సుప్రీంకోర్టు తీర్పులను దేశంలో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందే
రిజిస్ట్రార్లు, సబ్ రిజ్రిస్టార్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
వేలంలో కొన్న ఆస్తికి మార్కెట్ విలువ ప్రకారం స్టాంప్ డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు వర్తించదు
ఆస్తి విలువ ఆధారంగానే స్టాంపు డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు వసూలు చేయాలి
అధికారుల అజ్ఞానం వల్ల హైకోర్టులో కోకొల్లలుగా పిటిషన్లు దాఖలవుతున్నాయి
రిజ్రిస్టార్లు, సబ్ రిజిస్ట్రార్లకు శిక్షణ తరగతులు నిర్వహించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్టార్ల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టమైన తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది. చట్టాల విషయంలో అధికారుల అజ్ఞానం వల్ల హైకోర్టులో పిటిషన్లు వరదలా దాఖలవుతున్నాయని, ప్రజలను కోర్టులకు వచ్చి తీరే పరిస్థితులు కల్పిస్తున్నారని స్పష్టం చేసింది.
వేలంలో కొన్న ఆస్తికి మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఉండాలంటే రిజ్రిస్టార్, సబ్ రిజ్రిసా్టర్లకు న్యాయవ్యవస్థలో, చట్టాలలో వస్తున్న కొత్త మార్పులపై జ్ఞానోదయం కలిగించాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు, శిక్షణ తరగతులు నిర్వహించాలంది.
ఇందుకోసం ఓ ‘లీగల్ మాడ్యూల్’ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పుడే సమర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపింది. ఈ లీగల్ మాడ్యూల్ రూపకల్పన విషయంలో అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ లీగల్ మాడ్యూల్‌ని రూపొందించాలని తేల్చి చెప్పింది. అనంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలంది.
తమ ఈ ఆదేశాల అమలు పురోగతికి సంబంధించిన వివరాలతో 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లు వేలంలో కొన్న ఆస్తికి దాని విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు ఖరారు చేయాలని తిరుపతి సబ్ రిజ్రిస్టార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు.
కేసు నేపథ్యమిదీ
కడపకు చెందిన కొండపనేని మల్లికార్జున, లోకేశ్ కస్తూరి, హైదరాబాద్‌కు చెందిన స్వాతి కస్తూరి తిరుపతి కెనరా బ్యాంక్ నిర్వహించిన ఈృవేలంలో తిరుపతి సెంట్రల్ పార్క్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని పలు షాపులను రూ.2.17 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ ఆస్తిని తమ పేర రిజిస్టర్ చేయాలంటూ తిరుపతి సబ్ రిజ్రిస్టార్‌ను మల్లికార్జున తదితరులు ఆశ్రయించారు.
సదరు ఆస్తికి మార్కెట్ విలువ (రూ.3.65 కోట్లు) ఆధారంగా 6.5 శాతం స్టాంప్ డ్యూటీ, 1 శాతం రిజ్రిస్టేషన్ ఫీజు చెల్లించాలని సబ్ రిజ్రిస్టార్ స్పష్టం చేశారు. ఈ మొత్తం చెల్లిస్తేనే రిజ్రిస్టేషన్ చేస్తామని తేల్చి చెప్పారు. తాము వేలంలో ఈ ఆస్తిని కొన్నామని, అందువల్ల మార్కెట్ విలువ ప్రకారం కాకుండా ఆస్తి విలువ (రూ.2.17 కోట్లు) ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు చెల్లిస్తామని, నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయని మల్లికార్జున తదితరులు చెప్పారు.
సబ్ రిజ్రిస్టార్ ఒప్పుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment