కూటమి ప్రభుత్వం తాజా టార్గెట్‌ దళిత నేతలు, అధికారులు! | Kutami leaders are targeting Dalit communities in Ap | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం తాజా టార్గెట్‌ దళిత నేతలు, అధికారులు!

Published Sat, Dec 7 2024 11:02 AM | Last Updated on Sat, Dec 7 2024 1:12 PM

Kutami leaders are targeting Dalit communities in Ap

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజకూ అరాచకత్వం పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన అధికార కూటమి తాజాగా రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అరడజను మంది దళిత నేతలతోపాటు ఇదే వర్గానికి చెందిన ఐదుగురు ఆలిండియా సర్వీసు అధికారులను ఈ ప్రభుత్వం వేధిస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా...పలువురు  సామాన్య దళితులు సైతం వివక్ష, అవమానాలకు  గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్రంలో పౌర హక్కులు అనేవి ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న వస్తోంది. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. 

ఒకసారి గతంలోకి వెళదాం... టీడీపీ నేతల ప్రోద్బలంతో నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్ మాస్క్‌లు లేవంటూ అప్పట్లో రచ్చ చేశారు. ఆస్సత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. సుధాకర్‌ ఆ పని చేయకుండా టీడీపీ అండతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారు. దీంతో దీనిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్‌ చేశారు. దీనిపై టీడీపీ అగ్గిమీద గుగ్గిలమైంది. దళిత డాక్టర్‌ను సస్పెండ్ చేస్తారా? అని, అతడి క్రమశిక్షణ రాహిత్యాన్ని వదలివేసి దుర్మార్గపు  ప్రచారం చేశారు. ఆ తర్వాత కొద్ది నెలలకు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో ఒక రోడ్డుపై తాగి గొడవ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించారు.  పోలీస్ కానిస్టేబుల్  వారించినా వినిపించుకోలేదు.

పోలీస్ స్టేషన్ కు రాకుండా గొడవ చేయడంతో, ఆ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి తీసుకువెళ్లారు. ఆ పోటోలు, వీడియోలు తీసి చాలా ఘోరం జరిగిందని దుష్ప్రచారం చేశారు. అంతే తప్ప బాధ్యత కలిగిన ఆ డాక్టర్ అసభ్యంగా వ్యవహరించారని మాత్రం చెప్పకుండా అబద్దాలు వండి వార్చారు. అక్కడితో  ఆగలేదు. వెంటనే  ఆయన పేరుతో హైకోర్టులో పిల్ వేయడం, గౌరవ న్యాయ స్థానం దానిపై సీబీఐ విచారణకు ఆదేశించడం జరిగిపోయింది. కానిస్టేబుల్  పై సీబీఐ విచారణ ఏమిటా అని అంతా నివ్వెరపోయారు. కానీ అప్పట్లో చంద్రబాబు తన న్యాయవాదుల ద్వారా అలా చేయించగలిగారని అంటారు. ఆ తర్వాత సీబీఐ ఏమి నివేదిక ఇచ్చిందో ఎవరికి తెలియదు. మరికొంత కాలానికి సుధాకర్ అనారోగ్యానికి గురై చనిపోయారు. దానికి కూడావైఎస్సార్‌సీపీనే కారణమని టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇదంతా దళితుడు అన్న పేరుతో సాగించిన కుట్రగా అర్థమైంది. 

టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సుధాకర్ ఊసే లేదు. ఆ కుటుంబాన్ని పట్టించుకున్నట్లు  కూడా వార్తలు కనిపించ లేదు. ఇలా ఉంటుంది  టీడీపీ రాజకీయం, ఎల్లో మీడియా దుర్మారపు  ప్రచారం!!!  కారణం ఒకటే! దళిత వర్గాలలోవైఎస్సార్‌సీపీ పట్ల వ్యతిరేకత పెంచాలన్న ప్రయత్నం. కూటమి నాయకత్వానికి దళితులపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది దళితులపై కేసులు  పెట్టి జైళ్లకు పంపుతున్నది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై హత్య కేసుతో సహా పలు కేసులు పెట్టి నెలల తరబడి జలులో ఉంచుతున్నారు. 201419 మధ్యకాలంఓనూ నందిగం సురేష్ పై చంద్రబాబు  ప్రభుత్వం పలు కేసులు  పెట్టింది. 

అమరావతిలో పంటల దగ్ధమైన ఘటనలో జగన్ పేరు చెప్పాలని ఆయనపై పోలీసులు తీవ్ర ఒత్తిడి చేసి హింసించారు. అయినా ఆయన లొంగలేదు. ఆ విషయం తెలిసిన జగన్ తదుపరి సురేష్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన కేసులు ఎదుర్కోవలసి వస్తోంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై ఒక మహిళతో  కేసు  పెట్టించారు. ఆసక్తికరంగా ఆ మహిళ తనతో అధికార పార్టీ నేతలు కొందరు ఒత్తిడి చేసి తప్పుడు కేసు పెట్టించారని అఫిడవిట్ దాఖలు చేశారు.  ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే  తాటిపర్తి చంద్రశేఖర్ ఏపీలో ఉన్న పేకాట క్లబ్‌లు నడుస్తున్న తీరును  విమర్శిస్తూ మంత్రి లోకేష్ పై ఆరోపణలు చేశారు. లోకేష్ దీనిని ఖండించి ఉండవచ్చు. అలా కాకుండా ఏకంగా ఆయనపై పోలీసులు కేసు పెట్టేశారు. ఇదే ప్రామాణికంగా తీసుకుంటే లోకేష్ అప్పటి సీఎం. జగన్ పైతో సహా పలువురు వైఎస్సార్‌సీపీ వారిపై తీవ్రమైన ఆరోపణలు అనేకం చేసేవారని, అప్పట్లో తాము ఇలా కేసులు పెట్టలేదనివైఎస్సార్‌సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

అలాగే నందిగామలో ఎప్పుడో చంద్రబాబు టూర్ లో జరిగిన చిన్న గొడవ మీద మాజీ ఎమ్మెల్యే   జగన్మోహన్ రావు , ఎమ్మెల్సీ అరుణకుమార్ లపై కేసులు పెట్టారు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై కూడా హత్య కేసు బనాయించారనివైఎస్సార్‌సీపీ ఆరోపించింది. వీరంతా దళిత నేతలే.  దళిత నాయకత్వాన్ని దెబ్బతీయడానికే టీడీపీ ఇలా చేస్తోందనివైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. గతంలో ఒక కానిస్టేబుల్ పైనే సీబీఐ విచారణకు ఆదేశించిన న్యాయ వ్యవస్థ,  ఇంతమంది దళిత నేతల విషయాలలో కూడా న్యాయం చేయాలని, తద్వారా పౌర హక్కులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. అధికార వ్యవస్థపై కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం  కక్ష కట్టి పలు వేధింపులకు పాల్పడుతోంది. వీరిలో ఎక్కువమంది దళిత అధికారులు ఉండడం గమనించదగ్గ అంశం. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 201419 మధ్య జరిగిన స్కిల్ స్కామ్‌తోసహా పలు కుంభకోణాలలోవైఎస్సార్‌సీపీ టైమ్‌లో ఆధార సహితంగా కేసులు పెట్టడమే వారు చేసిన తప్పు. దీన్ని మనసులో ఉంచుకుని వారిలో పలువురిని వేధిస్తున్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్‌ను రకరకాలుగా వేధిస్తుండగా, పాల్ రాజు, జాషువా అనే ఇద్దరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం లేదట. మరో సీనియర్ అధికారి విజయపాల్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇందులో విశేషం ఏమిటంటే కుల, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ నిత్యం టీవీలలో మాట్లాడిన అప్పటివైఎస్సార్‌సీపీ అసమ్మతి నేతపై కేసు పెడితే, దానిని డైవర్ట్ చేసి, ఆయనను విచారణలో హింసించారంటూ కొత్త కేసును  ముందుకు తీసుకురావడం. 

ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఎలాంటి హింస లేదని సర్టిఫికెట్ ఇచ్చినా, కూటమి అదికారంలోకి వచ్చాక, మొత్తం కేసును తిరగతోడి, ఐపిఎస్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. వారిని లొంగదీసుకునివైఎస్సార్‌సీపీ నేతలపై కూడా కక్ష సాధించాలన్నది వీరి ప్లాన్ గా చెబుతున్నారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ మార్గదర్శి కేసును విచారించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శిలో రూ. 800 కోట్ల నల్లధనం ఉందని, మార్గదర్శి చిట్స్ లో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేయడమే ఆయన చెసిన తప్పు. ఇప్పుడు దానికి ప్రతిగా ఏదో రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఇక సోషల్  మీడియాలో ప్రభుత్వ దౌర్జన్యాలకు గురి అవుతున్నవారిలో పలువురు దళిత కార్యకర్తలు కూడా ఉన్నారు. రాజమండ్రిలో ఒక దళిత సోషల్  మీడియా యాక్టివిస్ట్ ను  స్టేషన్ కు తీసుకువెళ్లి అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానించారట. ఆ విషయాన్ని అతనే మాజీ ఎంపీ భరత్ సమక్షంలో వివరించారు. జగన్ పాలన సమయంలో ఒక దళిత డాక్టర్ సస్పెన్షన్ నే అంతగా రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితరులు ఇప్పుడు ఇంతమంది దళితులపై ఈ స్థాయిలో జరుగుతున్న  దాష్టికాలకు బాధ్యత వహించరా? 


కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement