మొ‘బిల్‌’ మోతే..! | Bharti Airtel and Vodafone Idea will increase rates | Sakshi
Sakshi News home page

మొ‘బిల్‌’ మోతే..!

Published Tue, Nov 19 2019 3:28 AM | Last Updated on Tue, Nov 19 2019 3:41 AM

Bharti Airtel and Vodafone Idea will increase rates - Sakshi

న్యూఢిల్లీ: భారీ నష్టాలు, పేరుకుపోయిన రుణాలు... వాటికి తోడు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటం... ఈ సంక్షోభం నుంచి కొంతైనా గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా  కాల్‌ చార్జీలను పెంచబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి కాల్‌ చార్జీలను పెంచనున్నట్లు టెలికం దిగ్గజాలు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించాయి. అయితే, చార్జీల పెంపు ఎంత మేర ఉంటుందనేది మాత్రం నిర్దిష్టంగా వెల్లడించలేదు. ‘కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి డిజిటల్‌ సేవలు అందించడాన్ని కొనసాగించే క్రమంలో.. డిసెంబర్‌ 1 నుంచి సముచిత స్థాయిలో టారిఫ్‌లు పెంచబోతున్నాం’ అని వొడాఫోన్‌ ఐడియా సోమవారం ప్రకటించింది.

ఆ తరువాత కొద్ది సేపటికే భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తమ రేట్ల పెంపు ప్రతిపాదనలు వెల్లడించింది. ‘అతి వేగంగా మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు టెలికం రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. డిజిటల్‌ ఇండియా కల సాకారం కావాలంటే టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండటం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ నుంచి చార్జీలను తగు రీతిలో పెంచనున్నాం‘ అని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. రిలయన్స్‌ జియో రాకతో టెల్కోల మధ్య అత్యంత చౌక చార్జీల పోరాటాలు ఆరంభమైన సంగతి తెలిసిందే. దీనికి తెరదించేలా అందరికీ కనీస చార్జీలను నిర్దేశించాలని కేంద్రం యోచిస్తున్న పరిస్థితుల్లో వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా నెలవారీ మొబైల్‌ సేవల ప్లాన్లు డేటా లేకుండా కనిష్టంగా రూ.24 నుంచి, డేటాతో కలిసి ఉన్నట్లయితే రూ.33 నుంచి ప్రారంభమవుతున్నాయి.
 
ఏజీఆర్‌తో నెత్తిన పిడుగు...! 
అసలే భారీ రుణాలు, నష్టాల్లో కూరుకుపోయి ఉన్న టెలికం పరిశ్రమపై ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుతో సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) పిడుగు పడటం తెలిసిందే. ఈ తీర్పుతో కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద ఏకంగా రూ.1.4 లక్షల కోట్ల దాకా టెలికం సంస్థలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో ఛార్జీలతో పాటు వాటిపై వడ్డీలు, పెనాల్టీలు, పెనాల్టీలపై వడ్డీలు కూడా కలిసి ఉన్నాయి. తీర్పు నేపథ్యంలో... మూడు నెలల్లో బకాయిలు చెల్లించాల్సిందేనంటూ టెలికం విభాగం (డాట్‌) ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆ మొత్తానికి కేటాయింపులు జరిపాయి. ఫలితంగా వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ రెండూ కలిసి ఏకంగా సుమారు రూ.74,000 కోట్ల నష్టాలు ప్రకటించాయి. దివాలా తీసిన అనిల్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ కూడా కేటాయింపులతో కలిసి రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంటే ఈ మూడు సంస్థల మొత్తమే రూ.లక్ష కోట్లు దాటేసింది. ఇందులో ఒక్క ఐడియా వాటాయే రూ.50,921 కోట్లు. దేశీయంగా ఓ కార్పొరేట్‌ కంపెనీ ఈ స్థాయి నష్టాలు ప్రకటించడం ఇదే రికార్డు.  

అసలేంటీ ఏఈఆర్‌ గొడవ? 
ఇది దాదాపు 16 ఏళ్లుగా సాగుతున్న వివాదం. టెలికం సేవల కోసం లైసెన్సులు పొందిన టెల్కోలు తమకు వచ్చే రెవెన్యూలో నిర్దిష్ట శాతాన్ని లైసెన్సు ఫీజు కింద, స్పెక్ట్రం యూసేజి చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ‘రెవెన్యూ’ను లెక్కించే విషయంలో మాత్రం టెల్కోలు, కేంద్ర టెలికాం విభాగం మధ్య వివాదం సాగుతోంది. టెలికంయేతర కార్యకలాపాల ద్వారా వచ్చే నిధులు కూడా టెల్కోలకు రెవెన్యూయేనని కేంద్రం వాదన. దానికి తగ్గట్లుగా సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) ప్రాతిపదికన టెల్కోలు.. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాలని నిర్దేశించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెల్కోలు న్యాయపోరాటానికి దిగాయి. తాజాగా వాటికి ఎదురుదెబ్బ తగిలింది. ఏజీఆర్‌ లెక్కింపుపై కేంద్రం ఫార్ములాను సమరి్థస్తూ అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. బకాయిల్ని పెనాల్టీలను వడ్డీతో సహా మూడు నెలల్లోగా కట్టేయాలంటూ ఆదేశించింది. దీంతో టెలికం కంపెనీలు రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి రావచ్చని అంచనా. టెల్కోలపై బాకీల భారం అటు వాటికి రుణాలిచి్చన బ్యాంకులనూ ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, పరిస్థితులను గాడినపెట్టేందుకు తగు చర్యల్ని సూచిం చేందుకు కేంద్రం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. 

ఈ గట్టున జియో... ఆ గట్టున మిగతావి!!
పోటాపోటీగా చార్జీలు తగ్గించాల్సి రావడం, కార్యకలాపాల విస్తరణకు భారీగా రుణాలు తీసుకోవడం వల్ల టెలికం సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. జూన్‌ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం వొడాఫోన్‌ ఐడియా రుణభారం రూ.99,000 కోట్లపైనే ఉంది. ఇక ఎయిర్‌టెల్‌కు  రూ.1.16 లక్షలపైన రుణాలున్నాయి. ఈ నేపథ్యంలో టెలికం రంగానికి సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ పాత తరం టెల్కోలు కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే, ప్యాకేజీల్లాంటివేమీ అవసరం లేదని   ముకేశ్‌ అంబానీ సంస్థ  జియో వాదిస్తోంది. ఏజీఆర్‌ విషయంలో కూడా రిలయన్స్‌ జియో చెల్లించాల్సిన మొత్తం రూ.41 కోట్లు మాత్రమేనని విశ్లేషణలు వస్తున్నాయి.  

ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీల (ఐయూసీ) విషయంలో కూడా వీటిని తొలగించాలని జియో వాదిస్తుండగా... ఎయిర్‌టెల్, ఐడియా మాత్రం ఉంచాలని కోరుతున్నాయి. అంటే... ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్‌ చేసినపుడు... కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు, కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ నిమిషానికి 6 పైసలు చెల్లించాలి. దీనివల్ల జియో నికరంగా ఇతర టెల్కోలకు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. దీంతో వీటిని తొలగించాలని మొదటి నుంచీ వాదిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తొలగించడానికి కూడా గతంలో కేంద్రం సమ్మతించింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని తొలగించకూడదని ఐడియా, ఎయిర్‌టెల్‌ మరింత గట్టిగా గళమెత్తేసరికి... త్వరలో కొత్త విధానం తెస్తామని ట్రాయ్‌ ప్రకటించింది.

మూడేళ్లు మారటోరియం కావాలి: సీవోఏఐ
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారీగా బకాయిలు కట్టాల్సి రానున్న టెలికం కంపెనీలు.. కొంత వెసులుబాటు కల్పించాలంటూ కేంద్రాన్ని పదే పదే అభ్యర్థిస్తున్నాయి. చెల్లింపులపై మూడేళ్ల మారటోరియం ఇవ్వాలని, మొత్తం బాకీలన్నీ కట్టేందుకు గడువు మరింత పొడిగించాలని, వడ్డీ రేటు తక్కువ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ చెప్పారు. తీవ్ర సంక్షోభంలో కొట్టుకుంటున్న టెలికం ఆపరేటర్లకు కాస్త ’ప్రాణవాయువు’ అందించాలని అభ్యర్థించారు. అలాగే, టెలికం కంపెనీల రుణాల పునర్‌వ్యవస్థీకరణ అంశంపై కూడా కేంద్రం దృష్టి సారించాలని కోరారాయన. 4జీ టెలికం సేవలకు సంబంధించి టెల్కోలు తీసుకున్న లైసెన్సుల గడువు మరో 11 ఏళ్ల పాటు ఉన్నందున.. బకాయిలను ఇప్పటికిప్పుడు కాకుండా.. పదేళ్లలో నెమ్మదిగా చెల్లించేందుకు ఆపరేటర్లకు వెసులుబాటు కల్పించాలని కోరారు. భవిష్యత్‌లో మారబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏజీఆర్‌ను పునర్నిర్వచించాలని కూడా సూచించారు. 

మారటోరియం అంటే... 
సాధారణంగా రుణం తీసుకున్న మరుసటి నెల నుంచే ఈఎంఐలు మొదలవుతాయి. అయితే కొన్నాళ్లపాటు కట్టకుండా వెసులుబాటు కల్పించడాన్ని మారటోరియంగా వ్యవహరిస్తారు. అయితే, ఈ మారటోరియం కాలానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చదువుకోవటానికి రుణం తీసుకున్నవారు... చదువు పూర్తయ్యాక ఈఎంఐలు చెల్లించటం మొదలుపెడతారు కనక... విద్యా రుణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement