
నిరుడు ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచీ భారత–బంగ్లాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్‌కు లేఖ రాయటం ఆహ్వానించదగ్గ పరిణామం. బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా త్యాగాల పునాదులపై నిర్మితమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
పదిహేనేళ్లు పాలించిన హసీనా మత ఛాందసుల్ని అదుపులో పెట్టడంలో సాధించిన విజయాలు ప్రశంసనీయమైనా, రిగ్గింగ్‌తో విజయాన్ని చేజిక్కించుకోవటం, విపక్ష నేతలను ఏళ్ల తరబడి జైళ్లపాలు చేయటం వంటి ధోరణుల్ని ఎవరూ జీర్ణించుకోలేక పోయారు. తిరుగుబాటు జరి గాక, జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది. హసీనా పార్టీ అవామీ లీగ్ నేత లపైనా, కార్యకర్తలపైనా దాడులతో పాటు ఆ పార్టీకి మద్దతు పలికారంటూ పలువురి ఆస్తుల్ని ధ్వంసం చేయటం మితిమీరింది.
ఈ అరాచకం ఆపకపోగా అంతా సవ్యంగా ఉందంటూ యూనుస్ దబాయింపులకు దిగారు. మతఛాందసులది పైచేయి అయి మహిళలపైనా, మైనారిటీ హిందూ వర్గంపైనా దాడులకు పూనుకుంటున్నా... వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు బాగా పెరిగినా అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. గత డిసెంబర్‌లో ఆ దేశాన్ని సందర్శించిన మన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బంగ్లా విదేశాంగ సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేన్‌కు అందజేశారు.
భౌగోళిక రాజకీయ కోణంలో బంగ్లాదేశ్‌తో చెలిమి భారత్‌కు చాలా అవసరం. అది చిన్న దేశమే అయినా దానితో మనకు 4,096 కిలోమీటర్ల మేర సరిహద్దువుంది. ఇందులో నదీ పరీవాహక ప్రాంతం వేయి కిలోమీటర్లపైన ఉంటుంది. తాగునీటికైనా, సాగునీటికైనా తీస్తా నదీజలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. ఆ నది ప్రవహించే 315 కిలోమీటర్లలోనూ 130 కిలోమీటర్లు బంగ్లాదేశ్ భూభాగంలోనే ఉంటుంది.
పశ్చిమబెంగాల్‌లోని గజల్‌డోబా బరాజ్ వల్ల భారీ మొత్తం జలాలు ఆ రాష్ట్రానికే పోతాయని, తమకు మిగిలేది అతి తక్కువని బంగ్లా వాదిస్తోంది. ఆ జలాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని కోరుకుంటోంది. చివరకు కనీసం తొలి దశలో 25 శాతం ఇస్తే చాలని రాజీ కొచ్చింది కూడా. కానీ మమత అందుకు కూడా ససేమిరా అన్నారు.
వాస్తవానికి 2011లో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ తీస్తా నదీజలాల పంపకంపై బంగ్లాతో సూత్రప్రాయంగా అంగీకారానికొచ్చారు. ఒప్పందం రూపొందింది. కానీ అప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ సీఎంగా వున్న మమతా బెనర్జీ యూపీఏ భాగస్వామి కావటం, ఆ ఒప్పందానికి ఆమె ససేమిరా అనటంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ఫెనీ జలాల విషయంలోనూ ఇలాంటి పీటముడే పడింది. నదీజలాల అంశం తప్ప ఇతరేతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవి.
భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తమ ప్రయోజనాలను బేఖాతరు చేస్తున్నదని బంగ్లా ప్రజానీకంలో చాన్నాళ్ల నుంచి అసంతృప్తి వుంది. దానికితోడు హసీనాకు భారత్ గట్టి మద్దతుదారుగా ఉండటంవల్లే ఆమె ఇష్టారాజ్యం సాగిందని, లక్షలాదిమంది తమ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని విపక్షాల ఆరోపణ. ఈశాన్య భారత్‌లో తరచు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ బంగ్లాదేశ్ శిబిరాల్లో తలదాచుకునే మిలిటెంట్లను ఆమె హయాంలో భారత్‌కు అప్పగించేవారు.
ఇది కూడా అక్కడి ఛాందసవాదులకు మింగుడుపడలేదు. అయినా ఇరు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కొనాల్సిన సమస్యలూ ఉన్నాయి. ఉదాహరణకు టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించతలపెట్టిన మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దది కాబోతోంది. అది మనతోపాటు బంగ్లాదేశ్ ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. బంగ్లా సాగు అవసరాల్లో 55 శాతం బ్రహ్మపుత్ర నదీజలాలు తీరుస్తాయి. చైనాలోని టిబెట్‌లో యార్లుంగ్ సాంగ్పోగా మొదలై మన దేశంలో ప్రవేశించేసరికి బ్రహ్మపుత్ర అయి, బంగ్లాలో అది జమునా నదిగా మారుతుంది.
ప్రస్తుత బంగ్లా వాటా జలాల్లో 5 శాతం తగ్గినా సాగు ఉత్పత్తులు 15 శాతం పడిపోతాయని మూడేళ్ల క్రితం బంగ్లా పర్యావరణ శాఖ అంచనా వేసింది. బరాజ్ నిర్మిస్తున్న ప్రాంతం భూకంపాలపరంగా ప్రమాదకరమైనది. భూ అంతర్భాగంలోని టిబెట్ పలక చురుగ్గా ఉండటమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే మన దేశం చైనాకు ఆందోళనను తెలియజేయగా, బంగ్లాదేశ్ సైతం ఆ బరాజ్ ప్రభావంపై రూపొందించిన నివేదికలు తమకందించాలని ఆ దేశానికి లేఖ రాసింది.
బంగ్లా విముక్తి దినోత్సవంపై ప్రస్తుత పాలకులకు అంత పట్టింపు లేదు. హసీనా పతనానికి దారితీసిన ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విద్యార్థులు తమది తటస్థ దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఆశయంతో గణతాంత్రిక్ ఛాత్ర సంగ్సద్ (ప్రజాతంత్ర విద్యార్థి మండలి) పేరిట గత నెలలో పార్టీ స్థాపించారు. అయితే ఛాందస వాదులు దీన్ని ఎంతవరకూ సాగనిస్తారో తెలియదు.
దేశాన్ని మళ్లీ తూర్పు పాకిస్తాన్‌గా మార్చాలని వారు తహతహలాడుతున్నారు. ఇస్లామిక్ సంప్రదాయాలను అమలు చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల 2 నుంచి 4 వరకూ బ్యాంకాక్‌లో జరగబోయే బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంఘం బిమ్‌స్టెక్ సమావేశం సందర్భంగా మోదీతో భేటీకి బంగ్లా ఆసక్తి చూపుతోంది. తాజా పరిణామంతో అది సాకారమైతే మళ్లీ ఇరు దేశాల స్నేహసంబంధాలూ పట్టాలెక్కుతాయి.