
అమెరికాకు ఎగుమతులు తక్కువగానే ఉండటం కారణం
దేశీ ఎగుమతిదార్లకు సదవకాశం...
జీటీఆర్‌ఐ అంచనా
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి వాహనాలు, ఆటో విడిభాగాలపై అమెరికా విధించబోయే 25 శాతం దిగుమతి సుంకాల ప్రభావం భారతీయ సంస్థలపై అంతంత మాత్రంగానే ఉండొచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు దేశీ ఎగుమతిదారులకు దీనివల్ల వ్యాపార అవకాశాలు మరింతగా పెరగడానికి కూడా ఆస్కారం ఉందని పేర్కొన్నారు.
2024 సంవత్సరంలో భారతీయ ఆటో, ఆటో విడిభాగాల ఎగుమతులను విశ్లేషించిన మీదట ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఏప్రిల్ 3 నుంచి కంప్లీట్లీ బిల్ట్ వెహికల్స్ (సీబీయూలు), ఆటో విడిభాగాలపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో జీటీఆర్‌ఐ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2024 గణాంకాల ప్రకారం భారత్ సుమారు 8.9 మిలియన్ డాలర్ల విలువ చేసే వాహనాలను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది మొత్తం 6.98 బిలియన్ డాలర్ల వాహన ఎగుమతుల్లో 0.13 శాతమే. అలాగే, మొత్తం ట్రక్కుల ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా 0.89 శాతమే. ఇలా అమెరికాకు వాహనాల ఎగుమతులు నామమాత్రమే కాబట్టి, మనపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని శ్రీవాస్తవ వివరించారు.
ఆటో షేర్లకు టారిఫ్ బ్రేక్స్
ఆటో దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలను విధింపుతో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమలో అనిశ్చితి తలెత్తింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల దిగ్గజం జేఎల్‌ఆర్ విలాసవంత మోడల్ కార్లు అమెరికా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారణంగా దేశీ మాతృ సంస్థ టాటా మోటార్స్‌కు సైతం సెగ తగులుతోంది. దీంతో టాటా మోటార్స్ షేరు తాజాగా 5.5 శాతం పతనమైంది. రూ. 669 వద్ద ముగిసింది.
కార్లతో పోలిస్తే యూఎస్‌కు భారత్ నుంచి ఆటో విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో సోనా కామ్‌స్టార్ షేరు 6.2 శాతం క్షీణించి రూ. 466 వద్ద నిలవగా.. సంవర్ధన మదర్‌సన్ 2.6 శాతం నీరసించి రూ. 131 వద్ద, అశోక్ లేలాండ్ 2.7 శాతం నష్టంతో రూ. 209 వద్ద, భారత్ ఫోర్జ్ 2.3 శాతం క్షీణించి రూ. 1,155 వద్ద ముగిశాయి.
ఆందోళనలో విడిభాగాల సంస్థలు
టారిఫ్‌ల ప్రభావం వాహన తయారీ సంస్థల కన్నా విడిభాగాల తయారీ సంస్థలపైనే ఎక్కువగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికాకు భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు గణనీయంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎక్కువగా ఇంజిన్ విడిభాగాలు, పవర్ ట్రెయిన్‌లు మొదలైన వాటిని అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశానికి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మన దిగుమతులపై అమెరికాలో సుంకాలేమీ లేకపోయినప్పటికీ అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులపై భారత్‌లో 15 శాతం సుంకాలు అమలవుతున్నాయి.