
ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్(పీఎం ఈ-డ్రైవ్) పథకంలో భాగంగా ఈ-అంబులెన్స్‌లు రోడెక్కేందుకు మరింత సమయం పట్టనుంది. 2024 సెప్టెంబర్‌లో ఈ-అంబులెన్స్‌ల కోసం రూ.500 కోట్ల కేటాయించారు. ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా వీటిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇది ఇప్పటికీ స్పష్టమైన ఫలితాలను ఇవ్వలేదు. పీఎం ఈ-డ్రైవ్ కోసం మొత్తం రూ.10,900 కోట్ల వ్యయం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ-అంబులెన్స్ విభాగంలో ఫోర్స్ మోటార్స్, మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే వీటి తయారీకి ఆసక్తి కనబరిచాయి.
కీలక సవాళ్లు
పరిమిత తయారీదారుల భాగస్వామ్యం వల్ల ఇప్పటి వరకు తయారీలో పురోగతి లేదనే వాదనలున్నాయి. 2025 మార్చి నాటికి ఈ-అంబులెన్స్‌లను ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టుకు కట్టుబడిన మొదటి కంపెనీ ఫోర్స్ మోటార్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ వాహనాలను పంపిణీ చేయలేదు. మారుతీ సుజుకి ఇండియా తయారీని ప్రారంభించినట్లు తెలిపింది. కానీ సంస్థ ఎండీ హిసాషి టకేచి వాహనాల కచ్చితమైన డెలివరీ సమయాన్ని మాత్రం తెలియజేయలేదు.
సబ్సిడీ మార్గదర్శకాల్లో జాప్యం
ఏఆర్ఏఐ లేదా ఐసీఏటీ వంటి ఏజెన్సీలు వాహనాలకు హోమోలాగేషన్ (పబ్లిక్ రోడ్లపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణిస్తుందనే అధికారిక ఆమోదం) లేకపోవడం వల్ల భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీల మార్గదర్శకాలను జారీ చేయలేదు. ఇప్పటివరకు భారత్‌లో సర్టిఫైడ్ ఈ-అంబులెన్స్‌లు లేకపోవడం కూడా భద్రతా మార్గదర్శకాల అమలుకు నిరోధకంగా మారింది.
హైబ్రిడ్ అంబులెన్సులు
తక్షణ అవసరాలను తీర్చడానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం హైబ్రిడ్ అంబులెన్సులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. కంపెనీలకు సబ్సిడీలు ఇస్తుంది. ఈ హైబ్రిడ్ అంబులెన్స్‌లను వినియోగించేందుకు అన్ని విధాలా సహకరిస్తుంది. అయినప్పటికీ, హైబ్రిడ్ నమూనాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ప్రధానంగా 14,028 ఈ-బస్సులు, 2.05 లక్షల ఈ-త్రీవీలర్ వాహనాలు, 1.10 లక్షల ఈ-రిక్షాలు, 24.79 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు, ఇ-ట్రక్కులు, ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?
ఈ-బస్సులు, ఈ-టూ వీలర్స్ వంటి విభాగాల్లో పురోగతి ఉన్నప్పటికీ ఈ-అంబులెన్స్‌లు తయారీ ఇంకా ప్రాథమిక ధశలోనే ఉంది. ప్రభుత్వ అధికారులు ఈ జాప్యాన్ని అంగీకరిస్తున్నారు. కానీ నిబంధనలను ఖరారు చేయడానికి, విజయవంతంగా వాటిని అమలు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తయారీ భాగస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి వీటిని వీలైనంత త్వరగా రోడెక్కించాలని నిపుణులు కోరుతున్నారు.