
సందేహం లేదు... న్యాయస్థానాలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆటలాడుతున్నారు. పరిధులు గుర్తెరిగి విధినిర్వహణ చేయాలని పదిరోజులనాడు చెప్పినా తమ వెనకటి గుణం మానుకోవటానికి ససేమిరా అంటున్నారు. అందుకే ఏపీ హైకోర్టు మంగళవారం మరోసారి చీవాట్లు పెట్టవలసి వచ్చింది. హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావనకొచ్చిన ప్రేమ్‌కుమార్ కేసు విచిత్రమైనది.
మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడైన ప్రేమ్‌కుమార్ రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్‌గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా ఒక చిన్న రూపకాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దానిపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తాము కట్టే పన్నుల్లో రోడ్ సెస్ వంటివి ఉండగా ఇలా ప్రత్యేకించి మళ్లీ వసూలు చేయడమేమిటన్న చర్చ మొదలైంది.
అందుకే సర్కారువారికి కంటగింపైంది. ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టడమే ధ్యేయంగా తప్పుడు కేసు సృష్టించారు. ‘మనోభావాలు’ దెబ్బతిన్నాయని ఒక వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేయించి కర్నూలునుంచి గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చి అర్ధరాత్రి అరెస్టుకు పూనుకున్నారు. ఇంగితం మరిచి ఆయన భార్య, కుమార్తెలపై దౌర్జన్యం కూడా చేశారు. ఇదొక్కటే కాదు... నిరుడు డిసెంబర్‌నుంచి ఇలాంటి కేసులెన్నో ఉన్నత న్యాయస్థానం దృష్టికి వస్తూనేవున్నాయి.
ఆ పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తులు హెచ్చరిస్తూనే వున్నారు. కానీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బహుశా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏలినవారే చూసుకుంటారన్న ధైర్యమేమో! హైకోర్టుతో చీవాట్లు తిన్న మరునాడే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసుల తీరు ఈ సందేహాన్నే కలిగిస్తోంది. ఎంపీపీ ఎన్నికల్లో విప్ జారీ చేయటానికి అధికారులను కలవడానికెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోవాల్సిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపైనే తప్పుడు కేసు బనాయించి నిర్బంధంలోకి తీసుకున్నారు.
నిద్రపోయేవారిని లేపవచ్చు... నిద్ర నటిస్తున్నవారిని తెలివిలోకి తీసుకురావటం సాధ్యమేనా? వీళ్లంతా కొత్తగా విధి నిర్వహణలో చేరినవారు కాదు. ‘జీ హుజూర్’ అంటే తప్ప జీతంరాళ్లు రాని వారు కాదు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులద్వారా వచ్చే ఆదాయంతో నెలనెలా జీతభత్యాలు పొందు తున్నవారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొందినవారు. కానీ పాలకులు మారేసరికి వీరిలో అపరిచితుడు బయటికొచ్చినట్టుంది.
తప్పుడు వాగ్దానాలతో, ప్రత్యర్థులపై దుష్ప్రచారంతో, చడీ చప్పుడూ కాకుండా సాగించిన అక్రమాలతో అందలం ఎక్కిన పాలకులు ఎంతకాలం ఊరేగుతారు? వారిని నమ్ముకుని ఇష్టారాజ్యం చేయొచ్చనుకోవటం, తమకేమీ కాదనుకోవటం మంచిదికాదని అధికారులు గ్రహించాలి. ఈ పాలన కొడిగట్టి కొండెక్కాక తమ పరిస్థితేమిటన్న స్పృహ కలగాలి.
అసలు దేశానికి రాజ్యాంగం ఉన్నదని, పౌరులకు దానిద్వారా హక్కులు సమకూరాయని, తమతో సహా అన్ని వ్యవస్థలూ వాటికి అనుగుణంగానే ప్రవర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవని తెలుసుకోవాలి. ఈ దేశంలో న్యాయస్థానాలు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో సైతం నిర్భయంగా తీర్పులిచ్చిన ఉదంతాలున్నాయి. ఆ సంగతిని ప్రభుత్వమూ, పోలీసులూ కూడా తెలుసుకోవాలి.
విధినిర్వహణ తీరుతెన్నులెలా వుండాలో తెలిపే మాన్యువల్ గురించి ధర్మాసనం పోలీసులకు గుర్తు చేయక తప్పలేదు. సాధారణ స్థాయి కానిస్టేబుల్ మొదలుకొని డీజీపీ వరకూ విధినిర్వహణ ఎలా వుండాలో, బాధ్యతలేమిటో తెలిపే మాన్యువల్ అది. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, దర్యాప్తు విధి విధా నాలూ, అధికారాల వినియోగంలో పాటించాల్సిన పద్ధతులు, పరిమితులు వగైరాలన్నీ అందులో నిర్దేశించివుంటాయి.
పౌరులకుండే హక్కులేమిటో, విధినిర్వహణలో వాటిని పాటించాల్సిన అవసర మేమిటో మాన్యువల్ చెబుతుంది. హైకోర్టు భిన్న సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ మాన్యువల్‌ను పోలీసులు పట్టించుకోవటం మానేశారని అర్థమవుతుంది. కనీసం గుర్తు చేస్తున్నా దున్నపోతు మీద వానపడిన చందాన ప్రవర్తిస్తున్నారు.
వర్రా రవీంద్రరెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, పప్పుల వెంకటరమణారెడ్డి, బొసా రమణ వగైరాల అరెస్టుల విషయంలో పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతున్నదని ధర్మా సనం వ్యాఖ్యానించింది. అవసరాన్నిబట్టి కేసులు కాక, ఏదోవిధంగా కేసులు పెట్టాలి... ఎవరో ఒకర్ని అరెస్టు చేయాలని చూడటం సరికాదని హెచ్చరించింది.
తమ ముందు దాఖలైన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే మేజిస్ట్రేట్‌లు రిమాండ్ విధిస్తు న్నారని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం అనటం గమనించదగ్గది. ప్రేమ్‌కుమార్ కేసు సంగతే తీసుకుంటే ఆయన అక్రమార్జనకు పూనుకున్నాడంటూ రూ. 300 స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.
ఇంత హాస్యాస్పదంగా పెట్టే కేసుల్ని మేజిస్ట్రేట్‌లే తమ స్థాయిలో అడ్డు కోవచ్చు. అది లేకపోవటంవల్ల ఉన్నత న్యాయస్థానంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవటంవల్ల బెయిల్ దరఖాస్తులు తమవద్దకు వెల్లువలా వచ్చిపడుతున్నాయని నిరుడు జూలైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
గత సోమవారం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై కిందిస్థాయి కోర్టుల తీరును తప్పుబట్టింది. హైకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకుంటే చిక్కులు తప్పవని తెలుసుకోవాలి. నిబంధనలు గుర్తెరిగి మసులుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment