Consolidated profit
-
టాటా టెక్నాలజీస్ ఫర్వాలేదు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ టాటా టెక్నాలజీస్ డిసెంబర్‌తో అంతమైన త్రైమాసికంలో రూ.170 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.148 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం ఇదే కాలంలో 15 శాతం వృద్ధితో రూ.1,289 కోట్లకు చేరింది. ‘‘డిసెంబర్ క్వార్టర్లో ఐదు పెద్ద ఆర్డర్లను సొంతం చేసుకున్నాం. ఇందులో ఒక డీల్ మొత్తం విలువ 50 మిలియన్ డాలర్లకు (రూ.415 కోట్లు) పైనే ఉంది. మరొక డీల్ విలువ 25 మిలియన్ డాలర్లు. ఆటోమోటివ్ విభాగంలో కస్టమర్ల వ్యయాల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఎందుకంటే ఓఈఎంలు ఎలక్ట్రిఫికేషన్ వైపు, ఇతర ప్రత్యామ్నాయ ప్రొపల్షన్ సిస్టమ్లవైపు దృష్టి సారిస్తున్నాయి. ఏరోస్పేస్ పరిశ్రమ కూడా ఉత్సాహంగా కనిపిస్తోంది. మా సామర్థ్యాలను భారీగా నిర్మించుకోవడంపై పెట్టుబడులు పెడుతున్నాం. కనుక దీర్ఘకాలానికి మా వ్యాపార మూలాల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాం’’ అని టాటా టెక్నాలజీస్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ ప్రకటించారు. డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 172 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12,623కు పెరిగింది. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్‌చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్‌పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టొరెంట్ పవర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టొరెంట్ పవర్ 2022–23 చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 484 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 487 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం సైతం భారీగా ఎగసి రూ. 6,134 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,165 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో కేవలం రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,493 కోట్ల నుంచి రూ. 26,076 కోట్లకు ఎగసింది. ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. టొరెంట్ పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 556 వద్ద ముగిసింది. -
ఆదిత్య బిర్లా లాభం 94 శాతం డౌన్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కన్సాలిడేటెడ్ లాభం డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు, 94 శాతం తగ్గిపోయి రూ.11 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.197 కోట్లుగా ఉంది. ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.3,589 కోట్లకు చేరింది. ప్రధానంగా మార్కెటింగ్ వ్యయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు రెండు రెట్లు పెరగడం నికర లాభం తగ్గిపోయేందుకు కారణమైనట్టు సంస్థ తెలిపింది. వ్యయాలు 31 శాతం పెరిగి రూ.3,603 కోట్లుగా ఉన్నాయి. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ విభాగం ఆదాయం 24 శాతం పెరిగి రూ.2,466 కోట్లుగా ఉంటే, ప్యాంటలూన్స్ ఆదాయం 9 శాతం పెరిగి రూ.1,159 కోట్లుగా ఉంది. తన బ్రండెడ్ అవుట్లెట్లను 245 వరకు పెంచుకుంది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాభం ఐదింతలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం ఐదింతలు పెరిగి రూ.29 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 50 శాతం పెరిగి రూ.3,075 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5 కోట్లు, ఆదాయం రూ.2,054 కోట్ల చొప్పున ఉన్నాయి. ‘‘కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఈ కామర్స్ విక్రయాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి సాయపడింది. మార్కెటింగ్‌పైనా పెట్టుబడులు పెరిగాయి. బ్రాండ్ల బలోపేతం, వినియోగదారులను చేరుకోవడంపై దృష్టి సారించాం. పెద్ద ఎత్తున స్టోర్ల నెట్వర్క్ విస్తరణ చేపట్టాం. పాంటలూన్ బ్రాండ్ కింద 21 స్టోర్లు, బ్రాండెడ్ వ్యాపారంలో 85 స్టోర్లు ప్రారంభించాం’’అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. విభాగాల వారీగా.. ► మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,109 కోట్లుగా నమోదైంది. ► ప్యాంటలూన్స్ ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,094 కోట్లకు చేరింది. ► ఈ కామర్స్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఎబిట్డా మార్జిన్లు కరోనా ముందున్న స్థాయిని అధిగమించాయి. ► కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.243 కోట్లకు తగ్గింది. -
మెప్పించని విప్రో
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో లాభాలకు గండి పడింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 21 శాతం పతనమై జూన్ త్రైమాసికంలో రూ.2,564 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.18,252 కోట్ల నుంచి రూ.21,529 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.3,243 కోట్లుగా ఉంది. డాలర్లలో చూస్తే ఆదాయం 17 శాతానికి పైగా పెరిగి 2,735 డాలర్లుగా ఉంది. క్వార్టర్ వారీగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 2 శాతం తగ్గి 15 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 2,817–2872 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా (జూన్ త్రైమాసికంతో పోలిస్తే) 3–5 శాతం మధ్య వృద్ధి నమోదు కావచ్చని కంపెనీ పేర్కొంది. ‘‘విప్రో వృద్ధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాం. వీటి ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆర్డర్ల పుస్తకం వార్షికంగా చూస్తే కాంట్రాక్టు విలువ పరంగా 32 శాతం పెరిగింది. పెద్ద డీల్స్ సొంతం చేసుకున్నాం. నేడు ఆర్డర్ల పైపులైన్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. మా వ్యాపార వృద్ధికి వీలున్న చోట పెట్టుబడులు కొనసాగిస్తాం. మా క్లయింట్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడంపై దృష్ట సారిస్తాం’’అని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్టే తెలిపారు. ఆపరేటింగ్ మార్జిన్లు 15 శాతంగా ఉన్నాయంటే కనిష్ట స్థాయికి చేరుకున్నట్టేనని కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగి 2.58 లక్షలకు చేరింది. -
నిరాశపరిచిన ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: నిర్మాణం, ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) కన్సాలిడేటెడ్ (అనుబంధ కంపెనీలు కలిసిన) నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో ఏకంగా 67 శాతం పడిపోయి రూ.1,819 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.5,520 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.31,594 కోట్ల నుంచి రూ.35,305 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘క్రితం ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఎలక్ట్రిక్ వ్యాపారాన్ని ష్నీడర్‌కు విక్రయించడంతో పెద్ద ఎత్తున లాభం సమకూరింది. అలాగే, విదేశీ ఆస్తులకు సంబంధించి ఇంపెయిర్మెంట్ (పెట్టుబడుల విలువ క్షీణత) కూడా చేయాల్సి వచ్చింది’’ అని ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్ శంకర్రామన్ తెలిపారు. అటువంటివి సమీక్షా త్రైమాసికంలో లేవని చెప్పారు. నిర్వహణ లాభం 56 శాతం వృద్ధి చెందినట్టు చెప్పారు. నికర లాభంలో ఉత్తరాఖండ్‌లోని హైడల్ ప్లాంట్‌లో వాటాల విక్రయం రూపంలో వచ్చిన రూ.144 కోట్లు కూడా ఉన్నట్టు ఎల్అండ్టీ తెలిపింది. ఇక ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,994 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.42,140 కోట్ల కొత్త ఆర్డర్లను కంపెనీ సంపాదించుకుంది. కంపెనీ చేతిలో మొత్తం రూ.3,30,541 కోట్ల ఆర్డర్లున్నాయి. -
భారీగా పెరిగిన మోల్డ్‌టెక్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సంస్థ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పదింతలకుపైగా ఎగసి రూ.18.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రెండింతలకుపైగా అధికమై రూ.134 కోట్లు సాధించింది. ఎబిటా 176 శాతం పెరిగింది. ఉత్తరాది మార్కెట్ కోసం ఉత్తర ప్రదేశ్‌లో ప్లాంటు స్థాపించేందుకు కావాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసినట్టు సంస్థ సీఎండీ లక్ష్మణ రావు వెల్లడించారు. అద్దె ప్రాతిపదికన కాన్పూర్‌లో తీసుకున్న ప్రాంగణంలో అక్టోబర్‌లో కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
యూనియన్ బ్యాంకు లాభంలో మూడు రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (యూనియన్ బ్యాంకు) జూన్ త్రైమాసికానికి రూ.1,120 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.341 కోట్లతో పోలిస్తే మూడు రెట్లకు పైగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,269 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మొత్తం ఆదాయం రూ.20,666 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.20,487 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. వసూలు కాని నిరర్థక రుణాలు (ఎన్పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు రూ.3,593 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 14.95% (రూ.97,190 కోట్లు) నుంచి 13.60%కి (రూ.87,762 కోట్లు) మెరుగుపడగా.. నికర ఎన్పీఏలు 4.97 శాతం నుంచి 4.69%కి (రూ.27,437 కోట్లు) తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యూనియన్ బ్యాంకు షేరు 7% లాభంతో రూ.37.95 వద్ద క్లోజయింది. -
సాగర్ సిమెంట్స్ లాభం జూమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సాగర్ సిమెంట్స్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాలు మెరుగ్గా నమోదు చేసింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 42.35 శాతం ఎగసి రూ.51.43 కోట్లు సాధించింది. టర్నోవర్ 50 శాతం అధికమై రూ.397 కోట్లకు చేరుకుంది. ఎబిటా 23 శాతం పెరిగి రూ.107 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 31.87 శాతం పెరిగి రూ.21.31గా ఉంది. మధ్యప్రదేశ్‌లో సద్గురు సిమెంట్స్ రూ.578 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ నిర్మాణం సెప్టెంబర్ నాటికి పూర్తి కానుంది. ఒడిశాలో జైపూర్ సిమెంట్స్ రూ.312 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంట్ రెండు నెలల్లో సిద్ధం అవుతోంది అని సంస్థ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. సాగర్ సిమెంట్స్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 1.72 శాతం తగ్గి రూ.1,339.75 వద్ద స్థిరపడింది. -
Tcs : రూ.9వేల కోట్లు దాటిన ఆదాయం!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28.5 శాతం ఎగసి రూ. 9,008 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,008 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18.5 శాతం పుంజుకుని రూ. 45,411 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 38,322 కోట్ల టర్నోవర్ నమోదైంది. భాగస్వామ్యాలు.. క్యూ1లో యూఎస్‌కు చెందిన బయోఫార్మా కంపెనీ డిజైన్, ఆచరణ సేవలకుగాను టీసీఎస్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. జర్మనీలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకులలో ఒకటైన నార్డ్ ఎల్బీ ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు వ్యూహాత్మక భాగస్వామిగా టీసీఎస్‌ను నియమించుకుంది. కమిన్స్ ఇంక్ గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్ కోసం టీసీఎస్ సేవలకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ కంపెనీలలో ఒకటైన కార్నివాల్ కార్పొరేషన్ అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసులకు టీసీఎస్‌తో జట్టు కట్టింది. అంతేకాకుండా గ్లోబల్ హెచ్ఆర్ వ్యవస్థకు సంబంధించిన సిస్టమ్ ఇంటిగ్రేటర్ భాగస్వామిగానూ ఎంపిక చేసుకుంది. క్యూ1 మైలురాళ్లు.. ♦ నికరంగా 20,409 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,09,058కి చేరింది. వెరసి 5 లక్షల మంది ఉద్యోగుల మైలురాయిని తొలిసారి అధిగమించింది. ♦ ఒక త్రైమాసికంలో 6 బిలియన్ డాలర్ల(రూ. 44,700 కోట్లు) ఆదాయాన్ని తొలిసారి సాధించింది. ♦ 8.1 బిలియన్ డాలర్ల విలువైన(టీసీవీ) కాంట్రాక్టులను సంపాదించింది. నిర్వహణ మార్జిన్లు 2 శాతం బలపడి 25.5 శాతాన్ని తాకాయి. నికర మార్జిన్లు 19.8 శాతంగా నమోదయ్యాయి. ♦ షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. జూలై 16 రికార్డ్ డేట్. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 8.6 శాతంగా నమోదైంది. ♦ ఉద్యోగుల్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్– సెప్టెంబర్‌కల్లా సిబ్బంది కుటుంబాలకూ వ్యాక్సిన్లు ♦ వార్షిక ప్రాతిపదికన వివిధ విభాగాలలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 25.4 శాతం, రిటైల్, సీపీజీ 21.7 శాతం, బీఎఫ్ఎస్ఐ 19.3 శాతం, తయారీ 18.3 శాతం, టెక్నాలజీ 12.3 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 6.9 శాతం చొప్పున ఎగశాయి. ♦ ప్రాంతాలవారీగా.. ఉత్తర అమెరికా 15.8 శాతం, యూకే 16.3 శాతం, యూరోప్ 19.7 శాతం, లాటిన్ అమెరికా 16 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 25.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇక దేశీయ బిజినెస్ 25.3 శాతం, ఆసియా పసిఫిక్ 9.3 శాతం చొప్పున వృద్ధి చూపాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ♦ దేశీ ఆదాయం 14.1% క్షీణత చవిచూసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలను ప్రకటించింది. షేరు 0.7% క్షీణించి రూ. 3,253 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ లాభం 157 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నికర లాభం 157 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,253 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ. 877 కోట్లు. రిఫైనరీల సామర్థ్యాన్ని గణనీయంగా వినియోగించుకోవడం, పరిశ్రమతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరు కనపర్చడం వల్ల కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా తెలిపారు. క్యూ1లో అమ్మకాలు రూ. 45,945 కోట్లకు క్షీణించినప్పటికీ నికర లాభాలు పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 74,596 కోట్లు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయని, అయితే క్రమంగా ఆంక్షల సడలింపుతో మళ్లీ పుంజుకుంటున్నాయని సురానా చెప్పారు. -
ధనాధన్ రిలయన్స్
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అదరగొట్టే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020–21, క్యూ1)లో రూ. 13,248 కోట్ల రికార్డు స్థాయి కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభా న్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.10,141 కోట్లతో పోలిస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా జియో లాభాల మోత మోగించడం ఆర్ఐఎల్ మెరుగైన ఫలితాలకు దోహదం చేసింది. ఇంధన రిటైలింగ్ వెంచర్లో 49 శాతం వాటాను బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు విక్రయించడం ద్వారా క్యూ1లో రూ.4,966 కోట్ల అసాధారణ వన్‌టైమ్ రాబడి లభించిందని రిలయన్స్ వెల్లడించింది. ఇది కూడా రికార్డు లాభాలకు కారణమైంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా మందగించిన తరుణంలో క్యూ1లో కంపెనీ ఫలితాలపై ప్రభావం ఉండొచ్చన్న విశ్లేషకుల అంచనాలను మించి కంపెనీ మెరుగైన పనితీరును కనబరచడం గమనార్హం. కాగా, 2019–20 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రూ.11,640 కోట్ల నికర లాభం ఇప్పటిదాకా కంపెనీ అత్యధిక త్రైమాసిక లాభంగా రికార్డుల్లో నిలిచింది. దీన్ని ఇప్పుడు అధిగమించింది. కాగా, భారతీయ కంపెనీల్లో అత్యధిక త్రైమాసికం లాభం ఆర్జించిన రికార్డు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)దే. 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో ఈ సంస్థ రూ.14,513 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. చమురు, పెట్రోకెమికల్ వ్యాపారాలపై ప్రభావం... క్యూ1లో కంపెనీ స్థూల లాభం(ఎబిటా) 11.8 శాతం క్షీణించి రూ.21,585 కోట్లకు తగ్గింది. పెట్రోలియం ఇంధనం, పాలిస్టర్ ఉత్పత్తుల డిమాండ్ తీవ్రంగా పడిపోవడంతో చమురు, పెట్రోకెమికల్ వ్యాపారాలు దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఎగుమతులు క్షీణించడం కూడా లాభదాయకతపై ప్రభావం చూపిందని తెలిపింది. ‘కరోనా వైరస్ కల్లోలంతో స్టోర్స్ మూసివేత, దేశవ్యాప్తంగా కార్యకలాపాలపై నియంత్రణల వల్ల రిటైల్ వ్యాపార ఎబిటా దిగజారింది. అయితే, డిజిటల్ సర్వీసుల వ్యాపారంలో మార్జిన్లు మెరుగుపడటం వల్ల ప్రతికూలతలను తట్టుకోగలిగాం’ అని కంపెనీ వెల్లడించింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► పెట్రోకెమికల్స్ వ్యాపార ఆదాయం క్యూ1లో 33 శాతం పడిపోయి రూ.25,192 కోట్లకు దిగజారింది. ► చమురు రిఫైనింగ్ ఆదాయం 54.1 శాతం తగ్గుదలతో రూ.46,642 కోట్లకు క్షీణించింది. ► క్యూ1లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్–జీఆర్ఎం) 6.3 డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 8.1 డాలర్లు కాగా, క్రితం క్వార్టర్(2019–20, క్యూ4)లో 8.9 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. ► చమురు–గ్యాస్ వ్యాపారం 45.2 శాతం క్షీణతతో రూ.506 కోట్లకు పరిమితమైంది. ► లాక్‌డౌన్‌తో 50 శాతం స్టోర్స్ పూర్తిగా మూసేయడం, 29% స్టోర్స్ పరిమిత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ రిలయన్స్ రిటైల్ వ్యాపారం మెరుగైన స్థాయిలో రూ. 31,633 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. రూ.1,083 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. ఆర్ఐఎల్ షేరు గురువారం బీఎస్ఈలో 0.61 శాతం లాభంతో రూ.2,109 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసిన తరవత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. నిధుల సునామీ... జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 33 శాతం వాటాను ఫేస్బుక్, గూగుల్ ఇతరత్రా పలు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయించడం ద్వారా రిలయన్స్ రూ.1,52,056 కోట్ల నిధులను సమీకరించింది. అదేవిధంగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు లభించాయి. ఇంధన రిటైలింగ్ వ్యాపారంలో 49 శాతం వాటాను బీపీకి అమ్మడం ద్వారా రూ.7,629 కోట్లను దక్కించుకుంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించింది. దుమ్మురేపిన జియో... ఆర్ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ జియో లాభాల మోత మోగించింది. క్యూ1లో కంపెనీ నికర లాభం రూ.2,520 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.891 కోట్లతో పోలిస్తే 183 శాతం వృద్ధి నమోదైంది. ఇక జియో ఆదాయం కూడా 33.7 శాతం ఎగబాకి రూ.16,557 కోట్లకు చేరింది. నెలకు ఒక్కో యూజర్ నుంచి ఆదాయం(యావరేజ్ రెవెన్యూపర్ యూజర్–ఏఆర్పీయూ) క్యూ1లో రూ.140.3గా నమోదైంది. క్రితం క్వార్టర్(2019–20, క్యూ4)లో ఏఆర్పీయూ రూ.130.6గా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి జియో మొత్తం యూజర్ల సంఖ్య 38.75 కోట్లు కాగా, జూన్ చివరినాటికి ఈ సంఖ్య 39.83 కోట్లకు వృద్ధి చెందింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్స్ ప్రకటించడంతో హైడ్రోకార్బన్స్ వ్యాపారం డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అయితే, కార్యకలాపాల్లో వెసులుబాటు కారణంగా దాదాపు సాధారణ స్థాయిలోనే నిర్వహణ సాధ్యమైంది. దీంతో పరిశ్రమలోకెల్లా ధీటైన ఫలితాలను ప్రకటించగలిగాం. కరోనా లాక్డౌన్ కాలంలోనూ కంపెనీ క్యూ1లో రికార్డు స్థాయిలో నిధులను దక్కించుకుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద నిధుల సమీకరణను ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మేం పూర్తిచేశాం’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత -
ఆకర్షణీయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఫలితాలు
ముంబై: ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేసినప్పటికీ.. బ్యాంకు కన్సాలిడేటెడ్ లాభం 24 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా కరోనా కారణంగా చెల్లింపులు రాకపోవచ్చన్న అంచనాలతోనే రూ.5,550 కోట్లను పక్కన పెట్టింది (ప్రొవిజనింగ్). స్టాండలోన్‌గా చూసుకుంటే (అనుబంధ కంపెనీలను మినహాయించి) బ్యాంకు లాభం 36 శాతం వృద్ధితో రూ.2,599 కోట్లుగా నమోదైంది. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో స్వల్ప వాటాలను విక్రయించడం లాభాల వృద్ధికి దోహదపడింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతానికి పైగా పెరిగి రూ.37,939 కోట్లుగా నమోదైంది. మారటోరియం వినియోగించుకున్న రుణ గ్రహీతల శాతం ఏప్రిల్ చివరికి 30 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 17.5 శాతానికి తగ్గింది. -
ఐటీసీ లాభం రూ. 2,567 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.2,567 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,436 కోట్లతో పోల్చుకుంటే 25 శాతం తగ్గిపోయింది. ఎక్కువ మంది అనలిస్టుల అంచనాలకు అనుగుణంగానే కంపెనీ ఫలితాలు ఉండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం 17% తగ్గి రూ.12,658 కోట్లుగా నమోదైంది. సిగరెట్ల అమ్మకాల రూపంలో వచ్చిన ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే రూ.6,142 కోట్ల నుంచి రూ.4,330 కోట్లకు పరిమితమైంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల పనితీరు మెరుగుపడింది. వీటి ఆదాయం మాత్రం రూ.3,068 కోట్ల నుంచి 3,379 కోట్లకు వృద్ధి చెందింది. హోటళ్ల ఆదాయం రూ.411 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గిపోగా.. అగ్రి వ్యాపారం ఆదాయం రూ.3,622 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు పెరిగింది. పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ ఆదాయం రూ.1,527 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు క్షీణించింది. -
ఎల్అండ్టీ లాభం రూ.537 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని దిగ్గజ కంపెనీ ఎల్అండ్టీ గ్రూపు కార్యకలాపాలు జూన్ త్రైమాసికంలో గణనీయమైన ప్రభావానికి గురయ్యాయి. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 68 శాతం పడిపోయి రూ.537 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 27 శాతం తగ్గిపోయి రూ.22,037 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,698 కోట్లు, ఆదాయం రూ.30,271 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా రూ.27,616 కోట్ల నుంచి రూ.21,368 కోట్లకు పరిమితమయ్యాయి. ‘‘కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ కారణంగా గ్రూపు కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడింది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి కార్మికులు, ఉద్యోగులతో కార్యకలాపాలను క్రమంగా, తగిన జాగ్రత్తల మధ్య ఆరంభించాము’’అని ఎల్అండ్టీ తెలిపింది. గ్రూపులో అధిక వ్యాపారాలపై కరోనా ప్రభావం ఉందని.. కస్టమర్లు, ఉద్యోగులు, సబ్ కాంట్రాక్టర్ల పరిధిలో పనిచేసే కార్మికులు, భాగస్వాములు, వెండర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.23,574 కోట్ల విలువ చేసే నూతన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో రూ.8,872 కోట్ల మేర అంతర్జాతీయ ఆర్డర్లే. గ్రూపు కన్సాలిడేటెడ్ ఆర్డర్ల విలువ జూన్ ఆఖరుకు రూ.3,05,083 కోట్లుగా ఉంది. -
అరబిందో లాభం 45% జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికంలో అరబిందో ఫార్మా ఉత్తమ పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 45.2% వృద్ధితో రూ.850 కోట్లకు చేరింది. టర్నోవర్ 16.4% వృద్ధితో రూ.5,292 కోట్ల నుంచి రూ.6,158 కోట్లకు ఎగసింది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 20.5% పెరిగి రూ.2,990 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 26% హెచ్చి రూ.1,652 కోట్లు, వృద్ధి మార్కెట్లు 30% పెరిగి రూ.376 కోట్లు సాధించాయి. ఏపీఐల అమ్మకాలు రూ.917 కోట్ల నుంచి రూ.755 కోట్లకు దిగొ చ్చాయి. పరిశోధన, అభివృద్ధికి రూ.239 కోట్లు వ్యయం చేశారు. ఏఎన్‌డీఏల విషయంలో యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈ త్రైమాసికంలో ఆరు తుది, రెండు తాత్కాలిక అనుమతులను కంపెనీ దక్కించుకుంది. టర్నోవర్ రూ.23 వేల కోట్లు.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అరబిందో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19.7% పెరిగి రూ.2,831 కోట్లు సాధించింది. టర్నోవర్ 18 శాతం అధికమై రూ.23,098 కోట్లకు ఎగసింది. ఈపీఎస్ రూ.48.32 నమోదైంది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 27% హెచ్చి రూ.11,483 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 19.4% పెరిగి రూ.5,922 కోట్లు, వృద్ధి మార్కెట్లు 13.5% అధికమై రూ.1,355 కోట్లు నమోదయ్యాయి. పరిశోధన, అభివృద్ధికి ఆదాయంలో 4.1% (రూ.958 కోట్లు) వెచ్చించారు. విభిన్న ఉత్పత్తుల కారణంగా యూఎస్ఏ, యూరప్ మార్కెట్లలో వృద్ధిని కొనసాగించామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపారాలను పటిష్టం చేయడం, వినూత్న, ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధి, నిబంధనలకు లోబడి పనిచేయడంపై దృష్టిసారించామని చెప్పారు. -
ధనాధన్ రిలయన్స్!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2019–20, క్యూ1)లో కంపెనీ కాన్సాలిడేటెడ్ నికర లాభం(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.10,104 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.9,459 కోట్లతో పోలిస్తే 6.8 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా కన్సూమర్ వ్యాపారాలైన రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది. ఈ రెండు విభాగాల స్థూల లాభం గతేడాది క్యూ1లో కంపెనీ మొత్తం స్థూల లాభంలో నాలుగో వంతు కాగా, ఈ ఏడాది క్యూ1లో ఇది మూడో వంతుకు(32 శాతం) చేరుకోవడం విశేషం. ఇదో కొత్త రికార్డు. ఈ ఇక మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1,72,956 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.1,41,699 కోట్లతో పోలిస్తే 22 శాతం దూసుకెళ్లింది. మార్కెట్ విశ్లేషకులు రూ.9,852 కోట్ల నికర లాభాన్ని, రూ.1.43 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా చూస్తే... గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో ఆర్ఐఎల్ నికర లాభం రూ. 10,362 కోట్లుగా నమోదైంది. అంటే సీక్వెన్షియల్‌గా చూస్తే క్యూ1లో లాభం 2.5% తగ్గింది. అయితే, ఆదాయం మాత్రం రూ.1,54,110 కోట్లతో(క్యూ4) పోలిస్తే 12.2 శాతం పెరిగింది. జీఆర్ఎం తగ్గుముఖం... రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8.1 డాలర్లకు తగ్గాయి. 18 త్రైమాసికాల్లో ఇదే అత్యంత తక్కువ జీఆర్ఎం కావడం గమనార్హం. గతేడాది ఇదే కాలంలో జీఆర్ఎం 10.5 డాలర్లు కాగా, క్రితం త్రైమాసికం (క్యూ4)లో ఇది 8.2 డాలర్లు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. కొనసాగుతున్న జియో జోరు... దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగుతోంది. ఈ విభాగం నికర లాభం క్యూ1లో ఏకంగా 45.6 శాతం వృద్ధి చెంది రూ.891 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో లాభం రూ.612 కోట్లుగా నమోదైంది. ఆదాయం 44 శాతం వృద్ధితో రూ.11,679 కోట్లను తాకింది. యూజర్ల సంఖ్య పరంగా దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న జియో.. మొత్తం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 33.13 కోట్లకు చేరింది. కొత్తగా 2.46 కోట్ల మంది యూజర్లు ఏప్రిల్–జూన్ కాలంలో జతయ్యారు. మార్చి చివరినాటికి యూజర్ల సంఖ్య 30.67 కోట్లు. ఇక క్రితం క్వార్టర్(జనవరి–మార్చి)లో ఒక్కో యూజర్ నుంచి లభించిన ఆదాయం(ఏఆర్పీయూ) రూ.126.2 ఉండగా.. తాజా క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో ఇది రూ.122కు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఏఆర్పీయూ రూ.134.3గా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► రిలయన్స్ పెట్రోకెమికల్స్ విభాగం ఆదాయం క్యూ1లో రూ. 37,611 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.40,287 కోట్లతో పోలిస్తే 6.6 శాతం తగ్గింది. ► రిఫైనింగ్ విభాగం ఆదాయం జూన్ క్వార్టర్లో 6.3% వృద్ధితో రూ.1,01,721 కోట్లకు పెరిగింది. గతేడాది క్య1లో ఆదాయం రూ. 95,646 కోట్లు. ► కంపెనీ రిటైల్ విభాగం స్థూల లాభం ఈ ఏడాది క్యూ1లో రూ.2,049 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ.1,206 కోట్లతో పోలిస్తే 70 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 47.5 శాతం వృద్ధితో రూ. 25,890 కోట్ల నుంచి రూ. 38,196 కోట్లకు ఎగసింది. దేశవ్యాప్తంగా 6,700 పట్టణాలు, నగరాల్లో రిలయన్స్ రిటైల్ 10,644 స్టోర్లను నిర్వహిస్తోంది. క్యూ1లో 229 కొత్త స్టోర్లు జతయ్యాయి. 10 కోట్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్ల మైలురాయిని అధిగమించింది. జూన్ క్వార్టర్లో 15 కోట్ల మంది తమ స్టోర్లను సందర్శించినట్లు కంపెనీ పేర్కొంది. ► జూన్ చివరికి ఆర్ఐఎల్ మొత్తం రుణ భారం రూ.2,88,243 కోట్లకు పెరిగింది. మార్చి నాటికి రుణాలు రూ.2,87,505 కోట్లు. కాగా, కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ.1,33,027 కోట్ల నుంచి రూ.1,31,710 కోట్లకు తగ్గాయి. రిలయన్స్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1 శాతం నష్టంతో 1,249 వద్ద ముగసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పటిష్టమైన లాభాలను సాధించాం. జియో సేవల్లో అంచనాలను మించి వృద్ధి కొనసాగుతోంది. రిటైల్ వ్యాపారంలో ఆదాయం భారీగా ఎగబాకింది. దేశవాసులకు చౌక ధరల్లో అత్యంత అధునాతన డిజిటల్ సేవలను అందించేందుకు జియో యాజమాన్యం ప్రధానంగా దృష్టిసారిస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా నెట్వర్క్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఫైబర్ నెట్వర్క్ ద్వారా కంపెనీలకు కొత్త తరం కనెక్టివిటీ సేవలను ఆరంభించాం. జియో గిగా ఫైబర్ ప్రయోగాత్మక సేవలు విజయవంతమయ్యాయి. 5 కోట్ల గృహాలు లక్ష్యంగా త్వరలోనే ఈ సేవలను మొదలుపెట్టనున్నాం. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ టవర్స్ వ్యాపారంలో వాటా విక్రయం... బ్రూక్‌ఫీల్డ్ రూ.25,215 కోట్ల పెట్టుబడి రిలయన్స్ తన టవర్ల వ్యాపారంలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. కెనడా ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్కు చెందిన బీఐఎఫ్ ఫోర్ జార్విస్ ఇండియాతో ఈ మేరకు తమ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. డీల్‌లో భాగంగా బ్రూక్‌ఫీల్డ్ (సహ–ఇన్వెస్టర్లతో కలిసి) ఆర్ఐఐహెచ్ఎల్ స్పాన్సర్‌గా ఉన్న టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లో రూ.25,215 కోట్ల పెట్టుబడి పెట్టనుందని వెల్లడించింది. జియోకు చెందిన టవర్ల నిర్వహణ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రైవేట్ లిమిటెడ్(ఆర్జేఐపీఎల్) తాజాగా ట్రస్ట్‌కు 51% వాటాను బదలాయించింది. ఇప్పుడు బ్రూక్‌ఫీల్డ్ పెట్టుబడులను కొంత రుణభారాన్ని తీర్చడంతో పాటు ఆర్ఐఎల్ వద్ద నున్న మిగతా 49% వాటాను కొనుగోలు చేసేందుకు వాడుకోనున్నట్లు తెలిపింది. -
మెప్పించిన ఇన్ఫీ!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019–20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,612 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 13.9 శాతం ఎగబాకి రూ.19,128 కోట్ల నుంచి రూ.21,803 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు కంపెనీ క్యూ1లో రూ. 3,702 కోట్ల నికర లాభాన్ని, రూ.21,776 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. దీనికి మించి ఫలితాలు వెలువడ్డాయి. సీక్వెన్షియల్‌గా ఇలా... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) నికర లాభం రూ.4,078 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభంలో 6.8% తగ్గుదల నమోదైంది. ఆదాయం మాత్రం 1.2 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో రూ.21,539 కోట్లుగా ఉంది. గైడెన్స్ అప్... ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) ఇన్ఫీ పెంచింది. గడిచిన క్వార్టర్ ఫలితాల సందర్భంగా ఈ ఏడాది ఆదాయ వృద్ధి 7.5–9.5% ఉండొచ్చని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.5–10 శాతానికి పెంచింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్ 21–23 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► డాలర్ల రూపంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన క్యూ1లో 534 మిలియన్ డాలర్ల నుంచి 546 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 2.83 బిలియన్ డాలర్ల నుంచి 3.13 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 12.4 శాతం వృద్ధి సాధించింది. ► క్యూ1లో 2.7 బిలియన్ డాలర్ల విలువైన భారీస్థాయి కాంట్రాక్టులను ఇన్ఫీ దక్కించుకుంది. 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో రెండు కాంట్రాక్టులు, 10 మిలియన్ డాలర్లకు మించిన విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి. ► కంపెనీకి డిజిటల్ విభాగం నుంచి 1,119 మిలియన్ డాలర్ల ఆదాయం క్యూ1లో సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 41.9 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 35.7 శాతానికి చేరింది. ► ఇంధనం–యుటిలిటీస్ విభాగం ఆదాయం 4.7 శాతం(సీక్వెన్షియల్), కమ్యూనికేషన్ 4.6 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఇక ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 3 శాతం వృద్ధి చెందింది. మిగత దేశాల నుంచి ఆదాయంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది. ► కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 2,29,029కి చేరింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి (2018–19, క్యూ4) ఈ సంఖ్య 2,28,123 మాత్రమే. దీనిప్రకారం చూస్తే నికరంగా 906 మంది ఉద్యోగులు మాత్రమే జతయ్యారు. ఇక ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ1లో 23.4 శాతానికి పెరిగింది. క్యూ4లో ఇది 20.4 శాతం మాత్రమే. ► డేటా ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ సేవల అనుబంధ సంస్థ ట్రైఫాక్టాలో అదనంగా 6 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మొత్తం పెట్టుబడి 10 మిలియన్ డాలర్లకు చేరుతుందని ఇన్ఫీ పేర్కొంది. ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1% లాభపడి రూ.727 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మగిశాక ఫలితాలను ప్రకటించింది. కాగా, అమెరికా నాస్డాక్ ఎక్సే్ఛంజ్‌లో ఇన్ఫీ షేరు(ఏడీఆర్) శుక్రవారం కడపటి సమాచారం మేరకు 6 శాతానికిపైగా లాభాలతో ట్రేడవుతోంది. ఇక లాభాల్లో 85% ఇన్వెస్టర్లకే.. ఇన్వెస్టర్లకు మరింత విలువ జోడించేందుకు తమ నిధుల కేటాయింపు ప్రణాళికను మారుస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లకుగాను కంపెనీ వార్షిక నికర లాభాల్లో (ఫ్రీ క్యాష్‌ఫ్లో) 85 శాతం వరకూ తిరిగి ఇన్వెస్టర్లకు పంచేయాలని నిర్ణయించినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నీలాంజన్ రాయ్ తెలిపారు. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్నట్లే డివిడెండ్లు లేదా ప్రత్యేక డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల రూపంలో ఇది ఉంటుందన్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, ఇప్పటికీ తమవద్ద 3.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలున్నాయని రాయ్ వివరించారు. ఇప్పటివరకూ ఏటా 70 శాతం వరకూ ఫ్రీ క్యాష్‌ను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చే విధానాన్ని ఇన్ఫీ అనుసరిస్తోంది. కాగా, రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్ కొనసాగుతోందని ఇప్పటివరకూ రూ.5,934 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ బైబ్యాక్ కొనసాగింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, తాజా బడ్జెట్లో 20 శాతం బైబ్యాక్ పన్ను విధించిన నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీల షేర్ల బైబ్యాక్‌లకు అడ్డుకట్ట పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు మరింతగా నగదు నిల్వలను పంచే ప్రణాళికను ఇన్ఫీ ప్రకటించడం గమనార్హం. ‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని చాలా పటిష్టమైన ఫలితాలతో మేం బోణీ చేశాం. డాలర్ల రూపంలో ఆదాయం 12.4 శాతం ఎగబాకడం, ముఖ్యంగా డిజిటల్ విభాగం నుంచి 41.9 శాతం ఆదాయ వృద్ధి నమోదు కావడం శుభపరిణామం. క్లయింట్లతో మెరుగైన సంబంధాలు, వారిపై మరింత దృష్టిపెట్టడం, తదనుగుణంగా మేం చేస్తున్న పెట్టుబడులే మెరుగైన ఫలితాలకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌ను కూడా పెంచాం’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ, ఎండీ -
ఎయిర్టెల్ లాభం 1,461 కోట్లు
• మొబైలేతర ఆదాయం ఆసరా • రిలయన్స్ జియో ఉచిత సేవలతో వ్యాపార వృద్ధి నిదానం న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వ్యయాలు పెరిగిపోవడంతో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ లాభం జూలై - సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 5% క్షీణించి రూ.1,461 కోట్లకు పరిమితమయింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ లాభాలు రూ.1,536 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం గతేడాది ఇదే కాలంలో రూ.23,851 కోట్లు కాగా ఇపుడది రూ.24,671 కోట్లకు చేరింది. నైజీరియా కరెన్సీ విలువ క్షీణించడంతో ఆదాయంలో వృద్ధి 3.3 శాతానికే పరిమితమైనట్టు కంపెనీ వెల్లడించింది. నికర వడ్డీ వ్యయాలు సైతం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.1,053 కోట్ల నుంచి రూ.1,603 కోట్లకు పెరిగాయి. స్పెక్ట్రమ్ సంబంధిత వ్యయాలు పెరిగిపోవడమే దీనికి కారణమని సంస్థ వివరించింది. దేశీయ కార్యకలాపాల ద్వారా ఆదాయం మాత్రం 10 శాతం వృద్ధి చెంది రూ.19,219 కోట్లకు చేరింది. డిజిటల్ టీవీ వ్యాపారం 20.9 శాతం, ఇతర మొబైలేతర వ్యాపారంలో వృద్ధి ఇందుకు దోహదపడినట్టు ఎయిర్టెల్ తెలిపింది. జియో ఉచిత సేవలతో కంపెనీ మొబైల్ వ్యాపార వృద్ధి నిదానించినట్టు కంపెనీ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాఫ్రికా) గోపాల్ విట్టల్ తెలిపారు. కంపెనీ మొబైల్ డేటా ఆదాయం వరకే చూస్తే... 21 శాతం వృద్ధితో రూ.4,536 కోట్లకు చేరింది. దేశీయ మొబైల్ వ్యాపార ఆదాయంలో డేటా వాటా 24.7 శాతంగా ఉన్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
13.77 శాతం పెరిగిన బజాజ్ ఆటో లాభం
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కన్సాలిడేటెడ్ లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల (ఏప్రిల్-జూన్) కాలంలో 13.77% వృద్ధి చెంది రూ.1039 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.913 కోట్లుగానే ఉంది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.5,881 కోట్ల నుంచి 3.52% వృద్ధితో రూ.6,088 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో వాహనాల అమ్మకాలు 2% క్షీణించాయి. బజాజ్ ఆటో షేరు ధర బీఎస్ఈలో 1.19% పెరిగి 2,701.95 వద్ద ముగిసింది.