
న్యూఢిల్లీ: ఢిల్లీలో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి జరిగింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో సోదాలు చేస్తుండగా సౌత్ ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూఏఈకి చెందిన పీపీపీవైఎల్ సైబర్ క్రైం కేసులో దర్యాప్తులో భాగంగా చార్టర్డ్ అకౌంటెంట్ ఇంటికి అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లారు. బిజ్వాసన్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించారు.
అయితే ఈ కేసులో నిందితుడైన అశోక్ శర్మ, తన సోదరుడు, మరికొందరితో కలిసి ఫర్నీచర్‌తో అధికారులపై దాడి చేశారు. అనంతరం దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. అతనికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత సోదాలు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.
దాడిలో గాయపడిన అధికారిని ఈడీ అదనపు డైరెక్టర్‌గా గుర్తించారు. అనంతరం ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment