కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా? | KSR Comments On TDP-Janasena-BJP Alliance Politics | Sakshi
Sakshi News home page

ఏపీ జనం కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?

Published Sat, Jul 20 2024 2:47 PM | Last Updated on Sun, Jul 21 2024 1:05 AM

KSR Comments On TDP-Janasena-BJP Alliance Politics

ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా? అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటూ మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌, తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు  ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది. చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం.


టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని టీడీపీ వారు భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే  టీడీపీ వారి అంతు చూసే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను బహిరంగంగా, పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది.



గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు. వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీ వారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.

31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక.. ఇప్పుడు తనకు ఏమీ కాదులే.. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది.


ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. ఆ ప్రకారం ఇప్పుడు మర్డర్లు చేసినవారికి మంత్రి హోదా ఏమైనా కల్పిస్తారేమో చూడాలి. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఏపీలో పోలీసు యంత్రాంగం ఎంత అసర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా? అనేది తెలియచేస్తుంది.

తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట. అక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు.


ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే, ఆ పార్టీవారు వైఎస్సార్‌సీపీ వారిని కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం, ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా? లేక రైతులు అంటారా? టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది.

1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్‌కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పాతిక మందికిపైగా హత్యకు గురయ్యారు. 1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.



ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు. వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవలు, హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019లో  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది. అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా, ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం.

బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది. గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి  పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్  చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో  అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు  హింసాకాండలో పాల్గొన్నారు. బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో, ఏమో చూడాలి. తాము  ఇంతమందిని చంపామని, లేదా  ఇంత ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వారిని  కొట్టామని, ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.

ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయారు. సుమారు 500కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేకపోవడం. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది.


టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా గత ప్రభుత్వ టైమ్‌లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్‌సీపీ వారిని మెడలు పిసికాలని, కొట్టాలని.. ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇందిరాగాంధీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటే, ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు.

రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా  చంద్రబాబు పాలన  ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ  ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది. గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ, లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ  ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement