పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్‌వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.
ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు.
Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD
— NDTV (@ndtv) December 22, 2024

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
