జీఎస్ఎంఏ చైర్మన్గా సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య ‘జీఎస్‌ఎంఏ’ చైర్మన్గా సునీల్ భారతీ మిట్టల్ ఎంపికయ్యారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన ఈయన వచ్చే జనవరి నుంచి రెండేళ్లపాటు జీఎంఎస్‌ఏ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఎస్‌ఎంఏకు చైర్మన్ అయిన తొలి భారతీయుడు మిట్టల్. ఇక ఆరంజ్ గ్రూప్ ఇన్నోవేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మారి-నోయిలె మళ్లీ జీఎస్‌ఎంఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
ప్రపంచంలో ఉన్న దాదాపు 800 మంది మొబైల్ ఆపరేటర్లు, మొబైల్ పరిశ్రమలోని 300కు పైగా కంపెనీలు భాగస్వామ్యమై ఉన్న జీఎస్‌ఎంఏ సంస్థను మిట్టల్ ఒక చైర్మన్‌గా సరైన మార్గంలో నడిపించనున్నారు. మంచి భవిష్యత్తే లక్ష్యంగా ప్రతి ఒక్కరితో కలిసి అందరి కోసం పనిచేస్తానని మిట్టల్ ఈ సందర్భంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తానని, దేశంలో బ్రాడ్‌బ్యాండ్ విప్లవానికి చేయూతనందిస్తానని పేర్కొన్నారు. ఇక జీఎస్‌ఎంఏ చైర్మన్‌గా ఉన్న జాన్ ఫెడ్రిక్ బక్‌సాస్ ఈ ఏడాది చివరిలో పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.