landline
-
ల్యాండ్‌లైన్ వాడుతున్నారా? కొత్త నిబంధన
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా ల్యాండ్‌లైన్ వినియోగదారులకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇకనుంచి దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా సున్నా (0) ను చేర్చాలని తాజాగా తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుందని స్పష్టం చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ప్రతిపాదనకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాట్ వెల్లడించింది. ఈ మేరకు టెలికాం సంస్థలు తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది. జనవరి 1వ తేదీనుంచి ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఏదైనా మొబైల్ నంబర్‌కు కాల్ చేయడానికి ముందు సున్నా జోడించాల్సి ఉంటుందని టెలికమ్యూనికేషన్ విభాగం తాజా సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డాట్ అన్ని టెలికం కంపెనీలను కోరింది. అలాగే కొత్త మార్పుల గురించి ల్యాండ్‌లైన్ వినియోగదారులకు త్వరలో తెలియ జేయనున్నట్లు కూడా తెలిపింది. అలాగే ల్యాండ్‌లైన్ నుంచి సున్నాను చేర్చకుండా డయల్ చేసిన యూజర్లకు క్రమం తప్పకుండా ప్రతీసారి ఈ హెచ్చరికను వినిపించాలని డాట్ పేర్కొంది. వినియోగదారులకు సున్నా డయిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సంస్థలను తన సర్క్యులర్‌లో ఆదేశించింది. కొత్త నేషనల్ నంబరింగ్ ప్లాన్ (ఎన్‌ఎన్‌పి) ను త్వరగా జారీ చేయాలని కూడా సిఫారసు చేసింది. మరోవైపు 11 అంకెల మొబైల్ నంబరింగ్ ప్లాన్‌ను తిరస్కరించిన సంస్థ 10 అంకెల నంబరుకే ఆమోదం తెలిపింది. -
బ్రాడ్‌బ్యాండ్‌తో కాల్స్ చేసుకోండిలా..
న్యూఢిల్లీ : సిగ్నల్స్ సరిగ్గా ఉండటం లేదా..? మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదా..? అయితే ఇక నుంచి మీ ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్‌బ్యాండ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చట. బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్ ఫోన్లకు, అదేవిధంగా ల్యాండ్లైన్లకు కాల్స్ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి. దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీకి అనుమతించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు మంగళవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం టెలిఫోనీ లైసెన్స్‌ను పొందే టెలికాం ఆపరేటర్లు, ఇతర కంపెనీలు సిమ్ అవసరం లేని కొత్త మొబైల్ నెంబర్‌ను ఆఫర్ చేయనున్నాయి. ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అక్టోబర్‌లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ ప్రతిపాదనలను రూపొందించింది. కాల్ డ్రాప్స్ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లను తీసుకొచ్చింది. అంతర్ మంత్రిత్వ టెలికాం కమీషన్ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ఆమోదంతో ఇక రిలయన్స్జియో, బీఎస్ఎన్, ఎయిర్టెల్ లాంటి టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించుకోవచ్చు. ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లతో యూజర్లకు ఎంతో మేలు చేకూరనుందని ట్రాయ్ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, వై-ఫై అందుబాటు చాలా బలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ సర్వీసుల కోసం యాక్టివేట్ చేసుకునే టెలిఫోనీ ఒక ఆఫరేటర్ది, మొబైల్ నెంబర్ మరో ఆపరేటర్‌ది అయితే, డౌన్లోడ్ చేసుకునే ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్ ఆపరేటర్ నెంబర్‌నే యూజర్లు పొందాల్సి ఉంటుంది. డౌన్లోడ్ యాప్, సర్వీసు ప్రొవైడర్ ఒకే ఆపరేటర్‌ది అయితే నెంబర్ మార్చుకోవాల్సినవసరం లేదని ట్రాయ్ అధికారులు చెప్పారు. -
పెళ్లి కాలానికి మళ్లీ వెళ్తే...
కొత్త బంగారం అమెరికన్ రచయిత్రి రెయిన్బో రవెల్ రాసిన ‘లాండ్‌లైన్’లో– జోర్జీ మిక్కోల్ పెళ్ళయి, ఇద్దరు పిల్లలున్న స్త్రీ. టీవీ సీరియళ్ళ రచయిత్రి. లాస్ ఏంజెలెస్‌లో ఉంటుంది. భర్త నీల్ ఉద్యోగం వదిలేసి, ఇంటినీ పిల్లల్నీ చూసుకుంటుంటాడు. భాగస్వామీ, స్నేహితుడూ అయిన సెఠ్తో కలిపి రాయవలసినది చాలా ఉండటంతో, భర్తతో కలిసి క్రిస్మస్ జరుపుకోవడానికి ఒమహాలో ఉన్న అత్తగారింటికి వెళ్ళలేనని జోర్జీ నిశ్చయించుకుంటుంది. ప్రయాణానికి రెండు రోజుల ముందు తన నిర్ణయాన్ని భర్తకి తెలిపినప్పుడు, అతను మౌనం వహిస్తాడు. తమ మధ్య సంబంధం తెగిపోతోందని ఆమె భావిస్తుంది.. భర్తా, ఇద్దరు కూతుళ్ళూ ఎయిర్ పోర్టుకి వెళ్ళిపోయిన తరువాత తన నిర్ణయం తప్పేమో అన్న సందేహం పుడుతుంది జోర్జీకి. ఒక వారంపాటు అసలేమీ రాయలేకపోయి, భర్తతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఫోన్ ఎత్తడు. ఒంటరిగా ఉండటం ఇష్టంలేక తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు, అల్లుడు కూతుర్ని వదిలిపెట్టాడని తల్లి అనుకుంటుంది. అక్కడ జోర్జీ ఐఫోన్ పాడయినప్పుడు, తన పాతగదిలో ఉన్న ‘లాండ్‌లైన్’తో అత్తగారింటికి ఫోన్ చేసి నీల్‌తో మాట్లాడుతుంది. వేలితో నంబర్లు తిప్పే ఆ పసుప్పచ్చటి ఫోన్ కాలయాన పరికరం అయి, ఆమెని గతంలోకి తీసుకెళ్తుంది. తను మాట్లాడుతున్నది భర్త అయిన 2013 సంవత్సరపు నీల్‌తో కాదనీ, 1988 సంవత్సరంలో తనకి కాలేజీలో తెలిసిన 22 ఏళ్ళ నీల్తోననీ రెండోరోజు గుర్తిస్తుంది. ఏది యథార్థమో, ఏది భ్రమో తెలుసుకోని పరిస్థితి ఏర్పడుతుంది. ‘నీ చుట్టూ ఉన్న దాని పట్ల నాకున్న అసహ్యం కన్నా, నీమీద నాకున్న ప్రేమ ఎక్కువ’ అని నీల్ తనకి చెప్పాడని సంభాషణ వల్ల గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ ఎలా కలుసుకుని ప్రేమలో పడ్డారో, కాలం గడిచేగొద్దీ ఎలా దూరం అయ్యారో పాఠకులకి తెలుస్తుంది. తనను పెళ్ళి చేసుకొమ్మని అడిగేటందుకు, గతంలో అతను ఒమహా నుంచి లాస్‌ఏంజెలెస్‌కి 27 గంటలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడని గతకాలపు నీల్ ఫోన్లో చెప్పినప్పుడు, జోర్జీ తను రాయవలిసిన స్క్రిప్ట్ వదిలి– భర్త, కుటుంబంతోపాటు క్రిస్మస్ జరుపుకోవడానికి వెళ్తుంది. జోర్జీ, నీల్– రాజీపడి, భవిష్యత్తులో సమస్యలని కలిసే పరిష్కరించుకుందామని నిర్ణయించుకుంటారు. సంబంధాలు ఎలా మారతాయో, మనుష్యులు పలుమార్లు ఒకరినొకరు కోల్పోయి తిరిగి ఎలా ఒకటైపోతారో, ముఖ్యమైన సంబంధాల పట్ల నిబద్ధత ఎలా పాటిస్తారో అని చెప్పే ఈ నవల అధికభాగం సంభాషణలతోనే సాగుతుంది. ఏ తిట్లూ, దూషణలూ లేకపోయినా వైవాహిక జీవితంలో కూడా రాపిడీ, ఘర్షణా ఉన్నప్పుడు ఆ సంబంధం చిక్కులు పడే ఉంటుందన్న సంగతిని పుస్తకం చెబుతుంది. నవల్లో జోర్జీ పడిన మీమాంస అందరికీ వర్తించేదే: ఉద్యోగమా, కుటుంబమా? చదవడానికి తేలికగా ఉండే ఈ పుస్తకం– ప్రేమనీ, పెళ్ళినీ నిర్వచిస్తూ, ‘సంబంధంలో కేవలం ప్రేమ ఉంటే సరిపోతుందా!’ అనే ప్రశ్నలని కూడా గుప్పిస్తుంది. రచయిత్రి స్వరం, జోర్జీ మానసిక స్థితినే కాక చుట్టుపక్కలున్న వారందరి అభిప్రాయాలనీ కూడా వ్యక్తపరుస్తుంది. ఇది రవెల్ నాలుగవ నవల. పబ్లిష్ అయినది 2014లో. ‘గుడ్‌రీడ్స్ ఛాయిస్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిక్షన్ ఆఫ్ ద ఇయర్’ గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది. - కృష్ణ వేణి -
బీఎస్ఎన్ఎల్ మెగా మేళా
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల సౌకర్యార్థం సోమవారం నుంచి మెగా మేళా నిర్వహిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఐదు రోజుల పాటు జరిగే మేళాలో కస్టమర్ సర్వీస్ సెంటర్లు/రిటైల్ అవుట్‌లెట్స్/రోడ్‌షోల్లో ఉచితంగా 3జీ సిమ్‌లు పొందవచ్చని పేర్కొంది. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు 351 ఎంబీ ఉచిత డేటాను అందించనుంది. మేళాలో ల్యాండ్‌లైన్, బ్రాడ్ బ్యాండ్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలకు 1503 లేదా 1800 1801 503లో సంప్రదించాలని కోరింది. -
బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్..
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి సోమవారం (ఆగస్ట్ 15) కూడా అన్ని రకాల మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లకు ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అనంతరం ఈ అవకాశం ప్రతీ ఆదివారం కూడా అందుబాటులో ఉంటుందని టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోపు ఏ నెట్‌వర్క్‌కు అయినా ల్యాండ్‌లైన్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. కొత్త ల్యాండ్‌లైన్ కస్టమర్లకు మొదటి ఆరు నెలల పాటు నెలవారీ అద్దె రూ.49 మాత్రమే వసూలు చేస్తున్నామని, అనంతరం రూ.99 నుంచి అందుబాటులో ఉన్న ఇతర ప్లాన్లలో ఒకదానికి మారవచ్చని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. -
ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి రాత్రివేళ ఫ్రీకాల్స్
బీఎస్ఎన్ఎల్ డీజీఎం శ్రీనివాసమూర్తి నల్లగొండ అర్బన్: ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్‌నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి రాత్రంతా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే ఆఫర్‌ను అందిస్తున్నారని టెలికాం జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఆఫర్‌ను మే 1వ తేదీనుంచి అమల్లోకి తెస్తున్నట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ నుంచి రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశంలో ఏ ప్రాంతానికైనా ఏ నెట్వర్క్ ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లకు ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చని తెలిపారు. అన్ని ల్యాండ్‌లైన్ పట్టణ, గ్రామీణ, సాధారణ ప్లాన్లు, స్పెషల్ ప్లాన్, కాంబోప్లాన్‌లకు బ్రాడ్‌బాండ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. అంతకంతకు తగ్గిపోతున్న ల్యాండ్లైన్ల కనెక్షన్లకు మళ్లీ గిరాకీ కనిపించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ల్యాండ్లైన్ల కోసం దగ్గరలో వున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసుల కోసం సంప్రదించాలని సూచించారు.18003451500 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని అన్నారు. ఈ పథకం ఎంత కాలం కొనసాగించాలనే విషయాన్ని నిర్ధారించలేదని తెలిపారు. ఆరునెలల తరువాత ప్రగతిని సమీక్షించి సేవలను కొనసాగించే యోచన చేస్తారని అన్నారు. ఇదే కాకుండా బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లను కూడా అమలు చేస్తున్నదని వివరించారు. డాటా ప్లాన్ ఓచర్ స్కీం ద్వారా రూ. 3299 తీసుకునే వారికి డాటా కార్డు ఉచితంగా అందిస్తారని అన్నారు. బీపీవీ-229 తీసుకుంటే రూ.300 కే డాటా కార్డును ఇస్తారని, డీపీవీ-1251 తీసుకుంటే రూ. 600 డాటా కార్డును అందజేస్తారని తెలిపారు. రూ. 2వేల నుంచివెయ్యి వరకు, రూ. 1500 నుంచి రూ. 10వేల వరకు ఫుల్‌టాక్‌టైమ్ అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు వేణుగోపాల్, వజీరుద్దీన్, జగన్మోహన్రెడ్డి, జేటీఓ శ్రీనివాస్ పాల్గొన్నార -
బ్యాడ్ ‘ల్యాండ్‌లైన్’
సక్రమంగా పనిచేయని బీఎస్ఎన్ఎల్ ఫోన్లు గతేడాది 4వేల మంది ఉపసంహరణ తీరుమారని బీఎస్ఎన్ఎల్ విశాఖపట్నం : ఆధునిక సాంకేతిక విప్లవంలో రోజుకో మోడల్ సెల్‌ఫోన్ రకరకాల ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోంది. సామాన్యులకు అందుబాటు ధరలో లభించడంతో వీటివైపు ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. 2జీ, 3జీ, 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో మరింత గిరాకీ పెరిగింది. మొబైల్ ఫోన్ల ప్రభంజనానికి ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. ఇటువంటి సమయంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి, వారి మెప్పు పొందాల్సిన బీఎస్ఎన్ఎల్ సిబ్బందికి చీమకుట్టినట్టయినా లేదు. పదే పదే ఫోన్లు మరమ్మతులకు గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో ల్యాండ్ లైన్ల ఫోన్ల సంఖ్య తగ్గిపోతుంది. విశాఖపట్నం టెలికం జిల్లా పరిధిలో ప్రస్తుతం లక్షా వెయ్యి వరకు ల్యాండ్‌లైన్ టెలిఫోన్లు ఉన్నాయి. తద్వారా సంస్థకు ఏటా రూ.80 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్కు ల్యాండ్‌లైన్ టెలిఫోన్ల ద్వారానే అధికంగా ఆదాయం వస్తోంది. అయినా సిబ్బందిలో అంకితభావం మాత్రం కానరావడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేలు ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఫోన్లు ఉపసంహరించుకున్నారు. ఇదే కాలంలో సుమారుగా 8 వేల మంది కొత్తగా ల్యాండ్‌లైన్ టెలిఫోన్లు తీసుకున్నారు. మరమ్మతులతో సరి? ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, వన్‌టౌన్, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ ఫోన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కొత్త పరికరం అవసరమైనా మరమ్మతులతో సరిపెడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో వాయిస్ స్పష్టంగా వినిపించడం లే దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం లో ఫోన్ క్రెడిల్ సక్రమంగా పనిచేయని కారణంగా పేపర్ వెయిట్ సాయం తీసుకోవల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఉచితంగా ఫోన్లు మార్చే సంస్థ ఇప్పుడేమే రూ.500 వసూలు చేస్తుంది. రోడ్లు తవ్వితే అంతే... జీవీఎంసీ పరిధిలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బీఆర్టీఎస్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు తవ్వినపుడు వందలాది బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్లు మూగబోతున్నాయి. డయల్ బి ఫోర్ డిగ్ అని బీఎస్ఎన్ఎల్ జంక్షన్ల వద్ద బోర్డులు ఉన్నా కాంట్రాక్టర్లు ముందుగా సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు జరపడంతో ఈ దుస్థితి నెలకొంటుంది. అయినా అధికారులు కాంట్రాక్టర్లపై కేసులు పెడుతున్న దాఖలాలు లేవు. కొత్త పరికరాలకు కొరత లేదు గతంలో ల్యాండ్‌లైన్ టెలిఫోన్ పరికరాలు ఢిల్లీ నుంచి వచ్చేవి. కొంతకాలంగా హైదరాబాద్ నుంచే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతానికి పరికరాల కొరత లేదు. అవసరం అయిన వారికి పాత ఫోన్ల స్థానంలో కొత్తవి ఇస్తున్నాం. రోడ్ల తవ్వకాల కారణంగా ఫోన్లు డెడ్ అయితే సంబంధిత కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నాం. - ఆర్.ఎం.ఎం.కృష్ణ, సీనియర్ జనరల్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్, విశాఖపట్నం -
కంటోన్మెంట్లో సెల్ మోగదా!
టవర్ఫ్రీ జోన్‌కు అధికారుల యోచన నిబంధనలు, భద్రత పేరుతోమరో వివాదాస్పద అడుగు కేవలం బీఎస్ఎన్ఎల్ టవర్లకే అనుమతిచ్చే యోచన హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మళ్లీ ల్యాండ్లైన్ల కాలం రానుందా? నిత్యావసరంగా మారిపోయిన సెల్‌ఫోన్‌ను అక్కడ ఇక వదిలేయాల్సిందేనా? మిలటరీ అధికారుల విపరీత ఆలోచనలు చూస్తుంటే అదే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది! నిబంధనలు, భద్రతా కారణాల్ని సాకుగా చూపుతూ అధికారులు ఈ దిశగా యోచిస్తున్నారు. కంటోన్మెంట్‌ను టవర్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో పాతకాలం నాటి తమ చట్టాల్ని మార్చుకోవడంపై దృష్టి సారించకుండా.. గుడ్డెద్దు చేనులో పడిందన్న చందంగా అధికారులు వ్యవరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నిర్ణయం అమలు అత్యంత కష్టసాధ్యమని కొందరు ఉన్నతాధికారులు గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ గోల? : కంటోన్మెంట్ బోర్డు ఆదాయం పెంపుపై తీవ్రంగా శ్రమిస్తున్న సీఈవో సుజాత గుప్తా దృష్టి సెల్‌టవర్లు, హోర్డింగ్‌లపై పడింది. ప్రస్తుతం కంటోన్మెంట్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఏ ఒక్క సెల్‌టవర్, హోర్డింగ్‌కూ బోర్డు నుంచి అనుమతి లేదు. దీంతో వీటి వివరాలు సేకరించిన బోర్డు అధికారులు వాటిని ఏర్పాటు చేసిన సంస్థలు, యజమానులకు నోటీసులు జారీ చేశారు. తద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించారు. అయితే ఇప్పటికీ ఏ ఒక్కరికీ అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఇందుకు కంటోన్మెంట్ నిబంధనలు అడ్డంకిగా మారడమే కారణమని తెలుస్తోంది. కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 60 వేల నివాసాల్లో కమర్షియల్ అనుమతులు ఉన్నవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వీటిని మాత్రమే వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశముంది. గిఫ్టెడ్, అన్గిఫ్టెడ్ కాలనీల్లోని రెసిడెన్షియల్ నివాసాలపై ఏర్పాటు చేసిన సెల్‌టవర్లకు అనుమతి లేదు. దీనిపై మిలటరీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అసలు కంటోన్మెంట్లో సెల్‌టవర్లను అనుమతించకూడదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టవర్లను ఏ సంస్థలు ఏర్పాటు చేశాయి? వీటిని ఏ అవసరాలకు, ఎవరు వినియోగిస్తున్నారనే సమాచారం అధికారుల వద్ద లేదు. భద్రతా కారణాల రీత్యా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మిలటరీ అధికారులు కంటోన్మెంట్‌ను ‘టవర్ ఫ్రీ జోన్’గా మార్చాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో బోర్డు అధికారులు ఈ దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్కే అనుమతిచ్చే అవకాశం సెల్‌టవర్లను తొలగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కేవలం బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు అనుమతించే అవకాశముందని తెలుస్తోంది. సెల్టవర్ల యజమానులకు నోటీసులిచ్చాక ఇప్పటివరకు కేవలం బీఎస్ఎన్ఎల్ అధికారులు మాత్రమే కంటోన్మెంట్ అధికారులతో భేటీ కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మిలటరీ కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిగించని విధంగా కేవలం తక్కువ ఫ్రీక్వెన్సీ టవర్లను కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అనుమతించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. కంటోన్మెంట్లో మిలటరీ అధికారులు పలు వివాదాస్పద నిర్ణయాలను మొండిగా అమలు చేస్తున్నారని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. రోడ్ల మూసివేత నిర్ణయమే ఇందుకు ఉదాహరణ. ఈ విషయంలో కోర్టు ఆక్షేపణ తెలిపినా భద్రతా కారణాల పేరుతో తమ నిర్ణయం అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం నామమాత్రం గానే స్పందిస్తుండడంతో అధికారులకు కలసి వస్తోంది. -
సెల్వన్ సేవలు నిల్
13 రోజుల నుంచి అందని సిగ్నల్స్ వినియోగదారుల ఆగ్రహం బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తళాలు కార్యాలయం ఎదుట ఆందోళన అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో పెదబయలు, న్యూస్‌లైన్ :సెల్ పని చేయదు.. విల్ మోగదు.. ల్యాండ్‌లైన్ పలకదు.. 13 రో జులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించకపోవడంతో వినియోగదారులు శనివారం రోడ్డెక్కారు. సెల్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది జాడ లేకపోవడంతో మండిపడ్డారు. స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాల యానికి తాళాలు వేశారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ జంక్షన్లో గంటపాటు రాస్తారోకో చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. 13 రోజుల నుంచి సిగ్నల్ లేకపోయినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఫోన్లు చేసుకోవాలంటే పాడేరు వరకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని చేయాలన్న, అధికారుల నుంచి సమాచారం ఉండడం లేదని ఉద్యోగు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల నుంచి ఫోన్ చే యడానికి పాడేరు వెళ్తున్నామని తెలిపారు. స్థానిక సెల్‌టవర్‌కు సంబంధించి టె క్నికల్ సిబ్బంది, జేఈఈ, ఇతర అధికారుల ప ర్యవేక్షణ లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిం దన్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు విసుగు తెప్పిస్తున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వినియోగదారులు హెచ్చరించారు. బీఎస్ఎన్ఎల్, విద్యుత్ శాఖ అధికారులపై ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేస్తామని సీపీఎం నాయకుడు బొండా సన్నిబాబు, స్థానికులు దడియా రాంబాబు, ఎం. పోతురాజు, లక్ష్మీనారాయణ, వర్తకులు తెలిపారు.