ్యంలో రెండు రకాల ఓట్లు ఉండొచ్చా? ఇవీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనకు సంబంధించి పైపైన ఆలో చిస్తేనే ఉత్పన్నమయ్యే ప్రాథమిక ఆందోళనలు. భారతదేశ ప్రజాస్వా మ్యానికి సంబంధించి మరొక మూడు ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటిది – పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలనేవి ఆ ధోరణిని తీవ్రతరం చేసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం లేదా? రెండవది – ఒక జాతీయ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు, ఏక కాల ఎన్నికలు బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ ఉన్న దేశంగా మార్చకుండా ఉంటాయా? మూడవది – ఎన్నికలు మన ప్రజా శాసన సభ్యులను ప్రతిస్పందించే వారిగా, జవాబుదారీగా ఉండేవారిగా చేస్తాయని మనకొక నమ్మకం. అయితే ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే మధ్యలో ఏం జరిగినా వారు తమకు పట్టనట్లుగా, అహంకారంగా ఉండిపోయే అవకాశం లేదా? ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మరీ ముఖ్యంగా మూడు అంశాలపై మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది: ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, వాటిని అమలు చేయడంలో వచ్చే చిక్కులు, అనంతరం వచ్చే పర్యవసానాలు. ఆ తర్వాత ‘ఇది సరైనదేనా?’ అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏపీలో ప్రజాస్వామ్యమే గెలిచింది
తాడికొండ: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందని, బహుజనుల ఉసురు తగిలి బాబు జైలు పాలయ్యాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హర్షంవ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 1,078వ రోజుకు చేరాయి. రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పలువురు ముఖ్యఅతిథులు సందర్శించి, మాట్లాడా రు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి అలవాటుపడ్డ చంద్రబాబు ప్రభుత్వ ధనం రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. బాబు అవినీతి పాపం పండి పక్కా ఆధారాలతో దొరకడంతో చట్టబద్ధంగా ప్రభుత్వం అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులను సైతం వెలికి తీసి స్టేలు ఎత్తివేసి పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాబు అండ్‌కో అవినీతి బయటపడకుండా చేసేందుకు ఎల్లో మీడియా చేసిన హడావిడి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, పేదలకు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కోర్టులో అనుమతించి తమకు సహకరించాలని కోరారు. నాయకులు మాదిగని గుర్నాధం, ఈపూరి ఆదాం, పల్లెబాబు, నూతక్కి జోషి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వాలని ప్రవాస భారతీయులకు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే ప్రధాని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లేనని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడటం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ (ఓఎఫ్ఓబీ) ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ మాట్లాడారు. ప్రవాస భారతీయులు ఎన్నికల సమయంలో కచ్చితంగా కనీసం 15 రోజుల సమయమైనా వెచ్చించి దేశానికి రావాలని కోరారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడంతోపాటు పేదలకు పక్కా గృహ సదుపాయం, నిరక్షరాస్యత నిర్మూలన, ఉన్నత విద్యావ్యాప్తితోపాటు తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పెద్ధ ఎత్తున నిర్మించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి అనుగుల (ఓఎఫ్ఓబీ జాతీయ పూర్వ అధ్యక్షులు), ప్రవాస భారతీయులు విలాస్ రెడ్డి, జంబుల సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రదీప్ రెడ్డి కట్ట పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం బలోపేతంలో ఆర్టీఐది కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యం బలోపేతం కావడంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన 28 బోర్డు ఆఫ్ గవర్నర్లు, సమాచార కమిషన్ల నేషనల్ ఫెడరేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపునకు, గోప్యత మినహాయింపునకు దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే శక్తివంతమైన సాధనం ఆర్టీఐ అని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా చేస్తూ అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సులభంగా వినియోగించుకునేలా చేస్తోందన్నారు. ఆర్టీఐ పౌరుల ప్రాథమిక హక్కును గుర్తించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేసిందని వివరించారు. అవినీతిని అరికట్టడంలోను, సుపరిపాలన అందించడానికి, అవినీతి, అధికార దుర్వినియోగాలను బహిర్గతం చేయడానికి ఇది సహకరిస్తోందన్నారు. ఏదైనా తప్పు చేస్తే పరిహారం పొందే అధికారం ఇచ్చిందన్నారు. అలాగే బ్యూరోక్రాట్ల జాప్యాన్ని తగ్గించడం, సత్వర సేవలను మెరుగు పరచడం, ప్రభుత్వ అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అట్టడుగు వర్గాలపై ప్రత్యేక సాధికారత వంటి అంశాల్లో సానుకూల ప్రభావం చూపడానికి ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు. ఇంకా వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక యంత్రాంగాన్ని అందించిందని, ఇది సమాచార అంతరాన్ని తగ్గించడంలో సహాయ పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల కమిషన్లు ఒకే విధమైన అధికారాలు, బాధ్యతలను, ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి ఉంటాయన్నారు. ఈ ఫెడరేషన్ కమిషన్లు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కమిషన్లను సభ్యులుగా చేర్చుకున్నందున కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల మధ్య పరస్పర సంప్రదింపులు సులభతరం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సందేశం పంపించిన సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాచార కమిషన్ల వార్షిక సమావేశానికి తన సందేశాన్ని పంపించారు. ‘ప్రభుత్వం తరఫున మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. దేశం నలుమూలల నుంచీ మీరు విశాఖకు రావడం సంతోషానిస్తోంది. రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టం పాత్ర, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా చదివి వినిపించారు. -
G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు
న్యూఢిల్లీ: 'భారత్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు ఆయా దేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. వారికి ఇవ్వడానికి భారతీయత ఉట్టిపడే విధంగా రెండు పుస్తకాలను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. క్రీస్తుపూర్వం 6000 ఏళ్లనాటి భారత చరిత్ర మొత్తం ప్రతిబింబించేలా వీటిని ముద్రించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే జీ 20 సమావేశాలకు భాగస్వామ్య 20 దేశాలతో పాటు అతిధులుగా మరో తొమ్మిది దేశాలు కూడా హాజరు కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులందరికి చేతికి అందివ్వడానికి రెండు బుక్లెట్లను ముద్రించింది కేంద్రం. వీటిలో ఒకటి 'భారత్-ప్రజాస్వామ్యానికి మాతృక' కాగా రెండవది 'భారతదేశంలో ఎన్నికలు'. ఈ రెండు పుస్తకాల్లోని 40 పేజీల్లో రామాయాణం, మహాభారతంలోని ఇతిహాస ఘట్టాలు, ఛత్రపతి శివాజీ, అక్బర్ వంటి చక్రవర్తుల వీరగాధలతో పాటు సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశంలో అధికార మార్పిడి గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. ప్రజాస్వామ్య తత్వమన్నది భారతదేశ ప్రజల్లో సహస్రాబ్దాలుగా భాగమని చెప్పడము ఈ రెండు బుక్లెట్ల ముఖ్య ఉద్దేశ్యమని తెలుపుతూ ఈ ప్రతుల సాఫ్ట్ కాపీలను జీ20 అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచింది. మొదటి 26 పేజీల డాక్యుమెంటు భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా వర్ణిస్తుంది. దీని ముఖచిత్రంగా 5000 ఏళ్ల నాటి నాట్యం చేస్తున్న మహిళామూర్తి కాంస్య ప్రతిమను ముద్రించారు. సామాన్యులు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సభనుద్దేశించి చతుర్వేదాల్లో ఆది వేదమైన ఋగ్వేదంలోని శ్లోకాన్ని కూడా ముద్రించారు. రామాయణ, మహాభారతాల్లోని ప్రజాస్వామిక అంశాలను ప్రస్తావించారు. రామాయణం నుంచి దశరధ మాహారాజు ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రచురించారు. అదేవిధంగా మహాభారతం నుంచి ధర్మరాజుకు భీష్మణాచార్యలు చెప్పినా సుపరిపాలనా నియామాల గురించి.. ప్రజా శ్రేయస్సు, సంతోషాలను కాపాడటమే రాజు ధర్మమని చెప్పిన అంశాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. బౌద్ధమతం దాని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి చక్రవర్తులకు చాణక్యుడి అర్థశాస్త్రం ఏ విధంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా నిలిచి నడిపియించిందో అందులో పొందుపరిచారు. ఇది కూడా చదవండి: రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్ -
జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి, జనాభా నియంత్రణ గురించి వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నారాయణ మూర్తి స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని వ్యక్తం చేశారు. దేశ జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం లేదని వెల్లడించారు. దేశంలోనో కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో దీన్ని పూర్తిగా విస్మరించినట్లు చెప్పుకొచ్చారు. నిజనమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయని, అవి.. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ మాటలు గుర్తు చేశారు. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, త్రాగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని. జనాభా సమస్య రానున్న 20 నుంచి 25 ఏళ్లలో మన దేశంపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్‌కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్‌లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్‌ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్‌లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్‌కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్‌కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్‌కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
మన ప్రజాస్వామ్యం కాగితపు పులా?
ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలో ఉందని ‘వి–డెమ్’ నివేదిక చెబుతోంది. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. కానీ భారత్ లాంటి దేశంలో ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకు పోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. మానవ హక్కులూ, ప్రజాస్వామ్య భావాలూ, సమానత్వ అంశాలూ మేళవింపుగా ఉన్న ఆధునిక రాజ్యాంగం కలిగిన దేశం కూడా. అయితే ఇటీవల ప్రజాస్వామ్య దేశం తన ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి నియంతృత్వ పోకడలకు దగ్గరవుతున్నట్టు, ‘వి–డెమ్’ తన పరిశోధనలో తేల్చింది. ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలోకి వెళ్ళింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ, ఆదిమ తెగలు, ఇతర వర్గాలకు సంబంధించిన స్వేచ్ఛల్లో మనం ఇతర దేశాలకన్నా వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనగానే ఒక ఐదారు అంశాలు ప్రస్తావనకు వస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛతో పాటు పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్వీడన్ విశ్వవిద్యాలయాల ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తోన్న వి–డెమ్ (విభిన్న ప్రజాస్వామ్యాలు) సర్వే కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలనే పేర్కొంటుంది. అయితే భారత్ సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో ఈ పరిశీలన మాత్రమే సరిపోదు. ఇక్కడ ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. మూల కారణం ప్రస్తుతం మన దేశంలో మోదీ పాలన నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదనే విషయం ఎక్కువగా చర్చకు వస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. రాజ్యాంగ విలువలకు స్థానం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించి అణచివేతను కొనసాగించారు. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వానికీ, మోదీ నియంతృత్వానికీ గుణాత్మకమైన తేడా ఉన్నదన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. ఇందిరాగాంధీ తన పాలనను కాపాడుకోవడానికి తాత్కాలికంగా నిర్బంధాన్ని అమలు జరిపారు. తదనంతరం తన తప్పు తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. మోదీ పాలన ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, ప్రజలను విభజించి, రాజ్యాంగం ప్రకటించిన ‘మేమంతా భారతీయులం’ అనే భావనకు చరమగీతం పాడుతున్నది. రెండువేల సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న కుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటున్నది. అయితే మోదీకి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఆ ధైర్యం కలగడానికి, అంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి పునాది ఇక్కడి కుల వ్యవస్థలో ఉంది. దానితో పాటు రోజురోజుకీ గుత్తాధిపత్యం వైపు వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రమాదాన్ని రాజ్యాంగ ముసాయిదాను సమర్థించిన 1949 నవంబర్ 25 రోజున బాబాసాహెబ్ అంబేడ్కర్ బహిరంగంగా దేశం ముందుంచారు. ‘‘ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ ద్వారా మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా ఆ తేడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో ఆ వ్యత్యాసాలను తొలగించుకోకపోతే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’’ అంటూ ఆనాడు చేసిన హెచ్చరిక ఈరోజు మరింత సత్యంగా కనపడుతున్నది. సోదరభావం కీలకం ఇతర దేశాల ప్రజాస్వామ్య భావనకూ, భారత దేశంలోని ప్రజాస్వామ్య అవగాహనకూ తేడా ఉన్న విషయాన్ని కూడా అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. 1936లో రాసిన కుల నిర్మూలనలోనే ఆయన తన ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. ప్రజాస్వామ్యం అనగానే అది ఎన్నికలు, పాలన, ప్రభుత్వాల విధానాలు అని అనుకోవడం పొరపాటనీ, అది ప్రజల మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తుందనీ కూడా అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి మూడు ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కీలకమని చెపుతూ, ఇందులో అత్యంత ముఖ్యమైనది సోదరత్వం అంటారు. ఇది భారత దేశంలో కొరవడిన అంశమని తేల్చారు. గత డెబ్భై అయిదు సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ అంబేడ్కర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. కులవ్యవస్థను నిర్మూలించే ఎటువంటి ప్రయత్నాన్ని గానీ, ప్రణాళికను గానీ కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో ఏనాడూ చేయలేదు. కేవలం ఆర్థిక తోడ్పాట్ల వంటివి మాత్రమే ఈ దేశంలో దళితులు, ఆదివాసుల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురాలేవనీ, కులవ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించగలిగే పక్కా ప్రణాళిక అవసరమనీ గుర్తించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. అదే ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. భారత దేశంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే బలవంతులు. ప్రజల్లో తరతరాలుగా నాటుకొని పోయిన కుల వ్యత్యాసాలు, కుల అసమానతలు ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. గత పదేళ్ళలో ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజే పీ ప్రభుత్వం మనగలుగుతుందంటే కులాలలోని విభేదాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే. దానితో పాటు, హిందూ మతంలోని పలు అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. గ్రామాల్లో ఏ కులాలైతే ఆధిపత్యంలో ఉన్నాయో వాటిని తమ బలంగా మార్చుకోవడం, అత్యధిక జనాభా కలిగిన కులాలను సమీకరించడం చూస్తే బీజేపీ ఎత్తుగడ ఏమిటో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అదే సమయంలో గత వందల ఏళ్ళుగా ముస్లింలు, హిందువుల మ«ధ్య ఉన్న వైషమ్యాలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా బలంగా వాడుకుంటున్నది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట నిజమే కానీ, దాని బలమేమీ తగ్గలేదు. కులాల పట్ల ప్రజల్లో ఉన్న భావాలను రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో ప్రభుత్వాల విధానాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో స్పష్టంగా కనపడుతున్నది. ఇటీవల దళితుల్లో పెరిగిన చైతన్యం అత్యాచారాల విషయంలో కేసులు నమోదు కావడానికి ఉపయోగపడింది. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య కులాలకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది బీజేపీ. తమ పార్టీ పునాదిగా ఉన్న ఆధిపత్య కులాలను మరింత సంతృప్తి పరిచేందుకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల పేరుతో అసలు రాజ్యాంగాన్నే అపహాస్యం చేసింది. చివరగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన వంటి విధానాలు ఏవి అమలు జరగాలన్నా కుల వ్యవస్థ ప్రధానమైన అవరోధం. దీనికి ప్రభుత్వాల బాధ్యత కన్నా, ప్రజల్లో కుల భావనలను తొలగించడం ముఖ్యం. ప్రజల్లో కుల అసమానతల పట్ల సానుకూలత ఉన్నంత వరకూ, గ్రామాల్లో ఇంకా ఈ కులవ్యవస్థ కొనసాగుతున్నంత వరకూ ప్రజాస్వామ్యమనే భావనకు ఆస్కారమే లేదు. తాత్కాలికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. అంబేడ్కర్ చెప్పినట్టు, ప్రజాస్వామ్యం, అంటే సమానత్వంతో కూడిన సామాజిక జీవన గమనం కోసం... ప్రభుత్వాల నిర్బంధాలు, నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే... ప్రజల్లో ఉన్న కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
భారత ప్రజాస్వామ్యం సచేతనమే కాదు, చలనశీలం కూడా!
‘ఇండియాలో ఉన్నది సచేతన ప్రజాస్వామ్య వ్యవస్థ. న్యూఢిల్లీ వెళ్లే ఎవరైనా ఈ వాస్తవం స్వయంగా చూడవచ్చు,’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ వ్యూహాత్మక కమ్యూనికేషన్ల విభాగం సమన్వయకర్త జాన్ కర్బీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న విషయంపై అగ్రరాజ్యం అధికారి ఒకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతం లేనే లేదు. కాని, దేశంలో రోజురోజుకూ పరిణతి, పరిపక్వత సాధిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై కొందరు ప్రపంచ లేదా పాశ్చాత్య మేధావులు తరచు అభాండాలు వేస్తూ, అనుమానాలు వ్యక్తం చేయడం ఈమధ్య అలవాటుగా మారింది. ఈ పరిస్థితుల్లో పైన చెప్పిన వైట్ హౌస్ అధికారి–భారత ప్రజాస్వామ్యం నాణ్యతపై వెలిబుచ్చిన అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం వైట్ హౌస్ విలేఖరుల సమావేశంలో ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్) ప్రతినిధి అస్మా ఖాలిద్ అడిగిన ప్రశ్నకు జవాబుగా పై మాటలు అన్నారు కర్బీ. ‘ఇండియాలో ప్రజాస్వామ్యం ఆరోగ్యంపై అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఏమాత్రమైనా పట్టించుకుంటోందా? ’ అని అస్మా ప్రశ్నించడంతో అమెరికా ఉన్నతాధికారి నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఇండియాలో ఆర్థికాభివృద్ధి శరవేగంతో సాగుతున్న విషయం తెలిసిందే. ఒక్క ఆర్థికరంగంలోనే గాక అన్ని రంగాల్లో భారతదేశం, వివిధ పారిశ్రామిక, ధనిక దేశాల్లో భారతీయులు విశేష ప్రగతి సాధిస్తున్న విషయం కూడా అందరూ అంగీకరించే సత్యమే. అయితే, భారత్ కొత్త ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించడం గిట్టని అనేక మంది ఇండియాలో ప్రజాస్వామ్యం ‘ఆరోగ్యం’ లేదా నాణ్యతపై అప్పుడప్పుడూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1950 జనవరిలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కొన్నిసార్లు ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న రాజకీయపక్షాలే అధికారంలోకి వస్తే, మరికొన్ని సార్లు ప్రతిపక్షాలు విజయం సాధించి న్యూఢిల్లీలో గద్దెనెక్కాయి. అలాగే, 20కి పైగా ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ అధికారం ఎన్నికల ద్వారానే వివిధ పార్టీల మధ్య బదిలీ అవుతోంది. ప్రజాస్వామ్యమే భారత్ ప్రాణం 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలోనూ ప్రభుత్వాలు సుస్థిరంగా పనిచేస్తూ ముందుకు వెళ్లలేకపోయిన సందర్భాలు కూడా ఉన్న మాట నిజమే. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రానప్పుడు భిన్న రాజకీయపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవగంతో పదే పదే రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలూ చాలా ఉన్నాయి. కాని, ఇదంతా గతం. ఈమధ్య కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అలాగే, పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి అవసరమైన సాధారణ మెజారిటీ రాని పరిస్థితులు చూశాం. 1984 డిసెంబర్ పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకున్నా ప్రభుత్వాలు సాఫీగానే నడిచాయి. పూర్తి పదవీకాలం ఐదేళ్లు ప్రభుత్వాలు నడవకపోయినా ఆర్థికవ్యవస్థను, దేశాన్ని కలవరపరిచే సంక్షోభం ఎప్పుడూ తలెత్తలేదు. 1991 నుంచి 2014 వరకూ కేంద్రంలో మైనారిటీ లేదా సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగినా ప్రజాస్వామ్యం నాణ్యత లేదా ఆరోగ్యం సన్నగిల్ల లేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినది 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లోనే. ఓ పక్క అంకితభావంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తూనే మరో పక్క ఇండియా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. ఈ సానుకూల పరిస్థితుల్లో కూడా భారత ప్రజాస్వామ్యంపై అనుమానాలు రేకెత్తించడం అన్యాయం. అందుకే ఇండియాలో ప్రజాస్వామ్యం సచేతనంగా ఉందని, ఈ వాస్తవం స్వయంగా చూడడానికి న్యూఢిల్లీ వెళ్లి రావాలని అమెరికా అధికారి సలహా ఇవ్వడం శుభసూచికం. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
ఢిల్లీ వెళ్లి చూడండి..భారత్‌లో ప్రజాస్వామ్యం చాలా శక్తిమంతంగా ఉంది:!
భారత్‌లోని ప్రజాస్వామ్యం గురించి అమెరికా అద్భుతంగా ప్రశంసించింది. భారతదేశం ఒక శక్తిమంతమైన ప్రజాస్వామ్యం అని మీరు న్యూఢిల్లీ వెళ్తే అది మీకు కచ్చితంగా కనిపిస్తుందని అమెరికా వైట్‌హౌస్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు. మీరే అక్కడకు వెళ్లి స్వయంగా తెలుసుకోగలరని కూడా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా ఆందోళనకర విషయాలు ఉంటే చెప్పడానికి వెనుకాడం, సిగ్గుపడం. ఆఖరికి స్నేహితులైన.. కలిసి పనిచేయాల్సి వచ్చినా.. కూడా కచ్చింతంగా దీని గురించి చెప్పేస్తామని కిర్బీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ఉద్దేశిస్తూ..ఈ పర్యటన ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, స్నేహం మరింతగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది. ఇది ఇలానే ముదుకు సాగాలని ఆశిస్తున్నానని కిర్బీ అన్నారు. అనేక స్థాయిలలో భారత్ అమెరికాకు బలమైన భాగస్వామి అని కిర్బీ అన్నారు. మీరు షాంగ్రిలా సెక్రటరీలో ఆస్టిన్(అమెరికా రక్షణ మంత్రి) భారత్‌తో కొన్ని అదనపు రక్షణ సహకారానికి సంబంధించిన పలు అంశాలను ప్రకటించడం చూశారు. వాస్తవానికి ఇరు దేశాల మధ్య చాలా భయంకరమైన ఆర్థిక వాణిజ్యం ఉంది. అదీగాక భారతదేశం ఇప్పుడు ఒక పసిఫిక్ క్యాడ్లో సభ్య దేశం. అలాగే ఇండో పసిఫిక్ భద్రతకు సంబంధించిన కీలక స్నేహితుడు, భాగస్వామి అని కిర్బీ పేర్కొన్నారు. అంతేగాదు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగానే కాకుండా, బహుపాక్షికంగా అనేక స్థాయిలలో భారతదేశం కచ్చితం ముఖ్యమైనదని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. తాను సమస్యలన్నింటి గురించి మాట్లాడటానికి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే గాక మరింతగా స్నేహన్ని పెంచుకునే ఉద్దేశంతో ప్రధాని మోదీ రాక కోసం తాను ఎదురు చూస్తున్నట్లు కిర్బీ చెప్పుకొచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. (చదవండి: అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు) -
ప్రజాస్వామ్యంలో నిరంకుశ నేత
నిరంకుశులు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. అతి జాతీయవాదం ప్రబలినప్పుడు ఆలోచనను అది మింగేస్తుంది. ఆ చేదు నిజానికి టర్కీ (తుర్కియే) మరోసారి సాక్షీ భూతమైంది. తొలి దఫాలో ఫలితం తేలకపోయేసరికి రెండో దఫా సాగిన ఎన్నికలు, నాటకీయ ఫక్కీలో రోజుకొకరిది ఆధిక్యంగా మారిన ఎన్నికల ప్రచారం తర్వాత టర్కీ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డొగాన్ తన పట్టు నిలబెట్టుకున్నారు. ఎన్నికలు ‘అత్యంత న్యాయవిరుద్ధంగా సాగా’యన్న ప్రత్యర్థి మాటలు ఎలావున్నా లెక్కల్లో అంతిమ విజయం ఎర్డొగాన్దే అయింది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి ఎగ బాకినా, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయినా ఆయన మాత్రం ప్రపంచ వేదికపై దేశప్రతిష్ఠను పెంచానని పౌరులకు నమ్మబలికారు. కుర్దిష్ వేర్పాటువాదుల్ని తన ప్రత్యర్థి సమర్థిస్తున్నారంటూ నమ్మించారు. అతి జాతీయవాదంతో ఆధిక్యాన్ని నిలుపుకొన్నారు. అదే ఈ ఎన్నికల విడ్డూరం. 2017లో రిఫరెండం ద్వారా టర్కీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలనగా మార్చిందీ, ఆ పైన ప్రధాని పదవిని రద్దు చేసిందీ ఎర్డొగానే. న్యాయవ్యవస్థ, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ సహా ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ నియంత్రణలో పెట్టుకున్న ఘనుడాయన. నైపుణ్యం కన్నా విధేయతే గీటురాయిగా అయినవాళ్ళతో వాటిని నింపేశారు. ప్రధాన స్రవంతి మీడియా అంతా చేతుల్లో ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారం పరాకాష్ఠకు చేరినవేళ 32 గంటల ప్రసార సమయం లభిస్తే, ప్రత్యర్థికి దక్కింది 32 నిమిషాలే. విజయానికై ఎంతకు దిగజారడానికైనా వెనుకాడకపోవడం ఆయన నైజం. దాంతో, దేశంలో ఎన్నడూ లేనన్నిసార్లు హత్యాయత్నం జరిగిన నేతగా పేరొందిన ప్రతిపక్షాల అభ్యర్థి కెమల్ కిలిచదరోగ్లూ చివరకు బహిరంగ సభల్లో బుల్లెట్ ప్రూఫ్ చొక్కా వేసుకొని, ప్రచారం చేయాల్సిన దుఃస్థితి. మాటల్లో సౌమ్యత, మనిషి కొంత మహాత్మా పోలికలతో ‘గాంధీ కెమల్’ అని ముద్దుగా అందరూ పిలుచుకొనే ప్రజాస్వామికవాది ఓడిపోయారు. నిజానికి 600 సభ్యుల పార్లమెంట్‌కూ, అధ్యక్ష స్థానానికీ మే 14న జరిగిన ఎన్నికలు ప్రస్తుత అధ్యక్షుడిని ఇంటికి సాగనంపి, ప్రతిపక్షాల సమష్టి అభ్యర్థి కెమల్కు పట్టం కడతాయని భావించారు. ఎన్నికల జోస్యాలూ ఆ మాటే చెప్పాయి. తీరా జరిగింది వేరు. 6.4 కోట్ల మంది ఓటర్లలో 88 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొంటే, 49.5 శాతం ఓట్లు ఎర్డొగాన్కూ, 44.8 శాతం ప్రత్యర్థికీ వచ్చాయి. ఆయన కూటమి ‘పీపుల్స్ అలయన్స్’ పార్లమెంట్లో 323 స్థానాలు, ప్రత్యర్థి ‘నేషన్ అలయన్స్’కు 213 స్థానాలు దక్కాయి. అధ్యక్ష పదవికి కావాల్సిన 50 శాతం ఓట్ల కోసం దేశ చరిత్రలో తొలిసారిగా కథ రెండో దఫా ఎన్నికల దాకా సాగింది. ఈ మదగజాల పోరులో సుమారు కోటి మంది సిరియన్ శరణార్థుల గోడు ఎవరికీ పట్టలేదు. ఇరుపక్షాలూ శరణార్థుల్ని వెనక్కి పంపేస్తామన్నాయి. సౌమ్యుడైన కెమల్ సైతం చివరకు ఓట్ల పునాదిని పెంచుకొనే వ్యూహంతో శరణార్థులపై కటువుగా మాట్లాడారు. అయినా లాభం లేకపోయింది. మే 28న రెండో దఫాలో 84 శాతం ఓట్లు పోలైతే, 48 శాతం వద్దే ప్రత్యర్థి ఆగిపోయారు. 52 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడికే పట్టం దక్కింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్టు... ఎన్నికల్లో ఎర్డొగాన్ గెలిచారు కానీ, కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటికి గెలిచినా, భిన్న ధ్రువాలుగా చీలిపోయిన దేశంలో, ఆయన అజెండాను ఇప్పటికీ 47 శాతం పైగా వ్యతిరేకిస్తున్నారని మర్చిపోరాదు. అందుకే, వరుసగా అయిదోసారి అధ్యక్షుడై, అధికారంలో మూడో దశాబ్దంలోకి అడుగిడుతున్న ఆయన ముంగిట అనేక సవాళ్ళు న్నాయి. టర్కీలో ద్రవ్యోల్బణం 44 శాతానికి చేరింది. 2018 నుంచి ఇప్పటికి కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 151 మిలియన్ డాలర్ల లోటులో పడ్డాయి. ఫిబ్ర వరిలో 50 వేల మంది మరణించిన భారీ భూకంప వేళ సర్కార్ పనితీరూ అంతంత మాత్రమే. ఇన్ని కష్టాల మధ్యా యూఏఈ, సౌదీ, రష్యాల నుంచి గణనీయ విదేశీ సాయంతో బండి నెట్టుకొచ్చారు. రానున్న అయిదేళ్ళలో ఈ నిరంకుశ నేత ఆర్థికవ్యవస్థను ఎలా సుస్థిరం చేస్తారన్నది ఆసక్తికరం. ఇక, భౌగోళికంగా ఆసియా – ఐరోపాల కొసన ఉండడం, ముస్లిమ్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రపంచ దేశాల్లో టర్కీ ఒకటి. రష్యా నుంచి లాభపడుతున్న ఈ ‘నాటో’ సభ్యదేశపు విదేశాంగ విధానం స్పష్టమే. రష్యాకూ, పాశ్చాత్య ప్రపంచానికీ మధ్య సాగుతున్న ప్రస్తుత పోరాటంలో ఆ దేశం తన వైఖరిని మార్చుకోదు. పాశ్చాత్య ప్రపంచానికి కాక పుట్టేలా ప్రాంతీయంగా, విదేశీ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వతంత్రతను చూప నుంది. భారత్‌తో ఒకప్పుడు బలమైన బంధమున్నా, 370వ అధికరణం రద్దు తర్వాత కశ్మీర్‌పై ఎర్డొ గాన్ ప్రకటనలు, పాక్‌తో సాన్నిహిత్యం నేపథ్యంలో మన సంబంధాలెలా ఉంటాయో వేచి చూడాలి. మొత్తం మీద ఎన్నికలనేవి అన్నిసార్లూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న నమ్మకాన్ని అందిస్తాయని చెప్పలేం. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేసి, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే నిబంధనల్ని మార్చేసి, అసలు స్ఫూర్తికే తిలోదకాలిచ్చినప్పుడు ఎన్నికలు నామ మాత్రమే! ప్రజాస్వామ్యం పేరుకే! సైన్యం తెర వెనుక ఉండి కథ నడిపే పాకిస్తాన్ సహా అనేక దేశాల్లో ఇదే ప్రహసనం. దశాబ్ది పైచిలుకుగా టర్కీలో ఎర్డొగాన్ చేసిందీ, జరిగిందీ ఇలాంటి ప్రజాస్వామ్య పరిహాసమే. కానీ, అధికారాన్ని నిలుపుకోవడానికి అక్కరకొచ్చిన ఈ ఆట ఆర్థిక కష్టాల్లోని దేశాన్ని ముందుకు నడిపించడానికి ఇకపైనా పనికొస్తుందా? -
రాజదండం – రాజ్యాంగ దండం
నిప్పు కాలుతుంది, అయినా నిప్పు లేనిదే రోజు గడవదు. కాలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నిప్పును వాడుకోవాలి. అధికారం కూడా అంతే; అధికారం చెడగొడుతుందనీ, సంపూర్ణ అధికారం సంపూర్ణంగా చెడగొడుతుందనీ ఒక ఆంగ్ల మేధావి సెలవిచ్చాడు. లోకవ్యవహారం సజావుగా సాగాలంటే అందుకు అవసరమైన అధికారాన్ని ఒక వ్యక్తి చేతిలోనో, వ్యవస్థ చేతిలోనో పెట్టక తప్పదు. మళ్ళీ అది చెడుదారి పట్టకుండా అవసరమైనప్పుడు కళ్లేలు బిగించకా తప్పదు. ఒక తెగకు లేదా ఒక ప్రాంతానికి చెందిన జనం సమష్టి ప్రయోజనాల కోసం ఎప్పుడైతే గుంపు కట్టారో అప్పుడే అధికార– నియంత్రణల రెండింటి అవసరాన్నీ గుర్తించారు. ఆ క్రమంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే మానవచరిత్ర అంతా అధికారమూ, దాని నియంత్రణల మధ్య ఎడతెగని పెనుగులాటే! ఈ పెనుగులాట రూపురేఖలు మన పురాణ ఇతిహాసాలలోనూ కనిపిస్తాయి. దశరథుడు అవడానికి రాజే కానీ పెద్దకొడుకైన రాముడికి పట్టాభిషేకం చేసే స్వతంత్రాధికారం మాత్రం ఆయనకు లేదు. పౌరజానపద పరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. ఆ పౌర జానపదులలో తరుజనులు, గిరిజనులూ కూడా ఉన్నారని రామాయణం చెబుతోంది. దశరథుడికి పౌరజానపదుల ఆమోదం సునాయాసంగా లభించింది కానీ; మహాభారత ప్రసిద్ధుడైన యయాతికి మాత్రం అంత సులువుగా లభించలేదు. తన చిన్న కొడుకైన పూరునికి రాజ్యం అప్పగించాలన్న తన ప్రతిపాదనను అతడు పౌరజానపదుల ముందు ఉంచినప్పుడు, పెద్దకొడుకైన యదువు ఉండగా చిన్నకొడుకును ఎలా రాజును చేస్తావని వారు ప్రశ్నించారు. యయాతి వారిని ఎలాగో ఒప్పించి తన నిర్ణయాన్ని అమలు చేశాడు. ప్రజామోదంతో రాజైన వ్యక్తి ఆ తర్వాత సర్వస్వతంత్రుడై విర్రవీగినప్పుడు అతణ్ణి తొలగించిన ఉదాహరణలూ ఉన్నాయి. మహాభారతంలోని పురూరవుడు, నహుషుడు ఆ కోవలోకి వస్తారు. రాజు ధర్మతత్పరతను ఉగ్గడించే కథలు; ధర్మం తప్పిన రాజూ, అతని రాజ్యమూ కూడా భస్మీపటలమైన కథలూ చరిత్రకాలంలోనూ కనిపిస్తాయి. బెజవాడ రాజధానిగా ఏలిన విష్ణుకుండిన రాజు మాధవవర్మ, తన కొడుకు ప్రయాణించే రథం కింద పడి ఒక పౌరుడు మరణించినప్పుడు కొడుకని చూడకుండా మరణశిక్ష అమలు చేస్తాడు. ‘శిలప్పదికారం’ అనే ప్రసిద్ధ తమిళ కావ్యంలో నాయిక కణ్ణగి తన భర్త కోవలన్ కు పాండ్యరాజు ఒకడు అన్యాయంగా మరణశిక్ష అమలు చేసినప్పుడు ఆగ్రహించి అతని రాజ్యాన్ని బూడిదకుప్ప కమ్మని శపిస్తుంది. శిక్షించే అధికారంతో పాటు తప్పొప్పులను నిర్ణయించే అధికారాన్ని కూడా రాజు గుప్పిట పెట్టుకున్న దశను ఈ కథ సూచిస్తుంది. రాజూ, రాజ్యాధికారమూ, ధర్మబద్ధత, దండనీతి గురించిన భావనలు ఏ ఒక్క దేశానికో పరిమితమైనవి కావు; సార్వత్రికమైనవీ, అత్యంత ప్రాచీనమైనవీ కూడా! ఆధునిక భాషాశాస్త్ర నిర్ధారణలనే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలరూపమైన ‘రెగ్’ అనే మాటే సంస్కృతంలో రాజశబ్దంగానూ, ఇతర ఇండో–యూరోపియన్ భాషల్లో దానికి దగ్గరగా ధ్వనించే ‘రెక్స్’ (లాటిన్) వంటి శబ్దాలుగానూ మారింది. ‘సరళరేఖలా తిన్నగా నడిచేది, నడిపించే’ దనే అర్థం కలిగిన ‘రెగ్’ అనే మాట నుంచే నేటి రెగ్యులేషన్, రెగ్యులర్, రైట్, రీజన్, రెజీమ్ మొదలైన మాటలు వచ్చాయని భాషావేత్తలు అంటారు. రాజశబ్దం ఎంత ప్రాచీనమో, కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న రాజదండం కూడా అంతే ప్రాచీనమూ, సార్వత్రికమూ కూడా! మన పురాణ, ఇతిహాసాలలో రాచరికానికీ, రాజుల నియామకానికీ ఇంద్రుడు బాధ్యుడిగా కనిపిస్తాడు. చేది దేశాన్ని పాలించే వసురాజు విరక్తుడై అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇంద్రుడు అతణ్ణి తిరిగి రాజ్యపాలనకు ప్రోత్సహించి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు, ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడని మహాభారతం చెబుతోంది. ఇలాగే ఇంద్రుడు రాజ్యపాలనకు ప్రోత్సహించిన మరో రాజు – మాంధాత. ధర్మరక్షణను రాజుకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటుంది కనుక రాజదండాన్ని ధర్మదండంగా కూడా అన్వయించారు. పట్టాభిషేక సమయంలో రాజుకీ, గురువుకీ మధ్య నడిచే ఒక సంభాషణ ప్రకారం, ‘నన్ను ఎవరూ శిక్షించలే’రని రాజు అంటాడు; అప్పుడు, ‘ధర్మం నిన్ను శిక్షిస్తుంది’ అంటూ గురువు మూడుసార్లు ధర్మదండంతో అతని శిరసు మీద కొడతాడు. ఈ రాజదండం ఆనవాయితీ రోమన్లకూ సంక్రమించింది. వారిలో మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌరకేంద్రిత పాలన– అంటే గణతంత్ర వ్యవస్థ ఉండేది. రాచరికాన్నీ, రాజు అనే మాటనూ కూడా వారు ఏవగించుకునేవారు. ఒక దశలో రోమ్ సైనిక నియంతగా ఉన్న జూలియస్ సీజర్ ఈజిప్టు రాణి క్లియోపాత్రా ప్రేమలో పడిన తర్వాత, అక్కడున్న వ్యవస్థ ప్రభావంతో సింహాసనాన్నీ, రాజదండాన్నీ స్వీకరించాడు. అదే చివరికి అతని హత్యకు దారితీసింది. అధికారమంతా రాజు దగ్గరే పోగుబడే ప్రమాదం తలెత్తినప్పుడు అతణ్ణి అదుపు చేసే సంకేత పాత్రను రాజదండం నిర్వహించి ఉండవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ ద్వారా ఆ ప్రమాదాన్ని అరికట్టేందుకు ఆయా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఏ వ్యవస్థ ఏ హద్దుల్లో ఉండాలో చెప్పే రాజ్యాంగమూ వచ్చింది. అదే నేటి అసలు సిసలు రాజదండం! -
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఘన విజయానికి ప్రతీక నూతన సన్సద్ భవన్!
భారత పార్లమెంటు నూతన భవనం మే 28న ప్రారంభమవుతోంది. 1927లో నిర్మించిన ప్రస్తుత సన్సద్ భవన్‌కు సమీపంలోని సెంట్రల్ విస్తాలో నిర్మించిన కొత్త భవనంలో పార్లమెంటు ఉభయసభలు రాజ్యసభ, లోక్ సభ కార్యకలాపాలు ఇక కొనసాగుతాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు భవనాల చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం. ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పుట్టినిల్లుగా ఇంగ్లండ్‌ను పరిగణిస్తారు. అయితే, బ్రిటిష్ పార్లమెంటును పొరపాటున ఇప్పటికీ చాలా మంది ప్రపంచంలోని పార్లమెంట్లకు మాతృక అని భావిస్తారు. అసలు విషయం ఏమంటే–ప్రఖ్యాత బ్రిటిష్ రాజకీయవేత్త, సంస్కర్త జాన్ బ్రయిట్ 1865 జనవరి 18న బర్మింగ్ హామ్ నగరంలో ప్రసంగిస్తూ ఇంగ్లండ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇంగ్లండ్ ఈజ్ ద మదర్ ఆఫ్ పార్లమెంట్స్’ అని అభివర్ణించారు. ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకుని, ఆచరణలో అనుసరిస్తున్న అన్ని దేశాలకు మోడల్ ఇంగ్లండ్ అనే అర్థంలో జాన్ బ్రయిట్ అలా మాట్లాడారు. కాని, యునైటెడ్ కింగ్ డమ్ రాజధాని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబి ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ పార్లమెంటు భవనాన్ని (అంటే అందులో సమావేశమవుతూ పనిచేసే పార్లమెంటు ఉభయ సభలు–హౌస్ ఆఫ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్) అన్ని దేశాల పార్లమెంట్లకు మాతృక అనే భావనతో కొందరు బ్రయిట్ అన్న మాటలను వాడుతుంటారు. ఈ సందర్భంగా బ్రిటిష్ పార్లమెంటు చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం. 1707-1800 మధ్య లండన్ లోని ఈ పార్లమెంటు గ్రేట్ బ్రిటన్ పార్లమెంటుగా పనిచేసింది. 1801 జనవరి 1 నుంచి పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్గా నడుస్తోంది. వెస్ట్ మినిస్టర్ ఆబీ ప్రాంతంలో ఉన్న భవనాల్లో బ్రిటిష్ పార్లమెంటు ఉభయసభలు సమావేశమవుతుండడం వల్ల బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా పిలుస్తారు. గతంలో రెండుసార్లు అగ్నిప్రమాదాల్లో పార్లమెంటు భవనాలు ధ్వంసం కావడం, మళ్లీ నిర్మించడం జరిగింది. లండన్ థేమ్స్ (టెమ్జ్) నది తీరాన ఉన్న పార్లమెంటు భవనాలను ఇప్పుడు మళ్లీ ఆధునికీకరించే పనిచేపడుతున్నారు. 2025లో ప్రారంభమయ్యే నవీకరణ ఆరేళ్ల పాటు సాగుతుందని అంచనా. ప్రారంభం తర్వాత 100 ఏళ్లు నిండక ముందే కొత్త భవనంలోకి భారత పార్లమెంటు మారిన పరిస్థితులు, సాంకేతికత, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా భారత పార్లమెంటు ఉభయ సభలకు కొత్త భవనం అవసరం ఏర్పడింది. 1927లో నిర్మాణం పూర్తయి నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కార్యకలాపాలతో ప్రారంభమైన ప్రస్తుత సన్సద్ భవన్ ను అలాగే ఉంచి దగ్గర్లో కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం, ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కొత్త సన్సద్ భవన్ ప్రారంభించడం నేడు చర్చనీయాంశాలయ్యాయి. భారత రాజ్యాంగ రచనకు వేదికగా ఉపకరించిన పార్లమెంటు భవనంలో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఉభయసభల నిర్వహణకు వీలు కల్పించారు. 1952 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ 15 మంది ప్రధానమంత్రులు (రెండుసార్లు 13 రోజులు చొప్పున ప్రధానిగా ఉన్న జీఎల్ నందాతో కలిపి), 15 మంది రాష్ట్రపతులు ఈ పార్లమెంటు భవనంలో తమ విధుల్లో భాగంగా ప్రసంగించారు. 14 మంది ఉపరాష్ట్రపతులు (సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి జగదీప్ ధన్‌ఖడ్ వరకూ) రాజ్యసభ అధ్యక్షుల హోదాలో ఎగువసభ సమావేశాలు నిర్వహించారు. చదవండి: బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటీ? అలాగే, 17 మంది స్పీకర్ల (జీవీ మావలంకర్ నుంచి ఓం బిర్లా వరకూ) ఆధ్వర్యంలో లోక్ సభ సమావేశాలను ఈ భవనంలోనే జరిపించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న పాత సన్సద్ భవన్ నుంచి ఇక ఉభయ సభల సమావేశాలు, కార్యకలాపాలు కొత్త భవనంలోకి మారడం నిజంగా 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లలో గొప్ప పరిణామం. భారత రాజ్యాంగం 73 ఏళ్ల క్రితం అమలులోకి వచ్చినప్పుడు అనేక మంది ఇతర దేశాల మేధావుల వ్యతిరేక అంచనాలకు భిన్నంగా ఇండియాలో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాలపరీక్షను తట్టుకుని నిలిచింది. విజయవంతమైంది. ఈ విజయానికి నూతన సన్సద్ భవన్ ప్రతీకగా నిలుస్తుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం
దేశంలోగాని, ఏదైనా రాష్ట్రంలోగాని ప్రజా ప్రభుత్వాల పాలనపై అసంతృప్తి పెల్లుబికినపుడు జనం రాజకీయాలపైన, రాజకీయ పక్షాలపైన విరుచుకుపడుతుంటారు. సరైన పరిపాలన అందించలేని ఆయా పాలక పక్షాలపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. కాని, కొన్ని సందర్భాల్లో జనం మొత్తంగా రాజకీయాలను, రాజకీయ పార్టీను దుయ్యబడుతూ ప్రజాస్వామ్యానికి పార్టీల వల్లే కీడు జరుగుతున్నట్టు మాట్లాడటం అభిలషణీయం కాదు. ఎందుకంటే రాజకీయపక్షాలు లేని ప్రజాస్వామ్యం ఇప్పట్లో సాధ్యం కాదు. రాజకీయ పార్టీల ఉనికి ప్రజల ఆదరణ, మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఓటర్లే నాయకులను లేదా ప్రజా ప్రతినిధులను (చట్టసభల సభ్యులను) ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ప్రజలకు తమకు నచ్చిన పార్టీలను, నేతలను గద్దెనెక్కించడానికి చక్కటి అవకాశం ఇస్తోంది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓటర్లకు ఎనలేని అధికారాలు అందిస్తున్నాయి. అయితే, కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి అనేక రాజకీయపక్షాలు అధికారం కోసం పోటీపడే బహుళపక్ష ప్రజాస్వామ్యం అవసరం ఇంకా ఉంది. పార్టీ రహిత ప్రజాస్వామ్యం మెరుగైనదని ప్రఖ్యాత రాడికల్ హ్యూమనిస్టు ఎం.ఎన్.రాయ్ వాదించినా ఇప్పటికిప్పుడు పార్టీలు లేని ప్రజాస్వామ్యం అమెరికా వంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం సాధ్యం కాదు. శాంతియుత పద్ధతిలో పాలకపక్షాలను మార్చడానికి ప్రజలకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఎలాంటి హింసకు ఆస్కారం లేకుండా దేశంలో ఆరో లోక్ సభ ఎన్నికల్లో (1977) ప్రజలు సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న పాలకపార్టీని (భారత జాతీయ కాంగ్రెస్) అధికారం నుంచి తొలగించి కొత్త రాజకీయపక్షానికి (జనతాపార్టీ) అవకాశం కల్పించారు. చదవండి: మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్ కొత్త రాజకీయపక్షం అంతర్గత కీచులాటలతో హస్తినలో ప్రభుత్వం నడపలేక మూడు సంవత్సరాల లోపే కుప్పకూలిపోయింది. దీంతో ఆగ్రహించిన భారత ఓటర్లు 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టారు. 1956 నుంచీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీని 1983 జనవరిలో ఓడించిన జనం కొత్త ప్రాంతీయపక్షానికి అధికారం అప్పగించారు. అప్పటి నుంచి ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల ద్వారా అధికారం కోసం పోటీ జరుగుతోంది. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించేది రాజకీయపక్షాలే! అన్ని ప్రాంతాల్లోనూ జాతీయపక్షాలకు పోటీగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు బలపడుతూ అవి స్థానిక ప్రజల ఆకాంక్షలకు తగినట్టు పరిపాలన అందిస్తున్నాయి. ఫలితంగా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో లేదా 20 ఏళ్లకో అధికారం ఒక పార్టీ నుంచి మరో పార్టీ చేతుల్లోకి ప్రశాంతంగా బదిలీ అవుతోంది. వివిధ రాజకీయపక్షాలకు తమకంటూ సొంత అజెండా, కార్యక్రమాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఎన్నికల ప్రణాళిక ఉన్న కారణంగా ప్రజలకు ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. అధికారం లేదా పరిపాలన అనే గమ్యం చేరడానికి రాజకీయపక్షాలే ప్రధాన రహదారులుగా ప్రజలకు ఉపకరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటే వారు స్వయంగా తమను తాము పరిపాలించుకోలేరు కాబట్టి ప్రభుత్వ వ్యవస్థను నడిపే ప్రజా ప్రతినిధులను ఎంపికచేసి చట్టసభలకు పంపిస్తారు. ప్రజా ప్రతినిధులు రాజకీయపక్షాల ప్రతినిధులుగా గాక, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిస్తే అంతా గందరగోళం అవుతందనే అంచనాతోనే.. ఓటర్లు 95 శాతానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీల టికెట్ పై పోటీకి దిగే అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలిచే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఏ ఒక్కరూ గెలవలేదు. ఎన్నికల ప్రక్రియ ద్వారా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలకు, రాజకీయాలకు కీలక ప్రాధాన్యం ఉంది. రాజకీయాలు, పార్టీల నాణ్యత పెరగాలని ప్రజలు కోరుకుంటూ ఆ మేరకు ఒత్తిడి తీసుకురావాలేగాని రాజకీయపక్షాలు లేని పరిస్థితిని కోరుకోకూడదు. అందుకే అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ (1809–1865) దాదాపు రెండు శతాబ్దాల క్రితమే ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యంపై మాట్లాడుతూ, ‘ఎన్నికలు ప్రజలవే. వారి నిర్ణయమే ఎన్నికలు ప్రతిబింబిస్తాయి. చలిమంట ముందు వారు శరీరం వెనుక భాగానికి మంట తగిలేలా కూర్చుని, వీపులు కాల్చుకోవాలని నిర్ణయించుకుంటే–కాలిన గాయాలతో వారు కూర్చోవాల్సి ఉంటుంది,’ అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఓటర్లు వారి నిర్ణయాలకు వారే బాధ్యులనే విషయాన్ని లింకన్ గారు ఇంత చమత్కారంగా వర్ణించారు. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
పరిహాసమైన ప్రజాస్వామ్యం
కంచే చేను మేస్తే? ధర్మం, న్యాయం కాపాడాల్సిన పాలకులే... అధర్మానికి కాపు కాస్తే? మాఫియా డాన్ల అడుగులకు మడుగులొత్తితే? పోలీసు, న్యాయవ్యవస్థలు దోషులుగా నిర్ధారించిన వారిని సైతం శిక్షాకాలం పూర్తి కాక ముందే రకరకాల సాకులతో బాహ్యప్రపంచంలోకి వదిలేస్తుంటే ఏమనాలి? ఎవరికి చెప్పాలి? పార్టీలు, పాలకుల మీద ఏవగింపు గలిగే ఇలాంటి చర్యల వరుసలో తాజా ఉదాహరణ – హంతకుడు ఆనంద్ మోహన్ సింగ్‌ను పాలకులు నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకొదిలేసిన సంఘటన. ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను దారుణంగా చంపి, జైలు ఊచలు లెక్క బెడుతున్న ఈ బడా నేరస్థుడు గురువారం బిహార్‌లోని సహరసా జైలు నుంచి విడుదలైన తీరు నివ్వెరపరుస్తోంది అందుకే. నిరుడు బీజేపీతో బంధం తెంచుకున్నాక ఓట్ల పునాదిని విస్తరించుకొనేందుకు తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీశ్ బలమైన తోమర్ రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఆనంద్‌లో అద్భుతమైన అవకాశాన్ని చూశారని ఆరోపణ వినిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలే పరమా వధిగా దోషుల్ని వదిలేసే దిగజారుడు పనిలో పార్టీలన్నీ పోటీ పడుతుండడం ఆగ్రహం రేపుతోంది. ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కృష్ణయ్యను 1994లో దారుణంగా హత్య చేశాడీ ఆనంద్ మోహన్. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దళితుడు. విధినిర్వహణలోని ఆయనను ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వ వాహనం నుంచి లాగి, హేయంగా కొట్టి చంపడానికి 1994 డిసెంబర్ 5న అల్లరిమూకను రెచ్చగొట్టింది ఆనంద్ మోహన్. 2007లో ట్రయల్ కోర్ట్ దోషికి మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ దాన్ని జీవితకాల శిక్షగా తగ్గించింది. ఈ తీర్పును ఆనంద్ సుప్రీమ్‌లో సవాలు చేసినా, ఇప్పటి దాకా కోర్ట్›ఉపశమనమేమీ ఇవ్వలేదు. అలా 2007 నుంచి జైలులో ఉన్న వ్యక్తిపై బిహార్ సర్కార్ ఎక్కడ లేని అక్కర చూపింది. ఈ నెలలోనే ‘బిహార్ ప్రిజన్ మ్యాన్యువల్ 2012’లో 481వ రూల్‌ను మార్చింది. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారి హత్యలో దోషి అయిన ఖైదీని విడుదల చేయరాద’న్న నిబంధనను నిర్లజ్జగా తొలగించింది. ఫలితంగా – జైలులో 14 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిపిన మరో 27 మంది ఖైదీలతో పాటు ఈ నేరస్థుడికీ అన్యాయంగా స్వేచ్ఛ లభించింది. పౌర సమాజం నుంచి ప్రతిపక్షాల దాకా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా, నితీశ్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. బిహార్‌లో రాజకీయాలకూ, నేరస్థులకూ మధ్య అనాదిగా పొడిచిన పొత్తుకు ఇది ప్రతీక. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ పలుకుబడి సామాన్యమేమీ కాదు. శివ్‌హర్ లోక్‌సభా స్థానంలో గతంలో ఎంపీగా గెలిచాడు. కృష్ణయ్య హత్యతో జైలులో ఉంటేనేం, అతని భార్య లవ్లీ ఆనంద్ ఒకసారి ఎంపీ అయ్యారు. 2010 అసెంబ్లీ, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పక్షాన పోటీ చేశారు. వారి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఎమ్మెల్యే. తల్లీకొడుకులిద్దరూ బిహార్ అధికార సంకీర్ణ కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యులే. కుమారుడి వివాహ నిశ్చితార్థం కోసం ఆనంద్ ఇటీవల 15 రోజులు పెరోల్ మీద బయటే ఉన్నాడు. సదరు నిశ్చితార్థానికి సాక్షాత్తూ బిహార్ సీఎం సహా అధికార కూటమి నేతలందరూ హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. పెరోల్ ముగిసిన ఆనంద్ ఏప్రిల్ 26న జైలుకు చేరాడో లేదో, సర్కార్ సవరించిన నిబంధనల పుణ్యమా అని మర్నాడే బయటకొచ్చేశాడు. వివిధ రాష్ట్రాల్లోని పాలకుల అవసరానికి తగ్గట్టు నియమ నిబంధనలు మారిపోతున్నాయి. వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. వెరసి, జైళ్ళలోని దోషుల శిక్షాకాలాన్ని తగ్గించి బయటకు వదిలేస్తున్న లజ్జాకరమైన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత ఆగస్ట్‌లో బయటపడ్డ బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషుల నుంచి తాజా ఆనంద్ మోహన్ దాకా అన్ని వ్యవహారాలూ అలాంటివే. బీజేపీ నుంచి జేడీ–యూ దాకా అన్ని పార్టీలూ ఈ తిలా పాపంలో తలా పిడికెడు పంచుకున్నవే. ఓటు రాజకీయాలు, సమర్థకుల సంరక్షణ – ఇలా ఈ విడుదల వెనుక పైకి కనిపించని కారణాలు అనేకం. గద్దె మీది పెద్దల పరోక్ష సాయంతో బయటపడ్డ వీరికి సమర్థకుల నుంచి లభి స్తున్న స్వాగత సత్కారాలు, నీరాజనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఆనంద్ విడుదలతో జరిగిన బైక్ ర్యాలీలు, మిఠాయి పంపిణీలూ అచ్చంగా అలాంటివే. రేపిస్టులనూ, హంతకులనూ గౌరవించి, ఆరాధించే సంస్కృతికి అన్ని పార్టీలూ, అనుయాయులూ దిగజారుతున్న తీరు జుగుప్సా కరం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ ఘటనల్లో వ్యవస్థలు భాగమైపోతూ ఉండడం శోచనీయం. చేసిన నేరం తాలూకు తీవ్రత, దోషుల వ్యక్తిగత చరిత్రలను బట్టి ఏ కేసుకా కేసు ప్రత్యేకమైనదే. కానీ, అన్నిటినీ ఒకే గాటన కడుతూ, కావాల్సినవారిని కాపాడుకొనే రీతిలో నిర్ణీత కాలవ్యవధి దాటి జైలులో ఉన్నవారందరినీ వదిలేయవచ్చని తీర్మానించడం సబబేనా? అలాంటప్పుడు బాధితులకు సరైన న్యాయం ఏ రకంగా జరిగినట్టు? పశ్చాత్తాపం, పరిణత సత్ప్రవర్తన లాంటివి శిక్షాకాలపు తగ్గింపునకు గీటురాళ్ళు కావాలి. కేవలం జైలులో గడిపిన రోజులే లెక్కలోకి తీసుకుంటే, బాజాప్తాగా బయటకొచ్చిన దోషి రేపు మరో నేరానికి పాల్పడడని నమ్మకం ఏమిటి? బాధిత కుటుంబాల కళ్ళెదుటే నేరస్థులు నిష్పూచీగా తిరుగుతుంటే, చట్టం, న్యాయం పట్ల సామాన్యుడు విశ్వాసం కోల్పోతే ఆ పాపం ఎవరిది? తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావిడి పడుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ లోతైన ప్రభావం చూపే పరిణామాలని ఇకనైనా తెలివిడి తెచ్చుకోవాలి. ఈ దేశంలో చట్టాలన్నీ అధికార బలగానికి చుట్టాలేనన్న భావన బలపడితే ప్రజాస్వామ్యానికే చేటు. -
ఇజ్రాయెల్‌లో మళ్లీ రాజుకున్న నిరసన జ్వాల!
ఇజ్రాయెల్‌లో మళ్లీ నిరసన జ్వాల రాజుకుంది. శనివారం వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మార్చి 27న ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు న్యాయవ్యవస్థలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు దేశాన్ని చీల్చేలా ఉన్నాయంటూ నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంస్కరణలను నిలిపి చర్చకు అనుమతించినట్లు ప్రకటించిన 15వ వారంలోనే మరోసారి నిరసనలు చెలరేగాయి. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని, కాపాడుకోవాలంటూ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దాదాపు పదివేలమందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వారంతా మేము ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, మాకు వేరే దేశం లేదంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేపట్టారు. ఈ సంస్కరణలు సుప్రీం కోర్టు అధికారాన్ని తగ్గించి న్యాయమూర్తుల ఎంపికపై రాజకీయ నాయకులకే ఫుల్‌గా అధికారాలుంటాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైఫాలోని మోడిన్‌లోని న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ ఇంటి వెలుపల కూడా నిరసనలు జరిగినట్లు సమాచారం. కాగా, యూఎస్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇజ్రాయెల్ దృక్పథానికి సానుకూలం నుంచి స్థిరీకరణకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత శనివారమే నిరసనలు వెల్లువెత్తడం గమనార్హం ఈ కొత్త సంస్కరణల పట్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ చట్టాన్ని అర్థాంతరంగా నిలిపి వేసి, ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు దారితీసింది. అయితే యూఎస్ మూడీస్ మాత్రం ప్రభుత్వం విస్తృత ఏకాభిప్రాయం కోరకుండా ఇలాంటి సంస్కరణలను అమలు చేయాలని యత్నించే తీరు సంస్థాగత బలం, విధాన అచనాల బలహీనతను సూచిస్తుందని పేర్కొంది. (చదవండి: కెనడాలో వైశాఖి పరేడ్..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన!) -
చరిత్రాత్మకమైన తీర్పు
న్యాయం చేయటం మాత్రమే కాదు, అలా చేస్తున్నట్టు కనబడటం కూడా ముఖ్యం అంటారు. ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ సహజ న్యాయసూత్ర ప్రాధాన్యతనూ, దాపరికం లేని న్యాయవ్యవస్థ ఆవకశ్యతనూ నిర్మొహమాటంగా తెలియజేసింది. అంతేకాదు, ఈమధ్యకాలంలో ‘జాతీయ భద్రత’ను అడ్డం పెట్టుకునే పోకడలను నిశితంగా విమ ర్శించింది. ‘మీడియా వన్’ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఆ కేసు నిజానికి ఇంత దూరం రావా ల్సిన అవసరం లేదని సులభంగానే అర్థమవుతుంది. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందన్న ఆరోపణతో కేరళలోని ‘మీడియా వన్’ చానెల్ ప్రసారాల కొనసాగింపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. దేశభద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవటానికీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికీ ప్రభుత్వాలకు సర్వాధికారాలూ ఉంటాయి. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ అందుకు సహేతుక కారణాలను చూపటం ముఖ్యం. అలా కారణాలు చూపటంవల్ల వ్యక్తులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయా లేదా అన్నది ప్రధానం కాదు. ప్రజా స్వామ్యం నాలుగు కాలాలపాటు మనుగడ సాగించాలంటే ఇది ముఖ్యం. ఇలా చేయటంవల్ల దేశ ప్రజల్లో చట్టబద్ధ పాలనపై విశ్వసనీయత ఏర్పడుతుంది. పాలన పారదర్శకంగా సాగుతున్నదనీ, జవాబుదారీతనం అమల్లో ఉన్నదనీ భరోసా కలుగుతుంది. కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల విషయంలో తన వాదనలకు మద్దతుగాకేంద్రం కొన్ని పత్రాలను సీల్డ్ కవర్లో అందజేయటం, న్యాయస్థానాలు ఆ ధోరణిని అంగీకరించటం కనబడుతుంది. ఇందుకు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు తదితరాలు మొదలుకొని భీమా కోరెగావ్ కేసు వరకూ ఎన్నిటినో ఉదహరించవచ్చు. ఆఖరికి ఇదెంత వరకూ వచ్చిందంటే సీల్డ్ కవర్ అందజేయటం న్యాయవ్యవస్థలో ఒక సాధారణ విషయంగా మారింది. ఇందువల్ల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకూ, సంస్థలకూ నష్టం జరుగుతుంది. తమపై ఉన్న ఆరోపణలేమిటో, వాటికిగల ఆధారాలేమిటో తెలియకపోతే ఏ ప్రాతిపదికన వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? నేరం రుజువయ్యేవరకూ ఎవరినైనా నిరపరాధులుగా పరిగణించాలన్నది అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ అనుసరించే విధానం. దానికి సీల్డ్ కవర్ పద్ధతి గండికొడుతోంది. అంతేకాదు, నిందితులకు అన్యాయం జరుగుతున్నదన్న భావన కలిగి ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఏర్పడుతోంది. ‘మీడియా వన్’ కేసు విషయానికొస్తే ఆ సంస్థ ప్రసారాలను ఎందుకు నిలిపేయాల్సివచ్చిందో కేంద్రం చెప్పదు. హైకోర్టుకు పోతే అక్కడ ధర్మాసనం తనకు సమర్పించిన సీల్డ్ కవర్లో ఆ ఆరోపణలేమిటో చూస్తుంది. వీటిపై మీ వాదనేమిటని కక్షిదారును ప్రశ్నించదు. పైగా ఆ సీల్డ్ కవర్ సమాచారం ఆధారంగా తీర్పు వెలువడుతుంది. సింగిల్ బెంచ్ ముందూ, డివిజన్ బెంచ్ ముందూ కూడా ‘మీడియా వన్’కు ఇదే అనుభవం ఎదురైంది. అయితే అసలు న్యాయస్థానాలు సీల్డ్ కవర్‌ను అంగీకరించే ధోరణి గతంలో లేనేలేదని చెప్పలేం. ప్రభుత్వోద్యోగుల సర్వీసు, పదోన్నతుల వ్యవహారాల్లో సంబంధిత అధికారుల ప్రతిష్ట కాపాడేందుకు... లైంగిక దాడుల కేసుల్లో బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచటానికి సీల్డ్ కవర్లో వివరాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఖరికి రాఫెల్ యుద్ధ విమానాల కేసులో సాంకేతిక అంశాలు వెల్లడిస్తే శత్రు దేశాలకు ఉప్పందించినట్టవుతుందని చెప్పటం వరకూ అంగీకరించవచ్చు. కానీ బీసీసీఐ విషయంలో తానే నియమించిన కమిటీ నివేదికనూ, గుజరాత్‌కు సంబంధించిన నకిలీ ఎన్కౌంటర్ కేసు, అయోధ్య స్థల దస్తావేజు కేసువంటి అంశాల్లో సైతం గోప్యత పాటించాలని ప్రభుత్వం చేసిన వినతిని న్యాయస్థానాలు అంగీకరించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2013లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. అయితే తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టు బ్రిటన్, కెనడా సుప్రీంకోర్టులు ఈ విషయంలో ఎన్నదగిన తీర్పులు వెలువరించాయి. కేసులకు సంబంధించిన సమాచారాన్ని దాచివుంచటం వల్ల ఆ కేసుల గురించి చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించటం ప్రజలకు నిరాకరించినట్టే అవుతుందని అక్కడి న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ‘మీడియా వన్’ కేసులో జాతీయ భద్రతను సాకుగా చూపిన కేంద్రం దాన్ని సమర్థించుకునేందుకు సీల్డ్ కవర్లో ప్రస్తావించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అందుకే గాల్లోంచి ఆరోపణలు సృష్టిస్తే అంగీకరించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి కేసుల విష యంలో న్యాయస్థానాలు అనుసరించాల్సిన రెండు గీటురాళ్లను కూడా ప్రకటించింది. కేసులోని అంశాలు వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని భావించటానికి అవసరమైన సమా చారం ప్రభుత్వం అందించిందా లేదా అన్నది అందులో మొదటిది. వివేకవంతులైన వ్యక్తులు సైతం ఆ సమాచారం ఆధారంగా అలాగే భావించే అవకాశం ఉన్నదా లేదా అన్నది రెండోది. భావప్రకటనా స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 19వ అధికరణలోనే ఏయే అంశాల్లో నియంత్రణలు అమలు చేయవచ్చో వివరంగా ఉంది. వాటిని బేఖాతరు చేసి నచ్చని అభిప్రాయాలు ప్రకటించారన్న ఏకైక కారణంతో ఆ స్వేచ్ఛకు గండికొట్టడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అందుకే ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. -
'మిత్రకాల్'పై పోరాటం.. సత్యమే నా ఆయుధం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను పోరాటం చేస్తున్నానని, సత్యమే తన ఆయుధమని పదునైన వ్యాఖ్యలు చేశారు. 'నేను మిత్రకాలంపై పోరాటం చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సత్యమే నా ఆయుధం. అదే నాకు అండ..' అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. ये ‘मित्रकाल’ के विरुद्ध, लोकतंत्र को बचाने की लड़ाई है। इस संघर्ष में, सत्य मेरा अस्त्र है, और सत्य ही मेरा आसरा! pic.twitter.com/SYxC8yfc1M — Rahul Gandhi (@RahulGandhi) April 3, 2023 హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం స్నేహితుడు అదానీ కోసమే మోదీ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శల జోరు పెంచిన విషయం తెలిసిందే. అందుకే మోదీ పాలనను మిత్రులకు లాభం చేకూర్చే మిత్రకాల్‌గా ఆయన అభివర్ణిస్తున్నారు. కాగా.. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో మార్చి 23న రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. తీర్పుపై స్టే విధించాలని, శిక్ష రద్దు చేయాలని కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం రాహుల్‌కు ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై స్టే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి విచారణను వాయిదా వేసింది. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి భారత్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో ప్రతికూలతలు ఉన్నా, వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రజాస్వామ్యంతో సత్ఫలితాలు లభిస్తాయనడానికిదే నిదర్శనం’’ అన్నారు. గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’లో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దేశ ప్రజల సమ్మిళిత ప్రయత్నాలే తగిన బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. పాలకులను ప్రజలంతా కలిసి ఎన్నుకొనే ఆలోచన ప్రపంచ దేశాల కంటే చాలా ఏళ్ల ముందే భారత్‌లో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రజల ప్రథమ విధి పాలకులను ఎన్నుకోవడమేనని మహాభారతంలో ఉందని తెలిపారు. ప్రాచీన భారతదేశంలో ఎన్నో గణతంత్ర రాజ్యాలుండేవని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయని వివరించారు. ‘‘గణతంత్ర రాజ్యాల్లో పాలనాధికారం వారసత్వంగా దక్కేది కాదు. పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు’’ అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక నిర్మాణం కాదని, అదొక స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’కు అమెరికా, కోస్టారికా, జాంబియా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా దేశాల అధినేతలు ఆతిథ్యం ఇస్తున్నారు. -
గొంతెత్తడం ప్రజల రాజకీయ కర్తవ్యం
అభిప్రాయ ప్రకటనకు వీలులేని స్వాతంత్య్రం నిరర్థకం. పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ దేనికి? అలా లేనప్పుడు దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి అంతకన్నా పెద్ద ప్రమాదం మరొకటి లేదు. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదని శతాబ్దం క్రితమే సుప్రసిద్ధ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ లూయీ బ్రాండీస్ అన్నారు. పౌరులకు భారత రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా పాలక పక్షాలు అడ్డుకుంటూనే వస్తున్నాయి. పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలిగిన పాలకులే ప్రజల మన్నన పొందగలరు. పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలిగినవారే పౌరస్వేచ్ఛకు హామీ ఇవ్వగలరు. ‘‘స్వాతంత్య్రం పొందిన దేశంలో రాజ్య పాలనా వ్యవస్థ అంతిమ లక్ష్యం– దేశ పౌరులు స్వేచ్ఛగా తమ శక్తియుక్తుల్ని వృద్ధి చేసుకునేటట్లు వారికి అండదండలుగా నిలవగల్గడం. ప్రభుత్వంలో నిరంకుశ ధోరణులు ప్రబలి నప్పుడు బుద్ధిగల పాలకులు వాటిని అణచివేయాలి. అలాంటి పాల కులు మాత్రమే ప్రజల మన్ననలు పొందగల్గుతారు. అలాంటి పాలకులు మాత్రమే పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలరు. అలాంటి వారు మాత్రమే పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలరు. పౌరులు స్వేచ్ఛగా ఆలోచించగల్గి, స్వేచ్ఛగా మాట్లాడగల్గడం అనే లక్షణం– రాజకీయ సత్యాల్ని స్వేచ్ఛగా అన్వేషించి కనుగొనడానికి అనివార్యమైన లక్షణమని గుర్తించాలి. స్వేచ్ఛగా అభిప్రాయ ప్రకటనకు, పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ నిరర్థకం. ఒక దేశ పౌరులు తమ సమస్యలపై స్పందించడానికి స్వేచ్ఛ లేని దేశ స్వాతంత్య్రం అనర్థం, ప్రమాదకరం. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదు.’’ – సుప్రసిద్ధ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ లూయీ బ్రాండీస్ ‘‘వచ్చే సాధారణ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే, 2024 పోరాటం ఎవరో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరిగే పోరుగా కాకుండా దేశంలో ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ మధ్య జరగ వలసిన సంకుల సమరంగా అన్ని ప్రతిపక్షాలూ భావించి ఉమ్మడిగా రంగంలోకి దిగేందుకు నడుం కట్టాలి.’’ – ప్రొఫెసర్ హర్బన్స్ ముఖియా, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చరిత్రాధ్యాపకులు (27 మార్చ్ 2023) జస్టిస్ బ్రాండీస్ శతాబ్దం క్రితం చేసిన చరిత్రాత్మక హెచ్చరిక పౌర సమాజాలకు అరమరికలు లేని బహిరంగ చర్చలు నిరంతర రాజకీయ కర్తవ్యంగా కొనసాగవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. దేశ రాజ కీయ పాలనా వ్యవస్థను ఒక వైపు నుంచి స్వాతంత్య్రానంతరం గాడి తప్పిన కాంగ్రెస్ (ఐక్య సంఘటన పాలన మినహా) పాలకులు, మరొకవైపు నుంచి బీజేపీ నడిపిస్తూ వచ్చాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తమ ఇష్టానుసారం తారుమారు చేసి, భారత పౌరులకు రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా ఇవి అడ్డుకుంటూనే వచ్చాయి. వ్యక్తిగత ఎజెండా లతో పాలనా పద్ధతుల్ని భ్రష్టు పట్టిస్తూనే వచ్చాయి. ఇక నేటి బీజేపీ పాలకవర్గం ప్రేమించే ఇజ్రాయెల్‌లో ఒక సరికొత్త పరిణామం తలెత్తింది. ఆ దేశ ప్రధానమంత్రిని ఏ పరిస్థితుల్లోనూ పాలనకు తగడని పదవి నుంచి తొలగించడానికి వీలు లేకుండా ఇజ్రా యెల్ తాజాగా చట్టం చేసింది. దీన్ని ‘ఇజ్రాయెలీ రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థలోనే సరికొత్త విపత్కర పరిణామం’గా బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూ ట్లో మధ్యప్రాచ్య విధాన నిర్ణయ కేంద్రం డైరెక్టర్ నతన్ సాక్స్ అభివర్ణించాడు. ఇజ్రాయెల్ కొత్త శాసనం ప్రకారం ఆ దేశపు సుప్రీంకోర్టుకు ఇజ్రాయెల్ పాలకవర్గంపైగానీ, దేశ శాసనాలపైగానీ అవసర మైన అదుపాజ్ఞలను జారీ చేసే హక్కు ఉండదు. ఈ తాజా పరిణామం ప్రభావం భారత పాలనా వ్యవస్థకు విస్తరించకుండా ఉండాలని మాత్రమే మనం కోరుకోగలం. విచ్చలవిడిగా దేశ ఏకైక కుబేర వర్గంగా బలిసినవారి గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాదయాత్రలో ప్రస్తావించి, విమర్శిస్తే పాలకులకు అంత ‘గుర్రెందు’కు? ఏ మాటకామాటే చెప్పు కోవాలి. కాంగ్రెస్ హయాంలోనూ, వారు ఈ వర్గంతో అంటకాగుతూ వారి దోపిడీ యథేచ్ఛగా సాగడానికి అనుమతించిన వారేనని మరచి పోరాదు! దీనికి భిన్నంగా తన సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూసిన ప్రజల కడగండ్ల దృష్ట్యా రూపొందించిన ‘నవరత్న’ ప్రణాళికను ఆ ప్రజలకు జీవశక్తిగా మలిచారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి. కోవిడ్ ఒడుదొడుకుల ఫలితంగా రాష్ట్రం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి ఇబ్బందులు ఎదురైనా జగన్ తట్టుకోగల్గడం ప్రశంసనీయ పరిణామంగా భావించాలి. అందుకే వేమన అన్నాడేమో: ‘‘భూమిలోన పుణ్యపురుషులు లేకున్న జగములేల నిల్చు పొగులు లేక (కుమిలిపోక)’’ రాహుల్ ఇవాళ ఇన్ని కబుర్లు చెబుతున్నారుగానీ, జగన్‌కన్నా ముందు ఉన్నత స్థాయికి ఎందుకు దూసుకురాలేక పోయారు? ‘అసూయ’ అనలేంగానీ, తనపై బనాయించిన అక్రమ కేసుల్ని జగన్ ఎదుర్కొంటూ పదహారు మాసాలకు పైగా జైళ్లలో మగ్గుతున్న ఘడియలలో ఒక్కసారైనా రాహుల్ సానుభూతిని ప్రకటించగలిగాడా? ఇవాళ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను సుప్రీంకోర్టు హెచ్చరికలను సహితం లెక్క చేయకుండా స్వార్థ రాజకీయాలకు బీజేపీ పాలకవర్గం వినియోగిస్తున్న తీరు అభ్యంతరకరమే కాదు, పరమ హాస్యాస్పదం! ‘ఉపా’ చట్టాన్ని తమ మనుగడకు బీజేపీ పాల కులు ‘ఉపాహారం’గా మలుచుకోవడం దారుణ పరిణామం! ప్రస్తుత సుప్రీంకోర్టు చైతన్యంతో నిర్ణయాలు చేస్తూండటం ఒక్కటే జస్టిస్ బ్రాండీస్ సంప్రదాయానికి నేడూ, రేపూ ‘శ్రీరామరక్ష’గా భావించాలి! ఇంతకూ మనం కనీసం కోరుకోదగిందల్లా – సుప్రీంకోర్టు అధికారాలను ఇజ్రాయెల్ పార్లమెంట్ తగ్గించినట్టుగా 2024 ఎన్నికలకు ముందే అలాంటి పరిణామం భారత్‌లో రాకూడదనే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
విమర్శ ప్రాధాన్యం మరిచారా?
కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోదీ ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతికఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు’’ అన్నారు. మీడియా విమర్శనాత్మకంగా ఉండకపోతే ప్రభుత్వంలో భయం పోయి దేశానికి తీవ్ర నష్టం జరుగు తుందన్నారు. చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. కొంతమంది మంత్రులు మోదీ మాటల్ని మర్చిపోయారు. విమర్శకులను జాతి వ్యతిరేకులు అని నిందిస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. సాక్షాత్తూ తన ప్రభుత్వాన్ని విమర్శించ డానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రధాన మంత్రే చెప్పిన మాటలు ఎంతమందికి గుర్తున్నాయో నాకు తెలీదు. ఆయన ప్రకటనలోని విషయం మాత్రమే కాదు, ఆయన జాగ్రత్తగా వాడిన పదాలు కూడా. ఆ ప్రసంగ వీడియోలోని క్లిప్‌ను ప్రదర్శించినట్లయితే, ప్రధాని ప్రసంగంలోని ధాటిని కూడా మీరు గమనిస్తారు. ఆ మూడింటినీ కలిపిచూస్తే, ఆయన చెప్పిన మాటల్ని సరిగ్గా అలాగే ఉద్దేశించారని మనల్ని స్పష్టంగా నమ్మమని అన్నట్లుగా ఉంటాయి. ప్రధాని పదవిని చేపట్టిన రెండేళ్ల తర్వాత, అంటే 2016 సెప్టెంబర్‌లో ‘నెట్వర్క్ 18’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ అన్నారు: ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతి కఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు.’’ భయం ఉండాల్సిన అవసరం మొదటగా ఆ పదాల ఎంపికను గమనించండి. ‘కఠినాతి కఠినమైన’ విశ్లేషణ, విమర్శ. మృదువైన, సూక్ష్మ కాదు. పరుషంగా, దాపరికం లేకుండా, శక్తిమంతంగా! రెండవది, ప్రభుత్వ పనిని మాత్రమే కాదు, ప్రభుత్వాన్నే విమర్శించి, విశ్లేషించాలి. మోదీ వీటిని ప్రత్యేక అంశాలుగా పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వక విభజన. మోదీ మరింత ముందుకెళ్లారు. అంతే సమానమైన, శక్తిమంతమైన పదాలతో ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించడంలో మీడియా విఫలమైతే రాదగిన నిర్దేశిత ఫలితమేమిటో చెప్పారు. ‘‘ప్రభుత్వంలో తేవాల్సిన మెరుగుదల, ప్రభుత్వంలో ఉండి తీరాల్సిన భయం లేకుండాపోతాయి. ఒకవేళ ఆ భయం ప్రభుత్వంలో అదృశ్యమైతే, దేశం ఘోరంగా దెబ్బతింటుంది. అందువల్లే మీడియా అత్యంత విమర్శ నాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’’. అంటే, ప్రభుత్వాన్ని భయపడుతున్న స్థితిలోనే ఉంచాలని ప్రధాని కోరుకుంటున్నారు. ఆయన ‘భయం’ అనేమాటను అను కోకుండా ఉపయోగించలేదు. చెప్పాలంటే, ఆ పదాన్ని ఆయన మూడుసార్లు వాడారు. ప్రభుత్వం భయపడటం మానేస్తే ఏం జరుగుతుందో గమనించండి– దేశానికి తీవ్ర నష్టం! జాతి వ్యతిరేకులా? ఇతర ప్రజాస్వామిక నేతలు విమర్శ అవసరం గురించి ఈ స్థాయిలో చెప్పి ఉంటారా అని నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. పైగా మోదీ ప్రభుత్వాలను అని బహువచనంలో మాట్లాడలేదు. ప్రత్యేకించి తన సొంత ప్రభుత్వం గురించే మాట్లాడారు. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు పునరుల్లేఖించాను? మామూలు కారణం ఏమిటంటే, కొంతమంది మంత్రులు దాన్ని మర్చిపోయారు లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరించేశారు. అందుకు నేను అనేక ఉదాహరణలు ఇవ్వగలను. కానీ రెండింటికి మాత్రమే పరిమిత మవుతాను. కొంతమంది రిటైరైన న్యాయమూర్తులు ‘భారత వ్యతిరేక గ్యాంగ్’లో భాగమయ్యారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఎందుకంటే ఈ న్యాయమూర్తులు పాల్గొన్న ఒక సెమినార్లో– మోదీ ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తుల గురించిన విశ్లేషణను ప్రొఫెసర్ మోహన్ గోపాల్ సమర్పిస్తూ, వారిలో 15 శాతంమంది మతరాజ్య వ్యవస్థకు తప్ప రాజ్యాంగబద్ధ న్యాయ మూర్తులాగా లేరని పేర్కొన్నారు. మోదీ ప్రకటన సరిగ్గా ఇదే మాట్లాడుతోందని న్యాయమంత్రి గుర్తించడం లేదా? అయినప్పటికీ ఆయన దాన్ని ‘భారత వ్యతిరేకం’ అన్నారు. న్యాయమూర్తులు దీనికి ‘తగిన మూల్యం’ చెల్లిస్తారని హెచ్చరించారు కూడా! చతురత లేకపోతే... నా రెండో ఉదాహరణ – ఉప రాష్ట్రపతికి సంబంధించినది. ఆయన మోదీ ప్రభుత్వంలో సభ్యుడు కాదు. ఆయన స్థానం ఆయన్ని మించినది. కానీ ‘మేధావర్గం, మీడియా జనాల’ గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించి చూపడానికి భారత వ్యతిరేక శక్తులు హానికరమైన కథనాలను అల్లుతున్నాయి. మన క్రియాత్మక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు కళంకం తెస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఇంటర్వ్యూలోని విష యాలు తనకు కూడా వర్తిస్తాయని ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు. ‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించాలని చూస్తున్నవారు’’ మన స్థూలదేశీయోత్పత్తి యథార్థతను ప్రశ్నిస్తున్నారు. ‘‘మన క్రియాత్మక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను’’ కళంకపరుస్తున్నవారు పార్లమెంటు, ఎన్నికల కమిషన్, మన భద్రతా సంస్థల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విమర్శను కేవలం స్వాగతించడం కాదు, ఇది అవసరమే అని మోదీ చెప్పారు. ప్రభుత్వ విమర్శలకు జవాబు ఇవ్వాల్సిన కేంద్ర మంత్రులూ, బీజేపీ అధికార ప్రతినిధులూ ప్రధానమంత్రి వివేకవంతమైన మాటలను కంఠతా పట్టాల్సి ఉంది. నన్ను మరో అంశాన్ని కూడా చేర్చనివ్వండి. విమర్శను ఎదుర్కొన్నప్పుడు చిరునవ్వుతో వినాలి, హుందాగా స్పందించాలి. అప్పుడు ఆ విమర్శ వెంటనే వీగిపోతుంది. అలా కాకుండా విమర్శతో ఘర్షించడం, ఇంకా ఘోరంగా విమర్శకు లను జాతి వ్యతిరేకులు అని నిందించడం చేస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, చతురతతో వ్యవహరించు, రాజకీయం చేయవద్దు! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్ని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రతో వస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీ అరెస్టు తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం విపక్షాలన్ని ఆందోళనకు దిగాయి. ఈ మేరకు ఈ అంశంపైనే శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయల సభల్లో ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనలు చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు..విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్వైపుకు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టాయి. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతి లేదంటూ వారిని అదుపులో తీసుకున్నారు. దీంతో విజయ్ చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదీగాక గత కొంతకాలంగా అదానీ హిండెన్‌బర్గ్ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడమే గాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని కోరుతున్నాయి. ఐతే దీనిపై పార్లమెంట్లో చర్చ జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విపక్ష ఆరోపిస్తున్నాయి. పైగా దీని నుంచి దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌పై అరెస్టు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. Democracy in danger.. We stand in support with #RahulGandhi.pic.twitter.com/848QlEQcVt — WB Youth Congress (@IYCWestBengal) March 24, 2023 (చదవండి: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్) -
కొలీజియమే అత్యుత్తమం: సీజేఐ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పరిపూర్ణమూ, లోపరహితమూ కాజాలదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక వ్యవస్థ అయిన కొలీజియాన్ని గట్టిగా సమర్థించారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియం వ్యవస్థ తీవ్ర విభేదాలకు కారణంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఇండియాటుడే సదస్సులో సీజేఐ మాట్లాడుతూ కొలీజియంను అత్యుత్తమ వ్యవస్థగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా కాపాడుకోవాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడే అది స్వతంత్రంగా పని చేయగలుగుతుందన్నారు. కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు ఆమోదం తెలపకపోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను కొలీజియం బయట పెట్టడంపై కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ‘‘వీటిపై న్యాయ మంత్రితో చర్చకు దిగదలచుకోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం’’ అన్నారు. అయితే కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో గత 23 ఏళ్లలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదన్నారు. అలాగే న్యాయమూర్తుల లైంగిక ప్రవృత్తికి, వారి సామర్థ్యానికి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొలీజియం సిఫార్సు చేసిన వారిలో కొందరు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకోవడం తెలిసిందే. -
భారత ప్రజాస్వామ్యం గురించి లండన్‌లో ప్రశ్నలా? రాహుల్‌కు మోదీ చురకలు
బెంగళూరు: భారత ప్రజాస్వామ్వం గురించి కొందరు లండన్‌లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. కర్ణాటక హుబ్బళ్లి- ధార్వాడ్‌లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసన అనంతరం ర్యాలీలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. భారత ప్రజాస్వామ్యం గురించి కొందరు లండన్‌లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం. కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి తరచూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ శక్తి భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు హాని తలపెట్టలేదు. కానీ కొందరు దాన్ని రేవులో నిలబెడుతున్నారు.' అని మోదీ ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫాంకు శంకుస్థాపన చేశారు. హుబ్బళ్లిలోని శ్రీ సిద్ధారుదలో 1.5కిలోమీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాం అరుదైన గుర్తింపు పొందింది. గతవారం లండన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత పార్లమెంటులో విపక్ష సభ్యుల మైకులు ఆఫ్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ రాహుల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చదవండి: విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు -
Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!
ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అతి దీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందింది. దీని రచనను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రభుత్వ సంస్థల విధులను గుర్తించేలా నిర్దేశించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులనూ నిర్దేశించింది. రాజ్యాంగమే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేది. అదే ప్రభుత్వం, పౌరుల మధ్య... నమ్మకం, సమన్వయాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం భారత పౌరుని ప్రాథమిక విధుల్లో ఒకటి. అప్పుడే సార్వభౌమ గణతంత్ర సభ్యునిగా, భారతదేశంలోని ప్రతి పౌరుడూ ప్రతిరోజూ వినియోగించుకోవలసిన రాజ్యాంగ హక్కులను పొందుతాడు. ప్రతి పౌరుడి అభివృద్ధి అతని హక్కులు, విధులపై అతనికి ఉన్న అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశ రాజ్యాంగం అయినా దేశ ప్రగతి కోసం మంచి పాలన, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం జరిగిన ఈ 72 సంవత్సరాల పాలనా కాలంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాం. తయారీ రంగంలో 30వ ర్యాంకులో ఉన్నాం. ఇక వివిధ ఆహార ధాన్యాల, తృణధాన్యాల ఉత్పత్తిలో మనం మొదటి 5 స్థానాన్ని ఆక్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం 20 శాతం పేదరికంలోనే ఉన్నాం. 12 శాతం నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. విపరీతమైన ఆదాయ అసమానతలూ ఉన్నాయి. వివిధ ప్రపంచ సూచికలలో మనం ఆందోళనకరమైన స్థానాల్లో ఉన్నాం. ఉదాహరణకు ఉగ్రవాద సూచికలో 8వ స్థానం, అవినీతిలో 28వ ర్యాంక్, హ్యాపీ ఇండెక్స్‌లో 44 ర్యాంక్‌లో ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం – రెండింటి కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు చాలానే ఉన్నా ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే విధానాలు ఉత్తమమైనవే కానీ వాటి అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అధిగమించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు వంటి ఇటీవలి విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన సృష్టించాయి. అయితే ఈ సమస్యలన్నీ తగిన రాజ్యాంగ సవరణలతో పరిష్కరించబడతాయి. సానుకూల ఫలితాలను, సమాజ అభ్యున్నతికి హామీ ఇచ్చే విధానాలను సులభంగా స్థాపించగలిగే విధంగా మన చట్టాలను సవరించడం కొనసాగించాలి. రాజ్యాంగాన్ని సముచితంగా అమలు చేయడానికి రాజకీయ రంగంలో, కార్యనిర్వాహక యంత్రాంగంలో నైతిక విలువలు ఉండాలి. ప్రజలు అవసరమైన చోట ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రతి పౌరుడూ ఇతరుల హక్కులను గౌరవించాలి. చట్టబద్ధంగా, నైతికంగా తన విధులను నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సారాన్ని ఆస్వాదించగలరు. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్) – డాక్టర్ పి.ఎస్. చారి, మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
National Voters Day 2023: ప్రజల చేతిలోని పాశుపతాస్త్రం
ఈ రోజు భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జనవరి 25ను జరుపు కొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా భారత పౌరులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడమే. ఎన్నిల సంఘం (ఈసీ) పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వతమైన స్వయంప్రతిపత్తి గల కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి ప్రతీక. ఈసీ నిష్పాక్షికత, విశ్వసనీయత ఆధారంగా ఇప్పటివరకు 17 లోక్‌సభ ఎన్నికలు; రాష్ట్రపతి ఎన్నికలు 16 సార్లు, అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. అలాగే 399 సార్లు శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. 400వ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలావరకు రాజకీయపార్టీల, ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల సంఘం చూరగొన్నదనే చెప్పాలి. పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. అదే సమయంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ‘మనం విధులను నిర్వర్తించ కుండా వదిలేస్తే, హక్కుల కోసం పరుగు తీయాల్సి ఉంటుంది. అవి మనల్ని ఇష్టానుసారంగా తప్పించుకుంటాయి’ అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తు కొస్తున్నాయి. 94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. యువత లోనూ, పట్టణ ఓటర్లలోనూ ఉన్న ఉదాసీనత; బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వలసపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇంతమంది ఓటింగ్‌లో పాల్గొనలేదని చెప్పవచ్చు. 2022 నవంబర్ 5న హిమాచల్‌ప్రదేశ్ కల్పాలో మరణించిన మొట్టమొదటి భారత ఓటర్ శ్యామ్ శరణ్ నేగీకి నివాళులు అర్పించే గౌరవం నాకు లభించింది. ఆయన తన 106వ ఏట మరణించే ముందు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటు వేయకుండా ఉండే ఉదాసీన పౌరులకు తమ విధి ఏమిటో తెలియచేశారు. ఆయన స్ఫూర్తిని అందరూ అందుకోవాలి. యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపుదిద్దబోతోంది. అందువల్ల ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలోనే ప్రజాస్వామ్య బీజం విద్యార్థుల్లో నాటడం అత్యంత క్లిష్టమైనదే కాదు, ముఖ్యమైనది కూడా. ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఈ కారణంగానే అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి వార్తాపత్రికల్లో తెలియ జేయాలి. ఇప్పటికీ ఎన్నికల్లో కండబలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరి కట్టడం పెద్ద సవాల్‌గా మిగిలిపోయింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది. అందులో నకిలీ వార్తల ప్రచారం జరగకుండా చూడాల్సి ఉంది. ఎన్నికలను అన్ని జాగ్రత్తలతో నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. ఎన్నికల ప్రక్రియలో ఓటరే ప్రధాన భాగస్వామి. అందుకే ఓటు వేయడానికి కావలసిన స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా ఈసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధమై ఉంది. పౌరులు ఓటరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. పౌరు లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు! (క్లిక్ చేయండి: నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య) - రాజీవ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం) -
బైడెన్ బెంబేలు.. ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా?
అమెరికాలో ఏకంగా ఆ దేశ అద్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదికారులు సోదాలు జరిపినట్లు వచ్చిన వార్త సంచలనాత్మకమైనదే. ప్రజాస్వామ్యంలో ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా, తప్పు చేస్తే తత్పరిణామాలను ఎదుర్కోవలసిందేనని అమెరికా అనుభవం చెబుతుంది. బైడెన్ ఇంటిలో సోదాలు ఏకంగా 13 గంటల పాటు జరిగాయి. అందులో ఆరు రహస్య ఫైళ్లు దొరికాయట. గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఉంచుకున్న ఆ ఫైళ్లు పదవి పోయిన వెంటనే ఆర్కివ్స్ కు పంపించవలసి ఉండగా, ఇంటిలోనే ఉంచుకోవడం వివాదాస్పదం అయింది. అది ఆయన అధ్యక్ష స్థానంలోకి వచ్చాక వెలుగులోకి రావడం విశేషం. మరో వైపు ఆయన కుమారుడి వ్యాపార లావాదేవీలపై కూడా విమర్శలు వస్తున్నాయి. అది వేరే సంగతి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే మన భారత దేశం అమెరికాకన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం. కాని ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్నవారి జోలికి తప్పనిసరి అయితే తప్ప సంబంధిత దర్యాప్తు సంస్థలు వెళ్లవు. ఒకవేళ వెళ్లినా అది మొక్కుబడిగానే ఉంటుందని చెప్పనవసరం లేదు. అదే ప్రతిపక్షానికి చెందినవారైతే దర్యాప్తు సంస్థలు జోరుగా విచారణకు వెళతాయన్న అభిప్రాయం ఉంది. అందుకే కేంద్రంలో అదికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీలకు చెందినవారు చేరుతుంటారు. అలాకాకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో యుపీఏ టైమ్‌లో శక్తిమంతమైన నేతగా ఉన్న సోనియాగాంధీని ఆ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఎదిరించారు. సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. అంతే! సోనియాగాంధీకి కోపం వచ్చింది. ఏపిలో ప్రతిపక్షపార్టీ అయిన తెలుగుదేశంతో కుమ్మక్కై మరీ జగన్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అదే టైమ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికి న్యాయ వ్యవస్థ కూడా ముందుకు రాకపోవడం గమనించవలసిన అంశం. 2014లో చంద్రబాబు అదికారంలోకి వచ్చాక తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆయనను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ సీఎం కేసీఆర్ అనేవారు. కాని కేంద్రంలోని ఎన్.డి.ఎ.లో భాగస్వామిగా టీడీపీ ఉండడంతో చంద్రబాబుకు కేంద్రంలోని కొందరు పెద్దలు రక్షణగా నిలబడ్డారు. అదే సమయంలో కొన్ని వ్యవస్థలలోని వారిని కూడా మేనేజ్ చేయగలిగారని చెబుతారు. ఏదైతేనేమీ ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యారు. ఆ తరుణంలో సీబీఐపై ఆయన ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిందే. బీజేపీ వారు తనపై కేసు పెట్టబోతున్నారని, ప్రజలంతా వచ్చి తనకు అండగా ఉండాలని కోరేవారు. అసలు సీబీఐని ఏపీలోకి రాకుండా ఆంక్షలు పెట్టారు. తర్వాత 2019లో ఆయన అధికారం కోల్పోయారు. తదుపరి ఆదాయపన్ను శాఖ చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడి ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల విలువైన అక్రమాలకు ఆధారాలు దొరికాయని ప్రకటించింది. కానీ చంద్రబాబు తన వైఖరి మార్చుకుని బీజేపీని ఒక్క మాట అనకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎవరూ తన జోలికి రాకుండా కేంద్రాన్ని మేనేజ్ చేసుకోగలిగారని చాలామంది భావిస్తుంటారు. అంతేకాదు. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిలో ఇద్దరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఐటీ, ఈడీ వంటి సంస్థలు దాడులు చేశాయి. ఒకాయన అయితే ఏకంగా ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయిపడ్డారు. అయినా ఆయన బీజేపీలో చేరాక దర్యాప్తు సంస్థలు మరీ అంత సీరియస్‌గా వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది. మరో వైపు బీజేపీ అంటే పడని పార్టీల నేతలపై సీబీఐ పలుమార్లు దాడులు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏకంగా జైలుకు వెళ్లవలసి వచ్చింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై సీబీఐ అధికారులు జరిపిన దాడులు సంచలనమే. పశ్చిమబెంగాల్ లో ఒక మంత్రి వద్ద రూ.45 కోట్లు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీపై మరీ అంత గట్టిగా ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెపైనే ఈడి ఆరోపణలు చేయడం, దానిని బీఆర్ఎస్ నేతలు ఖండించడం జరిగింది. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ఊబిలో దిగబడుతున్నాయన్న భావన ఉంది. మరి అమెరికాలో అధ్యక్ష స్థానంలో ఉన్న నేత ఇంటిలోనే ఎఫ్‌బీఐ సోదాలు జరిపితే మన దేశంలో మాత్రం ఒక్కొక్కరిపట్ల ఒక్కో రకంగా ప్రమాణాలు పాటిస్తున్నాయన్న అభిప్రాయం ఉండడంలో తప్పులేదేమో! -హితైషి -
అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా?
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే చారిత్రాత్మక వేదికగా ఖమ్మం సిద్ధమైంది. ఒకనాడు ఎర్రకొండగా ఉన్న స్తంభాద్రి ఇప్పుడు ఎర్రకోటపై ప్రజల అజెండాను ఎగుర వేసే ఒక మహాశక్తికి శంఖారావ క్షేత్రం అవుతోంది. బీఆర్ఎస్ ఒక మహోన్నత సమాజ నిర్మాణం వైపు అడుగులు వేస్తూ సృజనాత్మక మార్పుకు నడుంబిగించే సభకు ఖమ్మం గుమ్మం స్వాగతం పలుకుతోంది. దేశం అన్ని రంగాల్లో దివాళా తీసింది. ఎంతో స్ఫూర్తితో నిర్మించుకున్న ప్రభుత్వ రంగం కొడిగట్టే దీపమవుతోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్న తరుణంలో ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ గొంతు విప్పబోతుంది. ఎమర్జెన్సీ తర్వాత అన్ని ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ వెంట దేశం నడిచింది. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణకు లెఫ్ట్, రైట్లందరూ కలిసి నడిచారు. ఇవ్వాళ కూడా కేంద్రంలో పెద్దలు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును చాటిచెబుతూ దేశంలోని ప్రజాస్వామిక శక్తులందర్నీ కూడగట్టవలసిన అవసరం ఉంది. దేశానికి అత్యవసరమైన ఆర్థిక విధానాలను రచించుకోవాలి. 2014 నుంచి దేశం ఉత్పత్తిని పెంచుకోవటంలో పూర్తిగా వెనుకడుగు వేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ ఆస్తులను మాత్రం తెగనమ్మటంలో ముందుంది. తక్షణం ఈ అమ్మకాల నుంచి దేశాన్ని కాపాడాలి. సహజ వనరులను, అడవి సంపదలను గుత్తకు అప్పజెబుతున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి యువతను ఉత్పత్తి రంగంలో ఎక్కువగా వాడుకోవాలి. భారీగా పెరిగిపోయిన ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు జరపాలి. అంబేడ్కర్ పేరు జెప్పి ఆయన ఆశయాలను నిర్వీర్యం చేస్తున్న తీరును ఎత్తి చూపాలి. ఒక కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్నీ, ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్నీ రెచ్చగొట్టి విద్వేష భారతాన్ని రచిస్తున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. భారత గడ్డపై పుట్టిన వాళ్లనే పరాయి వాళ్లను చేస్తున్న తీరు ప్రమాదకరమైనది. దేశభక్తి కావాలి కానీ విద్వేషభక్తి ఉండకూడదు. ఒక్క భాషపైననే ప్రేమకాకుండా దేశ ప్రజలు మాట్లాడే అన్ని భాషలపై ప్రేమ ఉండాలి. ఇతరులపై గుడ్డి ద్వేషాన్ని పెంచే భావజాలం ఏదైనా అది విషాన్ని నింపటం కంటే ప్రమాదకరమైనది. చివరకు పాఠ్యప్రణాళికల్లో కూడా మతభావనలు చూపించే దశకు పోవటం అన్యాయమని ఎవరైనా అడిగితే వారిని జాతివ్యతిరేకి అంటున్నారు. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థలను పరిరక్షించకపోతే దేశం కుప్పకూలుతుంది. మహాత్మాగాంధీ, జ్యోతిబాఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా? దేశాన్ని సంపన్న భారతం చేయమంటే వలసల భారతంగా మార్చేశారు. వారి దుందుడుకు విధానాల పట్ల మొత్తం జాతిని మేల్కొలిపి ముందుకు నడిపించటానికే ఖమ్మం వేదికగా ప్రజల అజెండాకు రూపకల్పన జరుగుతోంది. కమండలాలకు సరైన సమాధానం చెప్పి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపిన లల్లూప్రసాద్ యాదవ్‌లాగా, ములాయంసింగ్ యాదవ్‌లాగా, ఒక వీపీసింగ్ లాగా దేశంలోని వలస భారతానికి ధైర్యం చెప్పే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది. తమకు అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతీ, తమకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలపైన కక్షకట్టే రాజకీయాలూ పోవాలి. తమకు అను కూలురైన సీఎంలు లేకపోతే గవర్నర్‌తో పాలి స్తామనే సంస్కృతి ఫెడరల్ వ్యవస్థను పెను ప్రమాదంలో పడవేస్తుంది. సంప్రదాయాల్లోకి, విశ్వాసాల్లోకి, నమ్మకాల్లోకి, మతాల్లోకి, కులాల్లోకి, గనుల్లోకి, గుడుల్లోకి, బడుల్లోకి, వనాల్లోకి, అడవుల్లోకి మన ఇంటి గడపల్లోకి, మంది మెదడుల్లోకి అన్నిట్లోకి తమ పాత భావాలను, ఛాంద సత్వాన్ని చొప్పించి ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని అవహేళన చేస్తున్నారు. ఎవరు తమను ప్రశ్నించినా ఈడీలు, బేడీలు వేస్తున్నారు. అన్ని వ్యవస్థలూ కళ్లముందే ధ్వంసం అవుతున్నప్పుడు ఇదేమి న్యాయమని అడిగితే నేరుగా జైలుకే పంపించేస్తున్నారు. ఇది ఫాసిజం కంటే ప్రమాదకమైనది. ఇపుడు తక్షణంగా దేశాన్ని రక్షించుకునేందుకు దేశభక్తియుత ఉద్యమాలు రావాలి. అటువంటి ఉద్యమాన్నే కేసీఆర్ ఖమ్మం వేదికగా ప్రారంభి స్తున్నారు. ఆ ఉద్యమంలో దేశ ప్రజ అంతా భాగం కావాలి. (క్లిక్ చేయండి: జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట) - జూలూరి గౌరీశంకర్ ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ (జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ జనగర్జన) -
రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్
చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్పీచ్‌లు చూసి కొందరు భయంతో వణికిపోతున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు చూస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుకు వస్తున్నారని కొనియాడారు. నేహ్రూ, గాంధీల వారసులు మాట్లాడుతుంటే గాడ్సే భక్తులకు మండుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తన స్పీచ్‌లలో ఎన్నికలపరమైన రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, సిద్ధాంతపరమైన రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రసంగాలు చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది అని స్టాలిన్ అన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను అమ్మెస్తోందని, పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడటానికి కూడా అనుమతించకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా బలగాల ఘర్షణ విషయంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ నిరాకరించింది. సభ్యులు సభలో ఆందోళనలు చేయడంతో రోజూ వాయిదాల పర్వాన్నే కొనసాగించింది. ఈ నేథ్యంలోనే శీతాకాల సమావేశాలను ఆరు రోజులు ముందుగానే ముగించింది. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! -
ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వం...బైడెన్‌కి చైనా కౌంటర్
అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు జోబైడెన్ ప్రస్తుత ప్రపంచ రాజకీయా స్థితిని విషతుల్యంగా ఉన్నాయని తరచుగా చెబుతుంటారు. ఇలాంటి స్థితిలో ప్రజలకు ప్రజావస్వామ్య వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థలలో ఏదో ఒకటి ఎన్నుకునే సందిగ్ధ స్థిత ఏర్పడటమో లేదా ప్రపంచాన్ని పూర్తిగా మార్చే ఆవశ్యకతను గుర్తించడమో జరుగుతుందన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు నాయకుడిగా జీవితాంతం ఉండాలని యోచిస్తున్నాడంటూ ఆందోళన లేవనెత్తారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వంగా పిలిచే కథనం నేటి ప్రంపచాన్ని నిర్వచించలేకపోవచ్చు కానీ కాలపు ధోరణిని మాత్రం సూచిస్తుందని బైడెన్‌తో అన్నారు. అలాగే తమ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, మానవాళి తదితరాలు గురించి సదా అన్వేషిస్తోందని చెప్పారు. అలాగే అమెరికాలో అమెరికా స్టైల్లో చైనాలో చైనీస్ స్ట్రైల్లో ప్రజాస్వామ్యం ఉంటుందని బైడెన్‌కి గట్టి కౌంటరిచ్చారు జిన్‌పింగ్. ఐతే మానవహక్కుల సంఘాలు, పాశ్చాత్య నాయకులు, విద్యావేత్తలు జిన్‌పింగ్‌ని నియంతృత్వం అని పిలిచే చైనీస్ పార్టీకి నాయకుడని విమర్శిస్తారు. చైనాలో స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛ మీడియాతో సహా జాతీయ కార్యాలయానికి సార్వత్రిక ఓటు హక్కు లేదని, పైగా పార్టీ విమర్శకులు ఆన్లైన్ సెన్సార్ చేయబడటం లేదా ఆఫ్‌లైన్‌లో నిర్బంధించబడటం వంటివి జరుగుతాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జో బెడెన్ ఈ అంశాలపై వర్చువల్ సదస్సు కోసం సుమారు 100 మంది ప్రపంచ నాయకులను ఆహ్వనించారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యాన్ని స్వాగితిద్దామా? లేదా మనమంతా ఒకే విజన్‌ని కిలిగి ఉందామా అని నాయకులకు పిలుపునిచ్చారు. ఆ సదస్సులో మానవ పురోగతి, మావన స్వేచ్ఛను ముందుకు నడిపించలా వద్దా అనే దానిపై ప్రసంగించారు. ఐతే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి ఆహ్వానించకపోవడంతో దీన్ని విభజన అంటూ కామెంట్లు చేసింది చైనా. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ 2021 చివరిలో ముప్పులో ఉన్న ప్రజాస్వామ్య దేశాల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: అమెరికా సెనేట్‌పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు) -
న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించడం చిన్న విషయమేమీ కాదని.. ఇలాంటి పద్ధతులు కొనసాగితే దేశంలో ఉద్రిక్తతలు, హింస తలెత్తి.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్మార్గాలను అడ్డుకునేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు చావాల్సి వస్తే.. అందుకు సిద్ధమని, ప్రాణాలు ఇచ్చి పోరాడుతామని ప్రకటించారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని సింగిల్ కేసుగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం సహా దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, సంస్థలకు ఆధారాలు పంపిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ఘటనపై సీఎం కేసీఆర్ తొలిసారిగా అధికారికంగా స్పందించారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజానికి రెండు రోజుల క్రితమే మీడియా ముందుకు రావాలనుకున్నానని.. కానీ మునుగోడు ఉప ఎన్నికలో లాభం కోసం చేశారనే చిల్లర ఆరోపణలు వస్తాయనే ఉద్దేశంతో పోలింగ్ ముగిసే వరకు వేచి చూశానని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మొదటిసారి భారమైన మనసుతో, దుఃఖంతో చెప్తున్నా.. పదవులున్నా లేకున్నా 40, 50 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న అనుభవంతో చెప్తున్నా. ఈ దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దేశంలో దుర్మార్గంగా, నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా ప్రజాస్వామ్య హత్య జరుగుతోంది. ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం దేశ పునాదులకే ప్రమాదకరం. ఊహకు కూడా అందే పరిస్థితి లేనందునే షాక్‌తో మాట్లాడుతున్నా. న్యాయవ్యవస్థకు చేతులు జోడిస్తున్నా.. గతంలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినపుడు న్యాయవ్యవస్థ గొప్ప పాత్ర పోషించింది. ఇప్పుడు దేశం ప్రమాదంలోకి వెళ్లకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లను చేతులు జోడించి కోరుతున్నాను. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆధారాలను దేశంలోని సీబీఐ, ఈడీ, సీవీసీతోపాటు అన్ని ప్రముఖ జాతీయ, మీడియా సంస్థలకు శుక్రవారం మధ్యాహ్నంలోగా చేరవేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధ్యక్షులకు కూడా పంపిస్తున్నాం. రాజ్యాంగేతర శక్తుల చేతిలో దేశం కర్ణాటక ఎమ్మెల్యేలకు మారువేషాలు వేసి తీసుకెళ్లిన తీరును నిందితులు పూసగుచ్చినట్టు చెప్పారు. ఈవీఎంలు ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదని చెప్పారు. భారతదేశం రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ఉన్నట్టు వీరి మాటల ద్వారా వెల్లడవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఉన్న దొంగల ముఠా వీర విహారాన్ని అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చెదలను నిర్మూలించాల్సి ఉంది. మన రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా. నెల రోజుల ముందు నుంచే రామచంద్రభారతి అనే వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో మొదట ఫోన్లో, తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడటంతో వాళ్ల ప్రణాళిక అర్థమైంది. విచారణ జరపాలని హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముఠాలోని వారికి రెండు మూడు ఆధార్లు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఈడీ, ఐటీ సంస్థలతోపాటు వై ప్లస్ భద్రత కల్పిస్తామని రాజ్యాంగేతర శక్తులు చెప్పడం చూస్తే దేశంలో ఏం జరుగుతోందో అర్థమవుతుంది. ఈ ముఠాలో 24 మంది ఉండగా వారందరికీ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి రెండు మూడు ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరు వివరాలు ఉన్నాయి. కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ మీద బీజేపీ టికెట్‌తో పోటీ చేసిన తుషార్ అనే వ్యక్తితో బ్రోకర్లు మాట్లాడారు. తుషార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే. ఈ దురాఘాతాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి ఎనిమిదేళ్లలో బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. దేశాన్ని విభజించేలా క్రూర పద్ధతుల్లో ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను చూసి బాధపడుతున్నా. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చి బలహీనపర్చే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ దేశంలో జరుగుతున్న ఈ దురాఘాతాలను తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత నాటి ప్రధాని ఇందిరకు ఎదురేలేదని భావిస్తున్న తరుణంలో ఎమర్జెన్సీ విధింపు, ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమంలో ప్రజలు ఎలా స్పందించారో తెలుసు. ఏళ్లపాటు నిర్బంధం ఎదుర్కొన్న మాలవ్యా, పాశ్వాన్, దండావతే వంటి నేతలు లక్షల మెజారిటీతో గెలిచారు. తద్వారా ప్రజాస్వామ్యానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమని ప్రజలు నిరూపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం మేం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే విలీనం చేసుకున్నాం. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వచ్చారు. కానీ కొందరు మునుగోడు ఉప ఎన్నికలో వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నన్ను కలిశారనే ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజాతీర్పును గౌరవించాలి. ఎన్నికల సంఘం, సీఈవో ఫెయిల్ అంటూ కొందరు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో మేం అనేక ఎన్నికల్లో పోటీ చేసినా ఇంత హేయంగా ఎన్నడూ మాట్లాడలేదు. ప్రజాస్వామ్య మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు మీడియా పట్ల కూడా వారికి గౌరవం లేదు.’’ చూస్తూ ఊరుకోబోం మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని చెప్పి మా రాజధానిలో వ్యవహారం చేస్తే చేతులు ముడుచుకుని కూర్చుని, అరాచకాలను భరించాలా? చూస్తూ ఊరుకోబోం.. పోరాడుతాం. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం. ఎమ్మెల్యేలను కొనడానికి అసలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడాం. నాలుగింట మూడింతల మెజారిటీ ఉన్న ప్రభుత్వాలను ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూల్చేయాలనే కుటిల రాజకీయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. మోదీ.. ఈ దుర్మార్గాలను ఆపండి ప్రధాని మోదీ గారూ.. నేను మీ రాజకీయ సహచరుడిని. మీరు ప్రధానమంత్రి అయినప్పుడే నేను ముఖ్యమంత్రిని. ఎనిమిదేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇంకేం కావాలి? మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకోండి. చరిత్రలో గుర్తింపు పొందండి. స్వయంగా అడుగు ముందుకేసి ఈ దుర్మార్గంలో పాత్ర కలిగిన వారందరినీ అరెస్టు చేయించండి. దర్యాప్తు చేయించండి. అలాకాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ద్వారా, ప్రభుత్వాలను కూల్చడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ దుర్మార్గాలను ఆపండి. ఇలా చేయడం దేశానికి, మీకు మంచిది కాదు. దేశచరిత్రలో మీ స్థానం దిగజారిపోతుంది. ఎంత శక్తివంతుడైనా వందేళ్లకు మించి బతకరు. ఎందుకు చెడ్డ పనులు చేయాలి? దీనికి ఫుల్స్టాప్ పడాలి. పట్టపగలు మీ పేరు, మీ హోంమంత్రి పేరు చెప్పి అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి కళ్లెం వేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశానికి కళంకం తీసుకురాకండి. అమిత్‌షా పేరు 20సార్లు చెప్పారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దాగిన భయంకరమైన దగా, కుట్రలు వింటే ఆశ్చర్యం కలుగుతోంది. వారు 20సార్లు అమిత్‌షా పేరు, ఒకట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారు. రిసార్టుల్లో ఉండి ప్రభుత్వాలను కూలగొట్టానని పసుపు పచ్చ బట్టలాయన (సింహయాజీ) చెప్పారు. ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, మరో నాలుగు కూల్చే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. తెలంగాణ, ఢిల్లీలలో బేరాలు అయిపోయాయి. తర్వాత ఆంధ్ర, రాజస్థాన్‌లలో ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పారు. వెంటనే ఢిల్లీ సీఎంను అప్రమత్తం చేశాం. ఇది రాజకీయమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వాలు కూలిన చోట మౌనం పాటించారు కాబట్టే ఈ దుర్మార్గ ముఠా ఆగడాలు చెల్లుబాటయ్యాయి. కానీ చైతన్యవంతమైన తెలంగాణ ఈ ముఠా ఆట కట్టించి వారి చర్యలను బయటకు తెచ్చింది. మేధావులు, యువత మౌనం వీడాలి బీజేపీ ఒళ్లు మరిచి చేస్తున్న అరాచక కాండ జుగుప్సాకరంగా ఉంది. ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని స్వయంగా దేశ ప్రధాని చెప్పడం దేనికి సంకేతం? నెల రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దేశ హోంమంత్రి చెప్పడం ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా? దేశ ప్రజలు, యువత, మీడియా ముక్త కంఠంతో ఖండించకపోతే దేశం ఉనికి, ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతుంది. ఒకసారి దేశం దెబ్బతింటే వందేళ్లు వెనక్కి పోతుంది. మఠాధిపతులు వేషాలు, రూపాలు మార్చి దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఆ పరిస్థితులు మారాలి. రాబోయే రోజుల్లో జయప్రకాశ్ నారాయణ్ తరహాలో జరిగే ఉద్యమాలకు యువత, విద్యార్థులు, మేధావులు మౌనం వీడి మద్దతునివ్వాలి. 2015 నుంచి వారి కాల్‌డేటా తీశారు బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా పేర్లను బ్రోకర్లే చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రలోభపర్చే కుట్రలో పాల్గొన్న మధ్యవర్తుల ఫోన్లను పోలీసులు సీజ్ చేసిన తర్వాత వారి కుట్ర కోణమంతా బయటపడింది. 2015 నుంచి ఇప్పటివరకు దేశంలో ఏం జరిగిందో వీళ్ల చరిత్ర ఏందో మొత్తం బయటపడింది. పోలీసులు కాల్‌డేటాను, ల్యాప్‌టాప్‌లలోని డేటాను తీశారు. మూడు గంటల వీడియోలో కుట్ర బహిర్గతమైంది. మొత్తం డేటాను ఉన్నదున్నట్టు హైకోర్టుకు సమర్పించారు. 70వేల నుంచి 80 వేల పేజీలు అయింది. హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఇది పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్లింది. సీఎం పక్కనే ‘ఆ నలుగురు’ఎమ్మెల్యేలు ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలకమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, బి.హర్షవర్ధన్‌రెడ్డి నలుగురూ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పక్కనే కూర్చోవడం గమనార్హం. ఇక ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మునుగోడులో పోలింగ్ శాతం 90 ప్లస్ -
Anti Defection Law: మేడిపండు ప్రజాస్వామ్యం
భారత రాజ్యాంగంలో పేర్కొన్న పార్లమెంట్, శాసన సభల వ్యవస్థలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వంటివి చెప్పే ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిదని కొన్ని సంవత్సరాలుగా రుజువవు తూనే ఉంది. నేడు తెలంగాణలో ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆ కంపును మరింత వ్యాపింప చేసింది. భారత రాజ్యాంగంలో ఒక పార్టీ తరఫున చట్ట సభలకు ఎన్నికై మరొక పార్టీలోకి వెళితే అతని సభ్యత్వం రద్దు అవుతుందని మొదట్లో పేర్కొన లేదు. అందువల్ల కొందరు పార్టీలు మారి కొన్ని ప్రభుత్వాల పతనానికి కారకులయ్యారు. 1952–67 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. 1967లో లోక్‌సభతో పాటు 16 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగగా... ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, తర్వాత పార్టీ ఫిరాయింపులు చేయించి మెజారిటీ పొందింది. 1967–71 మధ్య పార్లమెంట్, శాసనసభకు ఎన్నికైన నాలుగు వేల మంది సభ్యుల్లో 2 వేల మంది పార్టీ ఫిరాయింపులు చేశారు. ఫిరాయింపుల పట్ల ప్రజల్లో అసహ్యం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1979లో తొలిసారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం ఒక పార్టీ తరఫున టికెట్టు పొంది ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడూ, పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌కు హాజరు కానప్పుడూ, విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడూ, స్వతంత్ర సభ్యులుగా ఎన్నికైన సభ్యులు ఏదైనా పార్టీలో చేరినప్పుడూ; నామినేట్ అయిన పార్లమెంట్, శాసనసభ సభ్యులు 6 నెలల్లోపు ఏదైనా పార్టీలో చేరినప్పుడూ సభ్యత్వాలు రద్దు అవుతాయి. ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసన సభ్యుల్లో 2/3 వంతుల మంది వేరే పార్టీలో చేరినప్పుడు, లేదా స్వతంత్రంగా పార్టీ పెట్టిన ప్పుడు వారి సభ్యత్వాలు రద్దు కావు. చట్టంలో ఉన్న కంతలు ఉపయోగించుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తన వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నాయి. 2016లో అరుణా చల్ప్రదేశ్లో 45 కాంగ్రెస్ సభ్యుల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రితో సహా 44 మంది సభ్యులు ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్’లో విలీనమయ్యారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇలాగే జరిగింది. తెలంగాణలోనూ 2/3 మంది కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సభ్యుల చేత రాజీనామా చేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టించి, తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 23 మంది వైసీపీ శాసనసభ్యులు రాజీనామాలు చేయకుండానే చంద్రబాబు పార్టీలో చేరి కొందరు మంత్రులయ్యారు. కర్ణాటకలో కొందరు కాంగ్రెస్ శాసన సభ్యుల చేత రాజీనామాలు చేయించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. చట్ట సభల స్పీకర్లు రాజకీయ పార్టీలు కోరినా... గీత దాటిన సభ్యులపై అనర్హత వేటు వేయడంలో పక్షపాతం చూపిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి ఎడల అనర్హత వేటు వేయకుండా పదవీ కాలం ముగిసేవరకు సభ్యునిగా కొనసాగే వైఖరిని తీసుకుని... వ్యతిరేకంగా ఉన్న సభ్యునిపై వెంటనే అనర్హత వేటు వేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తాజాగా టీఆర్ఎస్ శాసనసభ సభ్యుల కొనుగోలు వ్యవహారంలో వివాదం సాగుతోంది. పరస్పర ఆరోపణలు జగుస్సాకరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బాగా పరిఢవిల్లుతోందో అర్థమవుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలు ఉద్యమించాలి. (క్లిక్ చేయండి: కళ్లముందున్న వివక్ష కనబడదా?) - బొల్లిముంత సాంబశివరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రైతు కూలీ సంఘం (ఏపీ) -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్‌కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్‌తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి దీదీ వినతి
కోల్‌కతా: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్ కాన్వకేషన్ కార్యక్రమానికి సీజేఐ యూయూ లలిత్ హాజరైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మమత. ‘ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే, క్షమించండి.’అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఎన్‌యూజేఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు దీదీ. ఈ సందర్భంగా సీజేఐ యూయూ లలిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: ‘తప్పుచేశా.. క్షమించండి’..గుడిలో చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చిన దొంగ -
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ట్రంప్ కుట్రలు
వాషింగ్టన్: అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. ట్రంప్ మద్దతుదారుల అజెండా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని తేల్చిచెప్పారు. వారి దుశ్చర్యల వల్ల సమానత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరుల ఆటలు సాగవని హెచ్చరించారు. నాయకుడి పట్ల గుడ్డిగా విధేయత ప్రకటించడం, రాజకీయ హింసలో పాల్గొనడం వంటివి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయన్న సత్యాన్ని చరిత్ర మనకు నేర్పుతోందని బైడెన్ ఉద్ఘాటించారు. -
పదును తగ్గని యుద్ధం చేసినోళ్లం
దాడి ఒకలాగుండదు... ఒక రూపంలో ఉండదు... దాడికి పలు రూపాలు, పలు అవతారాలు! ఏ విశ్వాసాలను నమ్మకాలనైనా అడ్డుపెట్టుకుని అమాంతం దాడి చేయవచ్చు. దాడి చేయటమన్నది పథకం ప్రకారం ఆట మధ్యలో అవాంతరాలు సృష్టించి అడ్డంగా గెలవటం లాంటిది కదా! అధికారం కోసం కల్లోలాలు సృష్టించటం, అంతర్యుద్ధాలు సృష్టించటం, సమాజాన్నే రెండు ముక్కలు చేయటం, రెండు మతాల మధ్య మంట రాజేయటం, కులాల మద్య రాజకీయ కుంపట్లు పెట్టటం, పార్టీలను చీల్చటం... ఎన్ని పన్నాగాలో! ఇలాంటి వారికి కొనుగోలు శక్తి తక్కువేం కాదు... దేశాన్ని ఎన్ని రకాలుగా ప్రైవేటైజేషన్ చేయాలో అన్నీ రకాలుగా చేసేశారు. నానా అగచాట్లు పెడతారు. అరగోసలు, అర్వతిప్పలు! ఇపుడు నా దేశ ప్రజాస్వామ్యమనే సౌధం రకరకాల అధికార దాహాలతో చేసే విచ్చలవిడి దాడులతో నెర్రలు బాస్తోంది... లౌకికత్వం తనను తాను రక్షించుకోలేక... భిన్న సంస్కృతుల, భిన్న జాతుల ఐక్యతను కాపాడలేక దురాక్రమణల దాడులకు నిలువలేక తల్లడిల్లుతుంది. జాతి సంస్కృతే చిన్నాభిన్నమౌతూ ఛిద్రమైపోతుంది. ఏమి దౌష్ట్యం? ఏమి దుర్నీతి? ఏమైపోతున్నాం... ఎటుపోతున్నాం. మన దేశ దశ దిశల లక్ష్యం ఏ వైపునకు పయనిస్తుందో కదా! రాష్ట్రాలపై కేంద్రం దాడులు మాములైపోయాయి. రాష్ట్రాలను అస్థిరపరచటం మామూలు క్రీడైపోయింది. ఒక ప్రభుత్వం ఒక్క పూటలో కూలిపోయి ఎప్పుడది వన్డే క్రికెట్ మ్యాచ్ అవుతుందో తెలియదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం, వాళ్ల చేతులతో వాళ్లే కూల్చుకునేలా చేయటం షరా మామూలైన స్థితికి ప్రజలస్వామ్యం రావటం చెప్పలేని బాధ. ప్రశ్నలను జోకొట్టవచ్చనే భ్రమలు బాగా పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రశ్న నోటిని మూసేసి ప్రశ్నలను కిడ్నాప్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రశ్నలనే బెదిరిస్తూ ప్రశ్నను ప్రశ్నించకుండా ప్రశ్నల గొంతులపై సీబీఐలను పెడ్తుండ్రు. ప్రశ్నల తలలు లేవకుండా పార్టీల అంతర్గత కలహాలు రాజేస్తుండ్రు. ప్రశ్నలు పురి విప్పకుండా ప్రశ్నల గాలులను ఆపాలని చూస్తుండ్రు. ప్రశ్నించకుండా అధికార ముద్రలతో దాడులన్నీ చేస్తుండ్రు. దుర్నీతి రాజకీయాలు చేస్తున్నవాళ్లే చీకటి రోజుల గురించి మాట్లాడుతుండటమే విచిత్ర చిత్రం. ఎందుకో ఈ తెలంగాణ మట్టి ఆధిపత్యాలను ససేమిరా ఒప్పుకోలేదు. మత ఆధిపత్యాన్ని అస్సలు సహించదు. తెలంగాణ పరమత సహన లౌకికతత్వం కోరుకునే మానవీయ మహాతల్లి. తెలంగాణ అందరికోసం తపన పడే బోళాతనమున్న మహాతల్లి. ఇది సృజనాత్మకమైన నేల. సబ్బండ వర్ణాల మహా సంస్కృతిని తనువంతా నిండిన తెలంగాణ నేల ఇది. ఇదొక మానవీయ మహా సమాజం. మానవీయత మత సామరస్యం తెలంగాణ తల్లివేరు. దీన్ని పెకలించటం ఎవరితరం కాదు. మనం ఉరుముల్లా ఉరిమినోళ్లం. జన జాతర్ల మెరుపులుగా మెరిసిన వాళ్లం. పిడుగుల్లా కురిసినోళ్లం. జన జలప్రళయాలుగా పొంగి పొరలినోళ్లం. ఆవేశ ఆగ్రహాలకు ఆది అంతాలుగా నిలిచిన సింహగర్జనలం. (క్లిక్: లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!) ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేరుకున్న విజయ చిహ్నాలం కదా... ఇపుడు కమ్ముకొస్తున్న కుల, మత కారు మేఘాలను చెల్లాచెదురు చేయగల శక్తులం మనమే. ఎంతపోరు చేసి ఎన్నెన్ని త్యాగాలు చేసి తెలంగాణను నిలబెట్టుకున్నమో... గెలిచిన తెలంగాణను మత గత్తరల నుంచి, కుల కలరాల నుంచి కాపాడుకోలేమా. మనకు కొత్తగా చెప్పాల్సిన పన్లేదు. చేసిన యుద్ధం పదును ఏ మాత్రం తగ్గనోళ్లం... మనమే గెలుస్తాం. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - జూలూరు గౌరీశంకర్ చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి -
Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం
న్యూఢిల్లీ : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితులు విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడల్ని ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తిప్పికొట్టారని ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదని అన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో మరోసారి ప్రధాని మోదీ కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తిరిగి 1977 మార్చి 21న ఎత్తివేశారు. ఎమర్జెన్సీకి 47 ఏళ్లయిన సందర్భంగా ప్రధాని దాని గురించి ప్రస్తావిస్తూ ఆ చీకటి రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కుని హరించివేసిందని, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభుత్వ తొక్కి పెట్టి ఉంచిందని అప్పటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చివరికి గాయకుడు కిశోర్ కుమార్ కూడా ఎమర్జెన్సీ చేదు అనుభవాలు ఎదుర్కొ న్నారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ అంతరిక్ష రంగంలో చేస్తున్న ప్రయోగాలను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ: ఏచూరి ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యల్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని అప్పట్లో మాదిరిగానే ప్రజలు దీనిని కూడా ఓడిస్తారని జోస్యం పలికారు. -
రాజకీయాల్లో విలువలు, నైతికత ముఖ్యం
సాక్షి, మచిలీపట్నం: ‘పార్టీలు మారే రాజకీయ నాయకుల పదవుల విషయంలో మార్పురావాలి. విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగజారుడుతనం, వ్యక్తిగత విమర్శలు ఆందోళనకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకం’ అని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా మాజీ జెడ్పీ చైర్మెన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి ప్రజలను ప్రభావితం చేస్తాయన్నారు. వారసత్వంతో కాదు... జవసత్వంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారి తీస్తోందన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని తెలిపారు. పార్టీలు మారే రాజకీయ నాయకుల విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఉప రాష్ట్రపతి.. పార్టీ మారడంతో పాటు పదవిని త్యజించే విధంగా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయపార్టీల ఎన్నికల హామీలకు నిధులు ఎలా వస్తాయనే అంశాన్ని పార్టీలన్నీ ప్రణాళికతో పాటు వివరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రచార, ప్రసార సాధనాలు, పత్రికలు అందించే సమాచారం సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలని తెలిపారు అసాధారణ నాయకుడు పిన్నమనేని.. ఇరవై ఏడు సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన పేదల పక్షపాతి పిన్నమనేని కోటేశ్వరరావు అసాధారణ నాయకుడన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించేందుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, దూలం నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య లక్ష్యాలు కాపాడుకోవాలి
రాజ్యాంగం కనుసన్నల్లో గాక తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం చూస్తూనే ఉన్నాం. అన్ని బాధ్యతా యుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందేనని ఇటీవల సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ ర మణ వ్యాఖ్యానించడం గమనార్హం. సీజే చేసిన ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే... ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులూ, కేసులూ ఉన్నా’యని లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజూ ప్రకటించి ఎదురుదాడికి దిగారు. ఈ విధంగా రాజ్యాంగ విభాగాలు లేదా సంస్థల మధ్య పరస్పర విమర్శలు పెరగడం దేశానికి శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్య లక్ష్యాలను కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత అందరి మీదా ఉంది. మహా కోటీశ్వరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ ఎందుకన్నాడోగానీ ఇటీవల ఓ గొప్ప సత్యాన్ని గుర్తు చేశాడు: ‘‘ఈ రోజున ఇంత నీడలో కూర్చుని తీరు బడిగా సేద తీర్చుకుంటున్నామంటే అర్థం– ఏనాడో వెనుక ఏ మహానుభావుడో నీడనిచ్చే ఓ చెట్టును నాటిపోయిన ఫలితమే సుమా’’ అని! అలాగే ఈ రోజున స్వతంత్ర భారత రాజ్యాంగ రచనలో అటూ ఇటుగా కొన్ని హెచ్చుతగ్గులు రంధ్రాన్వేషకులకు తగలొచ్చునేమోగానీ, అంతమాత్రాన మొత్తం రాజ్యాంగ రచనా సంవిధానాన్నే ఎకసెక్కా లకు గురిచేయరాదు. ఇందుకు అతి తాజా ఉదాహరణగా కేంద్ర స్థాయిలో నడిచే సాధికార విచారణ సంస్థలే పరస్పరం కుమ్ములాట లకు దిగడాన్ని పేర్కొనకుండా ఉండలేం. రాజ్యాంగం కనుసన్నల్లో గాక కేవలం ఎప్పటికప్పుడు తాత్కాలిక ‘తోలుబొమ్మలాట’గా అధికారం చేపట్టే రాజకీయ పార్టీల నాయకులు తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని తరచూ స్వప్రయోజనాలకు వినియోగించు కోవడం చూస్తున్నాం. కాగా ఇప్పుడు తాజాగా ఈ పుండు న్యాయ వ్యవస్థల్లో కూడా పుట్టి శరవేగాన పెరిగిపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణే... కేంద్రాధికార స్థానంలోని పాలకుల కనుసన్నల్లో మసలే విచారణాధికార సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ)... దేశంలోని ‘‘ప్రతీ పేరుమోసిన ఇతర గౌరవ సంస్థల మాదిరే రోజు రోజుకీ ప్రజల దృష్టిలో పడి, దాని విశ్వసనీయతను ప్రజలు ప్రశ్నించే స్థితి ఏర్పడిందని’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (1.4.2022) ప్రస్తావిం చారు. ఇదే సందర్భంలో ఆయన దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్య లక్ష్యాలను ఎందుకు కాపాడుకోవలసిన అవసరం మరింతగా ఉందో వివరిస్తూ ఇలా అన్నారు: ‘‘భారతీయులం స్వేచ్ఛను ప్రేమిస్తాం. ఆ స్వేచ్చను కాస్తా గుంజుకోవడానికి ఎవరు ప్రయత్నించినా జాగరూ కులైన మన పౌర సమాజం స్వేచ్ఛను హరించజూసే నిరంకుశ వర్గాల నుంచి అధికారాన్ని తిరిగి గుంజుకోవడానికి సంకోచించదు. అందు వల్ల పోలీసులు, విచారణ సంస్థలు సహా అన్ని బాధ్యతాయుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందే’’. ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి ఈ హెచ్చరిక వెలువడిన వెంటనే కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజిజూ మరునాడు... ఆ మాటకొస్తే ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులు, కేసులు ఉన్నాయని’ లోక్‌సభలో ప్రకటించడంతో– ఈ పరస్పర ఎత్తి పొడుపుల్లో వేటిని నమ్మాలో, వేటిని కుమ్మాలో సామాన్యులకు, పాలనా వ్యవస్థలు నిర్వహిస్తున్న వారికీ అంతుపట్టని పరిస్థితి! నిజానికి ఒకప్పుడు సీబీఐ అంటే జనంలో విశ్వసనీయత ఉండేది. చివరికి తీవ్ర నిరాశకు గురవుతున్నపుడు కూడా ఒక దశ వరకు ప్రజలు న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లగలిగే వారనీ, ఇప్పుడు ఆ విశ్వస నీయత కూడా ప్రజల్లో కలగడం లేదని కూడా జస్టిస్ రమణ గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని ఇకనైనా అడ్డుకోవాలంటే– రాజకీయుల్ని లేదా పాలకుల్ని రాసుకు పూసుకుని తిరగడాన్ని పోలీసులు మానుకోవాలని కూడా హితవు చెప్పాల్సి వచ్చింది. ప్రజా స్వామ్య విలువలతో పాటు మన వ్యవస్థలన్నీ ఎలా నిర్వీర్యమై పోతున్నాయో జస్టిస్ రమణ గుర్తు చేస్తున్న సమయంలోనే బీజేపీ మంత్రి రిజిజూ పోటీగా న్యాయవ్యవస్థపైనే ఎదురుదాడికి దిగారు. ఈ ఎదురుదాడితో మొత్తం పాలకులు, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, విచారణ సంస్థల ‘సగులు మిగులు’ ప్రతిష్ఠలు ఏమైనా మిగిలి ఉంటే గింటే, పోయిన విలువ తిరిగి రాదని గ్రహించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా, మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనివార్యంగా ఆమోదిం చాల్సి వచ్చిన పథకం– రాజధానుల వికేంద్రీకరణ! కానీ, సుప్రీం పరోక్ష అనుమతితో కొత్తగా రాష్ట్ర హైకోర్టుకు బదలాయించిన న్యాయ మూర్తి ఒకరు ‘రాష్ట్ర రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి’ లేదని శాసించారు. అలాగే బీజేపీ తన అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవైపు ‘మేలమాడుతూ’నే మరోవైపు నుంచి రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి నానా బాపతుతో జట్టుకట్టి కలగాపులగం రాజకీయాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాలనా వికేంద్రీ కరణ ప్రతిపాదనలకు స్థూలంగా సమ్మతించి నాటకమాడుతున్న దశలోనే, కేంద్రాధికారాన్ని కూడా ధిక్కరిస్తూ హైకోర్టు కొత్త బెంచ్ నుంచి ‘రాజధానిని మార్చరాదని’ తాఖీదు వచ్చింది. పైగా హైకోర్టు ప్రకటన ఏ పరిస్థితుల్లో వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో.. విడిపోతున్న కొత్త ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్ణయం కాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టులో పలు వురు ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులు ఆదరాబాదరాగా చంద్రబాబు చేసిన అమరావతి భూముల గోల్మాల్ విషయమై తిరుగులేని రిట్ పిటీషన్ వేశారు. దాన్ని కోర్టు అనుమతించి విచారణకు స్వీకరించింది కానీ, విచారించలేదు. అది ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టే లెక్క. అందులో అమరావతి భూములను బాబు ఎలా గోల్మాల్ చేసి... మూడు నాలుగు పంటలు పండే భూముల్ని అర్ధరాత్రి ఎలా తాను బయట పడకుండా తన అనుయాయుల ద్వారా తగలబెట్టించి, తప్పుకోజూసి ఎలా అభాసుపాలైందీ ప్రస్తుత హైకోర్టు కూడా తెలుసుకో గలిగితే మంచిది. అమరావతి భూములను తగులబెట్టించిన పాపాన్ని బాబు, అతని అనుయాయులు ఎవరిమీదికి నెట్టారు? ఆ పంటల దహన కాండను కళ్లారా చూసి గుండె పగిలినంత పనైన ఈనాటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (దళితుడు) పైకి! అతణ్ణి ఎలాగోలా పంట దహన కాండ క్రియలో ఇరికించడానికి బాబు గ్యాంగ్ చేసిన ప్రయత్నాలూ, వేధింపులూ అన్నీ ఇన్నీ కావు. వేటికీ సురేష్ లొంగి కాళ్లుపట్టుకోలేదు గనుకనే–ఎన్నికల్లో అనివార్యంగా పార్లమెంట్ సభ్యుడై గడిచిన యావత్తు చరిత్రకు నిండైన, మెండైన ప్రతినిధిగా నిలబడ్డాడు. అంతకు ముందు, వేధింపులలో భాగంగా పోలీసులు సురేష్‌ను అరెస్టు చేసి, ‘నీవే పంట భూములు తగలబెట్టాన’ని ఒప్పుకుంటే ‘బాబు ద్వారానే రూ. 50 లక్షలు నీకు ముడతాయ’ని రకరకాల ప్రలోభాలు పెట్టారు. అయినా లొంగని మొండి ఘటమైనందుననే సురేష్ మాటకి ఈ రోజుకీ అంత విలువన్న సంగతిని న్యాయమూర్తులూ, న్యాయ వ్యవస్థా మరచిపోరాదు. గౌతమబుద్ధుడు మనకు ఏమి బోధించి పోయాడు? ‘చివరకు నేను చెప్పానని కూడా దేన్నీ నమ్మొద్దు. సొంత బుద్ధితో ఆలోచించి నిర్ణయాలకు రండ’ని చెప్పాడు. అదీ– న్యాయ వాదికైనా, న్యాయ మూర్తికైనా ఉండాల్సిన నీతి, నియమం! ఉమ్మడి హైకోర్టులో నేనూ, ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులూ జమిలిగా అమరా వతి భూముల పంపిణీ తంతుపై వేసిన రిట్ పిటీషన్లు, రిమైండర్లకు ఈ క్షణానికీ జవాబు రావలసే ఉంది. అందుకనే, వాటి తుది తీరు మానానికి మళ్లీ డొంకంతా న్యాయబద్ధంగా మాజీ న్యాయమూర్తులు కదపవలసి వస్తోంది. అంటే అమరావతి భూముల అక్రమ పంపిణీ సమస్య ఇంకా అలాగే ఉండిపోయిందని గౌరవ న్యాయమూర్తులు గుర్తించాలి. ఆ మాజీ న్యాయమూర్తుల అపరిష్కృత ఫైల్‌కు గౌరవ న్యాయం జరిగే వరకు అమరావతి భూములు అన్యాక్రాంతం కథకు ముగింపు రాదు, ఇతరత్రా ఎన్ని పొంతన లేని మధ్యంతర తీర్పు లొచ్చినా సరే! ‘క్వీన్స్ కౌన్సిల్’ డేవిడ్ పానిక్ అన్నట్టు ‘‘రాజకీయ పాలకులకు నిర్ణయించిన పదవీ కాలం పరిమితమే. కానీ న్యాయ మూర్తులకున్న పదవీ భద్రత పాలకులకు ఉండదు. ఈ పదవీ భద్రత పబ్లిక్ సర్వెంట్లయిన న్యాయ మూర్తులకు మాత్రం ప్రత్యేక వనరు. అందువల్ల జడ్జీలనూ, వారి బాధ్యతల నిర్వహణా తీరునూ, వారి పని తీరునూ స్వేచ్ఛగా, బాహా టంగా విమర్శించవచ్చు. అలాగే, పత్రికలు ఇతర ప్రసార సాధనాలు వెలిబుచ్చే అభిప్రాయాలనూ, విమర్శలనూ జడ్జీలు పట్టించుకోనక్కర లేదు. అలా విమర్శలకు ఉలిక్కిపడే జడ్జీలు, జడ్జీలు కాజాలరు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసార మాధ్య మాలపై ఉందని, ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ని ఎంసీహెచ్ఆర్డీలో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమన్నారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని అన్నారు. వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత మీడియాదేనని స్పష్టం చేశారు. సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావు గారికి ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వ రాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణాపత్రికకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ముట్నూరి కృష్ణారావు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం అయిందన్నారు. ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి సంపాదకీయం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమేననే విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, శాంతా బయోటెక్ చైర్మన్ డా.వరప్రసాద్ రెడ్డి, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, రచయిత దత్తాత్రేయ శర్మ, దర్శనం పత్రిక ఎడిటర్ ఎం.వి.ఆర్.శర్మ తదితరులు పాల్గొన్నారు. -
Hemakshi Meghani: మా పూర్వ విద్యార్థులు విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది!
దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్న దేశం మనది. 35 ఏళ్ల లోపు వాళ్లు 65 శాతం ఉన్న దేశం ఎంత శక్తిమంతంగా ఉండాలి? ఎంత చైతన్యవంతంగా ఉండాలి? నిజానికి... ఉండాల్సినంత చైతన్యవంతంగా ఉందా మనదేశం? పార్లమెంట్లో చట్టాలు చేసే సభ్యుల సరాసరి వయసు యాభై ఏళ్లు. వారందరిలో 35 ఏళ్ల లోపు వాళ్లు కేవలం ఆరుశాతమేనా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయామె మెదడులో. ఏ ప్రశ్నకూ ఆశాజనకమైన సమాధానం దొరకలేదు. ప్రశ్నకీ జవాబుకీ మధ్య విశాల విశ్వమంతటి అంతరం ఉందని కూడా అనిపించింది. ఇక మహిళల ప్రాతినిధ్యం విషయానికి వస్తే మనదేశం సాధించిన అత్యున్నత మహిళా ప్రాతినిధ్యం పద్నాలుగు శాతం. ఇది కూడా సిగ్గుపడాల్సిన సమాధానమే. యువత రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపించకపోతే... దేశంలో చట్టాల రూపకల్పన చైతన్యవంతంగా ఎలా ఉంటుంది? వాటి ఆచరణ సమర్థంగా ఎలా సాగుతుంది? ఇలాగ ఎన్నో అనుబంధ ప్రశ్నలు. అసలు... సామాన్యులు రాజకీయరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోకపోవడం ఏమిటి? వీటన్నింటికీ సమాధానంగా హేమాక్షి మేఘాని ఆధ్వర్యంలో వెలిసింది ఐఎస్డీ. ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ. మంచి కోసం మంచిదారి హేమాక్షి 2011లో హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో మాస్టర్స్ చేస్తున్న సమయంలో రూపుదిద్దుకున్న ఆలోచన ఇది. మహిళలు రాజకీయరంగంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె నమ్మిన సందర్భం అది. హార్వర్డ్‌లో చదువు పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్‌లో బిల్డింగ్ రీసోర్సెస్ అక్రాస్ కమ్యూనిటీస్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లతో పనిచేసింది హేమాక్షి. ఆ తర్వాత 2018లో ప్రఖార్ భర్తియా సహకారంతో న్యూఢిల్లీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీని ప్రారంభించింది. అతడికి యూత్ అలయెన్స్ స్టార్టప్‌కు సీఈవోగా పని చేసిన అనుభవం ఉంది. ఈ స్కూల్ ప్రారంభించడం వెనుక ఉద్దేశాన్ని వివరిస్తూ ‘పార్లమెంట్ సభ్యుల్లో 43 శాతం మందికి క్రిమినల్ రికార్డు ఉంది. ఈ పరిస్థితిని తొలగించాలి. యువత దృష్టి జెండర్, లీడర్షిప్, పాలిటిక్స్... ఈ మూడు అంశాల మీద కేందీకృతం కావాలి. క్షేత్రస్థాయి నుంచి సూత్రబద్ధమైన రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకునేటట్లు వాళ్లను ప్రోత్సహించాలి. మంచి వ్యక్తులు ఈ రంగంలోకి రావడానికి అవసరమైన ఓ మంచి దారి వేయడమే ప్రధాన ఉద్దేశం. మేము ఒక వెయ్యి మందిని తయారు చేసి సమాజంలోకి పంపిస్తే వారిలో కనీసం పాతికశాతం మంది అయినా ఎన్నికల్లో నెగ్గితే ప్రజాస్వామ్యానికి మా వంతు సేవలు అందినట్లే’ అంటోంది హేమాక్షి. ఇదేం చోద్యం! ఐఎస్డీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, ఆఫ్‌లైన్ క్లాసుల ద్వారా పాఠాలు బోధిస్తోంది. పురుషాధిక్య సమాజంలో రాజకీయరంగం అంటే తమదే అనే భావన నరనరాన జీర్ణించుకుని ఉంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ ఇలాంటి ప్రయత్నం చేయడం కూడా వారికి ఆశ్చర్యంగానే ఉంటోంది. శిక్షణ కోసం ఐఎస్డీకి వచ్చిన వాళ్లు కూడా ఆర్థిక వ్యవహారాలు చూసుకునే మా సహ వ్యవస్థాపకుడు ప్రఖార్‌తో మాట్లాడడానికే ప్రయత్నిస్తారు తప్ప ఈ స్కూల్ నిర్వహిస్తున్న నాతో మాట్లాడాలంటే సందేహంగా, ఇదేం చోద్యం అన్నట్లు చూస్తారు అని నవ్వుతూ చెబుతుంది హేమాక్షి. మార్పు సాధ్యమే! ‘‘ఇప్పటి వరకు మా స్కూల్ నుంచి రెండు వందల మంది శిక్షణ తీసుకున్నారు. వారిలో 26 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారు. వాళ్లలో కొంతమంది ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు కూడా. ఇటీవల ఒడిషాలో పర్యటించాను. అక్కడి జిల్లా పరిషద్ ఎన్నికల బరిలో మా స్కూలు పూర్వ విద్యార్థి పోటీ చేశాడు. అక్కడ నేను చూసిందేమిటంటే... ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓటు అడగడానికి ఒక గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఓటు వేయడానికి ఏమిస్తారని అడిగారు. బదులుగా మా విద్యార్థి చాలా సంయమనంతో ‘నేను డబ్బిచ్చి ఓట్లు వేయించుకుంటే రేపు మీకు పని ఎవరు చేస్తారు’ అని తిరిగి ప్రశ్నించాడు. గ్రామస్థులు వెంటనే ఏమీ అనలేదు, కానీ ఆలోచనలో పడ్డారని మాత్రం చెప్పగలను. మరొక పూర్వ విద్యార్థి ప్రియాంక విషయానికి వస్తే... ఆమె బిహార్, సీతామర్హిలో ఒక గ్రామానికి ముఖియా ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రచారంలో ఇంటింటికీ వెళ్లింది. ఆ సమయానికి ఒక ఇంటి వాళ్లు భోజనం చేస్తుంటే, వాళ్లు లోపలికి ఆహ్వానించే వరకు ఇంటి బయటే ఎదురు చూసింది. డాలీ గత ఏడాది బీహార్‌లో పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. అర్చన రాబోయే గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ ఏడాది ఎనిమిది మంది మా పూర్వ విద్యార్థులు పంచాయితీ, కౌన్సిల్ స్థాయుల్లో పోటీ చేయనున్నారు. మా విద్యార్థులు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విధానాన్ని గమనించినప్పుడు నా ప్రయత్నం విజయవంతం అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని హేమాక్షి ఇనుమడించిన ఉత్సాహంతో చెప్పింది. చదవండి: తేడా వస్తే.. ఆ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు.. వాళ్లకు అలర్ట్ వెళ్లిపోద్ది -
నెహ్రూస్ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్ పీఎం... తప్పుబట్టిన భారత్!
India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్ భారత్‌లో లోక్‌సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి. డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సింగపూర్‌లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ సింగపూర్ ప్రధాని లీ నెహ్రూస్ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్‌ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్) -
ఇదేనా ప్రజాస్వామ్యం?
మరో విడత పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అధికార–ప్రతిపక్షాల వాదోపవాదాలు... సభా మధ్యంలో నిరసనలు... అనివార్యమైన వాయిదాలు... మళ్ళీ అవే సన్నివేశాలు. డిసెంబర్ 23 వరకు జరగాల్సిన శీతకాల సమావేశాలు ఒకరోజు ముందే బుధవారమే ముగిశాయి. వెనక్కి తిరిగి చూస్తే, చట్టసభలు సాగిన తీరులో ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. సభాసమయంలో వృథానే ఎక్కువగా కనిపిస్తుంది. కీలక బిల్లులు ఆమోదం పొందినా, వాటిపై చర్చ జరగలేదనే చేదు నిజం వెక్కిరిస్తుంది. ఎవరి పాలెంతనేది పక్కనపెడితే, అధికార, ప్రతిపక్షాలు రెంటిలో తప్పు కనిపిస్తుంది. నవంబర్ 29న సభ మొదలైన రోజు నుంచే పరిస్థితి అదుపు తప్పింది. వర్షాకాల సమావేశాల్లోని ప్రవర్తన తీరుకు దండనగా 12 మంది ప్రతిపక్ష సభ్యులను మొత్తం ఈ శీతకాల సమావేశాల నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. దాని చట్టబద్ధతా ప్రశ్నార్థకమైంది. పలుమార్లు సభలో అంతరాయాలకూ, సభ బయట ధర్నాలకూ కారణమైంది. ఒక రకంగా ప్రతిపక్షాల్లో అనూహ్య ఐక్యతకూ దారి తీసింది. 22 రోజుల పాటు గాంధీ విగ్రహం పాదాల చెంత ప్రతిపక్ష సత్యాగ్రహం సాగింది. సామూహిక పశ్చాత్తాపం కాదు... వ్యక్తిగతంగా ఎవరికి వారు క్షమాపణలు చెబితేనే సభలోకి అనుమతిస్తామన్న అధికార పక్షం మంకుపట్టు ఆఖరి దాకా కొనసాగింది. అదీ విచిత్రం. ఈ విడతలో లోక్‌సభ, రాజ్యసభ– చెరి 18 సార్లు సమావేశమయ్యాయి. కానీ, అంతరాయాలతో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాలు వృథా. అంతరాయాలు, వాయిదాలతో రాజ్యసభలో ఏకంగా 49 గంటల 32 నిమిషాలు కృష్ణార్పణం. మొత్తం మీద లోక్‌సభ ఉత్పాదకత 77 శాతమైతే, రాజ్య సభది 43 శాతమేనని చట్టసభలపై స్వచ్ఛంద పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెక్కేసింది. ప్రభుత్వం లెక్క మాత్రం అంతకన్నా కాస్తంత మెరుగ్గా ఉంది (లోక్‌సభ 82 శాతం, రాజ్యసభ 47 శాతం). ఏ లెక్కనైనా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదనేది నిర్వివాదాంశం. ఈ సమావేశాల్లో 12 బిల్లులు లోక్‌సభలో, ఒక బిల్లు రాజ్యసభలో– మొత్తం 13 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిలో 11 ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో అద్దె గర్భం, సహాయ పునరు త్పాదక టెక్నాలజీ (ఏఆర్టీ), నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కీలక బిల్లులున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉండడంతో వీటిని పాస్ చేయించుకోవడం పాలకపక్షానికి కష్టమేమీ కాదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే ఇప్పటికీ స్వల్ప మెజారిటీ (ప్రతిపక్షాలు 120, ఎన్డీఏ సభ్యులు 118). అందుకే, ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాత తప్పుల సాకుతో 12 మంది విపక్ష సభ్యుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసి, కృత్రిమ మెజారిటీ సంపాదించి, బిల్లులను పాస్ చేయించుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. నిందారోపణలు ఏమైనా, చర్చ లేకుండా నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులకు ఆమోద ముద్ర పడడం మటుకు నిజం. సమావేశాల మొదట్లోనే తెచ్చిన కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు మొదలు చివరలో తెర మీదకు తెచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు దాకా అనేకం అర్థవంతమైన చర్చ ఏమీ లేకుండా, అరగంటలో పాలకపక్షం మమ అనిపించినవే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డునూ – ఆధార్‌నూ అనుసంధానించడానికి వీలు కల్పించే అత్యంత కీలక ఎన్నికల చట్టం మార్పుపై చర్చించడానికి అధికార పక్షానికి సమయమే లేదా అన్నది విమర్శకుల ప్రశ్న. భిన్నాభిప్రాయాల చర్చావేదికగా నిలవడం, ఆ చర్చల్లో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంట్ ప్రాథమిక లక్షణం. కానీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రజాస్వామ్య వేదిక ఆ గుణాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందన్నది కొందరి విమర్శ. 17వ లోక్‌సభలోని తాజా 7వ విడత సమావేశాల్లో సగటున ప్రతి బిల్లూ లోక్‌సభలో 10 నిమిషాల్లో, రాజ్యసభలో అరగంటలో పాసైపోయాయి. చట్టసభల్లో పరిఢవిల్లాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ పరిహసించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. బిల్లులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపడం సాధారణం. ఇటీవల ఆ ధోరణి కూడా తగ్గుముఖం పడుతోంది. తాజా సమా వేశాల్లో 6 బిల్లుల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. ఆడపిల్లల వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమయ్యాక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. ఇక, ప్రజాసమస్యలను ప్రస్తావించి పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశమున్న కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలోనూ 60 శాతం సమయం వృథా తప్పలేదంటే, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రంగస్థల ప్రదర్శనలా మారిపోతున్న తమ సభావ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. నిజానికి, ఈసారి సభలో గట్టిగా చర్చ జరిగింది – కోవిడ్ పైన, పర్యావరణ మార్పుల పైనే! రైతుల ప్రాణాలు బలిగొన్న లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో, కన్నకొడుకే నిందితుడైన హోమ్ శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చివరి దాకా పట్టుబట్టాయి. కానీ, కీలక అంశాల చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడమూ అంతే ముఖ్యమని గ్రహించాల్సింది. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే సమావేశాలు మరింత మెరుగ్గా జరిగి ఉండేవి. రాజ్యసభ ఛైర్మన్ అన్న ఆ మాట నిజమే. కానీ, అందుకు పాలకపక్షం కూడా కలసి రావాలి. పట్టువిడుపులతో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎంతైనా, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేం కదా! పాలకులు ఏకపక్ష ప్రకటనలు చేయడానికీ, అనుకున్నవాటికి రబ్బరు స్టాంపు రాజముద్రలు వేయడానికీ పార్లమెంట్ సమావేశాలతో పని ఏముంది! -
మయన్మార్ నియంతల ఆగడం
నిరంతర అప్రమత్తత కొరవడితే ప్రజాస్వామ్యం క్రమేపీ కొడిగట్టడం ఖాయమని గ్రహించనిచోట చివరకు నియంతలదే పైచేయి అవుతుంది. వర్తమాన మయన్మార్ ప్రపంచానికి చాటిచెబుతున్న పాఠం అదే. తన జీవితంలో ఇప్పటికే పదిహేనేళ్లపాటు చెరసాలలో గడిపిన సీనియర్ నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై రెండు నాసిరకం ఆరోపణల ఆధారంగా నడిచిన కేసులో సైనిక న్యాయస్థానం సోమవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన వైనం అక్కడి సైనిక పాలకుల పోకడలు తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించలేదు. తీర్పు వెలువడిన వెంటనే ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్టు సైన్యం ఉదారత ప్రకటించడం దాని నయవంచనకు నిదర్శనం. ఆమెపై మరో తొమ్మిది అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ‘విచారణ’ పూర్తయితే ఆమెకు మొత్తం 102 ఏళ్ల వరకూ శిక్ష పడుతుందంటున్నారు! సూకీని గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించడం, ప్రత్యేక కోర్టు విచారణకు వేరెవరినీ అనుమతించకపోవడం, కేసు గురించి ఆమె న్యాయవాది బయటెక్కడా మాట్లాడకూడదని ఆంక్ష పెట్టడం సైనిక ముఠా దుర్మార్గానికి నిదర్శనం. ఆరు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన సైనిక దుశ్శాసనులు అప్పుడప్పుడు తగ్గి నట్టు నటించడం, అదునుచూసి తమ వికృత రూపాన్ని ప్రదర్శించడం రివాజే. నిరుడు నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేష నల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) విజయం సాధించడాన్ని చూసి కడుపుమండిన సైనిక ముఠా... మొన్న ఫిబ్రవరిలో ఉన్నట్టుండి ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అధికారాన్ని హస్త గతం చేసుకుంది. వాస్తవానికి ఇదంతా లాంఛనమే. అధికార పీఠాన్ని సైన్యం ఎప్పుడూ వదిలింది లేదు. పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థకు చోటిచ్చినట్టు కనబడినా తన హవా నడిచేందుకు అనువైన రాజ్యాంగాన్ని సైన్యం ముందే రాసిపెట్టుకుంది. పార్లమెంటులో తనకు 25 శాతం స్థానాలు రిజర్వ్ చేసుకుంది. ఆ స్థానాలకు ప్రతినిధులను తానే నామినేట్ చేస్తుంది. మిగిలిన 75 శాతం స్థానాలకు జరిగే ఎన్నికల్లో సైతం కీలుబొమ్మ పార్టీలను నించోబెట్టి తమ పలుకుపడికి ప్రమాదం రాకుండా చూసుకోవడం మొదటినుంచీ సైనిక పాలకులకు అలవాటైన విద్య. కానీ 2020 ఎన్నికల్లో కీలుబొమ్మ పార్టీ అయిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎన్డీపీ)కి కేవలం 25 స్థానాలే లభించేసరికి సైన్యానికి దిక్కుతోచలేదు. ఈ మెజారిటీతో సూకీ రాజ్యాంగాన్ని మార్చేస్తారని రూఢీ చేసుకుని మళ్లీ అది పంజా విసిరింది. సైనిక ముఠా రూపొందించిన రాజ్యాంగమంతటా కంతలే. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అధ్యక్ష పీఠం అధిష్టించడానికి అనర్హులవుతారని అందులో ఉన్న ఒక నిబంధన కేవలం సూకీని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అయితే 2015లో అధికారంలోకొచ్చిన తర్వాత సూకీ ఈ దొంగల రాజ్యాంగంపై పోరాడవలసింది. సైన్యం దురాలోచనను ఎండగట్టవలసింది. కానీ ఆమె రాజీపడ్డారు. దేశాధ్యక్ష పదవి దక్కకపోయినా సరిపెట్టుకుని వెనకుండి పాలనను పర్యవేక్షించారు. కీలకమైన ఆంతరంగిక భద్రత, రక్షణ శాఖలను సైన్యం తన చేతుల్లో పెట్టుకున్నా అదేమని ప్రశ్నిం చిన పాపాన పోలేదు. సైన్యం ఆగడాలు అంతకంతకు మితిమీరుతున్నా చూసీచూడనట్టు మిన్న కుండిపోయారు. చివరకు దేశ పౌరుల్లో భాగమైన రోహింగ్యాలపై జాత్యహంకార బుద్ధిస్టులతో ఏకమై సైన్యం దమనకాండకు దిగినా ఖండించడానికి సూకీ ముందుకు రాలేదు. సైనిక నియంత లపై నిలకడగా, నిబ్బరంగా శాంతియుత పోరాటాన్ని కొనసాగించి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న ధీరవనిత ఇలా మూగనోము పట్టడమేకాదు... ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై వారిని సమర్థిస్తూ మాట్లాడిన తీరుకు ప్రపంచ ప్రజానీకం విస్తుపోయింది. నిజానికి ఆమె ఇంటా బయటా కూడా ఒంటరి కాదు. ఆమెకు దేశ ప్రజానీకంలోనూ మద్దతుంది. విదేశాల్లోనూ ఆదరణ ఉంది. కానీ ఆమె దాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రజాస్వామ్యం కోసం జనం సాగించిన పోరాటం కేవలం సూకీని అధికార పీఠంపై ప్రతిష్టించడానికి కాదు... వ్యవస్థలన్నిటినీ చెరబట్టిన సైనిక ముఠాను గద్దెదించి, మానవ, పౌరహక్కులనూ సాధించుకోవడానికి. సకలరంగాల్లోనూ ప్రజా స్వామ్య సంస్కృతిని పునఃప్రతిష్టించడానికి. వాటి సాధనకై ఉద్యమానికి నాయకత్వం వహించ డంలో, ప్రజలను చైతన్యవంతం చేయడంలో అధికారంలోకొచ్చాక సూకీ విఫలమయ్యారు. తాను రాజీపడితే సైన్యం కూడా ఒక మెట్టు దిగుతుందనుకున్నారు. అది అడియాసే అయింది. చెప్పుకోదగ్గ నాయకత్వం లేకున్నా మయన్మార్ విద్యార్థులు, యువజనులు మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. వివిధ సందర్భాల్లో గత ఎనిమిది నెలలుగా 1,300మంది ప్రాణాలు తీసినా వారు వెనక్కు తగ్గటంలేదు. ఐక్యరాజ్యసమితివంటి అంతర్జాతీయ సంస్థలు, అమెరికా తదితర దేశాలు మాటల్లో సైనిక పాలకులను ఖండిస్తున్నా చేతల్లో చూపిస్తున్నదేమీ లేదు. చైనా సరేసరి. దానికి లాభార్జన మినహా ఏదీ పట్టదు. అక్కడి పాలకులను వ్యతిరేకిస్తే ఈశాన్య భారత్‌లో తిరుగుబాటు దార్ల ఆటకట్టించడం అసాధ్యమవుతుందని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రజానీకం మయన్మార్‌కు నైతిక మద్దతునీయాలి. అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమానికి చేయూతనందించాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అప్పుడు మాత్రమే మయన్మార్ పాలకులు దిగివస్తారు. -
ప్రజాస్వామ్యానికి పనికిరాని క్యారెక్టర్ చంద్రబాబు
-
పర్యావరణ ధ్వంసంతో విచ్చలవిడిగా డబ్బు సంపాదన
-
ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం
అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్ క్వీన్స్ కౌన్సిల్‌గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు! దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్ చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్ చేయగానే డిస్మిస్ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు? బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్ గాంధీ ట్వీట్ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్ 7న తొలగించేశారు. ఇక అంతర్ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది! మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ