అమరనాథ్ యాత్రలో గుండెపోటు మరణాలు!!
శ్రీనగర్ః అమరనాథ్ యాత్రలో గుండెపోటు మరణాలు రాను రాను పెరుగుతున్నాయి. గుండెపోటుతో షెర్ ఇ కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్ కె ఐ ఎమ్ ఎస్) లో చేరిన ఓ యాత్రికుడు చికిత్స పొందుతూ ఈ రోజు మరణించడంతో యాత్రలో గుండెపోటు మరణాలు 18 కి చేరాయి.
ప్రముఖ ఆధ్యాత్మిక అమరనాథ్ యాత్రలో.. యాత్రికులు ఒక్కొక్కరుగా గుండెపోటుకు గురై.. మృత్యు వాత పడుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన పంజాబ్ కు చెందిన 18 ఏళ్ళ సందీప్ సింగ్.. జూలై 15 న బల్టాల్ శిబిరం వద్దకు వచ్చేసరికి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అతడిని చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ టెరిటరీ కేర్ హాస్పిటల్ స్కిమ్స్ కు తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సందీప్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
యాత్రికులు ప్రయాణ సమయంలో గుండెపోటుకు గురౌతున్నారని, తీవ్ర గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రస్తుతం మరణించిన సందీప్ మృత్యువాత పడ్డ యాత్రికుల్లో 14వ వాడని అధికారులు తెలిపారు. అలాగే ఓ యాత్రికుడు, స్థానిక డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా... ఓ సీఆర్పీఎఫ్ జవాన్, సెవేదార్ బల్టాల్ శిబిరంలో యాత్రికులకోసం ఏర్పాటు చేసిన వంటగదిలో తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.