GSMA
-
జియో ఎఫెక్ట్: చైనా ఆపరేటర్లు కూడా...
-
జియో ఎఫెక్ట్: చైనా ఆపరేటర్లు కూడా...
న్యూడిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉచిత కాలింగ్ సేవలు, డేటా అంటూ తారిఫ్ వార్ ను మొదలుపెట్టిన జియో బాటలోకి మిగిలిన దేశీయదిగ్గజ టెలికాం కంపెనీలు అనివార్యంగా ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ ఆపరేటర్లు తమ ఖాతాదారులను వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ ఆపరేటర్లు దేశీయ రోమింగ్ చార్జీలు రద్దుచేయడానికి నిర్ణయించుకున్నారు. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) ఈ విషయాన్ని ప్రకటించింది. దేశీయ రోమింగ్ చార్జీలపై తామిచ్చిన పిలుపునకు ఈ మేరకు చైనా ప్రముఖ ఆపరేటర్ల నుండి అద్భుతమైన మద్దతు లభించిందని ప్రపంచంలో అతిపెద్ద టెలికాం మార్కెట్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ చెప్పారు. చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్ , చైనా యునైటెడ్ నెట్వర్క్ కమ్యునికేషన్స్ గ్రూప్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంటర్ ప్రావిన్స్ రోమింగ్ చార్జీలను రద్దుచేయనున్నట్టు ప్రకటించారు. బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుడికి సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందివ్వనున్నట్టు తెలిపారు. ఇతరదేశాల్లోని వివిధ ఆపరేటర్లు కూడా చైనాను ఉదాహరణగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 1 నుంచి, జియో దాని సేవలకు చార్జీలను ప్రారంభిస్తుంది. ఇవి ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ .19, పోస్ట్ పెయిడ్ వాటిని కోసం రూ 149 నుంచి ప్రారంభం. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ ద్వారా స్పెషల ప్యాక్‌లను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలు రద్దుకానున్నాయి. అలాగే 90 శాతం వరకు అంతర్జాతీయ రోమింగ్ ఛార్జీలు తగ్గిస్తుంది. నేషనల్ ఇన్కమింగ్ రోమింగ్ ఛార్జ్ ప్రస్తుతం ఒక నిమిషం 45పైసలుగా ఉండగా, అవుట్ గోయింగ్ కాల్స్ ఛార్జీలు రద్దుకానున్నాయి. కాగా గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య 'జీఎస్ఎంఏ' చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ దేశీయ అతి పెద్ద మొబైల్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. గత ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సునీల్ రెండేళ్లపాటు జీఎంఎస్‌ఏ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఎస్‌ఎంఏకు చైర్మన్ అయిన తొలి భారతీయుడు మిట్టల్ కావడం విశేషం. -
జీఎస్ఎంఏ చైర్మన్‌గా సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య ‘జీఎస్ఎంఏ’ చైర్మన్‌గా సునీల్ భారతీ మిట్టల్ ఎంపికయ్యారు. భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన ఈయన వచ్చే జనవరి నుంచి రెండేళ్లపాటు జీఎంఎస్‌ఏ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఎస్‌ఎంఏకు చైర్మన్ అయిన తొలి భారతీయుడు మిట్టల్. ఇక ఆరంజ్ గ్రూప్ ఇన్నోవేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మారి-నోయిలె మళ్లీ జీఎస్ఎంఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రపంచంలో ఉన్న దాదాపు 800 మంది మొబైల్ ఆపరేటర్లు, మొబైల్ పరిశ్రమలోని 300కు పైగా కంపెనీలు భాగస్వామ్యమై ఉన్న జీఎస్ఎంఏ సంస్థను మిట్టల్ ఒక చైర్మన్‌గా సరైన మార్గంలో నడిపించనున్నారు. మంచి భవిష్యత్తే లక్ష్యంగా ప్రతి ఒక్కరితో కలిసి అందరి కోసం పనిచేస్తానని మిట్టల్ ఈ సందర్భంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తానని, దేశంలో బ్రాడ్‌బ్యాండ్ విప్లవానికి చేయూతనందిస్తానని పేర్కొన్నారు. ఇక జీఎస్ఎంఏ చైర్మన్‌గా ఉన్న జాన్ ఫెడ్రిక్ బక్సాస్ ఈ ఏడాది చివరిలో పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. -
భారత్‌లో మొబైల్ సర్వీసుల విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 8.2%కి (దాదాపు రూ. 14 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్ఎంఏ అధ్యయనం ఒకటి పేర్కొంది. ‘‘ది మొబైల్ ఎకానమీ: ఇండియా 2015’ పేరుతో ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. 2014 జీడీపీలో ఈ రంగం వాటా 6.1% ఉందని, పరిమాణంలో ఇది రూ.7.7 లక్షల కోట్లని నివేదిక విడుదల సందర్భంగా జీఎస్ఎంఏ ఆసియా హెడ్ అలేస్దర్ గ్రాట్ పేర్కొన్నారు. 2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని వివరించారు. పన్నులు, స్పెక్ట్రమ్ ఆక్షన్ చెల్లింపుల రూపంలో 2014లో ప్రభుత్వానికి ఈ రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపింది. ఈ మొత్తం దాదాపు రూ. 1.1 లక్షల కోట్లుగా తెలిపింది. కాగా భారత్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటినట్లు ట్రాయ్ వెల్లడించగా.. వాస్తవ యూజర్ల సంఖ్య దాదాపు 45.3 కోట్లుగా జీఎస్ఎంఏ నివేదిక పేర్కొంటోంది. ఈ ఏడాది ఈ సంఖ్య 50 కోట్లు దాటుతుందని తెలిపింది. 2014 దేశజనాభాలో మొబైల్ వినియోగ రేటును ట్రాయ్ 74%గా పేర్కొంటే నివేదిక మాత్రం 36%గా అంచనావేసింది. a -
2020 నాటికి మొబైల్ యూజర్లు @ 460 కోట్లు
దుబాయ్: రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియోగదారుల సంఖ్య మరో 100 కోట్లు పెరగనుంది. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) నివేదిక ‘ద మొబైల్ ఎకానమీ-2015’ ప్రకారం, గతేడాది చివరకు 360 కోట్లుగా ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏడాదికి 4 శాతం వృద్ధితో 2020 నాటికి 460 కోట్లకు చేరనుంది. ‘దశాబ్దకాలం క్రితం ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే మొబైల్‌ను వినియోగించేవారు. ఇప్పుడు మేము 50 శాతం మైలురాయిని (ప్రపంచవ్యాప్తంగా 50 శాతానికిపైగా జనాభా మొబైళ్లను వినియోగిస్తున్నారు) అధిగమించాం. రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియోగదారుల సంఖ్య మరో 100 కోట్లు పెరుగుతుంది’ అని జీఎస్ఎంఏ డెరైక్టర్ అన్నె బౌవెర త్ అన్నారు. అంతర్జాతీయంగా గతేడాది 710 కోట్లుగా ఉన్న సిమ్ కనెక్షన్ల సంఖ్య 2020 నాటికి 900 కోట్లకు చేరనుంది. గతేడాది మొబైల్ పరిశ్రమ ప్రపంచ ఆర్థిక రంగానికి 3 ట్రిలియన్ డాలర్లను సమకూర్చింది. ఇది ప్రపంచ జీడీపీలో 3.8 శాతానికి సమానం. 2020 నాటికి ఈ మొత్తం 3.9 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. ఇది ప్రపంచ జీడీపీలో 4.2 శాతానికి సమానం. -
మొబైల్ పరిశ్రమతో 41 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం మొబైల్ పరిశ్రమ(మొబైల్ ఎకానమీ) 2020 నాటికి 41 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దీని వాటా 400 బిలియన్ డాలర్ల మేర ఉండనుంది. మొబైల్ ఎకానమీ ఇండియా 2013 పేరిట అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య జీఎస్ఎంఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలిసి జీఎస్ఎంఏ దీన్ని రూపొందించింది. మొబైల్ ఎకానమీ వల్ల టెలికం మౌలిక సదుపాయాల కల్పన కోసం 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగలవని జీఎస్ఎంఏ వివరించింది. దేశీయ మొబైల్ పరిశ్రమ చాలా వేగంగా ఎదుగుతోందని, అయితే లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే నియంత్రణ వ్యవస్థ ప్రస్తుతం కరువైందని జీఎస్ఎంఏ డెరైక్టర్ జనరల్ యాన్ బూవెరాట్ తెలిపారు. గతేడాది గణాంకాల ప్రకారం 2012 జీడీపీలో మొబైల్ పరిశ్రమ వాటా 5.3 శాతంగా ఉండగా, ప్రత్యక్షంగా 7,30,000 మందికి, పరోక్షంగా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించిందని వివరించారు. పరిశ్రమ మరింతగా పురోగమించాలంటే స్పెక్ట్రమ్ కేటాయింపులు తదితర అంశాల్లో దీర్ఘకాలిక మైన, సరళమైన విధానాలు అవసరమవుతాయని బూవెరాట్ చెప్పారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రభుత్వంతోనూ, ఇతర అనుబంధ పరిశ్రమలతోనూ కలిసి పనిచేసేందుకు మొబైల్ రంగం సిద్ధంగా ఉందని జీఎస్ఎంఏ ఇండియా డెరైక్టర్ సందీప్ కరణ్వాల్ తెలిపారు.