అమానుషం: మహిళపై కర్రతో దాడి.. వీడియోలు తీసిన జనం | Madhya Pradesh: Woman Beaten With Stick In Broad Daylight; Video Goes Viral | Sakshi
Sakshi News home page

అమానుషం: మహిళపై కర్రతో దాడి.. వీడియోలు తీసిన జనం

Published Sat, Jun 22 2024 1:45 PM | Last Updated on Sat, Jun 22 2024 4:55 PM

Viral: Woman beaten with stick in Madhya Pradesh Dhar

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అమాన‌వీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు విచక్ష‌నార‌హితంగా దాడి చేశారు. బ‌హిరంగ ప్ర‌దేశంలో అందరూ చూస్తుండగానే కర్రతో కొట్టారు. అయితే చుట్టూ ఉన్న వారు దీన్నంత‌టినీ వీడియోలు తీస్తూ.. ప్రేక్ష‌కుల్లా చూస్తూ ఉండిపోయారే త‌ప్ప అక్క‌డ జ‌రుగుతున్న దారుణాన్ని ఆపేందుకు ముందుకు రాక‌పోవ‌డం సిగ్గుచేటు.

మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్‌ స్వగ్రామ‌మైన ధార్‌ జిల్లాలోని తండా ప్రాంతంలోఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మహిళను కొందరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కర్రతో దారుణంగా కొట్టారు. నలుగురు వ్యక్తులు మహిళను పట్టుకోగా.. ఓ వ్యక్తి బలమైన కర్రతో కొడుతూ కనిపించాడు. ఈ దాడిలో తనను కాపాడండి అంటూ ఆ మహిళ ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. పైగా  అక్క‌డ జ‌రుగుతున్న దాన్ని తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేస్తూ చోద్యం చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. బీజేపీ పాల‌న‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త లేదంటూ మండిప‌డింది. మధ్యప్రదేశ్‌లో వేధింపులు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్ర‌శ్నించింది. మహిళలపై అఘాయిత్యాలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంద‌ని విరుచుకుప‌డింది.

 

వీడియో వైర‌ల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడిని నూర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు.. మిగ‌తా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ధార్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement