
చదువు కోసం వెళ్తే అనంత లోకాలకు నర్సింగ్ విద్యార్థినులు
ఆదుకుంటారనుకున్న వారి కలలను ఛిద్రం చేసిన రోడ్డు ప్రమాదం
ఇరువురివీ నిరుపేద కుటుంబాలే..
అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తండ్రులు..
కాయాకష్టం చేసి పోషించుకుంటున్న తల్లులు
మహబూబ్‌నగర్: ఆ ఇద్దరు విద్యార్థునులవీ నిరుపేద కుటుంబాలే.. ఒకరి తండ్రేమో కాళ్ల వాపుతో ఐదేళ్లుగా.. మరొకరి తండ్రి రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయి మూడేళ్లుగా మంచాలకే పరిమితమయ్యారు. దీంతో తాము కష్టపడినా.. తమ పిల్లలైనా బాగుపడాలని భావించిన ఆ తల్లులు కాయాకష్టం చేసి వారిని చదివించుకుంటున్నారు. ఇంతటి కష్టంలోనూ ఆ నిరుపేద కుటుంబాలపై దేవుడు ఏమాత్రం కనికరం లేకుండా మరో పిడుగు వేశాడు. రోడ్డు ప్రమాద రూపంలో ఇద్దరు విద్యార్థులను కబళించి.. తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల కలలను ఛిద్రం చేశాడు.
తీరని గోస..
మాగనూరు మండలంలోని గురువలింగంపల్లి గ్రామానికి చెందిన గోసాయి మారెప్ప, మాణిక్యమ్మల దంపతులకు కుమారుడు రమేష్ గౌరి, మహేశ్వరి ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితం గోసాయి మారెప్ప కాళ్లవాపు వ్యాధితో మచ్చానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కోసం కుమారుడు రమేష్ దినసరి కూలి బాటపట్టగా.. తల్లి మాణిక్యమ్మ స్థానికంగా బిచ్చమెత్తుకుంటూ భర్తను చూసుకుంటుంది. కాగా.. ఇద్దరు కూతుళ్లు కష్టపడి చదివి బీఎస్సీ నర్సింగ్ ప్రభుత్వ సీట్లు సాధించారు. గౌరికి వనపర్తి జిల్లాలో సీటు రాగా, మహేశ్వరి (చివరి అమ్మాయి)కి గద్వాల జిల్లాలో ఉచిత సీటు వచ్చింది.
దీంతో మహేశ్వరి గద్వాలలో హాస్టల్‌లో ఉంటూ బీఎస్సీ నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతుంది. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న తన కుటుంబానికి బాసటగా నిలుద్దామని కలలు కన్న ఆ విద్యార్థిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యుఒడికి చేరడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘బిడ్డా.. నీవెక్కడమ్మా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులతో కంటతడి పెట్టించింది. మృతిచెందిన కూతురును కళ్లతో చూద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రమేష్ (అన్న)ను తీసుకెళ్లారు.
కదిలించిన ప్రమాదం
గద్వాల జిల్లాకేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అధికార, రాజకీయ నాయకులను కదిలించింది. ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతిచెందడంతో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కుల, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం రాత్రి జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థినుల కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ పోలీసులను ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాల వివరాలు, స్థితిగతులపై ఆరా తీయాలని రెవెన్యూ సిబ్బందికిఉ సూచించారు.
మిన్నంటిన రోదనలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించడంతో ఆస్పత్రి ఆవరణలో రోదనలు మిన్నంటాయి. మనీష మృతదేహంపై తల్లిదండ్రులు బోయ రాజు, శ్రీదేవి పడి గుండెలు అవిసేలా రోదించారు. ఎన్నో ఆశలతో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని విలపించారు. త్వరలో వేసవి సెలవులు వస్తాయని, ఇంటికొస్తానని చెప్పిన మాటలను తండ్రి గుర్తు చేసుకొని కంటతడి పెట్టడం పలువురిని కదిలించింది.
తల్లి కష్టమే ఆధారం..
పాన్‌గల్ మండలం రాయినిపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి, రాజుల దంపతులకు కూతురు మనీష, కుమారుడు మనోజుకుమార్ ఉన్నారు. తండ్రి రాజు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోవడంతో ఎలాంటి పనులు చేయలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యా డు. దీంతో కుటుంబ భారమంతా తల్లి శ్రీదేవిపై పడింది. దీంతో ఆమె స్థానికంగా చిన్నపాటి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. మనీషశ్రీని నర్సింగ్ చదివిస్తుంది. మరో ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని తమ పేద కు టుంబానికి తోడుగా ఉంటుందనుకున్న తరుణంలో కూతురు అకాల మరణం చెందడంతో కుటు ంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్ర మాదం విషయం తెలియడంతో కుటుంబ సభ్యు లు అందరూ గద్వాలకు బయలుదేరి వెళ్లారు.