
విజయవాడలో యువ వైద్యులను బలవంతంగా లాక్కెళ్తున్న పోలీసులు
వైద్యుల దినోత్సవం రోజునే వారి గొంతు నొక్కిన ప్రభుత్వం
శాంతియుత నిరసన చేస్తున్న యువ వైద్యులపై పోలీస్ జులుం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): జాతీయ వైద్యుల దినోత్సవం రోజునే యువ వైద్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తున్న వైద్యులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విదేశాల్లో వైద్య విద్య చదివిన తమకు మెడికల్ కౌన్సిల్ శాశ్వత రిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేస్తూ, తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నారని యువ వైద్యులు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగారు.
కాగా 36 గంటల అనంతరం మంగళవారం వీరి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేస్తున్న తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రజలకు సేవ చేయడం కోసం రాష్ట్రంలో సీట్ దక్కక కష్టపడి విదేశాల్లో వైద్య విద్య చదివామన్నారు.
వైద్యుల దినోత్సవం అని కూడా చూడకుండా అదే రోజున తమను పోలీసు వాహనాల్లోకి ఈడ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైద్య శాఖమంత్రి సత్యకుమార్‌యాదవ్‌తో పాటు, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు.
వైద్య విద్యార్థుల అరెస్టును ఖండిస్తున్నాం..
వైద్య విద్యార్థులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. విద్యార్థులకు పర్మినెంట్ రిస్ట్రేషన్ చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? రూ.కోట్లు ఖర్చు చేసి తమ పిల్లలను విదేశాల్లో డాక్టర్లుగా చదివించుకోవడం నేరమా? తమకు వెంటనే రిస్ట్రేషన్ చేయాలంటూ వారు డిమాండ్ చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం తప్పా? బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి వార్నింగ్ ఇవ్వడమేంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు.