జియో ఎఫెక్ట్: చైనా ఆపరేటర్లు కూడా...
న్యూడిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉచిత కాలింగ్ సేవలు, డేటా అంటూ తారిఫ్ వార్ ను మొదలుపెట్టిన జియో బాటలోకి మిగిలిన దేశీయదిగ్గజ టెలికాం కంపెనీలు అనివార్యంగా ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ‍్యంగా భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ ఆపరేటర్లు తమ ఖాతాదారులను వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ ఆపరేటర్లు దేశీయ రోమింగ్ చార్జీలు రద్దుచేయడానికి నిర్ణయించుకున్నారు. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్‌ఎంఏ) ఈ విషయాన్ని ప్రకటించింది.
దేశీయ రోమింగ్ చార్జీలపై తామిచ్చిన పిలుపునకు ఈ మేరకు చైనా ప్రముఖ ఆపరేటర్ల నుండి అద్భుతమైన మద్దతు లభించిందని ప్రపంచంలో అతిపెద్ద టెలికాం మార్కెట్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ చెప్పారు. చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్ , చైనా యునైటెడ్ నెట్వర్క్ కమ్యునికేషన్స్ గ్రూప్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంటర్ ప్రావిన్స్ రోమింగ్ చార్జీలను రద్దుచేయనున్నట్టు ప్రకటించారు. బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుడికి సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందివ్వనున్నట్టు తెలిపారు. ఇతరదేశాల్లోని వివిధ ఆపరేటర్లు కూడా చైనాను ఉదాహరణగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఏప్రిల్ 1 నుంచి, జియో దాని సేవలకు చార్జీలను ప్రారంభిస్తుంది. ఇవి ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ .19, పోస్ట్ పెయిడ్ వాటిని కోసం రూ 149 నుంచి ప్రారంభం. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ ద్వారా స్పెషల ప్యాక్‌లను ప్రకటించింది.
ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలు రద్దుకానున్నాయి. అలాగే 90 శాతం వరకు అంతర్జాతీయ రోమింగ్ ఛార్జీలు తగ్గిస్తుంది. నేషనల్ ఇన్‌కమింగ్ రోమింగ్ ఛార్జ్ ప్రస్తుతం ఒక నిమిషం 45పైసలుగా ఉండగా, అవుట్ గోయింగ్ కాల్స్ ఛార్జీలు రద్దుకానున్నాయి.
కాగా గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య 'జీఎస్‌ఎంఏ' చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ దేశీయ అతి పెద్ద మొబైల్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. గత ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సునీల్ రెండేళ్లపాటు జీఎంఎస్‌ఏ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఎస్‌ఎంఏకు చైర్మన్ అయిన తొలి భారతీయుడు మిట్టల్ కావడం విశేషం.