న్యూఢిల్లీ: సౌదీ అరేబియా, రష్యా తమ ఉత్పత్తి– ఎగుమతి కోతల విధానాన్ని ఏడాది చివరి వరకు పొడిగించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్ల పైకి చేరాయి. ఇది 10 నెలల గరిష్ట స్థాయి. దీనితో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. చమురు అవసరాల కోసం 85 శాతం కంటే ఎక్కువ దిగుమతులపై భారత్ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరిగితే, దేశంపై దిగుమతుల భారం మరింత పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. రష్యాతో కలిసి కూటమిగా ఉన్న ఒపెక్ (ఓపీఈసీ– పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ)కు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా డిసెంబర్ చివరి వరకు ప్రపంచ మార్కెట్‌కు సరఫరాలో రోజుకు ఒక మిలియన్ బ్యారెల్స్ తగ్గింపును కొనసాగించాలని ఇటీవల నిర్ణయించింది. అటు తర్వాత బ్రెంట్ ధర గత వారంలో 6.5% పెరిగింది. ఇక రష్యా కూడా ఇటీవలి నెలల్లో చమురు ఎగుమతులపై కోతలకు నిర్ణయం తీసుకుంది.
భారత్ బిల్లు బ్యారెల్ సగటు 89.81 డాలర్లు!
తాజా పరిణామాలతో మంగళవారం మొదటిసారి ఈ సంవత్సరంలో బ్రెంట్ బ్యారెల్ ధర మొదటిసారి 90 డాలర్లు దాటింది. బుధవారం కూడా ఈ వార్త రాసే 11 గంటల సమయంలో అదే స్థాయిలో ట్రేడవుతోంది. చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ఆగస్టులో 86.43 డాలర్లు. ఈ నెలలో 89.81 డాలర్లకు పెరుగుతుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
మేలో ఈ ధర 73 నుంచి 75 డాలర్ల శ్రేణిలో తిరిగింది. అయితే జూలైలో 80.37 డాలర్లకు తాజాగా 90 డాలర్లకు పెరిగింది. దీనితో దేశీయంగా రేట్లు తగ్గవచ్చన్న అంచనాలకు ముగింపు పడినట్లయ్యింది. నిజానికి గత సంవత్సరం తీవ్ర స్థాయికి ధరలు చేరినప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ యేడాది మేలో పరిస్థితి కొంత మెరుగుపడుతోందనుకుంటుండగా, ధరలు మళ్లీ దూసుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో నిజానికి 17 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో నిలకడగా కొనసాగుతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 పలుకుతుండగా, డీజిల్ ధర రూ.89.62 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు అంతర్జాతీయ ఇంధన ధరల బెంచ్‌మార్క్ 15 రోజుల రోలింగ్ యావరేజ్ ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాలి.
అయితే ఆయా సంస్థలు 2022 ఏప్రిల్ 6 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల తర్వాత రిటైల్ రేట్ల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పుడు మే 22న చివరిసారిగా ధరలు మారాయి. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్ ధర 73–74 డాలర్ల శ్రేణిలో ఉంటే, చమురు కంపెనీలు రోజువారీ ధరల సవరణను మళ్లీ ప్రారంభించేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇక తగ్గింపు అవకాశాలే సన్నగిల్లాయన్నది
నిపుణుల అంచనా.
భారీ ‘విండ్‌ఫాల్’ ఆదాయం!
అధిక ధరల పరిస్థితుల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) వంటి దేశీయ ఉత్పత్తి సంస్థలు అధిక ఆదాయాలను పొందుతాయి. దీనితో పెరుగుతున్న ఆదాయాల నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ రూపంలో భారీ మొత్తాలను పొందే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) రూపంలో విధించే పన్ను సెప్టెంబర్ 2 నుండి టన్నుకు రూ. 6,700కి తగ్గింది.
ఇది గతంలో టన్నుకు రూ.7,100గా ఉంది. రానున్న నెలల్లో మళ్లీ పెంపు బాట పట్టవచ్చు. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది.
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎౖMð్సజ్ సుంకం (ఎస్‌ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత అంచనా.
Comments
Please login to add a commentAdd a comment