Bharti Airtel
-
ఎయిర్టెల్ యాప్‌లో బజాజ్ ఫైనాన్స్.. కొత్త క్రెడిట్ కార్డు
ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఎన్బీఎఫ్సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా బజాజ్ ఫైనాన్స్ రుణ సంబంధ ఉత్పత్తులను తొలుత ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో అందజేస్తారు. ఆ తరువాత ఎయిర్టెల్ స్టోర్ల ద్వారా ఈ సేవలను విస్తరిస్తారు.ఆర్థిక సేవలు దేశవ్యాప్తంగా విస్తృతం అయ్యేందుకు తమకున్న బలం దోహదం చేస్తుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ‘10 లక్షల మందికిపైగా వినియోగదార్లు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కస్టమర్ల అన్ని ఆర్థిక అవసరాల కోసం ఎయిర్టెల్ ఫైనాన్స్‌ను వన్–స్టాప్ షాప్‌గా మార్చడమే లక్ష్యం’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. డేటా ఆధారిత రుణ పూచీకత్తు, అందరికీ ఆర్థిక సేవలు చేరేందుకు భారత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ గుండెకాయగా ఉందని బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్ చెప్పారు.కంపెనీ ప్రకటన ప్రకారం.. ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డును (Airtel-Bajaj Finserv EMI) ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ స్టోర్ల నెట్వర్క్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.“ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆఫర్ల శ్రేణికి యాక్సెస్‌ను అందిస్తుంది. 4,000 కంటే ఎక్కువ నగరాల్లోని 1.5 లక్షల పార్టనర్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా సామాగ్రితో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపికలు, చెల్లింపు ప్లాన్ల నుండి వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. అదనంగా కో-బ్రాండెడ్ కార్డ్ బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ-కామర్స్ లావాదేవీలకు వర్తిస్తుంది" అని పేర్కొంది. -
రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గణనీయంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధా (ఏఐ) ఆధారిత సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది. అలాగే ప్రతీ రోజుదాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్లు వివరించింది. తమ నెట్‌వర్క్‌కు సంబంధించి మొత్తం కాల్స్‌లో ఆరు శాతం, మొత్తం ఎస్ఎంఎస్లలో రెండు శాతం స్పామ్ ఉంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్ కూడా అక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్‌ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, పశి్చమ ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ రెండున్నర నెలల్లో సందేహాస్పద కాల్స్, ఎస్ఎంఎస్ల గురించి దాదాపు 25.2 కోట్ల మందిని అప్రమత్తం చేశామని, దీంతో వాటికి స్పందించే వారి సంఖ్య సుమారు 12 శాతం తగ్గిందని ఎయిర్టెల్ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35 శాతం మంది ల్యాండ్‌లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు పేర్కొంది. అలాగే, పురుష కస్టమర్లే లక్ష్యంగా 76 శాతం కాల్స్ ఉంటున్నాయని వివరించింది. లావాదేవీలు, సరీ్వస్కి సంబంధించిన కాల్స్ చేసేందుకు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, స్టాక్‌బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎస్ఎంఈలకు ప్రభుత్వం 160 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్లను కేటాయించినట్లు వివరించింది. డు–నాట్–డిస్టర్బ్ని (డీఎన్డీ) ఎంచుకోని వారికి, ప్రమోషనల్ కాల్స్‌ను అందుకునేందుకు అంగీకరించిన వారికి యథాప్రకారం 140 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్ల నుంచే కాల్స్ వస్తాయని పేర్కొంది. మిగతా వివరాల్లోకి వెళ్తే.. → ఢిల్లీ, ముంబై, కర్ణాటక అత్యధికంగా స్పామ్ కాల్స్ జనరేట్ అవుతున్న ప్రాంతాల్లో వరుసగా టాప్ 3లో ఉన్నాయి. ఎస్ఎంఎస్లపరంగా (టెక్ట్స్ మెసేజీలు) గుజరాత్, కోల్‌కతా, ఉత్తర్‌ప్రదేశ్‌లు ఈ స్థానాల్లో ఉన్నాయి. → 36–60 ఏళ్ల వయసు గల కస్టమర్లు లక్ష్యంగా 48 శాతం కాల్స్ ఉంటున్నాయి. 26 శాతం కాల్స్‌తో 26–35 ఏళ్ల వారు రెండో స్థానంలో ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎనిమిది శాతం స్పామ్ కాల్స్ మాత్రమే వచ్చాయి. → స్పామ్ కాల్స్ ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. తర్వాత ఉధృతి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గం.ల సమయానికి తారాస్థాయికి చేరుతుంది. మొత్తం స్పామ్ కాల్స్‌లో 22 శాతం కాల్స్.. రూ. 15,000–20,000 ధర శ్రేణిలోని మొబైల్స్ కలిగిన కస్టమర్లు లక్ష్యంగా ఉంటున్నాయి. → పనిదినాల్లోనూ, వారాంతాల్లోనూ వచ్చే కాల్స్ పరిమాణంలో వ్యత్యాసం ఉంటోంది. ఆదివారాలు ఇలాంటి కాల్స్ ఏకంగా 40 శాతం తగ్గుతున్నాయి. -
నోకియాకు ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీలో ఉన్న ఫిన్లాండ్ దిగ్గజం నోకియా తాజాగా భారతీ ఎయిర్టెల్ నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్‌లోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలలో నోకియా తయారీ 4జీ, 5జీ పరికరాలను వినియోగంలోకి తెస్తారు. రీఫ్షార్క్ సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీ ఆధారిత బేస్ స్టేషన్స్, బేస్‌బ్యాండ్ యూనిట్స్, మాసివ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ ఔట్పుట్ వైర్లెస్ కమ్యూనికేషన్స్‌ను నోకియా అందించనుంది.‘వీటి చేరికతో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను అసాధారణమైన 5జీ సామర్థ్యం, కవరేజీతో మెరుగుపరుస్తాయి. అలాగే నెట్వర్క్ వికాసానికి మద్దతు ఇస్తాయి. ఎయిర్టెల్ యొక్క ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌ను మల్టీబ్యాండ్ రేడియోలు, బేస్‌బ్యాండ్ పరికరాలతో నోకియా ఆధునీకరించనుంది. ఇది 5జీకి కూడా మద్దతు ఇస్తుంది’ అని నోకియా వెల్లడించింది.నోకియాతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సంస్థ నెట్వర్క్ మౌలిక సదుపాయాల సామర్థాన్ని రుజువు చేస్తుందని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందిస్తుందని, ఈ నెట్వర్క్ పర్యావరణ అనుకూలమైనదని వివరించారు. ఎయిర్‌టెల్‌కు రెండు దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్వర్క్ ఉపకరణాలను నోకియా సరఫరా చేస్తోంది. -
ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం వాటా పెంపు
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లో తాజాగా 1.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఆఫ్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ వాటాను సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ పేర్కొంది.అయితే డీల్ విలువను వెల్లడించనప్పటికీ.. ఎయిర్టెల్ మార్కెట్ విలువ ప్రకా రం వాటా విలువ రూ. 11,680 కోట్లుగా అంచనా. కాగా.. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం వాటా 40.33 శాతానికి చేరింది. మరోవైపు ఇండియన్ కాంటినెంట్ వాటా 3.31 శాతానికి పరిమితమైంది. భారతీ టెలికంలో సునీల్ భారతీ మిట్టల్ వాటా 50.56 శాతంకాగా.. సింగ్టెల్ 49.44% వాటాను కలిగి ఉంది.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
ఎయిర్టెల్ భారీ వ్యూహం.. టాటాగ్రూప్ కంపెనీపై కన్ను!
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన డిజిటల్ టెలివిజన్ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే (గతంలో టాటాస్కై)ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎయిర్టెల్ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఎఫ్‌టీఏ సేవల ఆవిర్భావం కారణంగా వృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్న డిజిటల్ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగా టాటాప్లేని కొనుగోలు చేయడానికి ఎయిర్టెల్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 2017లో టాటా కన్స్యూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని భారతీ ఎయిర్టెల్ కొనుగోలు చేసిన తర్వాత రెండు కంపెనీల మధ్య ఇది రెండో ఒప్పందం కానుంది. ఈ ఒప్పదం కుదిరి టాటా ప్లేను ఎయిర్టెల్ కొనుగోలు చేస్తే టాటా తన కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల పూర్తిగా వైదొలుగుతుంది.టాటా ప్లే ప్రస్తుతం డీటీహెచ్ విభాగంలో 20.77 మిలియన్ల సబ్స్క్రైబర్లు, 32.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది. కానీ ఆర్థిక పరంగా నష్టాల్లో నడుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.353.8 కోట్లుగా ఉంది. టాటా ప్లే కొనుగోలుతో ఎయిర్టెల్ కస్టమర్ బేస్ పెరుగుతుందని, అదే సమయంలో జియో అందిస్తున్న ఆఫర్లతో పోటీపడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. -
ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ షట్‌డౌన్: కారణం ఇదే..
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ తన వింక్ మ్యూజిక్ యాప్‌ను త్వరలోనే నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇందులో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపించేది లేదని, వారందరినీ కంపెనీలోని సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఎయిర్టెల్ కంపెనీ యాపిల్‌తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వింక్ మ్యూజిక్ నిలిపివేసిన తరువాత ఎయిర్టెల్ యూజర్లు యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినొచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కంపెనీ ఓ స్పెషల్ ఆఫర్ అందించే అవకాశం ఉందని సమాచారం. -
భారతీ హెక్సాకామ్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 3న ప్రారంభంకానుంది. వెరసి కొత్త ఆరి్థక సంవత్సరం(2024–25)లో వెలువడిన తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఏప్రిల్ 5న ముగియనున్న ఇష్యూలో భాగంగా టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ 7.5 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఫలితంగా ప్రస్తుత వాటాదారు సంస్థకు ఐపీవో నిధులు అందనున్నాయి. ఇవి కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానంకాగా.. గతంలో 10 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని సంకలి్పంచిన సంగతి తెలిసిందే. యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను కేటాయించనుంది. కంపెనీ లిస్టయ్యేందుకు ఈ నెల రెండోవారంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీలో భారతీ ఎయిర్టెల్ వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ రంగ టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా మిగిలిన 30 శాతం వాటాను కలిగి ఉంది. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త కార్డులు, ఆఫర్ ఏంటంటే!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను ప్రారంభించింది. పర్యావరణ హితంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పొదుపు బ్యాంకు ఖాతాలను కలిగి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డులు ఆవిష్కరించింది. అంతేకాకుండా, మార్కెట్లోని సాంప్రదాయ PVC కార్డులతో పోలిస్తే, తమ 50,000 కార్డుల ప్రతి బ్యాచ్ 350 కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్డ్‌లను తీసుకురానున్నామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. పర్యావరణ అనుకూలమైన ఆర్-పీవీసీ మెటీరియల్‌తో దీన్ని తయారు చేసినట్లు సంస్థ సీవోవో గణేష్ అనంతనారాయణన్ తెలిపారు. సాంప్రదాయ పీవీసీ కార్డులతో పోలిస్తే వీటి ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గగలవని, హైడ్రోకార్బన్ల వినియోగం గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత క్లాసిక్ వేరియంట్లో పర్సనలైజ్డ్, ఇన్‌స్టా కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటితో రూ. 10,000 వరకు విలువ చేసే ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్‌చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్‌పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది. -
వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను ప్రారంభించింది. ఇందుకోసం భారతీ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపింది. పలు బ్యాంకు సర్వీసులతోపాటు ఇంటి వద్ద సేవల కోసం వినతి, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ శాఖ ఎక్కడ ఉంది వంటివి వాట్సాప్ ద్వారా ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌నకు 4.51 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. లైవ్ ఇంటెరాక్టివ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌ను సైతం వాట్సాప్‌లో పరిచయం చేయనున్నారు. -
500 కేంద్రాల్లో ఎయిర్టెల్ 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మరో 235 నగరాలు, పట్టణాలకు 5జీ సేవలను పరిచయం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీ 5జీ సర్వీసులు విస్తరించిన కేంద్రాల సంఖ్య 500లకు చేరింది. ప్రతి రోజు 30–40 కేంద్రాల్లో తదుపరి తరం టెలికం సేవలను జోడిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2023 సెప్టెంబర్‌లోగా అన్ని నగరాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్టెల్ సీటీవో రన్‌దీప్ సెఖన్ తెలిపారు. రిలయన్స్ జియో 406 నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను అందిస్తోంది. 5జీ నెట్వర్క్ విషయంలో ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. 2023 మార్చి 31 నాటికి 200 కేంద్రాల్లో 5జీని పరిచయం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. అంచనాలను మించి ప్రస్తుతం ఈ సేవలు విస్తరించడం గమనార్హం. -
వొడాఫోన్ కొత్త ప్లాన్: జియో, ఎయిర్టెల్ తరహాలోనే, ఏది బెటర్?
సాక్షి,ముంబై:వొడాఫోన్ ఇండియా సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. దేశీయ వినియోగదారుల కోసం రూ. 296ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ డేటాను వినియోగించే కస్టమర్లు లక్క్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ఎయిర్టెల్, జియోకు చెందిన రూ.296 రీచార్జ్ ప్లాన్లకు దీటుగా తాజా బల్క్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్ రూ.296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు 25 జీబీ బల్క్ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వీఐ మూవీస్, టీవీని ఎంజాయ్ చేయవచ్చు కానీ, వివో అన్లిమిటెడ్ ప్రయోజనాలుండవు. ఎయిర్టెల్ రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకి100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు ఏంటంటే.. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్ , వింక్ మ్యూజిక్ ఫ్రీ. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా జియో క్లౌడ్,జియో సెక్యూరిటీల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి -
Bharti Airtel: ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌ల పెంపు
బార్సెలోనా: ఈమధ్యే పలు దఫాలుగా ప్లాన్ల టారిఫ్‌లను పెంచిన టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ మరో విడత వడ్డింపునకు సిద్ధమవుతోంది. పెట్టుబడులపై రాబడులు అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల అట్టడుగున ఉన్నవారిపై పడే ప్రభావంపై స్పందిస్తూ.. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే పెంపు చాలా స్వల్పమే ఉంటుందని పేర్కొన్నారు. ‘ఒక్కటి తప్ప.. అన్నీ పెరిగాయి. జీతాలు .. అద్దెలు పెరిగాయి. ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ప్రజలు 30 జీబీ డేటాను దాదాపు ఏమీ కట్టకుండానే వినియోగిస్తున్నారు. దేశంలో మరో వొడాఫోన్ తరహా పరిస్థితి తలెత్తకూడదు. మనకు ఒక భారీ టెలికం సంస్థ అవసరం‘ అని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ చెప్పారు. కోటి మందికి ఎయిర్టెల్ 5జీ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కోటి మంది 5జీ చందాదార్లను సొంతం చేసుకుంది. 2024 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టినట్టు తెలిపింది. ప్రపంచ స్థాయి 5జీ ప్లస్ అనుభూతిని అందించడానికి సరైన మార్గంలో ఉన్నట్టు విశ్వసిస్తున్నామని సంస్థ సీటీవో రన్‌దీప్ సిఖోన్ తెలిపారు. 2022 నవంబర్‌లో 10 లక్షల మంది కస్టమర్లు కంపెనీ 5జీ వేదికపైకి వచ్చారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే ఈ ఘనతను సాధించామని ఎయిర్టెల్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లను 5జీ ఎక్స్‌పీరియెన్స్ జోన్స్‌గా తీర్చిదిద్దామని కంపెనీ వివరించింది. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, 30రోజులు వాలిడిటీతో
సాక్షి,ముంబై: దేశీయ టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్టెల్ యూజర్లకు సరికొత్త ప్లాన్‌ను అందిస్తోంది. 30 రోజులవాలిడిటీతో రూ.199 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా డేటా పెద్దగా వాడని యూజర్లకోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎందుకంటే 30 రోజులకు గాను కస్టమర్లకు అందించే మొత్తం డేటా కేవలం 3జీబీ మాత్రమే. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, 30 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే రోజుకు 100 మెసేజ్‌లకు పరిమితం. ఎయిర్టెల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. -
ఎయిర్టెల్ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6-9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
నెల రోజుల్లోనే 10 లక్షల 5జీ యూజర్లు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6–9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
ఎయిర్టెల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 89% జంప్‌చేసి రూ. 2,145 కోట్లను తాకింది. అనూహ్య రాబడిని మినహాయిస్తే రూ. 2,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) క్యూ2లో కేవలం రూ.11,340 కోట్లు ఆర్జించింది. 4జీ లాభదాయకత, వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ), డేటా వినియోగం పుంజుకోవడం అధిక లాభాలకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 22% ఎగసి రూ. 34,527 కోట్లకు చేరింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కస్టమర్లను అధిగమించడంతోపాటు.. నిలకడైన పటిష్ట పనితీరును చూపగలిగినట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమలోనే అత్యుత్తమంగా రూ. 190 ఏఆర్పీయూను సాధించింది. గత క్యూ2లో ఇది రూ. 153 మాత్రమే. 20 జీబీ వినియోగం: 5జీ ప్రారంభించనున్న నేపథ్యంలో మరింత ఉత్తమ సేవలు అందించగలమని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే చౌక ధరల కారణంగా తక్కువ ఆర్వోసీఈని నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 8 పట్టణాలలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టింది. కాగా ప్రస్తుత సమీక్షా కాలంలో 1.78 కోట్లమంది 4జీ కస్టమర్లు లభించగా.. ఒక్కొక్కరి నెలవారీ సగటు డేటా వినియోగం 20.3 జీబీకి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2 శాతం లాభపడి రూ. 832 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన భారతి ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో ఏకంగా 89 శాతం రెట్టింపు లాభాలను సాధించింది. 30 సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 2,145 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. (Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు) గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ లాభం రూ.1,134కోట్లు మాత్రమే. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21.9 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.28,326 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 21.9శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది, పోర్ట్‌ఫోలియో అంతటా బలమైన, స్థిరమైన పనితీరు కనబర్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కస్టమర్లను దాటినట్టు కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్యూ1తో 183 రూపాయలతో పోలిస్తే క్యూ2లో రూ. 190కి పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ఎయిర్టెల్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 33.5 శాతం పెరుగుదలను నివేదించింది. కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ , వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో ఎయిర్టెల్ 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఇటీవల తెలిపిన సంగతివ తెలిసిందే. -
ఎయిర్టెల్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లో మొత్తం 1.76 శాతం వాటాను సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్(సింగ్టెల్) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ. 686 ధరలో పాస్టెల్ లిమిటెడ్(సింగ్టెల్ సంస్థ) 1.63 శాతం వాటాను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం దాదాపు రూ. 6,602 కోట్ల విలువైన ఈ వాటా(9.62 కోట్లకుపైగా షేర్లు)ను ఎయిర్టెల్ ప్రమోటర్ భారతీ టెలికం కొనుగోలు చేసింది. ఈ బాటలో సింగ్టెల్ మరో సంస్థ విరిడియన్ సైతం 0.13 శాతం వాటా(కోటి షేర్లు)ను ఇదే ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. సాధారణ వాటాదారులు 70 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో పబ్లిక్ వాటా 44.74 శాతం నుంచి 44.87 శాతానికి పెరిగినట్లు తెలియజేశాయి. జూన్ చివరికల్లా ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం 35.85 శాతం వాటా కలిగి ఉంది. కాగా.. భారతీ టెలికంలో సింగ్‌టెల్‌కు 50.56 శాతం, సునీల్ మిట్టల్ కుటుంబానికి 49.44 శాతం చొప్పున వాటా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం బలపడి రూ. 379 వద్ద ముగిసింది. -
భారతీ టెలికంకు సింగ్టెల్ వాటా
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. కంపెనీలో సింగ్‌టెల్‌కు గల 3.33 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా పేర్కొంది. మాతృ సంస్థ భారతీ టెలికం ఈ వాటాను 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఇందుకు 2.25 బిలియన్ సింగపూర్ డాలర్ల(రూ. 12,895 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. కాగా.. భారతీ టెలికంలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ కుటుంబంతోపాటు, సింగ్టెల్ సైతం ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్టెల్ గ్రూప్ వాటా 29.7 శాతానికి చేరనుంది. రెండు సంస్థల మధ్య ఈ లావాదేవీ పూర్తయ్యాక ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం ప్రధాన వాటాదారుగా కొనసాగనున్నట్లు సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. -
నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు
సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రం కొనుగోలుకు సంబంధించి ఎయిర్టెల్ ముందస్తు చెల్లింపులు చేసిన కొన్ని గంటల్లోనే సంబంధిత స్పెక్ట్రమ్‌ను సంస్థకు కేటాయించడం విశేషంగా నిలిచింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించినతీరుపై ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రశంసలు కురిపించారు. ఊహించిన దానికంటే ముందుగానే 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగంగో 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేశారు ఎయిర్ టెల్ చెల్లింపులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 5జీ స్పెక్ట్రం కేటాయించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లేఖ అందిందని ఎయిర్టెల్ చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్ సంతోషం ప్రకటించారు. నిర్ణీత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కేటాయింపు లేఖ చేతికందిందని, ఇచ్చిన హామీ మేరకు స్పెక్ట్రమ్‌తోపాటు ఇ బ్యాండ్ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. బహుశా చెల్లింపులు జరిపిన రోజే ఇలా లేఖ అందడం ఆశ్చర్యం కలిగించిందనీ, చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. తన 30 అనుభవంలో తొలిసారి ఇలా జరిగిందంటూ ఉబ్బితబ్బిబ్బవుతునన్నారు. ఎలాంటి గందరగోళం, వివరాల ఆరాలు, ఆఫీసుల చుట్టూ తిరగడాలు ఈ బాదర బందీ ఏమీ లేకుండానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇదంతా టెలికాం శాఖ నాయకత్వ కృషి అని, ఈజీ బిజినెస్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఈ మార్పే అవసరమని ఇదే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇంధనంగా తోడ్పడు తుందంటూ మిట్టల్ అభిప్రాయపడ్డారు. Ready to lead India into the next generation of connectivity. #Airtel5G pic.twitter.com/deFlNWlZcC — Bharti Airtel (@airtelnews) August 18, 2022 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసినట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది, ఎయిర్టెల్ ఈ నెలాఖరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.షెడ్యూల్ కంటే 4 సంవత్సరాల ముందుగానే బకాయిలను చెల్లించిందని కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసారు. "5G అప్డేట్: స్పెక్ట్రమ్ అసైన్మెంట్ లెటర్ జారీ చేశాం. 5G లాంచ్‌కు సిద్ధం కావాలని సర్వీసు ప్రొవైడర్లను అభ్యర్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా 5జీ స్పెక్ట్రమ్ బకాయిల కోసం టెలికాం కంపెనీలు రూ.17,873 కోట్లకు పైగా చెల్లించాయి. ఇందులో దాదాపు సగం నాలుగేళ్లకు చెందిన ముందస్తు చెల్లింపులు రూ. 8,312.4 కోట్లు భారతీ ఎయిర్టెల్ చెల్లించింది. -
స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ రూ. 8 వేల కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కేంద్రానికి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. నాలుగేళ్లకు సరిపడా వాయిదాల మొత్తాన్ని టెలికం శాఖకు (డట్) ముందస్తుగా చెల్లించినట్లు సంస్థ తెలిపింది. దీనితో తాము ఇక పూర్తిగా 5జీ సేవలను అందుబాటులోకి తేవడంపైనే దృష్టి పెట్టేందుకు వీలవుతుందని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. తగినంత స్పెక్ట్రం, అత్యుత్తమ టెక్నాలజీ, పుష్కలంగా నిధుల ఊతంతో ప్రపంచ స్థాయి 5జీ సేవల అనుభూతిని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్టెల్ రూ. 43,039.63 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందులో ముందుగా రూ. 3,849 కోట్లు, తర్వాత 19 ఏళ్ల పాటు మిగతా మొత్తాన్ని విడతలవారీగా చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌కు అవకశం ఉంది. -
5000 పట్టణాల్లో ఎయిర్టెల్ 5జీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్టెల్ నూతన అధ్యాయానికి సిద్ధం అవుతోంది. 5జీ సేవలను ఆగస్ట్‌లోనే ప్రారంభిస్తున్న ఈ సంస్థ.. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ మంగళవారం ప్రకటించారు. ‘5,000 పట్టణాల్లో 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన నెట్వర్క్ విస్తరణ ప్రణాళిక పూర్తిగా అమలులో ఉంది. ఇది సంస్థ చరిత్రలో అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటి. మొబైల్ సేవల చార్జీలు భారత్‌లో అతి తక్కువ. టారిఫ్‌లు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక్కో యూజర్ నుంచి కంపెనీకి ఆదాయం రూ.183 వస్తోంది. ఇది త్వరలో రూ.200లకు చేరుతుంది. టారిఫ్‌ల సవరణతో ఈ ఆదాయం రూ.300లు తాకుతుంది’ అని తెలిపారు. 900 మెగాహెట్జ్, 1,800, 2,100, 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 900 మెగాహెట్జ్ ద్వారా.. ‘భారీ మిడ్ బ్యాండ్ 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోటీ సంస్థకు లేదు. ఇది మాకు లేనట్టయితే ఖరీదైన 700 మెగాహెట్జ్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ బ్యాండ్‌లో భారీ రేడియో ఉపకరణాలను ఉపయోగించాలి. ఇవి ఖర్చుతో కూడుకున్నవే కాదు, కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తాయి. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ అదనపు కవరేజ్ ఏమీ ఇవ్వదు. స్టాండలోన్ 5జీ నెట్వర్క్స్ కంటే నాన్–స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) 5జీ నెట్వర్క్స్ ప్రయోజనాలు అధికం. అదనపు ఖర్చు లేకుండానే ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీని ఉపయోగించి నూతన సాంకేతికత అందించవచ్చు. అలాగే వేగంగా కాల్ కనెక్ట్ అవుతుంది’ అని వివరించారు. జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అయిదురెట్లకుపైగా పెరిగి రూ.283 కోట్ల నుంచి రూ.1,607 కోట్లకు చేరడం తెలిసిందే. టారిఫ్‌లు పెరగడమే ఈ స్థాయి వృద్ధికి కారణం. రిలయన్స్ జియో సైతం.. టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 1,000 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నూతన సాంకేతికత పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన పరీక్షలు సైతం జరిపినట్టు వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం గేర్స్‌ను కంపెనీ వాడుతోంది. ఖరీదైన 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. ఈ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూజర్ భవనం లోపల ఉన్నా కవరేజ్ ఏమాత్రం తగ్గదు అని ఆయన చెప్పారు. ఇతర బ్యాండ్స్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కస్టమర్‌కు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని వివరించారు. -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది. 4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది. -
ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగుతోంది. ఆరో రోజైన ఆదివారం మరో రూ. 163 కోట్ల బిడ్లు అదనంగా రావడంతో ఇప్పటిదాకా వచ్చిన బిడ్ల విలువ మొత్తం రూ.1,50,130 కోట్లకు చేరినట్లు టెలికం శాఖ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కు శనివారం డిమాండ్ కాస్త తగ్గినట్లు కనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఏడో రోజైన సోమవారం నాడు కూడా వేలం కొనసాగనుంది. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో పాల్గొంటోంది. దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది.