
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ద్వారా తనదైన రాజకీయ క్రీడ సాగిస్తోందా? కొంతకాలం క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అవుననే అనిపిస్తోంది. బీజేపీ అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఈ అవకాశవాదాన్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరుణ తనపై ఉంటే రాజకీయాల్లో ఢోకా ఉండదన్న ధీమాతో పవన్ అనుకుంటున్నారు. అలాగే తమిళనాట పవన్ సినిమా గ్లామర్ తనకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ కూడా భావిస్తోంది. అన్నాడీఎంకేతో పెట్టుకున్న పొత్తుతో తమిళనాడులో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ.
పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాను భుజాన వేసుకుని తిరుగుతుండడం చూస్తుంటే, భవిష్యత్తులో ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. గత అనుభవాల రీత్యా టీడీపీ రాష్ట్రంలో బీజేపీను అంటిపెట్టుకుని ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయినా వచ్చే కాలంలో బీజేపీ, జనసేనలు ఏపీలో కూడా సొంత అజెండాతో ముందుకు వచ్చి టీడీపీని వెనక్కి నెట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ప్రాతిపదిక కనిపించక పోవచ్చు.
కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి జమిలి ఎన్నికలపై మాట్లాడి వచ్చారు. దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బాగుకు జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే కానీ.. పవన్ గతంలో దీనికి పూర్తి వ్యతిరేక భావజాలమున్న పార్టీలతో కలిసి పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై ఒకసారి మంచిదని.. ఇంకోసారి అవి మోడీ నియంతృత్వ ఆలోచన అని వ్యాఖ్యానించారు.
ప్రజలు వీటిలో దేన్ని నమ్మాలి? ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కనుక వారి భావజాలానికి మద్దతు ఇస్తున్నారు. గతంలో పవన్, చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. ఆ పార్టీలు బీజేపీ సిద్దాంతాలకు పూర్తి వ్యతిరేకం. జమిలి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులను హరించడానికే ఈ ప్రతిపాదన అని కమ్యూనిస్టులు విమర్శిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలతో కలిసి పోటీచేసి ఓడిపోయిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీని బతిమలాడుకుని వారితో కలిశారు. సినీ నటుడు కనుక ఎందుకైనా పనికి వస్తారులే అని బీజేపీ కూడా ఓకే చేసింది. చంద్రబాబు నాయుడు అయితే జమిలి ఎన్నికలు మంచిదేనని 2004 కి ముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు అనేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన కూడా కమ్యూనిస్టులతోను, టీఆర్‌ఎస్‌తోను జత కట్టారు.అప్పుడు ఫలితం దక్కకపోవడంతో తిరిగి బీజేపీ చెంతకు చేరారు.
2014లో అధికారంలోకి వచ్చినా, 2018 నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు.ఆ సమయంలో ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, బీజేపీ విధానాలన్నిటిని తీవ్రంగా దుయ్యబట్టేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్,తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి జమిలి ఎన్నికలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన రాగం ఆలపించారు. పశ్చిమ బెంగాల్ లో షర్మిష్ట అనే యూట్యూబర్‌ను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మళ్లీ ప్రస్తావించారు. ఏపీలో సోషల్ మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే పవన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తిరుమల లడ్డూపై అపచారపు మాటలతో సహా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణే సనాతన ధర్మం కాదు కదా.. అసలు ధర్మమే పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదు.
అవకాశవాదమే తమ సిద్దాంతంగా వీరు మలచుకుని రాజకీయాలు చేస్తూ కొంత సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఏవో కొత్త ఆశలు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ ఈయనకు పిలిచి మరీ చాక్ లెట్ ఇచ్చిన ఉత్సాహం ఎటూ ఉంది. దాంతో ఆయన తమిళనాడు వెళ్లి డీఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. జమిలి ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వాలని కోరారు. కరుణానిధి జమిలిని సపోర్టు చేశారని, ఇప్పుడు అందుకు విరుద్దంగా ఆయన కుమారుడు ఎలా వెళతారని పవన్ ప్రశ్నించడం ఆశ్చర్యమే. అందుకే పవన్ పై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. తన తండ్రి కమ్యూనిస్టు ని పవనే చెప్పారు.
అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎలా స్నేహం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే,ఆయనను గౌరవించి ఎందుకు ఆ పార్టీలో చేరలేదని మరొకరు ప్రశ్నించారు. స్టాలిన్ ను విమర్శించే ముందు తను చేసిందేమిటో గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే తమిళనాడు ప్రజలకు ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చన్నది ఆయన విశ్వాసం కావచ్చు. అలాగే ఈవీఎంల గురించి పవన్ మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019లో ఈవీఎంల వల్ల కూడా వైసీపీ గెలిచి ఉండవచ్చని చెప్పిన ఈయన 2024లో మాత్రం ఈవీఎంలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మాదిరి మాటలు మార్చిన వారు ,ఎప్పుడు ఏది అవసరమైతే దానిని మాట్లాడేవారు దేశ రాజకీయాలలో మరొకరు ఉండకపోవచ్చు.
జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివినట్లు అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఆ విషయం వేరే చెప్పనవసరం లేదు. అదే సందర్భంలో సనాతన ధర్మంపై అడిగిన ప్రశ్నకు ఈ భూమి సనాతన ధర్మానిది అని, భారతీయ సంస్కృతిలోనే ఉందని ఆయన అన్నారు. వినడానికి, చెప్పడానికే బాగానే ఉంటుంది. కాని ఆచరణలో పవన్ ధర్మంగా ఉంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. సడన్ గా సనాతని వేషం దాల్చి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అపచారపు మాటలు ,అబద్దాలు చెప్పాలని ఏ ధర్మం చెబుతుందో ఆయనకే తెలియాలి. కులం, మతం అన్ని విషయాలలో పవన్ ఎన్ని అసత్యాలు చెప్పారో పలు వీడియోలు తెలియ చేస్తాయి. కొందరు ఇస్లాం, క్రిస్టియానిటిపై దాడి చేయరట. హిందూ మతంపైనే దాడి చేస్తారట.
ఎల్లో మీడియాలోనే ఈ కథనం వచ్చింది. ఇది చదివితే ఏమనిపిస్తుంది.అన్ని మతాలు సమానం.. ఎవరూ ఎవరిపై దాడి చేయవద్దని చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి అచ్చంగా బీజేపీ భాషను అరువుకు తీసుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతకాలం సహిస్తాం...హిందువులకు ఉన్నది ఒకటే దేశం..అదే ముస్లింలపై దాడి జరిగితే ఊరుకుంటారా..అంటూ యుద్దం చేయాలన్నట్లుగా మాట్లాడిన ఆయన, తదుపరి ఒకటి,రెండు రోజులకే ఏమని అన్నారు.. భారతదేశం శాంతి కోరుకుంటుంది.. సంయమనంగా ఉంటుంది..అని మాట మార్చేశారే. పనిలో పని ఆయన 1985, 1986 ప్రాంతంలో కశ్మీర్‌లో షూటింగ్ లలోపాల్గొన్నట్లు ఏదో కూడా చెప్పారు కదా! దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వచ్చిన వార్తలు చూస్తే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టింది 1971లో అయితే 15 ఏళ్లకే ఎప్పుడు సినిమాలలో నటించారని నెటిజన్లు ప్రశ్నించారు. ఇలా అనేక విషయాలలో రెండు నాలుకల దోరణి అవలంభించే పవన్ కళ్యాణ్ కు పెద్దగా సిద్దాంత, రాద్దాంతాల పని ఉండదన్న భావనతో బీజేపీ ఈయనను తన గేమ్ లో ఒక పావుగా మార్చుకుని ప్రచారానికి వాడుకున్నట్లు ఉంది.ఆంధ్ర ప్రజల మాదిరి తమిళ ప్రజలు ఈ మాటలకు బోల్తా పడతారా!
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.