
భూమిని గురించి చెబుతూ ప్రఖ్యాత కవి దేవిప్రియ అది ‘మధ్యమధ్యలో మతిభ్రమించే/ మమతానురాగాల మాతృమూర్తి’ అంటారు. సకల సంపదలకూ పుట్టిల్లయిన నేలతల్లి ఎందుకనో ఆగ్రహించింది. శుక్రవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపాల పరంపర మయన్మార్, థాయ్‌లాండ్‌లను తీవ్రంగా దెబ్బతీయగా... మయన్మార్ ఇరుగు పొరుగు నున్న భారత్, చైనాలను భూప్రకంపనలు వణికించాయి. ఈశాన్య భారత్, బెంగాల్, ఢిల్లీ తదితర చోట్ల ప్రకంపనలు కనబడగా, చైనాలో యునాన్, సిచువాన్ ప్రాంతాలు దీని బారినపడ్డాయి.
ఈ భూప్రళయం ఒక్కసారిగా జనజీవనాన్ని తలకిందులు చేసింది. మృతులెందరన్న లెక్క వెంటనే తేలడం కష్టం. ఎందుకంటే కోటి 70 లక్షల జనాభాగల థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆకాశా న్నంటే భవనాలు చాలా వున్నాయి. వాటిల్లో అనేకం నేలమట్టమయ్యాయి. వేలాదిమంది ఇరుక్కు పోయారు. వర్తక, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు ముమ్మరంగా సాగే వేళ భూకంపం రావటం ప్రాణనష్టాన్ని పెంచివుండొచ్చన్న అంచనాలున్నాయి. మయన్మార్‌లో సైనిక పాలనవల్ల పరిస్థితి తీవ్రత తెలియటం లేదంటున్నారు.
అయితే భూకంప కేంద్రం ఆ దేశంలోని రెండో పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో వుండటం, భూగర్భంలో 20– 30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభ వించటాన్నిబట్టి నష్టం ఎక్కువుంటుందన్నది భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. నిరంతర ఘర్షణలతో అట్టుడుకుతున్న ఆ దేశంలో ఇప్పటికే 30 లక్షలమంది కొంపా గోడూ వదిలి అత్యంత దుర్భరమైన స్థితిలో బతుకీడుస్తున్నారు. ఒక్కో పట్టణం ఒక్కో సాయుధ ముఠా గుప్పిట్లో వుంది. ఇవిగాక సైన్యం అడపా దడపా వైమానిక దాడులు చేస్తోంది. ఈ భూకంపం ఆ దేశ జనాభాలో మూడోవంతుమందిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం వున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది.
మిగిలిన వైపరీత్యాలు విరుచుకుపడే ముందు ఏదో రకమైన సూచనలందిస్తాయి. జాగ్రత్త పడటానికి కాస్తయినా వ్యవధినిస్తాయి. కానీ భూకంపాలు చెప్పా పెట్టకుండా విరుచుకుపడతాయి. రెప్పపాటులో సర్వం శిథిలాల కుప్పగా మారుతుంది. అపార ప్రాణనష్టం వుంటుంది. తప్పించు కున్నవారిని సైతం తీవ్ర భయోత్పాతం వెన్నాడుతుంది. భూమి లోలోతు పొరల్లో అనునిత్యం మార్పులు సంభవిస్తూనే వుంటాయి. భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నదాన్నిబట్టి భూగర్భం ఏడు పలకలుగా విడివడి వుంటుంది. వీటిల్లో వచ్చే కదలికలూ, అవి తీసుకొచ్చే రాపిడులూ పర్యవసానంగా ఆకస్మికంగా శక్తి విడుదలవుతుంటుంది. ఆ శక్తి తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరుతుంది. అది భూకంపం రూపంలో వ్యక్తమవుతుంది.
భూకంపం మనిషి జ్ఞానాన్ని పరిహసించే ప్రకృతి విపత్తు. ఖగోళంలో మానవుడు సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. అక్కడ జరిగే పరిశోధనలు అన్నీ ఇన్నీ కాదు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ నిరుడు డిసెంబర్ 24న సూర్యుడి ఉపరితలానికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమించింది. ఇది అత్యంత సమీపం వరకూ వెళ్లినట్టు లెక్క. కానీ కాళ్లకింద పరుచుకున్న భూమి లోలోతు పొరల్లో ఏం జరుగుతున్నదో ఆరా తీయటంలో వైఫల్యాలే ఎదురవుతున్నాయి.
భూకంపాలపై సాగుతున్న పరిశోధనలు గతంతో పోలిస్తే ఎంతో కొంత ప్రగతి సాధించాయనే చెప్పాలి. ఫలానాచోట భూకంపం రావొచ్చని చెప్ప గలిగే స్థాయి వచ్చింది. కానీ అది నిర్దిష్టంగా ఎప్పుడు, ఎక్కడ వస్తుందో చెప్పటం మటుకు సాధ్యం కావటం లేదు. ఏడెనిమిదేళ్ల క్రితం దక్షిణ కాలిఫోర్నియా, దక్షిణమధ్య అలస్కా ప్రాంతాల్లో చాలా తక్కువస్థాయి ప్రకంపనలు నమోదైనప్పుడు భూ పొరల్లో ఏదో జరుగుతున్నదని, భూకంపం వచ్చే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ తర్వాత ఉత్పాతం చోటుచేసుకుంది.

అయితే సంభావ్యతను 85 శాతం వరకూ ఊహించవచ్చని, నిర్దిష్ట సమయాన్ని చెప్పటం అసాధ్యమనిఅంటున్నారు. ఇందులో చిక్కేమంటే... ముందే చెబితే జనం భయాందోళనల్లో కాలం వెళ్లదీస్తారు. ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ తర్వాత అంచనాలు తప్పితే అనవసర భయాందోళనలు సృష్టించారని శాస్త్రవేత్తలను తప్పుబడతారు.
ప్రకృతిని గౌరవించటం నేర్చుకోనంతవరకూ ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. వాతావరణ కాలుష్యం, నానాటికీ పెరుగుతున్న భూతాపం, అడవుల విధ్వంసం, అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా కొండలు తొలిచి రైలు, రోడ్డు మార్గాలు నిర్మించటం, జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటివి ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ సముద్ర మట్టాలు పెరగటానికీ, వరదలకూ దారితీసి భూమి లోలోపలి పొరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముప్పును వేగవంతం చేస్తున్నాయి.
ఎంఐటీ శాస్త్రవేత్తలు జపాన్‌లోని నోటో ద్వీపకల్పంలో సాగించిన పరిశోధనల ఫలితాలు దీన్నే చాటు తున్నాయి. 2020కి ముందు అక్కడ ఒకటీ అరా వచ్చే భూకంపాలు స్వల్పస్థాయిలోవుంటే... ఆ తర్వాతి కాలంలో వాటి సంఖ్య పెరగటంతోపాటు తీవ్రత ఎక్కువ కావటాన్ని వారు గమనించారు. ఇదంతా అక్కడి వాతావరణ మార్పులవల్లేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిశోధనలు ప్రభు త్వాల కళ్లు తెరిపించాలి.
అభివృద్ధి పేరుతో అమలవుతున్న నమూనాలను మార్చుకోవాలి. అలాగే భూకంపాలు వాటికవే ప్రాణాలు తీయవు. బలహీనమైన కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాలు ముప్పునుంచి బయటపడే మార్గాలను మూసేస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలకు అనుమతు లిచ్చేటపుడు ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవటం అవసరం.