విజయవాడకు సమీపంలోని పెనమలూరుకు చెందిన ఆటోడ్రైవర్ వెంకట్ (38)కు ఇటీవల ఆకస్మికంగా కాలు, చేయి చచ్చుబడిపోయాయి. విజయవాడలోని యనమలకుదురుకు చెందిన నగరపాలక సంస్థ డ్రెయినేజీ విభాగ ఉద్యోగి రాజేష్ (42) విధుల్లో ఉండగా.. చేయి చచ్చుబడింది.
క్షణాల్లోనే గుర్తించిన స్థానికులు వెంకట్, రాజేష్లను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తక్షణమే సీటీ స్కాన్ చేసిన వైద్యులు వారు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడినట్టు గుర్తించారు. వెంటనే త్రోంబొలైసిస్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. వైకల్యం రాకుండా ఇద్దరినీ కాపాడగలిగారు. సాధారణంగా 55–60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) సంభవించేది. ఇటీవల కాలంలో 45 ఏళ్లలోపు వారిలో ఈ కేసులు అధికమవుతున్నాయి.
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల కాలంలో స్ట్రోకింగ్ యంగ్ (45 ఏళ్లలోపు వారిలో బ్రెయిన్ స్ట్రోక్) కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలకు వస్తున్న వారిలో స్ట్రోకింగ్ యంగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కదలిక లేని జీవన విధానం.. తీవ్రమైన వత్తిళ్లు.. రక్తం, రక్తనాళాల్లో లోపాలు.. ధూమపానం.. హెరాయిన్ లాంటి మత్తు పదార్థాల వినియోగం.. వంశపారంపర్య కారణాలు 30 ఏళ్లకే బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతున్నాయి.
25% ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులే
ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ.. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వారిలో 25 నుంచి 30 శాతం మంది 30–45 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రిలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్నారు.
స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడం వలన వచ్చే స్ట్రోక్ (ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లిపోయి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు.
గోల్డెన్ అవర్‌లో గుర్తించడం ముఖ్యం
ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి.. నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్ కారణంగా వైకల్యం బారినపడకుంటా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచి్చన వారికి త్రోం»ొలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు.
ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, అకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటిచూపు మందగించడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.
స్ట్రోక్‌కు కారణాలివీ
పెద్ద వయసుల వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణమవుతోంది. అయితే.. 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సికిల్ సెల్ అనీమియా, రక్తంలో జన్యుపరమైన లోపాలు, హెరాయిన్ వంటి డ్రగ్స్ వినియోగం, మితిమీరిన మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్టు వైద్యులు చెపుతున్నారు. వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్న కేసులూ ఉంటున్నాయి. మహిళల్లో హార్మోన్స్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండె లోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
యువకుల్లోనూ కేసులు
ఇటీవల 45 ఏళ్లలోపు యువత బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతోంది. స్ట్రోక్ కేసుల్లో 25% యువతే ఉండటం గమనార్హం. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడినవారు 4 గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ దారా వెంకట రమణ, న్యూరాలజిస్ట్, జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment