ఆ శబ్దంతో ప్రమాదమే!
లండన్ః మీరు.. భారీ ట్రాఫిక్ ఉండే రోడ్లకు, రైలు మార్గాలకు దగ్గరలో నివసిస్తున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు పరిశోధకులు. వాహనాలనుంచీ వచ్చే విపరీతమైన శబ్దంవల్ల గుండెనొప్పి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రహదార్లు, రైల్వే ట్రాక్ లు దగ్గరలో నివసించేవారికి ఈ ప్రమాదం అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. 65 డెసిబుల్స్ కు పైన ఎప్పుడూ స్థిరంగా ఉండే విమానాల శబ్దంకంటే రైళ్ళు, రోడ్లపై వాహనాలవల్ల వచ్చే ధ్వని.. తీవ్ర సమస్యలు సృష్టిస్తుందని తెలిపారు.
ఇటీవల నగరాలు కాలుష్యానికి సాకారాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వాహనాలవల్ల వచ్చే పొగతో అనేక రోగాలు ఉద్భవిస్తుండటంతో ప్రభుత్వాలు నివారణా దిశగా చర్యలు చేపడుతున్నాయి. అయితే ట్రాఫిక్ లో వాహనాల వల్ల వచ్చే పొగతోనే కాదు.. శబ్బంతో కూడ ప్రమాదమేనంటున్నారు లండన్ పరిశోధకులు. ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యంతో గుండెజబ్బులు, ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. నిరంతరం ట్రాఫిక్ లో ఉండేవారికి, రైల్వే ట్రాక్ లు, రహదార్లకు దగ్గరలో ఉండేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు.
జర్మనీ డ్రెస్ డెన్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రియాస్ సైడ్లేర్, ఇతర పరిశోధక బృదం.. ఓ బీమా సంస్థ అందించిన మూల్యాంకనాల్లోని 40 ఏళ్ళ వయసు దాటిన సుమారు 10 లక్షల మందిపై పరిశోధనలు జరిపి, ఈ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. అంతేకాక రైన్ మెయిన్ ప్రాంతంలో రైలు ట్రాక్ లకు, రోడ్లకు సమీపంలో నివస్తున్న వ్యక్తుల వివరాలను.. ట్రాఫిక్ శబ్దాలతో సరిపోల్చి విశ్లేషించారు. 2014/15 మధ్య మరణించినరోగుల్లోనూ అత్యధిక శాతం శబ్దకాలుష్యం కారణంగా గుండెపోటు ప్రమాదంతో చనిపోయినట్లు తేల్చారు. పైగా ఎయిర్ క్రాఫ్ట్ సృష్టించే శబ్ద కాలుష్యం కంటే రోడ్లు, రైలు మార్గాలు తెచ్చే శబ్ద కాలుష్యమే ప్రమాదమని పరిశోధకులు చెప్తున్నారు.
తాము జరిపిన అధ్యయనాల వివరాలను పరిశోధకులు డాయిశ్చస్ ఆర్జిటాబ్లాట్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తాజా ఫలితాలవల్ల ట్రాఫిక్ శబ్దాలు, గుండెపోటుకు మధ్య అత్యంత దగ్గరి సంబంధం ఉన్నట్లు తేలిందని, ఇకపై ట్రాఫిక్ శబ్దాలను నియంత్రించడం, వాటికి దూరంగా ఉండటంవల్ల గుండెపోటును నివారించవచ్చని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. ట్రాఫిక్ శబ్దాలు, ఆరోగ్య పరిణామాలపై యూరప్ వ్యాప్త నోరా (నాయిస్ రిలేటెడ్ యన్నాయన్స్, కాగ్నిషన్, హెల్త్) అధ్యయనాల్లో భాగంగా వారు పరిశోధనలు జరిపినట్లు వివరించారు.