
ప్యారిస్: చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ప్లస్ .. ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడం వల్ల ప్రపంచ ఎకానమీకి రిస్కులు పొంచి ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అధిక స్థాయుల్లో ఉన్న ఇంధన ధరలు.. దీని వల్ల మరింతగా ఎగిసే అవకాశం ఉందని, భారత్ వంటి దేశాలకు చమురు దిగుమతుల భారం భారీగా పెరిగిపోవచ్చని తెలిపింది.
సరఫరా తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున 2023 ద్వితీయార్ధంలో అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలో కొరత నెలకొనవచ్చని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఎకానమీ ఇంకా బలహీనంగానే ఉండటంతో పాటు పలు వర్ధమాన దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చమురు ఉత్పత్తి కోతల నిర్ణయం వల్ల అంతర్జాతీయ ఎకానమీకి రిస్కులు ఎదురవుతాయని భావిస్తున్నాను‘ అని ఆయన తెలిపారు.
ఇన్వెస్టర్ల సమావేశాల కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌తో సమావేశం అనంతరం బిరోల్ ఈ విషయాలు వివరించారు. భారత ఎకానమీ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత బలంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని బిరోల్ చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల ప్రభావం గురించి మాట్లాడుతూ ఆ దేశ ఆదాయాలను తగ్గించాలన్న లక్ష్యం సాకారమైందని తెలిపారు.
చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే, వినియోగించుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ 85 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ఆయిల్ దిగుమతులపై 118 బిలియన్ డాలర్లు వెచ్చించింది.
Comments
Please login to add a commentAdd a comment