మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్‌’ కీలకం | Cantonment is crucial for all three parties | Sakshi
Sakshi News home page

మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్‌’ కీలకం

May 5 2024 3:34 AM | Updated on May 5 2024 3:34 AM

Cantonment is crucial for all three parties

సిట్టింగ్‌ స్థానంనిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ 

నగరంలో బోణీ కొట్టాలని కాంగ్రెస్‌

పట్టు పెంచుకోవాలని బీజేపీ   

సర్వశక్తులు ఒడ్డుతున్నఅభ్యర్థులు 

కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌  అసెంబ్లీ నియోజకవర్గ  ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తంగా 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంది. గత అసెంబ్లీ  ఎన్నికల్లో రాష్ట్రంలో  అధికారంలోకి వచ్చినా,  హైదరాబాద్‌ సిటీ పరిధిలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్‌ కంటోన్మెంట్‌తో బోణీ కొట్టాలన్న కసితో ఉంది.

 ప్రత్యర్థులకంటే తామే ఇక్కడ బలంగా ఉన్నామని భావిస్తున్న బీఆర్‌ఎస్, సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో తొలిసారిగా రెండో స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయతి్నస్తోంది. మొత్తానికి మూడు పార్టీలూ ఉపఎన్నిక విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

 సిట్టింగ్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె అక్క నివేదిత బీఆర్‌ఎస్‌  నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన  శ్రీగణేశ్, అధికార కాంగ్రెస్‌  పార్టీలో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఈసారి కొత్త  అభ్యర్థి అయిన డాక్టర్‌ టీఎన్‌  వంశ తిలక్‌కు పార్టీ టికెట్‌  కేటాయించింది.  

బీఆర్‌ఎస్‌.. నివేదిత
దివంగత ఎమ్మెల్యే సాయన్న 2014లో టీడీపీ నుంచి గెలిచి రెండేళ్లలోనే బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2018లో తొలిసారిగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. గతేడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన స్థానంలో చిన్న కుమార్తె లాస్య నందిత 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం కాగా, బీఆర్‌ఎస్‌ మళ్లీ సాయన్న రెండో కుమార్తె నివేదితకు టికెట్‌ కేటాయించింది. అయితే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ల మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, గజ్జెల నాగేశ్, డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారానికి వారు దూరంగా ఉన్నారు. 

లాస్య నందిత గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటూ పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌ నేతలు, ముఖ్యంగా ఒకనాటి సాయన్న అనుచరులు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. బోర్డు మాజీ సభ్యులు మాత్రం అండగా నిలవగా, సాయన్న, సోదరి లాస్య సెంటిమెంట్‌పై ఆశలతో నివేదిత తన ప్రచారం కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉన్న బీఆర్‌ఎస్‌ కేడర్, తండ్రి, సోదరి సెంటిమెంట్‌తో తన గెలుపు ఖాయం అన్న ధీమాలో ఉన్నారు.

అనుకూలతలు
» దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె కావడం 
» ఏడాదిలోనే ఎమ్మెల్యే హోదాలోనే తండ్రి, సోదరిని కోల్పోయిన సానుభూతి 
» పటిష్టమైన పార్టీ కేడర్‌ 

ప్రతికూలతలు
»పెద్ద సంఖ్యలో నేతలు పార్టీని వీడటం 
»  ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే గతానుభవాలు 
»   కీలకనేతలు ప్రచారానికి దూరంగా ఉండటం 

కాంగ్రెస్‌.. శ్రీగణేశ్‌
నారాయణ్‌ శ్రీగణేశ్‌ పదిహేనేళ్ల క్రితమే కాంగ్రెస్‌ యువ నాయకుడిగా కంటోన్మెంట్‌ రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అయితే 2018లో ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలకతీతంగా శ్రీగణేశ్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రజాసేవతో కంటోన్మెంట్‌ ఓటర్లకు దగ్గరయ్యారు. 

ఈ క్రమంలో 2023లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోవడంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందితకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో అధికార కాంగ్రెస్‌ శ్రీగణేశ్‌ను పార్టీలోకి ఆహా్వనించింది. శ్రీగణేశ్‌ వ్యక్తిగత బలం, అధికార పార్టీ అండతో గెలుపు ఖాయం అన్న ధీమాలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. చేరికల జోరుతో కాంగ్రెస్‌ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. 

అనుకూలతలు
» అధికార పార్టీ అభ్యర్థి కావడం 
» ఓడిపోయినా ప్రజల్లోనే ఉండటం 
»  పార్టీలకతీతంగా సొంత కేడర్‌  

ప్రతికూలతలు
» తరచూ పార్టీలు మారతాడన్న అపవాదు 
» పాతనేతలు, కొత్తగా చేరుతున్న వారిమధ్య సమన్వయలేమి 
»  కొన్ని వార్డుల్లో పార్టీ బలహీనంగా ఉండటం

బీజేపీ.. టీఎన్‌ వంశ తిలక్‌ 
ఉత్తరాది ప్రాంతాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉండే కంటోన్మెంట్‌లో పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎంపీగా గెలిచినా, కంటోన్మెంట్‌లో మాత్రం బీజేపీ కాంగ్రెస్‌ను దాటి రెండో స్థానంలో నిలిచింది. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది. 

అయితే ఆ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి శ్రీగణేశ్‌ కాంగ్రెస్‌లోకి చేరడంతో మాజీ మంత్రి టీఎన్‌ సదాలక్ష్మి కుమారుడైన డాక్టర్‌ టీఎన్‌ వంశ తిలక్‌కు టికెట్‌ కేటాయించింది. కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కావడంతో సీనియర్‌ నేతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. 

బీజేపీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేకపోయారు. అయితే మాదిగ అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాలన్న తమ డిమాండ్‌కు తలొగ్గిన బీజేపీకి ఎమ్మార్పిఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికలతో కలిసి రావడంతో మోదీ చరిష్మాతో బీజేపీ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది.

అనుకూలతలు
» పటిష్టమైన పార్టీ కేడర్‌ 
»  ఎమ్మార్పిఎస్‌ సంపూర్ణ మద్దతు 
» మోదీ చరిష్మాతో ఉత్తరాది ఓట్లపై ఆశలు 

ప్రతికూలతలు
 » కంటోన్మెంట్‌కు పరిచయం లేని వ్యక్తి 
» పార్టీ నేతల మధ్య సమన్వయలేమి 
» ప్రచారంలో వెనుకబడిపోవడం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement