సాక్షి,ముంబై: ఏజీఆర్ వివాదంలో చిక్కుకున్న టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) సంబంధిత బకాయిలను రాబోయే కొద్ది రోజుల్లో టెలీకమ్యూనికేషన్ విభాగానికి (డాట్) జమ చేయనున్నట్లు వోడాఫోన్ ఐడియా శనివారం తెలిపింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారాన్ని అందించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, డాట్ విధించిన డెడ్‌లైన్ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో కంపెనీ బోర్డు ప్రత్యేకంగా సమావేశ మైంది.
డాంట్ అంచనాల ప్రకారం, వోడాఫోన్ ఐడియా బకాయిలు మొత్తం రూ .53,038 కోట్లు. వీటిలో రూ.24,729 కోట్ల స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కాగా, లైసెన్స్ ఫీజు రూ.28,309 కోట్లు. మరోవైపు శుక్రవారం అర్థరాత్రిలోపు బకాయిలు చెల్లించాలని డాట్ విధించిన గడువుపై తక్షణమే స్పందించిన మరో దిగ్గజ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఫిబ్రవరి 20న రూ. 10వేల కోట్లు, కోర్టువిచారణ లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తామని ప్రకటించింది.
కాగా టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో విలీనం తరువాత అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్ ఇండియా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. దీనికితోడు కస్టమర్ల సంఖ్య కూడా క్రమేపీ క్షీణిస్తోంది. దీనికి ఏజీఆర్ బకాయిల అంశం అగ్నికి ఆజ్యంలా తోడైంది. ఈ నేపథ్యంలోనే తమకు ఉపశమనం కల్పించకపోతే కంపెనీనీ మూసుకోవాల్సి వస్తుందని ఇటీవల వ్యాఖ్యానించింది. ఇది ఇలా వుండగా తాజాగా వరుసగా ఆరవ త్రైమాసికంలో కూడా కంపెనీ నష్టాలనే ప్రకటించింది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో, రూ .6,439 కోట్ల నికర నష్టాన్ని మూట గట్టుకుంది. అటు స్టాక్‌మార్కెట్లో కంపనీ షేరు భారీగా పతనమైంది. ఏజీఆర్ సంక్షోభంతో కంపెనీ దివాలా ప్రకటిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యాపించాయి. మొండిపద్దుల గుదిబండ తమ మెడకుచుట్టుకుంటుందనే ఆందోలన అటు బ్యాంకింగ్ రంగంలో కూడా నెలకొంది. టెలికాం కంపెనీలు రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదైనా కంపెనీ దివాలా ప్రకటిస్తే.. దానికి బ్యాంకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజా ప్రకటనతో ఈ అంచనాలకు తెరపడింది. ఏజీఆర్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 17వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
చదవండి : టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్
Comments
Please login to add a commentAdd a comment