2020 నాటికి మొబైల్ యూజర్లు @ 460 కోట్లు
దుబాయ్: రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియోగదారుల సంఖ్య మరో 100 కోట్లు పెరగనుంది. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్‌ఎంఏ) నివేదిక ‘ద మొబైల్ ఎకానమీ-2015’ ప్రకారం, గతేడాది చివరకు 360 కోట్లుగా ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏడాదికి 4 శాతం వృద్ధితో 2020 నాటికి 460 కోట్లకు చేరనుంది. ‘దశాబ్దకాలం క్రితం ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే మొబైల్‌ను వినియోగించేవారు.
ఇప్పుడు మేము 50 శాతం మైలురాయిని (ప్రపంచవ్యాప్తంగా 50 శాతానికిపైగా జనాభా మొబైళ్లను వినియోగిస్తున్నారు) అధిగమించాం. రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియోగదారుల సంఖ్య మరో 100 కోట్లు పెరుగుతుంది’ అని జీఎస్‌ఎంఏ డెరైక్టర్ అన్నె బౌవెర త్ అన్నారు. అంతర్జాతీయంగా గతేడాది 710 కోట్లుగా ఉన్న సిమ్ కనెక్షన్ల సంఖ్య 2020 నాటికి 900 కోట్లకు చేరనుంది. గతేడాది మొబైల్ పరిశ్రమ ప్రపంచ ఆర్థిక రంగానికి 3 ట్రిలియన్ డాలర్లను సమకూర్చింది. ఇది ప్రపంచ జీడీపీలో 3.8 శాతానికి సమానం. 2020 నాటికి ఈ మొత్తం 3.9 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. ఇది ప్రపంచ జీడీపీలో 4.2 శాతానికి సమానం.