
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మున్ముందు రికవరీ బాటన పయనిస్తుందని చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తి పెంపునకు తన మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మే నుంచి జూలై వరకూ మొత్తంగా రోజుకు 2 మిలియన్ బ్యారళ్లకుపైగా అదనపు ఉత్పత్తి జరగనుంది. దీని ప్రకారం ఉత్పత్తి మే నెల్లో రోజుకు 3,50,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. జూన్ నెల్లో అదనపు ఉత్పత్తి కూడా ఇదే స్థాయిలో రోజుకు 3,50,000 బ్యారళ్లు జరుగుతుంది. జూలైలో రోజుకు 4,00,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి అవుతుంది. దీనికితోడు సౌదీ అరేబియా రోజుకు అదనంగా ఒక మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి జరపనుంది. మార్చిలో ఒపెక్ తన ఉత్పత్తిని రోజుకు 3,00,000 బ్యారళ్ల మేర అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో రోజుకు సగటు ఉత్పత్తి 25.33 మిలియన్ బ్యారళ్లకు చేరింది. (ఐటీ కంపెనీల తాజా సవాల్ ఏంటంటే?)
గత మార్చి సమా వేశం తరహాలోనే సరఫరాల విషయంలో ఒపెక్ జాగరూకతతో వ్యవహరించింది. ఉత్పత్తి లక్ష్యా లను భారీగా పెంచకపోవడం వల్ల స్వల్ప కాల వ్యవధిలో ధరల స్థిరీకరణ జరగవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థల రికవరీ బాగుంటుందని, ఈ నేపథ్యంలో క్రూడ్ డిమాండ్ భారీగా పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతి, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల ఉద్దీపన చర్యలు గ్లోబల్ ఎకానమీ వృద్ధికి బాటలువేస్తాయని ఒపెక్ దేశాలు అంచనా వేస్తున్నాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రిఫైనరీలు భారీగా క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన విషయాన్ని సంబంధిత వర్గాలు ప్రస్తావించాయి.
Comments
Please login to add a commentAdd a comment