Andhra Pradesh High Court
-
స్టాపేజ్ రిపోర్ట్ ఇవ్వకుంటే వాహన పన్ను కట్టాల్సిందే
సాక్షి, అమరావతి: మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన మోటారు వాహనం లేదా వాణిజ్య వాహనాలను వాటి యజమానులు రోడ్లపై తిప్పకూడదనుకున్నప్పుడు ఆ విషయాన్ని రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు మాత్రమే ఆ వాహనానికి పన్ను మినహాయింపు కోరడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. తమ వాహనం లేదా వాహనాలు రోడ్డుపై తిరగడం లేదని, పన్ను చెల్లింపు త్రైమాసిక గడువు ముగిసిన తరువాత ఆ వాహనాలను రోడ్లపై తిప్పబోమంటూ వాహన యజమానులు ‘స్టాపేజ్ రిపోర్ట్ లేదా నాన్ యూజ్ రిపోర్ట్’ ఇవ్వకుంటే.. వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్టుగానే భావించి పన్ను విధించే అధికారం రవాణా అధికారులకు ఉందని పేర్కొంది. ఒకవేళ రవాణాయేతర వాహన యజమాని స్టాపేజ్ రిపోర్ట్ సమర్పించడంలో విఫలమైనప్పటికీ, ఆ తరువాత వాహనాన్ని తిప్పడం లేదని అధికారులకు అన్ని ఆధారాలను ఇస్తే, ఆ వాహనం తిరగడం లేదనే భావించాల్సి ఉంటుందని తెలిపింది. తమ వాహనాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ లోపల సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ (సీడీవై)లో తిరుగుతున్నాయని, సీడీవై ‘బహిరంగ ప్రదేశం’ కిందకు రాదని, అందువల్ల తమ వాహనాలకు మోటారు వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందన్న తారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వాదన ఏపీ మోటారు వాహన పన్నుల చట్టంలోని సెక్షన్ 12ఏకి విరుద్ధమని తేల్చిచెప్పింది. సీడీవై బహిరంగ ప్రదేశం కిందకు రాదు కాబట్టి, తారాచంద్ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్నును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. సెక్షన్ 12ఏ ప్రకారం స్టాపేజ్ రిపోర్ట్‌కు బహిరంగ ప్రదేశం, ప్రైవేటు ప్రదేశం అన్న తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలన్న సింగిల్ జడ్జితారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ కంపెనీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఐరన్ స్టోరేజీ, హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులకు 36 వాహనాలను వినియోగిస్తోంది. ఈ వాహనాలు అప్పటివరకు రోడ్లపై తిరిగినందుకు కాంట్రాక్ట్ పొందడానికి ముందే సదరు కంపెనీ ఆ వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించింది. పన్ను చెల్లించిన కాల పరిమితి ముగియడంతో అధికారులు ఆ వాహనాలకు రూ.22.71 లక్షల మేర పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై తారాచంద్ కంపెనీ తమ వాహనాలు రోడ్లపై తిరగడం లేదని, సీడీవైలోనే తిరుగుతున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలంటూనే రూ.22.71 లక్షల పన్ను చెల్లించింది. ఆ తరువాత తమ వాహనాలకు పన్ను విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 2022లో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి తారాచంద్ కంపెనీ తన వాహనాలను రోడ్లపై తిప్పలేదని, స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సీడీవైలోనే తిప్పిందని, అందువల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చారు. ఆ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్ను మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.ప్రభుత్వం అప్పీల్ చేయడంతో..ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వాహనదారు పన్ను మినహాయింపు కావాలంటే.. పన్ను చెల్లించాల్సిన త్రైమాసికం మొదలు కావడానికి ముందే సదరు వాహనం తిరగడం లేదంటూ స్టాపేజ్ రిపోర్ట్‌ను రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియజేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.వాస్తవానికి మోటారు వాహన పన్ను అనేది పరిహార స్వభావంతో కూడుకున్నదని, పన్నుల ద్వారా వచ్చే మొత్తాలతోనే అన్ని వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా రోడ్లను నిర్వహించడమన్నది ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. తారాచంద్ కంపెనీకి రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. -
మా తీర్పు.. మీ భాషలోనే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు. ‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.షెడ్యూల్డ్ భాషల్లోనూ..షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్సైట్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది. రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్‌కు అధికారం కల్పించింది. అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.బీజం వేసిన మద్రాస్ హైకోర్టుమద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి. 1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది. గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందేఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్లేషన్ టూల్స్‌ని ఉపయోగించి ఈ–ఎస్సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది. -
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరాలు కావు
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదని.. వాటికి సెక్షన్–111 వర్తించదని హైకోర్టు ఇప్పటికే రెండు వేర్వేరు సందర్భాల్లో స్పష్టంచేసింది. అసలు ఏ సందర్భంలో బీఎన్ఎస్ సెక్షన్–111 (వ్యవస్థీకృత నేరం) వర్తిస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఏకపక్షంగా ఈ సెక్షన్‌ను పెడుతున్న కేసుల్లో పలువురు మేజి్రస్టేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయనేందుకు దర్యాప్తు అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపకపోయినా కూడా కొందరు మేజి్రస్టేట్లు ఆ రిమాండ్ రిపోర్టుల పట్ల సంతృప్తి వ్యక్తంచేయడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు పక్షం రోజుల వ్యవధిలో ఇచ్చిన తీర్పులు పోలీసులకు చెంపపెట్టు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సులభంగా బెయిల్ రాకూడదనేతెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చంది మొదలు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా పోలీసులు వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సులభంగా బెయిల్ రాకుండా చేసేందుకు సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ సెక్షన్–111 కింద ఈ కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి.. ఇప్పుడు ఎవరిపై అయితే కేసులు నమోదు చేశారో వారికి ఈ సెక్షన్ వర్తించదని పోలీసులకు స్పష్టంగా తెలిసినప్పటికీ, రాజకీయ కారణాలతో వారు తప్పుడు కేసులు నమోదుకు వెనుకాడటంలేదు. సెక్షన్–111 వర్తించాలంటే.. భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. ఓ నిందితునికి సెక్షన్–111 వర్తించాలంటే, ఆ వ్యక్తిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్ దాఖలై, అందులో కనీసం ఒక్క చార్జిషీట్నైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పులు కూడా స్పష్టంచేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో ఎవ్వరిపై కూడా గత పదేళ్లలో కనీసం రెండు చార్జిషీట్లు దాఖలై, అందులో ఒక దానిని కోర్టు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేనేలేవు. కాబట్టి.. సోషల్ మీడియా పోస్టులపై ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న వారికి సెక్షన్–111 వర్తించే అవకాశమేలేదు. ఇదే కారణంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ను తప్పుపట్టింది. సోషల్ మీడియా కేసులకు ‘111 సెక్షన్’ వర్తించదు» కోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి » మేమేజిస్ట్రేట్లు సైతం ఈ కేసుల్లో రిమాండ్ తిరస్కరిస్తున్నారు » సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు » యథేచ్చగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన » ‘బీఎన్ఎస్ 111’ కేసులపై క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం » ప్రైవేటు కేసులతో పోలీసులను న్యాయస్థానంలో నిలబెడతాం » వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మలసాని మనోహర్రెడ్డిసాక్షి, అమరావతి : రాష్ట్రంలో చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను టీడీపీ కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. వీరిపై పోలీసులు బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని.. నిజానికి, ఈ సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని ఆయనన్నారు. అయినా కూడా పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రతోనే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే.. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై మాత్రమే బీఎన్ఎస్ 111 సెక్షన్ ప్రయోగించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ, ఏపీ పోలీసులు మాత్రం దీనిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదం మోపేందుకే బీఎన్ఎస్ 111 సెక్షన్‌ను వారిపై అక్రమంగా బనాయించి వేధిస్తోంది. సాధారణంగా ఈ సెక్షన్‌ను మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ సరఫరా, కిడ్నాప్, దొంగతనాలు, దోపిడీలు, బలవంతంగా ఆస్తుల స్వా«దీనం.. సుపారీలు తీసుకుని హత్యలు చేయడం, ఆరి్థక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారు. అలాగే, ఈ చట్టం రావడానికి కనీసం పదేళ్ల ముందు నుంచి నేరాలకు పాల్పడి ఉండి.. ఒకటి కన్నా ఎక్కువ కేసుల్లో కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులపైనే ఈ సెక్షన్‌ను వాడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ, కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అభంశుభం తెలియని సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ సెక్షన్‌ను బనాయించి వారిని ఎక్కువ కాలం జైళ్లలో నిర్బంధించే కుట్రలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇప్పటికే ఎంతోమందిని జైళ్లకు పంపారు. ఈ అక్రమ నిర్బంధాలు ఎక్కువ కాలం నిలబడవని ప్రభుత్వం, పోలీసులు తెలుసుకోవాలి. ప్రైవేట్ కేసులు వేస్తాం.. ఈ నేపథ్యంలో.. ఈ సెక్షన్లు పెట్టిన అన్ని కేసుల్లోనూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం. ఈ కేసులు బనాయిస్తున్న అధికారులపైన న్యాయస్థానాల్లో పోరాడుతాం. అర్థరాత్రి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయించడాలు, నెంబర్లు లేని వాహనాల్లో మఫ్టీలో వచ్చి అపహరించడం.. కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం, అరెస్టు చూపకుండా.. ఆచూకీ చెప్పకుండా వారిని వేధించడం, రోజుకో పోలీస్‌స్టేషన్‌కి తిప్పడం.. ఇలా పది రోజులపాటు తిప్పిన సందర్భాలున్నాయి. ఇప్పటికే ఎన్నో కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసి కార్యకర్తల ఆచూకీ తెలుసుకున్నాం. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారందర్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ప్రైవేట్ కేసులు వేసి వీటితో సంబంధమున్న ప్రతి పోలీస్ అధికారిని కోర్టులో ముద్దాయిగా నిలబెడతాం. మా దారిలోకి రాకపోతే ఏమైనా చేస్తామనే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఆఖరికి జడ్జీలపై నిఘా పెట్టే దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. న్యాయవాదులుగా మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థ జోలికొస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం. -
చెట్ల ట్రాన్స్లోకేషన్పై విధాన నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: చెట్లను కొట్టేయకుండా, వాటిని వేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటే ప్రక్రియ (ట్రాన్స్‌లొకేషన్)కు ప్రాధాన్యతనివ్వాలని, దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌లొకేషన్‌కు అవసరమైన యంత్రాలు ఖరీదైనవే అయినప్పటికీ, అవి లేవని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు, నిర్వహణ తదితరాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తుండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెట్ల నరికివేత పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిందని తెలిపింది. చెట్ల నరికివేతను గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాన్స్‌లొకేషన్ అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది.ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పర్యావరణ నిపుణులను సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఆ కమిటీ సలహాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మూడు నెలల్లో పూర్తి వివరాలతో స్పందనను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) దాఖలు చేసిన కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంది. ట్రాన్స్‌లొకేషన్ కోసం పిల్... రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితరాల పేరుతో భారీ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారని, చెట్లను కొట్టేయకుండా వాటిని మరో చోట నాటేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహ్మద్ షేక్ షా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు వచ్చిoది. పిటిషనర్ తరఫు న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ.. చాలా రాష్ట్రాల్లో చెట్లను నరికేయకుండా వాటిని మరో చోట నాటుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, మరో చోట విజయవంతంగా నాటారని తెలిపారు. ఇందుకోసం హైకోర్టులో ఓ సంస్థ పనిచేస్తోందని వివరించారు. జీపీఎఫ్, ఈపీఎఫ్ దేనిని ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం » ఫలానా స్కీంను వర్తింపజేయాలని కోర్టులు ఆదేశించలేవు »ఉద్యోగులు జీపీఎఫ్ కోరుతున్నందున దానిపై నిర్ణయం తీసుకోండి » ఆర్థిక, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ స్కీం లేదా జీపీఎఫ్ స్కీంలలో దేనిని వర్తింపజేయాలన్నది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్దిష్టంగా ఫలానా స్కీంను వర్తింపజేయాలని న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని స్పష్టం చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) స్కీం వర్తింపజేయాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు అభ్యర్థనలు పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తమకు పాత పెన్షన్ స్కీం అయిన జీపీఎఫ్‌ను వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కం) పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న కొందరు ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ఉద్యోగుల తరఫున న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన మెమోరాండం ప్రకారం పిటిషనర్లందరూ జీపీఎఫ్‌కు అర్హులని చెప్పారు. జీపీఎఫ్ కోసం పిటిషనర్లు పై అధికారులకు వినతులు ఇచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది ఆర్థికపరమైన అంశమని, దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని డిస్కంలు, ఆరి్థక, ఇంధన శాఖల న్యాయవాదులు వాదనలు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. -
సజ్జల భార్గవ్ క్వాష్ పిటిషన్.. ప్రతివాదులకు కోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.అంతకుముందు.. ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు.ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది. ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. -
మేజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపకపోయినా మేజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారనేందుకు ఆధారాలున్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపింది. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, లోపభూయిష్టంగా ఉత్తర్వులిస్తున్నారని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును తప్పుపట్టింది. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే, అతనిపై గత పదేళ్లలో ఒకటికంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో నిందితుడిపై గత పదేళ్లలో కేసులు నమోదయినట్లు గానీ, చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు గానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదంది. అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచి్చన నోటీసులో అరెస్ట్‌కు కారణాలను పేర్కొన్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్ట్‌కు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదని తెలిపింది. అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక, కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్ట్‌కు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదని ఆక్షేపించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఈ రెండు లోపాల కారణంగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం నిందితుని అరెస్ట్‌కు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించలేమంది. అందువల్ల అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. -
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
విధి నిర్వహణలో భాగంగా... జత్వానీని విచారించడం తప్పా?
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు. జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచి్చన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు? జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. -
చట్టం మీ చుట్టం కాదు.. సర్కారుకు కోర్టు మొట్టికాయలు
-
అందరిపైనా సెక్షన్ 111 కుదరదు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరమంటూ కొందరిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న అడ్డగోలు కేసుల విషయంలో హైకోర్టు ఒకింత స్పష్టతనిచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లను కించపరిచేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివశంకర్‌రెడ్డి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పులి శ్రీనివాసరావు గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్‌రెడ్డిపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్... బీఎన్ఎస్ సెక్షన్ 111 గురించి కొంతమేర స్పష్టతను ఇస్తూ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు.‘ఏవరైనా ఒక వ్యక్తిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే... అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి. వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి. బీఎన్ఎస్ సెక్షన్ 111 మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టంతోపాటు గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాలను పోలి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ చట్టాలు ఏ సందర్భాల్లో వర్తిస్తాయో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఆ చట్టాలు కూడా నిందితునిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలని, వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి అని చెబుతున్నాయి. కేరళ హైకోర్టు సైతం ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.’ అని స్పష్టంచేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందా? లేదా? అన్నది దర్యాప్తు అధికారి తన విచారణలో తేల్చాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.ఐటీ యాక్ట్ సెక్షన్–67 పైనా స్పష్టత... ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఏ సందర్భంలో వర్తిస్తుందన్న విషయంలోను న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. ‘అసభ్యంగా ఉన్న దాన్ని ఎల్రక్టానిక్ రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం చేశారంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఏది అసభ్యత కిందకు వస్తుందన్న దాన్ని తేల్చే ముందు సమకాలీన విలువలను, జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలే తప్ప, సున్నిత మనసు్కలతో కూడిన సమూహం నిర్దేశించిన ప్రమాణాలను కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అసభ్యతను నిర్ధారించే ముందు విషయం మొత్తాన్ని చూడాలే తప్ప, అందులో ఓ భాగం ఆధారంగా అసభ్యతను నిర్ణయించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది’అని జస్టిస్ హరినాథ్ తన తీర్పులో గుర్తుచేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ పెసల శివశంకర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని అతన్ని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
-
ఇకపై మరింత మందిని కోల్పోనివ్వం
సాక్షి, అమరావతి: హెల్మెట్ లేకపోవడం వల్ల చోటు చేసుకుంటున్న మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదని.. నిబంధనల అమలులో పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము ఈ విధంగా మరింత మందిని కోల్పోనివ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలు విషయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరవ్వాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో రవాణా శాఖ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలుకు ముఖ్యంగా హెల్మెట్లు ధరించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రాష్ట్రవ్యాప్తంగా 8,770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాలి కానీ.. కేవలం 1,994 మందే ఉన్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాళ్లు తెలంగాణ సరిహద్దు రాగానే సీటు బెల్టులు పెట్టుకుంటున్నారని.. ఇందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారన్న భయమే కారణమని పేర్కొంది. కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ప్రణతి జోక్యం చేసుకుంటూ.. మొత్తం బాధ్యత పోలీసులదే అంటే సరికాదని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజలను తప్పు పట్టొద్దని, అవగాహన కల్పించడం పోలీసుల బాధ్యత అని హితవు పలికింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు, హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసే విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జరిమానాలు కఠినంగా వసూలు చేయాలి.. రాష్ట్రంలో కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయట్లేదని.. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేశ్ వాదనలు వినిపిస్తూ.. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. హెల్మెట్ ధారణ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలని తాము జూన్‌లో ఆదేశాలిచి్చనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారని ప్రశ్నించింది. జూన్ నుంచి సెపె్టంబర్ వరకు 667 మంది చనిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి తెలిపారు. ఇది చిన్న విషయం కాదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రణతి స్పందిస్తూ, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 5,62,492 చలాన్లు విధించామని చెప్పారు. కృష్ణా జిల్లాలో 20,824 చలాన్లు విధించి రూ.4.63 లక్షలు జరిమానా వసూలు చేశామన్నారు. ఇది చాలా తక్కువ మొత్తమన్న ధర్మాసనం.. నిబంధనలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా ఉందని ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని సూచించింది. చలాన్లు కట్టని వారి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఆపేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. చలాన్లు చెల్లించకపోతే సదరు వాహనాన్ని ఎందుకు జప్తు చేయట్లేదని పోలీసులను, ఆర్టీఏ అధికారులను ప్రశ్నించింది. భారీ జరిమానాలు విధించే బదులు.. ఇప్పటికే ఉన్న జరిమానాలను కఠినంగా వసూలు చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడింది. -
సౌర విద్యుత్ కొనుగోలు పిల్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్‌ను ఓసారి పరిశీలించి అవసరమైతే అదనపు వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణను జనవరి చివరి వారంలో జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. అసలు వివాదం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తారని.. దీని వల్ల పంపిణీ నష్టాలుంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. -
జీవోలు రహస్యంగా ఉంచడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వెబ్సైట్లో కొన్ని జీవోలు మాత్రమే అప్లోడ్ చేసి.. మిగిలిన వాటిని ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీవోలన్నింటినీ ఎలా పడితే అలా కాకుండా ప్రజలకు అర్థమయ్యేందుకు వీలుగా.. ఓ వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. ఏదైనా జీవోలో రహస్య సమాచారం ఉంటే.. ఆ విషయాన్ని కూడా జీవో ద్వారా తెలపాలని ఆదేశించింది. దీని వల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని.. ప్రజలకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అలాగే జీవోలను గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జీఎంఎన్‌ఎస్ దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, జీవోలన్నీ అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు స్పందిస్తూ.. గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోలను అప్లోడ్ చేయడం లేదన్నారు. దీని వల్ల జీవోల వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. జీవోలను ఓ వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిందేనని ఆదేశించింది. -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
సాక్షి, విజయవాడ: హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించక 667 మంది చనిపోయారని పిటిషనర్ పేర్కొన్నారు. హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదంటూ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసిన హైకోర్టు.. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
-
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట
సాక్షి,గుంటూరు : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీపై అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. నిన్నటి (సోమవారం) విచారణలో కూడా వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు.. ఈరోజు(మంగళవారం) షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆర్జీవీపై నమోదైన అన్నీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నమోదైన కేసుల విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. ఇదీ చదవండి: ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ -
రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు చెల్లదు
సాక్షి, అమరావతి: రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్డీడ్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక, ఏకపక్ష అధికార వినియోగమేనని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన నిబంధన ఏదీ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో నిర్ధిష్టంగా లేకపోయినప్పటికీ, అది రూల్స్‌లో ఉన్నట్టుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ‘ఏపీ రిజిస్ట్రేషన్ రూల్స్ 26(కె)(1) ప్రకారం సేల్డీడ్లను రద్దు చేయాలంటే.. సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు ప్రభుత్వ/అసైన్డ్/దేవదాయ లేదా రిజిస్టర్ చేయడానికి వీల్లేని భూములు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉండాలి. అప్పుడే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సివిల్ కోర్టు/ప్రభుత్వ అధికారి సంబంధిత ఆస్తుల సేల్డీడ్లను రద్దు చేయడం సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు పైన పేర్కొన్న కేటగిరీలో ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే, సేల్డీడ్ల రద్దుకు రూల్ 26(కె)(1) వర్తించదు. ఈ రూల్‌లో ఎక్కడా ఆస్తి స్వభావంపై అధికారులు విచారణ చేపట్టాలని లేదు. సేల్డీడ్లలోని భూమి ఫలానా భూమి అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే.. దాని ఆధారంగా అధికారాన్ని ఉపయోగించవచ్చని మాత్రమే ఉంది. సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేదు కాబట్టి, దానిని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో సమాధానం చెప్పింది. నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్‌లో లేకుంటే.. ఆ రూల్స్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేకపోయినా.. అది రూల్స్‌లో ఉన్నట్లే భావించాలి’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.సేల్డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తనకు ఇరువాడ, అసకపల్లి గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 4.90 ఎకరాల భూమిని జి.నాగేశ్వరరావు, ఎన్.రమణ, షేక్ ఆసీఫ్ పాషాలకు 2013లో విక్రయించారు. సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అధికారులు సేల్డీడ్లు కూడా జారీ చేశారు. 2014లో ఆ సేల్డీడ్లను అధికారులు రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందన్‌రావు తుది విచారణ జరిపి పైవిధంగా తీర్పు వెలువరించారు. -
ఆధారాలు లేకుండా అరెస్టులు ?.. బాబు సర్కార్ పై హైకోర్టు సీరియస్
-
ఆధారాల్లేకుండా అరెస్టులా? వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలా?... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి
-
ఆధారాల్లేకుండా అరెస్టులా?
సాక్షి, అమరావతి : పోలీసులు ఆయా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్ర వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని నిందితులను నెలల తరబడి జైళ్లలో ఉంచాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించాలన్న ప్రభుత్వ వాదనను సైతం తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించలేమంది. సహ నిందితుల వాంగ్మూలాలను తమను (కోర్టులను) కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాని పని అని స్పష్టం చేసింది. ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటే ఎలా? అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. ఆ తర్వాత ఎలాంటి దర్యాప్తు చేయకుండా, ఎలాంటి ఆధారాలు సేకరించకుండా నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. వాంగ్మూలాలు కేవలం దర్యాప్తునకు ఓ దారి చూపుతాయే తప్ప, వాటిని సాక్ష్యంగా తీసుకోజాలమంది. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైళ్లలో ఉంచడం అనవసరమంది. వాళ్లను ఊరికే జైళ్లలో ఉంచి, ప్రజల డబ్బును ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది. వాంగ్మూలాలను చూస్తుంటే నిందితులంతా రాష్ట్రానికి విశ్వాస పాత్రులుగా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనప్పుడు ఏ కారణంతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులను కోరుతారని పోలీసులను నిలదీసింది. చాలా కేసుల్లో ఇంతే.. ఆయా కేసుల్లో రాష్ట్రం తీరు ఎంత మాత్రం సరిగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ల విషయంలో రాష్ట్రం చాలా రొటీన్‌గా వ్యవహరిస్తోందని, దీంతో హైకోర్టులో పుంఖాను పుంఖాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం ఎంతో మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పింది. వీళ్లంతా నవ్వులాటకు ఈ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరంతో పోలీసులను ప్రశి్నంచింది. గంజాయి కేసులో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట గ్రామం వద్ద పట్టుబడిన లారీ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా హనుమంతరావు అనే వ్యక్తిని నిందితునిగా చేర్చి, అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను సేకరించకుండా అతన్ని నాలుగు నెలలుగా జైల్లో ఉంచడంపై మండి పడింది. అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హనుమంతరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హనుమంతరావు నుంచి ఎలాంటి గంజాయిని స్వాదీనం చేసుకోలేదని తెలిపింది. అతనికి వ్యతిరేకంగా పోలీసులు ఒక్క కాగితం ముక్కను కూడా ఆధారంగా చూపలేకపోయారని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ రాష్ట్రం తీరును తీవ్రంగా గర్హించారు. పీపీ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేశారు. -
1,600 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలో 22 ఏళ్ల వరకూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) మేల్స్‌గా సేవలు అందించిన ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. దీంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు దాదాపు ఉద్యోగ విరమణ దశలో..మరికొందరు ఉద్యోగులు ఉన్నారు. 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన 1207 జీవో ద్వారా ఎంపికైన 1,000 మందిని, అనంతర కాలంలో ఈ జీవోను అనుసరించి మరో 500–600 మందిని ప్రభుత్వం నియమించింది. వీరిని విధుల నుంచి తొలగించాలని జిల్లాల డీఎంహెచ్వోలను ఆదేశిస్తూ గురువారం ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఉత్తర్వులిచ్చారు. డీఎంహెచ్వోలు సైతం తొలగింపు ఉత్తర్వులను సదరు ఉద్యోగులకు పంపారు. తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2002లో ఎంపీహెచ్‌ఏల నియామకంలో అర్హతలపై సుప్రీం, హైకోర్టుల్లో కేసులు పడ్డాయి.కోర్టు ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ఏపీలో 1,200 మందిని తొలగించాల్సి ఉండగా వీరిని 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మేరకు జోవో 1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ 1200 మందిలో దాదాపుగా 250 మంది వరకు తెలంగాణకు వెళ్లిపోవాలి. మిగిలిన వారితో (సుమారు 1,000 మంది) కలిపి 2013లో విధుల్లోకి తీసుకున్న దాదాపు 600 మంది కలిపి మొత్తం 1600 మందిని తాజాగా విధుల నుంచి తొలగించారు. వీరందరూ 45–50 ఏళ్లు పైబడిన వాళ్లే. దశాబ్దాల పాటు సేవలు అందించిన తమను మానవతాదృక్పథంతో ప్రభుత్వం విధుల్లో కొనసాగించాలని వీరు కోరుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయడానికి 3 నెలల సమయం ఉందని, వారం కూడా తిరగకుండా హడావుడిగా ప్రభుత్వం విధుల నుంచి తొలగించడంపై మండిపడుతున్నారు.హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి ఆస్కారం ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 2,3 రోజుల్లో కోర్టు మెమోల ద్వారా 2021–24 సంవత్సరాల్లో విధుల్లో చేరిన మరో 1,500 మందిని కూడా విధుల నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం పునరాలోచించాలిఎంపీహెచ్ఏల తొలగింపు విషయాన్ని ప్రభుత్వం పునరా>లోచించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఆస్కార్ రావు కోరారు. కోర్టు తీర్పు ప్రకారం 3 నెలల ముందస్తు నోటీస్ ఇచ్చి, 3 నెలల జీతం ఇచ్చిన తర్వాతే తొలగించాలన్నారు. కనీస నియమాలు పాటించకుండా ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. కొందరు ఉద్యోగులు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. -
బాధితుడినే నిందితుడిగా మార్చారు
సాక్షి, అమరావతి: బాధితుడినే నిందితుడిగా మార్చి.. నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని కుక్కల విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సినీ నటి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినీనటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్ నుంచి బలవంతంగా రూ.కోటి వరకు గుంజితే.. పోలీసులు రివర్స్‌లో అతనిపైనే కేసుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నారని వివరించారు. జత్వానీకి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్‌ను బెదిరించిన మెసేజ్‌లు అందులో ఉన్నాయని తెలిపారు.అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వానీ చాటింగ్ మెసేజ్‌లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని తెలిపారు. జత్వానీ రెండు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికీ రెండో ఆధార్ కార్డు ఇవ్వదన్నారు. జత్వానీ సోదరుడికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానీని ఓ సాధనంగా వాడుకుంటోందన్నారు.ఆ బాధ్యత పోలీసులపై ఉందినిరంజన్రెడ్డి వాదనలపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో సురేష్ రిమాండ్‌ను కోరవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని నందిగంను ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరఫున పీపీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈ నెల 16కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారి చుట్టూ తిరిగే ఓపికలేకే రాజీపడ్డా
సాక్షి, అమరావతి: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా, రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా హైకోర్టు, అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది. మీ మధ్య రాజీ కుదిరిందని అనిత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా? మీరు తప్పుడు కేసు వేశారని వారు చెబుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నించగా, అనిత తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని తెలిపారు. న్యాయస్థానం స్పందిస్తూ, ఇది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారు, శ్రీనివాసరావుకు ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇచ్చారు.. తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. రాజీ కుదిరిపోయిందని, దానిని రికార్డ్ చేసేయాలంటే కుదరదని తేల్చిచెప్పింది. రాజీని రికార్డ్ చేసేందుకు అవసరమైన అన్నీ వివరాలను తమ ముందుంచాలని అనితను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఏపీ జడ్జిగా తెలంగాణ అమ్మాయి
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం గాయత్రి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అక్కడి హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో రెండోసారి పరీక్ష రాసిన గాయత్రి.. ఈనెల 27న వెలువడిన ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం మొండయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు గాయత్రి ఉన్నారు.తండ్రి వ్యవ సాయ కూలీగా గ్రామంలోనే పనిచేస్తున్నారు. కూతురిని కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం చదివించారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు తొలిసారి హాజరైన గాయత్రి.. అప్పుడు విజయం సాధించలేకపోయారు. పట్టుదలతో చదివిన ఆమె రెండోసారి పరీక్షలు రాసి తన లక్ష్యం సాధించారు. కాగా, మొండయ్య ఇద్దరు కుమారులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.