
దేశ జీడీపీలో 55 శాతం
భారతీయుల వద్ద రూ.204 లక్షల కోట్ల విలువైన బంగారం
ఇటలీ ఆరి్థక వ్యవస్థకు సమానం
పాకిస్థాన్ కంటే ఆరు రెట్లు ఎక్కువ
మొత్తం ప్రపంచవ్యాప్త బంగారం నిల్వల్లో భారత్ వద్ద 14 శాతం
యూబీఎస్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద విలువ అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుత ధరల ప్రకారం భారతీయుల వద్ద దాదాపు రూ.204 లక్షల కోట్ల (2.4 ట్రిలియన్ డాలర్లు) విలువైన బంగారం ఉందని స్విస్ ఆర్థిక సేవల సంస్థ– యూబీఎస్ అంచనా వేసింది. ఆది నుంచి బంగారంపై విపరీతమైన మక్కువ కలిగిన భారతీయుల వద్ద 25,000 టన్నులకుపైగా (దేవాలయాలతో కలిపి) ఉన్నట్లు యూబీఎస్ పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లో 2020 నుంచి బంగారం విలువ రెండు రెట్లు పైగా పెరిగితే ఒక్క 2025 సంవత్సరంలోనే 25 శాతం పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ భారీగా పెరిగిందని, ఇది దేశ జీడీపీలో 56 శాతానికి సమానమని పేర్కొంది. అంతేకాదు అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ (2.4 ట్రిలియన్ డాలర్లు), కెనడా (2.33 ట్రిలియన్ డాలర్ల) జీడీపీకి సమానంగా భారతీయులు బంగారాన్ని కలిగి ఉన్నారని తెలిపింది.
అదే మన పక్క దేశం పాకిస్థాన్ జీడీపీ కంటే మన దగ్గర ఉన్న బంగారం విలువ ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారంలో అత్యధికంగా 14 శాతం వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉందని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని అంశాలు...
తాకట్టుకూ ఇష్టపడటం లేదు...
భారతీయుల సంప్రదాయం ప్రకారం బంగారంతో విడదీయరాని ఆధ్యాతి్మక అనుబంధం కూడా ఉంది. దీనితో వాటిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. భారతీయులు తమ వద్ద ఉన్న బంగారంలో రెండు శాతం మాత్రమే తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన గోల్డ్ మోనటైజేషన్ స్కీం, సావరిన్ గోల్డ్ బాండ్ పథకాలు కూడా విఫలమయ్యాయి. భౌతిక కొనుగోళ్లనే ఇష్టపడ్డం, పసిడి విక్రయాలకు ససేమిరా అనడం దీనికి ప్రధాన కారణం.
» అంతర్జాతీయంగా యుద్ధభయాలు , ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భారతీయుల సంపద మరింత పెరగనుంది.
» బంగారంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి.
» బంగారం ధరలు భారీగా పెరుగుతున్నా, భారతీయులకు బంగారంపై మక్కువ తీరడం లేదు. కొనుగోళ్లకు వెనుకడుగు వేయడం లేదు.
» 2025లో 782 టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేస్తుందని అంచనా. అయితే ఇప్పుడు ఆభరణాల కంటే పెట్టుబడుల రూపంలో అంటే నాణేలు, బంగారు కడ్డీల రూపంలో అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బంగారం ఆభరణాల కొనుగోళ్లలో స్వల్ప క్షీణత నమోదవుతున్నప్పటికీ, నాణేలు, బంగారు కడ్డీల కొనుగోళ్లలో వార్షికంగా 25 శాతం పెరుగుదల నమోదవుతోంది.
» గతేడాది కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గడంతో బంగారంలో పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది.
» వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ అమలు చేయనుండటంతో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని అంచనా.