
జెడ్‌ప్లస్ భద్రత ఉన్నా తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం లేదు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి
ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేయడం లేదు
జెడ్‌ప్లస్ ఉన్నవారికి కల్పించే భద్రతా ఏర్పాట్లను చేసేలా ఆదేశాలివ్వండి
నెల్లూరులో తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటుకు సైతం ఆదేశించండి
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్
తాత్కాలిక హెలిప్యాడ్‌కు అభ్యంతరం లేదు.. వైఎస్ జగన్‌కు జెడ్‌ప్లస్ భద్రత ఇస్తున్నాం
ప్రత్యేకంగా రోప్ పార్టీ అవసరం లేదు.. అన్ని వివరాలను కోర్టు ముందుంచుతాం
హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్రదేవ్
తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. నిర్దేశిత విధి విధానాలు వేటినీ పోలీసులు పాటించడం లేదని పేర్కొన్నారు. ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేయడం లేదన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా అవాంఛనీయ ఘటనలకు ప్రభుత్వం, పోలీసులే ఆస్కారం కల్పిస్తున్నారని తెలిపారు.
ఈ నెల 3న వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తున్నారని, అక్కడ తగిన భద్రత ఏర్పాట్లు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. హెలిప్యాడ్ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వివరించారు. కాగా, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... నెల్లూరు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌కు కల్పించనున్న భద్రతకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ
వైఎస్ జగన్ ఈ నెల 3న నెల్లూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో హెలిప్యాడ్‌ల కోసం రెండు స్థలాలను సూచిస్తూ జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) యతీంద్రదేవ్ వాదనలు వినిపిస్తూ, నెల్లూరు జిల్లా జైలు సమీపంలో హెలిప్యాడ్ సిద్ధం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయాన్ని పిటిషనర్లకు చెప్పామన్నారు. వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రత్యేకంగా రోప్ పార్టీ అవసరం లేదన్నారు.
న్యాయమూర్తి స్పందిస్తూ, ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీ ఏర్పాటు చేస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా రోప్ పార్టీని తాను చూశానని తెలిపారు. యతీంద్రదేవ్ స్పందిస్తూ, వైఎస్ జగన్‌కు కల్పిస్తున్న భద్రత విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని.. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు.