ఎయిర్టెల్ లాభం 1,461 కోట్లు
• మొబైలేతర ఆదాయం ఆసరా
• రిలయన్స్ జియో ఉచిత సేవలతో వ్యాపార వృద్ధి నిదానం
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వ్యయాలు పెరిగిపోవడంతో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ లాభం జూలై - సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 5% క్షీణించి రూ.1,461 కోట్లకు పరిమితమయింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ లాభాలు రూ.1,536 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం గతేడాది ఇదే కాలంలో రూ.23,851 కోట్లు కాగా ఇపుడది రూ.24,671 కోట్లకు చేరింది. నైజీరియా కరెన్సీ విలువ క్షీణించడంతో ఆదాయంలో వృద్ధి 3.3 శాతానికే పరిమితమైనట్టు కంపెనీ వెల్లడించింది.
నికర వడ్డీ వ్యయాలు సైతం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.1,053 కోట్ల నుంచి రూ.1,603 కోట్లకు పెరిగాయి. స్పెక్ట్రమ్ సంబంధిత వ్యయాలు పెరిగిపోవడమే దీనికి కారణమని సంస్థ వివరించింది. దేశీయ కార్యకలాపాల ద్వారా ఆదాయం మాత్రం 10 శాతం వృద్ధి చెంది రూ.19,219 కోట్లకు చేరింది. డిజిటల్ టీవీ వ్యాపారం 20.9 శాతం, ఇతర మొబైలేతర వ్యాపారంలో వృద్ధి ఇందుకు దోహదపడినట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. జియో ఉచిత సేవలతో కంపెనీ మొబైల్ వ్యాపార వృద్ధి నిదానించినట్టు కంపెనీ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాఫ్రికా) గోపాల్ విట్టల్ తెలిపారు. కంపెనీ మొబైల్ డేటా ఆదాయం వరకే చూస్తే... 21 శాతం వృద్ధితో రూ.4,536 కోట్లకు చేరింది. దేశీయ మొబైల్ వ్యాపార ఆదాయంలో డేటా వాటా 24.7 శాతంగా ఉన్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది.