
ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే నిద్రలేమి సమస్య 60 శాతం అధికం
కొత్త అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: రాత్రిళ్లు నిద్రపోయే ముందు ఎక్కువసేపు ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, టెలివిజన్ ఇలా ఏదైనా స్క్రీన్‌ను ఎక్కువసేపు చూస్తే వెంటనే చాలా మందికి నిద్రపట్టదు. చాలా సేపటి తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఈ సమస్య రానురాను శాశ్వతంగా ఉండిపోయి నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇన్సోమ్నియాగా పిలిచే నిద్రలేమి సమస్య బారినపడే అవకాశాలు ఏకంగా 60 శాతం అధికమవుతాయని ఈ కొత్త పరిశోధనలో తేలింది. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ఇటీవల ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకియాట్రీ’అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
వేల మందిపై పరిశోధన
అధ్యయనంలో భాగంగా నార్వేలో 18 నుంచి 28 ఏళ్ల వయసు ఉన్న 45,000 మందికిపైగా విద్యార్థుల రోజువారీ జీవనశైలి వివరాలను సేకరించారు. రోజూ ఏ సమయానికి నిద్రపోతారు, రాత్రిళ్లు నిద్రపోవడానికి ముందు ఎంతసేపు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ చూస్తారు, తర్వాత ఎంతసమయానికి నిద్రపడుతుంది, వంటి ఎన్నో వివరాలను రాబట్టారు. డిజిటల్ పరికరాలను వాడేటప్పుడు సినిమాలు చూస్తారా, సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తారా వంటి వివరాలను సేకరించారు. ‘‘సోషల్ మీడియా మాధ్యమాల చూడటం కోసం వెచ్చించి సమయం, ఇతర కార్యక్రమాలను చూడటానికి కేటాయించిన సమయాల్లో పెద్ద తేడాలులేవు.
ఏ రకం డివైజ్‌ను వాడారు అన్న దానికంటే అసలు ఎంత సమయం వాడారు అనేదే ఇక్కడ ప్రధానం. స్క్రీన్ ఎక్కువసేపు చూడటం వల్ల అంతసేపు నిద్రను వాయిదావేస్తున్నారు. దాంతోపాటు స్క్రీన్ వాడకం వల్ల తర్వాత సైతం నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారు. ఇలా దాదాపు 30 నిమిషాలకంటే ఎక్కువ సమయం నిద్రలోకిజారుకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిద్రపట్టక మధ్యలో బెడ్ మీద నుంచి లేచి వచ్చి కొద్దిసేపు అటూ ఇటూ నడవడం లాంటివి చేస్తున్నారు’’అని నార్వేనియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధకుడు, పరిశోధనలో కీలక సభ్యుడు గన్‌హీల్డ్ జాన్సన్ హెజెట్‌ల్యాండ్ చెప్పారు.
రోజంతా ఇబ్బంది
‘‘ఇలా రాత్రిళ్లు స్క్రీన్ చూసి నిద్రపట్టక కాస్త ఆలస్యంగా నిద్రపోయిన వారు తెల్లారాక సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నాణ్యమైన నిద్రలేకపోవడంతో తదుపరి రోజంతా దైనందిన జీవిత పనులను సవ్యంగా చేసుకోలేకపోతున్నారు. అధిక స్క్రీన్ వినియోగం అనేది నాలుగు రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. తరచూ నోటిఫికేషన్లు టింగ్ టింగ్‌మని వస్తూ నిద్రను పాడుచేస్తాయి. నిద్రపోయే సమయాన్ని స్క్రీన్‌టైమ్ అనేది మింగేస్తోంది. స్కీన్‌చూసినంతసేపు నిద్రపోలేని పరిస్థితి ఉండటంతో ఆమేరకు నిద్ర తగ్గుతోంది. అంతసేపు స్కీన్ నుంచి వచ్చే కాంతి ప్రభావానికి లోనవడంతో శరీరంలోని జీవగడియారం సైతం సరిగా పనిచేయదు’’అని జాన్సన్ వివరించారు.
ఎన్నో సమస్యలు
స్క్రీన్ టైమ్ కారణంగా నిద్ర మాత్రమే తగ్గి కేవలం ఇన్సోమ్నియా బారిన పడతామని భావించకూడదు. అది రోజువారీ జీవితంపైనా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం మెల్లగా దెబ్బతింటుంది. విద్యా ప్రమాణాలు పడిపోతాయి. సగటున 24 నిమిషాల నిద్రాకాలం తగ్గిపోతుంది. మొత్తంగా విద్యా, ఆరోగ్యం, మానసిక సంబంధ స్థాయిలు దిగజారుతాయి. ఈ సమస్యలు శాశ్వతంగా ఉండకూడదంటే నిద్రకు ఉపక్రమించడానికి కనీసం గంటముందే స్క్రీన్‌ను చూడటం ఆపేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో హోమ్‌పేజీపై నోటిఫికేషన్లు కనపడకుండా డిజేబుల్ చేయాలి’’అని జాన్సన్ సూచించారు.