మెప్పించిన ఇన్ఫీ! | Infosys delivers in Q1, raises growth guidance for the year | Sakshi
Sakshi News home page

మెప్పించిన ఇన్ఫీ!

Published Sat, Jul 13 2019 5:00 AM | Last Updated on Sat, Jul 13 2019 5:11 AM

Infosys delivers in Q1, raises growth guidance for the year - Sakshi

ఫలితాలను ప్రకటిస్తున్న ఇన్ఫీ సీఈఓ సలీల్‌ పరేఖ్, సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌ (కుడి వ్యక్తి)

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019–20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్‌ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,612 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 13.9 శాతం ఎగబాకి రూ.19,128 కోట్ల నుంచి రూ.21,803 కోట్లకు చేరింది. మార్కెట్‌ విశ్లేషకులు కంపెనీ క్యూ1లో రూ. 3,702 కోట్ల నికర లాభాన్ని, రూ.21,776 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. దీనికి మించి ఫలితాలు వెలువడ్డాయి.

సీక్వెన్షియల్‌గా ఇలా...
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) నికర లాభం రూ.4,078 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభంలో 6.8% తగ్గుదల నమోదైంది. ఆదాయం మాత్రం 1.2 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో రూ.21,539 కోట్లుగా ఉంది.  

గైడెన్స్‌ అప్‌...
ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్‌) ఇన్ఫీ పెంచింది. గడిచిన క్వార్టర్‌ ఫలితాల సందర్భంగా ఈ ఏడాది ఆదాయ వృద్ధి 7.5–9.5% ఉండొచ్చని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.5–10 శాతానికి పెంచింది. ఇక నిర్వహణ మార్జిన్‌ గైడెన్స్‌ 21–23 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
►  డాలర్ల రూపంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన క్యూ1లో 534 మిలియన్‌ డాలర్ల నుంచి 546 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 2.83 బిలియన్‌ డాలర్ల నుంచి 3.13 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. 12.4 శాతం వృద్ధి సాధించింది.

► క్యూ1లో 2.7 బిలియన్‌ డాలర్ల విలువైన భారీస్థాయి కాంట్రాక్టులను ఇన్ఫీ దక్కించుకుంది. 100 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో రెండు కాంట్రాక్టులు, 10 మిలియన్‌ డాలర్లకు మించిన విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి.

►  కంపెనీకి డిజిటల్‌ విభాగం నుంచి 1,119 మిలియన్‌ డాలర్ల ఆదాయం క్యూ1లో సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 41.9 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 35.7 శాతానికి చేరింది.

► ఇంధనం–యుటిలిటీస్‌ విభాగం ఆదాయం 4.7 శాతం(సీక్వెన్షియల్‌), కమ్యూనికేషన్‌ 4.6 శాతం చొప్పున వృద్ధి చెందాయి.

► ఇక ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 3 శాతం వృద్ధి చెందింది. మిగత దేశాల నుంచి ఆదాయంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది.

► కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది జూన్‌ చివరినాటికి 2,29,029కి చేరింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి (2018–19, క్యూ4) ఈ సంఖ్య 2,28,123 మాత్రమే. దీనిప్రకారం చూస్తే నికరంగా 906 మంది ఉద్యోగులు మాత్రమే జతయ్యారు. ఇక ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్‌) క్యూ1లో 23.4 శాతానికి పెరిగింది. క్యూ4లో ఇది 20.4 శాతం మాత్రమే.

► డేటా ప్రిపరేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల అనుబంధ సంస్థ ట్రైఫాక్టాలో అదనంగా 6 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మొత్తం పెట్టుబడి 10 మిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఇన్ఫీ పేర్కొంది.
ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 1% లాభపడి రూ.727 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ మగిశాక ఫలితాలను ప్రకటించింది. కాగా, అమెరికా నాస్‌డాక్‌ ఎక్సే్ఛంజ్‌లో ఇన్ఫీ షేరు(ఏడీఆర్‌) శుక్రవారం కడపటి సమాచారం మేరకు 6 శాతానికిపైగా లాభాలతో ట్రేడవుతోంది.


ఇక లాభాల్లో 85% ఇన్వెస్టర్లకే..
ఇన్వెస్టర్లకు మరింత విలువ జోడించేందుకు తమ నిధుల కేటాయింపు ప్రణాళికను మారుస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా  వచ్చే ఐదేళ్లకుగాను కంపెనీ వార్షిక నికర లాభాల్లో (ఫ్రీ క్యాష్‌ఫ్లో) 85 శాతం వరకూ తిరిగి ఇన్వెస్టర్లకు పంచేయాలని నిర్ణయించినట్లు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) నీలాంజన్‌ రాయ్‌ తెలిపారు. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్నట్లే డివిడెండ్లు లేదా ప్రత్యేక డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల రూపంలో ఇది ఉంటుందన్నారు.

కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ చాలా పటిష్టంగా ఉందని, ఇప్పటికీ తమవద్ద 3.5 బిలియన్‌ డాలర్ల నగదు నిల్వలున్నాయని రాయ్‌ వివరించారు. ఇప్పటివరకూ ఏటా 70 శాతం వరకూ ఫ్రీ క్యాష్‌ను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చే విధానాన్ని ఇన్ఫీ అనుసరిస్తోంది. కాగా, రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్‌ కొనసాగుతోందని ఇప్పటివరకూ రూ.5,934 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ బైబ్యాక్‌ కొనసాగింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, తాజా బడ్జెట్‌లో 20 శాతం బైబ్యాక్‌ పన్ను విధించిన నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీల షేర్ల బైబ్యాక్‌లకు అడ్డుకట్ట పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు మరింతగా నగదు నిల్వలను పంచే ప్రణాళికను ఇన్ఫీ ప్రకటించడం గమనార్హం.

‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని చాలా పటిష్టమైన ఫలితాలతో మేం బోణీ చేశాం. డాలర్ల రూపంలో ఆదాయం 12.4 శాతం ఎగబాకడం, ముఖ్యంగా డిజిటల్‌ విభాగం నుంచి 41.9 శాతం ఆదాయ వృద్ధి నమోదు కావడం శుభపరిణామం. క్లయింట్లతో మెరుగైన సంబంధాలు, వారిపై మరింత దృష్టిపెట్టడం, తదనుగుణంగా మేం చేస్తున్న పెట్టుబడులే మెరుగైన ఫలితాలకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌ను కూడా పెంచాం’.
– సలీల్‌ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ, ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement