infosis
-
హైదరాబాద్ సహా మూడు నగరాలకు ఫుల్ డిమాండ్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్‌వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD— NDTV (@ndtv) December 22, 2024 -
వైజాగ్‌లో ఇన్ఫోసిస్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవంలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. విశాఖపట్నం నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉందని.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోందని తెలిపారు. ఆ స్ధాయిలోనే విశాఖకు సహాకారం అందిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నెంబరు 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ను సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్ ప్రతినిధులను, సిబ్బందిని ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇన్ఫోసిస్ ప్రతినిధులు నిలంజన్ రాయ్(చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్), నీలాద్రిప్రసాద్ మిశ్రా(వైస్ ప్రెసిడెంట్), ఇతర ఇన్ఫోసిస్ ప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, ఇతర అతిధులకు అభినందలు తెలిపారు. విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటు అయ్యాయని సీఎం జగన్ పేర్కొన్నారు. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సీటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖపట్నం ఎడ్యుకేషన్ హబ్‌గా తయారయిందన్నారు. ఇక్కడ నుంచి ఏడాదికి దాదాపు 12వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు తమ డిగ్రీ పూర్తిచేసుకుని వస్తున్నారని తెలిపారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖపట్నంలో ఉన్నాయని గుర్తు చేశారు. విశాఖకు అన్ని అర్హతలు, సామర్థ్యాలు ఉంది ‘రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖపట్నంలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం విశాఖలో ఉన్నప్పటికీ... ఈ కంపెనీలన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు అయ్యాయి. అప్పట్లో విశాఖపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీలో విశాఖపట్నం అతిపెద్ద నగరం. టయర్ వన్ సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి. రెండేళ్లలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఇది విశాఖపట్నం సామర్ధ్యం. ఇక్కడే ఐఓసీ, దాదాపు 20వేల నేవల్ అధికారుల కుటుంబాలతో కూడిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ వంటి పబ్లిక్ సెక్టార్ సంస్ధలు కూడా ఉన్నాయి. తీరప్రాంత ఆధారిత మౌళిక సదుపాయాలు, విశాఖపట్నం, గంగవరంలలో రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో కూడా మూడో పోర్టు వస్తుంది. కేవలం మరో రెండేళ్లలోనే ఇక్కడ అత్యంత సుందరమైన అంతర్జాతీయ పౌర విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుంది. నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతాను: సీఎం మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. నేను కూడా త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతాను. మా అధికారులు కార్యాలయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయ అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఇక్కడికే వస్తారు. డిసెంబరులోపు విశాఖకు మారుతాం. నేను కూడా విశాఖలోనే నివాసం ఉంటాను. రానున్న రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు టయర్ వన్ నగరంగా ఎదగడానికి ఈ రకమైన తోడ్పాడు విశాఖనగరానికి అవసరం. ఆ రకమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నాను. 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యంతో ఉన్న ఇన్ఫోసిస్‌తో పాటు, టీసీఎస్, విప్రో వంటి సంస్ధలు ఏ నగరం యొక్క ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని అయినా పూర్తిగా మార్చివేస్తాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది. ఐటీ రంగంలో మార్పులు ఇంటర్నెట్ కేబుల్ మనకు ఎక్స్‌క్లూసివ్‌గా సింగ్‌పూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ వచ్చింది. నిలంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు వంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీళ్లంతా కచ్చితంగా ఒకరోజు విశాఖ ఐటీలో అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ 1000 మందితో ఇక్కడ ప్రారంభం అయిన ఇన్ఫోసిస్... రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం నేను కచ్చితంగా చెప్పగలను విశాఖ కలలను సాకారం చేసే లక్ష్యంగా నిలుస్తుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇన్ఫోసిస్‌తో కలిసి విశాఖ ఐటీ రంగంలో బహుముఖ ప్రగతిని సాధిస్తుంది. అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీకు మరొక్కసారి హామీ ఇస్తున్నా ఏ అవసరం ఉన్నా... మేం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొండి. మీకు ఏ అవసరం వచ్చినా మీకు అండగా నిలబడతాం అని సీఎం ప్రసంగం ముగించారు. ఇది కూడా చదవండి: ఏపీలో పెట్టుబడుల పరుగులు.. -
24 ఏళ్ల కింద కొన్న చీరే.. మళ్ళీ కొనలేదు - ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు సైతం వారానికో, నెలకో షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ చాలా సింపుల్‌గా, ఎంతో మందికి ఆదర్శమైన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్ఫోసిస్ అనగానే గుర్తొచ్చేది 'నారాయణ మూర్తి', కానీ ఈ రోజు ఇన్ఫోసిస్ ఆ స్థాయిలో ఉందంటే దానికి పెట్టుబడి 'సుధా మూర్తి' ఇచ్చినదే అని చాలామందికి తెలియకపోవచ్చు. సుధా మూర్తి నేడు సుమారు రూ. 775 కోట్లు సంపద కలిగి ఉన్నప్పటికీ గత 24 సంవత్సరాల్లో ఒక్క చీర కూడా కొనలేదు అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. నిజానికి సింప్లిసిటీ గురించి మాట్లాడాల్సి వస్తే తప్పకుండా ఎవరైనా సుధా మూర్తి గురించి మాట్లాడతారు. 1950 ఆగష్టు 19న జన్మించిన సుధామూర్తి ఉన్నత భావాలు కలిగిన విద్యావేత్త, రచయిత్రి మాత్రమే కాదు.. ఎంతో మందికి సహాయం చేసే పరోపకారి కూడా. ఈమెకు 2023లో భారత ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అందించింది. చీరలు కొనకపోవడానికి కారణం.. 24 సంవత్సరాలుగా చీరలు కొనకపోవడానికి వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. కాశీకి వెళ్ళినప్పుడు పవిత్ర గంగా స్నానం చేసి షాపింగ్ (ముఖ్యంగా చీరలు కొనడం) మానేస్తాని చెప్పుకోవడమే అని తెలుస్తోంది. ఎవరైనా గంగా నదిలో తమకు ఇష్టమైన వాటిని వదిలిపెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ సుధా మూర్తి చీరలు కొనటం మానేసింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? సుధా మూర్తి ఇష్టాలతో నారాయణ మూర్తి కూడా ఏకీభవించారు. ఈ కారణంగానే వారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా ఉంటారు. వీరిరువురూ పుస్తకాలు మాత్రం విరివిగా కొనుగోలు చేస్తారు. ఇప్పటికి వీరు 20,000కంటే ఎక్కువ బుక్స్ సేకరించినట్లు తెలుస్తోంది. -
ఇన్ఫోసిస్ కి ఉద్యోగులు షాక్
-
అలా తపన పడే భర్తలకు కేవలం భార్యగా ఉంటే సరిపోదు!
Sudha Murthy: భారతదేశంలో పరిచయం అవసరంలేని పేరు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధా మూర్తి'. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా, రచయిత్రిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందినప్పటికీ నిరాడంబరంగా జీవించడం ఈమెకు మాత్రమే సాధ్యమవుతుంది. గతంలో అనేక సందర్భాల్లో ఈమె నారాయణ మూర్తితో తన ప్రయాణం గురించి వెల్లడించింది. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో విజయవంతమైన భర్తల దగ్గర భార్యలు ఎలా ఉండాలి? అనేదాని గురించి వివరించింది. యువ పారిశ్రామిక వేత్తల భార్యలకు సూచనలు చేసే క్రమంలో నారాయణ మూర్తి లాంటి సక్సెస్ఫుల్ పర్సన్‌ని డీల్ చేయడం అంత ఈజీ కాదని చెప్పింది. అంతకు ముందే నారాయణ మూర్తి మాట్లాడుతూ తాను జీవితంలో విజయం సాధించడానికి తన భార్య చాలా సహకరించిందని చెప్పారు. సుధా మూర్తి మాట్లాడుతూ.. నిజానికి జీవితంలో సక్సెస్ సాధించాలని తపనపడే వారు సాధారణ వ్యక్తుల మాదిరిగా ఉండరు, వారికి ఇంట్లో లాజిక్ ఉండదు, ఆఫీసులో మాత్రమే లాజిక్ ఉంటుంది. కాబట్టి మీరు భార్యగా మాత్రమే కాకుండా, సెక్రటరీ, ఫైనాన్స్ మేనేజర్, నానీ, అడ్వైజర్ వంటి ఎన్నో పాత్రలు పోషించాల్సి వస్తుంది. ఇందులో ఏదైనా తప్పితే ప్రతికూల ప్రభావం ఎదురవుతుందని వెల్లడించింది. (ఇదీ చదవండి: మెటా థ్రెడ్స్‌లోకి టాలీవుడ్ హీరోలు.. ఫస్ట్ ఎంట్రీ ఎవరిదంటే?) పాత రోజుల్లో కొంత మంది తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లేవారు. అక్కడ తపస్సు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. పారిశ్రామిక వేత్తలు కూడా వారి కంపెనీ కోసం తపస్సు చేస్తారు. జీవితాన్ని దాని కోసం త్యాగం చేస్తారు. కావున భార్య తప్పకుండా అన్ని విషయాలలోనూ సహకరించాలి. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) ఒక స్త్రీ పురుషుడికన్నా బలంగా ఉండాలని చెబుతూ.. కంపెనీలో నారాయణ మూర్తి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు, అయితే నేను అంతకంటే స్ట్రాంగ్‌గా ఉంటానని సుధామూర్తి చెప్పుకొచ్చింది. ప్రతి భార్య మంచి మేనేజర్, అద్భుతమైన సీఈఓ, గొప్ప సహచరురాలుగా ఉండాలన్నారు. నా మాటలు భర్త కోసం త్యాగాలు చేస్తున్న భార్యలకు అంకితమని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నారాయణ మూర్తి కూడా తన భార్య సుధా మూర్తి గురించి చాలా గొప్పగా చెప్పాడు. -
భర్త గురించి మనసులో మాట చెప్పిన సుధా మూర్తి, తొలి పరిచయం అలా..
'సుధా మూర్తి' ఈ పేరుకి భారతదేశంలో పరిచయమే అవసరం లేదు, ఎందుకంటే ఒక రచయిత్రిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా మాత్రమే కాకుండా పరోపకారిగా కూడా చాలా మందికి సుపరిచయమే. అయితే ఈమె ఇటీవల తన భర్త నారాయణ మూర్తితో ఏర్పడిన తొలి పరిచయం గురించి ఒక టీవీ షోలో వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ఒక ప్రముఖ 'బాలీవుడ్ టాక్ షో'లో సుధా మార్తి పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్, ప్రొడ్యూసర్ గుణీత్ మోంగా కూడా పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నారాయణ మూర్తిని మొదటి సారి ఎప్పుడు కలిసారని వ్యాఖ్యాత కపిల్ శర్మ సుధా మూర్తిని అడిగారు. ఈ సందర్భంలో సుధా మూర్తి తన స్నేహితురాలి ద్వారా నారాయణ మూర్తి పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. ప్రసన్న అనే స్నేహితురాలు రోజూ ఒక పుస్తకం తీసుకువచ్చేదని, అందులోని ఫస్ట్ పేజీలో నారాయణ మూర్తి పేరు మాత్రమే కాకుండా పక్కన పెషావర్, ఇస్తాంబుల్ వంటి ప్రదేశాల పేర్లు ఉండేవని చెప్పింది. ఇది చూసినప్పుడు నారాయణ మూర్తి బహుశా ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ అయి ఉంటాడేమో అనుకున్నట్లు చెప్పింది. ఒక రోజు నారాయణ మూర్తిని కలవడానికి వెళ్లాలని, కలవడానికి ముందు ఆయన సినిమా హీరోలా ఉంటాడని ఊహించినట్లు చెప్పింది. కానీ డోర్ ఓపెన్ చేయగానే ఎవరీ చిన్నపిల్లాడు? అనిపించిందని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇది విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) సుధా మూర్తి 44 సంవత్సరాల కిందట నారాయణ మూర్తిని వివాహం చేసుకుంది. వీరికి అక్షతా మూర్తి, రోహన్ మూర్తి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షతా మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సుధా మూర్తి గొప్ప మానవతా మూర్తి. ఈమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి గొప్ప పురస్కారాలను అందించింది. -
బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి ఒక్క రోజులో రూ.68 కోట్లు అందుకోనున్నారు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఇటీవల డివిడెండ్లను ప్రకటించింది. వీటి ద్వారా అక్షతా రూ.68.17 కోట్లు ఆర్జించనున్నారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి. గత ఏడాది ఆమె కంపెనీకి చెందిన 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున జూన్ 2 నాడు ఆమె ఈ మొత్తాన్ని అందుకోనున్నారు. అయితే దాని కోసం ఆమె తన స్టాక్ హోల్డింగ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. గతేడాది కంపెనీ డివిడెండ్ కలిపితే ఆమె మొత్తం ఆదాయం రూ.132.4 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్ అక్టోబర్‌లో ఒక్కో షేరుకు రూ.16.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గతేడాది మూర్తి ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్‌ను అందుకున్నారు. దీంతో ఆమెకు రూ.120.76 కోట్లు వచ్చాయి. ఇన్ఫోసిస్‌లో ఆమె షేర్ల విలువ రూ.5400 కోట్లు. ఆమె భర్త, భారత సంతతికి చెందిన రుషి సునాక్ గత అక్టోబర్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. రుషి సునాక్ బ్రిటిష్ పౌరుడు. కానీ అక్షత మాత్రం తన భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. అందుకే ఆమె అక్కడ నివాసితురాలు కాదు. దీని కారణంగా యూకే చట్టాల ప్రకారం.. ఆమె 15 సంవత్సరాల పాటు పన్నులు చెల్లించకుండా దేశంలో నివసించవచ్చు. ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే తన ఆదాయంపై పన్నులు ఉన్నాయని వాటిని ఎప్పుడూ చెల్లిస్తానని ఆమె చెప్పారు. (tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) అక్షతా మూర్తి కర్ణాటకలోని హుబ్బళ్లిలో జన్మించారు. బెంగళూరులో ఆమె పాఠశాల విద్యను అభ్యసించించారు. కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో ఎకనామిక్స్ అండ్ ఫ్రెంచ్‌లో డ్యూయల్ మేజర్లు పూర్తి చేశారు. తర్వాత లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీని పొందారు. స్టాన్‌ఫోర్డ్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో ఆమె రుషి సునాక్‌ను కలిశారు. వీరికి 2009లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు కృష్ణ, అనౌష్క. రుషిసునాక్, అక్షత దంపతులు రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. కెన్సింగ్టన్లో వీరికి సొంత ఇల్లు ఉంది. దీని విలువు రూ.71 కోట్లు. వీరికి అక్కడ ఫ్లాట్ కూడా ఉంది. కాలిఫోర్నియాలో ఒక పెంట్‌హౌస్, యార్క్‌షైర్‌లో ఒక భవనం కూడా ఉన్నాయి. అక్షత తల్లి సుధా మూర్తి రచయిత్రి. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. అక్షతా మూర్తికి అక్షతా డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది. మారుమూల గ్రామాల్లోని కళాకారులతో కలిసి ఫ్యూజన్ దుస్తులను ఆమె తయారు చేస్తుంటారు. -
అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ కార్యకలాపాలు
-
ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరిస్తోంది. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 3,000 సీటింగ్ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతలో 1,000 మందితో ప్రారంభించనుంది. ఇందుకోసం మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విజయవాడలో ఇప్పటికే ఉన్న హెచ్‌సీఎల్.. తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించే యోచనలో ఉంది. విశాఖలో మరో భారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడితో 130 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్కు, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరలో ప్రారంభించనుంది. యాంకర్ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో ఐటీ పార్కుల నిర్మాణ రంగ సంస్థల చూపు ఇప్పుడు ఆ నగరంపై పడింది. ఐటీ పార్కుల నిర్మాణ సంస్థ రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఇన్ ఆర్బిట్‌మాల్ షాపింగ్ మాల్తో పాటు ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టుకు సంబంధించిన 17 ఎకరాల భూమిని రహేజా గ్రూపు కొనుగోలు చేసింది. విజయవాడకు టెక్ మహీంద్ర టెక్ మహీంద్రా తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నాని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తెలియజేశారు. ఇప్పటికే విశాఖలో ఉన్న తాము విజయవాడలో కూడా అడుగు పెట్టామంటూ సీఎంను కలిసిన అనంతరం గుర్నానీ ట్వీట్ చేశారు. అంతకు ముందు దావోస్‌లో గుర్నానిని కలిసిన సీఎం జగన్.. రాష్ట్రంలో కార్యకలాపాలను మరింతగా విస్తరించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. విజయవాడాలోని మేథా టవర్స్‌లో ప్రస్తుతం 100 మందితో కార్యకలాపాలను ప్రారంభించగా, త్వరలో ఆ సంఖ్యను 1,000కి చేర్చాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తగిన భవనాలను కోసం అన్వేషిస్తోంది. మరో ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్స్ కూడా విజయవాడలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 1,000 మంది సీటింగ్ సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా తొలుత 200–300 సీటింగ్ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇదే సమయంలో ఇండియాకు చెందిన అతి పెద్ద ఐటీ కంపెనీ ఒకటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖ వేదికగా ఒక భారీ ఐటీ సదస్సును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. కోవిడ్‌తో చిన్న ఊళ్ల వైపు చూపు అంతర్జాతీయంగా పని చేస్తున్న ఐటీ నిపుణుల్లో 20 శాతం మంది మన రాష్ట్రం నుంచే ఉన్నారని అంచనా. ప్రతి ఐదుగురిలో ఒకరు మన రాష్ట్రం నుంచి ఉన్నట్లు వివిధ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ తర్వాత చాలా మంది బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ఆఫీసులకు వెళ్లి పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో 10 శాతం మించి ఉద్యోగులు ఆఫీసులకు రావడం లేదు. ఇదే అంశాన్ని వివరిస్తూ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. తక్షణం ప్రభుత్వం వద్ద బిల్డింగ్లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ప్రైవేటు బిల్డింగ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రాయితీలతో పాటు, వాటి కార్యకలాపాలు సజావుగా సాగేలా అపిటా (ఏపీఈఐటీఏ– ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ) ద్వారా చేయూత అందిస్తున్నాం. ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. – ఎం.నందకిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) చిన్న కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, అసెంచర్స్ వంటి ఐటీ యాంకర్ కంపెనీలు రాష్ట్రానికి వస్తుండటంతో వాటికి అనుబంధంగా అనేక చిన్న కంపెనీలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయనున్న హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే మర్ని ఐటీ కంపెనీలు విశాఖకు క్యూ కడతాయి. ఐటీ కంపెనీలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలు ఇస్తోంది. త్వరలో స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం. – శ్రీధర్ కోసరాజు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (ఐటాప్) -
విశాఖకు ఇన్ఫోసిస్
సాక్షి, అమరావతి: దేశంలో అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో భారీ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ప్రారంభంలో సుమారు 1,000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘సాక్షి’కి చెప్పారు. దాదాపు 1,000 సీట్లతో ప్రారంభించి రానున్న కాలంలో మరింతగా విస్తరించి మూడువేల సీట్లకు పెంచే విధంగా ఇన్ఫోసిస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఆ సంస్థ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రిప్రసాద్ మిశ్రా, రీజనల్ హెడ్ అమోల్ కులకర్ణి మంత్రి అమర్నాథ్తో పాటు అధికారులతో సమావేశమయ్యారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ కోసం ప్లగ్ అండ్ ప్లే విధానానికి మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సొంత భవనాన్ని సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు. ఐటీ రాజధానిగా విశాఖ ఎదగడానికి అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని దిగ్గజ కంపెనీలు తరలివస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పనిచేస్తున్న ఐటీ నిపుణుల్లో 25 శాతం మంది తెలుగువారే ఉన్నారని, ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే మధురవాడ సమీపంలో అదానీ రూ.14,500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని నిర్మాణ పనులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు చిన్న ఐటీ కంపెనీలకు పరిమితమైన విశాఖ ఇన్ఫోసిస్, అదానీ రాకతో మరిన్ని బహుళజాతి కంపెనీలను ఆకర్షిస్తుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
అలర్ట్: ఐటీ దిగ్గజ సంస్థల్లో లక్షకు పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
35,000–ఇన్ఫోసిస్ సంస్థ ఈ ఏడాది చేపట్టనున్న నియామకాలు.. 40,000–టీసీఎస్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ చేస్తామని పేర్కొన్న సంఖ్య.. 22,000–హెచ్‌సీఎల్ సంస్థలో ఈ ఏడాది జరగనున్న ఐటీ నియామకాలు. 12,000–విప్రో సాఫ్ట్వేర్ సర్వీసుల్లో భర్తీ చేస్తామని ప్రకటించిన పోస్టుల సంఖ్య... ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ›ఏడాది టాప్ ఐటీ సంస్థల్లోనే లక్షా పదివేల వరకూ కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు, మధ్యతరహా ఐటీ సంస్థలు చేపట్టే నియామకాలను కూడా కలుపుకుంటే.. ఐటీ రంగంలో ఈ సంవత్సరం 1.6 లక్షల నుంచి 2 లక్షల వరకు కొత్త కొలువులు స్వాగతం పలికే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ తదితర ఐటీ సంస్థల్లో నియామక ప్రక్రియ.. విజయం సాధించేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. టీసీఎస్.. టెక్నికల్ టు పర్సనల్ ► అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). ఈ ఐటీ కంపెనీ.. టెక్నికల్ నైపుణ్యాలు మొదలు సాఫ్ట్ స్కిల్స్ వరకూ.. అన్నింటినీ పరిశీలించేలా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. ► టీసీఎస్ ఎంపిక ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయి. అవి.. అప్టిట్యూడ్ టెస్ట్; టెక్నికల్ ఇంటర్వ్యూ; మేనేజీరియల్ ఇంటర్వ్యూ; హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎఫిషియన్సీ,కోడింగ్ టెస్ట్, ఈ–మెయిల్ రైటింగ్ తదితర అంశాలుంటాయి. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో రౌండ్.. టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ► టెక్నికల్ ఇంటర్వ్యూలో.. అభ్యర్థులు తమ రెజ్యుమేలో పేర్కొన్న అకడమిక్ నైపుణ్యాలు, చేపట్టిన ప్రాజెక్ట్ వర్క్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ టెక్నికల్ ఇంటర్వ్యూ టీంను మెప్పిస్తే తదుపరి దశలో మేనేజీరియల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► మేనేజీరియల్ ఇంటర్వ్యూలో.. అభ్యర్థుల మానసిక సంసిద్ధత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. చివరిగా హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ రౌండ్లో.. భవిష్యత్తు లక్ష్యాలు, కుటుంబ, వ్యక్తిగత నేపథ్యాలపై హెచ్ఆర్ ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతారు. వీటన్నింటికీ అభ్యర్థులు సంతృప్తికరంగా సమాధానాలిస్తే ఆఫర్ ఖరారైనట్లే! ► ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్: టీసీఎస్ క్యాంపస్ నియామకాలతోపాటు ఆఫ్–క్యాంపస్ డ్రైవ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్(ఎన్‌క్యూటీ) పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. ఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఎన్‌క్యూటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు.. తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే కొలువు ఖాయం అవుతుంది. వీరికి కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్(సీబీఓ), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ), లైఫ్ సైన్సెస్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చి.. విధులు కేటాయిస్తారు. ఇన్ఫోసిస్.. ఇలా ► ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ నియామకం కోసం మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అవి.. అప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధిస్తే.. టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలో..ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, కోడింగ్ స్కిల్స్, లేటెస్ట్ టెక్నాలజీస్‌పై అవగాహనను పరిశీలిస్తారు. ఇందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా.. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలో..వ్యక్తిగత సామర్థ్యాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రశ్నలు అడుగుతారు. ► అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలతో హెచ్ఆర్ ప్రతినిధులు సంతృప్తి చెందితే.. సదరు అభ్యర్థులకు ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ తేదీ ఖరారు చేస్తారు. హెచ్‌సీఎల్.. నాలుగు రౌండ్లు ► హెచ్‌సీఎల్ ఎంపిక ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయి. అవి.. అప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ ఇంటర్వ్యూ,హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. ప్రధానంగా అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, టెక్నికల్ అప్టిట్యూడ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధిస్తే.. రెండో రౌండ్లో గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్లో ఏదైనా సామాజిక, సాంకేతిక ప్రాధాన్యం కలిగిన అంశాలను ఇచ్చి.. వాటిపై చర్చించాలని పేర్కొంటారు. ఇందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వారిని టెక్నికల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► టెక్నికల్ ఇంటర్వ్యూలో.. కోడింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో విజయం సాధిస్తే చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ► హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యంపై ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు మీ గురించి చెప్పండి.. హెచ్‌సీఎల్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. వంటి ప్రశ్నలు అడుగుతారు. హెచ్ఆర్ రౌండ్లోనూ నెగ్గితే ఆఫర్ సొంతమైనట్లే! విప్రో.. మూడు దశలు ► విప్రో.. ఐటీ నియామకాలకు మూడంచెల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. అవి..అప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో.. అనలిటికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, టెక్నికల్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. టెక్నికల్ అండ్ లాజికల్ రీజనింగ్‌లో.. పజిల్స్, కోడింగ్‌కు సంబంధించిన చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ► అప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధించిన వారిని టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ► టెక్నికల్ ఇంటర్వ్యూలో..అభ్యర్థుల ప్రోగ్రామింగ్ లాంగ్వే జ్ స్కిల్స్, కోడింగ్ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్నిసార్లు రాత పరీక్ష కూడా నిర్వహించే అవకాశముంది. అప్పటికప్పుడు ఏదైనా అంశాన్ని పేర్కొని దానిపై కోడింగ్ రాయమంటారు. ఈ టెక్నికల్ రౌండ్లో చూపిన ప్రతిభ ఆధారంగా హెచ్ఆర్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ► హెచ్ఆర్ ఇంటర్వ్యూలో.. భవిష్యత్తు లక్ష్యాలు.. అకడమిక్‌గా సాధించిన విజయాలు.. తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ► హెచ్ఆర్ రౌండ్లోనూ విజయం సాధిస్తే విప్రో కొలువు ఖరారైనట్లే! సంస్థ ఏదైనా.. కోరుకునే లక్షణాలివే ► సాఫ్ట్వేర్ సంస్థలు.. నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి ప్రధానంగా కొన్ని లక్షణాలను ఆశిస్తున్నాయి. అవి.. టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్, పీపుల్ స్కిల్స్. ► టెక్నికల్ స్కిల్స్‌లో భాగంగా.. ప్రధానంగా కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నైపుణ్యాలపై సంస్థలు ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. ఇవి ఉన్న వారికే నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► అభ్యర్థులు సమస్యల పట్ల స్పందించే తీరు, సానుకూల దృక్పథం, సంస్థలో దీర్ఘ కాలం పని చేసేందుకు సంసిద్ధత వంటి వాటి ఆధారంగా తుది ఎంపిక చేస్తున్నారు. -
ఇన్ఫోసిస్ లాభం 4,335 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 6 శాతం పెరిగింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా వ్యాపార అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020–21) ఆదాయ, మార్జిన్ల అంచనాలను వెల్లడించడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడ్డాక ఈ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. కాగా గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,078 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ4లో రూ.4,335 కోట్లకు పెరిగింది. అయితే గత క్యూ3 నికర లాభంతో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైంది. ఇతర ఆదాయం 26 శాతం తగ్గడం, అంతకు ముందటి క్వార్టర్లో పన్ను రాయితీలు లభించడంతో నికర లాభం ఈ క్యూ4లో ఈ స్థాయికే పరిమితమైంది. ► ఆదాయం రూ.21,539 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.23,267 కోట్లకు చేరింది. ► డాలర్ల పరంగా చూస్తే, గత క్యూ4లో (సీక్వెన్షియల్‌గా)నికర లాభం 6 శాతం తగ్గి 59 కోట్ల డాలర్లకు, ఆదాయం 1.4 శాతం తగ్గి 320 కోట్ల డాలర్లకు తగ్గింది. ► గత క్యూ4లో 165 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో మొత్తం డీల్స్ విలువ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల డాలర్లకు చేరాయి. ► ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 8% వృద్ధితో రూ.16,639 కోట్లకు, ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.90,791 కోట్లకు చేరాయి. ఆదాయం 10–10.5% రేంజ్లో పెరగగలదన్న అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది. ► ఈ ఏడాది మార్చి చివరికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.27,276 కోట్లుగా ఉన్నాయి. ఎలాంటి రుణ భారం లేదు. ► ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,371కు చేరింది. గత క్యూ4లో ఉద్యోగుల వలస(అట్రిషన్ రేటు) 21 శాతంగా ఉంది. ► ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని ఇన్ఫోసిస్ తెలిపింది. వారు కోలుకోవడానికి తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొంది. జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారందరికీ కొలువులు ఇస్తామని భరోసా ఇచ్చింది. అయితే, వేతనాల పెంపు, అలాగే ప్రమోషన్లు కూడా ఉండవని తెలిపింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 3.7 శాతం లాభంతో రూ.653 వద్ద ముగిసింది. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన ఇన్ఫోసిస్ ఏడీఆర్ మాత్రం 1 శాతం లాభంతో 8.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సమస్యల నుంచి గట్టెక్కుతాం... గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10 శాతం వృద్ధి, 21.3 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించాం. సమీప భవిష్యత్తులో మా వ్యాపారంపై ప్రభావం ఉంటుంది. రికవరీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. నాణ్యమైన సేవలందించగలగడం, పుష్కలంగా నిధుల దన్నుతో సమస్యలను అధిగమించగలం. –సలిల్ పరేఖ్, సీఈఓ, ఎమ్డీ, ఇన్ఫోసిస్ ఫలితాలు సంతృప్తికరం... వివిధ విభాగాల్లో, దేశాల్లో మంచి వృద్ధిని సాధించాం. భారీ డీల్స్ పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరమైన ఫలితాలిచ్చింది. –ప్రవీణ్ రావ్, సీఓఓ, ఇన్ఫోసిస్ -
బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ
సాక్షి, బెంగళూరు : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనావైరస్ సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్ని ఖాళీ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కొంత మంది సభ్యులకు కరోనా సోకినట్లు అనుమానం కలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్‌పాండే పేర్కొన్నారు. (చదవండి : కరోనా ఎఫెక్ట్..అమెరికా కాన్సులేట్ కీలక నిర్ణయం) ‘సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా వ్యాపించిందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఐఐటీఎం భవనం ఖాళీ చేస్తున్నాం. మన ఉద్యోగుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీరు గుర్తించాలి. కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీరేమీ ఆందోళన చెందవద్దు. కరోనా వ్యాప్తి గురించి ఎలాంటి పుకార్లు అవాస్తవాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటిని నమ్మకండి.. ప్రచారం చేయకండి. మీరు బాధ్యతాయుతంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఉద్యోగులకు దేశ్‌పాండే మెయిల్ చేశారు. కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండడానికి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోవ్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని ఐటీ, బయోటెక్ కంపెనీలకు ఆదేశించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ
అమెరికా–చైనాల మధ్య తొలి దశ ఒప్పందంపై సంతకాలు ఈ వారమే జరుగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా సోమవారం లాభపడింది. గత ఏడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 1.8 శాతం వృద్ధి సాధించడం, ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు అంచనాలను మించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 70.82కు చేరడం(ఇంట్రాడేలో), సానుకూల ప్రభావం చూపించాయి. టెక్నాలజీ, బ్యాంక్, లోహ, రియల్టీ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్లను సృష్టించాయి. ఇంట్రాడేలో 41,900 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్ చివరకు 260 పాయింట్ల లాభంతో 41,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,330 పాయింట్ల వద్దకు చేరింది. ఇంట్రాడేలో 12,338 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నికర లాభాలు పెరుగుతాయ్....! ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు బాగా ఉండటంతో ఇతర కంపెనీల ఫలితాలు కూడా బాగానే ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల కారణంగా కంపెనీల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో నికర లాభాలు మాత్రం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ► నికర లాభం 24 శాతం పెరగడంతో ఇన్ఫోసిస్ షేర్ 4.7 శాతం లాభంతో రూ.773 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 260 పాయింట్ల లాభంలో సగం పాయింట్లు (125 పాయింట్లు) ఇన్ఫోసిస్ షేర్వి కావడం విశేషం. ► ఇన్వెస్టర్ల సంపద ఒక్క సోమవారం రోజే రూ. లక్ష కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1 లక్ష కోట్లు పెరిగి రూ.158.74 లక్షల కోట్లకు ఎగసింది. ► లిస్టింగ్ నిబంధనలను పాటించనందున వచ్చే నెల 3 నుంచి కాఫీ డే ఎంటర్ప్రైజెస్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ల ట్రేడింగ్ నిలిచిపోనున్నది. దీంతో ఈ రెండు షేర్లు చెరో 5 శాతం మేర నష్టపోయాయి. కాఫీ డే షేర్ రూ.39.65కు, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ 4.9 శాతం నష్టంతో రూ.10.80కు చేరాయి. ► జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, ఫీనిక్స్ మిల్స్, రిలాక్సో ఫుట్‌వేర్, శ్రీ సిమెంట్, ఎస్ఆర్ఎఫ్, టాటాగ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు ఆల్‌టైం హైని తాకాయి. ► ఎర్విన్ సింగ్బ్రెయిచ్ పెట్టుబడుల ప్రణాళికను యస్ బ్యాంక్ తిరస్కరించింది. ఈ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఒకరు రాజీనామా చేశారు. అంతే కాకుండా నిధుల సమీకరణను రూ.10,000 కోట్లకు మాత్రమే పరిమితం చేయాలని డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. దీంతో యస్ బ్యాంక్ షేర్ 6 శాతం నష్టంతో రూ.42 వద్ద ముగిసింది. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో డీఎల్ఎఫ్ షేర్ జోరుగా పెరిగింది. 3.5 శాతం లాభంతో రూ. 253కు చేరింది. -
అమెరికాలో కేసు.. కోర్టు బయట పరిష్కారం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో విదేశీ ఉద్యోగులను తప్పుగా వర్గీకరించి చూపడం, పన్నుపరమైన మోసాలకు పాల్పడటం తదితర ఆరోపణలకు సంబంధించిన కేసును ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోర్టు వెలుపల పరిష్కరించుకోనుంది. ఇందుకు సంబంధించి కాలిఫోర్నియా రాష్ట్రానికి 8,00,000 డాలర్లు (సుమారు రూ.5.6 కోట్లు) చెల్లించనుంది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెసెరా ఈ విషయాలు తెలిపారు. ‘తక్కువ జీతాలతో పనిచేయించుకునేందుకు, పన్నులు ఎగ్గొట్టేందుకు ఇన్ఫోసిస్ తప్పుడు వీసాలపై ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చింది. కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవనడానికి ఈ సెటిల్మెంట్ ఒక నిదర్శనం’ అని పేర్కొన్నారు. 2006–2017 మధ్య కాలంలో అమెరికాలో 500 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ హెచ్–1బీ వీసాలపై కాకుండా బీ–1 వీసాలపై పనిచేయించుకుందన్న ప్రజా వేగు ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఇలాంటి తప్పుడు వర్గీకరణ వల్ల ఇన్ఫోసిస్.. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరుద్యోగ బీమా, వైకల్య బీమా, ఉద్యోగుల శిక్షణ పన్నులు చెల్లించకుండా తప్పించుకుందని ఆరోపణలున్నాయి. సాధారణంగా హెచ్–1బీ వీసాలపై పనిచేసే సిబ్బందికి స్థానిక నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, తమపై ఆరోపణలను ఇన్ఫోసిస్ తోసిపుచ్చింది. సుదీర్ఘంగా 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే పరిష్కరించుకుంటున్నట్లు వివరణనిచ్చింది. తప్పుడు పత్రాలు సమర్పించిందన్న ఆరోపణలను సెటిల్ చేసుకునేందుకు 2017లో న్యూయార్క్‌కు ఇన్ఫోసిస్ 1 మిలియన్ డాలర్లు చెల్లించింది. -
ఇన్ఫీపై సెబీ విచారణ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడంపైనా, సీఈవో.. సీఎఫ్‌వోలపై వచ్చిన ఆరోపణలమీద స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. కంపెనీ షేరు ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలియజేయకపోవడంపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, కంపెనీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దిశగా ఇన్ఫోసిస్ షేర్లలో ట్రేడింగ్ డేటాతో పాటు డెరివేటివ్ పొజిషన్ల గురించిన వివరాలు ఇవ్వాలని స్టాక్ ఎక్సే్చంజీలకు సెబీ సూచించినట్లు వివరించాయి. ఈ వివాదంపై ఇన్ఫీ టాప్ మేనేజ్మెంట్తో పాటు ఇతరత్రా కీలక వ్యక్తులను కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇన్వెస్టిగేషన్ పురోగతిని బట్టి ఆడిటింగ్ సహా ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలు చూసే బోర్డు కమిటీల నుంచి కూడా సెబీ వివరాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వతంత్ర డైరెక్టర్లపైనా దృష్టి..: ఈ వ్యవహారంలో ఇన్ఫీ స్వతంత్ర డైరెక్టర్ల తీరుపైనా సెబీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజావేగు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఇన్ఫీ యాజమాన్యం.. స్టాక్ ఎక్సే్చంజీలకు, సెబీకి సత్వరం తెలియజేసేలా, తక్షణ చర్యలు తీసుకునేలా చూడటంలో స్వతంత్ర డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరించారన్నది తెలుసుకోనుంది. మరోవైపు, ప్రజావేగు ఫిర్యాదు గురించి సత్వరం ఎందుకు తెలియజేయలేదో వివరణనివ్వాలంటూ ఇన్ఫోసిస్‌కు బుధవారం బోంబే స్టాక్ ఎక్సే్చంజీ (బీఎస్ఈ) సూచించింది. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంబించారంటూ ’నైతిక ఉద్యోగుల బృందం’ పేరిట కొందరు ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్ బోర్డుకు ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. అటు అమెరికాలోని ఆఫీస్ ఆఫ్ ది విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంకు కూడా ప్రజావేగుల నుంచి ఫిర్యాదు వెళ్లింది. సోమవారం బైటికొచ్చిన ఈ వార్తలతో ఇన్ఫీ షేరు మంగళవారం భారీగా పతనమైంది. అటు అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు రోజెన్ లా ఫర్మ్ అనే న్యాయసేవల సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ నందన్ నీలేకని వెల్లడించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం ఇన్ఫోసిస్ షేరు సుమారు ఒక్క శాతం లాభపడింది. బీఎస్ఈలో రూ. 650.75 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్ మొదలయ్యాక ఒకానొకదశలో 4.5% మేర దిగజారి రూ.615 కనిష్ట స్థాయిని కూడా తాకింది. -
అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా!
ప్రజావేగు ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫీని మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఈ వివాదంతో నష్టపోయిన ఇన్వెస్టర్ల తరఫున క్లాస్ యాక్షన్ దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ రోజెన్ లా ఫర్మ్ వెల్లడించింది. ‘ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనల కారణంగా మదుపుదారులకు వాటిల్లిన నష్టాల గురించి విచారణ చేస్తున్నాం. పరిహారాన్ని రాబట్టేందుకు క్లాస్ యాక్షన్ దావా సిద్ధం చేస్తున్నాం‘ అని పేర్కొంది. ఐఎస్ఎస్ సెక్యురిటీస్ క్లాస్ యాక్షన్ సర్వీసెస్ ప్రకారం 2017లో అత్యధికంగా క్లాస్ యాక్షన్ దావాలను సెటిల్ చేసిన సంస్థల్లో రోజెన్ అగ్రస్థానంలో ఉంది. క్లాస్ యాక్షన్ అంటే..: ఒక్కొక్క ప్రతివాదికి రావాల్సిన పరిహారం చాలా స్వల్పస్థాయిలో ఉండి, దావా వేసేంత స్థాయిలో ఆర్థిక వనరులు లేనప్పుడు అందరూ కలిసి వేసే కేసును క్లాస్ యాక్షన్ దావాగా పరిగణించవచ్చు. ఒక గ్రూపుగా ఏర్పడి కేసు వేయడం వల్ల లాయర్ల ఫీజుల భారం తగ్గించుకోవచ్చు. అదే సమయంలో కోర్టులకు కూడా ఒకే తరహా కేసులో వందలకొద్దీ క్లెయిమ్స్ విచారణ భారం తగ్గుతుంది. సాధారణంగా తప్పుడు ప్రకటనలు, వివక్ష, లోపభూయిష్టమైన ఉత్పత్తులు తదితర అంశాలపై ఆర్థిక సంస్థలు, తయారీదార్ల నుంచి ప్రభుత్వ సంస్థల దాకా దేనిపైనైనా ఈ దావాలకు ఆస్కారముంది. సాధారణంగా ఇలాంటి క్లాస్ యాక్షన్ కేసుల సెటిల్మెంట్ కోర్టుల వెలుపలే జరుగుతుంటాయి. పదేళ్ల క్రితం సత్యం కంప్యూటర్స్ స్కామ్ బైటపడినప్పుడు అమెరికాలో ఇన్వెస్టర్లు ఇలాంటి కేసు ద్వారానే నష్టాలకు కొంత పరిహారం పొందగలిగారు. కానీ భారత్‌లో అప్పట్లో ఇలాంటి విధానం లేకపోవడంతో ఇక్కడి ఇన్వెస్టర్లకు సాధ్యపడలేదు. సత్యం కుంభకోణం దరిమిలా ఆ తర్వాత భారత్‌లో కూడా ఇలాంటి క్లాస్ యాక్షన్ దావాలకు వీలు కల్పిస్తూ.. కంపెనీల చట్టంలో నిబంధనలు చేర్చారు. -
ఇన్ఫోసిస్..ఇన్వెస్టెర్రర్!
న్యూఢిల్లీ: ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఈవో సలిల్ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు కుదేలైంది. మంగళవారం ఏకంగా 16 శాతం పతనమైంది. గడిచిన ఆరేళ్లలో ఇంత భారీగా ఇన్ఫీ షేరు క్షీణించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపించేందుకు ఖాతాల గోల్మాల్ చేయిస్తున్నారని, అనైతిక విధానాలకు తెరతీశారని సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పష్టం చేశారు. అంతర్గత ఆడిటర్లు ఈవైతో ఆడిట్ కమిటీ సంప్రతింపులు జరుపుతోందని, స్వతంత్ర విచారణ కోసం న్యాయసేవల సంస్థ శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కోని నియమించుకున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు నీలేకని తెలియజేశారు. ఆడిట్ కమిటీ సిఫార్సులతో చర్యలు.. సంస్థలో అనైతిక విధానాల పేరిట ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఒక బోర్డు సభ్యుడికి గుర్తుతెలియని వారి నుంచి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు నీలేకని తెలిపారు. వీటిలో ఒక దానిపై సెప్టెంబర్ 20వ తేదీ ఉండగా, రెండో దానిపై తేదీ లేకుండా ప్రజావేగు ఫిర్యాదు అని ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండింటినీ అక్టోబర్ 10న ఆడిట్ కమిటీ ముందు, మరుసటి రోజున బోర్డులో నాన్–ఎగ్జిక్యూటివ్ సభ్యుల ముందు ఉంచినట్లు నీలేకని తెలిపారు. తేదీ లేని రెండో లేఖలో ప్రజావేగు ప్రధానంగా సీఈవో అమెరికా, ముంబైల పర్యటనల మీద ఆరోపణలు ఉన్నట్లు వివరించారు. ‘అక్టోబర్ 11న బోర్డు సమావేశం అనంతరం ప్రాథమిక విచారణకు సంబంధించి స్వతంత్ర అంతర్గత ఆడిటర్లతో (ఎర్నెస్ట్ అండ్ యంగ్) ఆడిట్ కమిటీ సంప్రతింపులు ప్రారంభించింది. అక్టోబర్ 21న శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో సంస్థను స్వతంత్ర విచారణ కోసం నియమించుకోవడం జరిగింది‘ అని ఆయన పేర్కొన్నారు. 11న బోర్డు సమావేశం తర్వాత తమ ఆడిటర్లకు (డెలాయిట్ ఇండియా) అన్ని విషయాలు పూర్తిగా తెలియజేసినట్లు నీలేకని తెలిపారు. ‘ఈమెయిల్స్ లేదా వాయిస్ రికార్డింగ్స్ లాంటివేవీ మాకు అందలేదు. అయినప్పటికీ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇది నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు సీఈవో, సీఎఫ్‌వో దీనికి దూరంగా ఉంటారు‘ అని ఆయన వివరించారు. విచారణలో వెల్లడయ్యే వివరాలను బట్టి ఆడిట్ కమిటీ సిఫార్సుల ప్రకారం బోర్డు తగు చర్యలు తీసుకుంటుందని నీలేకని చెప్పారు. సీఈవో, సీఎఫ్‌వోలపై అనైతిక విధానాల ఆరోపణలు ఐటీ దిగ్గజం ఇన్ఫీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కంపెనీ షేరు ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కుప్పకూలింది. ప్రజావేగుల ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామంటూ సంస్థ చైర్మన్ నీలేకని దిద్దుబాటు చర్యలు ప్రారంభించినప్పటికీ.. అమెరికాలో ఇన్ఫీని ఇరకాటంలో పెట్టేందుకు అక్కడి ఇన్వెస్టర్లు క్లాస్ యాక్షన్ దావాకు సిద్ధమవుతున్నారు. దీంతో.. రెండేళ్ల క్రితం సీఈవో, ప్రమోటర్ల మధ్య వివాదాలతో తలెత్తిన సంక్షోభ ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇన్ఫోసిస్ .. తాజాగా మరో సంక్షోభంలోకి జారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్ఫీ షేరు మంగళవారం ఎలా పడిపోయిందంటే.. షేరు క్రితం ముగింపు ధర రూ.768, ఆరంభం 10 శాతం డౌన్ షేరు ధర రూ.691, ఇంట్రాడేలో కనిష్ట ధర రూ.638 17 శాతం క్రాష్ , షేరు ముగింపు ధర రూ. 643,16% డౌన్ 53 వేల కోట్ల మార్కెట్ క్యాప్ హుష్.. ప్రజావేగుల ఆరోపణలపై ఆందోళనలతో ఇన్ఫీ షేరు కుదేలవడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒకే రోజులో ఏకంగా రూ. 53,451 కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్ వేల్యుయేషన్ రూ. 2,76,300 కోట్లకు తగ్గింది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా పతనమైన పెద్ద కంపెనీ షేరు ఇదే. బీఎస్ఈలో షేరు ఒక దశలో 16.86 శాతం పతనమై రూ. 638.30 స్థాయిని కూడా తాకింది. 2013 ఏప్రిల్ తర్వాత ఒకే రోజున ఇంత స్థాయిలో షేరు క్షీణించడం ఇదే తొలిసారి. చివరికి 16.21 శాతం క్షీణించి రూ. 643.30 వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈలో 16.65 శాతం క్షీణించి రూ. 640 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అమెరికా మార్కెట్లో సోమవారం 14 శాతం పతనమైన ఇన్ఫీ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) పతనం మంగళవారం కూడా కొనసాగింది. ఒక దశలో మరో 4 శాతం దాకా పడింది. ఇదీ వివాదం.. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సలిల్ పరేఖ్, ఆయనకు తోడుగా నీలాంజన్ రాయ్ ఖాతాలు గోల్మాల్ చేయిస్తున్నారంటూ కొందరు ఉద్యోగుల బృందం.. ఇన్ఫీ బోర్డుకు, అమెరికాలోని విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంకు చేసిన ఫిర్యాదులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. గత రెండు త్రైమాసికాలుగా ఇలాంటి ధోరణులు పెరిగాయని, అనైతిక విధానాలకు అడ్డు చెప్పిన ఉద్యోగులను పక్కన పెట్టడం జరుగుతోందని ప్రజావేగులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ అన్నీ తమ దగ్గర ఉన్నాయని, తగిన సందర్భంలో అందజేస్తామని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలతో రెండేళ్ల క్రితం ఇన్ఫీ ఉక్కిరిబిక్కిరైన సంగతి తెలిసిందే. దీనిపైనే ప్రమోటర్లతో విభేదాలు రావడంతో సీఈవో విశాల్ సిక్కా అర్ధంతరంగా నిష్క్రమించారు. కొత్త సీఈవోగా సలిల్ పరేఖ్ వచ్చిన తర్వాత మళ్లీ ఇన్ఫీ మెల్లిగా గాడిన పడటం మొదలైంది. అయితే ఇంతలోనే ఆయనపైనా అవకతవకల ఆరోపణలు రావడంతో ఇన్ఫీ వ్యవహారాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. -
ఇన్ఫోసిస్ మరో సత్యం కాబోతుందా?
-
మెప్పించిన ఇన్ఫీ!
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్.. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం నికర లాభం స్వల్పంగా 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా నమోదైంది. మార్కెట్ వర్గాలు ఇది సుమారు రూ. 4,040 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 4,110 కోట్లు. మరోవైపు, రెండో త్రైమాసికంలో ఆదాయం 9.8% వృద్ధితో రూ. 20,609 కోట్ల నుంచి రూ. 22,629 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 11.4 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ గైడెన్స్‌ను ఇన్ఫోసిస్ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 9–10 శాతానికి సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రెవెన్యూ వృద్ధి 7.5–9.5 శాతంగా ఉండొచ్చంటూ గైడెన్స్ ఇచ్చిన ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో దీన్ని 8.5–10 శాతానికి పెంచింది. తాజాగా కనీస ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను మరింత పెంచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. టీసీఎస్ లాభంలో స్వల్ప వృద్ధి సాధించగా, ఇన్ఫీ లాభాలు స్వల్పంగా తగ్గడం గమనార్హం. 2.8 బిలియన్ డాలర్ల డీల్స్.. మరో త్రైమాసికంలో అన్ని విభాగాల్లోనూ, ప్రాంతాలవారీగాను ఆల్ రౌండ్ వృద్ధి సాధించగలిగాం. క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. 2.8 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఉద్యోగులకు మరింత ప్రయోజనాలు చేకూర్చేందుకు తీసుకుంటున్న చర్యలతో అట్రిషన్ రేటును తగ్గించుకోగలిగాం‘. – ప్రవీణ్ రావు, సీవోవో బహుముఖ వృద్ధి.. నిర్వహణ మార్జిన్లు, సామర్ధ్యాలు, ఆదాయాలు, డిజిటల్ విభాగం మెరుగుపడటంతో పాటు భారీ డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఆట్రిషన్ తగ్గింది. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు సాధించగలిగాం. వాటాదారులకు మరింత విలువ చేకూర్చడంతో పాటు క్లయింట్లకు అవసరమైన సేవలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా కంపెనీ పురోగతి సాధిస్తోందనడానికి ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు’. – సలిల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ 14% అదనంగా డివిడెండ్ నిర్వహణపరంగా అన్ని అంశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు వ్యయాలు నియంత్రించుకోవడంతో రెడో త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్లు పెంచుకోగలిగాం. నిధులను మెరుగ్గా వినియోగించుకునే∙దిశగా మధ్యంతర డివిడెండ్‌ను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14 శాతం పెంచగలిగాం’. – నీలాంజన్ రాయ్, సీఎఫ్ఓ మరిన్ని విశేషాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్ మారకంలో నికర లాభం 569 మిలియన్ డాలర్లు కాగా ఆదా యం 3.21 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► సీక్వెన్షియల్‌గా నికర లాభం 6 శాతం, ఆదాయం 3.8 శాతం పెరిగింది. ► డిజిటల్ విభాగం ఆదాయాలు 38.4 శాతం వృద్ధి చెంది 1.23 బిలియన్ డాలర్లకు చేరాయి. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 38.3 శాతానికి చేరింది. ► 21–23 శాతం శ్రేణిలో ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ యథాతథం. ► రూ. 8,260 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్ కార్యక్రమం ఆగస్టు 26తో ముగిసింది. ► రెండో త్రైమాసికంలో నికరంగా 7,457 మంది నియామకాలు జరిగాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.36 లక్షలకు చేరింది. ► ఆట్రిషన్ రేటు జూన్ ఆఖరు నాటికి 23.4 శాతంగా ఉండగా, సెప్టెంబర్ క్వార్టర్లో 21.7 శాతానికి తగ్గింది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడయ్యాయి. బీఎస్ఈలో సంస్థ షేరు 4.19% పెరిగి రూ. 815.70 వద్ద ముగిసింది. -
మెప్పించిన ఇన్ఫీ!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019–20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,612 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 13.9 శాతం ఎగబాకి రూ.19,128 కోట్ల నుంచి రూ.21,803 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు కంపెనీ క్యూ1లో రూ. 3,702 కోట్ల నికర లాభాన్ని, రూ.21,776 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. దీనికి మించి ఫలితాలు వెలువడ్డాయి. సీక్వెన్షియల్‌గా ఇలా... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) నికర లాభం రూ.4,078 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభంలో 6.8% తగ్గుదల నమోదైంది. ఆదాయం మాత్రం 1.2 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో రూ.21,539 కోట్లుగా ఉంది. గైడెన్స్ అప్... ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) ఇన్ఫీ పెంచింది. గడిచిన క్వార్టర్ ఫలితాల సందర్భంగా ఈ ఏడాది ఆదాయ వృద్ధి 7.5–9.5% ఉండొచ్చని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.5–10 శాతానికి పెంచింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్ 21–23 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► డాలర్ల రూపంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన క్యూ1లో 534 మిలియన్ డాలర్ల నుంచి 546 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 2.83 బిలియన్ డాలర్ల నుంచి 3.13 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 12.4 శాతం వృద్ధి సాధించింది. ► క్యూ1లో 2.7 బిలియన్ డాలర్ల విలువైన భారీస్థాయి కాంట్రాక్టులను ఇన్ఫీ దక్కించుకుంది. 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో రెండు కాంట్రాక్టులు, 10 మిలియన్ డాలర్లకు మించిన విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి. ► కంపెనీకి డిజిటల్ విభాగం నుంచి 1,119 మిలియన్ డాలర్ల ఆదాయం క్యూ1లో సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 41.9 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 35.7 శాతానికి చేరింది. ► ఇంధనం–యుటిలిటీస్ విభాగం ఆదాయం 4.7 శాతం(సీక్వెన్షియల్), కమ్యూనికేషన్ 4.6 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఇక ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 3 శాతం వృద్ధి చెందింది. మిగత దేశాల నుంచి ఆదాయంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది. ► కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 2,29,029కి చేరింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి (2018–19, క్యూ4) ఈ సంఖ్య 2,28,123 మాత్రమే. దీనిప్రకారం చూస్తే నికరంగా 906 మంది ఉద్యోగులు మాత్రమే జతయ్యారు. ఇక ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ1లో 23.4 శాతానికి పెరిగింది. క్యూ4లో ఇది 20.4 శాతం మాత్రమే. ► డేటా ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ సేవల అనుబంధ సంస్థ ట్రైఫాక్టాలో అదనంగా 6 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మొత్తం పెట్టుబడి 10 మిలియన్ డాలర్లకు చేరుతుందని ఇన్ఫీ పేర్కొంది. ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1% లాభపడి రూ.727 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మగిశాక ఫలితాలను ప్రకటించింది. కాగా, అమెరికా నాస్డాక్ ఎక్సే్ఛంజ్‌లో ఇన్ఫీ షేరు(ఏడీఆర్) శుక్రవారం కడపటి సమాచారం మేరకు 6 శాతానికిపైగా లాభాలతో ట్రేడవుతోంది. ఇక లాభాల్లో 85% ఇన్వెస్టర్లకే.. ఇన్వెస్టర్లకు మరింత విలువ జోడించేందుకు తమ నిధుల కేటాయింపు ప్రణాళికను మారుస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లకుగాను కంపెనీ వార్షిక నికర లాభాల్లో (ఫ్రీ క్యాష్‌ఫ్లో) 85 శాతం వరకూ తిరిగి ఇన్వెస్టర్లకు పంచేయాలని నిర్ణయించినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నీలాంజన్ రాయ్ తెలిపారు. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్నట్లే డివిడెండ్లు లేదా ప్రత్యేక డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల రూపంలో ఇది ఉంటుందన్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, ఇప్పటికీ తమవద్ద 3.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలున్నాయని రాయ్ వివరించారు. ఇప్పటివరకూ ఏటా 70 శాతం వరకూ ఫ్రీ క్యాష్‌ను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చే విధానాన్ని ఇన్ఫీ అనుసరిస్తోంది. కాగా, రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్ కొనసాగుతోందని ఇప్పటివరకూ రూ.5,934 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ బైబ్యాక్ కొనసాగింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, తాజా బడ్జెట్లో 20 శాతం బైబ్యాక్ పన్ను విధించిన నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీల షేర్ల బైబ్యాక్‌లకు అడ్డుకట్ట పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు మరింతగా నగదు నిల్వలను పంచే ప్రణాళికను ఇన్ఫీ ప్రకటించడం గమనార్హం. ‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని చాలా పటిష్టమైన ఫలితాలతో మేం బోణీ చేశాం. డాలర్ల రూపంలో ఆదాయం 12.4 శాతం ఎగబాకడం, ముఖ్యంగా డిజిటల్ విభాగం నుంచి 41.9 శాతం ఆదాయ వృద్ధి నమోదు కావడం శుభపరిణామం. క్లయింట్లతో మెరుగైన సంబంధాలు, వారిపై మరింత దృష్టిపెట్టడం, తదనుగుణంగా మేం చేస్తున్న పెట్టుబడులే మెరుగైన ఫలితాలకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌ను కూడా పెంచాం’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ, ఎండీ -
తక్షణ అవరోధశ్రేణి 36,200–36,285
జనవరి తొలివారంలో భారత్‌తో సహా ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ...వాటి ఇటీవలి గరిష్టస్థాయిల వద్ద పరిమితశ్రేణిలో కదిలాయి. అమెరికా–చైనా ట్రేడ్‌వార్ చర్చలు సానుకూలంగా ముగిసాయన్న వార్తలు కూడా మార్కెట్లను పెద్దగా ఉత్తేజపర్చలేకపోయాయి. ఇక్కడ ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు సైతం మార్కెట్ అంచనాలకంటే దిగువస్థాయిలోనే వున్నాయి. ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించినందున, ఫలితాలు నిరుత్సాహపర్చినా, షేరు గరిష్టస్థాయిలోనే ట్రేడ్‌కావొచ్చు. అయితే ఇన్ఫోసిస్, ఐటీసీ, కొన్ని కార్పొరేట్ బ్యాంకులు మినహా మిగిలిన హెవీవెయిట్ షేర్లన్నీ ముందడుగు వేయలేకపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనపర్చే అంశం. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునఃప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు.. జనవరి 11తో ముగిసిన వారంలో 36,270–35,750 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 315 పాయింట్ల లాభంతో 36,010 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే సెన్సెక్స్‌కు 36,200–36,285 శ్రేణి గట్టిగా నిరోధించవచ్చు. గతవారంలో పలుదఫాలు అవరోధం కలిగించిన ఈ శ్రేణిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35750 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తేక్రమేపీ 35,380 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధశ్రేణి 10830–10,870 గతవారం 10,870– 10,733 పాయింట్ల మధ్య పరిమితశ్రేణిలో ఊగిసలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,795 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 10830–10,870 శ్రేణి తొలుత తీవ్ర నిరోధాన్ని కల్పించవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ వారం పైన సూచించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,730 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. గత వారంరోజులుగా మద్దతునిచ్చిన ఈ స్థాయిలోపున ముగిస్తే 10,630 పాయింట్ల వద్ద క్రమేపీ తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 10,535 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
మోదీ కేర్’కు నిలేకనీ సాయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకానికి(ఎన్‌హెచ్‌పీఎస్) అవసరమయ్యే సాంకేతిక వనరుల(ఐటీ) కల్పనలో సాయానికి ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకనీ అంగీకరించారని నీతి ఆయోగ్ తెలిపింది. మోదీ కేర్‌గా పిలుస్తున్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆధార్ తరహాలోనే ఎన్‌హెచ్‌పీఎస్ పథకానికి కూడా భారీ స్థాయిలో ఐటీ సేవలు అవసరమని, ఆ నేపథ్యంలో ఆధార్ జారీ వ్యవస్థ యూఐడీఐఏ మాజీ చైర్మన్ నిలేకనీని సంప్రదించామని నీతి ఆయోగ్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 2న పరేఖ్ బాధ్యతలు చేపడతారు. ఆయన పదవీకాలం అయిదేళ్ల పాటు ఉంటుంది. ఇకపై యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని ఇన్ఫోసిస్ తెలిపింది. పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ సారథ్యంలో ఇన్ఫోసిస్ పురోగమించగలదని కంపెనీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. కీలకమైన సీఈవో పదవికి ఇన్ఫోసిస్ బయటి వ్యక్తిని తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో సీఈవోగా వ్యవహరించిన విశాల్ సిక్కా.. వ్యవస్థాపకులతో విభేదాల నేపథ్యంలో కొన్నాళ్ల క్రితమే రాజీనామా చేశారు. నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు పరేఖ్ ఎంపిక జరిగినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫీ బాధ్యతలు చేపడుతున్న పరేఖ్.. పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
ఇన్ఫీ ఫలితాలు.. ఐఐపీపై దృష్టి
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా సోమవారం(6న) స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం(10న) జూలై-సెప్టెంబర్ కాలానికి(క్యూ2) పనితీరు వెల్లడించనుంది. తద్వారా దేశీ కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరలేవనుంది. ఇక అదే రోజు ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడనున్నాయి. మరోవైపు ఆగస్ట్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ వివరాలు మంగళవారం(7న) వెల్లడికానున్నాయి. ఈ అంశాలన్నీ ఈ వారం సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఇన్ఫోసిస్ ఫలితాలు, ఐఐపీ తీరు మార్కె ట్ల నడకను నిర్దేశించగలవని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఎఫ్ఐఐలు, రూపాయి కీలకమే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరుతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని అత్యధికశాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఇవికాకుండా అంతర్జాతీయ సంకేతాలు సైతం మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని తెలిపారు. విదేశీ మార్కెట్ల తీరు, అంతర్జాతీయ సంకేతాలు, దేశీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వంటి అంశాలు రానున్న కాలంలో మార్కెట్ల దిశను నిర్దేశించగలవని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ వివరించారు. కాగా, యూఎస్ ఉద్యోగ గణాంకాల ప్రభావం మంగళవారంనాటి ట్రేడింగ్‌పై ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. 2008 జూలై తరువాత ఈ సెప్టెంబర్ నెలకు అమెరికాలో నిరుద్యోగిత బాగా తగ్గడంతో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఉంటుందని నిపుణులు తెలిపారు. 2,15,000 కొత్త ఉద్యోగాలను అంచనా వేయగా, 2,48,000 నమోదుకావడంతో నిరుద్యోగ రేటు 6.1% నుంచి 5.9%కు దిగింది. దీంతో గడిచిన శుక్రవారం(3న) అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో ఇతర కరెన్సీలతో మారకంలో డాలర్ బలపడింది. ఇది దేశీయంగా ఐటీ షేర్లకు ప్రోత్సాహాన్నిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.