ప్రజాస్వామ్యం లేని గెలుపు? | Sakshi Editorial On Bangladesh Parliamentary Elections | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం లేని గెలుపు?

Published Wed, Jan 10 2024 12:00 AM | Last Updated on Wed, Jan 10 2024 12:00 AM

Sakshi Editorial On Bangladesh Parliamentary Elections

ఆమె గెలవడం ఇది అయిదోసారి. అందులోనూ ఇది వరుసగా నాలుగో గెలుపు. మామూలుగా అయితే ఇది అసాధారణం. అయితే, బంగ్లాదేశ్‌లో కాదు. ఆ దేశంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన తీరు కానీ, ప్రధాని షేక్‌ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ (ఏఎల్‌) ఘన విజయం కానీ అనూహ్యమేమీ కాదు. మునుపటి ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ, దాని మిత్రపక్షాలు... అన్నీ కలిపి 15 పార్టీలు ప్రజాతీర్పుకు దూరంగా ఉన్నప్పుడు పాలక పక్షానిదే గెలుపు కాక మరేమవుతుంది! ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునివ్వడంతో సహజంగానే ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. 2018 నాటి 80 శాతం సగానికి పడిపోయి, 40 చిల్లర వద్ద తచ్చాడింది. ఫలితాలూ ఊహించినట్టే వచ్చాయి. 

మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా, పాలక పక్షానికి 223 వచ్చాయి. విచి త్రమేమంటే, ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచింది స్వతంత్రులే. ఇలా ఇండిపెండెంట్లుగా గెలిచిన 62 మందిలో కూడా అత్యధికులు పాలక అవామీ లీగ్‌ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ, పార్టీ అధికా రిక అభ్యర్థిపై పోటీ చేసి గెలవమన్న వాళ్ళే! అలా గెలిచినవాళ్ళే! ఇప్పుడు బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో రెండో అతి పెద్ద వర్గం ఈ ఇండిపెండెంట్లదే!

‘జాతీయ పార్టీ’ 11 సీట్లు, మరో మూడు విపక్ష పార్టీలు 3 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నామావశిష్టంగా నిలిచాయి. ఇప్పుడిక ఎవరిని పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటిస్తారో చూడాలి. అధికారిక ప్రకటనలెలా ఉన్నా, ఆచరణలో వాస్తవికంగా బంగ్లా ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్షమే లేని పార్లమెంట్‌ అయింది. షేక్‌ హసీనా తన తాజా విజయంతో అటు ప్రతిపక్షాలనే కాదు... ఇటు ప్రజాస్వామ్యాన్ని సైతం ఓడించారని విశ్లేషకులంటున్నది అందుకే!

ప్రపంచంలో దీర్ఘకాల మహిళా ప్రభుత్వాధినేత అనే కిరీటం హసీనాదే. 2009 నుంచి హసీనా తాలూకు పార్టీదే అధికారం. అప్పటి నుంచి ఇన్నేళ్ళలో మంచీ చెడులు రెంటిలోనూ హసీనా ఉక్కుమహిళే! అటు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్ని దుర్భర దారిద్య్రం నుంచి బయటకు తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన కీర్తి, ఇటు మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో తొక్కేసిన అపకీర్తి... రెండూ ఆమెవే. దేశ ఆర్థిక పురోగతి, సామాజిక అభివృద్ధిలో అవిస్మరణీయ పాత్ర ఈసారి కూడా ఆమెకు విజయం అందించి ఉండవచ్చు.

అంతమాత్రాన మిగతా తప్పులన్నీ ఒప్పులై పోవు. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై అంతర్జాతీయ పరిశీలకులు, మానవ హక్కుల సంఘాల వారు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. కీలక సంస్థలు, వ్యవస్థల పైన, అసమ్మతి వినిపించకుండా చివరకు మీడియా పైన కూడా హసీనా సర్కార్‌ నియంత్రణపై విమర్శలూ వచ్చాయి. 17 కోట్లకు  పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్‌ తరుణ ప్రజాస్వామ్యానికి ఇది వన్నె తీసుకురాదు. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు. 

హసీనా మరోసారి ఎన్నికవడం భారత్‌కు మాత్రం ఒక రకంగా శుభవార్తే! ఎందుకంటే, హసీనా హయాంలో భారత – బంగ్లాదేశ్‌ బంధాలు  బలపడ్డాయి. వాణిజ్యం పెరిగింది. మెరుగైన రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతానికి తీవ్ర వాదం పెనుముప్పుగా పరిణమించిందని ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మునుపటి షేక్‌ హసీనా హయాం మరో పర్యాయం కొనసాగడం ఢిల్లీ దృష్టి నుంచి చూస్తే మంచిదే!

బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరత, విదేశాంగ విధానాల కొనసాగింపు మనకు లాభించే విషయాలు. పైగా, అంతర్యుద్ధంలో కూరుకుపోయిన ఉమ్మడి పొరుగుదేశమైన మయన్మార్‌ నుంచి శరణార్థుల సమస్య పెరుగుతూ, తీవ్రవాదులకు ఆయుధాలు సులభంగా అందివచ్చే పరిస్థితులున్న సమయంలో బంగ్లా దేశ్‌లో స్నేహశీల సర్కార్‌ ఉండడం భారత్‌కు ఒకింత సాంత్వన. 

నిజానికి, రాగల కొద్దినెలలు దక్షిణాసియా ప్రాంతానికి కీలకం. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో ఈ ఏడాదే ఎన్నికలున్నాయి. ఈ ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లో ఎన్నికలు జరగనుంటే, ఆ తరువాత కొద్దినెలలకే శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నిక. ఇక, ఏప్రిల్‌ – మే నెలల్లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు సరేసరి. వివిధ దేశాల ఎన్నికల ఫలితాలు, కొలువు దీరే కొత్త ప్రభుత్వాలు, వాటి వైఖరిలో మార్పులను బట్టి భారత ఉపఖండంలో అనేక మార్పులు రావడం సహజం.

ఇప్పటికే నిరుడు సెప్టెంబర్‌లో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత వ్యతిరేక వైఖరిని అస్త్రంగా చేసుకొని, మహమ్మద్‌ మొయిజు గద్దెనెక్కారు. భారత్‌కు దీర్ఘకాలిక మిత్రదేశమైన మాల్దీవులు అప్పటి నుంచి ఢిల్లీ కన్నా బీజింగ్‌ వైపు మొగ్గుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజా లక్షద్వీప్‌ వర్సెస్‌ మాల్దీవ్స్‌ ఘటనలోనూ అదే కనపడింది. వీటన్నిటి దృష్టితో చూసినప్పుడూ బంగ్లాదేశ్‌లో మరోసారి భారత అనుకూల హసీనా సర్కార్‌ ఏర్పాటవడం భారత్‌కు ప్రయోజనకరమే!

ఇటు భారత్‌తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, అటు చైనా సైనిక ఆలంబన – రెండూ కొనసాగిస్తూ హసీనా చేస్తున్న సమతూకం అందరికీ చేతకావు. అలాంటి ఆమె విజయాలు ప్రశంసా ర్హమే అయినా, సాగిస్తున్న రాజకీయ అణచివేతను విస్మరించలేం. ఆన్‌లైన్‌లో విమర్శించినా అరదండాలే అన్న డిజిటల్‌ భద్రతా చట్టం లాంటివి పౌరస్వేచ్ఛకు ప్రతిబంధకాలు.

ప్రజాస్వామ్య వాతావర ణమే లేకుంటే, చివరకు అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య షరతులు విధిస్తాయి. అదే అదనుగా బంగ్లాదేశ్‌ పక్షాన చైనా బరిలోకి దిగుతుంది. అది భారత్‌కూ అభిలషణీయం కాదు. అందుకే, ప్రతిపక్షాలను ఊపిరి పీల్చుకొనిచ్చేలా, వ్యవస్థల స్వతంత్రతను కాపాడేలా హసీనా సర్కార్‌కు భారత్‌ నచ్చజెప్పాలి. బంగ్లాకూ, భారత్‌కూ దీర్ఘకాలంలో అదే శ్రేయస్కరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement