గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ సివిల్‌ ఏరియాల విలీనం | Hyderabad civil areas to be merged with GHMC | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ సివిల్‌ ఏరియాల విలీనం

Published Sun, Jun 30 2024 4:04 AM | Last Updated on Sun, Jun 30 2024 4:04 AM

Hyderabad civil areas to be merged with GHMC

కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు 

మిలిటరీ స్టేషన్‌ మినహా నివాస ప్రాంతాలు ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోకి..

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లారు.

మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచి్చన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవలే రక్షణ శాఖకు లేఖ రాశారు.

ఈనెల 25 రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సంబంధిత విధి విధానాలపై రక్షణ శాఖ లేఖ రాసింది. దీని ప్రకారం కంటోన్మెంట్‌లోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్‌ఎంసీకి బదిలీ చేస్తారు. 

కంటోన్మెంట్‌ బోర్డు ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్‌ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ పరిధి వర్తిస్తుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు, సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement