Dot India
-
‘అదానీ’ కి టెలికం లైసెన్స్: డాట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం సర్వీసులకు సంబంధించి అదానీ డేటా నెట్‌వర్క్‌కు ఏకీకృత లైసెన్సు (యూఎల్) లభించింది. కేంద్రం తాజాగా దీన్ని మంజూరు చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అదానీ డేటా నెట్వర్క్స్ (ఏడీఎన్ఎల్) , ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు,ముంబై ఇలా ఆరు సర్కిళ్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి ఏకీకృత లైసెన్స్‌ను పొందింది. అదానీ గ్రూప్‌లో భాగమైన ఏడీఎన్ఎల్ ఇటీవల జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 20 ఏళ్ల వ్యవధికి 400 మెగాహెట్జ్ మేర స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది. ఈ స్పెక్ట్రంను తమ గ్రూప్ వ్యాపారాల కస్టమర్ల కోసం రూపొందిస్తున్న సూపర్ యాప్‌తో పాటు తమ డేటా సెంటర్ల కోసం మాత్రమే వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు అదానీ గ్రూప్ గతంలోనే పేర్కొంది. -
ఏజీఆర్ బకాయిలు: వొడాఫోన్ ఐడియాకు ఊరట
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016-17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018-19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం షురూ..!
దేశంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు కీలక అడుగు పడుతున్నాయి. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మార్చి నాటికి అమ్మకపు ప్రక్రియకు సంబంధించిన నియమ & నిబంధనలపై తన సిఫార్సులను సమర్పిస్తే ఈ ఏడాది మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం జరుగుతుందని టెలికాం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "5జీ వేలానికి సంబంధించి తన సిఫార్సులను మార్చి నాటికి సమర్పించనున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఆ తర్వాత మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి ఒక నెల రోజులు సమయం పడుతుంది" అని టెలికామ్ కార్యదర్శి కె. రాజరామన్ పీటీఐకి చెప్పారు. గతంలో స్పెక్ట్రమ్ వేలంపై ట్రాయ్ నుంచి సిఫార్సులు అందుకున్న తర్వాత వేలంలో బిడ్డింగ్ రౌండ్లను ప్రారంభించడానికి ప్రభుత్వం 60-120 రోజులు సమయం తీసుకునేది అని ఆయన అన్నారు. ఈసారి వేలం ప్రారంభించడానికి ట్రాయ్ నుంచి సిఫార్సులు వచ్చిన రోజు నుంచి డీఓటీకి రెండు నెలలు సమయం పడుతుందని రాజరామన్ తెలిపారు. డీఓటీ తెలిపిన వివరాల ప్రకారం.. స్పెక్ట్రమ్ ధర, దానిని కేటాయించే విధానం, స్పెక్ట్రం బ్లాక్ సైజు, చెల్లింపుల నిబంధనలు & షరతులు, ఇతరుల విషయాలపై ట్రాయ్ నుంచి డీఓటీ సిపార్సులను కోరుతుంది. ఈ మేరకు ట్రాయ్ టెలికాం పరిశ్రమ, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత డివోటికి సిఫార్సులను సమర్పిస్తుంది. ప్రస్తుత పద్ధతి ప్రకారం, ట్రాయ్ సిఫార్సులపై డీఓటీలోని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్(గతంలో టెలికామ్ కమిషన్) నిర్ణయం తీసుకొని కేంద్ర మంత్రి వర్గ ఆమోదం కోసం పంపిస్తుంది. 5జీ వేలం నిర్వహణ భాద్యతలను డీఓటీ ఇప్పటికే ఎంఎస్‌టిసికి అప్పజెప్పినట్లు రాజరామన్ తెలిపారు. (చదవండి: మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై సీబీటీ కీలక సమావేశం..!) -
వొడాఫోన్-ఐడియాలో వాటా: మాంచి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
Govt Not Interested in Supervising Vodafone Idea Operations: భారత టెలికాం రంగంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న వొడాఫోన్-ఐడియా తన మేజర్ వాటాను కేంద్రం చేతికి అప్పగించింది. దీంతో కార్యనిర్వాహణ, కీలక నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోనుందని.. మంచిరోజులు రాబోతున్నాయంటూ కంపెనీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కేంద్రం ఆ ఆశలపై నీళ్లు జల్లింది. కంపెనీలో మేజర్ వాటా దక్కించుకున్నప్పటికీ.. వొడాఫోన్ ఐడియా కంపెనీ కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు బోర్డు నిర్ణయాలను సైతం ప్రభావితం చేయబోదని పేర్కొంది. వొడాఫోన్-ఐడియాను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. బోర్డు సీటుపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. నష్టాల్లో ఉన్న టెల్కో స్థిరపడిన వెంటనే.. నిష్క్రమించాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇక వొడాడియా ఆఫర్ చేసిన వాటాను.. ప్రభుత్వ ఈక్విటీగా మార్చే విధానంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపనుందని అధికారులు వెల్లడించారు(దాదాపు ఖరారైనట్లే!). మొత్తం వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చేయగా.. రూ. 16,000 కోట్లకుగానూ 35.8 శాతం వాటాను వొడాఫోన్-ఐడియా కంపెనీ, కేంద్రానికి అప్పజెప్పేందుకు సిద్ధమైంది. దీంతో కంపెనీలో గరిష్ఠ వాటా దక్కడంతో.. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే చూసుకోనుందంటూ(మరో బీఎస్ఎన్ఎల్గా మారనుందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు సైతం) కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ చేతికి మేజర్ వాటాను అప్పజెప్పడం ద్వారా లబ్ధి పొందవచ్చని భావించిన కంపెనీకి.. అధికారుల తాజా ప్రకటనతో నిరాశే ఎదురైంది. కేవలం టెలికాం సంస్కరణల ప్యాకేజీ ద్వారా లిక్విడిటీకి తీసుకురావడం, టెలికాం కంపెనీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటం లాంటి చర్యలకు మాత్రమే ప్రభుత్వం పూనుకోనుందట. ఇక ఓటింగ్ హక్కులు, PSU(పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్)గా మార్చడం, డైరెక్టర్ల బోర్డులో స్థానం పొందడంలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేదనే స్పష్టత లభించింది. మరోవైపు ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకే ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.దీంతో కంపెనీ ఇక మీదట కూడా స్వతంత్రగా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే.. కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించించింది. ఇందులో భాగంగానే టెలికం కంపెనీలు.. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. అలా ఐడియా-వొడాఫోన్ నుంచి కేంద్రం వాటా రూపంలో ఆఫర్ అందుకుంది. సంబంధిత పూర్తి కథనం: ప్రభుత్వం చేతికి వొడాఐడియా! -
భారత్ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్ మస్క్ కంపెనీ..!
స్టార్‌లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టాలని భావించిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌కు గత నెలలో మనదేశంలో గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతదేశంలో స్టార్‌లింక్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ తీసుకోవడం నిలిపివేసిన తర్వాత ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం గతలో యూజర్ల వసూలు చేసిన డబ్బులను తిరగి ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2020లో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ స్టార్‌లింక్ వినియోగదారుల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ప్రీ బుకింగ్ ఆర్డర్లు 99 డాలర్ల ధరకు లభ్యం అయ్యాయి. మన దేశంలో ఈ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల అందించడం కోసం ప్రీ బుకింగ్ పేరుతో రూ.7300లను స్టార్‌లింక్ వసూలు చేసింది. లైసెన్స్ తీసుకోకుండా స్టార్‌లింక్ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరం అని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) సంస్థను హెచ్చరించడంతో స్టార్ లింక్ నవంబర్ 2021లో భారతదేశంలో ప్రీ బుకింగ్ ఆర్డర్లను తీసుకోవడం నిలిపివేసింది. దీంతో భారత్‌లో స్టార్‌లింక్ సేవలను అందించేందుకుగాను వాణిజ్య లైసెన్స్ కోసం ఈ ఏడాది జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోనుందని స్టార్‌లింక్ ఇండియా హెడ్ సంజయ్ భార్గవ్ లింక్డ్ఇన్లో గతంలో పేర్కొన్నారు. అక్టోబర్ 1, 2021 నాటికి భారతదేశంలో ఈ సేవల ఇప్పటికే 5000కు పైగా ప్రీ ఆర్డర్లు అందినట్లు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో లైసెన్స్ పొందే వరకు ప్రీ ఆర్డర్ల రూపంలో తీసుకున్న డబ్బును రీఫండ్ చేయాలని డీఓటీ ఆదేశించినట్లు స్టార్‌లింక్ భారతదేశంలోని కస్టమర్లకు ఈ-మెయిల్ చేసినట్లు సమాచారం. భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు అందించడానికి ముందు పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని కంపెనీ హైలైట్ చేసినట్లు ఒక ప్రముఖ మీడియా నివేదించింది. దేశంలో ఉపగ్రహ ఆధారిత సేవలను అందించడానికి భారత ప్రభుత్వం నుంచి అవసరమైన లైసెన్స్(లు) తీసుకోవాలని డీఓటి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. (చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..!) -
6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే..
భారతదేశంలో అతి త్వరలో 6జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? అంటే, అవును అనే సమాధానాం వస్తుంది. టెలికాం రంగంలో ఆరవ తరం 6జీ టెక్నాలజీ అవకాశాలను అన్నీ దేశాల కంటే ముందే అందిపుచ్చుకోవడానికి తయారీ & సేవల వ్యవస్థను సిద్ధం చేసేందుకు భారతదేశం 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ)ని ఏర్పాటు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కానున్న 6G టెక్నాలజీని అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ) ఏర్పాటు చేసినట్లు టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) తెలిపింది. "6జీ టెక్నాలజీ అవకాశాలను అన్నీ దేశాల కంటే ముందే అందిపుచ్చుకోవడానికి భారతదేశంలో ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూప్(టీఐజీ) సిద్ధం చేయడం అవసరం" అని కూడా డీఓటీ తెలిపింది. ఈ 6జీ టెక్నాలజీ గ్రూప్ ఇన్నోవేషన్ గ్రూపులో ప్రభుత్వం, అకాడెమియా, ఇండస్ట్రీ అసోసియేషన్, టిఎస్ డీఎస్ఐ(టెలికామ్ స్టాండర్డ్స్ డెవలప్ మెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా) సభ్యులుగా ఉంటారు. 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేయడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సహాయంతో 6జి టెక్నాలజీని రూపొందించనున్నట్లు కమ్యూనికేషన్ శాఖ మంత్రి వైష్నావ్ గతంలో పేర్కొన్నారు. 2024 లేదా 2025 ఏడాది ప్రారంభంలో ఈ 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. -
5జీ స్పెక్ట్రమ్ వేలంపై కీలక ప్రకటన చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2022) ఏప్రిల్-మే మధ్య 5జీ స్పెక్ట్రమ్ వేలం జరిగే అవకాశం ఉన్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్నావ్ గురువారం తెలిపారు. టెలికాం ఆపరేటర్ల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన చర్యలు మొదటి సంస్కరణలుగా చెప్పారు. "రాబోయే 2-3 సంవత్సరాలలో టెలికామ్ నియంత్రణ వ్యవస్థ మారాలి" అని వైష్ణవ్ తెలిపారు. ఒక మీడియా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ టెలికామ్ సెక్టార్ రెగ్యులేషన్‌ను ప్రపంచ ఉత్తమంగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. "కాబట్టి, ఇక మేము టెలికామ్ పరంగా వరుస సంస్కరణలతో వస్తాము" అని అన్నారు. 5జీ వేలం కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సంప్రదింపులు జరుపుతోందని మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. "ఫిబ్రవరి మధ్య నాటికి వారు తమ నివేదికను సమర్పిస్తారని నేను అనుకుంటున్నాను. బహుశా ఫిబ్రవరి చివరి వరకు/గరిష్టంగా మార్చి వరకు. ఆ వెంటనే మేము వేలం వేస్తాం" అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5జీ వేలం నిర్వహించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటి) ఇంతకు ముందు ఆశాభావం వ్యక్తం చేయడంతో ఈ మాటలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాబోయే 5జీ వేలం నిర్దిష్ట కాలవ్యవధిని పేర్కొనడం ఈ దశలో కష్టమవుతుంది. ఎందుకంటే ట్రాయ్ తన అభిప్రాయాలను ఖరారు చేసే పట్టే సమయంపై చాలా ఆధారపడి ఉంటుంది అని మంత్రి తెలిపారు. (చదవండి: యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే!) "కానీ, మా అంచనా ప్రకారం ఏప్రిల్-మేలో వేలం వేయవచ్చు. నేను ఇంతకు ముందు మార్చి ఆని అంచనా వేశాను. కానీ, సమయం పడుతుందని నేను అనుకుంటున్నాను.. సంప్రదింపులు ప్రక్రియ సంక్లిష్టమైనవి కాబట్టి, విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి గ్రౌండ్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నందున, బహుళ బ్యాండ్లలోని రేడియోవేవ్‌లకు సంబంధించిన ధర, క్వాంటం, ఇతర విధానాలపై సిఫార్సులను కోరుతూ డీఓటి ట్రాయ్‌ని సంప్రదించిందన్నారు. వీటిలో 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్ లతో పాటు 3,300-3,600 మెగాహెర్ట్జ్ బ్యాండ్లు(అవి గత వేలంలో లేవు) ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన చివరి రౌండ్ స్పెక్ట్రమ్ వేలంలో 855.6 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు ₹77,800 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి అని అన్నారు. -
అప్పుడే 6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇంకా 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్ జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించాయి. ఈ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు పేర్కొంది. దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ స్పీడ్ ను నమోదు చేసింది. అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీ వాణిజ్యీకరణపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సి-డిఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సీ-డీఓటీకి సూచించారు. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటితో పోటీగా మన దేశంలో కూడా నూతన టెక్నాలజీల పనిచేయాలని డీఓటీ పేర్కొంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్టైన్మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను 6జీ పెంచనుంది. -
టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్) బకాయిలను తిరిగి లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించిన టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం కంపెనీలు పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఉన్నత న్యాయస్థానం టెలికామ్ కంపెనీలకు ఏజీఆర్ బకాయిలను 10 ఏళ్ల కాలం(2030 వరకు)లో తిరిగి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఏజీఆర్ బకాయిలను ప్రతి సంవత్సరం 10 శాతానికి సమానంగా చెల్లించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి మొదటి విడతగా కంపెనీలు మార్చి 31, 2021లోపు 10 శాతం బకాయిలను చెల్లించాలి. ఏజీఆర్ చార్జీల లెక్కింపునకు సంబంధించి టెలికామ్ విభాగం(డీఒటీ) అనుసరించిన విధానంలో దోషాలు ఉన్నట్లు టెలికాం కంపెనీలు ఆరోపించాయి. ఈ దోషాలను సవరిస్తే కంపెనీలు చెల్లించాల్సిన బకాయలు చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నాయి. మొదట విడత బకాయి నిదులు చెల్లించకపోవడంతో మళ్లీ ఈ వివాదం తిరిగి కోర్టుకు వచ్చింది. ఏజీఆర్ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి పెట్టుకున్న అభ్యర్థనను తోసిపుచ్చింది, ఏజీఆర్ ఛార్జీలను 10 వార్షిక వాయిదాల్లో చెల్లించాలని ఏప్రిల్ 1న జారీ చేసిన ఆదేశాల్లోనే పునఃలెక్కింపును కోర్టు నిషేధించిందని నేటి తీర్పులో ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఏజీఆర్ ఛార్జీలను తిరిగి లెక్కించడం కుదరని తేల్చి చెప్పింది. వొడాఫోన్-ఐడియా రూ.58,254 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు, టాటా టెలిసర్వీసెస్ రూ.16,798 కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నాయి. -
ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ చేస్తే, భారీ జరిమానా: ట్రాయ్
సాక్షి, న్యూఢిల్లీ: అవాంఛనీయ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు నిబంధనలను కఠినతరం చేసింది. రూ.10,000 వరకు జరిమానా విధింపుతోపాటు, టెలీమార్కెట్లకు కనెక్షన్ల తొలగింపు కూడా ఇందులో భాగంగా ఉండనుంది. మళ్లి మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదని ట్రాయ్ హెచ్చరించింది. 50 ఉల్లంఘనల తరువాత టెలిమార్కెటర్లు చేసే ప్రతీకాల్, లేదా ఎస్ఎంఎస్కు రూ. 10వేల దాకా పెనాల్టీ ఆ తరువాత కూడా ఉల్లంఘన కొనసాగితే, సంబంధిత ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లను రెండేళ్లపాటు బ్లాక్ చేయనుంది. ‘‘టెలికం చందాదారులు ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా ఉండేందుకు ‘ఎస్ఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1909’కు పంపించాలి. దీంతో లావాదేవీల సమాచారం మినహా అన్ని రకాల ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది’’అని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) తన నోటీస్‌లో పేర్కొంది. కేంద్ర స్థాయిలో టెలికం శాఖ ఒక డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను (డీఐయూ) ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, లైసెన్స్డ్ సర్వీస్ ప్రాంతంలోని క్షేత్రస్థాయి యూనిట్లలో టెలికం అనలైసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (టీఏఎఫ్‌సీవోపీ)ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నాయి. జరిమానాలు.. ట్రాయ్ విడుదల చేసిన నోటీస్ ప్రకారం.. రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ నుంచి అవాంఛనీయ వాణిజ్య సమాచారం వినియోగదారులకు వెళితే పలు రకాల పెనాల్టీలను విధించనున్నారు. తొలుత రూ.1,000 జరిమానాతో సరిపెట్టి.. ఆ తర్వాత నిబంధన ఉల్లంఘనకు రూ.5,000 చొప్పున జరిమానా విధించడంతోపాటు.. కనెక్షన్ రద్దు చేయడానికి సంబంధించి హెచ్చరిక జారీ అవుతుంది. మూడో ఉల్లంఘనను గుర్తిస్తే రూ.10,000 జరిమానాతోపాటు కనెక్షన్‌ను కూడా రద్దు చేయనున్నారు. ఇక నమోదు చేసుకోని టెలీమార్కెటర్ నుంచి అవాంఛనీయ కాల్ లేదా సందేశం వస్తే.. సంబంధిత టెలికం కనెక్షన్‌ను గుర్తిస్తారు. రోజుకు 20 కాల్స్, 20ఎస్ఎంఎస్ల పరిమితి అమల్లోకి వస్తుంది. గుర్తింపు ధ్రువీకరణ పూర్తయ్యే వరకూ డేటా వినియోగానికి అవకాశం ఉండదు. సిమ్‌లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ గైడ్‌లైన్స్ 2018 కింద అమలు చేయాల్సి ఉంటుందని ట్రాయ్ పేర్కొంది. -
ఎయిర్టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?
గుర్గావ్: కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశంలోని టెలికాం సంస్థలకు 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రయిల్స్ లో భాగంగా ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీతో సహా ఇతర నాలుగు భారతీయ టెలికం సర్కిల్‌లలో ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రంను డీఓటి కేటాయించింది. 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకున్న ఎయిర్టెల్ ఎయిర్టెల్ దేశంలోని ఇతర ప్రాంతాలలో మిడ్-స్పెక్ట్రంను పరీక్షించే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ టెలికాం నివేదిక ప్రకారం.. ఈ ట్రయిల్స్ లో 1 జీబీపీఎస్ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఎయిర్‌టెల్‌కు 5జీ ట్రయల్ కోసం 3500 మెగాహెర్ట్జ్, 28 గిగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను కేటాయించినట్లు నివేదిక పేర్కొంది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(వి)లకు 700 మెగాహెర్ట్జ్, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌లను కేటాయించారు. 5జీ ట్రయిల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న టీఎస్‌పీలలో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్టిఎన్ఎల్ ఉన్నాయి. ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5జీ నెట్వర్క్ గేర్‌తో కలిసి పనిచేస్తోంది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ టెక్నాలజీ ప్రొవైడర్లతో టీఎస్పీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా, రిలయన్స్ జియో తన సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్ యొక్క వ్యవధి 6 నెలల మాత్రమే. ఇందులో పరికరాల సేకరణ, ఏర్పాటు కోసమే 2 నెలల పడుతుంది. ఈ ఏడాది జనవరిలో ఎన్ఎస్ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్టెల్ నిలిచింది. ఇప్పటికే ఉన్న టెక్నాలజీలతో పోల్చినప్పుడు 5జీ 10x స్పీడ్స్, 10 ఎక్స్ లేటెన్సీ, 100 ఎక్స్ కంకరెన్సీని అందించగలదని గతంలో ఎయిర్టెల్ నిరూపించింది. చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త! -
టెలికాం రంగంలోకి పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం పరికరాల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రూ.12,195 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీముకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. టెలికం శాఖ(డాట్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పథకంలో నమోదు చేసుకునే ప్రక్రియ శుక్రవారం (జూన్ 4న) ప్రారంభమై జూలై 3 దాకా కొనసాగుతుంది. అర్హత పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 దాకా పెట్టే పెట్టుబడులు, విక్రయాలపై ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని వర్తింపజేస్తారు. అధునాతన టెక్నాలజీ ఊతంతో దేశీ కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించడం స్కీము ప్రధాన లక్ష్యమని డాట్ వెల్లడించింది. ఈ పథకం ఊతంతో వచ్చే అయిదేళ్లలో దేశీయంగా రూ. 2.44 లక్షల కోట్ల విలువ చేసే టెలికం పరికరాల ఉత్పత్తి జరగగలదని అంచనా. టెలికం పీఎల్ఐ ద్వారా సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో దాదాపు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులు రానుండగా, రూ.17,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరగలదని అంచనాలు ఉన్నాయి. దేశ, విదేశ కంపెనీలు.. చిన్న, మధ్య తరహా సంస్థలు దీని కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి.. ఎంఎస్ఎంఈలకు రూ.10 కోట్లుగాను, ఇతర సంస్థలకు రూ.100 కోట్లుగాను ఉంటుంది. స్థలం, నిర్మాణ వ్యయాలను పెట్టుబడి కింద పరిగణించరు. ఎరిక్సన్, నోకియా, హెచ్ఎఫ్సీఎల్ వంటి అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు విస్తరించడంపై ఆసక్తిగా ఉన్నాయి. స్టీల్, ఆటో, జౌళి రంగాలు త్వరలో నోటిఫై ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి రంగాల్లో అమలుకుగాను ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐ) కేంద్రం త్వరలో నోటిఫై చేయనుంది. తద్వారా ఈ పథకం కింద ఆయా రంగాల్లో పెట్టుబడులకు సంబంధిత సంస్థలకు వీలుకలుగుతుంది. పథకం అమలుకు సంబంధించి ప్రకటించిన నోటిఫికేషన్ విధివిధానాలకు అనుగుణంగా సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకోగలుగుతాయి. అనంతరం దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే ఫార్మా, ఐటీ హార్డ్‌వేర్ వంటి రంగాలకు పీఎల్ఐ నోటిఫై జరిగింది. ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి వంటి రంగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీపీఐఐటీ(పారిశ్రామిక, అంతర్గత వాణిజాభివృద్ధి శాఖ) అదనపు కార్యదర్శి సుమితా దావ్రా గురువారం జరిగిన ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ వెబినార్‌లో వెల్లడించారు. భారత్ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేయడానికి వీలుగా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితికిగాను రూ.2 లక్షల కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 13 రంగాలకు ఈ పథకం కింద రాయితీలు వర్తిస్తాయి. ఏసీసీ బ్యాటరీ, సోలార్ మాడ్యూల్స్ విభాగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. సప్లై చైన్ సవాళ్ల పరిష్కారం, తయారీ రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులకు కూడా తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వెబినార్‌లో సుమితా దావ్రా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ స్కీమ్ దోహదపడుతుందన్నారు. చదవండి: భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ సగటు వినియోగం -
ల్యాండ్‌లైన్ వాడుతున్నారా? కొత్త నిబంధన
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా ల్యాండ్‌లైన్ వినియోగదారులకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇకనుంచి దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా సున్నా (0) ను చేర్చాలని తాజాగా తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుందని స్పష్టం చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ప్రతిపాదనకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాట్ వెల్లడించింది. ఈ మేరకు టెలికాం సంస్థలు తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది. జనవరి 1వ తేదీనుంచి ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఏదైనా మొబైల్ నంబర్‌కు కాల్ చేయడానికి ముందు సున్నా జోడించాల్సి ఉంటుందని టెలికమ్యూనికేషన్ విభాగం తాజా సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డాట్ అన్ని టెలికం కంపెనీలను కోరింది. అలాగే కొత్త మార్పుల గురించి ల్యాండ్‌లైన్ వినియోగదారులకు త్వరలో తెలియ జేయనున్నట్లు కూడా తెలిపింది. అలాగే ల్యాండ్‌లైన్ నుంచి సున్నాను చేర్చకుండా డయల్ చేసిన యూజర్లకు క్రమం తప్పకుండా ప్రతీసారి ఈ హెచ్చరికను వినిపించాలని డాట్ పేర్కొంది. వినియోగదారులకు సున్నా డయిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సంస్థలను తన సర్క్యులర్‌లో ఆదేశించింది. కొత్త నేషనల్ నంబరింగ్ ప్లాన్ (ఎన్‌ఎన్‌పి) ను త్వరగా జారీ చేయాలని కూడా సిఫారసు చేసింది. మరోవైపు 11 అంకెల మొబైల్ నంబరింగ్ ప్లాన్‌ను తిరస్కరించిన సంస్థ 10 అంకెల నంబరుకే ఆమోదం తెలిపింది. -
ఐటీ శాఖ శుభవార్త : దిగ్గజాలు హర్షం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు భారత ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోకరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసుకునే విధానాన్ని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై నాస్కాంతోపాటు పలువురు ఐటీ కంపెనీ అధినేతలు హర్షం ప్రకటించారు. భారతీయ ఐటీ పరిశ్రమ వ్యాపార నిర్వహణకు, ఐటీ ఉద్యోగుల రక్షణకు బలమైన సహకారాన్ని అందిస్తున్నారంటూ నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్జానీ ఘోష్ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ధన్యావాదాలు తెలిపారు. మొదటినుంచి తమకు భారీ మద్దతు అందిస్తున్నకేంద్రానికి విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అవకాశం కల్పించిన డాట్‌కు బిగ్ థ్యాంక్స్ అంటూ టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని ట్వీట్ చేశారు. కాగా దేశంలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా చాలా వరకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ఏప్రిల్ 30 వరకు వర్క్ ఫ్రం హోం విధానానికి అనుమతినిచ్చిన కేంద్రం, కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలోతరువాత ఈ గడువును జూలై 31 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఐటీ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని పొడిగించడం విశేషం. Once again a big thank you from the IT fraternity to @DoT_India @GoI_MeitY @rsprasad for extending the OSP relaxations. Great step to ensure business operates seamlessly in the current environment. pic.twitter.com/EID8HGC8dU — CP Gurnani (@C_P_Gurnani) July 22, 2020 Thank you to the government for their tremendous support on the new ways of working from day 1. This has helped tremendously in further elevating our standing and responsiveness globally. @rsprasad @DoT_India https://t.co/ewvTTgvgKr — Rishad Premji (@RishadPremji) July 21, 2020 -
షాకింగ్ : నిమిషానికి ఆరు పైసలా?!
సాక్షి, ముంబై: అష్టకష్టాలతో దివాలా దిశగా పయనిస్తున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా సంచలన ప్రతిపాదనలు చేసింది. ఆర్థికంగా భారీ నష్టాలకు తోడు ఏజీఆర్ బకాయిల చెల్లింపు వివాదంతో మరింత కుదేలైన సంస్థ మొబైల్ డేటా, కాల్ చార్జీలపై కొన్ని సవరణలు చేయాలని కోరుతోంది. డేటా చార్జీలను కనీసం 7 రెట్లు , కాల్ చార్జీలను 8 రెట్లు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది. దీంతో వొడాఫోన్ ఐడియా వినియోగదారులు షాక్ తిన్నారు. మొబైల్ డేటా చార్జీని ఒక జీబీకి రూ. 35 వుండాలని,( ప్రస్తుతం జీబీకి రూ. 4-5) అవుట్ గోయింగ్ కాలింగ్ చార్జి నిమిషానికి 6 పైసలుగా( మంత్లీ చార్జీ కాక) నిర్ణయించాలని డాట్‌కు రాసిన లేఖలో వొడాఫోన్ ఐడియా కోరింది. దీంతోపాటు కనీస నెలవారీ కనెక్షన్ ఛార్జీ రూ. 50లుగా ఉంచాలని ప్రతిపాదించింది. ఏజీఆర్ బకాయిలు చెల్లించేందుకు సహాయపడటానికి ఏప్రిల్ 1 నుంచి ప్రతిపాదిత రేట్లను అమలు చేయాలని కోరుతోంది. మార్కెట్ వాటా తగ్గడం మరియు ప్రభుత్వానికి ఎజిఆర్ బకాయిలు చెల్లించడం వల్ల కంపెనీ గత కొన్ని వారాలలో భారీ నష్టాలతో సహా ఆర్థిక ఇబ్బందులను వెల్లడించింది. కాగా ఏజీఆర్ బకాయిలకు సంబంధించి వోడాఫోన్ ఐడియా ప్రభుత్వం చెల్లించాల్సింది. మొత్తం రూ. 53,000 కోట్లు. ఈ బకాయిల్లో కంపెనీ ఇప్పటికే రూ 3500 కోట్లు చెల్లించగా, స్వయం మదింపు ఆధారంగా రూ 23,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ 7000 కోట్లు అసలు మొత్తం. మరోవైపు బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని, బకాయిలు చెల్లించడానికి 18 సంవత్సరాల సమయం కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్, జియో కూడా టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. చదవండి : చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్ -
టెల్కోలకు మరిన్ని కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) చెల్లింపుల సంక్షోభం దేశీయ టెలికాం కంపెనీల మెడకు మరింత గట్టిగా బిగుస్తోంది. ఒకవైపు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడ్డ టెలికాం సంస్థలు తమ బకాయిలను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్టెల్ రూ. 10వేలకోట్లు, వోడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది. మరోవైపు టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించనందుకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలిసర్వీస్‌లకు ఈ వారం తాజా నోటీసులు జారీ చేయనుంది. అలాగే బ్యాంక్ హామీలను అంగీకరించే అవకాశం వుందని, అయితే మార్చి 17 లోపు చేయాలా వద్దా అనే దానిపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరినట్టు డాట్ వెల్లడించింది. టాటా టెలీ సర్వీసెస్ ప్రకటనపై డాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ బకాయిలు రూ .2,197 కోట్ల 'ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్' చేసినట్టు టాటా టెలిసర్వీసెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాట్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతూ టాటా టెలీ సర్వీసెస్‌కు ప్రత్యేక నోటీసు జారీ చేయనుంది. కంపెనీ మొత్తం బకాయిలు రూ. 14,000 కోట్లని డాట్ స్పష్టం చేసింది. మొత్తంపై వడ్డీ (పెనాల్టీతో పాటు), పెనాల్టీపై వడ్డీని చెల్లించలేదని డాట్ అధికారి తెలిపారు. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా టాటా టెలీ సర్వీసెస్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గురువారం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు. ఇంతకుముందెన్నడూ లేని ఈ అసాధారణ సంక్షోభంలో టెలికాం రంగానికి పన్నులు, సుంకాలను తగ్గించాలని కోరారు. అలాగే బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించటానికి ఎయిర్టెల్ కట్టుబడి ఉందని మిట్టల్ చెప్పారు. మిగిలిన ఏజీఆర్ బకాయిల చెల్లింపులను వేగవంతం చేశామన్నారు. మార్చి 17 వరకు సమయం ఉందని, కంపెనీ తన బకాయిలను అంతకు ముందే చెల్లిస్తుందని వెల్లడించారు. కాగా బకాయిల చెల్లింపుల ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. -
వోడాఫోన్ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్
సాక్షి, న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డాట్)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించింది. ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను చెల్లించిన సంస్థ తాజాగా మరో దఫా చెల్లింపులు చేసింది. డీఓటీ గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ ఛార్జీల బాకీల కింద వోడాఫోన్ ఐడియా రూ.53వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి మరో దిగ్గజ టెల్కో భారతి ఎయిర్టెల్ రూ.10వేల కోట్లన ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. అలాగే టాటా టెలిసర్వీసెస్ మొత్తం రూ.14వే కోట్లు చెల్లించాల్సి ఉండగా, సోమవారం రూ.2,197 కోట్లను చెల్లించింది. మరోవైపు ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి బకాయిల రికవరీ కోసం టాటా టెలిసర్వీస్‌కు నోటీసులు కూడా పంపుతామని డిఓటి వర్గాలు తెలిపాయని పీటీఐ తెలిపింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా షేర్లు 18.85 శాతం పెరిగి బిఎస్ఇలో రూ .4.98 ను తాకింది. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం -
ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: ఏజీఆర్ వివాదంలో చిక్కుకున్న టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) సంబంధిత బకాయిలను రాబోయే కొద్ది రోజుల్లో టెలీకమ్యూనికేషన్ విభాగానికి (డాట్) జమ చేయనున్నట్లు వోడాఫోన్ ఐడియా శనివారం తెలిపింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారాన్ని అందించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, డాట్ విధించిన డెడ్‌లైన్ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో కంపెనీ బోర్డు ప్రత్యేకంగా సమావేశ మైంది. డాంట్ అంచనాల ప్రకారం, వోడాఫోన్ ఐడియా బకాయిలు మొత్తం రూ .53,038 కోట్లు. వీటిలో రూ.24,729 కోట్ల స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కాగా, లైసెన్స్ ఫీజు రూ.28,309 కోట్లు. మరోవైపు శుక్రవారం అర్థరాత్రిలోపు బకాయిలు చెల్లించాలని డాట్ విధించిన గడువుపై తక్షణమే స్పందించిన మరో దిగ్గజ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ ఫిబ్రవరి 20న రూ. 10వేల కోట్లు, కోర్టువిచారణ లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తామని ప్రకటించింది. కాగా టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో విలీనం తరువాత అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్ ఇండియా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. దీనికితోడు కస్టమర్ల సంఖ్య కూడా క్రమేపీ క్షీణిస్తోంది. దీనికి ఏజీఆర్ బకాయిల అంశం అగ్నికి ఆజ్యంలా తోడైంది. ఈ నేపథ్యంలోనే తమకు ఉపశమనం కల్పించకపోతే కంపెనీనీ మూసుకోవాల్సి వస్తుందని ఇటీవల వ్యాఖ్యానించింది. ఇది ఇలా వుండగా తాజాగా వరుసగా ఆరవ త్రైమాసికంలో కూడా కంపెనీ నష్టాలనే ప్రకటించింది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో, రూ .6,439 కోట్ల నికర నష్టాన్ని మూట గట్టుకుంది. అటు స్టాక్మార్కెట్లో కంపనీ షేరు భారీగా పతనమైంది. ఏజీఆర్ సంక్షోభంతో కంపెనీ దివాలా ప్రకటిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యాపించాయి. మొండిపద్దుల గుదిబండ తమ మెడకుచుట్టుకుంటుందనే ఆందోలన అటు బ్యాంకింగ్ రంగంలో కూడా నెలకొంది. టెలికాం కంపెనీలు రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదైనా కంపెనీ దివాలా ప్రకటిస్తే.. దానికి బ్యాంకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజా ప్రకటనతో ఈ అంచనాలకు తెరపడింది. ఏజీఆర్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 17వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చదవండి : టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్ రూ.10 వేల కోట్లు కడతాం టెల్కోలపై సుప్రీం కన్నెర్ర! -
రూ.10 వేల కోట్లు కడతాం
సాక్షి,న్యూఢిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల చెల్లింపులపై డాట్ తాజా ఆదేశాలపై ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ స్పందించింది. ఫిబ్రవరి 20 వ తేదీ నాటికి రూ.10వేల కోట్ల చెల్లిస్తామని తెలిపింది. మిగిలిన బకాయిలను తదుపరి విచారణ సమయాని కంటే ముందే సర్దుబాటు చేస్తామని వివరించింది. గౌరవనీయమైన సుప్రీంకోర్టు తీర్పు , అనంతరం టెలికాం విభాగం ఆదేశాలకు అనుగుణంగా, భారతి గ్రూప్ కంపెనీల తరపున 2020 ఫిబ్రవరి 20 నాటికి రూ .10,000 కోట్లు (ఖాతాలో) జమ చేస్తామని ఎయిర్టెల్ తెలిపింది. ఈ మేరకు డాట్ ప్రతినిధి( (ఫైనాన్స్) ఒక లేఖ రాసింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీతో సహా దాదాపు రూ .35,586 కోట్లను ఎయిర్టెల్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. చదవండి : టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్ -
టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టెలికాం విభాగం (డాట్) మరోషాక్ ఇచ్చింది. రాత్రి 11. 59 నిమిషాల్లోపు బకాయిలు చెల్లించాలని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం గడువు విధించింది. శుక్రవారం అర్థరాత్రి లోపు మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. బకాయిల వసూళ్లపై సుప్రీంకోర్టు డాట్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తమకు ఉపశమనం లభిస్తుందని ఎదురు చూస్తున్న టెల్కోలకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా వోడాఫోన్‌ఐడియాకు ఈ సమయంలో బకాయిలు చెల్లించడం తలకుమించిన భారమే. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వోడాఫోన్ ఐడియా షేరు భారీగా నష్టపోయింది. కాగా ఏజీఆర్ బకాయిల విషయంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. రూ .1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు చెల్లించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు వారిపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని సుప్రీం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొత్తం టెలికాం విభాగానికి రూ .88,624 కోట్లు చెల్లించాల్సివుంది. రిలయన్స్ జియో రూ.177 కోట్లను ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం -
టెలికంలో భారీగా ఉద్యోగాల కోత
సాక్షి, ముంబై: సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్) పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశీయ టెలికం కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. టెలికం సెక్టార్‌లోకి రిలయన్స్ జియో రాకతో కుదేలైన ఈ రంగానికి ఏజీఆర్‌పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకీభవించిన సుప్రీం కోర్టు తీర్పు అశనిపాతంలా తగిలింది. టెలికాం (డాట్) విభాగానికి టెల్కోస్ రూ .92,641 కోట్లను వడ్డీతో సహా చెల్లించాల్సిందేనన్న సుప్రీం తీర్పు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న టెల్కోల లాభదాయకతను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతో టెలికాం కంపెనీలు తమ శ్రామిక శక్తిని 20 శాతం తగ్గించాల్సి ఉంటుంది. అంతేకాదు రానున్న కాలంలో ఉద్యోగులను తీసివేసే శాతం మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్) వివాదంలో తాజా తీర్పు ప్రకారం టెలికం రంగం మొత్తం సుమారు రూ 1.3 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లో ప్రభుత్వానికి చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే వరకు తాజా నియామకాలు చేపట్టరాదనే నిర్ణయంతోపాటు, ఉన్న ఉద్యోగాల్లో కూడా కోతలకు మొగ్గు చూపుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో భారత టెలికాం రంగంలో సుమారు 40వేల ఉద్యోగాల కోతకు దారితీయనుంది. అంతేకాదు ఆపరేటర్లలో ఎవరైనా దివాలా కోసం దాఖలు చేస్తే మరింత పెరగవచ్చు అని సీఐఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్, సీఈఓ ఆదిత్య నారాయణ మిశ్రా చెప్పారు. టెల్కోస్, టవర్స్ కంపెనీలు ,ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎఎస్‌పీ) లను కలిగి ఉన్న ఈ రంగంలో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, చాలా ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. కొన్ని కంపెనీలు దివాలా తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో మధ్య నుండి సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని ఆయన అన్నారు. అలాగే గత మూడేళ్ళలో, నియామకం గణనీయంగా తగ్గింది. సీనియర్ స్థాయిలో పదవులు భర్తీ కావడంలేదనీ హెచ్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. ప్రధానంగా భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి సంస్థల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కానుంది. డాట్ గణాంకాల ప్రకారం ఎయిర్టెల్ మొత్తంలో 23.4 శాతం (రూ. 21,682 కోట్లు) చెల్లించాల్సి ఉండగా, వొడాఫోన్ ఐడియా 30.55 శాతం (రూ. 28,308 కోట్లు) చెల్లించాల్సింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను నవంబర్ 14 వరకు వాయిదా వేయవలసి వచ్చింది. ఉదాహరణకు, జూన్ 2019 తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్టెల్ 2,392.2 కోట్ల రూపాయల నికర నష్టాలను నమోదు చేసింది. వోడాఫోన్ ఐడియా త్రైమాసికంలో రూ .4,873.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కాగా 2016 సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో ఎంట్రీ తరువాత రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టెలినార్ లాంటి ఇతర సంస్థలు మూతతో ఈ రంగం పరిమాణం 30 శాతానికి పైగా తగ్గిపోయింది. అలాగే వొడాఫోన్, ఐడియా విలీనం తరువాత భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. మరోవైపు ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించి, తగిన సలహాలిచ్చేందుకు కేంద్రం ఒక సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో ఈ కమిటి ఏర్పాటైన సంగతి తెలిసిందే. చదవండి : టెల్కోలకు భారీ ఊరట లభించనుందా? -
టెలికం కంపెనీలకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ టెలికం కంపెనీలకు భారీ షాక్ తగిలింది. చార్జీల వసూలుపై సుప్రీంకోర్టు కేంద్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) నిర్దేశించిన అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ( ఏజీఆర్\) నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీం గురువారం తీర్పుచెప్పింది. దీనికి డాట్ విధించిన జరిమానాను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు చెప్పింది. టెల్కోలు లేవనెత్తిన అంశాలను పనికిరానివని కొట్టిపారేయడమే కాకుండా.. వడ్డీ తో సహా జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఏఏ నజీర్, ఎంఆర్‌షాలతోకూడిన సుప్రీం ధర్మాసంన ఈ తీర్పును వెలువరించింది. దీంతో ఏజీఆర్ ఫీజుపై మొబైల్ ఆపరేటర్లు, ప్రభుత్వానికి మధ్య సాగిన 14 సంవత్సరాల న్యాయ పోరాటం ముగిసింది. అంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ .92,642 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది, అందులో సగానికి పైగా ఎయిర్టెల్, వొడాఫోన్ చెల్లించాల్సి ఉంది. డాట్ లెక్కల ప్రకారం భారతి ఎయిర్టెల్ రూ .21,682 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .28,309 కోట్లు, ఎమ్టీఎన్ఎల్ రూ.2 వేల 537 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. డాట్ రూల్స్ ప్రకారం అడ్జెస్టెట్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) లో ఎనిమిది శాతం లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. ఏజీఆర్ స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్సింగ్ ఫీజులుగా విభజించారు. ఐదుశాతం ఎస్‌యూసీతోపాట, ఎక్కువ స్పెక్ట్రాన్ని సేకరించిన మొబైల్ సంస్థ ఓటీఎస్‌సీ కూడా చెల్లించాలి. ఒక్కో సర్కిల్ లో 4.4 మెగాహెజ్ ల కంటే ఎక్కువ స్పెక్ట్రం ఉన్నా మార్కెట్ ధరలు చెల్లించాల్సిందే! మరోవైపు ఈ తీర్పుతో భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ షేర్లు 4.9 శాతం, వోడాఫోన్ ఐడియా 13.3 శాతం పతనాన్ని నమోదు చేసాయి. -
జియో బ్యాన్ చేసిందా? యూజర్లకు షాకేనా?
సాక్షి, ముంబై: టెలికాం మార్కెట్లోకి సంచలనంలా దూసుకు వచ్చిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలనం నిర్ణయం తీసుకుందా? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తాజా ఆదేశాలకనుగుణంగా తన నెట్‌వర్క్‌లో పోర్న్వెబ్సైట్లను బ్లాక్ చేసింది. ఈ సైట్లకు యాక్సెస్ లభించడం లేదంటూ పలువురి జియో యూజర్ల అనుభవాన్ని బట్టిచూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఈ మేరకు ఒక యూజర్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూ పోస్ట్ పెట్టారు. దీంతో మరికొంత మంది యూజర్లు ప్రయత్నించారు. వారికీ ఇదే అనుభవం ఎదురైంది. జియో నెట్‌వర్క్‌లో పోర్న్‌హబ్, ఎక్స్ వీడియోస్ సహా దాదాపు వందలాది వెబ్సైట్లు బ్లాక్ అయ్యాయి. దీంతో ఇటీవల టెలికాం శాఖ ఆదేశాలను జియో పాటిస్తూ పోర్న్ వెబ్సైట్లను నిషేధించినట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాల ప్రకారం జియో వీడియో వినియోగం మందగించినప్పటికీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం. అయితే మిగతా నెట్‌వర్క్‌లో ఇంకా ఈ ఆదేశాలు ఇంకా అమల్లోకి వచ్చినట్టు లేదు. మొత్తం 857 పోర్న్ వెబ్సైట్లను నిషేధించాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు సెప్టెంబర్ 27, 2018న ఆదేశించింది. జూలై 31,2015లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ఆదేశాలకు కొనసాగింపుగానే ఈ ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. అయితే ఐటీ మంత్రిత్వ శాఖ ఇందులో 30 వెబ్సైట్లలో ఎలాంటి పోర్న్ కంటెంట్ లేనందున వాటికి మినహాయింపు ఇచ్చింది. మిగిలిన మొత్తం 827 పోర్న్ వెబ్సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా టెలికాంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే సర్వీస్ ప్రొవైడర్ల లైసెన్సులను రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. -
ఆధార్ నెంబర్‌ను తొలగించేసింది
న్యూఢిల్లీ : డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తప్పనిసరి జాబితా నుంచి ఆధార్ నెంబర్‌ను తొలగించేసింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా తమ డేటాబేస్‌లో నమోదు చేసే మొబైల్ సబ్స్క్రైబర్ల 29 పారామీటర్ లిస్ట్ నుంచి ఆధార్ నెంబర్‌ను తొలగిస్తున్నట్టు డీఓటీ పేర్కొంది. దీంతో వర్చ్యువల్ ఐడీ వాడకానికి మార్గం సుగమం అయింది. కొత్త సిమ్ కొనుగోలు చేసేటప్పుడు లేదా పాత దాన్ని పునఃసమీక్షించేటప్పుడు ఈ-కేవైసీ ప్రక్రియలో ఆధార్ నెంబర్‌కు ప్రత్యామ్నాయంగా ఇక నుంచి ఈ వర్చ్యువల్ ఐడీని ఉపయోగించుకోవచ్చు. ధృవీకరణ సమయంలో ఆధార్ నెంబర్ హోల్డర్ భద్రతను, గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు, ఆధార్ ఎకోసిస్టమ్‌లో యూఐడీఏఐ కొన్ని మార్పులను ప్రతిపాదించినట్టు డీఓటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ సర్క్యూలర్‌ను జారీచేసింది. వర్చ్యువల్ ఐడీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం, కొత్త సిస్టమ్‌లోకి తరలి వెళ్లడం వంటి వాటిని టెలికాం ఆపరేటర్లు అమలు చేయాలని డీఓటీ ఆదేశించింది. ఏప్రిల్‌లోనే యూఐడీఏఐ 16 అంకెల వర్చ్యువల్ ఐడీ సౌకర్యాన్ని లాంచ్ చేసింది. ఈ వర్చ్యువల్ ఐడీని, 12 అంకెల ఆధార్ నెంబర్‌కు బదులుగా ధృవీకరణ కోసం వాడుకోవచ్చు. కొత్త మొబైల్ సిమ్ కొనుగోలు చేసేందుకు, పాత నెంబర్‌ను సమీక్షించుకునేందుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని అంతకముందు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లింకేజీని తప్పనిసరి చేయాలా? లేదా? అనే విషయంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రైవేట్, పబ్లిక్ సర్వీసులకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తే, వ్యక్తుల గోప్యత హక్కులను కాల రాసినట్టే అవుతుందని పిటిషన్‌దారులు చెబుతున్నారు. ఆధార్ విషయంలో తమ తుది తీర్పు వచ్చే వరకు ఆధార్ నెంబర్‌ను మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా ఏ సర్వీసులకు తప్పనిసరిగా లింక్ చేయాల్సినవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈ-కామర్స్‌కు డొమైన్ బూస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు భారత్ వేదిక కానుంది. డాట్(.) భారత్ ఎక్స్టెన్షన్ రాకతో ఇప్పుడు ఇంగ్లీషు రానివారు సైతం నెట్లో విహరించేందుకు మార్గం సుగమం అయింది. ఇంటర్నెట్ విషయంలో అత్యంత వేగంగా వద్ది చెందుతున్న భారత్‌లో ప్రధాన అడ్డంకి దాదాపు తొలగిపోయినట్టే. ఉత్పత్తులు, సేవలు, విద్య తదితర రంగ సంస్థలు ఇక నుంచి తమ వెబ్సైట్లను స్థానిక భాషల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. రంగమేదైనా సమాచారం స్థానిక భాషలో తెలుసుకునేందుకు సామాన్యుడికి వీలైంది. రానున్నరోజుల్లో ఈ-కామర్స్‌తోపాటు సమాచార, సాంకేతిక రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయని నిపుణులు అంటున్నారు. ఏమిటీ డాట్ భారత్.. డొమైన్ పేర్లు ఇప్పటి వరకు ఇంగ్లీషులోనే ఉండేవి. డాట్ భారత్ ఎక్స్టెన్షన్ రాకతో హిందీ, మరాఠి, కొంకణి, మైథాలి, నెపాలీ, బోరో, డోగ్రి, సింధి భాషల్లో వెబ్సైట్ పేర్లను నమోదు చేసుకునే అవకాశం లభించింది. కొద్ది రోజుల్లోనే తెలుగుతో సహా బెంగాళి, గుజరాతి, ఉర్దూ, తమిళ్, పంజాబి భాషలకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. స్థానిక భాషలో ఇంటర్నెట్ వెబ్ చిరునామా (డొమైన్) టైప్ చేస్తే చాలు. ఉదాహరణకు ఠీఠీఠీ. ఎన్ఎండీసీ.భారత్ అన్నమాట. డాట్ భారత్ ఎక్స్‌టెన్షన్‌ను నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇం డియా(నిక్సి) అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఉన్న ‘డాట్ ఇన్’ డొమైన్ ఎక్స్టెన్షన్కు రిజిస్ట్రీగా నిక్సి వ్యవహరిస్తోంది. కంటెంట్కేం కొదవ లేదు..: ఏ వెబ్సైట్లో ఏముందో తెలుసుకోవడం ఇంగ్లీషు రానివారికి కష్టమే. ఇదంతా గతం. ఇప్పుడు నిక్సి చొరవతో ప్రపంచంలో ఏ మూలనున్నా, ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. చాలా వెబ్సైట్లు ఇప్పటికే స్థానిక భాషల్లో కంటెంట్(విషయం) అందిస్తున్నాయి. కంటెంట్ డెవలపర్లూ భారత్‌లో కోకొల్లలు. డెవలపర్లకూ ఇప్పుడు నూతన వ్యాపార వేదికలు దొరికినట్టే. కొత్త కొత్త యాప్స్ మార్కెట్లోకి వస్తాయి. విప్లవం ఇప్పుడే మొదలైందని అంటున్నారు డొమైన్ ఇన్వెస్టర్ అరవింద్ రెడ్డి. తెలుగు కీ బోర్డులు, కంటెంట్ విస్తృతమైతే సామాన్యుడికి చేరువ అయినట్టేనని చెబుతున్నారు. తెలుగు భాషను ఆధారంగా చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంత కాదన్నా 1,500 మంది యాప్ డెవలపర్లు ఉంటారని సమాచారం. వినియోగమూ పెరుగుతుంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని గూగుల్ చెబుతోంది. 2018 నాటికి 50 కోట్ల మందికిపైగా నెట్‌కు కనెక్ట్ అవుతారని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ అంటున్నారు. ప్రతి నెల 50 లక్షల మంది కొత్త వినియోగదారులు వచ్చి చేరుతున్నారు. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వాడేవారు 15.5 కోట్ల మంది ఉన్నారు. 2017 నాటికి వీరి సంఖ్య 48 కోట్లను తాకుతుందని సర్చ్ ఇంజన్ దిగ్గజం అంటోంది. డాట్ భారత్ ప్రవేశంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. అటు నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్(ఎన్‌వోఎఫ్‌ఎన్) ప్రాజెక్టులో భాగంగా 2017 ఏడాది నాటికి 2.50 లక్షల గ్రామ పంచాయితీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పించాలిని కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం రూ.35 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఆన్లైన్ అమ్మకాలకు బూస్ట్... వాటర్ బాటిళ్లు సైతం ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం సౌకర్యం. గుండు పిన్ను మొదలు విమానం దాకా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలు స్థానిక భాషల్లోనూ వెబ్సైట్లను తీర్చిదిద్దితే ఈ రంగంలో ఎవరూ ఊహించని అభివృద్ధి సాధ్యమవుతుందని నిక్సి సీఈవో గోవింద్ తెలిపారు. భారత్‌లో ఏ మూలనున్నా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ వ్యాపారం భారత్‌లో రూ.13,800 కోట్లుగా ఉందని... 2020 నాటికి ఇది 1.92 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశోధన సంస్థ టెక్నోప్యాక్ చెబుతోంది. ఎన్‌వోఎఫ్‌ఎన్ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో ఇ-కామర్స్ విస్పోటనం సంభవిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల వ్యాఖ్యానించారు.