
వాళ్ల పార్టీకి 80%.. వీళ్ల పార్టీకి 15%.. మనకేమో 5 శాతమట..
కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేవు
బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతల నిరసన గళం
కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కేలా పని చేస్తా: పీవీఎన్ మాధవ్
సాక్షి, అమరావతి: ‘ప్రతీసారి వాళ్లది 80 శాతం. ఇంకొకళ్లది 15 శాతం. మనది 5 శాతమే అంటున్నారు. ఏందయ్యా 5 శాతం. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఊహించుకోండి. పేరుకే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. అసలు కూటమి పాలనలో బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం, గుర్తింపు రెండూ లేవు. ఇప్పటివరకు ఎన్ని నామినేటెడ్ లిస్టులు ఇచ్చినా కొన్ని పోస్టులు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఏడాదిలోపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లే ఇస్తామంటే కుదరదు.
మా వాటా మాకు ఇవ్వాల్సిందే..’ అంటూ టీడీపీ తీరును పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైనట్లు ప్రకటించే కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలోని ఒక ఫంక్షన్ హాలులో నిర్వహించారు. పీవీఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటకకు చెందిన ఎంపీ పీసీ మోహన్ అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణపత్రాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. తొలుత ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ‘కూటమిలో మన పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవం. నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎన్నిలిస్టులు వచ్చినా బీజేపీకి కొన్ని పోస్టులు కూడా ఇవ్వలేదు’ అని ధ్వజమెత్తారు. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లడుతూ ‘బీజేపీకి ఉన్నది ఐదు శాతమే అంటున్నారు.
ఏందయ్యా ఐదు శాతం. రెడిక్యూలెస్’ అంటూ తీవ్రంగా స్పందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లు ఇస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. కూటమితో కలిసి ఉండాలని, అయితే, బీజేపీ వాటాను తప్పకుండా పొందాల్సిందేనని చెప్పారు. బీజేపీలో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు 15 నుంచి 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారికి న్యాయం చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. ‘బీజేపీ కనుక కూటమిలో కలవకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఏవిధంగా ఉండేవో తెలుసుకోవాలి..’ అంటూ పరోక్షంగా టీడీపీ నేతలను హెచ్చరించారు.
ఒకచేతిలో బీజేపీ జెండా... ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా: మాధవ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలను సమన్వయం చేసుకుంటూ ‘ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా’ అన్నట్టు ముందుకు సాగుతానని చెప్పారు.
ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గౌరవం దక్కేలా, గర్వపడేలా పని చేస్తానని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సమయంలో తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందన్నారు. జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్రం సహకారంతోనే రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు.
మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదు
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా నా తండ్రి పని చేశారు. మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదన్నట్లు మా తండ్రి వ్యవహరించారు. మా అక్కల పేర్లు కూడా ముఖర్జీ, ఉపాధ్యాయ అని వచ్చేలా పెట్టారు. తొలి పుస్తెను పార్టీకి కట్టాను. ఆ తర్వాత నీకు కట్టాను అని మా నాన్న అమ్మకు చెప్పారంట. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాపై నమ్మకంతో పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తా’ అని మాధవ్ చెప్పారు.
ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల తన పదవీకాలంలో ప్రోత్సహించిన, విభేదించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదలు అని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ మాధవ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.