doctors
-
మహమ్మారి కాదు మామూలు వైరస్సే
సాక్షి, హైదరాబాద్: ‘హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ)’ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 50, 60 ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.దేశంలో కేసుల నమోదుతో ఆందోళనచైనాలో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, చెన్నైలలో రెండు చొప్పున, అహ్మదాబాద్, కోల్‌కతాలలో ఒక్కో హెచ్ఎంపీవీ కేసు మాత్రమే నమోదయ్యాయి. మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.శ్వాస మార్గంలో వృద్ధి చెందే లక్షణంతో..కరోనా వైరస్ తరహాలోనే హెచ్ఎంపీవీ కూడా ‘ఆర్ఎన్ఏ’ రకం వైరస్. అందువల్ల దీనిలోనూ కరోనా తరహాలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒంటి ఒప్పులు తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రధానంగా మనం శ్వాస తీసుకునే మార్గం (రెస్పిరేటరీ ట్రాక్ట్)లోనే వృద్ధి చెందుతుందని... అంటే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల తరహాలో కొన్నిరోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని వివరిస్తున్నారు. ఇది కలసి వచ్చే అంశమని పేర్కొంటున్నారు. వైరస్ ప్రధానంగా నోటి తుంపరలు, తుమ్ముల ద్వారా వెలువడే తుంపరల ద్వారా వ్యాపిస్తుందని... ఆ తుంపరలు పడిన చోట తాకడం, వైరస్ సోకినవారిని తాకడం ద్వారా ఇతరులకు విస్తరిస్తుందని స్పష్టం చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.ఆందోళన వద్దుకరోనాలా వ్యాప్తి చెందుతూ ఉత్పాతం సృష్టించే లక్షణం హెచ్ఎంపీవీకి చాలా తక్కువ. కరోనా సమయంలోలాగే తుమ్ములు, దగ్గు నుంచి వచ్చే తుంపర్లకు దూరంగా ఉంటూ, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటే ఈ వైరస్ వల్ల ప్రమాదం దాదాపుగా ఉండదు. పైగా ఇప్పుడు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆందోళన అవసరం లేదు.– డాక్టర్ గురవారెడ్డి, సన్‌షైన్ హాస్పిటల్స్జాగ్రత్తలతో నివారణ సాధ్యమేచిన్నపాటి ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలు హెచ్ఎంపీవీ వైరస్‌ను దాదాపుగా నివారించవచ్చు. మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రపర్చుకుంటూ ఉండాలి. వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సమయానికి వ్యాక్సిన్లన్నీ ఇప్పించాలి. పెద్దలు, వృద్ధులు జలుబు వంటి లక్షణాలున్నవారి నుంచి దూరంగా ఉండాలి.– డాక్టర్ జయచంద్ర, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తచైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఈ ఆర్ఎన్ఏ వైరస్‌ను 2001లో గుర్తించారు. అప్పటి నుంచి ఇది ఏటా చలికాలంలో చిన్న పిల్లలు, వృద్ధుల్లో సీజనల్ వైరల్ అనారోగ్యంగా కొనసాగుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులకు మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. – జీసీ ఖిల్నానీ, ఢిల్లీ ఎయిమ్స్ పల్మనరీ విభాగం మాజీ హెడ్అతిగా భయాందోళన అనవసరంహెచ్ఎంపీవీ వైరస్ గురించి అతిగా భయాందోళనకు గురికావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అయితే బయటికి వెళ్లినప్పుడు, గుంపుల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటిదాకా వెల్లడైన అంశాల మేరకు ఈ వైరస్ చాలా స్వల్ప లక్షణాలు కలిగి ఉంటుంది. సాధారణ జలుబు మాదిరిగా ముక్కు కారడం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, శ్వాస తీసుకునేప్పుడు ఈల వేసినట్టు శబ్దాలు రావడం, శరీరంపై దద్దుర్లు రావడం వంటి వాటి ద్వారా దీనిని గుర్తించవచ్చు. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రిమహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రిహెచ్ఎంపీవీపై నిపుణుల కమిటీ⇒ నియమించిన వైద్య, ఆరోగ్య శాఖ⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసూ లేదు⇒ ఎలాంటి భయాందోళనలు వద్దుసాక్షి, అమరావతి: చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్, బెంగళూరుల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ప్రకటించింది. కేరళలోనూ వైరస్ కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రిక్స్, పల్మనాలజిస్ట్, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ అధికారులతో ఈ అంశంపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసులు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు 10, వీఆర్డీఎల్ ల్యాబ్‌లు 9 సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి టెస్టులకు కావాల్సిన కిట్లు, యాంటీవైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలన్నారు. డీఎంఈ, డీహెచ్, సెకండరీ హెల్త్ ఇలా అన్ని విభాగాల అధిపతులు హెచ్ఎంపీవీ లక్షణాలకు సంబంధించిన కేసుల నమోదును క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు సూచించారు. వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. అప్రమత్తంగా ఉండండి: సీఎంహెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి, వెళ్లే వారిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ఆదేశించారు. -
శుభమస్తు.. ఆరోగ్య‘మస్త్’
కొత్త ఏడాది నాడు.. పెద్దలు దీవెనలిస్తారు.. ఫ్రెండ్స్ విషెస్ చెబుతారు .. పిల్లలకు కానుకలిస్తారు మరి పెద్ద పెద్ద డాక్టర్లో..? కొత్త సంవత్సరంలో ‘అందరికీ ఆరోగ్యమస్తు’ అని దీవిస్తూనే.. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహా–సూచనలను ‘కన్సల్టేషన్’గా అందిస్తున్నారు. దాన్నే సమగ్రంగా, సంక్షిప్తంగా, చిరు కానుకగా ప్రత్యేక పేజీ రూపంలో ‘సాక్షి’ అందిస్తోంది. ‘ఓమ్’ ప్రథమం గట్ బయోమ్జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. గతంలో జీర్ణవ్యవస్థ అనేది కేవలం జీర్ణం చేయడానికి ఉపయోగడపతుందని అనుకున్నారు. ఇటీవలి పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే జీర్ణవ్యవస్థలో కోటాను కోట్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయనీ, ‘గట్ బయోమ్’గా పేర్కొనే వీటి సమతౌల్యత వల్లనే మానసిక ఆరోగ్యం, వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడం వంటివన్నీ ఆధారపడి ఉంటాయని తెలిసింది.అంటే ఓ వ్యక్తి ఆహారం అరిగించడంలోనే కాకుండా, అతడు తినే పదార్థాల తీరు తెన్నులు అతడి మానసిక ఆరోగ్యాన్నీ, రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్దేశిస్తుంటాయన్నమాట. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి. మంచి జీవనశైలిని అనుసరిస్తూ, పూర్తిగా సమతులాహారం తీసుకుంటూ ఉంటే గట్ బయోమ్ సమతౌల్యత బాగుంటుంది. మన భారతీయ సంప్రదాయ ఆహారంలో మొక్కలూ, వృక్షాల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకుంటుంటాం. అంటే... మనం తినే అన్నంలోనే కాయధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు పులవడానికి సిద్ధంగా ఉండే ఇడ్లీ, దోశలు, భోజనం చివర్లో పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయాటిక్ ఆహారాలను తీసుకుంటాం. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగా, సమతౌల్యంగా ఉండేలా చూస్తాయి. ఇటీవల మనం తీసుకుంటున్నప్రాసెస్డ్ ఫుడ్, చక్కెరతో చేసే తీపిపదార్థాల్లో ఇవి అంతగా ఉండవు. అందుకే మంచి సమతులాహారం తీసుకోవడంతో పాటు మంచి జీవనశైలిలో భాగంగా ఒంటికి తగినంత శ్రమ కలిగేలా తేలికపాటి వ్యాయామాలు, వేళకు కంటి నిండా నిద్రపోవడం వంటి చర్యలతో గట్ బయోమ్ సమతౌల్యత సమర్థంగా నిర్వహితమవుతూ ఉంటుంది. దీనివల్ల మంచి జీర్ణక్రియ, తిన్నది ఒంటికి పట్టడమే కాకుండా మంచి మూడ్ (భావోద్వేగాల) నిర్వహితమవుతుండటం, వ్యాధి నిరోధక వ్యవస్థ చురుగ్గా, క్రియాశీలకంగా మారడం, పూర్తిస్థాయి భౌతిక, మానసిక ఆరోగ్యాల నిర్వహణ జరుగుతాయి. అందుకే స్వాభావికమైన, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పులవడానికి సంసిద్ధంగా ఉండే పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్, తేలికపాటి వ్యాయామాలతో గట్ బయోమ్ సమతౌల్యతతో నిర్వ‘హిత’మయ్యేలా చూసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. - డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ,సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ చైర్పర్సన్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకదలికే ‘కీళ్ల’కంపోషకాలు తీసుకోవడానికి జాయింట్స్‌కు నోరు లేదు. అదెలాగంటారా? మన దేహంలోని ప్రతి కణానికీ రక్తం ద్వారా పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండటం వల్ల వాటికి నేరుగా న్యూట్రియెంట్స్ (పోషకాలు) అందుతాయి. కానీ, కీళ్ల విషయం వేరు. అవి రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండవు. మరి వాటికి పోషకాలు అందడమెలా? కీళ్లు ఎంతగా కదులుతుంటే అంతగా వాటికి పోషకాలు అందుతాయి. ఒకవేళ శరీరం కదలికలు మందగించి, కీళ్లలో కదలిక లేకపోతేనో?... అప్పుడు వాటికి పోషకాలు అందవు. నేరుగా రక్తప్రసరణ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న కణాలకు ఉన్నట్లు వాటికి సప్లై ఉండదు కాబట్టే... వాటికి నోరు లేదు అన్నది. నోరున్న వాడు నోరు చేసుకు బతుకుతాడు. మరప్పుడు నోరు లేని కీళ్లు కష్టం చేసుకుని బతకాల్సిందే కదా. అందుకే కీలాడితే గానీ వాటికి బతుకాడదు. అందుకే కీళ్ల ఆరోగ్యం బాగుండాలంటే, వాటికీ పోషకాలు అందాలంటే వ్యాయామం తప్పనిసరి అన్నమాట. ఇక మరోమాట... ఎవరిలోనైనా కీళ్లు బాగా అరిగిపోతే (అంటే కీళ్లపై ఉండే కార్టిలేజ్ అనే ΄పోర అరిగితే) అప్పుడు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది కీళ్లలోకి ఇంజెక్షన్ ఇస్తామంటూ పీఆర్పీలు, స్టెరాయిడ్స్ ఎక్కిస్తారు. అవి అందగానే నొప్పులన్నీ తగ్గుతాయి. దాంతో ఇంజెక్షన్‌తోనే నొప్పి అంతా తగ్గిపోయిందంటూ చాలామంది ఆనందపడతారు. అలాంటి ఇంజక్షన్స్ చేయమంటూ ఆర్థోపెడిక్ సర్జన్ల దగ్గరికి రోజూ పదుల సంఖ్యలో వస్తుంటారు. నాలుగో స్టేజీలో ఉన్న మోకాళ్ల ఆర్థరైటిస్‌కి ఏ డాక్టర్ అయినా పీఆర్పీ ఇంజెక్షన్ ఇస్తే అతడు డాక్టర్ కాదు... ఆపరేషన్ అంటే భయపడే అమాయకులైన పేషెంట్లను మోసం చేస్తున్నాడని గ్రహించాలి. ఇంజెక్షన్ చేయడమనేది ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు మొదలు కాం΄ûండర్లూ చేయగలిగేదే. స్టెరాయిడ్స్ ఇవ్వడంతో తొలుత నొప్పులు ఉపశమించినట్లు కనిపించినా... ఆ తర్వాత అవి బోలుగా మారడం, తేలిగ్గా విరగడం జరుగుతుంది. మహామహా కీళ్లమార్పిడి నిపుణులు చిన్నపాటి ఇంజెక్షన్ చేయలేరా? ఎందుకు చేయరంటే బాధితుల పాలిట అదో ద్రోహం. వాళ్ల ఎముకల్ని గుల్ల చేసేసే ఓ అనైతిక (అన్ ఎథికల్) పద్ధతి. అందుకే కీళ్లు పూర్తిగా అరిగాక ఎవరైనా ఇంజెక్షన్స్‌తో మాన్పిస్తామంటే... వాళ్లు నొప్పి నివారణ మందులూ, స్టెరాయిడ్స్ కలిపి ఇంజెక్షన్ చేస్తూ, దీర్ఘకాలికంగా ఎముకల్ని గుల్ల గుల్ల చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. -డాక్టర్ గురవారెడ్డి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల నిపుణులుమూత్ర పిండం బ్రహ్మాండంగా ఉండాలంటే..గతంలో పెద్దవయసు వారిలోనే కనిపించే చాలా ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చిన్నవయసు వారిలోనూ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ఆరోగ్య స్పృహ కారణంగా ముందుగానే చేయిస్తున్న వైద్య పరీక్షల వల్ల అనేక జబ్బులు బయటపడటమూ జరుగుతోంది. దీనివల్ల రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది... జబ్బులు బయటపడటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా పెరిగిందనేది ఆందోళన కాగా... ఇక రెండో అంశం... ఆరోగ్యస్పృహ ఇంతగా పెరగకపోయి ఉంటే, అవి మరింత ముదిరాక బయటపడి ఇంకా సమస్యాత్మకంగా మారేవనే పాజిటివ్ అంశం.ఉదాహరణకు గతంలో మూత్రవ్యవస్థకు సంబంధించిన జబ్బుల్లోనూ కిడ్నీల్లో రాళ్లు, పెద్దవయసువారిలో మూత్ర విసర్జన కష్టం కావడం ఇక డయాబటిస్, హైపర్‌టెన్షన్ బాధితుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. కానీ ఇటీవల యుక్తవయసువారిలోనూ, ఆమాటకొస్తే చాలా చిన్నపిల్లల్లోనూ కిడ్నీలో రాళ్ల సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణం కావచ్చు. మన ఆహారపు అలవాట్లు, కలుషిత వాతావరణం, జీవనశైలి మార్పులు వంటివి కారణాలు కావచ్చు. అయితే ఇప్పుడు ఓ ఆరోగ్య సమస్య వచ్చిందంటే... ఉదాహరణకు ‘కిడ్నీలో రాళ్లు’ సమస్యను తీసుకుంటే... ఇటీవల అత్యాధునికమైన వైద్య ప్రక్రియలూ, లేజర్లు, రొబోటిక్ సర్జరీలూ అందుబాటులోకి రావడంతో కోత, గాటూ లేకుండా, రక్తం చిందకుండా సర్జరీ చేస్తున్నామని అనుకోవడం తప్ప అసలివి రాకుండా చేసుకోవడానికి నివారణలేమిటి అనే ఆలోచనకు తావులేకుండా పోయింది. నిజానికి మనం ఆలోచించాల్సింది వ్యాధుల నివారణ గురించే. ఉదా: కిడ్నీలు, మూత్ర వ్యవస్థ విషయానికి వస్తే... రాళ్లు ఏర్పడటానికి ఆస్కారమిచ్చే ఆహారానికి దూరంగా ఉండటం, నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వంటి నివారణ చర్యల గురించి గురించి ఆలోచించాలి. సమాజంలో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా పెరిగింది. వీటన్నింటికీ కారణం మన జీవనశైలిలోని మార్పులే. దీనికి తోడు మన జీవితాల్లో పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్) కూడా మరో ప్రధాన కారణం. దీనివల్లనే హైబీపీ, డయాబెటిస్... మళ్లీ వీటివల్లనే కిడ్నీ జబ్బులు... ఇలా ఓ చైన్ రియాక్షన్‌లా కొనసాగుతున్నాయి. ఇవన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల జరుగుతున్నాయని గ్రహించి మన లైఫ్‌స్టైల్‌ను పునర్నిర్వచించుకొని హెల్దీ జీవనశైలిని అనుసరించాలి. -డాక్టర్ మల్లికార్జున ఎండీ అండ్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీమీరు బరువైతే గుండె చెరువేగుండెను అందరూ పదిలంగా చూసుకోవాల్సిన అవసరముంది. అందుకు కొన్ని సూచనలు... ⇒ మనం మన ఒత్తిడి (స్ట్రెస్)కి కారణమైన అంశాలని చెబుతున్న వాటిల్లో 90 శాతం అంశాలు అంతగా ఒత్తిడికి గురిచేసేవే కాదు. అసలు స్ట్రెస్ కంటే... మనం దానికి భయపడుతున్న తీరే ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే పరిష్కార మార్గాలు ఆలోచిస్తే స్ట్రెస్ దానంతట అదే తగ్గిపోతుంది. ⇒ మహిళలకు ప్రత్యేకంగా చెబుతున్న విషయమేమిటంటే... నిత్యజీవితంలోని ఒత్తిడి (స్ట్రెస్) పురుషులకంటే మహిళలకే ఎక్కువగా హాని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. మహిళలు ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం గుండెకు మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే రక్షణ తొలగిపోతుంది కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక స్థైర్యాన్ని మరింతగా పెంచుకుంటూ, సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరముంది.ఇందుకోసం చేయాల్సిన పనులూ సులువు కూడా. మొబైల్ ఫోన్‌ను పరిమితంగా వాడితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే టెలివిజన్‌కే అంటిపెట్టుకొని ఉండటం. ఒకేచోట కూర్చుని అదేపనిగా వీటిని వాడుతుంటే స్థూలకాయం వస్తుంది. ఇది కేవలం గుండెకే కాదు... అనేక ఆరోగ్య అనర్థాలకు కారణం. ఆరోగ్యకరమైనవి తింటూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉంటే కేవలం గుండెజబ్బులే కాదు... ఇతర వ్యాధులూ తగ్గుతాయి. -డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ హాస్పిటల్స్ఈ ఎన్ టీ ‘తల’మానికంమన ముక్కు చెవులనూ, అలాగే మన తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే మెడ... వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ చెవుల సంరక్షణ కోసం... ∙అతి భారీ శబ్దాలు వినికిడి సమస్యను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలాచేయడం వల్ల అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాకపోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. ఇక ముక్కు ఆరోగ్యం కోసం... ⇒ అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకునేందుకు నీళ్లు తాగుతూ హైడ్రేటిడ్గా ఉండాలి. ⇒ ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసం... ⇒ స్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్య మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ⇒గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి చిట్కా. మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితో పాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయని గ్రహించాలి. -డాక్టర్ ఈసీ వినయ కుమార్ హెచ్ఓడీ అండ్ సీనియర్ ఈఎన్టీ సర్జన్, అపోలో హాస్పిటల్స్ఇంటి పని ఒంటికి మంచిదిమంచి వ్యాయామంతో ఇటు కీళ్లూ, అటు గుండె రెండూ ఒకేసారి ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ వ్యాయామాలు చేయడానికి తమకు సమయం లేదంటూ చాలామంది చెబుతుంటారు. ఈరోజుల్లో కొన్ని ఇంటి పనులు అందరూ చేయాలి. ముఖ్యంగా ఇంట్లోని ఇల్లాళ్లతో పాటు ఇంటి మగవాళ్లు కూడా. ఉదాహరణకు... తోటపనీ, వస్తువులు తేవడం, లేవగానే బెడ్‌షీట్స్ మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం, తుడవడం ఇవన్నీ ఇంట్లోని మహిళలు చేయాల్సిన పనులుగా చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ ఇవన్నీ చేస్తే కీళ్లకు కదలికలు సమకూరి వాటి ఆరోగ్యం మెరుగుపడటం, పోషకాలు అందడం జరుగుతాయి. ఇవే పనులు గుండెజబ్బుల ముప్పునూ తప్పిస్తాయి. అంటే ఒకే పనితో ఎన్నో ప్రమోజనాలుంటాయి.ఉదా: క్రమం తప్పని వ్యాయామం వల్ల గుండె బలంగా అవుతుంది. (కీళ్లు కూడా) అంతేకాదు... పది లక్షల సార్లు గుండె కొట్టుకుంటే కలిగే శ్రమను ఒక్కసారి చేసే వ్యాయామం దూరం చేస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఎముకలు బలంగా మారతాయి. ఒత్తిడీ, నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. చాలామంది పురుషులు ΄పోగతాగడం, మద్యంతాగడం తమ జన్మహక్కుగా భావిస్తారు. పైగా కొద్దిపాటి మద్యం గుండెకు మేలు చేస్తుందని సమర్థించుకుంటారు. కానీ... ΄పోగ, మద్యం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు పరచడానికి కొత్త సంవత్సరాన్ని ఒక సందర్భంగా తీసుకుంటారు. మీ నిర్ణయం ఏదైనా... అంటే వ్యాయామం చేయడం, బరువు తగ్గడం, ΄పోగ, మద్యం వంటి అలవాట్లు మానేయడం... ఇవన్నీ వాయిదా వేయకండి. ఇప్పుడే ఈ కొత్త సంవత్సరంలో మొదలుపెట్టండి. -డాక్టర్ గాయత్రి కామినేని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, కామినేని హాస్పిటల్స్డబ్బు జబ్బుకు ‘బీమా’త్రలుగత కొన్నేళ్లుగా పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా క్యాన్సర్లు అలాగే లైఫ్‌స్టెల్ డిసీజెస్ అని పిలిచే హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వంటివి విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. జబ్బు వచ్చాక చికిత్స ఎలాగూ తప్పదు. ఇప్పుడు వీటి చికిత్సల గురించి ఆలోచించడం కంటే అసలివి రాకుండా ఉండేలా నివారణ చర్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇదో మంచి సమయం. ప్రస్తుత కాలం చాలా అనిశ్చితంగా ఉంది. మన ఆర్థిక పరిస్థితుల్లోగానీ రోజువారీ కార్యక్రమాల్లోగానీ ఎలాంటి మార్పులు వస్తాయో తెలియని అనిశ్చితి. అందుకే మున్ముందు మనందరి ఆరోగ్యాల రక్షణ కోసం, చికిత్సల కోసం మెడికల్ ఇన్సూ్యరెన్స్ను సిఫార్సు చేస్తున్నాను. మీతో పాటు మీ కుటుంబమంతటికీ ఇన్సూ్యరెన్స్ వచ్చేలా పాలసీ తీసుకోండి. క్యాన్సర్లు వస్తే అయ్యే ఖర్చులకు బెంబేలెత్తడం కంటే అవి రాకుండా నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలు చాలా సులువైనవి. సమాజంలోని అందరూ... ముఖ్యంగా నలభై దాటిన ప్రతివారూ తరచూ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అయితే ప్రస్తుతం సాంకేతిక మార్పులతో అందుబాటులోకి వచ్చిన చికిత్సలకు అయ్యే ఖర్చు తడిసిమోపెడు కానుంది. ఆ ఖర్చులు తట్టుకోవాలంటే ఇన్సూ్యరెన్స్ ఒక మార్గం. వాటితో పాటు మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తూ నివారించుకోవడం మరో మార్గం. ఈ రెండు మార్గాలను ఎంచుకుని మనల్ని మనం అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థికంగా కాపాడుకోవడం మన చేతుల్లో ఉన్న పని. - డాక్టర్ బి. కిశోర్‌రెడ్డి ఎండీ అమోర్ హాస్పిటల్స్, అండ్ చీఫ్ ఆర్థో ఆంకాలజిస్ట్ అమోర్ హాస్పిటల్ఆరోగ్యానికి బోన్.. మెయిన్ఒక భవనం పడిపోకుండా స్థిరంగా ఉండాలన్నా, ఈ దేహం ఒంగిపోకుండా నిటారుగా నిలబడాలన్నా... చిత్రంగా ఈ రెంటికీ అవసరమైనది క్యాల్షియమ్. దాదాపు 30 ఏళ్ల వయసులో ఇది గరిష్టంగా ఉండి, ఆ తర్వాత అనేక అంశాల కారణంగా ఇది కొద్దికొద్దిగా తగ్గుతూ పోతుంటుంది. అయితే దాన్ని మరింత కాలం నిలుపుకుంటూ దేహపు ఫ్రేమ్ వర్క్ అయిన ఎముకల సాంద్రతను (బోన్ డెన్సిటీని) గరిష్టకాలం పాటు నిలుపుకోవాలంటే చేయాల్సింది చాలా సులువైన పనులే. మంచి సమతులాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడం. ఎముకల ఆరోగ్యాన్నీ, సాంద్రతనూ నిలుపుకోవడానికి తీసుకునే ఆహారంలోనూ రుచికరమైనవే ఎక్కువ. ఉదాహరణకు పాలు, వెన్న లాంటి డెయిరీ ఫుడ్స్; చిక్కుళ్లు, బెండకాయ, క్యాబేజీ, బ్రాకలీ లాంటి రుచికరమైన కూరగాయలు; టేస్టీగా ఉండే అంజీర్ లాంటి ఎండుఫలాలు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్‌తో పాటు చాలామంది టేస్టీగా ఫీలై తినే చేపలు. ఇవి ఎముకలతో పాటు మొత్తం దేహ సంపూర్ణ ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అయితే వ్యాయామాలు లేకుండా కేవలం ఆహారాలు మాత్రమే ఎముకల సాంద్రత పెంచలేవు. అందుకే... నడక వంటి తమకు అనువైన వ్యాయామాలతో పాటు శ్రమ ఎక్కువగా చేయలేనివారు నడకతో పాటు ఇతరులు సైక్లింగ్, జాగింగ్, ఈత, తమకు ఇష్టమైన స్పోర్ట్స్ ఆడటం వంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తుంటే ఎముకలలోని క్యాల్షియమ్ చాలాకాలం పదిలంగా ఉంటుంది. -డాక్టర్ సుధీర్‌రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్‌కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్‌లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో ఎగ్జామినేషన్ గ్లౌజ్‌లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్‌సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్‌సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్‌తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్‌లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్‌కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
గత సర్కారు ముందుచూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు చెక్ పెట్టడం కోసం 2019–24 మధ్య ఏకంగా 54 వేల వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది.ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా గతేడాది మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్ల(ఎంవో)కు గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని 22.30 శాతం మేర ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా, కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్ర మే ఉన్నట్టు స్పష్టమైంది. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది.ఇందులో భాగంగా ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేసింది. మరోవైపు పట్టణ పీహెచ్‌సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. కేరళ రాష్ట్రంలోని గ్రామీణ పీహెచ్‌సీల్లో సైతం 5.22 శాతం ఎంవోల కొరత ఉంది. కర్ణాటకలో 14.21 శాతం, తమిళనాడులో 11.58, తెలంగాణలో 36.27 శాతం మేర వైద్యుల కొరత ఉంది.ఉత్తరాదిలోని యూపీలో ఏకంగా 36.44 శాతం, బిహార్‌లో 34.62, గుజరాత్లో 17.69 శాతం వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో దేశం మొత్తం 46,692 నర్సు పోస్టులకు గాను 10,814 పోస్టులు(23.16 శాతం) ఖాళీగా ఉన్నాయి. యూపీలో 64.94 శాతం, బిహార్‌లో 35.59 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. ఏపీలో 4.74 శాతం పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. నాడు ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ⇒ 2019–24 మధ్య వైద్యశాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఉద్యోగ విరమణలు, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ⇒ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలను ఇచ్చి మరీ పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు 61 శాతం దేశవ్యాప్తంగా కొరత ఉండగా, రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉండేది. వీటన్నింటికీ తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులను సైతం అందుబాటులో ఉంచింది. ⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడించింది. దీంతో వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ అవ్వక ప్రజలకు వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
నిద్రలో పళ్ల సెట్ మింగిన విశాఖపట్నం వాసి
సాక్షి, విశాఖపట్నం: పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంత వైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది.కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఊరికి బంధువులొస్తున్నారుసాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు. -
Year Ender 2024: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. నిత్యం ఇవే వార్తలు
హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హృద్రోగాల బారినపడి ఏటా లక్షలాదిమంది మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2024 కూడా గుండె ఆరోగ్యానికి సవాలుగా నిలిచింది. గుండెపోటు, గుండె ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది లక్షలాదిమంది మృతిచెందారు.కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో గుండె జబ్బులు అధికంగా నమోదవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. 2024లో తీవ్రమైన గుండె సమస్యల కారణంగా మన దేశంలో లక్షలాది మంది మృతిచెందారు. 2024, ఫిబ్రవరి 20న ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ (59) గుండెపోటుతో మరణించారు. రితురాజ్.. హిట్లర్ దీదీ తదితర టీవీ షోలలోనటించారు. అదేవిధంగా నటి కవితా చౌదరి కూడా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె ఉడాన్ తదితర సీరియళ్లలో నటించారు. టీవీ నటుడు, మోడల్ వికాస్ సేథి కూడా 48 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు.గుండెపోటుతో పాటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు ఈ ఏడాది అందరిలోనూ ఆందోళనను పెంచాయి. 2024 జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే(47) గుండెపోటుతో మరణించారు. కాగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనేవి రెండు వేర్వేరు స్థితులు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకి ఏర్పడిన కారణంగా, గుండెకు రక్త ప్రసరణ అందడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ స్థితిలో గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది.కరోనా ఇన్ఫెక్షన్, మరణాల ముప్పును తగ్గించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ టీకా గుండెపోటుతో పాటు మరణాల కేసులు పెరిగాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవని, ఎలాంటి సమస్యలు తలెత్తవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని, అందుకే ముందస్తుగా గుండెపోటు వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెపోటు వచ్చిన బాధితునికి వెంటనే సీపీఆర్ అందించడం ద్వారా అతని ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. గుండె జబ్బుల ముప్పును నివారించడానికి సరైన జీవనశైలిని అనుసరించడం, పోషక ఆహారాన్ని తీసుకోవడం రక్తపోటును, షుగర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి, అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం లక్నోలో ఓ వివాహ వేడుకకు హాజరైన వైద్య విద్యార్థులు కారులో సైఫాయికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.మృతుల్లో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మొరాదాబాద్‌లోని బుద్ధ విహార్‌కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..
ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కష్టం. అలాంటిది ఒక కుటుంబంలో మొత్తం 140 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. ఇలా ఎక్కడోగానీ జరగదు. తరతరాలు ఓకే వృత్తిని కుటుంబ వారసత్వంగా కొనసాగిస్తూ.. ప్రతి తరంలో ఒక వ్యక్తి దాన్ని అనుసరించడం విశేషం. ఇలా ఐదు తరాలు వైద్య వృత్తినే అనుసరించారు. ఆ ఇంటికి వచ్చిన కోడలు కూడా డాక్టరే అయ్యి ఉండాలట. అంతేగాదు ఐదు తరాలుగా ప్రతి ఒక్క సభ్యుడు డాక్టర్‌గా ఉన్న ఏకైక కుటుంబంగా అరుదైన రికార్డుని దక్కించుకుంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..డిల్లీకి చెందిన సబర్వాల్ కుటుంబం ఈ ఘనతను దక్కించుకుంది. ఇదంతా వారి ముత్తాత లాలా జీవన్మల్ నుంచి మొదలయ్యిందని డాక్టర్ రవీంద్ర సబర్వాల్ చెబుతున్నారు. లాహోర్‌లో స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న లాలా జీవన్ముల్ ఒకరోజు మహాత్మా గాంధీ ఆరోగ్యం, విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడటం విన్నాడట. ఇక అప్పుడే ఆయన ఆస్పత్రిని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట. అంతేగాదు తన నలుగురు కుమారులు బోధిరాజ్, త్రిలోక్ నాథ్, రాజేంద్ర నాథ్, మహేంద్ర నాథ్ లను మెడిసిన్ చదివించాలని భావించాడట. అలా వారి కుటుంబంలో 1902లో తొలి డాక్టర్‌గా బోధిరాజ్ ఈ వృత్తిని చేపట్టారు. అదే ఏడాది పాకిస్తాన్‌లోని జలాల్పూర్ జట్టన్లో జీవన్ ఆసుపత్రిని నిర్మించారు. ఆయన అక్కడ వైద్యుడిగా సేవలందించారు. అప్పటి నుంచి ఈ వృత్తిని కుటుంబంలోని తదుపరి తరం చేపట్టాలని, అలాగే వైద్య విద్యనభ్యసించిన వధువునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విభజన సమయంలో లాహోర్ నుంచి ఢిల్లీకి తరలి వెళ్లాల్సి వచ్చింది ఈ కుటుంబం.ప్రస్తుతం ఢిల్లీలో ఆ కుటుంబానికి మొత్తం ఐదు ఆస్పత్రులు ఉన్నాయి. అంతేగాదు కరోల్ బాగ్, ఆశ్రమం, వసంత్ విహార్‌లో వాటికి సంబంధించిన వివిధ శాఖలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి తరం డాక్టర్ కావడంతో ఆస్పత్రి కారిడార్ కూడా పెరుగుతూ వచ్చింది. అంతేగాదు ఆ కుటుబంలోని తొలి డాక్టర్ భోధిరాజ్ హయాం నుంచి.. తర్వాతి తరం మెడిసిన్ నాల్లోవ సంవత్సరం చదువుతుండగానే.. ఒక సరికొత్త స్టెతస్కోప్‌ను అందజేయడం ఆచారంగా పాటిస్తారట. దీన్ని వాళ్లు ఆశీర్వాదంగా భావిస్తారట. ఈ మేరకు నేత్ర నిపుణుడు డాక్టర్ వికేష్ సబర్వాల్ మాట్లాడుతూ..డాక్టర్ బోధిరాజ్ కుటుంబ సభ్యులందర్నీ వైద్యులుగా తీర్చిదిద్దేలా గట్టిగా కృషి చేశారని చెప్పారు. తమకు అరటిచెట్టుకు ఇంజెక్షన్లు ఇవ్వడం నుంచి ప్రాక్టీస్ చేయించినట్లు తెలిపారు. ఆఖరికి డిన్నర్ టేబుల్ సంభాషణల్లో కూడా ఆస్పత్రి గురించే మాట్లాడటం, చర్చలు జరుగుతాయని అన్నారు. అలాగే తమ పిల్లలు ఆపరేషన్ థియేటర్ లోపలే హోంవర్క్‌లు చేస్తారని గర్వంగా చెప్పారు. ప్రమాద బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలియగానే తమ కుటుంబం అప్రమత్తమైపోతుందని చెబుతున్నారు. ఎవ్వరూ వ్యతిరేకించ లేదా..?కుటుంబంలో ప్రతి ఒక్కరినీ డాక్టర్‌గా మార్చే నినాదాన్ని ఎవ్వరు వ్యతిరేకించి లేదా అంటే..? వారి ఆలోచనని మార్చడంలో కుటుంబం పూర్తిగా విజయం సాధించిందని అంటారు ఆ కుటుంబ సభ్యులు. ఎవ్వరైనా తాము వేరే కెరీర్‌ని ఎంచుకుంటాం అనగానే కుటుంబ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారట. అదికూడా ఆస్పత్రిలోనే సమావేశమై నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని చెబుతోంది ఆ కుటుంబం. ఇక కుమారుల్లో ఒకరు బయోకెమిస్ట్ చేసిన భార్యను వివాహం చేసుకుంటే..ఆమెను పదేపదే మెడిసిన్ చదవమని చెప్పడంతో..ప్రస్తుతం ఆమె అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిందని చెబుతున్నారు నాలుగోతరం కోడలు డాక్టర్ గైనకాలజిస్ట్ శీతల్. ఇక ఆ కుటుంబంలోని ఆరవతరం సమర్వీర్ అనే 11 ఏళ్ల బాలుడు కూడా తనని తాను డాక్టర్ సమర్వీర్గా పరిచయం చేసుకోవడం విశేషం. అయితే తమ కుటుంబంలోని ఆరవ తరం దియా సబర్వాల్ అనే 21 ఏళ్ల అమ్మాయి తమ కుటుంబ వారసత్వ వృత్తికి విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్‌లలో డబుల్ డిగ్రీని పూర్తి చేసిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అలాగే 16 ఏళ్ల ఆర్యన్ కూడా ఇలానే వేరే రంగం(క్రికెట్) అంటే మక్కువ..కానీ నానమ్మ కుటుంబ వారసత్వం వృత్తినే ఎంచుకోమని బలవంతం చేస్తోందని చెబుతున్నాడు. ఇలా ఒక నినాదంతో కుటుంబం అంతా ఒక తాటిపై నిలబడి ఆ వృత్తినే చేపట్టడం అంత ఈజీ కాదు కదా..!.(చదవండి: తొలిసారిగా వృద్ధుడికి ట్రిపుల్-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్..!) -
గం‘జాయింట్’గా కొడదామా?
‘హాయ్ మామా.. బాగా గ్యాప్ వచ్చింది. జాయింట్ కొడదాం పద..’.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మాటలివి..‘ఏం స్ట్రెస్రా బాబూ ఇది. టార్గెట్లతో తలపగిలిపోతోంది. చలో బయటికి వెళ్లి కాస్త స్కోర్ చేసొద్దాం’.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంభాషణ ఇది.... వాళ్లు ఏదో టీ తాగడానికో, టిఫిన్ చేయడానికో వెళ్లడం లేదు. గంజాయి తాగేందుకు వెళదామని కోడ్ భాషలో చెప్పుకొంటున్నారు. ఇక్కడా, అక్కడా అని కాదు హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఈ గంజాయి కల్చర్ కనబడుతోంది. కొందరిలో ఇదో సోషల్ స్టేటస్‌గా మారింది. నగరంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వివిధ పోలీసు విభాగాల మధ్య కొరవడిన సమన్వయాన్ని గంజాయి విక్రేతలు ఆసరాగా తీసుకుని, మరింతగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్: గంజాయి మహమ్మారి రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మత్తుకు బానిస అవుతున్న వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. గతంలో కొన్నివర్గాలకే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా పాకింది. పెద్ద పెద్ద ఆస్పత్రుల వైద్యులు సైతం గంజాయి మత్తుకు బానిస అవుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన కొందరు వైద్యులు గంజాయి వాడుతున్నట్టు తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మందలించి వదిలేయడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించింది. మత్తు దందాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు. కానీ వివిధ విభాగాల మధ్య తగిన సమన్వయం లేకపోవడం, కొందరు అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకోకపోవడం, గంజాయి సరఫరా దారులు కొత్తకొత్త మార్గాలు అనుసరిస్తూ, వినియోగదారులనే విక్రేతలుగా మారుస్తుండటం వంటివి గంజాయి దందా యథేచ్ఛగా సాగిపోవడానికి దారితీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి వాడుతున్న వారి సంఖ్య 10లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. దందాలోకి దిగుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి వాడకం క్రమంగా పెరుగుతోంది. తొలుత ఒకరిద్దరితో మొదలయ్యే ఈ వ్యసనం స్నేహితుల మధ్య విస్తరిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్‌లకు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి విక్రేతలుగా మారుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలకు ఒకింత తలనొప్పిగా మారింది. ఈజీ మనీకి గంజాయి మార్గం! చాలా మంది కష్టపడకుండా డబ్బులు వస్తుండటంతో (ఈజీ మనీ) గంజాయి అమ్మకాలకు దిగుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల (ఏఓబీ)కు వెళితే ఏడెనిమిది వేల రూపాయలకే రెండు కిలోల గంజాయి దొరుకుతుంది. దాన్ని హైదరాబాద్ వరకు తెస్తే.. ఆ రెండు కిలోల ప్యాకెట్ రూ.15 వేలకు కొంటారు. అదే ఒక్కో కిలో గంజాయిని 10 గ్రాముల చొప్పున 100 ప్యాకెట్లు చేసి.. ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 చొప్పున అమ్ముతారు. అంటే కిలోకు రూ.30 వేలు వస్తాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్‌ను రూ.15 వేలు పెట్టి కొంటే.. దాన్ని విక్రయించడం ద్వారా..రూ.45 వేలు మిగిలించుకుంటారు. ఇలా ఈజీ మనీ కోసం కొందరు గంజాయి అమ్మకంలోకి దిగుతున్నారు. నియంత్రణపై హడావుడికే పరిమితం హైదరాబాద్‌లో గంజాయికి ప్రధానంగా ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, సీతాఫల్మండి, ఫతేనగర్ హబ్‌లుగా ఉండేవి. ఇప్పుడు చాలా ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. అంగోరి భాయ్, గాంజా కిశోర్, సునీతభాయ్, ముఖేశ్‌సింగ్, దీపు, సట్టా కిశోర్, రౌడీ గోపాల్, రౌడీ విశాల్ వంటి 25 మంది వరకు గంజాయి విక్రేతలు ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారు 30, 40 కిలోల చొప్పున గంజాయి తెప్పించి.. రిటైల్‌గా విక్రయించేవారికి సరఫరా చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందుతున్నా పైపైన హడావుడికే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గంజాయి కట్టడిలో టీజీ నార్కోటిక్స్ బ్యూరో, స్థానిక పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వంటి విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా గంజాయి స్మగ్లర్లకు కలిసి వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఓబీ టు నార్త్ ఇండియా.. వయా తెలంగాణ! ఏఓబీ (ఆంధ్రా– ఒడిశా బార్డర్), ఛత్తీస్‌గఢ్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో పండించే గంజాయిని.. ఉత్తర భారతదేశంతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ కారిడార్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి. స్మగ్లర్లు రైలు, రోడ్డు మార్గాల్లో పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ రవాణా చేస్తున్నారు. టీజీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, స్థానిక పోలీసులు, డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో తరచూ గంజాయి పట్టుబడుతోంది. ఇలా పట్టుబడుతున్నది స్వల్పమేనని, అంతకు ఎన్నో రెట్లు తరలుతోందని సమాచారం. ఇక వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోనూ గంజాయి ఏజెంట్లు నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారని.. వారి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని తెలిసింది. డ్రగ్స్‌పై ఫోకస్ పెరగడంతో గంజాయి వైపు.. కొకైన్, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్, ఎక్సైజ్ ఫోకస్ పెరగడంతో.. చాలా మంది తక్కువ ధరకు, వెంటనే అందుబాటులో ఉండే గంజాయివైపు దృష్టి పెడుతున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని లేబర్ కాలనీలు, రాజీవ్ గృహకల్ప, సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ, ధూల్‌పేట్, జీడిమెట్ల, చింతల్, సూరారం కాలనీ, దుండిగల్ సహా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో గంజాయి వాడకం విస్తృతంగా పెరిగింది. గోల్కొండ, లక్ష్మీనగర్, ఎల్‌బీనగర్‌లతోపాటు హాస్టళ్లు ఎక్కువగా ఉన్న అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్‌రోడ్, ఇతర పార్కులు వంటి చోట్ల గంజాయి విక్రయాలు సాగుతున్నట్టు తెలిసింది. శిక్షల భయం లేకపోవడంతో.. గంజాయి కేసులలో నిందితులపై శిక్షలు సరిగా లేకపోవడంతో వారిలో భయం ఉండటం లేదన్న వాదనలు ఉన్నాయి. కిలోకుపైన గంజాయి పట్టుబడితేనే దాన్ని కమర్షియల్ క్వాంటిటీగా గుర్తిస్తారు. ఆ కేసులలోనే కఠిన శిక్షలుంటాయి. ఈ క్రమంలోనే గంజాయి సప్లయర్లు చిన్నచిన్న ప్యాకెట్లలో విడివిడిగా సరఫరా చేస్తున్నారు. వారు పట్టుబడినా బలమైన కేసులు ఉండటం లేదు. సరైన దర్యాప్తు లేని కారణంగా కూడా చాలా వరకు కేసులు వీగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులకు చిక్కిన గంజాయి విక్రేతలు.. బెయిల్‌పై వచ్చాక మళ్లీ దందా మొదలుపెడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ నేరం చేస్తున్నవారిపై పీడీ యాక్ట్ తరహాలో.. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్’ చట్టాన్ని నమోదు చేస్తున్నారు. దీనితో రెండేళ్ల వరకు బెయిల్ లభించే అవకాశం ఉండదు. అంతేగాక స్థానిక కోర్టుల అనుమతితో ‘స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ (సఫెమా)’ ప్రయోగించేందుకూ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. దోషులుగా తేలినవారి ఆస్తులను జప్తు చేయవచ్చు. గతేడాది నమోదైన నాలుగు కేసుల్లో నిందితులకు చెందిన రూ.8 కోట్లు విలువైన ఆస్తులను టీన్యాబ్ జప్తు చేసింది. గంజాయి చాక్లెట్లు... రాజస్థాన్, ఒడిశా నుంచి గాంజా, బంగ్ చాక్లెట్లు హైదరాబాద్ వస్తున్నాయి. కూరగాయలు, పండ్ల రవాణా వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ 5 కిలోల బరువు గల 2,000 గాంజా బంగ్ చాక్లెట్స్ స్వా«దీనం చేసుకుంది. నాలుగు కేసులు రిజిస్టర్ చేసింది. -
Supreme Court: దుష్ప్రభావాలు రాయడం కుదరదు
న్యూఢిల్లీ: ఆయా ఔషధాల సైడ్ఎఫెక్ట్లనూ మందుల చీటీలో పేర్కొనేలా వైద్యులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాకబ్ వడక్కన్‌చెరీ అనే వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు. ‘‘రోగులకు వైద్యులు సూచించిన ఔషధం గురించి, దాని సానుకూల ప్రభావంతోపాటు దుష్ప్రభావాలపైనా అవగాహన ఉండాలి. ఆ మేరకు వైద్యులు మందుల చీటీలో వాటిని తప్పకుండా ప్రస్తావించాలి’అంటూ జాకబ్ వేసిన పిటిషన్‌ను మే 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ప్రతి చీటీపై ప్రతి ఒక్క మందు సైడ్ఎఫెక్ట్లను రాయడం ఆచరణలో సాధ్యంకాదు. ఒకవేళ రాస్తూపోతే వైద్యుడు ఒకరోజుకు పది, పదిహేను మందికి మించి చూడలేదు. చివరకు వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యే ఛాన్సుంది ’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘దుష్ప్రభావాలపై ముందే హెచ్చరిస్తే మంచిది. లేదంటే అవన్నీ వైద్యసేవల్లో నిర్లక్ష్యం లెక్కలోకి వెళ్తాయి. ముందుగా వైద్యులు తమ వద్ద ఉదాహరణలతో కూడిన నమూనాపత్రాన్ని ఉంచుకుంటే మంచింది’అని వాదించారు. ‘‘అలా చేస్తే దాని విపరిణామాలు పెద్దవై చివరకు వైద్యులకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కష్టాలు పెరుగుతాయి. మేం అలా చేయలేం’’అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. -
‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!
కుటుంబంలో ఒకరు డాక్టర్ అవడం సాధారణంగా చూస్తుంటాం. ఇద్దరు డాక్టర్లు ఉండటమూ మనకు తెలుసు. ఆ ఇంట్లో మాత్రం నలుగురు కుమార్తెలూ డాక్టర్లే! టైలరింగ్ చేస్తూ కూతుళ్లను డాక్టర్లు చేయడానికి తపించారు రామచంద్రం – శారద దంపతులు. వారి కలలు నిజమై ఇప్పుడు ఆ ఇల్లే వైద్యుల నిలయంగా మారి΄ోయింది. సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. రామచంద్రం – శారద టైలరింగ్ చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదంతా సాధారణమే! కానీ వీరి నలుగురు కుమార్తెలు డాక్టర్లే కావడమే విశేషం. ఒకరు వైద్యవిద్య పూర్తిచేయగా, మరొకరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఇంకో ఇద్దరు కుమార్తెలు ఈ ఏడాది మెడిసిన్‌లో సీట్లు సాధించారు. ‘నలుగురు కూతుళ్లేనా..’ అని హేళనలు ఎదుర్కొన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారు.ఒక్కరైనా డాక్టర్ కావాలని..రామచంద్రం, శారద ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడితే రూ.800 వస్తుంది. దీంతో వారి కుటుంబం గడవడమే కష్టమైనా నలుగురు పిల్లలను చక్కగా చదివించాలని తపించారు. రామచంద్రం సోదరుడు రాజు 1992లో ఫిట్స్‌తో మృతిచెందగా, రామచంద్రం 14 ఏళ్ల వయసులో ఆయన తల్లి మల్లవ్వ గొంతు కేన్సర్‌తో మరణించింది. సరైన సమయంలో తాము గుర్తించక΄ోవడంతోనే సోదరుడు, తల్లిని కోల్పోవాల్సి వచ్చిందని... కుటుంబంలో ఒక్కరికైనా డాక్టర్ అయి ఉంటే వాళ్లు బతికేవారని అనుకునేవాడు. నలుగురు కూతుళ్ల లో పెద్ద కూతురు మమత ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆ తర్వాత ఆమె చెల్లెళ్లూ అదే బాట పట్టారు.చదువులోనూ కవలలే..రోహిణి, రోషిణి ఇద్దరు కవలలు... 2023 నీట్ రాసిన రోహిణి 443(పెద్ద కూతురు), రోషిణి 425(చిన్న కూతురు) మార్కులు సాధించారు. రోహిణికి ఓ ప్రై వేట్ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినా చెల్లి రోషిణికి సీటు రాక΄ోవడంతో ఒత్తిడికి గురవుతుందని అక్క సీటు వదులుకుంది. ఆపై ఇద్దరు లాంగ్‌టర్మ్ శిక్షణతో ప్రిపేర్ అయ్యారు. దీంతో 2024 నీట్లో రోహిణి 536 మార్కులు, రోషిణి 587 మార్కులు సాధించారు. ఇప్పుడు రోషిణికి(చెల్లి) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకేదగ్గర చదువుకోవాలని అక్క కోసం జగిత్యాల మెడికల్ కళాశాలలో సీట్లు తీసుకున్నారు. నాన్న కల నాకు లక్ష్యమైందిడాక్టర్ చదవాలన్నది మా నాన్న కల. ఆ కల నాకు లక్ష్యం అయ్యింది. 2018–2024లో ఎంబీబీఎస్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పూర్తిచేశా. గైనిక్ లేదా జనరల్ మెడిసిన్ పీజీ చేయాలని అనుకుంటున్నా. మా అమ్మనాన్నలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకు ఏనాడూ లోటు రాకుండా చూసుకున్నారు. – డాక్టర్ మమత, ఎంబీబీఎస్(7009)అక్క చూపిన దారిఇంటర్మీడియెట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎంబీబీఎస్ చదవలేనేమో అని, డిప్రెషన్‌కు లోనయ్యాను. హైదరాబాద్‌లో చదువుతున్నప్పటికీ ఇంటి నుంచే వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. ఇప్పుడు కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అక్క నా ముందున్న దారిని క్లియర్ చేయడంతో మేం సాఫీగా నడుస్తున్నాం. జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పేదలకు సేవలు అందిస్తాను.– మాధురి, ఎంబీబీఎస్, ఫైనల్ ఇయర్(7012)మేం ఇద్దరం ఒకే కళాశాల లో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం సంతోషంగా ఉంది. మా అక్కలే మాకు రోల్ మోడల్. అమ్మానాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువుపై మాకు ఉన్న ఇష్టాన్ని గుర్తించి కాదనలేదు. అక్కలిద్దరూ మాకు సరైన గైడెన్స్ ఇచ్చారు. – రోహిణి, రోషిణి, ఎంబీబీఎస్, మొదటి సంవత్సరం(7011)నలుగురు ఆడపిల్లలని, వారిని హైదరాబాద్‌లో చదివిస్తున్నామని చాలామంది సూటి;yటీ మాటలు అనేవారు. అయినా కుంగిపోకుండా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలకున్నాం. టైలరింగ్ చేస్తూ వచ్చే కొద్ది డబ్బుతోనే పిల్లలను లోటు లేకుండా పెంచాం. అప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు మా నలుగురు కూతుర్లు మెడిసిన్ చేస్తుంటే సరస్వతీ పుత్రికలు అని మెచ్చుకోవడంతో మా బాద, కష్టమంతా మర్చి΄ోతున్నాం. మాది పేద కుటుంబం. పిల్లల చదువు నిమిత్తం ఎవరైనా దాతలు సాయం చేస్తే వారు ఉన్నత చదువులకు మార్గం ఏర్పడుతుంది.– రామచంద్రం, శారద – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఫోటోలు: కె సతీష్,ఈ సరస్వతీ పుత్రికలకు అండగా నిలవాలనుకునే వారు 98499 54604 ను సంప్రదించవచ్చు. (చదవండి: సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!) -
డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్
కోల్‌కతా ఆర్టీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.#WATCH | Howrah: Chief advisor to West Bengal CM Mamata Banerjee, Alapan Bandyopadhyay says, "There has been confusion recently regarding the so-called resignation of senior doctors working in government medical colleges and hospitals. We have been receiving certain letters which… pic.twitter.com/2jP1dkhCkJ— ANI (@ANI) October 12, 2024 జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు. -
మళ్లీ ‘డెంగీ’ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా, మలేరియా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి విష జ్వరాలు తిరిగి విజృంభిస్తున్నాయి. మరోవైపు దగ్గు, జలుబు బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటీవలి వానలతో నీళ్లు నిలవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో దోమలు స్వైర విహారం చేయడం, వాతావరణంలో మార్పులు వంటివి దీనికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో డెంగీ ప్రతాపం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో 9,254 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 2,731 డెంగీ కేసులు, తర్వాత మేడ్చల్ జిల్లాలో 700 కేసులు నమోదైనట్టు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యంత తక్కువగా 24 డెంగీ కేసులు నమోదైనట్టు పేర్కొంది. అయితే అధికారికంగా నమోదు కాని డెంగీ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా. మరోవైపు ఇదేకాలంలో తెలంగాణవ్యాప్తంగా 397 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్‌లో ఏకంగా 204 కేసులు రికార్డయ్యాయి. ఇక 229 మలేరియా కేసులు నమోదవగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 67 కేసులు ఉన్నాయి. డెంగీ, చికున్‌గున్యా తదితర విష జ్వరాల కేసులు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే నమోదవుతున్నాయి. మొత్తం డెంగీ కేసుల్లో 8,409 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవగా.. ప్రైవేట్‌లో 845 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనేక ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ, చికున్‌గున్యా కేసుల వివరాలను సరిగా అందజేయకపోవడమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి. తమ వద్దకు వస్తున్న ప్రతీ 10 జ్వరం కేసుల్లో ఇద్దరు, ముగ్గురికి చికున్‌గున్యా లక్షణాలు ఉంటున్నట్టు వైద్యులు చెప్తుండటం గమనార్హం. రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలు రాష్ట్రంలో డెంగీ ముప్పున్న 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే గుర్తించింది. గతంలో నమోదైన డెంగీ కేసుల ఆధారంగా ఈ ప్రాంతాలను నిర్ధారించింది. ప్రస్తుతం డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే 42 డెంగీ పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా.. అందులో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని.. దోమల ఉత్పత్తిని నివారించే చర్యలు, అవగాహన చేపట్టాలని సూచించారు. మరోవైపు వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులంతా ఆస్పత్రులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒకేసారి రకరకాల జ్వరాలు ఈ ఏడాది రకరకాల వైరల్ జ్వరాలు కలిపి ఒకే సమయంలో దాడి చేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరిలో డెంగీ, చికున్‌గున్యా రెండూ కూడా ఉంటున్నాయని అంటున్నారు. ఇక నడివయసువారు, వృద్ధుల్లో చికున్‌గున్యా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఏదైనా సరైన పరీక్షలు చేయించుకుని.. వ్యాధిని స్పష్టంగా నిర్ధారించుకుని, చికిత్స పొందాలని స్పష్టం చేస్తున్నారు. డెంగీకి కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటివి సరిపోవని.. ఐజీఎం పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. -
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ
కోల్‌కతా: కోల్‌కత ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది డాక్టర్లపై ఆర్టీ కర్ హాస్పిటల్ అంతర్గత కౌన్సిల్ బహిష్కరణ వేటు వేసింది. ఆస్పత్రిలో బెదిరింపులు, వేధింపులు, ర్యాగింగ్, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు సదరు డాక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ డాక్టర్లను కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని, వారి ఇళ్లకు నోటీసులు కూడా పంపాలని సమిష్టిగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 10 మంది వైద్యుల బహిష్కరణతో పాటు, ఇంటర్న్లు, విద్యార్థులు, హౌస్ సిబ్బందితో సహా మొత్తం 59 మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బహిష్కరణ వేటుపడిన డాక్టర్లలో సౌరభ్ పాల్, ఆశిష్ పాండే (సీబీఐ అరెస్టు చేసిన), అభిషేక్ సేన్, ఆయుశ్రీ థాపా, నిర్జన్ బాగ్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాథ్, అమరేంద్ర సింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీలు ఉన్నారు. ఈ డాక్టర్లు తమ హాస్టల్‌ను ఖాళీ చేయడానికి అధికారులు 72 గంటల సమయం ఇచ్చారు. మరోవైపు.. బహిష్కరణకు గురైన డాక్టర్ల పేర్లు రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ డాక్టర్ల మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను సమీక్షించవచ్చు లేదా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.చదవండి: కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్విస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన నిరసన సెగ సీఎం చంద్రబాబును తాకింది. బుధవారం విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్రేట్లో వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దీంతో వందలాది పీహెచ్సీ వైద్యులు ఉదయాన్నే కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇన్సర్విస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిసరాల్లో నిరసన తెలపడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంను కలిసి తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని వైద్యులు తెగేసి చెప్పారు. సీఎంను కలవడానికి ఇంత మందిని అనుమతించబోమని, ఇద్దరు మాత్రమే రావాలని పోలీసులు చెప్పారు. పోలీసుల షరతుకు అంగీకరించి, ఇద్దరు వైద్యులే సీఎంను కలిశారు. మిగిలిన వైద్యులందరూ అక్కడే రోడ్డుపై గంటల తరబడి పడిగాపులు కాశారు. జీవో రద్దు చేయం వైద్యుల ప్రతినిధులు సీఎంను కలిసి జీవో 85 రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, జీవో 85ను రద్దు చేయడం కుదరదని సీఎం తేల్చి చెప్పినట్టు తెలిసింది. జీవోలో సవరణకు ఇప్పటికే సానుకూలత తెలిపామని అన్నట్లు సమాచారం. జీవో రద్దుకు పట్టుబడితే కుదరదని సున్నితంగా హెచ్చరించినట్టు వైద్యులు చెప్పారు.ఇన్సర్విస్ కోటా కుదించిన బాబు సర్కారు పీజీ వైద్య విద్యలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లుగా సేవలందించే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. గత ప్రభుత్వం క్లినికల్ పీజీ కోర్సుల్లో 30 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం క్లినికల్‌లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 30 శాతానికి ఈ కోటా కుదించింది. దీంతో 2023–24లో క్లినికల్‌లో 389, నాన్–క్లినికల్‌లో 164 పీజీ సీట్లు పొందిన వైద్యులు, ఇప్పుడు క్లినికల్‌లో 270, నాన్ క్లినికల్‌లో 66 చొప్పున సీట్లను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి వైద్యులు ఉద్యమం చేపట్టారు. 15వ తేదీ నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు సైతం దూరంగా ఉన్నారు. -
జీవో 85ను రద్దు చేయండి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో నంబర్ 85ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం లేఖ రాసింది. ‘నిర్దేశిత పరీక్షకు కేవలం 20 రోజుల ముందు ప్రభుత్వం ఇన్‌సరీ్వస్ కోటాను కుదిస్తూ నిర్ణయం తీసుకుని జీవో 85ను జారీ చేసింది.దీంతో మాకు న్యాయపరమైన మార్గం చూసుకునే అవకాశం లేకుండాపోయింది. జీవో 85పై మేము జూలై 23న వైద్య శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమరి్పంచాం. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లకు వినతిపత్రాలు సమర్పించాం. గత 50 రోజులుగా మా బాధను చెబుతూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇక దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాటపట్టాం. జీవో 85 రద్దు చేసి.. ఇప్పటికే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు మరిన్ని పీజీ సీట్లు ఇవ్వడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. మా డిమాండ్లు అన్నింటినీ వెంటనే పరిష్కరించండి’ అని ప్రభుత్వాన్ని పీహెచ్సీ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు శనివారం కూడా తమ నిరసన కొనసాగించారు. పీజీలో ఇన్ సర్వీస్ కోటాను కుదించడాన్ని ఖండిస్తూ జీవో నంబర్ 85ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వైద్యులు తమ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. -
వంద రోజుల్లో వైద్యులను రోడ్డుపై నిలబెట్టారు
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం వైద్యులను రోడ్ల మీదకు లాగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు మండిపడ్డారు. వంద రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేశామని ప్రకటనలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం కోవిడ్‌లో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యులను అవమానాలకు గురిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున వైద్యులను నియమించి, పీహెచ్‌సీలను బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వం వైద్యులపై వేధింపులకు దిగుతోందన్నారు. వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో 85కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు వైద్యులు శుక్రవారం శాంతియుత నిరసనలు చేపట్టారు. విజయవాడలో నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వైద్యులందరు తమ జిల్లాలకు గురువారం వెళ్లిపోయినట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యూనస్‌మీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం ఛలో విజయవాడ 2.0 కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు చర్చలు నిర్వహించిన్పటికీ తమ డిమాండ్లు నెరవేరలేదని, మళ్లీ చర్చలకు పిలిచి, డిమాండ్లను నెరవేర్చే వరకూ విజయవాడలో నిరసన తెలుపుతామన్నారు. శుక్రవారం ఉదయం నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులపై కేసులు పెడతామని డీఎంహెచ్వోలు బెదిరించారని చెప్పారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా శనివారం కూడా డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ కలిసి వేధింపులకు పాల్పడిన డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పారు.సమస్యలు పరిష్కరించే వరకు నిరసనప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారంఅయ్యే వరకు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు. -
సమ్మె విరమించేది లేదు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదిస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేసే వరకూ సమ్మె విరమించబోమని పీహెచ్సీ వైద్యులు తేల్చిచెప్పారు. బుధవారం మంత్రి సత్యకుమార్‌తో చర్చల్లో సమ్మెల విరమణకు అంగీకరించిన పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులపై వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ప్రధాన డిమాండ్ అయిన జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి ఎలా చెబుతారని నిలదీశారు.సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో మంత్రితో పాటు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో జీవో 85 రద్దు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సహా పలు అంశాలను వైద్యుల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. జీవో సవరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన కోర్సుల్లోనే కాకుండా అన్ని క్లినికల్ కోర్సుల్లోనూ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. చర్చల అనంతరం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్లో సుమారు 1500 మంది వైద్యులతో సంఘం నేతలు సమావేశమయ్యారు. మరోమారు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో చర్చలకు పిలుస్తుందని, ఈ క్రమంలో సమ్మె విరమిస్తామని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. జీవో రద్దు చేయకుండా సమ్మె ఎలా విరమిస్తామంటూ వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాల్సిందేనని చెప్పారు. వైద్యులను అవమానించిన పోలీసులుధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అవమానించారు. ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పోలీస్ శాఖను వైద్యులు అనుమతి కోరారు. మంగళ, బుధవారాల్లో నిరసన తెలపడానికి పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. బుధవారం ప్రభుత్వం చర్చలకు పిలిచినందున ధర్నాచౌక్‌లో అనుమతి రద్దు చేశామంటూ వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. నిల్చోడానికి కూడా వీల్లేకుండా వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపేశారు. చేసేదేమీ లేక బసవపున్నయ్య ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని అక్కడ సమావేశమయ్యారు. పోలీసుల చర్య తమను అవమానించడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు -
నేడు పీహెచ్సీ వైద్యుల చలో విజయవాడ
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ యూనస్‌మీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చలకు ప్రభుత్వం పిలుస్తామని చెప్పడంతో సోమవారం వేచి చూసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందు నిర్దేశించుకున్నట్లు మంగళవారం చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్‌లో శాంతియుత నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించబోమని స్పష్టం చేశారు. -
సీఎం మమతా బెనర్జీతో మరోసారి వైద్యుల బృందం భేటీ
డాక్టర్ల సమస్యను కొలిక్కి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొద్ది సేపటి క్రితమే డాక్టర్లతో భేటీ అయ్యారు.కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ ఘటనపై సీఎం మమతా బెనర్జీతో వైద్యుల బృందం మరోసారి భేటీ అయ్యింది. మమతా బెనర్జీ ఇంటికి బస్సులో చేరుకున్న డాక్టర్లు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. చర్చలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తోంది వైద్యుల బృందం. అభయ ఘటనలో సీబీఐ అధికారుల విచారణ నిస్పక్షపాతంగా, వేగంగా జరగాలని కోరుతున్నారు. వ్యవస్థల వైఫల్యం ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కేసును తప్పుదారి పట్టించిన హెచ్ఓడీలను తొలగించాలని కోరుకుంటున్నారు. డీసీపీతో పాటు పోలీసు అధికారులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని, వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఆందోళన చేస్తున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు. ఇదీ చదవండి : గుంజీలు తీసిన విద్యార్థినులకు అస్వస్థత -
‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వైద్యులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే వారి ఆందోళనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ వైద్యులు ‘టీ’ తాగేందుకు రావాలని కోరారు. అందుకు వైద్యులు ఒప్పుకోలేదు. అభయ ఘటనలో న్యాయం చేస్తేనే.. తాము టీ తాగేందుకు అంగీకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసిన ప్రతినిధి బృందంలోని డాక్టర్ అకీబ్ మాట్లాడారు. కాళీఘాట్ వద్ద చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ మమ్మల్ని వారి నివాసానికి పిలిచారు. ఆహ్వానం మేరకు మేం అక్కడి వెళ్లాం. విజ్ఞప్తి మేరకు వైద్యుల బృందానికి, సీఎం దీదీతో జరిపే చర్చలు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఆ తర్వాత సీఎం బయటికి వచ్చి టీ తాగమని మమ్మల్ని అభ్యర్థించారు. కాని జూనియర్ డాక్టర్లు మాకు న్యాయం చేస్తేనే టీ తాగుతామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చెప్పి వెనుదిరిగినట్లు అకీబ్ వెల్లడించారు.కాగా, ఆర్జీ కార్ ఆస్పత్రిలో అభయపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ కోల్‌కతా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలను విరమించి విధుల్లోకి చేరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా జూడాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చివరికి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జూడాల సమ్మె కొనసాగుతుంది.ఇదీ చదవండి : నేను ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
వైద్యుల నిరసన... చలో విజయవాడ
-
నేటి నుంచి ఏపీ పీహెచ్సీలలో వైద్య సేవలు బంద్
-
వైద్యులతో చర్చలు.. ఆహ్వానించిన సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో అభయ ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యుల డిమాండ్లపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. వైద్యులతో గురువారం సాయంత్రం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 15 సభ్యుల వైద్యుల ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించింది. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ లేఖ రాశారు.చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ రాసిన లేఖలో వైద్యుల ప్రతినిధి బృందం సంఖ్య 15 మందికి మించకూడదు. పారదర్శకతను కొనసాగిస్తూ ప్రభుత్వానికి, వైద్య ప్రతినిధుల మధ్య జరిగే సమావేశాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఇదీ చదవండి : మాటలు చెప్పడం కాదు మోదీజీ