టెల్కోలకు మరిన్ని కష్టాలు | DoT to issue fresh notice to telcos for full payment of AGR dues | Sakshi
Sakshi News home page

టెల్కోలకు మరిన్ని కష్టాలు

Published Thu, Feb 20 2020 7:25 PM | Last Updated on Thu, Feb 20 2020 8:19 PM

DoT to issue fresh notice to telcos  for full payment of AGR dues - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏజీఆర్‌ (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) చెల్లింపుల సంక్షోభం దేశీయ టెలికాం కంపెనీల మెడకు మరింత గట్టిగా బిగుస్తోంది. ఒకవైపు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడ్డ టెలికాం సంస్థలు తమ బకాయిలను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్‌  రూ. 10వేలకోట్లు, వోడాఫోన్‌ ఐడియా మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది.  మరోవైపు టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్‌)  ఏజీఆర్‌ బకాయిలను పూర్తిగా చెల్లించనందుకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్, టాటా టెలిసర్వీస్‌లకు ఈ వారం తాజా నోటీసులు జారీ చేయనుంది. అలాగే  బ్యాంక్‌ హామీలను అంగీకరించే అవకాశం వుందని, అయితే మార్చి 17 లోపు చేయాలా వద్దా అనే దానిపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరినట్టు డాట్‌  వెల్లడించింది. 

టాటా టెలీ సర్వీసెస్‌ ప్రకటనపై డాట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ బకాయిలు రూ .2,197 కోట్ల 'ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్' చేసినట్టు టాటా టెలిసర్వీసెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీనిపై స్పందించిన డాట్‌  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతూ  టాటా టెలీ సర్వీసెస్‌కు  ప్రత్యేక నోటీసు జారీ చేయనుంది. కంపెనీ మొత్తం బకాయిలు రూ. 14,000 కోట్లని డాట్  స్పష్టం చేసింది. మొత్తంపై వడ్డీ (పెనాల్టీతో పాటు),  పెనాల్టీపై వడ్డీని చెల్లించలేదని డాట్‌ అధికారి తెలిపారు. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా టాటా టెలీ సర్వీసెస్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు.

భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గురువారం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు. ఇంతకుముందెన్నడూ లేని ఈ అసాధారణ సంక్షోభంలో టెలికాం రంగానికి పన్నులు, సుంకాలను తగ్గించాలని కోరారు. అలాగే బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించటానికి ఎయిర్‌టెల్ కట్టుబడి ఉందని మిట్టల్ చెప్పారు.  మిగిలిన ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులను వేగవంతం చేశామన్నారు.  మార్చి 17 వరకు సమయం ఉందని, కంపెనీ తన బకాయిలను అంతకు ముందే చెల్లిస్తుందని వెల్లడించారు. కాగా బకాయిల చెల్లింపుల ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement