సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా ల్యాండ్‌లైన్ వినియోగదారులకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇకనుంచి దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా సున్నా (0) ను చేర్చాలని తాజాగా తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుందని స్పష‍్టం చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ప్రతిపాదనకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాట్ వెల్లడించింది. ఈ మేరకు టెలికాం సంస్థలు తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది.
జనవరి 1వ తేదీనుంచి ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఏదైనా మొబైల్ నంబర్‌కు కాల్ చేయడానికి ముందు సున్నా జోడించాల్సి ఉంటుందని టెలికమ్యూనికేషన్ విభాగం తాజా సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డాట్ అన్ని టెలికం కంపెనీలను కోరింది. అలాగే కొత్త మార్పుల గురించి ల్యాండ్‌లైన్ వినియోగదారులకు త్వరలో తెలియ జేయనున్నట్లు కూడా తెలిపింది. అలాగే ల్యాండ్‌లైన్ నుంచి సున్నాను చేర్చకుండా డయల్ చేసిన యూజర్లకు క్రమం తప్పకుండా ప్రతీసారి ఈ హెచ్చరికను వినిపించాలని డాట్ పేర్కొంది. వినియోగదారులకు సున్నా డయిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సంస్థలను తన సర్క్యులర్‌లో ఆదేశించింది. కొత్త నేషనల్ నంబరింగ్ ప్లాన్ (ఎన్‌ఎన్‌పి) ను త్వరగా జారీ చేయాలని కూడా సిఫారసు చేసింది. మరోవైపు 11 అంకెల మొబైల్ నంబరింగ్ ప్లాన్‌ను తిరస్కరించిన సంస్థ 10 అంకెల నంబరుకే ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment