కంటోన్మెంట్‌లో సెల్ మోగదా!
టవర్‌ఫ్రీ జోన్‌కు అధికారుల యోచన
నిబంధనలు, భద్రత పేరుతోమరో వివాదాస్పద అడుగు
కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లకే అనుమతిచ్చే యోచన
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మళ్లీ ల్యాండ్‌లైన్‌ల కాలం రానుందా? నిత్యావసరంగా మారిపోయిన సెల్‌ఫోన్‌ను అక్కడ ఇక వదిలేయాల్సిందేనా? మిలటరీ అధికారుల విపరీత ఆలోచనలు చూస్తుంటే అదే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది! నిబంధనలు, భద్రతా కారణాల్ని సాకుగా చూపుతూ అధికారులు ఈ దిశగా యోచిస్తున్నారు. కంటోన్మెంట్‌ను టవర్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో పాతకాలం నాటి తమ చట్టాల్ని మార్చుకోవడంపై దృష్టి సారించకుండా.. గుడ్డెద్దు చేనులో పడిందన్న చందంగా అధికారులు వ్యవరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నిర్ణయం అమలు అత్యంత కష్టసాధ్యమని కొందరు ఉన్నతాధికారులు గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏమిటీ గోల? : కంటోన్మెంట్ బోర్డు ఆదాయం పెంపుపై తీవ్రంగా శ్రమిస్తున్న సీఈవో సుజాత గుప్తా దృష్టి సెల్‌టవర్లు, హోర్డింగ్‌లపై పడింది. ప్రస్తుతం కంటోన్మెంట్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఏ ఒక్క సెల్‌టవర్, హోర్డింగ్‌కూ బోర్డు నుంచి అనుమతి లేదు. దీంతో వీటి వివరాలు సేకరించిన బోర్డు అధికారులు వాటిని ఏర్పాటు చేసిన సంస్థలు, యజమానులకు నోటీసులు జారీ చేశారు. తద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించారు. అయితే ఇప్పటికీ ఏ ఒక్కరికీ అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఇందుకు కంటోన్మెంట్ నిబంధనలు అడ్డంకిగా మారడమే కారణమని తెలుస్తోంది. కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 60 వేల నివాసాల్లో కమర్షియల్ అనుమతులు ఉన్నవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వీటిని మాత్రమే వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశముంది. గిఫ్టెడ్, అన్‌గిఫ్టెడ్ కాలనీల్లోని రెసిడెన్షియల్ నివాసాలపై ఏర్పాటు చేసిన సెల్‌టవర్లకు అనుమతి లేదు. దీనిపై మిలటరీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అసలు కంటోన్మెంట్‌లో సెల్‌టవర్లను అనుమతించకూడదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టవర్లను ఏ సంస్థలు ఏర్పాటు చేశాయి? వీటిని ఏ అవసరాలకు, ఎవరు వినియోగిస్తున్నారనే సమాచారం అధికారుల వద్ద లేదు. భద్రతా కారణాల రీత్యా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మిలటరీ అధికారులు కంటోన్మెంట్‌ను ‘టవర్ ఫ్రీ జోన్’గా మార్చాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో బోర్డు అధికారులు ఈ దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్‌కే అనుమతిచ్చే అవకాశం
సెల్‌టవర్లను తొలగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల ఏర్పాటుకు అనుమతించే అవకాశముందని తెలుస్తోంది. సెల్‌టవర్ల యజమానులకు నోటీసులిచ్చాక ఇప్పటివరకు కేవలం బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు మాత్రమే కంటోన్మెంట్ అధికారులతో భేటీ కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మిలటరీ కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిగించని విధంగా కేవలం తక్కువ ఫ్రీక్వెన్సీ టవర్లను కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అనుమతించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు..
కంటోన్మెంట్‌లో మిలటరీ అధికారులు పలు వివాదాస్పద నిర్ణయాలను మొండిగా అమలు చేస్తున్నారని ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. రోడ్ల మూసివేత నిర్ణయమే ఇందుకు ఉదాహరణ. ఈ విషయంలో కోర్టు ఆక్షేపణ తెలిపినా భద్రతా కారణాల పేరుతో తమ నిర్ణయం అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం నామమాత్రం గానే స్పందిస్తుండడంతో అధికారులకు కలసి వస్తోంది.