Sunil Bharti Mittal
-
మిట్టల్‌కు నైట్‌హుడ్ పురస్కారం
లండన్/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు. -
ఎయిటెల్ బాస్ సునీల్ మిట్టల్‌కు నైట్ హుడ్ అవార్డ్!
భారతీ ఎంటర్ ప్రైజెస్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అరుదైన ఘనతను సాధించారు. భారత్-యూకేల మధ్య స్నేహపూర్వక వ్యాపార సంబంధాలను కొనసాగిస్తున్నందుకు గాను కింగ్ చార్లెస్ 3 నుంచి అత్యంత ప్రతిష్మాత్మక నైట్ హుడ్ అవార్డ్‌ను పొందారు. కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (KBE) పేరుతో బ్రిటన్ ప్రభుత్వం అందించే అవార్డ్‌లలో ఇది ఒకటి. ఈ అవార్డ్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా మిట్టల్ పేరు సంపాదించారు. ఈ సందర్భంగా మిట్టల్ మాట్లాడుతూ “కింగ్ చార్లెస్ నుండి అరుదైన పురస్కారం పొందడంపై సంతోషంగా ఉంది. యూకే-భారత్‌లు చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. భారత్-యూకేల మధ్య ఆర్థిక ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను’ అని మిట్టల్ అన్నారు. -
వన్‌వెబ్ సేవలు చౌకగా ఉండవు..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ వన్‌వెబ్ సేవల టారిఫ్‌లు పాశ్చాత్య దేశాల్లోని మొబైల్ సర్వీసుల రేట్ల స్థాయిలో ఉంటాయని కంపెనీ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు. ఇవి భారత్‌లో ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్న టారిఫ్‌లకు సమానంగా మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. ఒక ఊళ్లో 30–40 ఇళ్లు ఒక కమ్యూనిటీగా సర్వీసులను వినియోగించుకుంటే కాస్త చౌకగా ఉండవచ్చని కానీ వ్యక్తిగతంగా ఒక్కరు వాడుకోవాలంటే మాత్రం ఖరీదైనవిగానే ఉండవచ్చని మిట్టల్ చెప్పారు. ‘మొబైల్ టారిఫ్‌ల స్థాయిలో శాటిలైట్ కమ్యూనికేషన్ ధర ఉంటుందా అని ప్రశ్నిస్తే .. ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న వాటి స్థాయిలో ఉండవచ్చు. భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు నెలకు 2 – 2.5 డాలర్ల స్థాయిలో (సుమారు రూ. 164– రూ. 205) ఉన్నాయి. ఆ రేట్లకు మాత్రం శాటిలైట్ కమ్యూనికేషన్ టారిఫ్‌లు ఉండవు. ఎందుకంటే అవి అత్యంత కనిష్ట రేట్లు‘ అని ఆయన పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించే వన్‌వెబ్‌కు సంబంధించిన 36 ఉపగ్రహాలను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ప్రయోగించిన సందర్భంగా మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఎల్వీఎం–3 (లాంచ్ వెహికల్ మార్క్–3) వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో వన్‌వెబ్‌కి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 618కి చేరింది. తమకు ఉపగ్రహ సర్వీసులను ఆవిష్కరించేందుకు పర్మిట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పేస్‌కామ్ పాలసీని ప్రవేశపెట్టి, స్పెక్ట్రం కేటాయించే వరకు వేచి ఉండాల్సి ఉంటుందని మిట్టల్ తెలిపారు. భారత్‌లో యూజర్ శాటిలైట్ టెర్మినల్స్ తయారీ కోసం కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. -
వన్‌వెబ్ మరోసారి ప్రయోగం
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్స్ రంగ కంపెనీ వన్‌వెబ్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో (ఇస్రో) కలిసి 36 ఉపగ్రహాలను మార్చి 26న ప్రయోగించనుంది. భూమికి తక్కువ కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్) వీటిని పంపుతారు. జూలై–ఆగస్ట్ నాటికి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధమని వన్‌వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఫిబ్రవరిలో వెల్లడించారు. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి కంపెనీకి లైసెన్స్ దక్కింది. అయితే ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించాల్సి ఉంది. ‘శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవి నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. వన్‌వెబ్ ఇప్పటికే 17సార్లు ఉపగ్రహాలను పంపింది. ఈ ఏడాది మూడవ పర్యాయం ప్రయోగిస్తోంది. మొదటి తరం లో ఎర్త్ ఆరిŠబ్ట్ (లియో) కూటమిని పూర్తి చేసి 2023లో కంపెనీ అంతర్జాతీయంగా కవరేజీని ప్రారంభించేందుకు ఈ ప్రయోగం వీలు కల్పిస్తుంది. కంపెనీ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి’ అని వన్‌వెబ్ తెలిపింది. -
ఎయిర్‌టెల్‌లో గూగుల్‌కు చోటు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా దేశీ టెలికం భారతి ఎయిర్‌టెల్‌లో దాదాపు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్ డాలర్లతో 1.28 శాతం వాటాలు కొనుగోలు చేయనుండగా, మిగతా 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రాబోయే సంవత్సరాల్లో సర్వీసుల విస్తరణపై వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 734 రేటు చొప్పున గూగుల్ తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5,224.3 కోట్ల (సుమారు 700 మిలియన్ డాలర్లు) విలువ చేసే 7,11,76,839 ఈక్విటీ షేర్లను గూగుల్‌కు కేటాయించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. కొత్త ఉత్పత్తులతో భారత్ డిజిటల్ లక్ష్యాల సాకారానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు సిద్ధంగా ఉన్న తమ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫాంలు, చెల్లింపుల వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడగలవని ఆయన వివరించారు. కంపెనీలు డిజిటల్ బాట పట్టడంలో తోడ్పడేందుకు, స్మార్ట్ఫోన్లు.. కనెక్టివిటీని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఎయిర్‌టెల్‌తో ఒప్పందం దోహదపడగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఇరు సంస్థలు భారత్ కోసం ప్రత్యేకమైన 5జీ సొల్యూషన్స్‌ను కనుగొనడంపై కృషి చేయనున్నాయి. ఎయిర్టెల్ తన 5జీ ప్రణాళికలను మరింత దూకుడుగా అమలు చేసేందుకు, మార్కెట్ దిగ్గజం జియోకి దీటుగా పోటీనిచ్చేందుకు గూగుల్ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. 1.28 శాతం వాటాల కోసం గూగుల్ చేస్తున్న 700 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రకారం ఎయిర్టెల్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లుగా (54.7 బిలియన్ డాలర్లు) ఉండనుంది. ఇప్పటికే జియోలో గూగుల్... దేశీయంగా డిజిటలీకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గూగుల్ .. రాబోయే 5–7 ఏళ్లలో భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 4.5 బిలియన్ డాలర్లు వెచ్చించి 7.73 శాతం వాటాలు కూడా కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడుల ప్రకారం అప్పట్లో జియో ప్లాట్‌ఫామ్స్ విలువను రూ. 4.36 లక్షల కోట్లుగా (దాదాపు 58.1 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. శుక్రవారం బీఎస్‌లో భారతి ఎయిర్టెల్ షేరు 1 శాతం పైగా పెరిగి రూ. 716 వద్ద క్లోజయ్యింది. -
టెల్కోలకు మరిన్ని కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) చెల్లింపుల సంక్షోభం దేశీయ టెలికాం కంపెనీల మెడకు మరింత గట్టిగా బిగుస్తోంది. ఒకవైపు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడ్డ టెలికాం సంస్థలు తమ బకాయిలను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్టెల్ రూ. 10వేలకోట్లు, వోడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది. మరోవైపు టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించనందుకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలిసర్వీస్‌లకు ఈ వారం తాజా నోటీసులు జారీ చేయనుంది. అలాగే బ్యాంక్ హామీలను అంగీకరించే అవకాశం వుందని, అయితే మార్చి 17 లోపు చేయాలా వద్దా అనే దానిపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరినట్టు డాట్ వెల్లడించింది. టాటా టెలీ సర్వీసెస్ ప్రకటనపై డాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ బకాయిలు రూ .2,197 కోట్ల 'ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్' చేసినట్టు టాటా టెలిసర్వీసెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాట్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతూ టాటా టెలీ సర్వీసెస్‌కు ప్రత్యేక నోటీసు జారీ చేయనుంది. కంపెనీ మొత్తం బకాయిలు రూ. 14,000 కోట్లని డాట్ స్పష్టం చేసింది. మొత్తంపై వడ్డీ (పెనాల్టీతో పాటు), పెనాల్టీపై వడ్డీని చెల్లించలేదని డాట్ అధికారి తెలిపారు. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా టాటా టెలీ సర్వీసెస్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గురువారం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు. ఇంతకుముందెన్నడూ లేని ఈ అసాధారణ సంక్షోభంలో టెలికాం రంగానికి పన్నులు, సుంకాలను తగ్గించాలని కోరారు. అలాగే బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించటానికి ఎయిర్టెల్ కట్టుబడి ఉందని మిట్టల్ చెప్పారు. మిగిలిన ఏజీఆర్ బకాయిల చెల్లింపులను వేగవంతం చేశామన్నారు. మార్చి 17 వరకు సమయం ఉందని, కంపెనీ తన బకాయిలను అంతకు ముందే చెల్లిస్తుందని వెల్లడించారు. కాగా బకాయిల చెల్లింపుల ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. -
వ్యాపార నిబంధనాలు తొలగించండి
న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కేంద్రాన్ని కోరారు. 2020–21 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, అసోచామ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గోయెంకా తదితర పారిశ్రామిక ప్రముఖులతోపాటు కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమైన సూచనలు, డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. మరింత స్వేచ్ఛ... ‘‘దేశంలో వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే విషయమై చర్చించేందుకే నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. నా డిమాండ్ ఇదే. వినియోగదారుల ప్రయోజనాన్ని, పెట్టుబడులను సమతౌల్యం చేయాల్సి ఉంది’’ అని సునీల్ భారతీ మిట్టల్ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు, విలీనాలు, వ్యాపార విభజన, ఎన్సీఎల్టీ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న ఆదాయపన్ను సెక్షన్లపై సూచనలు చేసినట్టు వెల్లడించారు. ‘‘పరిశ్రమలు మరింత స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలన్నదే ఆలోచన. వాటిని ఆర్థిక మంత్రి చక్కగా స్వీకరించారు. భారత పారిశ్రామికవేత్తల శక్తిని ద్విగుణీకృతం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని మిట్టల్ తెలిపారు. వ్యాపార సులభతర నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందని అసోచామ్ ప్రెసిడెంట్ బాలకృష్ణగోయంకా పేర్కొనగా, చాలా పరిశ్రమలకు ఇదే ఆందోళనకర అంశమని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. వ్యాపార సులభ నిర్వహణతోపాటు వృద్ధి ప్రేరణకు ఏం చేయగలమన్న అంశంపై చర్చించినట్టు ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు అధినేత సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘‘అన్ని రకాల సలహాలను వారు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరహా స్పందనను ప్రభుత్వం నుంచి చూడడం ఇదే మొదటిసారి’’ అని గోయెంకా పేర్కొన్నారు. మందగమనం చాలా రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం వినియోగంపై ప్రభావం చూపించిందన్నారు. ఇది సాధారణ స్థితికి రావడానికి మూడు, నాలుగు త్రైమాసికాల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. పన్ను భారం తగ్గించాలి.. ‘‘రూ.20 లక్షల కంటే ఒక ఏడాదిలో తక్కువ ఆర్జించే వారికి ఆదాయపన్ను తగ్గించాలని సూచన చేశాం. దీనివల్ల వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరింత ఆదాయం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఈఎంఐలను తగ్గించాలనీ కోరాం. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని మరింతగా వినియోగదారులకు బదిలీ చేస్తే ఈఎంఐల భారం తగ్గుతుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. ఆదాయపన్ను సీలింగ్ పెంచాలి: కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని రూ.21,000 చేయాలని, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, వార్షికంగా రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారిని ఆదాయపన్ను నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కార్మిక సంఘాలు కోరాయి. బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా తమ డిమాండ్లను మంత్రి ముందుంచాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంపై ఆందోళనను వ్యక్తం చేశాయి. ఉద్యోగ కల్పన దిశగా రానున్న బడ్జెట్లో ఉండాల్సిన చర్యలను సూచించాయి. ► మౌలిక, సామాజిక రంగాలు, వ్యవసాయంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేయడం ద్వారా ఉద్యోగాలను కల్పించొచ్చు. ►అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, అదనపు పోస్టులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. ► నిత్యావసర వస్తువులను స్పెక్యులేటివ్ ఫార్వార్డ్ ట్రేడింగ్ నుంచి నిషేధించాలి. ►సామర్థ్యాలు ఉండి కూడా దెబ్బతిన్న ప్రభుత్వరంగ సంస్థలను పునరుద్ధరించేందుకు బడ్జెట్ నుంచి నిధుల సహకారం ఇవ్వాలి. ►10 మంది ఉద్యోగులను కలిగిన కంపెనీలనూ ఈపీఎఫ్‌వో పరిధిలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇది కనీసం 20 మంది ఉద్యోగులున్న కంపెనీలకు వర్తిస్తోంది. ►గ్రాట్యుటీని ఏడాదిలో 15 రోజులకు కాకుండా కనీసం 30 రోజులకు చెల్లించేలా చేయాలి. ►హౌసింగ్, మెడికల్, ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. ►స్టీల్, బొగ్గు, మైనింగ్, హెవీ ఇంజనీరింగ్, ఫార్మా, డ్రెడ్జింగ్, సివిల్ ఏవియేషన్, ఫైనాన్షియ ల్ రంగంలోని ప్రభుత్వరంగ సంస్థలను వ్యూహాత్మక విక్రయాలకు దూరంగా ఉంచాలి. -
సామాజిక సేవకు సునీల్ మిట్టల్ 7,000 కోట్లు
-
సామాజిక సేవకు సునీల్ మిట్టల్ 7,000 కోట్లు
న్యూఢిల్లీ: మరో సంపన్న కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు చేయూతనందించడానికి ముందుకు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది. ఈ మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. భారతీ ఎయిర్టెల్ కంపెనీలో మిట్టల్ కుటుంబ సభ్యులకు ఉన్న మూడు శాతం వాటా కూడా విరాళంలో భాగమే. ఈ మొత్తాన్ని తమ కుటుంబం తరఫున ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ఇవ్వనున్నట్టు సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. తన సోదరులు రాకేశ్, రాజన్‌తో కలసి ఆయన ఢిల్లీలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలు ప్రకటించారు. ‘‘తొలితరం ప్రారిశ్రామిక వేత్తలుగా ప్రపంచ స్థాయి వ్యాపారాల స్థాపనకు ఈ దేశం మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని భావిస్తున్నాం. దేశాభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు ఎంతో గర్విస్తున్నాం. మా సంపదను తిరిగి సమాజానికి ఇవ్వడం ద్వారా ఇతరులకూ అవకాశాలు కల్పించాలని ఎంతగానో కోరుకుంటున్నాం’’ అని మిట్టల్ తెలిపారు. పేదలకు ఉచితంగా టెక్నాలజీ విద్య ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉచితంగా విద్యనందించేందుకు సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మిట్టల్ చెప్పారు. ఉత్తర భారతంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకోసం పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. విరాళంలో అధిక భాగం యూనివర్సిటీ ప్రాజెక్టుపైనే వెచ్చించనున్నామని, కొంత మేర ఇప్పటికే నిర్వహిస్తున్న సత్యభారతి స్కూళ్ల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై ఈ యూనివర్సిటీ ఫోకస్ ఉంటుందన్నారు. అలాగే, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీలనూ ఆఫర్ చేయనున్నట్టు వివరించారు. నందన్ నిలేకని, ఆయన సతీమణి రోహిణి తమ సంపదలో సగం మేర దాతృత్వానికి ఇచ్చేందుకు ముందుకొచ్చిన కొన్ని రోజులకే మిట్టల్ కుటుంబం కూడా ఇదే బాటలో పయనించడం గమనార్హం. దాతృత్వానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తున్నట్టు దీన్ని చూస్తే తెలుస్తోంది. తొలుత ఈ దిశగా అడుగు వేసి మార్గదర్శకులుగా నిలిచిన వారిలో విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ ఒకరు. -
జీఎస్ఎంఏ చైర్మన్‌గా సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య ‘జీఎస్ఎంఏ’ చైర్మన్‌గా సునీల్ భారతీ మిట్టల్ ఎంపికయ్యారు. భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన ఈయన వచ్చే జనవరి నుంచి రెండేళ్లపాటు జీఎంఎస్‌ఏ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఎస్‌ఎంఏకు చైర్మన్ అయిన తొలి భారతీయుడు మిట్టల్. ఇక ఆరంజ్ గ్రూప్ ఇన్నోవేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మారి-నోయిలె మళ్లీ జీఎస్ఎంఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రపంచంలో ఉన్న దాదాపు 800 మంది మొబైల్ ఆపరేటర్లు, మొబైల్ పరిశ్రమలోని 300కు పైగా కంపెనీలు భాగస్వామ్యమై ఉన్న జీఎస్ఎంఏ సంస్థను మిట్టల్ ఒక చైర్మన్‌గా సరైన మార్గంలో నడిపించనున్నారు. మంచి భవిష్యత్తే లక్ష్యంగా ప్రతి ఒక్కరితో కలిసి అందరి కోసం పనిచేస్తానని మిట్టల్ ఈ సందర్భంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తానని, దేశంలో బ్రాడ్‌బ్యాండ్ విప్లవానికి చేయూతనందిస్తానని పేర్కొన్నారు. ఇక జీఎస్ఎంఏ చైర్మన్‌గా ఉన్న జాన్ ఫెడ్రిక్ బక్సాస్ ఈ ఏడాది చివరిలో పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. -
ఎయిర్టెల్ లాభం 29% డౌన్
న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్టెల్ లాభాల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 29 శాతం దిగజారి రూ.512 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.721.2 కోట్లుగా ఉంది. లాభాలు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది 15వ క్వార్టర్ కావడం గమనార్హం. అయితే, కంపెనీ నిర్వహణ మార్జిన్లు మెరుగుపడటం భవిష్యత్తులో దేశీ టెలికం కంపెనీలకు మంచిరోజులు రానున్నాయనే ఆశలను చిగురింపజేస్తోంది. కాగా, క్యూ2లో తమ లాభాలు తగ్గుముఖం పట్టడానికి ప్రధానంగా రుణ చెల్లింపుల వ్యయాలు అధికం కావడం, రూపాయి విలువ క్షీణత వల్ల తలెత్తిన ఫారెక్స్ నష్టాలు(రూ.342 కోట్లు) కారణంగా నిలిచాయని కంపెనీ వెల్లడించింది. మెరుగైన ఎబిటా...: వడ్డీ, పన్నులు, తరుగుదలను తీసేయడానికి ముందు(ఎబిటా) నిర్వహణ మార్జిన్లు క్యూ2లో 32 శాతంగా నమోదయ్యాయని(క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో 30.6 శాతం) భారతీ గ్రూప్ సీఎఫ్ఓ సర్వ్‌జిత్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దేశీ టెలికం మార్కెట్లో కొంత సానుకూల పరిస్థితులు కనబడుతున్నాయని ఆయన చెప్పారు. డేటా టారిఫ్‌ల పెంపు తోడ్పాటు..: ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ2లో రూ.21,343 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ2లో రూ.19,408 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి చెందింది. డేటా సేవలపై దృష్టిసారిస్తున్న ఎయిర్‌టెల్‌కు ఈ సెప్టెంబర్ క్వార్టర్లో మొబైల్ ఇంటర్నెట్ విభాగం నుంచి రూ.1,503 కోట్ల ఆదాయం(39% వృద్ధి) లభించింది. కాగా, మొబైల్ ఇంటర్నెట్ రేట్లను గత నెలలో ఎయిర్టెల్ 25% పెంచడంతోపాటు కొన్ని ప్రోత్సాహక స్కీమ్‌లలో ప్రయోజనాలను 50% మేర కోత విధించింది. భారత్‌లో టారిఫ్‌లు ఇప్పటికీ చాలా తక్కువస్థాయిలోనే ఉన్నాయని కంపెనీ జాయింట్ ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ చెప్పారు. అయితే, ప్రధాన టారిఫ్‌లలో ఇప్పటిదాకా ఎలాంటి పెంపు చేయలేదన్నారు. తద్వారా భవిష్యత్తులో మరిన్ని రేట్ల పెంపు సంకేతాలిచ్చారు. ప్రోత్సాహకాలను మరింత తగ్గించేందుకు అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ2లో కంపెనీకి భారత్‌లో 25 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు జతయ్యారు. సెప్టెంబర్ చివరికి యూజర్ల సంఖ్య 19.34 కోట్లకు చేరింది. ఒక్కో కస్టమర్ నుంచి నెలవారీ సగటు ఆదాయం(ఏఆర్పీయూ) కూడా క్యూ2లో 192కు చేరింది. క్రితం క్యూ2తో పోలిస్తే రూ.15 పెరిగింది. ఇక ఆఫ్రికా ప్రాంతంలో క్యూ2 నష్టాలు మరింత పెరిగాయి. గత క్యూ2లో 9.7 కోట్ల డాలర్లు కాగా, తాజా క్యూ2లో నష్టం 10.5 కోట్ల డాలర్లకు చేరాయి. అయితే, ఆదాయం 109.7 కోట్ల డాలర్ల నుంచి 111.9 కోట్ల డాలర్లకు వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 220-230 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రణాళికలకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా, కంపెనీ షేరు ధర బుధవారం బీఎస్ఈలో 5.23 శాతం ఎగబాకి రూ.359 వద్ద స్థిరపడింది.