Risks
-
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్‌లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
రిస్కులో బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ
న్యూఢిల్లీ: రీసైక్లింగ్ వ్యవస్థలో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ పలు రిస్కులు ఎదుర్కొంటోందని మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్‌ఏఐ) తెలిపింది. పరిశ్రమలోకి మోసపూరిత వ్యాపార సంస్థల ఎంట్రీతో పాటు పర్యావరణంపరంగా విపత్తులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వివరించింది.ప్రస్తుత ధర విధానం వల్ల లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై భారత్‌కు సుమారు 1 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకంపరంగా నష్టం వాటిల్లుతోందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో లిథియం రీసైక్లింగ్‌కు ఫ్లోర్ ధరను పెంచాలని, నిబంధనలు పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంఆర్‌ఏఐ వివరించింది. -
రిస్క్ లు తెలుసుకోకుండానే ఎఫ్‌అండ్‌వోలోకి
న్యూఢిల్లీ: సత్వర లాభాలపై ఆశలు, స్పెక్యులేటివ్ ధోరణులే రిటైల్ ఇన్వెస్టర్లను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు రిస్క్ ల గురించి ఆలోచించకుండా ట్రేడింగ్‌లోకి దూకి, చేతులు కాల్చుకుంటున్నారు. అలా జరగకుండా ఎఫ్‌అండ్‌వోపై పూర్తి అవగాహన పెంచుకుని, రిస్క్ లను ఎలా ఎదుర్కొనాలనేది తెలుసుకుని మాత్రమే ఇందులోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ లతో కూడుకున్న ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తుండటంపై కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ మాధవిపురి బచ్ తదితరులు ఈ సాధనం విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. అయినప్పటికీ ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ భారీగా పెరుగుతూనే ఉంది. 2019లో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్ నెలవారీ టర్నోవరు 8,740 లక్షల కోట్లుగా ఉండేది. ఇది 2024 మార్చి నాటికి ఏకంగా రూ. 217 లక్షల కోట్లకు ఎగిసింది. సెబీ అధ్యయనం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం మంది నష్టపోయారు. నష్టాలు సగటున రూ. 1.1 లక్షలుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ అనేది హెడ్జింగ్, స్పెక్యులేషన్ కోసం ఉపయోగకరంగా ఉంటుందని, కానీ అధిక స్థాయిలో మార్జిన్లు అవసరమవుతాయి కాబట్టి రిస్క్ లు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఫైయర్స్ సహ–వ్యవస్థాపకుడు తేజస్ ఖోడే చెప్పారు. వీటి వల్ల చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈ సాధనాలు, వాటిలో ఉండే రిసు్కల గురించి రిటైల్ ఇన్వెస్టర్లు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయడం మంచిదని సూచించారు. ‘ఈ సాధనాలకు అవసరమైన పెట్టుబడి తక్కువగానే ఉండటం, వివిధ సూచీల్లో వీక్లీ ఎక్స్‌పైరీలు కూడా అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ లు కూడా పెరిగాయి‘ అని ఆనంద్ రాఠీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా చెప్పారు. -
వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం
ఈ రోజు మే నెల 28వ తేదీ! ఈ రోజుకో ప్రత్యేకత ఉందండోయ్! అంతర్జాతీయంగా మెనుస్ట్రువల్ హైజీన్ డేగా జరుపుకుంటారు. మహిళల నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరం, పాటించకపోతే వచే ప్రమాదాల గురించి అందరిలో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. అలాగే.. నెలసరి నిర్వహణకు సంబంధించిన ఉత్పత్తులు అందరికీ, వీలైనంత చౌకగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కూడా ఈ రోజున ప్రయత్నాలు, చర్చలు జరుగుతాయి. పాఠశాలల్లో ఆడపిల్లలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంచిపెట్టినా.. మరే ఇతర కార్యక్రమం ద్వారానైనా ఆరోగ్యకరంగా రుతుస్రావ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకుంటున్న చర్యలే. ఓకే.. అంతా బాగానే ఉంది కానీ.. అసలు ఈ వరల్డ్ మెనుస్ట్రువల్ డే అనేది ఎలా ఆచరణలోకి వచ్చిందో మీకు తెలుసా? నెలసరి సమయంలో పరిశ్రుభత పాటించకపోవడం ఎంత ప్రమాదకరమో మీకు అవగాహన ఉందా? ఆలస్యమెందుకు తెలుసుకుందాం రండి...ఆవిర్భావమిలా...జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘వాష్’ 2013లో ఏటా మే 28వ తేదీని వరల్డ్ మెనుస్ట్రువల్ హైజీన్ డేగా జరుపుకోవడం మొదలు పెట్టింది. రుతుస్రావం అనే అంశం ఏదో గుసగుసలాడుకునేది మిగిలిపోరాదని, అసంబద్ధ, మూఢవిశ్వాసాలతో కూడిన సామాజిక కట్టుబాట్ల నుంచి మహిళలు బయటపడాలన్న లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారు. అలాగే ప్రభుత్వాధినేతలు, అధికారులు ఈ అంశానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి తేవడమూ ఒక లక్ష్యమే. మహిళల్లో నెలసరి రుతుచక్రం 28 రోజులపాటు నడుస్తుంది కాబట్టి రుతుస్రావం ఐదు రోజులు కొనసాగుతుంది కాబట్టి ఏటా ఐదవ నెల 28వ తేదీన హైజీన్ డేను జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు. పరిశుభ్రతతో ఆరోగ్య రక్షణ...సౌకర్యాల లేమి, సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా లక్షలాది మంది అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో పరిశుభ్రతను పాటించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో నివారించదగ్గ రోగాల బారిన పడాల్సి వస్తోంది. పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మూత్రాశయ నాళంతోపాటు పునరుత్పత్తి అవయవాలు కూడా ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. ఇవి కాస్తా దీర్ఘకాలంలో పిల్లలు పుట్టకపోయేందుకూ, కాన్పు సమయంలో సమస్యలకు దారితీయవచ్చు. రుతుస్రావ సమయంలో జననేంద్రియ ప్రాంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, తరచూ దురద, పొక్కుల్లాంటివి ఏర్పడేందుకు కారణమవుతుంది. శానిటరీ ప్యాడ్లను మార్చుకునే సందర్భంలో చేతులను కూడా బాగా శుభ్రం చేసుకోవడం ద్వారా హెపటైటిస్-బీ, థ్రష్ వంటి రోగాలను నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎక్కువ సేపు ఒకే ప్యాడ్ ధరించడం: మహిళలు 6-8 గంటలకోసారి శానిటరీ న్యాప్కిన్లను మార్చుకోవాలి. లేదంటే దద్దుర్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.చేతులు కడుక్కోకపోవడం: శానిటరీ నాప్కిన్లను మార్చే ముందు, మార్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. లేదంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా హెపటైటిస్ బికి దారి తీస్తుంది.వెనుక నుంచి ముందుకి కడగడం: రుతుస్రావం సమయంలో జననేంద్రియ ప్రాంతాలను శుభ్రం చేసుకునేందుకూ ఒక పద్ధతిని పాటించాలి. ముందు నుంచి వెనక్కు కడగడం అవసరం. ఇందుకు భిన్నంగా చేయడం వల్ల హానికారక బ్యాక్టీరియా పేవుల్లోకి చేరే అవకాశాలు పెరుగుతాయి.రుతుస్రావం సమయంలో భరించలేని నొప్పి, వికారం వాంతులు లాంటివి లక్షణాలు కనిపించినపుడు, వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. తగిన విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకోవాలి. -
సదా అప్రమత్తంగా ఉండండి
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఎల్లప్పుడూ అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఉదాసీనతకు చోటులేకుండా సవాళ్ల పట్ల జాగరూకత వహించాలన్నారు. పటిష్ట బ్యాంకింగ్‌కు సంబంధించి నిరంతర పరస్పర చర్యల్లో భాగంగా గవర్నర్ కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు. ఫైనాన్షియల్ విధుల నిర్వహణలో భారత్ బ్యాంకింగ్ చక్కటి పురోగతి సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. అయితే చక్కటి బ్యాలెన్స్ సీట్స్ నిర్వహణ, వ్యక్తిగత రుణాలపై పర్యవేక్షణ, సహ–రుణ మార్గదర్శకాలను పాటించడం, ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల అందజేత, ద్రవ్య లభ్యత సవాళ్లు, ఐటీ– సైబర్ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల పటిష్ట నిర్వహణ, డిజిటల్ మోసాల నివారణ వంటి అంశాలపై అన్ని సమయాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంటూ... ఫైనాన్షియల్ వ్యవస్థ రక్షణ, స్థిరత్వలో ఇది కీలకమని అన్నారు. ఆర్బీఐ ఫిన్‌టెక్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి బ్యాంకులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్‌రావు, స్వామినాథన్సహా నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. -
ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!
పెళ్లి సంబంధం కుదరగానే వారి వారి స్థోమత మేరకు పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేయాలనే ఆలోచన చేస్తుంటారు పెద్దవాళ్లు. పెళ్లిలో కాబోయే అత్తగారి డిమాండ్ మేరకు వధువు అమ్మానాన్నలు నడుచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవల మరో కొత్త డిమాండ్ కూడా వచ్చి చేరింది.కాబోయే పెళ్లికూతురు వివాహ వేడుకలో దేదీప్యమానంగా వెలిగిపోవాలి. అందరూ ‘అందమైన కోడలిని సెలెక్ట్ చేసుకున్నారు అనే కితాబులు అందుకోవాలి. అందుకు, చికిత్స చేయించుకున్నా సరే!’ అంటున్నారు. మరి, కాబోయే వధువులు వేడుకకు సిద్ధం కావడానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అందం పట్ల తీసుకుంటున్న చికిత్సలు.. వికటిస్తున్న పరిమాణాలు ఏమిటి? భేష్ అనదగిన విధానాలేమిటి? అనే విషయాలపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ‘‘ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న సుష్మ పెళ్లి వచ్చే డిసెంబర్లో జరగనుంది. పెళ్లి ఫిక్స్ అయ్యాక అత్తగారు నవ్వుతూ – ‘అమ్మాయీ, నీ వంటి రంగు బ్రైట్ చేయించుకో. ఫెయిర్ నెస్ కోసం ఇంజెక్షన్లు మార్కెట్లో దొరుకుతాయని విన్నాను. వాటిని ట్రై చేయి. ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకో. కానీ, పెళ్లి టైమ్‌కి అందంగా తయారవ్వాలి’ అని ఆర్డర్ వేసింది. ఆమె తన కోడలు పందిట్లో చందమామలా కనిపించాలని, కోడలు మొహం చూసి బంధుమిత్రులంతా నిశ్చేష్టులవ్వాలని కోరుకుంటుంది. ‘అత్తగారి డిమాండ్ ఇప్పుడు నాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటోంది సుష్మ. ఇందుకోసం బ్యూటీ ట్రీట్మెంట్స్తో పాటు చర్మ ఛాయలో కూడా తేడా వచ్చేలా మార్పులు చేసుకోవడానికి తెగ కష్టపడుతోంది. ‘పెళ్లి అంటేనే ఎంతో ఉత్సాహం. ఫొటోల్లో, వీడియోల్లో బాగా కనిపించాలని, అందరిలో ప్రత్యేకంగా వెలిగిపోవాలని నాకూ ఉంటుంది. ఇందుకు బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం, మేకప్ చేయించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. పెళ్లి ఖర్చులే కాకుండా ఈ కొత్త తరహా ఖరీదైన ఖర్చు తలనొప్పిగా మారింది అంటున్నారు అమ్మనాన్నలు’ అని బాధపడుతోంది సుష్మ. కాబోయే అత్తగారు కోరడంతో రూప (పేరు మార్చడమైంది) తన కంటి కింది భాగం లోతుగా ఉండటం వల్ల ‘అండర్ ఐ ఫిల్లర్’ ఇంజక్షన్ చేయించుకుంది. దీంతో కంటి కింది భాగంలో రక్తం గడ్డకట్టి, వాపు వచ్చి, బయటకు రాలేని పరిస్థితి. త్వరలో పెళ్లి. ఆ క్లాట్ అంత తొందరగా తగ్గదు. దిక్కుతోచని పరిస్థితి. శిల్ప అందం కోసం బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంది. డోస్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి వీలు లేకుండా మారిపోయింది. అందం పెంచుకునే విషయంలో ఒకరో ఇద్దరు కాదు అమ్మాయిలు ఎప్పుడూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లి అంటే చెప్పనక్కర్లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి ప్రతి సంబరాన్నీ పదిలపరుచుకోవడానికి ఎన్నో పాట్లు పడతారు. దీంట్లో భాగంగా బ్యూటీ కాన్షియస్ అమ్మాయిల్లోనూ, అబ్బాయిల్లోనూ పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది అంటున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్న ప్రియ. వాటిలో... ఇంట్లో ప్రయోగాలు.. చాలా మంది అందానికి ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. సహజంగా లభించే వాటితో బ్యూటీప్యాక్‌లు వేసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా ఎంత సమయంలో ఎంత ప్రయోజనం ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే, కొంతమందికి స్కార్స్, పింపుల్స్, యాక్నె, డల్ స్కిన్, కలర్ ఛేంజ్, చుండ్రు... ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి చికిత్సనే సరైన మార్గం. ఆహారానికి సంబంధించినవి తప్పనిసరిగా పెళ్లికి రెండు నుంచి మూడు నెలల ముందు మార్పులు చేసుకోవాలి. సహజంగా చర్మంలో మార్పులు రావాలంటే పోషకాహారం మంచి ఎంపిక. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. బ్యూటీ స్పాలో చికిత్స మంచిదేనా? స్కిన్ టైటనింగ్, రింకిల్స్, స్కిన్ హైడ్రేషన్.. వంటి ట్రీట్మెంట్స్ బ్యూటీ స్పాలలో చేయించుకుంటారు. దీనికి కూడా ముందు సరైన కౌన్సెలింగ్ అవసరం. ఒక్కో వ్యక్తి చర్మ తత్త్వం ఒక్కో విధంగా ఉంటుంది. ఈ విధానంలో చర్మం రికవరీ అవడానికి కూడా సమయం పడుతుంది. ఇంజక్షన్లు సరైనవేనా... కృత్రిమంగా కొలాజన్, స్కిన్ బూస్టర్స్.. అని తీసుకుంటున్నారు. ఎవరో చెప్పారని కొంతమంది నర్సులను ఇంటికి పిలిపించుకొని ఇంజక్షన్లు చేయించుకుంటారు. మంచి లుక్ కోసం ట్రై చేయచ్చు. కానీ, వాటి డోసుల్లో తేడాలొస్తే మొత్తం తిరగబడుతుంది. ఆన్లైన్లో చూసి ... సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆన్లైన్లో బ్యూటీ ఉత్పత్తులు తెప్పించుకొని, అప్లై చేసుకోవడం చూస్తుంటాం. వాటి వల్ల ఇబ్బందుల పాలైన వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే, అవి వారికి ఎంత వరకు నప్పుతాయో తెలియదు. కెమికల్ పీలింగ్ కెమికల్ పీల్లో బయటి నుంచి చర్మంలోకి ఎలాంటి రసాయనాలు చొప్పించరు. మృతకణాలను తొలగిస్తారు, చర్మం పై పొర నుండి టానింగ్, పిగ్మెంటేషన్ తగ్గి కొత్త పొర కనిపిస్తుంది. అయితే, దీని ద్వారా చర్మంపై కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిపుణుల సలహా అవసరం. ఇంకొన్ని పీఆర్పీ చికిత్సలు చర్మ నిగారింపును తీసుకువస్తాయి. అయితే, వధువులు కాబోయే అమ్మాయిలు పెళ్లికి 3 నుండి 6 నెలల ముందు ఈ కాస్మెటిక్ విధానాలను ప్రారంభించాలి. ఎందుకంటే వారి సిట్టింగ్‌లలో కనీసం 3 వారాల గ్యాప్ ఉండాలి. లైటర్ టోన్లకు డిమాండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తమ ప్రీ–బ్రైడల్ విధానంలో రంగు ఫెయిర్‌గా మారడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి, సూర్యకిరణాల నుండి మన చర్మాన్ని మనం రక్షించుకోనప్పుడు, చర్మంలో పాచెస్ ఏర్పడతాయి. కొన్నిసార్లు సూర్యకాంతి కుడి వైపున, మరి కొన్నిసార్లు ఎడమ వైపున ఎక్కువగా పడుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలను దెబ్బతీస్తాయి. పిగ్మెంటేషన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో అంతటా ’చర్మపు రంగు’ ఒకే విధంగా ఉండదు. అంటే ముఖం మీద చాలా చోట్ల టాన్ ఉంటుంది. ఈవెన్ టో ని కలిగి ఉండాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖంపై సన్ స్క్రీన్‌ని అప్లై చేయడం చాలా ముఖ్యం. కాస్మొటిక్ ఫిల్లర్స్... నిఖిత పెదవులు చాలా సన్నగా ఉంటాయి. రంగు చాలా తక్కువ. ఒకరోజు ఆమె కాబోయే అత్తగారు ఫోన్ చేసి ‘నీ ముఖంలో పెదవులు కనిపించడం లేదు. ఏదైనా చికిత్స తీసుకో’ అంది. దీంతో నిఖిత నర్సులను కాస్మెటిక్ ఫేషియల్ ఫిల్లర్లను ఆశ్రయించింది. దీనిని లిప్ ఫిల్లర్ అని కూడా అంటారు. దీర్ఘకాలిక ఫలితాల కోసం, ప్రతి 6 నుండి 8 నెలలకు ఇంజెక్షన్లు చేయాలి. కాస్మెటిక్ ఫేషియల్ ఫిల్లర్లే కాకుండా, హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్ ఇంజక్షన్లు కూడా ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ డెర్మా ఫిల్లర్లతో పెదవులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. పగుళ్లు రావు, పూర్తి పరిమాణంలో కనిపిస్తాయి. అలాగే, కొందరు అమ్మాయిలు అత్తింటి వారు బరువు తగ్గమన్నారు కదా అని లైపోసక్షన్ వంటి చికిత్సలు చేయించుకుంటారు. దీని వల్ల చర్మంపై చారలు ఏర్పడతాయి. అవి అంత త్వరగా పోవు. ముక్కు, పెదాలు, బ్రెస్ట్ సరిచేసుకోవడానికి కాస్మొటిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఏ చికిత్స అయినా కనీసం ఆరు నెలల ముందు చేయించుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్నూ నివారించవచ్చు. సహజమైన మెరుపే మేలు పెళ్లి 10–15 రోజులు ఉందనగా ఏ బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోకూడదనే విషయం ముందు గ్రహించాలి. కనీసం ఆరు లేదా మూడు నెలల ముందు బ్యూటీ చికిత్సలు చేయించుకోవచ్చు. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే నివారించుకునే అవకాశం ఉంటుంది. కృత్రిమ అందాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎప్పుడైనా సహజమైన మెరుపును ఇచ్చే బ్యూటీ ట్రీట్మెంట్ మాత్రమే మంచిదని గమనించాలి. అయినా తప్పదు అనుకునేవారు స్కిన్ బూస్టర్స్, ఇతర ట్రీట్మెంట్ వైపుగా వెళ్లచ్చు. ఇందుకు నిపుణుల పర్యవేక్షణ అవసరం. డాక్టర్ స్వప్నప్రియ, డర్నటాలజిస్ట్ (చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!) -
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదా? ప్రమాదమా?
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దంటారు. నిజమేనా? ఒకవేళ జ్వరం లాంటి వాటికి డోలో వంటి మందులు వేసుకుంటే ఏమన్నా ప్రమాదమా? – సి. వెంకటలక్ష్మి, బిచ్కుంద ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్ ఉండటం చాలామందిలో చూస్తుంటాం. పెయిన్ టైప్, తీవ్రతను బట్టి పెయిన్ స్కేల్ అసెస్మెంట్తో నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సెలింగ్ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDS డ్రగ్ ఫ్యామిలీకి సంబంధించిన Brufen, Naproxen, Diclofenac లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ఏడు నుంచి తొమ్మిది నెలల్లో. పారాసిటమాల్(డోలో, కాల్పాల్, క్రోసిన్) లాంటివి వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్ ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, వేడి, ఐస్ కాపడాలు వంటివి సూచిస్తారు. పారాసిటమాల్‌ని వాడవచ్చు. 30 వారాలు దాటిన తర్వాత ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే Opiates పెయిన్ కిల్లర్స్ అంటే Morphine, Tramadol లాంటివి సూచిస్తారు. లేబర్ పెయిన్‌ని కూడా కొంతవరకు ఓర్చుకోగల ఉపశమనాన్నిస్తాయి. అయితే ఇవి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే వాడాలి. కొంతమంది గర్భిణీలకు నర్వ్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసిటమాల్‌ని ఇస్తారు. గర్భిణీ.. నిపుణల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి. కొందరికి Amitriptyline లాంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు. పారాసిటమాల్ ఒళ్లు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసిటమాల్ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?) -
టాటులు వేయించుకోవడం మంచిది కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు రావా?
పచ్చబొట్టు వేసుకోవడం పురాతన కళ. ప్రపంచవ్యాప్తంగా ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. పలుదేశాల్లో బయటపడిన కొత్తరాతియుగం నాటి ఆధారాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా 3300 నుంచి 3200 నాటి ‘ఓట్జీ ది ఐస్ మ్యాన్’ మమ్మీ.. ఆస్ట్రియా–ఇటలీ సరిహద్దుల్లో దొరికింది. అతడి పచ్చబొట్లను ఎక్స్ రే తీసిన శాస్త్రవేత్తలు.. అతడి శరీరంపైనున్న ప్రతి పచ్చబొట్టుకు కొన్ని నొప్పులు, వ్యాధులే కారణమని నిర్ధారించారు. దీనిని బట్టి పురాతన చికిత్సా విధానాల్లో భాగంగా పచ్చబొట్లను వేసుకునేవారని తేలింది. ఫ్రాన్స్, పోర్చుగల్, స్కాండినేవియన్ దేశాల్లోని పురావస్తు శాఖ పరిశోధకులకు పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే పురాతన పరికరాలు దొరికాయి. అవి సుమారు పన్నెండువేల ఏళ్ల నాటి మంచు యుగానికి చెందినవని నిర్ధారించారు. ఆనాటి కొన్ని స్త్రీల బొమ్మలపై పచ్చబొట్ల లాంటి చిత్రాలు ఉన్నాయి. తొడలపైన, వీపు మీద పచ్చబొట్లు వేయించుకోవడం అప్పటి నుంచే ఉండేదనేందుకు ఆ చిత్రాలే నిదర్శనాలు. పచ్చబొట్లు చర్మం మీద వేయించుకొనే శాశ్వత చిహ్నాలు. ఒకప్పుడు ఇవి నలుపు, ముదురాకుపచ్చ రంగుల్లో ఉండేవి. ఇప్పుడు పచ్చబొట్లు రకరకాల రంగులతో మరింత కళాత్మకంగా రూపు దిద్దుకున్నాయి. పూర్వం చాలామంది సంతల్లో, జాతర్లలో తమ పిల్లలు తప్పిపోకూడదని చేతులపై వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించేవారు. పలు తెగలకు చెందిన గిరిజన స్త్రీలు తమ ముంజేతులు, భుజాలు, పాదాలపై నక్షత్రాలు, చందమామ చిత్రాలను తమ తమ సంప్రదాయాల ప్రకారం పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అప్పట్లో కొందరు స్త్రీలు సౌందర్యం కోసం బుగ్గలు, పై పెదవి, చుబుకం మీద పుట్టుమచ్చల్లా పచ్చబొట్లు వేయించుకునేవారు. కాలక్రమేణా మనసులోని ప్రేమను వ్యక్తపరచేందుకు ప్రియమైనవారి పేరును పచ్చబొట్టు వేయించుకునేవారు పెరిగారు. ప్రాచీన గ్రీకు, రోమన్, పర్షియన్ రాజ్యాల్లో బానిసలు, నేరగాళ్లు పారిపోయినా, వారిని సులువుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుగా వారి శరీరాలపై ప్రస్ఫుటంగా కనిపించేలా పచ్చబొట్లు వేసేవారు. రోమన్ చక్రవర్తుల కాలంలో పచ్చబొట్ల కళకు రాజాదరణ అమితంగా ఉండేది. రాజులను మెప్పించడానికి రాజ దర్బారులోని వారంతా పచ్చబొట్లు వేయించుకునేవారు. దర్బారులోని రాజోద్యోగులను చూసి సామాన్య పౌరులూ పచ్చబొట్లు వేయించుకోవడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతోంది. ఈ ధోరణి విపరీతమైన కొన్నాళ్లకు.. కొందరు మతపెద్దలు పచ్చబొట్లను నిషేధించడంతో 19వ శతాబ్దం వరకూ పశ్చిమ యూరోపియన్లకు పచ్చబొట్ల కళ దూరమైంది. ఇక తూర్పు యూరోపియన్లు కూడా పచ్చబొట్లపై పెద్దగా ఆసక్తికనబరచలేదు. అయితే వారు తమ శత్రువులను అవమానించడానికి అసహ్యకరమైన పచ్చబొట్లను నుదుటిపై వేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. టాటూ అర్థాలు వాటర్ కలర్ టాటూలు, బ్లాక్‌వర్క్ టాటూలు, ఇలస్ట్రేటివ్ టాటూలు, హెన్నా టాటూలు, డాల్ఫిన్ టాటూలు, పువ్వులు, సీతాకోక చిలుకలు, పక్షుల టాటూలు.. ఇలా ఒకటి రెండూ కాదు కొన్ని వందల టాటూలు ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా రంగులు పెరిగే కొద్దీ సహజమైన అందాలను అచ్చంగా అద్దే ఆర్టిస్ట్‌లు చాలామందే పుట్టుకొస్తున్నారు. అయితే టాటూ బాగుంది కదా అని వేయించుకునే వారికంటే.. వాటి అర్థాలు తెలుసుకుని వేయించుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో టాటూ అర్థాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కువమంది వాడే కొన్ని టాటూల అర్థాలు చూద్దాం. డ్రాగన్ – ధైర్యం, బలం, రక్షణ, శక్తి, జ్ఞానం సీతాకోక చిలుక – అందం, స్వేచ్ఛ, విశ్వాసం పక్షులు – స్వేచ్ఛ, ఆకాశమే హద్దు నక్షత్రం – ఆశ, విశ్వాసం, పరివర్తన, ఆశయం, విజయం పువ్వులు – సున్నితత్వం, ప్రశాంతత (ఎంచుకున్న రంగును బట్టి, పువ్వును బట్టి మరిన్ని అర్థాలు మారతాయి) సూర్యుడు – ఆరంభం, శక్తి మ్యూజిక్ టాటూ – ప్రేమ, పరివర్తన, అహ్లాదం (డప్పు, పియానో, ప్లేబ్యాక్ బటన్స్ వంటి రూపాలను బట్టి అర్థాలు మారతాయి) పులి – నాయకత్వం, ప్రాణాంతకం, భయానకం, ప్రకృతిపై ప్రేమ సింహం – రాజసం త్రాసు – సానుకూలత, ఆదర్శవాదం శాశ్వత అలంకరణగా టాటూ మేకప్ ఎర్రని పెదవులు, గులాబి బుగ్గలు, నిండుగా ఉన్న కనుబొమలు, దట్టంగా కనిపించే కనురెప్పలు.. వీటితో స్త్రీలకు ప్రత్యేకమైన అందం వస్తుంది. అందుకే తాత్కాలిక కాస్మెటిక్స్ పక్కన పెట్టి మరీ.. ఈ పర్మినెంట్ టాటూ రంగుల్ని వాడటం మొదలుపెట్టారు నేటి మహిళలు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదని.. 1902లో లండన్‌లో మొదలైందనే ఆధారాలున్నాయి. అయితే భారతీయుల్లో పర్మినెంట్ మేకర్ అనే ఈ కళ 19వ శతాబ్దం చివర్లో ప్రారంభమైంది. ఇప్పుడు దేశవాప్తంగా పలు సెలూన్స్, స్కిన్ క్లినిక్స్ ఇలాంటి శాశ్వతమైన మేకప్ ట్రెండ్‌ని అందిస్తున్నాయి. అయితే కొంతమంది అమ్మాయిలు.. పార్టీలు, ఫంక్షన్ల కోసం మాత్రమే సెమీ పర్మినెంట్ మేకప్స్ వేయించుకుంటున్నారు. అవి కొన్ని రోజుల పాటు చెక్కు చెదరని అందాన్ని ఇస్తుంటాయి. కానీ పర్మినెంట్ మేకప్స్ పట్ల మోజు చూపే యువత సంఖ్యే ఎక్కువగా ఉంది. సున్నితమైన పెదవులు, కళ్లు వంటి చోట్ల పర్మినెంట్ మేకప్‌లో భాగంగా రసాయనాలు వాడుతుండటం అంత మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో వీటి జోలికి వెళ్లేందుకు కాస్త వెనుకాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కపుల్ టాటూస్‌తో పాటు ఫ్రెండ్స్ టాటూలూ బాగానే ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వీటితో పాటు పాపులర్‌గా నిలుస్తున్న కొన్ని టాటూస్ విశేషాలు చూద్దాం. ►కలర్‌ఫుల్ టాటూస్: వీటిలో చాలా కలర్స్ వాడుతారు. మనిషి ముఖం, పువ్వులు వంటి ప్రకృతి అందాలను సహజసిద్ధంగా చెక్కుతారు. ►టెంపరరీ టాటూ: నచ్చిన స్టికర్ సెలెక్ట్ చేసుకుంటే.. దాని మీద ఒకరకమైన స్ప్రే జల్లి.. ఆ స్టికర్ లాగేస్తారు. ఇది మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. ►యానిమే టాటూ: వీడియో గేమ్స్ నుంచి ప్రేరణ రూపొందిన టాటూలు ఇవి. యానిమేషన్ లవర్స్ వీటిని విపరీతంగా వేయించుకుంటున్నారు. ►లివింగ్ టాటూ: దీన్నే త్రీడీ టాటూ అనీ అంటారు. వీటిలో కొన్ని చూడటానికి కదలుతున్నట్లుగా ఉంటాయి. మనదేశంలో ఇవి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. ►మ్యూజిక్ ప్లేయింగ్ టాటూ: ఇష్టమైన వారి వాయిస్‌ని రికార్డ్ చేసి.. దాన్ని మ్యూజిక్ సింబల్ రూపంలో మార్పించి, దాన్ని టాటూగా వేయించుకోవచ్చు. అలా వేయించుకున్న టాటూని.. ఫోన్లో తిరిగి స్కాన్ చేస్తే ఆ వాయిస్ మనకు వినిపిస్తుంది. టాటూ క్యాన్సర్ కారకమా? కలప బూడిదతో, నూనె, పసుపు కాల్చిన మసితో మూలికలను జోడించి.. పూర్వం పచ్చబొట్టు సిరాలను తయారు చేసేవారు. అయితే నేడు రకరకాల పిగ్మెంట్స్తో తయారైన కెమికల్ ఇంకును వాడుతున్నారు. పైగా ఏది ఎంత మోతాదులో వాడుతారనేదానికి సరైన తూకం లేదు. తయారీదారులు వాటి సాంద్రతను, గాఢతను బహిర్గతం చేయాల్సిన పనిలేదు. అలాగే టాటూ డిజైనర్స్.. వేసే డిజైన్ని బట్టి సొంతంగానే సిరాను కలిపి పచ్చబొట్లను చిత్రిస్తారు. దాంతో దేని మోతాదు ఎంత? దాని వల్ల కలిగే ఫలితాలేంటి అనేవి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అయితే గత ఏడాది అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు టాటూ ఇంక్స్ మీద పలు పరిశోధనలు చేశారు. అప్పుడే ఓ షాకింగ్ విషయం బయటపడింది. టాటూల కోసం ఉపయోగించే ఇంకుల్లో క్యాన్సర్ కారకం ఉందని వారు వెల్లడించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన సైంటిస్ట్ స్వియర్క్ నేతృత్వంలో దాదాపు వంద రకాల టాటూ ఇంకులను పరీక్షించారు. టాటూలు ఎప్పటికీ తొలగిపోకుండా శరీరంపై ఉండటానికి ఇంకుల్లో ఉండే పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్ని వాడుతుంటారు. శాస్త్రవేత్తలు పరీక్షించిన 100 ఇంకుల్లో 23 ఇంకుల్లో అజో అనే సింథెటిక్ రంగుల ఉనికిని గుర్తించారు. సాధారణంగా అజో సింథెటిక్ రంగులను ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులు, దుస్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి బ్యాక్టీరియా చేరినా, అధిక సూర్యరశ్మి తగిలినా క్యాన్సర్ కారకంగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. టాటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావా? ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధపడే వారు.. శరీరంపై పచ్చబొట్లు వేయించుకునే ఆలోచన మానుకుంటే మంచిది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, పోలీసు ఉద్యోగాలతో పాటు.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) వంటి ఉద్యోగాలు ఒంటిపైన పచ్చబొట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రావు. వాస్తవానికి, శరీరంపై పచ్చబొట్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోవడానికి.. పచ్చబొట్లు పలు వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందనేది ఒక కారణం కాగా.. సైన్యం వంటి రక్షణ రంగంలో శరీరంపై టాటూలు భద్రతకు ముప్పు అనేది మరో కారణం. అంతేకాదు టాటూ వేసుకున్నవారు క్రమశిక్షణా రాహిత్యంతో ఉంటారనే అభిప్రాయమూ ఉంది. అయితే గత ఏడాది.. అన్ని అర్హతలూ ఉన్నా కేవలం తన ఒంటి మీదున్న టాటూ కారణంగా తనకు సర్కారు కొలువును నిరాకరించారంటూ అసోమ్‌కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ హైకోర్టు్టను ఆశ్రయించాడు. అయితే ఈ కేసులో కోర్టు.. పచ్చబొట్టు తీయించుకునేందుకు రెండు వారాలు గడువు ఇచ్చింది. పచ్చబొట్టు తొలగించుకున్నాక మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలని, ఆ తర్వాతే నియామకం జరుగుతుందని తీర్పు చెప్పింది. రక్తదానం చేయకూడదా? గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో రక్తదానాలు చేసే వారి సంఖ్య పెరిగింది. రాజకీయ అభిమానులు, సినీ నటుల అభిమానులతో పాటు చాలామంది యువత సేవాభావంతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సర్వసాధారణమైంది. అయితే రక్తదానం చేయడానికి ముందుకొచ్చేవారిలో వందకు సుమారు తొంభై మంది టాటూస్తోనే ఉంటున్నారని కొన్ని సర్వేలు తేల్చాయి. అత్యవసర పరిస్థితుల్లో అయినా సరే.. రక్తం తీసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు వైద్యులు. ఆ జాగ్రత్తల్లో రక్తం ఇచ్చేవారు టాటూ వేయించుకున్న సమయం కూడా ముఖ్యమే. ఎందుకంటే టాటూ కారణంగా.. కొన్ని రకాల చర్మవ్యాధులు, హెపటైటిస్– ఏ, హెపటైటిస్–బీ, హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులూ సోకే ప్రమాదం ఉంది. ఎవరైనా టాటూ వేయించుకుంటే సంవత్సరం పాటు రక్తదానం చేయకూడదనేది రెడ్ క్రాస్ నిబంధన. అయితే కొన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన టాటూ సెంటర్స్‌లో టాటూ వేయించుకుంటే సమస్య లేదు. కానీ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ టాటూ వేయించుకున్న తర్వాత కనీసం ఆరు నెలలు రక్తదానం చేయొద్దని అంటోంది. ఆరోగ్య నిపుణుల సలహాలతో, ప్రొఫెషనల్ టాటూ సెంటర్స్‌లో టాటూలు వేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఇవి వద్దు గురూ.. చిరునవ్వు సానుకూలత.. విచారం ప్రతికూలత అనేది తెలిసిన సంగతే. ఇదే టాటూల విషయంలోనూ కనిపిస్తుంది. సానుకూల సంకేతాలతో మేలు, ప్రతికూల సంకేతాలతో కీడు ఎలా వచ్చిపోతాయో మన పురాణాల్లో ఋషులు వర్ణించారు. అందుకే కొందరు శాస్త్రం తెలిసిన పెద్దలు.. కొన్ని రకాల టాటూలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. పగిలిన అద్దం (అశుభానికి సంకేతం), తిరగబడిన గుర్రపు డెక్క (దురదృష్టానికి ప్రతీక), విరిగిన గడియారం (పురోగతికి అవరోధం) విచారంగా ఉండే ముఖం (దుఃఖానికి సూచన) వంటివి ఒంటిపై టాటూలుగా వేయించుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే గబ్బిలం, పాము, బల్లి, పిల్లి, తేలు వంటి రూపాలను టాటూలుగా వేయించుకుంటే అవి జీవితాన్ని సన్మార్గంలో తీసుకెళ్లవని కొందరి నమ్మకం. మొన్నటికి మొన్న హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మ.. ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. స్టేడియంలోనే.. తన జెర్సీని పైకి లేపి టాటూని చూపించాడు. ఒంటిపై వేయించుకున్న తల్లిదండ్రుల రూపాన్ని చూపించి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఆ దృశ్యం.. టాటూలపై మరోసారి చర్చకు దారితీసింది. యువత ఆకర్షణకూ కారణమైంది. ఈ రోజుల్లో యూత్.. టాటూ, టాటూస్య, టాటూభ్యోహ అనే రీతిలో టాటూ ఒరవడిని ఫాలో అవుతోంది. ఆ మాటకొస్తే అక్కినేని నాగార్జున, త్రిష, జూనియర్ ఎన్టీఆర్, నాని, తాప్సీ, విక్రమ్, షాలినీ పాండే, చార్మీ ఇలా ఎందరో సెలబ్రీటీలు ఏనాడో ఈ ట్రెండ్ ప్రారంభించారు. పచ్చబొట్టు చెరిగిపోద్దిలే.. పూర్వకాలం శరీరంపై వేసిన ఈ పచ్చబొట్లను తీసివేయడం కోసం నాటు పద్ధతులను ఉపయోగించేవారు. వెనిగర్, పావురాల రెట్టలతో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని పిండికట్టులా పచ్చబొట్టుపై వేసేవారు. కానీ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్తో పచ్చబొట్లను తేలికగా తొలగిస్తున్నారు. ఈ ట్రీట్మెంట్తో నలుపు రంగులో ఉన్న పచ్చబొట్లను చాలా సులువుగా తొలగించవచ్చు. కానీ పసుపు, ఎరుపు వంటి ఇతర రంగులను తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పాత పచ్చబొట్టు కొత్త రంగులతో వన్నె తరగని ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ఆరోగ్యం.. ఆహ్లాదం.. ఆనందం! దానికి పచ్చబొట్టూ మినహాయింపు కాదు! (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
మ్యూచుఫల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా ఉండాలి?
ఈ వారం ఆరంభంలో నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిసాయి. నిఫ్టీ 19600 స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో హెక్సాగాన్ కాపిటల్కు చెందిన శ్రీకాంత్ భగవత్ తో కారుణ్యరావు సంభాషణ విందాం. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి ఎలా ఉండబోతోంది. నిఫ్టీతో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు బాగా పెరిగాయి. క్విక్ రాలీతోపాటు వాల్యూయేషన్లను పరిశీలించాలి. కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచింది. అలాగే బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తూ డెట్ ఫండ్స్, బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? రిటర్న్న్ ఎలా ఉంటాయి అంటే మిగతా అన్ని పరిస్థితులు బావుంటే.. మీడియం టర్మ్ డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి ఫలితాలుండే అవకాశాలన్నాయి. క్రెడిట్ గ్రోత్ రికవరీ అవుతున్న తరుణంలో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల వైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ. హైబ్రిడ్ ఫండ్స్‌లో టాక్స్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ పండ్స్తో పోలిస్తే డెట్స్ ఫండ్స్‌తో రిస్క్ ఎలా ఉంటుంది? అనేది పరిశీలిస్తే మ్యూచుఫల్ డెట్ ఫండ్స్ ఈల్డ్స్ బావున్నాయి. ఇంట్రరెస్ట్, క్రెడిట్, లిక్విడిటీ అనే మూడు రిస్క్‌లు ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగితే పాత బాండ్ల ధరలు పడతాయి. లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది. కరెంట్ మార్కెట్లో లార్జ్ క్యాప్‌లో మీడియం టెర్మ ఫండ్ బావుంటుంది. పీఎస్‌యూ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ కంపెనీల బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈక్విటీ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడులు మంచిది. (Disclaimer: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
రిస్క్ లపై ఇన్వెస్టర్లలో అవగాహన అంతంతే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టపడి సంపాదించే ధనాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇదే క్రమంలో పెట్టుబడి సాధనంగా మ్యుచువల్ ఫండ్స్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. కానీ, ఇన్వెస్టర్లలో రిస్కులు, తమ రిస్కు సామర్థ్యాలపై అవగాహన అంతంతమాత్రంగాన ఉంటోంది. సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడంలో తమ రిస్కు సామర్థ్యాలను అర్థం చేసుకుని, వ్యవహరించడం కీలకాంశమని 89 శాతం మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నప్పటికీ .. వాస్తవంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న వారు 27 శాతమే. 53 శాతం మంది ఇన్వెస్టర్లు తమ వ్యక్తిగత రిస్కుల మదింపు విషయంలో ధీమాగా వ్యవహరించలేకపోతున్నారు. యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ (ఏఎంసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్కుల విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,700 మంది పైచిలుకు యాక్సిస్ ఎంఎఫ్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఫండ్ రిస్కులను మదింపు చేసేందుకు రిస్్క–ఓ–మీటర్ అనే సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని 55 శాతం మందికి, అలాగే వ్యక్తిగత రిస్కులను మదింపు చేసుకునేందుకు రిస్క్ ప్రొఫైలర్‌ను ఉపయోగించుకోవచ్చని 69 శాతం మందికి అవగాహన లేదు. దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా వారికి మరింత తోడ్పాటు అందించేందుకు పరిశ్రమ కృషి చేస్తోందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. సర్వేలో మరిన్ని అంశాలు.. ► ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రామాణికంగా తీసుకోతగిన అంశాల్లో, దాని గత పనితీరు కూడా ఒకటని 59% మంది ఇంకా విశ్వసిస్తున్నారు. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించాల్సిన అవసరం, కాంపౌండింగ్ ప్రయో జనాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది ఇ న్వెస్టర్లు పలు సందర్భాల్లో తమ పెట్టుబడులను ముందుగానే ఉపసంహరించుకుంటున్నారు. ► పరిశ్రమ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 22.2% మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు 12–24 నెలల పాటే తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. 48.7% మంది తమ పోర్ట్‌ఫోలియోను రెండేళ్లు, అంతకన్నా తక్కువ వ్యవధిలోనే రిడీమ్ చేసుకుంటున్నారు. ► పెట్టుబడులు పెట్టేటప్పుడు తమ రిస్కు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన 27% మందిలో దాదాపు 64% మందికి రిస్కు సామర్థ్యాలను మదింపు చేసుకోవడానికి రిస్క్ ప్రొఫైలర్ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలియదు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 30% మందికి మాత్రమే రిస్క్ ప్రొఫైలర్ గురించి అవగాహన ఉంది. ► 61% మందికి రిస్్క–ఓ–మీటర్ దేన్ని సూచిస్తుందనేది తెలియదు. ఇది ‘ఫండ్’ రిసు్కను సూచిస్తుందని 16% మందికి మాత్రమే తెలుసు. తాము పెట్టుబడులు పెట్టే ముందు రిస్కోమీటర్ను చూసుకునే ఇన్వెస్ట్ చేస్తామని సదరు ఇన్వెస్టర్లు తెలిపారు. -
సానుకూలమైనా... సవాళ్లూ ఉన్నాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 మొదటి నెల– ఏప్రిల్‌లో శుభారంభం చేసిందని ఆర్థికశాఖ ఏప్రిల్ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. అయితే భారత్ వృద్ధి బాటకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. వినియోగం స్థిరంగా ఉండడం విస్తృత ప్రాతిపదికన వృద్ధి నమోదుకావడానికి దోహదపడే అంశమైనా, పెట్టుబడుల్లో సామర్థ్యం సృష్టి, రియల్టీలో పెట్టుబడులు వంటి అంశాలపై అనిశ్చితి ఉందని పేర్కొంది. దేశీయంగా అన్నీ సానుకూల అంశాలేనని పేర్కొంటున్న నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ఆర్థిక సంవత్సరం శుభారంభం మొత్తం సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను అంచనా వేయడానికి ఏప్రిల్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అయితే ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను తీసుకుంటే, ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలతోనే ప్రారంభమైందని భావించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని పరిగణనలోకి తీసుకోవాలి. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్‌లో రికార్డు సృష్టించాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. అన్ని పరోక్ష పన్నులనూ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలైలో కొత్త పన్ను విధానం ప్రారంభంమైన తర్వాత ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. 2022 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 12 శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ప్రశంసనీయం. ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ వార్త. తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ, పన్నుల వసూళ్లు నెలవారీగా ఈ స్థాయికి పెరగడం జీఎస్టీ పట్ల వ్యవస్థలో పెరిగిన విశ్వాసాన్ని, ఆమోదనీయోగ్యతను, సమ్మతిని సూచిస్తోంది. భారత్ ఎకానమీ పటిష్ట పురోగతిని ఇది సూచిస్తోంది. ఐఐపీ భరోసా గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసింకంలో (2022–23 జనవరి–మార్చి) పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ) అందులో దాదాపు 44 వెయిటేజ్ ఉన్న ఎనిమిది పరిశ్రమల కీలక గ్రూప్ ( క్రూడ్ ఆయిల్, విద్యుత్, సిమెంట్, బొగ్గు, ఎరువులు, స్టీల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టŠస్ ) స్థిరమైన వృద్ధి తీరును కనబరిచాయి. అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోల్చితే (జూలై–డిసెంబర్) వినియోగ సామర్థ్యం 75 శాతం పెరిగింది. కార్యకలాపాలలో స్థిరమైన వృద్ధి, సామర్థ్య వినియోగం పెరుగుదల సానుకూలతలతో కార్పొరేట్లు కొత్త పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. భారీ యంత్రసామాగ్రి డిమాండ్, ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగాలు 4వ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. మూలధన వస్తువుల దిగుమతుల్లోనూ పెరుగుదల నమోదయ్యింది. సేవలు, తయారీ, వ్యవసాయమూ.. ప్లస్సే... తయారీ, సేవల రంగం మాదిరిగానే వ్యవసాయ రంగానికి కూడా అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సాధారణ రుతుపవనాల అంచనా, మిగులు నీటి నిల్వ స్థాయిలు, విత్తనాలు– ఎరువులు తగినంత లభ్యత, పటిష్టమైన ట్రాక్టర్ విక్రయాలు జూన్ 2023 నుండి ప్రారంభమయ్యే ఖరీఫ్ విత్తన సీజన్‌కు శుభసూచికలు. అకాల వర్షాలు నమోదవుతున్నప్పటికీ, గోధుమల సేకరణ సజావుగా సాగుతోంది. ఇది ఆహార భద్రతకు ఊతమిస్తోంది. గ్రామీణ డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలలో అంకెల వృద్ధి నమోదయ్యింది. ఖరీఫ్ సీజన్‌కు మంచి అవకాశాలు, పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) పెరగడం, ప్రభుత్వం బడ్జెట్లో పెంచిన వ్య యం రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు గ్రా మీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి... 18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్‌లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్ మినహా 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది. ఎగుమతులు భేష్... తీవ్ర పోటీ, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్ ఎగుమతులు మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. ప్రొడక్ట్ లింక్డ్ స్కీమ్ (పీఎల్ఐ) మద్దతుతో భారత్ నుండి వస్త్ర, రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు కూడా భారీగా పెరుగుతున్నాయి. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల పునరేకీకరణ, కొత్త మార్కెట్లకు అనుగుణంగా శుద్ధి చేసిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. -
కంపెనీలు ఎదుర్కొంటున్న రిస్క్‌లేంటో తెలుసా?
న్యూఢిల్లీ: మేధోపరమైన హక్కులు (ఐపీ), సమాచారం, సైబర్ దాడులు, ప్రమాదాలు అనేవి భారత కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన రిస్క్‌లు అని ఫిక్కీ సర్వే తెలిపింది. మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే, 2022లో 5వ స్థానానికి వచ్చినట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! లాజిస్టిక్స్, నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని ప్రధానంగా ప్రస్తావించాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్ కంపెనీలకు రోడ్డు ప్రమాదాలు రెండో అత్యంత ఆందోళకరమైన అంశంగా ఉంది. ఐపీ హక్కుల చోరీ మొదటి స్థానంలో ఉంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాల రూపంలో ఎక్కువ రిస్క్‌ను చూస్తున్నాయి. రిటైల్ పరిశ్రమ ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీ, విపత్తులను రిస్క్‌లుగా తెలిపాయి. మీడియా, వినోద పరిశ్రమ సమాచారం, సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను ప్రస్తావించాయి. ఐటీ, తయారీ రంగంలో ఐపీ హక్కుల చోరీ ప్రథమ రిస్క్‌గా ఉంది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే రిస్క్‌లను తెలుసుకునేందుకు ఫిక్కీ ఈ వార్షిక సర్వే నిర్వహించింది. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! -
ఉత్పత్తి కోతలతో చమురు ధరలకు సెగ
ప్యారిస్: చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ప్లస్ .. ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడం వల్ల ప్రపంచ ఎకానమీకి రిస్కులు పొంచి ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అధిక స్థాయుల్లో ఉన్న ఇంధన ధరలు.. దీని వల్ల మరింతగా ఎగిసే అవకాశం ఉందని, భారత్ వంటి దేశాలకు చమురు దిగుమతుల భారం భారీగా పెరిగిపోవచ్చని తెలిపింది. సరఫరా తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున 2023 ద్వితీయార్ధంలో అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలో కొరత నెలకొనవచ్చని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఎకానమీ ఇంకా బలహీనంగానే ఉండటంతో పాటు పలు వర్ధమాన దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చమురు ఉత్పత్తి కోతల నిర్ణయం వల్ల అంతర్జాతీయ ఎకానమీకి రిస్కులు ఎదురవుతాయని భావిస్తున్నాను‘ అని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సమావేశాల కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌తో సమావేశం అనంతరం బిరోల్ ఈ విషయాలు వివరించారు. భారత ఎకానమీ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత బలంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని బిరోల్ చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల ప్రభావం గురించి మాట్లాడుతూ ఆ దేశ ఆదాయాలను తగ్గించాలన్న లక్ష్యం సాకారమైందని తెలిపారు. చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే, వినియోగించుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ 85 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ఆయిల్ దిగుమతులపై 118 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
ఎస్వీబీ సంక్షోభం: స్టార్టప్‌లకు రిస్కులు తొలగిపోయినట్లే!
న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ) విషయంలో అమెరికా ప్రభుత్వం సత్వరం చర్య తీసుకున్న నేపథ్యంలో దేశీ స్టార్టప్‌లకు పొంచి ఉన్న రిస్కులు తొలగిపోయినట్లేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా విశ్వసించాల్సిన అవసరం గురించి ఈ సంక్షోభం ఓ పాఠాన్ని నేర్పిందని ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఎస్వీబీ ఖాతాదారులకు సోమవారం నుంచి వారి నగ దు అందుబాటులో ఉంటుందంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. ఎస్వీబీ ప్రధానంగా స్టార్టప్ సంస్థలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. అయితే, డిపాజిటర్లు విత్‌డ్రాయల్స్‌కు ఎగబడటంతో సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న బ్యాంకును నియంత్రణ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎస్వీబీ బ్రిటన్ విభాగాన్ని బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ నామమాత్రంగా 1 పౌండుకు కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా 3,000 మంది ఖాతాదారులకు చెందిన 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లను భద్రత లభిస్తుందని పేర్కొంది. -
ఫైనాన్షియల్ రంగంపై నిరంతర అప్రమత్తత: ఎఫ్ఎస్డీసీ
ముంబై: అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా నిలువరించడానికి ఫైనాన్షియల్ రంగం, దానికి ఎదురయ్యే ఇబ్బందులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అత్యున్నత స్థాయి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశం ఉద్ఘాటించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇక్కడ జరిగిన ఈ సమావేశం, ఎకానమీపై కీలక సమీక్ష జరిపింది. సకాలంలో తగిన చర్యలు తీసుకునేలా వ్యవస్థల సంసిద్ధత అవసరాన్ని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, రెగ్యులేటర్ల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎకానమీ వృద్ధి అంచనాలకు క్రిసిల్ కోత
సాక్షి, ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం 7.3 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఎగుమతుల డిమాండ్ మందగమనం తన తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. ఈ మేరకు క్రిసిల్ విడుదల చేసిన నివేదికలో కొన్నిముఖ్యాంశాలు.. ♦ అధిక కమోడిటీ, సరకు ధరలు, ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గుముఖం పట్టడంతో ఎగుమతులకు డిమాండ్ తగ్గే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ వినియోగంకు దోహదపడే అంశాలు కూడా బలహీనంగా ఉండటం తీవ్ర ప్రతికూలాంశం. ♦ కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల్లో పెరుగుదల, సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ప్రస్తుతం ఎకానమీకి ఉన్న బలాలు. ♦ ద్రవ్యోల్బణం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతం ఉంటే, 2022–23లో సగటున 6.8 శాతంగా ఉంటుందని అంచనా. ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వినియోగం పునరుద్ధరణపై ప్రభావం చూపుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో కొనుగోలు, వినియోగ రంగాలపాత్ర కీలకం. ♦ అధిక కమోడిటీ ధరలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, సరఫరా చైన్‌లో సవాళ్లు భారత్ కరెంట్ ఖాతాపై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతుంది. కరెంట్ ఖాతా లోటు 2021-22లో (జీడీపీ) 1.2 శాతం ఉంటే, 2022-23లో 3 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ♦ఆర్థిక బలహీనతల నేపథ్యంలో 2023 మార్చి నాటికి అమెరికా డాలర్లో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉంది. పెరుగుతున్న వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) ప్రవాహాలు భారీగా వెనక్కు మళ్లడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలోపేతం (రిజర్వ్ రేట్ల పెంపుదల కారణంగా) రూపాయి-డాలర్ మారకపు విలువ సమీప కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు, దిగువముఖ పయనానికి దారితీసే వీలుంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఎంచుకోవచ్చు. ♦2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ క్రూడ్ సగటు బ్యారెల్‌కు 105-110 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2013 తర్వాత క్రూడ్ ఈ స్థాయిలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ♦ అధిక కమోడిటీ ధరలు భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెరుగుతున్న దిగుమతి బిల్లుతో వాణిజ్య లోటు తీవ్రం అయ్యే వీలుంది. దిగుమతుల బిల్లు పెరగడం ద్ర వ్యోల్బణం పెరుగుదలకూ కారణం అవుతుంది. ♦ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను మరో 75 బేసిస్ పాయింట్లకు పెంచే వీలుంది. మే, జూన్ నెలల్లో రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి ఎగసింది. వడ్డీరేట్ల పెరుగుదల వృద్ధి అవకాశాలను దెబ్బతీసే అంశం. రియల్టీ మహమ్మారి స్థాయికన్నా కిందకు పడిపోయే వీలుంది. ద్రవ్యోల్బణం కట్టడికి ద్రవ్య పరపతి విధానాలు మరికొంతకాలం కఠినంగా కొనసాగే అవకాశం ఉంది. 2022-23పై అంచనాల కోతలు (శాతాల్లో) ఇలా... సంస్థ తాజా తొలి ఆర్బీఐ 7.2 7.8 ఎస్అండ్పీ 7.3 7.8 ఫిచ్ 8.5 10.3 ప్రపంచ బ్యాంక్ 7.5 8.0 ఐఎంఎఫ్ 8.2 9 ఏడీబీ 7.5 –– ♦ మూడీస్ గత ఏడాది నవంబర్‌లో 2022–23లో భారత్ వృద్ధి 9.3 శాతం ఉంటుందని అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంచనా తగ్గించే అవకాశం ఉంది. అయితే 2022 క్యాలెండర్ ఇయర్లో వృద్ధి రేటు అంచనాలను మూడీస్ 9.1 శాతం నుంచి 8.8 శాతానికి కోత పెట్టింది. -
పెట్టుబడులు ఆలస్యం అయితే ఏంటి మార్గం?
పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ అస్థిరతలు, జాగ్రత్తలపై నిపుణులు, వాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ సలహాలు ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్ మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం. మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. -
రిస్కలను సరిగ్గా అంచనావేయకపోతే ఇబ్బందులు
కోల్‌కతా: వ్యవస్థలో నగదు లభ్యత సమృద్ధిగా ఉన్నందున సమస్యలను (రిస్కలను) సరిగ్గా అంచనా వేయకపోతే ఆందోళనకు దారితీస్తుందన్నారు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు వచి్చపడుతున్నాయి. కానీ, రుణాల వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. దీంతో బ్యాంకులు ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికలైన టీ బిల్లులవైపు చూడాల్సి వస్తుంది. కానీ, ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ పరిధి తక్కువ. దీంతో రిస్‌్కలను సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) రూపంలో తగినంత అనుభవాలు నేర్చుకున్నందున.. అండర్‌రైటింగ్ ప్రమాణాల విషయంలో రాజీ ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని ఖారా బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ట్రీ నిర్వహించిన వెబినార్‌లో భాగంగా చెప్పారు, -
ఆటో డిమాండ్‌కు కరోనా షాక్
సాక్షి,ముంబై : కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో సమీప భవిష్యత్తులో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ క్షీణించే రిస్కులు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) ఒక నివేదికలో తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టేస్తుందని పేర్కొంది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ 2021–22 ద్వితీయార్థంలో మెరుగుపడొచ్చని నివేదిక పేర్కొంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలు కూడా సీవీల విక్రయాలు..ముఖ్యంగా మీడియం, హెవీ సీవీల అమ్మకాలకు దోహదపడగలవని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాలు మొత్తం మీద 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం, సీవీల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 2021 మార్చి గణాంకాలు చూస్తే పీవీలు మినహా రిటైల్ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించడం చూస్తే కన్జూమర్ సెంటిమెంటు ఇంకా పూర్తిగా మెరుగు పడినట్లు కనిపించడం లేదని ఇండ్-రా నివేదికలో తెలిపింది. (భారత్ ఎకానమీకి నష్టం తప్పదు!) నివేదిక ఇతర విశేషాలు.. ► 2021 మార్చి దాకా దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ వరుసగా ఎనిమిదో నెల సానుకూల వృద్ధి నమో దు చేసింది. 2020 మార్చి నాటి లో బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021 మార్చిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 115 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 73 శాతం వృద్ధి కనపర్చాయి. ► ఎగుమతుల పరిమాణం 2020 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 57 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 63 శాతం పెరిగాయి. ► 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఎగుమతుల పరిమాణం 13 శాతం క్షీణించింది. ► కరోనా పరిస్థితులతో వ్యక్తిగత రవాణా వాహనాలకు డిమాండ్ పెరగడం వల్ల ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్‌కు కాస్త ప్రయోజనం చేకూరింది. మిగతా విభాగాలతో పోలిస్తే తక్కువ క్షీణత నమోదైంది. మధ్య స్థాయి, ఎగ్జిక్యూటివ్, ప్రీమియం కార్లు.. వ్యాన్ల సెగ్మెంట్‌తో పోలిస్తే కాంపాక్ట్, సూపర్ కాంపాక్ట్, మినీ, మైక్రో కార్ల అమ్మకాలు మెరుగ్గా నమోదయ్యాయి. తొలిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు వీటికి ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. ► యుటిలిలటీ వాహనాలకు డిమాండ్ కొనసాగింది. కొత్త వాహనాల ఆవిష్కరణ కారణంగా ఈ విభాగం 12 శాతం వృద్ధి చెందింది. ► గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ .. ద్విచక్ర వాహనాల విభాగానికి సానుకూలంగా దోహదపడింది. అయితే, విద్యా సంస్థలను తెరవడంలో జాప్యం జరగడం, ఇంధన ధరల పెరుగుదలతో వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, కోవిడ్ సంబంధ లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి కొంత మేర ప్రతికూల ప్రభావమైతే పడింది. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి మోడల్స్‌పై ఇది కనిపించింది. చదవండి : కరోనా ముప్పు: ఎస్బీఐ సంచలన రిపోర్ట్ -
మీ ‘సేఫ్’ లాకర్ ఎక్కడ?
బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు చాలా మంది బ్యాంకుల్లోని సేఫ్లాకర్లను ఆశ్రయిస్తారు. ఇది సర్వసాధారణం. కారణం... బ్యాంకు లాకర్లలో ఉంచితే ఎంతో భద్రంగా ఉంటాయన్న నమ్మకం!!. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బ్యాంకు లాకర్ మాత్రమే అద్దెకిస్తుంది. అంతవరకే దాని బాధ్యత. అందులో మనం ఏం దాచామన్నది బ్యాంకుకు తెలియదు. అనవసరం కూడా. కాబట్టి ఆ లాకర్లలో మనం దాచిన వస్తువులు పోతే... అందుకు బ్యాంకుల బాధ్యత ఉండదని ఈ మధ్యే ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. అలాగే, కొన్ని చోట్ల బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టి విలువైన వస్తువుల్ని దోచుకుపోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. దీంతో బ్యాంకు లాకర్లలో ఉంచిన వస్తువుల భద్రత విషయంలో ఖాతాదారులు మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయాలేంటి? ఎక్కడైతే సురక్షితంగా దాచుకోగలం? అసలు బ్యాంకు లాకర్లలో ఉంచిన వారు భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?... ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మంచి కంపెనీల సేఫ్టీ లాకర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు సరిపోయేదాన్ని ఎంచుకుని ఇంట్లోనే ఓ చోట ఏర్పాటు చేసుకోవడం ఒక పరిష్కారం. ఇందులో కొన్ని ప్రయోజనాలున్నాయి. అలాగే, కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా లాకర్లలో ఉంచిన వాటిని తీసుకోవచ్చు. బ్యాంకుల్లో అయితే నిర్ణీత సమయాల్లోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రైవేటుగా లాకర్ సేవలందించే సంస్థలు కూడా రోజువారీ సమయాలను పాటిస్తాయి. పైపెచ్చు సెలవు రోజుల్లో మూసి ఉంచుతాయి. ఇక బ్యాంకు లాకర్లయితే ఏడాదిలో కనీసం ఒకసారయినా లాకర్‌ను తెరవాలన్న నిబంధన ఉంటుంది. ఒకవేళ అలా తెరవలేని పక్షంలో ఎందుకు తెరవలేదో చెప్పాలని కోరుతూ బ్యాంకు నోటీసు జారీ చేస్తుంది. దానికి సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దానికి స్పందించకపోతే లాకర్‌ను బలవంతంగా తెరవడం జరుగుతుంది. బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులుంచినపుడు వాటిని అవసరానికి తీసుకురావడం, పని ముగిసిన తర్వాత తిరిగి మళ్లీ తీసుకెళ్లి లాకర్లలో పెట్టడం కాస్తంత శ్రమ, సమయంతో కూడినది. పైగా క్యారీ చేసే సమయంలో దోపిడీ భయం ఉండనే ఉంది. ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకుంటే ఈ విధమైన ఇబ్బంది ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. చార్జీలు ఎలా ఉంటాయంటే... బ్యాంకు లాకర్‌ను అద్దెకు తీసుకునేటపుడైనా... దానికి బదులు సొంతంగా లాకర్ కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేసుకునేటపుడైనా వాటికయ్యే ఖర్చును పోల్చి చూడాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో లాకర్ అద్దెలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. లాకర్ సైజును బట్టి కూడా ఈ చార్జీలు మారుతుంటాయి. చిన్న లాకర్‌కు అయితే ఎస్బీఐ సంవత్సరానికి పట్టణాల్లో రూ.1,100, సెమీ అర్బన్, గ్రామీణ శాఖల్లో రూ.800 చొప్పున వసూలు చేస్తోంది. పెద్ద లాకర్ అయితే ఈ అద్దె పట్టణాల్లో రూ.8,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,000గా ఉంది. పైపెచ్చు బ్యాంకుల్లో లాకర్ కోసం మూడేళ్ల అద్దెను కూడా డిపాజిట్ చేయాల్సి రావచ్చు. ప్రైవేటు సంస్థలయితే తిరిగి చెల్లించే మూడేళ్ల అద్దెను డిపాజిట్ చేయాలని కోరుతున్నాయి. ఈ సంస్థలు వసూలు చేసే అద్దె ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటోంది. ఇక ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఫలానా వారే దాన్ని తెరవాలి, ఇన్ని సార్లే తెరవాలన్న అడ్డంకులేవీ ఉండవు. బ్యాంకులు లాకర్లను తెరిచే విషయంలో ఏడాదికి ఇన్ని సార్లేనన్న పరిమితులు అమలు చేస్తున్నాయి. అంతకు మించితే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ అయితే ఏడాదికి 12 సార్లు మాత్రమే ఉచితం. ఆ తర్వాత నుంచి ప్రతీ సందర్శనకు రూ.100 చార్జీ విధిస్తోంది. అలాగే, బ్యాంకులు ఇద్దరు వ్యక్తులను జాయింట్ హోల్డర్లుగా లాకర్‌ను యాక్సెస్ చేసుకునేందుకు అనుమతిస్తుంటాయి. వీరు మినహా మిగిలిన వారికి ఆ అవకాశం ఉండదు. నామినీని కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకున్నట్టయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దొంగల నుంచి కాపాడుకునే బాధ్యత ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు, ఎవరైనా చొరబడితే గుర్తించి అప్రమత్తం చేసే పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. లాకర్ ఎంపిక ఎలా? ఇంట్లో ఏర్పాటు చేసుకునే లాకర్లకు సంబంధించి ఎన్నో సైజులు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కనిపించేవి ‘కీ’తో ఉండే మెకానికల్ లాకర్లు. అలాకాకుండా ఎలక్ట్రానిక్ కీప్యాడ్‌లతో కూడిన ఖరీదైన లాకర్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. కార్డుల స్వైప్‌తో, బయోమెట్రిక్ ద్వారా యాక్సెస్ చేసుకునేవీ దొరుకుతున్నాయి. మెకానికల్ లాకర్ల కంటే ఈ తరహా లాకర్ల ఖరీదు దాదాపు 50 శాతం ఎక్కువ ఉంటోంది. ఉదాహరణకు గోద్రెజ్ 23 లీటర్ల ఎలక్ట్రానిక్ మోడల్ లాకర్ ధర రూ.11,522. అదే మెకానికల్ లాకర్ ధరయితే రూ.8,000. లాకర్ బరువు కూడా చూడాల్సి ఉంటుంది. చాలా బరువుతో ఉండేవి ఎంచుకోవడం వల్ల దొంగలెవరైనా చొరబడి వాటిని ధ్వంసం చేయాలనుకున్నా, తీసుకెళ్ళాలనుకున్నా కష్టమవుతుంది. అలాంటి వాటి ధర ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. 30 లీటర్ల ఎలక్ట్రానిక్ సేఫ్ లాకర్, 14 కిలోల బరువున్న దాన్ని పెప్పర్ఫ్రైలో కొనుగోలు చేయాలంటే ధర సుమారు రూ.12,200 వరకూ ఉంది. 18 కిలోల బరువుతో ఉన్న దాని ధర రూ.13,530. ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇళ్లలో లాకర్‌ను పెట్టుకోవాలనుకున్న వారు... దాన్ని ఎక్కడ ఉంచాలన్నది కూడా ఆలోచించతగినదే. ఇంటి నిర్మాణ సమయంలోనే లాకర్‌ను కొని ఏర్పాటు చేయించుకోవడం మంచి ఆలోచన. ఇలా చేస్తే లాకర్ కనిపించకుండా చేసుకునేందుకు వీలుంటుంది. నిర్మాణం పూర్తయిన ఇంట్లో అయితే గోడలకు స్క్రూతో గట్టిగా ఫిట్ చేయించుకోవాలి. కాకపోతే ఇలా లాకర్‌ను ఏర్పాటు చేసేటపుడు ఎవరికీ తెలియకుండా చూసుకోవటం తప్పనిసరి. ఇల్లు కట్టేటపుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అగ్ని ప్రమాద నిరోధ లాకర్లు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగితే ఈ లాకర్లలో ఉంచిన డాక్యుమెంట్లకు కాలిపోయే రిస్క్ ఉండదు. ఏ మేరకు భద్రత అవసరం అన్నదాన్ని బట్టి ఈ ఫీ చర్లను జోడించుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, ధర కూడా ఎంచుకున్నదాన్ని బట్టి ఉంటుంది. బీమా తప్పనిసరి బ్యాంకు లాకర్ అద్దెకు తీసుకున్నా లేక ఇంట్లో లాకర్‌ను ఏర్పాటు చేసుకున్నా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం బీమా పాలసీ తీసుకోవడం. లాకర్లలో ఉంచిన వస్తువులు మాయం అయితే బ్యాంకులు బాధ్యత తీసుకోవడం లేదు. కనుక అందులో ఉంచిన వాటి విలువకు సమానంగా బీమా రక్షణతో పాలసీ తీసుకోవడం అవసరం. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో చాలా వాటికి బీమా రక్షణ లభిస్తుంది. బీమా పాలసీ తీసుకునే వారు బ్యాంకు లాకర్లలో ఉంచినవి కోల్పోతే కచ్చితంగా పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకు శాఖలు పటిష్ట భద్రతతో ఉంటాయి కనుక. కానీ, ఇంట్లో లాకర్ ఏర్పాటు చేసుకుని అందులో విలువైన వాటిని ఉంచిన వారు బీమా ఉందిలే అని నిర్లక్ష్యం చూపిస్తే పరిహారం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లో లాకర్ ఏర్పాటు చేసుకునే వారు సీసీ కెమెరాలు, పటిష్టమైన లాకర్, అగ్ని నిరోధక తదితర అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం కచ్చితంగా అవసరం. అప్పుడే క్లెయిమ్ తిరస్కరణ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. -
బాధలూ బలమే!
ఆత్మీయం ఆపదలు, కష్టాలు రానివారుండరు. దేవుడు ఇచ్చే ప్రతి కష్టమూ మనకు అనుభవాన్ని నేర్పిస్తుంది. మరింత గట్టిపడేలా చేస్తుంది. అదే విధంగా ప్రతికూల భావనల స్థానంలో సానుకూల భావనలను నింపుకుంటే, ఇక ఏ సంఘటనా బాధించదు.దేనినైనా సరే, అది మనకు ఇబ్బందికరమైనదనో, దాని ద్వారా భరించలేనంతటి బాధ కలుగుతుందనో ముందే అనుకోకూడదు. అసలు ఆ భావనే దుర్భరమైన స్థితిలోకి నెడుతుంది. కాబట్టి ఆ జరగబోయే దానిలో లేదా అప్పటికే జరిగిన దాని ద్వారా కలగబోయే మేలును మాత్రమే తలచుకోవాలి. మనల్ని పరీక్షించడం కోసం ఆ బాధను లేదా సమస్యను సృష్టించిన దేవుడే దానిని పరిష్కరించగలడన్న నమ్మకాన్ని మనసులో నింపుకోవాలి. అప్పుడే ఎంతటి గడ్డు పరిస్థితులనయినా సరే, ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుడే బాధే బలంగా మారుతుంది. కుంతీదేవి ఎప్పుడూ శ్రీకృష్ణుని తనకు ఏదైనా సమస్య లేదా కష్టాన్ని ఇమ్మని కోరుకునేదట. ఎందుకంటే, కష్టసమయంలోనే కదా, దేవుడు గుర్తుండేది! -
ఆ శబ్దంతో ప్రమాదమే!
లండన్ః మీరు.. భారీ ట్రాఫిక్ ఉండే రోడ్లకు, రైలు మార్గాలకు దగ్గరలో నివసిస్తున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు పరిశోధకులు. వాహనాలనుంచీ వచ్చే విపరీతమైన శబ్దంవల్ల గుండెనొప్పి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రహదార్లు, రైల్వే ట్రాక్ లు దగ్గరలో నివసించేవారికి ఈ ప్రమాదం అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. 65 డెసిబుల్స్ కు పైన ఎప్పుడూ స్థిరంగా ఉండే విమానాల శబ్దంకంటే రైళ్ళు, రోడ్లపై వాహనాలవల్ల వచ్చే ధ్వని.. తీవ్ర సమస్యలు సృష్టిస్తుందని తెలిపారు. ఇటీవల నగరాలు కాలుష్యానికి సాకారాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వాహనాలవల్ల వచ్చే పొగతో అనేక రోగాలు ఉద్భవిస్తుండటంతో ప్రభుత్వాలు నివారణా దిశగా చర్యలు చేపడుతున్నాయి. అయితే ట్రాఫిక్ లో వాహనాల వల్ల వచ్చే పొగతోనే కాదు.. శబ్బంతో కూడ ప్రమాదమేనంటున్నారు లండన్ పరిశోధకులు. ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యంతో గుండెజబ్బులు, ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. నిరంతరం ట్రాఫిక్ లో ఉండేవారికి, రైల్వే ట్రాక్ లు, రహదార్లకు దగ్గరలో ఉండేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు. జర్మనీ డ్రెస్ డెన్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రియాస్ సైడ్లేర్, ఇతర పరిశోధక బృదం.. ఓ బీమా సంస్థ అందించిన మూల్యాంకనాల్లోని 40 ఏళ్ళ వయసు దాటిన సుమారు 10 లక్షల మందిపై పరిశోధనలు జరిపి, ఈ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. అంతేకాక రైన్ మెయిన్ ప్రాంతంలో రైలు ట్రాక్ లకు, రోడ్లకు సమీపంలో నివస్తున్న వ్యక్తుల వివరాలను.. ట్రాఫిక్ శబ్దాలతో సరిపోల్చి విశ్లేషించారు. 2014/15 మధ్య మరణించినరోగుల్లోనూ అత్యధిక శాతం శబ్దకాలుష్యం కారణంగా గుండెపోటు ప్రమాదంతో చనిపోయినట్లు తేల్చారు. పైగా ఎయిర్ క్రాఫ్ట్ సృష్టించే శబ్ద కాలుష్యం కంటే రోడ్లు, రైలు మార్గాలు తెచ్చే శబ్ద కాలుష్యమే ప్రమాదమని పరిశోధకులు చెప్తున్నారు. తాము జరిపిన అధ్యయనాల వివరాలను పరిశోధకులు డాయిశ్చస్ ఆర్జిటాబ్లాట్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తాజా ఫలితాలవల్ల ట్రాఫిక్ శబ్దాలు, గుండెపోటుకు మధ్య అత్యంత దగ్గరి సంబంధం ఉన్నట్లు తేలిందని, ఇకపై ట్రాఫిక్ శబ్దాలను నియంత్రించడం, వాటికి దూరంగా ఉండటంవల్ల గుండెపోటును నివారించవచ్చని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. ట్రాఫిక్ శబ్దాలు, ఆరోగ్య పరిణామాలపై యూరప్ వ్యాప్త నోరా (నాయిస్ రిలేటెడ్ యన్నాయన్స్, కాగ్నిషన్, హెల్త్) అధ్యయనాల్లో భాగంగా వారు పరిశోధనలు జరిపినట్లు వివరించారు.