కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య విజయవాడ నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇతనికి మొన్న డిసెంబర్ 20న విధి నిర్వహణలో ఉండగా ఎడమవైపు చెయ్యి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బ్రెయిన్ స్టోక్‌గా వైద్యులు నిర్థారించారు. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి వెళ్లడం, సకాలంలో వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఐదున్నర గంటల వ్యవధిలో బసవయ్య తేరుకున్నాడు.
విశాఖపట్నం నగరానికి చెందిన 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఇంట్లో ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లుగా వైద్యులు గుర్తించారు.
సాక్షి, అమరావతి: ..ఈ రెండు ఘటనల్లో తీవ్రమైన పనిఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు స్ట్రోక్‌కు దారితీసినట్లు వైద్యులు తెలిపారు. ఈ తరహా యంగ్ స్ట్రోక్ ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు 50–60 ఏళ్లు పైబడిన వారు బీపీలు, సుగర్‌లు నియంత్రణలో లేకపోవడంతో స్ట్రోక్ గురయ్యేవారు. అయితే, ఇప్పుడు మార్పు వచ్చింది.
ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 20–30 శాతం బాధితుల వయస్సు 45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఓపీలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. 2020–21లో 1,476, 2021–22లో 24,197, ప్రస్తుత సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి 22,928 ఓపీలు నమోదయ్యాయి.
ముప్పు తెచ్చిపెడుతున్న ఆధునిక జీవన శైలి
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి మానవాళికి అనేక రకాల ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఇందులో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించే చర్యలు చేపడుతున్న వారు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. దీంతో చిన్న వయసులోనే సుగర్, బీపీలు, ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాక.. బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు వైద్యులు చెబుతున్న కారణాలు..
► పొగతాగడం, మద్యం సేవించడం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం.
► 15–24 ఏళ్ల వయస్సులోనే యువత మద్యం, ధూమపానానికి అలవాటు పడుతున్నారు. ఈ వయస్సులో స్మోకింగ్ అలవాటు చేసుకున్న వారికి పదేళ్లు గడిచేసరికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నట్లు తెలుస్తోంది. ధూమపానం, మద్యపానానికి బానిసలైన వారిలో 70–80 శాతం బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
► బీపీ, సుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, సుగర్‌లతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది.
► మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం.
► కరోనా బారినపడి కోలుకున్న 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు.
జీవనశైలిలో మార్పు రావాలి
ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజ్ స్ట్రోక్.. ఇలా రెండు రకాలుగా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది. మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడంవల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. హైబీపీ ఉన్న వారిలో హెమరేజ్ స్ట్రోక్ వస్తుంది. మా వద్దకు ఓపీ ఉన్న రోజుల్లో సగటున ఐదు కొత్త కేసులు వస్తున్నాయి.
స్ట్రోక్ బాధితులను గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆస్పత్రికి తీసుకుని వస్తే ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలిలో మార్పు చేసుకోవడంతో పాటు, బీపీ, సుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన పెరిగితే స్ట్రోక్ ఘటనలను అరికట్టవచ్చు.
– డాక్టర్ దార వెంకట రమణయ్య, న్యూరాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్
25 శాతం కేసులకే సర్జరీ అవసరం
బ్రెయిన్ స్ట్రోక్ ఘటనల్లో 25 శాతం మందికే సర్జరీ అవసరమవుతుంది. మిగిలిన 75 శాతం మెడికల్ మేనేజ్‌మెంట్‌తో నయమవుతుంది. కరోనా అనంతరం సర్జరీ ఘటనలు ఐదు శాతం మేర పెరిగాయి. కరోనా వచ్చిన వారిలో స్ట్రోక్ ఘటనలు కనిపిస్తున్నాయి. 25ఏళ్లలోపు వారు కూడా బ్రెయిన్ హెమరేజ్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
బాధితుడిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడమే కీలకంగా మారుతోంది. చాలా సందర్భాల్లో స్ట్రోక్‌కు ముందే లక్షణాలు బయటపడతాయి. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, కంటిచూపు మందగించడం జరుగుతుంది. ఇవి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించడంతో పాటు నయం చేయడానికి వీలుంటుంది.
– డాక్టర్ భవనం శ్రీనివాసరెడ్డి, న్యూరో సర్జన్, గుంటూరు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.శరీర బరువును నియంత్రించుకోవడం, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. తప్పనిసరిగా ఆరు గంటలు నిద్రపోవాలి.
Comments
Please login to add a commentAdd a comment