బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుషం వెలుగుచూసింది. కొడుకు ఫోన్ వాడటానికి బాని, చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన ఘోర ఘటన శనివారం జరిగింది. కన్న కొడుకును దారుణంగా హత్య చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడైన తండ్రి.
వివరాలు.. వృత్తిరీత్యా వడ్రంగి అయిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివిసిస్తున్నాడు. 14 ఏళ్ల కుమారుడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల మొబైల్ వాడకం ఎక్కువై చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్నేహితులతోనూ చెడు సావాసం చేస్తుండటం తండ్రికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
అంతేగాక ఇటీవల ఆ ఫోన్ పనిచేయకపోవంతో దానిని రిపేర్ చేయించాడు తేజస్.. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కొడుకుతో గొడవకు దిగాడు.. ఇది కాస్తాపెరిగి పెద్దది కావడంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తేజస్‌ను కొట్టాడు. అక్కడితో ఆగకుండా గొడకేసి బాది ‘నువ్వు బతికినా, చచ్చినా నాకు పర్వలేదు’ అంటూ చితకబాదాడు. దీంతో విద్యార్ధి నొప్పి భరించలేక నేలపై పడిపోయాడు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పరిస్థితి విషమంగా మారింది. అయితే శ్వాస ఆగిపోయిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవికుమార్ ఇంటికి చేరుకోగా.. అప్పటికే కొడుకు అత్యంతక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
ఇక బాలుడి తలపై తీవ్రమైన అంతర్గత గాయాలు, అతని శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే బాలుడి మృతదేహానికి ఉన్న రక్తపు మరకలను తొలగించి, బ్యాట్‌ను దాచిపెట్టి హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడని, వెంటనే అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసి కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నమిదని తెలిపారు. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటంపై పిల్లవాడికి, తండ్రికి వాగ్వాదం జరుగుతోందని, అదే అతడి హత్యకు దారితీసినట్లు డీసీపీ లోకేష్ బీ పేర్కొన్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment